కవిత్వం

తనలో తాను

సెప్టెంబర్ 2014

తనలో తాను కల్లోలిస్తున్నప్పుడు
ఒక్కడు… ఏం చేయగలడు!
ఒడ్డునవాలిన అలల నురగలా ఆరిపోతూ
తడిసీ తడవని ఇసుకలా మారుతూ
తనని తానే ఓదార్చుకుంటాడు

తన గుండె నాలుగ్గదుల్లో తానే దాక్కుంటూ
దాగుడు మూతలాడుతుంటాడు
చీకటి చివరి కొసలపై పాటకట్టీ
రాగానికి రంగు అద్దేందుకు నల్లరంగు లేదేమని
ఇంద్రచాపాన్ని నిలదీస్తాడు

నిశబ్దాన్ని పారేసుకుంటూ
ఏకాంతాన్ని కోరుకుంటూ
చెదరిన కలని, చెరగని జ్ఞాపకాల్ని మోసుకుంటూ
ఆరిన దీపపు పొగ గాల్లో కలిసినట్టు
తనలోకి తాను మెల్లిగా జారుకుంటాడు.