కవిత్వం

బహుశా నువ్వు కూడా…

నవంబర్ 2014

ఒకోసారి పావురం గాయపడుతుంది
నెత్తురోడుతుంది
ఐనా గాయాన్నలా రెక్కలకింద కప్పిఉంచి
మాట మబ్బులకింద ఎగురుతూనే ఉంటుంది-
ఏ భావమూ లేని గాజు కళ్ళతో
దిగుల్ దిగులుగా ఊఁ కొడుతుంది
గొంతుదాటి రాబోయిన ఏవో శబ్దాలను
భయమ్ భయం గా పట్టి ఆపుతుంది-
గాయపడటం నేరమవుతుందేమోనని
నెత్తుటి చుక్కల్నీ నియంత్రించుకుంటుంది
ఎక్కడో ఒక మూలన ఏ చెట్టు మీదకో చేరి
గుబురుకొమ్మల నడుమ ముడుక్కుంటుంది-
బహుశా పావురం
ప్రేమ లో ఉంది కావచ్చు-

***

విలవిల్లాడుతున్న పక్షిని
కాస్త అర్ధం చేసుకోవూ
ప్రేమగా చేతుల్లోకి తీసుకోవూ
వెచ్చగా గుండెల్లోకి పొదువుకోవూ
రెండుపెదవులలా ఆనించి
నాలుగు మంత్రాక్షతలు జల్లి
రెక్కల్ సవరించి గాల్లోకి ఎగరేయవూ
-ఎగరేస్తావులే…
బహుశా నువ్వు కూడా
ప్రేమలోనే ఉన్నావు కావచ్చు.మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)