మిట్టమధ్యాహ్నం సూరీడు నడినెత్తిన ఉండి తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ స్కూలు వదలగానే రోడ్డు మీద పడ్డాను మాసిపోయిన యూనీఫాంతో, అవ్వాయి చెప్పులేసుకుని. ఓపక్క ఆకలి, మరోపక్క వేడెక్కిన రోడ్డుమీద నడక, ఎంత తొందరాగా ఇంటికి వెళ్ళి అన్నం తింటానా అనే తొందరలో ఉన్నాను. సరిగ్గా మా గుడి సందు దాటుతుంటే, ఎత్తరుగు మీద ఇంటి చూరు కిందగా, కాళ్ళు బారజాపుకుని చేతి కర్రతో కాకుల్ని తోలుతూ వడియాలకు కాపలాకాస్తూ కూచునుంది సిద్ధేర్వరి బామ్మ. ఆకలి వల్ల కళ్లానక ఇలావచ్చేసాను. “చచ్చానురా దేవుడా… ఉత్తపుణ్యాన బామ్మకు పలారమైపోతానే” పక్కదారిగుండా పోకుండా ఎందుకు గుడి దారిన వచ్చానురా అనుకున్నాను. నేను తనను చూడక మునుపే బామ్మ తన గుడ్ల గూబకళ్ళేసుకుని నన్ను చూసేసింది.
“ఏమిటే సుబ్బి ఇలా వస్తున్నావ్, ప్రసాదం కోసమేనా… అంత తిండియావ ఏమిటే… చదువు సంధ్యా ఏవన్నా ఉందేమిటే, ఇంత మిట్టమధ్యాహ్నపు వేళ ఏమిటే నీకు ఈవీధిలో పని… ఓ పక్కతెల్లారకుండానే గుడి దగ్గర వాలిపోతావు. దీపాలవేళా గుడి దగ్గరే ఉంటావు. ఇప్పుడెందుకు వచ్చావే… వేళాపాళా లేదా ఏం… అంటూ ఆపకుండా తిడుతూనే ఉంది. నా మాట వినడం అన్నదే లేదు.
బామ్మదంతా అదో సంత ఎవ్వురినీ నమ్మదు. ఉత్త పిసినారి, చాదస్తం మనిషి. ఆ ఇంటి గుమ్మం ముందు నుండీ పొరపాటుగా వచ్చామా చచ్చామే. ముఖ్యంగా పిల్లలంటే అస్సలు పడదు. ఎప్పుడూ ఎదవ అనుమానం కళ్ళేసుకుని చూస్తూ, అందరి మీదా నోరు పారేసుకోవడమే అలవాటు. బామ్మ అందరితోనూ కాస్త బాగా మాట్లాడేది కార్తీకమాసంలోనే… అదెళ్ళిపోగానే మళ్ళీ మామూలు సూరేకాతం అయిపోద్ది.
“ఏంటే పిల్లదానా నేను అరుస్తున్నా మాటన్నా మాటాడవేమే… మంచి పొరుగే దాపురించింది… ఈ పిల్లల్ని గుళ్ళోకి రానీయకురా అంటే మా వాడు వినిచస్తేగా వెదవసంత. ఏ చెట్టుమీద ఏ కాయలున్నాయా, పూలున్నాయా అని చూసి ఎత్తుకు పోడానికీ ఈ పచారిలు…” బామ్మ ఇంకా తిడతానే ఉంది. నేను ఒక్క పరుగందుకుని మా ఇంట్లోకొచ్చి పడ్డాను.
సిద్ధేశ్వరి బామ్మ గురించి ఇంకా చెప్పాలంటే, ముందు మా ఊరు గురించీ మా గుడి గురించీ కాస్త చెప్పాలి. మాది తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు. పక్కనే ఉన్న రావులపాలెం, మండపేటలు కాంక్రీటు బిల్డింగులతో, ఎటుచూసినా నిరంతరం రద్దీగా తిరిగే వాహనాలతో ఎంత మారిపోయినా, ఈనాటి వరకూ ఎలాంటి మార్పులూ లేకుండా అదే బెల్లులూడిపోయిన పాత మేడలు, చెద పురుగులు తినేసిన చెక్కమెట్లు, నాచు పట్టిన గోధుమరంగు సున్నం గోడలు, పల్లెటూరి వాసన్ని వదిలించుకోవాలని తెగ తాపత్రయపడే జనాలు, చుట్టూ పొలాలు, చెరువుగట్టు, చిన్న బడి, మర్రిచెట్టు ఉయ్యాలా, బుధవారం సంత, సైకిలుషాపు, మిఠాయి కొట్టు, బట్టీవిక్రమార్కుని గుడి… వీటన్నింటి మధ్యా ఎన్నాళ్ళైనా తనలో మార్పురాలేదని స్వగతంలో ఆనందపడే మా ఊరు. మాఇంటికి నాలుగు ఇళ్ళ తరువాత ఉంది భట్టీవిక్రమార్కుని గుడి. మా దొడ్డివైపు గుమ్మంలో నిలబడి చూస్తే ఆలయగోపురం, వెనకవైపు రోడ్డుకానుకున్న పూజారిగారి ఇల్లూ కనిపిస్తాయి.
మా ఊరికంతా పెద్దదేవాలయమైన భట్టీవిక్రమార్కుని గుడి ఏనాడో దేవతలు కట్టారంటారు. రోడ్డుకి ఎత్తులో ఉంటుంది. ఎతైన గాలిగోపురం, ధ్వజస్తంభం, శివునికి ఎదురుగా పెద్ద నంది, కొక్కానికి వేలాడదీసిన బరువైన గంట, అగరబత్తి, సాంబ్రాణి కలిపి వచ్చే కమ్మని వాసనతో ఉంటుంది గుడి.
సువర్ణ గన్నేరు చెట్ల పూలు రాలి విశాలమైన గుడి ప్రాంగణం తెల్లని తివాచిలా మారిపోతుంది, తెల్లవారేసరికి తరుముకొచ్చే పూల పరిమళాలతో చూడచక్కగా ఉంటుంది వాతావరణం. ఇక మా గుడి పంతులుగారు సుబ్రమణ్యం దీక్షితులు చాలా మంచోరు, పిలిచిమరీ ప్రసాదం పెడతారు. పంతులిగారి భార్య సీతమ్మ సోమవారం చెక్కరపొంగలి మా భలేగా చేస్తారు. ఈళ్ళ అమ్మాయి రాజ్యం మా బడిలోనే ఆరోతరగతి చదువుతుంది. చాలా కొంటిది నన్ను కొడుతుంది. రాజ్యం బామ్మే సిద్దేశ్వరి.
కొన్నాళ్ళ క్రితంవరకు బాగానే ఉన్న మా ఊరి పెద్దలు ఈమధ్య ఆలమూరును ఓ పుణ్యక్షేత్రంగా తయారు చేయాలని కంకణం కట్టేసుకున్నారు. చెరువు గట్టంపటా అన్ని దేవుళ్ళగుళ్ళూ కట్టించేసారు. ఆదివారం మొదలుకుని శనివారందాకా రోజుకో గుడిలో ఒక్కోరకం ప్రసాదం తినే భాగ్యం మా పిల్లకాయలకు దక్కింది. కొత్తగా స్నేహం దొరికిందని పాత స్నేహాన్ని వదలగలమా, అలానే కొత్తగుళ్ళొచ్చాయని పాత గుడిని వదలలేంకదా.
ఎన్ని గుళ్ళు వచ్చినా మా గుడి అందం ఏ గుడికీ లేదు. కార్తీకమాసంలో గుడి నిండుగా దీపాలు పెడితే అచ్చం ఆకాశంలో నక్షత్రాలు నేలమీద వెలుగుతున్నట్టే ఉంటుంది.
ఓరోజు బడి వదిలేసాకా ఇంటికొస్తున్న దారిలో రాజ్యాన్ని అడిగాను “ఏమే రాజ్యం మీ బామ్మ ఎందుకే అందరి మీదా ఉత్తనే కేకలేస్తాది”.
“ఏమోనే నాకు తెలీదంది”. తెలిసినా చెప్పుద్దా చుప్పనాతిది. అదేదో పరమ రహస్యం అన్నట్టు.
కొంత కాలానికి బామ్మ చనిపోయింది. రాజ్యం చాలా ఏడిచింది, నాకూ ఏడుపొచ్చింది. గుడివైపుగా వెళుతుంటే పదేపదే బామ్మ గుర్తొస్తుంది. బామ్మ బ్రతికుండగా ఏనాడూ వాళ్ళ ఇంటివైపు రానీలేదు. నన్ను చూస్తేనే చీదరించుకునేది.
ఓసారి మా అమ్మను అడిగితే, “ఆళ్ళు మనలా ఎండలో నడుమొంచి పన్జేయ్యరే, రెండు మంత్రాలు చదివితే కడుపు నిండిపోద్ది, పైగా గుడి మీద బోలెడు సంపాదనా, అమ్మవారికివచ్చే పట్టుచీరలన్నీ కొత్తమాయగానే ఇంట్లో పెట్టేసుకుంటారా… పైకి మాత్రం ఏం లేనట్టుగా ఉంటారు. అవన్నీ చూత్తామని ఆళ్ళిళ్ల వైపు మనల్ని రానీరు” అంది.
బామ్మ చనిపోయి నెలరోజులైపోయింది. ఆళ్ళ ఇల్లు చూడాలన్న నా కోరికా అలానే ఉండిపోయింది.
ఓరోజు రాజ్యాన్ని బతిమాలి ఇల్లు చూడ్డానికి వెళ్ళాను. ఎత్తరుగు మీద ఆరబోసిన వడియాలు ఎవరూ కాపలాలేకుండా ఉన్నాయి. ఇల్లంతా చాలా పాతగా బీటలువారి ఉంది. రెండే గదులు. అందులోనే చిన్న వంటగది. చూడ్డానికి చాలా ఇరుగ్గా ఉంది ఇల్లు. దండెం మీద మాసిన రెండు పంచెలు, చిరుగుల చీరె వేలాడుతున్నాయి. అమ్మ చెప్పినట్టు ఈళ్ళు ఉన్నోళ్ళు కాదనిపించింది.
పెరడులోకి తీసుకెల్లింది. రకరకాల మొక్కలతో, పువ్వులతో ఉంది పెరడంతా… ఓ మూల చిన్నదడి కట్టి ఉంది. “అదేంటే స్నానాలదడా” అని అడిగాను. “కాదు అది బామ్మ వేసుకున్న మొక్కలకు చుట్టూ దడికట్టింది. అటువైపుగా మా ఎవర్నీ పోనీయదు. ఆఖరుకి నాన్నను కూడా” అంది.
“ఓసారెల్లి చూద్దామే అందులో ఏం మొక్కలున్నాయో” అని దాని చెయ్యపుచ్చుకుని లోపలకు వెళితే దడినిండా బంతిమొక్కలున్నాయి.
వాళ్ళమ్మగారు పిలిచే సరికి బయటకొచ్చేసాం. చాన్నాళ్ళకు తెలిసిందేంటంటే కార్తీకమాసంలో త్రిమూర్తుల వ్రతానికి అందరికీ గంజాయి అమ్మేది బామ్మ, ఎవరికీ అనుమానం రాకుండా బంతి మొక్కల్లో గంజయి పెంచేదని.
గుట్టు బాగుంది. ఇంత చిన్న కథలోనే పెద్ద సమాచారం ఇచ్చారు రచయిత్రి.. వాళ్ళ ఊరి వర్ణన, గుళ్ళని కమర్షియల్ చెయ్యడం, పూజారి పేదరికం.. చటుక్కుని మనం కూడా బామ్మ చేత తిట్లు తినేస్తాం. శ్రీ శాంతికి అభినందనలు.
బావుందిశ్రీ శాంతి,అంటే బామ్మా ఆమె కి సొంతం కాదా? అది అర్ధం కాలేదు
కథ చాలా బాగుంది.శ్రీశాంతి గారు .
ఈ కథ మా జిల్లాలో జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది .
శ్రీ శాంతీ ..
కథ రాయడం లో మీ నైపుణ్యం ఎంత గా ఆకట్టుకుందో !
ఊరు నేపధ్యం , వర్ణనలు భలే బాగున్నాయి ..చివర చిన్న మెలిక పెట్టి ,గుట్టు ,బయలు పెట్టారు ..
బాగుంది ..
వసంత లక్ష్మి .
అబ్బ అబ్బ ఎం రాసారండి మేడం సూపర్ . బావుంది కథ.
భామ్మ గుట్టు బాగుందండి శ్రీశంతి గారు
శ్రీ శాంతి కథలు చదువుతుంటే అవి కథల్లా వుండవు.
కళ్ళ ముందు కదిలే సన్నివేశాల్లా వుంటాయి.
ఆ మధ్యోసారి వేపచెట్టు మీద రాసిన కథ చదివాను. అదీ అలానే అనిపించింది.
ఇక ఈ కథ మాటకొస్తే – ఒక సజీవ దృశ్యం కదలాడినట్టైంది.
ఆ ఊరు, పరిసరాలు, పాత భవనాఉలు, అన్నీ కలిసి, ఓ అవ్యక్తమైన గతజ్ఞాపకాలతో గుండె కొట్టుకుంది.
శాంతి! మీరు మీ అక్షరాలలో చూపించిన గుడి బావుంది. కార్తీక మాసం మధ్యాన్నం వేళ, ఒకానొక నిశ్శబ్దం లో, గాలికి ఊగే రావి చెట్టు పత్రాల చప్పుళ్ళు వింటున్నప్పుడు నాలో కలిగే ఒక మౌనభావం మళ్ళీ మొదలై, అలా అలా..నన్నొక అవ్యక్తమైన స్థితి లోకి తీసుకెళ్ళిపోయింది.
మరో మాట చెప్పనా? – మీ కథలో – కొందరి నిజ స్వభావాలను చూపే ప్రయత్నం కూడా జరిగింది. ఎవరొప్పుకున్నా, ఒప్పకున్న, ఈ సమాజంలో కొన్ని కుల మతాల వారి పట్ల కొందరికి ఓ స్థిరమైన అభిప్రాయం వుంటుంది.
వారి వారి కుల వృత్తుల మీదా, వారి మనస్తత్వాల మీద, ప్రవర్తనా తీరుల మీద కూడా , ఇతర కులాల వారికి – కొన్ని కదిలించలేని, కరగిపోని భావాలు… అలా బండ ముద్రలేసుకుండి పోతాయి.
అందుకు నిలువెత్తు నిదర్శనం మీ కథలో ఆ పిల్ల తల్లి పాత్రా, ఆమె ద్వారా చెప్ప్పించిన మాటలూను.
చాల సింపుల్ గా సిన్సియర్ గా పాత్రల్ని ప్రొజెక్ట్ చేయడం నాకు చాలా నచ్చేసింది.
మీ కథలో హీరోయింకి మల్లేనే, నా చిన్నప్పుడు నాక్కూడా అలా అనిపిస్తూ వుండేది. రాజు గారి మహలంత పెద్ద పెద్ద భవనాలను చూస్తున్నప్పుడు, వెంటనే ఆ లోనకెళ్ళి – ఎలా వుంటుందో, లోపల ఏమేం వుంటాయో.. ఓ సారి చూసి రావాలని తెగ తహతహ గా వుండేది.
చివరికి ఎలా ఐతేనేం, ఆ అమ్మాయి కోర్కె తీర్చారు మీ కథలో.
కానీ, ఎటొచ్చీ చూసారూ! బట్ట బయలైన బామ్మ గుట్టు రహస్యాన్నే నేనింకా నమ్మలేకపోతున్న. అ..లా నిజమేనా? అని!
అసలలాటి సాంప్రదాయమొకటి వుంటుందని తెలుసుకోడం కూడా ఇదే మొదలని నా అనుమానం.
కొంతమంది మనుషుల్ని నమ్మినట్టె, కొన్ని పాత్రల్ని కూడా నమ్మేయడం అఫ్కోర్స్, హ్యూమన్ వీక్నెస్ అనుకోండి.
కథ బావుంది. అందులో ఎలాటి అనుమానమూ లేదు.
కనీ కథలో ఈ బంతిపూల దడి గురించి మరింత ఆసక్తి పుట్టించేలా కతారంభం నించీ కనక చెబుతూ, సస్పెన్స్ క్రియేట్ చేసి వుంటే ఇంకా ఇంకా బావుండేదనిపించింది.
మీ కథల్లో మీదైన ఒక మార్క్ నాకెప్పుడూ కనిపిస్తూ వుంటుంది శాంతి.
అదేంటంటే – పరిపక్వత గల లేదా చాలా పరిపూర్ణత సాధించిన రచయితల రచనలు చదివిన లేదా చదువుతున్న ప్రభావం..మీ కథల్లో ప్రతిఫలించడాన్ని నేను గమనిస్తున్న.
కరెక్టేనా?
కథ నచ్చింది. చిన్న కథే గానీ, చక్కని నరేషన్.
అసలే పాయింట్ తో రాయాలి కథ అంకుంటూ బుర్ర పగలకొట్టుకునే వారికి మీ కథల్నిచ్చి చదవమంటా ఇకనించి.
అద్సరే కానీ, సువర్ణ గన్నేరుపూలు తెల్లగా వుంటాయా? సువర్ణ అంటే -పసుపు రంగు కదా?..ఇదొకటి క్లారిఫై చేసుకోవాలి నేను. అర్జెంట్ గా.
మరో మాట!
మీరు రాసారు కదా. ‘కొత్తగా స్నేహం దొరికిందని పాత స్నేహాన్ని వదలగలమా?’ – ‘ఇదెప్పటి మాట!- ఈ కాలం వారికి!’ అని అనిపించింది శాంతి. అంతే!
ఇంకా ఎన్నో మంచి మంచి కథలు మీ కలం నించి కదలి కదలి కురియాలని ఆశిస్తూ..అభినందిస్తూ
శుభాకాంక్షలతో..
కథ చాలా బాగుంది శ్రీ శాంతి. కథ క్లుప్తంగా బాగా వివరించారు. అభినందనలు!