కవిత్వం

వర్తమానాన్ని కోల్పోయి …..

జనవరి 2013

మధ్యధరా సముద్ర కెరటాలు

అరబ్ ప్రపంచంలోని గొప్ప కవులను వారి పద్యాలనీ పరిచయం చేసే చిన్న ప్రయత్నమిది.

మధ్యధరా సముద్ర తీరపు  అరబ్ ప్రపంచంలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ అమితంగా గౌరవించబడి, ప్రేమించబడ్ద కవుల్లో మహ్మౌద్ దర్విష్ ఒకరు. ‘ఐడెంటిటీ కార్డ్ ‘ అనే కవిత్వాగ్రహ ప్రకటన ద్వారా చిరపరిచితుడైన దర్విష్ వర్తమానం గురించి స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండిన కవి, అర్ధ శతాబ్దం పైగా సాగుతున్న మహత్తర పాలస్తీనా పోరాటానికి మనసా వాచా కర్మణా మద్దతిచ్చిన తన కవిత్వం ద్వారా గొంతునిచ్చిన కవి. 1941 లో గెలీలీ లోని అల్ బిర్వా లో జన్మించి2008 లో అమెరికా హూస్టన్ లో మరణించాడు. చిన్ననాడు అతని పల్లె ని ఇజ్రాయిల్ సైన్యం బుల్ డోజర్లతో నేలమట్టం చేసినప్పుడే అతని ప్రవాసమూ, పాలస్తీనా కోసం పోరాటమూ ప్రారంభమైంది. పోరాటమూ ప్రవాసమూ అతని జీవితంలో భాగమైనవి. తన జీవిత కాలంలో ముప్ఫై దాకా కవిత్వ సంకలనాలు, ఎనిమిది వచన సాహిత్య సంపుటులు ప్రచురించాడు. పాలస్తీనా జాతీయ మహాకవిగా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. తాను ఎంతగా వర్తమానంలో స్పష్టతతో ఉన్నాడో, అంతే బలంగా అల్ అందాలుస్ , అరబ్ , ఐరోపా, సెఫార్డిక్ జ్యూయిష్ సంప్రదాయాల్నుండీ  స్వీకరించాడు. రిట్సాస్, నెరూడా లాంటి మహాకవుల్తో సంభాషించాడు. తన వస్తువును ఎంత బలంగా నమ్మాడో అంతే బలంగా రూపాన్నీ,శిల్పాన్నీ పదును పెట్టాడు – వస్తువుని తాత్వీకరించడానికి రూపశిల్పాల్ని గొప్ప నైపుణ్యం తో ఉపయోగిస్తూ , తన కవిత్వాన్ని తాత్విక స్థాయికి తీసికెళ్ళ డంలో సఫలీ కృతుడయ్యాడు.ఫలితంగా దర్వీష్ కవిత్వం శాశ్వ్తంగా నిలిచి పోయే గొప్ప కవిత్వమైంది! ‘అపరిచితుడి పడక’ అనే సంపుటిలోంచి తీసుకున్న ఈ పద్యం లో వస్తువూ,రూపమూ, తాత్వికతా కలగలిసి పోయి పాఠకుడి మదిలో బలమైన ముద్ర వేస్తాయి.

పద పోదాం మనం,
మన లాగే,  ఉన్నదున్నట్టుగా:

నువ్వో స్వేచ్చా  స్త్రీవి,
నేన్నీ నమ్మకస్థుడైన స్నేహితున్ని.

ఇద్దరం ఒకటిగా వేర్వేరు మార్గాల్లో
ఇద్దరం కలిసీ విడివిడిగా,

మనల్ని ఏదీ గాయపర్చదు
విడిపోయిన గువ్వల జంట గానీ, చేతులమధ్య చల్లదనం గానీ
చర్చి చుట్టూ తిరిగే గాలి గానీ ….

 

బాదాం చెట్టు వికసించింది సరిపోలేదు –
చెంపల సొట్టల సీతాకోకచిలుకల నడుమ

చిర్నవ్వు నవ్వు
బాదాములు మరింత వికసించాలని.

 

త్వరలో మనకో కొత్త వర్తమానముంటుంది.

వెనక్కి చూస్తే కనబడేది

వెనక్కి చూడడమనే  ప్రవాసమే:

నీ పడగ్గది,

నీ పెరడు,
గాజు భవంతుల వెనుక నది,
మనం నిరంతరం వాదించుకున్న చాయి హోటల్…

అన్నీ, అంతా….

ప్రవాసమెళ్ళడానికి సిద్ధమౌతున్నాయి,

కొంచెం నెనరు చూపుదామా?

 

పద పోదాం

మనం మనలాగే, ఉన్నదున్నట్లుగా:

స్వేచ్చా స్త్రీవి నువ్వు,

నేన్నీ  వేణుగానానికి విశ్వాసపాత్రుడిని.

మనకున్న సమయం సరిపోలేదు -
కలిసి పెరిగి పెద్దవడానికి,
సినిమాలకు బెదురుతూ వెళ్ళడానికి,

పొరుగువారితో ఏథెన్సు యుద్దం అంతాన్ని చూడ్డానికి,
రోమ్  కార్థేజి ల మధ్య శాంతి విందుకి హాజరవడానికి.

ఎందుకంటే అతి త్వరలో పక్షులు ఒక యుగం నుండి మరో యుగానికి తరలి వెల్తాయి :

ఈ తోవ అర్థం లా కనబడే ఉత్తి  దుమ్మేనా,
రెండు పురాణాలమధ్య ప్రయాణిస్తున్న వాళ్ళలా మనని నడిపించిందా,
ఒక అపరిచితుడు మరో అపరిచితుడి అద్దంలో చూసుకున్నట్టు
మనమూ,  మన తోవా అనివార్యాలేనా?
“కాదు! ఇది నా శరీరానికి తోవ కాదు”
“అస్తిత్వ సమస్యలకు సాంస్కృతిక సమాధానాలుండవు”

”నువ్వెక్కడున్నా నా ఆకాశం నిజం”
“వెనుకటి సూర్యున్నీ చంద్రున్నీ నీకు వాపస్ ఇవ్వడానికి నేనెంత?”

అందుచేత, కొంచెం నెనరు తో ఉందామా?

 

 

పద పోదాం, మనం మనలాగే, ఎట్లున్నామో అట్లే:

నువ్వో స్వేచ్చా స్త్రీవి

నేన్నీ స్నేహితుణ్ణి.

 

జనవరిలో పడ్డ మంచు సరిపోలేదు కదా

చిర్నవ్వు నవ్వు – క్రైస్తవ ప్రార్థనల మీద మంచు దూది హారాలై అలంకరించాలని,

మనం త్వరలో తిరిగి వస్తాం మన వెనుకటి రేపుకు,
తిరిగి వస్తాం మన ప్రేమ ప్రారంభపు తొలియవ్వనాల మిసమిసల్లోకి,
రోమియో జూలియెట్ గా,  షేక్సిపియర్ భాష నేర్చుకుంటూ ……

మనల్ని రెండు నక్షత్రాలతో అలంకరించి,

రెండు కిటికీల మధ్య మన అస్తిత్వ పోరాటంలో హత్య చేస్తూ,

క్షణికమైన శాంతి ఎండమావుల్లా
సీతాకోక చిలుకలు నిద్రల్లోంచి ప్రవహించాయి -

పద పోదాం దయ కురిపిస్తూ …..

పద పోదాం, మనం మనలా ఉన్నదున్నట్లే:

నువ్వో స్వేచ్చా స్త్రీవి, నేన్నీ నమ్మకస్తుడైన స్నేహితుడిని,

పద వెళ్దాం మనం మనలాగే!

బాబిలాన్ నుండి వీచిన గాలితో వచ్చాం మనం.

బాబిలాన్ కే ప్రస్థానిద్దాం ….

దక్షిణాదికి నా ప్రశంసలు,
నా తోవల్లో సతతహరితారణ్యాల జాడలయేంతగా
నా ప్రయాణం సరిపోలేదు.

ఇక్కడ మనమంతా   నెనరు గల వాళ్లం.

మన గాలి ఉత్త్రరం వైపు  వీచినా

మన పాటలు దక్షిణాదివే!
నేను మరో నువ్వా,

నువ్వు మరో నేనా?

“ నా స్వేచ్చా దేశానికిది  తోవ కాదు”

ఇది నా శరీరానికీ తోవ కాదు

నేను రెండు సార్లు “నేను” కాలేను!

ఇప్పుడు నా నిన్న రేపయి,

నేను రెండు స్త్రీలుగా చీలి పోయాను కనక
నేను తూర్పూ కాదు పడమరా కాదు,

నేను ఖురాన్ శ్లోకాలకు నీడనిచ్చే ఆలివ్ చెట్టు నీడనూ కాదు,

అందుకే పద పోదాం.

”వ్యక్తిగత సందేహాలకు సామూహిక సమాధానాలుండవు”

మనం కల్సిఉండడానికి కల్సిఉంటేనే సరిపోదు….

మనమున్న చోట, మనం చూడడానికి ఒక వర్తమానం లేదు.

 

పద వెళ్దాం మనం మన లాగే:

నువ్వో స్వేచ్చా స్త్రీ, నేనో పాత స్నేహితుడూ -

ఇద్దరం వేర్వేరు దారుల్లో వెళదాం.

ఇద్దరం కలిసి వెళదాం,

నెనరుతో ….

 

తెలుగు: నారాయణస్వామి

 

 



2 Responses to వర్తమానాన్ని కోల్పోయి …..

  1. January 11, 2013 at 6:56 pm

    ఇంత మానవీయ కవితను అనువదించి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్..

  2. vasudev
    January 15, 2013 at 12:07 am

    దార్విష్ గురించి ఇంతకుముందు చాలా సార్లు విని ఉన్నాను.కొన్ని అనువాదాలు చదివానుకూడా. కవిత్వాన్ని ప్రేమించేవారెవరైనా దార్విష్ నీ అతని కవిత్వాన్ని ప్రేమించాల్సిందె.ఇక్కడ కూడా (నేనున్న బ్రూనై దేశంలో)కొన్ని అనువాదాలున్నాయని అన్నారు. ఇంకా వెదకాలి. మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. కృతజ్ఞతలు

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)