కథ

కిటికీలోని బాల్యం

డిసెంబర్ 2014

వెలుతురూ గాలీ ధారాళంగా ఉన్న ఆ గదిలోనే గత పదేళ్ళుగా నా నివాసం! గది కిటికీ దగ్గరే ఇన్నేళ్ళుగానూ నా మకాం కూడాను. ఆ కిటికీలోనుంచి చిత్రకారుడు తీర్చిదిద్దినట్టుగా కనిపించే పచ్చిక బయలు కనువిందుగా కనిపిస్తూ ఉంటుంది. “అరణ్య ” అన్న ఈ ఎస్టేట్ కు పెట్టిన పేరును సార్థకత చేకూరుస్తూ ఏపుగా పెరిగిన చెట్లు, గుబురుగా ఉండే పొదలు ఇవన్నీ వందల అపార్ట్ మెంట్ భవనాల మధ్యలో చక్కని పచ్చదనాన్ని కళకళలాడిస్తూ ఉంటాయి.

నా భర్త చనిపోయాక నా ఒక్కగానొక్క కొడుకూ, వాడి భార్య, నేనూ అద్దె ఇంట్లో మిగిలాం. వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులే కావడంతో నగరానికి చివరలో వాళ్ళకు అందుబాటు ధరలో వచ్చిందని ఈ ఫ్లాట్ తీసుకుని ఇందులోకి నన్ను కూడా తీసుకుని వచ్చేశారు. నాకు నాలుగో తరగతి చదువుతున్న మనవడు, రెండో తరగతి చదువుతున్న మనవరాలు.

ఉదయాన్నే ఈ ఇల్లు చాలా కోలాహలంగా ఉంటుంది. వంటగదిలో సతమతమవుతూ కోడలు విద్య చాలా కష్టపడుతూ ఉంటే మా అబ్బాయి విశాల్ “ఏమోయ్, ఇంకా కాఫీ అవలేదా?” అని హాల్లో పేపర్ చూస్తూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. నేను కోడలు విద్యకి దగ్గరలోనే ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉల్లిపాయలో, కూరగాయలో తరుగుతూ కొద్దిపాటి సాయాన్ని అందిస్తూ ఉంటాను. తను వాళ్ళ ఆయన వైపు కోపంగా చూసి నాతో అంటూ ఉంటుంది, “చూడండి, ఎంత దర్జాగా కూర్చుని పేపర్ చదువుతున్నారో!”

“తెస్తున్నా…. ఇక్కడ ఎవరూ ఖాళీ చేతులతో లేరు!” అని ఒక్క కేక పెడుతూ ఉంటుంది. “నేను తీసుకెళ్ళి ఇవ్వనా?” అంటాను.

“ఇంకా కాఫీ అవ్వలేదు అత్తయ్యా! అది పూర్తయ్యేసరికి ఆ ఘుమఘుమలు తగిలి ఆయనే వస్తారు చూడండి.” అంటుంది.

తను అన్నట్టుగానే కాఫీ వాసన తగలగానే పరుగు పెట్టినట్టుగా వంటింట్లోకి వచ్చి కాఫీ కప్పు అందుకుని, “థ్యాంక్సోయ్!” అని భార్యతో చెప్పి, నా వైపు తిరిగి, “ఎంతసేపయిందమ్మా లేచి?” అని అడుగుతాడు. “అమ్మకు కాఫీ ఇచ్చావా?” అని కూడా ప్రశ్నిస్తాడు.

“ఇవ్వాలని నాకు తెలీదులెండి. ముందు మీరెళ్ళి పిల్లలిద్దర్నీ నిద్రలేపండి.” కస్సుమంటుంది విద్య. వాడు వెళ్ళాక రెండు కప్పులతో కాఫీ తెచ్చి నా ముందు పెట్టి తను కూడా నా ఎదురుగా కూర్చుని కాఫీ తాగుతుంది. లోపలినుండి “ఇంకా కాసేపు డాడీ!” అని  అక్షర్, ఆకాంక్షలు బ్రతిమాలడం మాకు వినిపిస్తూనే ఉంటుంది. వాడు వాళ్ళ పక్కనే మంచం మీద కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవడంలో మునిగిపోతాడు. “అత్తయ్యా, ఈ కూర కాస్త చూస్తూ ఉండండి. ఈయనగారిని పిల్లల్ని లేపమనడంకంటే బుద్ధి తక్కువ పని వేరే ఏదీ ఉండదు.” అని చెప్పి బెడ్ రూం లోకి వెళుతుంది. “ఏయ్… స్కూల్ కి టైం అవుతుంది లేవండి? ఎంతసేపు పడుకుంటారు గాడిదల్లా?! ” అని కేకలు పెట్టి పిల్లలను లేపుతుంది. తల్లి రాగానే పిల్లలు తటాలుమని లేచి బ్రష్ చేసేందుకు బాత్ రూం ల వైపు పరుగులు తీస్తారు.

“ఆ పేపర్లోనే మునిగిపోతే మనం ఆఫీసుకెళ్ళినట్టే! పిల్లలకు స్నానాలు చేయించి వస్తాను. వాళ్ళ యూనిఫారాలు ఇస్త్రీ చేసి ఉంచండి.” అని వాడి చేతిలోని పేపర్ని తీసుకుని విసిరికొట్టి పిల్లలకు స్నానాలు చేయిస్తుంది.

కొడుకు, కోడలు స్నానాలు చేసేదాకా పిల్లలిద్దరూ టీ వీ చూస్తూ ఉంటారు. ఈ లోపుగా నేనూ వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళు చెప్పే కబుర్లను వింటూ ఆనందిస్తూ, వాళ్ళడిగే సందేహాలకు నవ్వుకుంటూ నాకు తోచినవిధంగా జవాబులు చెబుతూ ఉంటాను. ఆ తర్వాత అందరం డైనింగ్ టేబుల్ చుట్టూ చేరి కూర్చుంటాం. పిల్లలిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ, చిన్న చిన్న దెబ్బలాటలు ఆడుకుంటూ, అమ్మా నాన్నలతో కసిరించుకుంటూ, నాతో బుజ్జగింపులు చేయించుకుంటూ టిఫిన్లు తినేస్తారు. వాళ్ళతో పాటు మేం ముగ్గురం కూడా టిఫిన్ ముగిస్తాం. మరో అరగంటకల్లా ఇల్లు మొత్తం ఖాళీ అయిపోతుంది. కొడుకు, కోడలు కార్లో పిల్లలను స్కూల్ దగ్గర దింపి వాళ్ళ ఆఫీసులకు వెళిపోతారు. తొమ్మిది గంటలకు అలా ఖాళీ అయిపోయిన ఇల్లు సాయంత్రం అయిదున్నరకు పిల్లలు ఆటోలో తిరిగి వచ్చేవరకూ బోసిపోయే ఉంటుంది. మరో గంటకు వాళ్ళ అమ్మానాన్నా వస్తారు. ఈలోగా నేను పిల్లలకు ఏదైనా చేసి ఉంచి రాగానే తినిపిస్తాను. ఉదయం వాళ్ళు వెళ్ళడానికి, తిరిగి సాయంత్రం రావడానికి మధ్య ఉన్న కాలం నాకు చాలా బరువుగా సాగుతూ ఉంటుంది.ఆ తర్వాత వంటింట్లోకి వచ్చి, కూర పూర్తవడం చూస్తూనే సంతోషంగా నా వైపు చూసి, “థ్యాంక్స్ అత్తయ్యా! మీరలా కూర్చోండి. నేను క్యారేజీలు కట్టేస్తాను.” అని డైనింగ్ టేబుల్ మీదకి అన్నం ఉన్న కుక్కర్ని, కూరలను, అంతకు ముందే తయారు చేసిన టిఫిన్లను తరలిస్తుంది. నలుగురి బాక్సులూ తెరిచి అన్నిటినీ సర్దుతుంది. పిల్లలు బట్టలు వేసుకోవడానికి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ వాళ్ళ నాన్నను విసిగిస్తూ ఉంటారు. ఎలాగో తంటాలు పడి వాడు బట్టలు వేస్తాడు. క్యారేజీలు సర్ది కోడలు వాళ్ళిద్దరికీ తలలు దువ్వి తయారు చేస్తుంది.

అయినా వీలైనంత ఉల్లాసంగా గడపడానికి నాకు సాయపడేదే ముందు చెప్పిన ఆ గదిలోని కిటికీ. ఆ కిటికీలోకి రివ్వుమంటూ గాలిని వీస్తూ అల్లంత దూరంలో కనిపిస్తున్న చెట్లు నాతో ఏదో చెప్పాలనుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చల్లని ఆ గాలిని ఆస్వాదిస్తూ చెట్లకు చెయ్యిని ఊపుతాను. సమాధానంగా మరింత చల్లని గాలిని ఆనందంగా తలలు ఊపుతూ ఆ చెట్లు నాకు పంపిస్తూ ఉంటాయి.

చెట్ల కొమ్మల్లోంచి వినిపించే రకరకాల పక్షుల కిలకిలారావాలను వింటూ అవి ఎక్కడ దాక్కున్నాయో వెదుక్కుంటూ ఉంటాను. కానీ ఒక పట్టాన అవి కనపడవు. ఎగిరి వెళ్ళేటప్పుడు మాత్రం ‘అక్కడే ఉందే’ అని ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒక్కొక్కసారి చెట్లనుండి రాలే పండుటాకులు కిటికీలోనుంచి నా ఒళ్ళోవచ్చి వాలుతూ ఉంటాయి. గాలితోనే కాకుండా ఇలా అప్పుడప్పుడూ ఏవో సందేశాలను కూడా నాకు ఆ చెట్లు పంపిస్తున్నాయా అని నవ్వుకుంటూ ఉంటాను. అంతలోనే ఆ పండుటాకులను చూసినప్పుడల్లా నేను కూడా అలాంటిదాన్నే కదా అని మనసు నిర్వేదమవుతుంది. ఈలోగా నన్ను ఊరడిస్తున్నట్టుగా దూరాన్నుండి కోకిల గళమో, చిలుకమ్మ స్వరమో వినిపించి నా విచారాన్ని దూరం చేస్తూ ఉంటాయి. కాసేపు పేపర్నీ, కాసేపు నాకిష్టమైన పుస్తకాలనూ చదువుతూ ఉన్నా మధ్యమధ్యలో కిటికీలోనుంచి కనిపించే ఎన్నో అందమైన దృశ్యాలను ఆస్వాదించడం మాత్రం మానను.

నిజానికి కిటికీ నా ప్రియమైన నేస్తం. దానితో నా స్నేహం ఇప్పటిది కాదు. అందుకే ఒక్కసారిగా లేచి నిలబడి కిటికీ ఊచలను ఆప్యాయంగా తడుముతూనో, బ్రష్ తీసుకొచ్చి వాటిని శుభ్రం చేస్తూనో నా కృతజ్ఞతను దానికి వెల్లడిస్తూ ఉంటాను. సంతోషంగా కిటికీ కూడా తన రెక్కలను అల్లల్లాడిస్తూ మురిసిపోతూ ఉంటుంది! ఇలా ప్రకృతినంతా నాకు చూపిస్తూ, ప్రతి చెట్టునూ, పొదనూ, పిట్టనూ తనతో పాటు నాకు దగ్గర చేసిన కిటికీ అంటే నాకు మహా ప్రాణం. రోజూ నేను గడిపే ఈ ఆనందాకరమైన అనుభూతులన్నిటినీ సాయంకాలం కావస్తుండగా ఓ పుస్తకంలో రాసుకుంటాను. ఆ తర్వాత పిల్లలకు ఏదైనా తినడానికి చేసిపెట్టేందుకు లేస్తాను.

ఆరోజు కూడా ఇలాగే  చెట్లతోనూ, చిరుగాలితోనూ మాట్లాడుకుంటూండగా  నా దగ్గరకు రెపరెపలాడుతూ ఎగురుకుంటూ ఓ గాలిపటం వచ్చింది. లోపలికి రావాలా వద్దా అని నన్నడుగుతున్నట్టుగా దారం ఊచలకు చిక్కుకుని ఆగిపోయిన ఆ గాలిపటం చక్కని ఆకర్షణీయమైన రంగు కాగితాలతో అచ్చంగా చక్కని పెద్ద సీతాకోక చిలుకలా ఉంది. జాగ్రత్తగా దారపు చిక్కులు విడదీసి ఆ గాలిపటాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. అది ఎక్కడినుండి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంతలోనే నా సందేహానికి సమాధానంగా దూరం నుండి వినవచ్చిందో పిలుపు, “మామ్మగారూ, ఆ గాలిపటం నాదే!”

ముద్దులొలుకుతున్న ఆ మాటలు వినిపించిన దిశగా చూశాను. దాదాపు రెండువందల అడుగులున్న మరో భవన సముదాయంలోనుండి వచ్చిందని అప్పుడు నాకర్థమయింది. నాకు కనిపించేలా తన చిట్టి చిట్టి చేతులను కిటికీలోనుంచి బయటకు వేగంగా ఊపుతూ నా వైపే చూస్తూ అరుస్తోంది ఆ ఏడేళ్ళ పాప! కొంచెం గట్టిగా మాట్లాడితేనే వినపడే ఆ దూరాన్ని ఛేదిస్తూ తను ఆ గాలిపటం వైపు, నా వైపు దీనంగా చూస్తూ అన్న ఆ మాటలకు మరింత బాధవేసింది. తన బుజ్జి బుజ్జి మాటలకు ముద్దు కూడా వేసింది.

“ఓహో నీదేనా ఈ గాలిపటం?” గొంతు పెంచి అడిగాను. “అవును మామ్మగారూ నాదే!” నా స్పందనకు ఆ పాప కన్నుల్లో ఆనందం కనిపించింది.

“నీకు ఈ గాలిపటం ఇచ్చేయాలా?!”

“ఊ… అవును. అది తెగిపోయింది.” తన చేతిలో మిగిలిన దారపుకండీని చూపిస్తూ చెప్పింది.

“సరే, సాయంత్రం పంపిస్తాను.” అన్నాను. “సాయంత్రమా? ఇప్పుడు నేను ఎగరేసుకోవాలి కదా?” బిక్కముఖం వేసింది పాప. “కానీ బైట తాళం వేసి ఉందమ్మా. నేను రాలేను.”

“ఓహో…మీరు కూడా నాలాగేనా? మా ఇంటికీ తాళం వేసి వెళిపోయారు మమ్మీ డాడీ!” నా పరిస్థితి అర్థమయినట్టుగా తలాడిస్తూ చెప్పింది పాప.

నిజమే! ఆ పాప చెప్పినట్టు నేను కూడా తాళం వేసి ఉన్న బందీనే! ఎంతమంది కాపలా ఉన్నా కూడా ఈ ఆధునిక జీవితమంతా భయం భయంగానే గడపాలి మరి! అందుకే కొడుకు, కోడలు, పిల్లలు వెళ్ళిపోయేటపుడు తప్పకుండా తాళం వేసుకునే వెళతారు. కొంతలో కొంత నయం తాళంచెవి నా దగ్గర ఒకటి వదిలి వెళతారు. కాలింగ్ బెల్ మ్రోగాక తలుపుకున్న రంధ్రంలోనుండి ఎవరొచ్చారో  తనిఖీ చేసుకుని, కొడుకైనా కోడలైనా పిల్లలైనా వాళ్ళు బ్యాగ్స్ లోంచి తాళం వెదుక్కుని తీసేలోపే నేనే ఇనుప కటకటాల్లోంచి అందిస్తే తాళం తీసుకుని వస్తారు. లోపలికి వచ్చాక కూడా మళ్ళీ తాళం బిగించెయ్యాల్సిందే! అంటే అందరమూ ఇంట్లోలోనే ఉన్నా కానీ మాకు మేముగా వేసుకున్న స్వయంఖైదు అనుభవిస్తున్న బందీలమన్నమాట!

“మామ్మగారూ, మీ పేరేంటి?” అరిచింది ఆ ఆరిందా, నాకు నవ్వు తెప్పిస్తూ. “సుమిత్ర.” చెప్పాను.

“సుమిత్ర! పేరు బావుంది చాలా.” నవ్వింది పాప. “ఎక్కడా విన్నట్టు లేదా?” అడిగాను.

“ఏమో…” ఆలోచిస్తున్నట్టుగా అయోమయంగా చూసింది. “సుమిత్ర అంటే రామాయణంలో లక్ష్మణుడి తల్లి.”

“ఓహో… నాకు సరిగ్గా తెలీదు. మమ్మీ ఎప్పుడూ వాటి గురించి చెప్పలేదు. పైగా డాడీకీ మమ్మీకీ ఎప్పుడూ ఖాళీ ఉండదు.” దిగాలుగా ముఖం పెట్టి చెప్పింది.

“అది సరే, నా పేరు అడిగావు కానీ నీ పేరు మాత్రం చెప్పలేదు నాకు.” నేనూ తనలా బుంగమూతి పెట్టడానికి ప్రయత్నిస్తూ చెప్పాను.

“అయ్యో మామ్మగారూ అలగకండి. నా పేరు చక్రిక.” నవ్వుతూ చెప్పింది. “చక్రిక! ఎంత బావుందో నీ పేరు! అంటే తెలుసా నీకు?!” అడిగాను.

“ఏమో చక్రిక నా పేరు. అంతే. చక్రిక అంటే నేనే!”

నా ప్రశ్నకు అయోమయంగా సమాధానం చెప్పింది.

“సరే, నేనే చెప్తానులే! చక్రిక అంటే లక్ష్మీ దేవి అమ్మవారి పేరు. నువ్వు లక్ష్మీ దేవివి అన్నమాట!”

“భలే, భలే… మమ్మీ డాడీ ఎప్పుడూ నా పేరు లక్ష్మీ దేవి పేరు అని చెప్పలేదు నాకు. సాయంత్రం వచ్చాక అడుగుతాను.”

“వద్దులే చక్రీ, వాళ్ళకూ తెలుసో లేదో కదా.” అన్నాను. “తెలీనప్పుడు ఎందుకు పేరు పెట్టారు? ఇంత మంచి మీనింగ్ ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా!” మళ్ళీ బుంగమూతి పెట్టింది చక్రిక. “సరే కానీ, బడికి వెళ్ళలేదేం?” అడిగాను.

“బడి?! బడంటే?!” ఆశ్చర్యంగా అడిగింది.

“బడి అంటే స్కూల్ అమ్మా! స్కూల్ కి తెలుగు మాట బడి.”

“అవునా? మరి ఎప్పుడూ వినలేదేంటి? మనం తెలుగు వాళ్ళమే కదా?!” మళ్ళీ ఆశ్చర్యాన్ని ప్రకటించింది చక్రిక.

“సరే ఎందుకు వెళ్ళలేదు బడికి?”

“ఎందుకంటే ఫీవర్ వచ్చింది నాకు. డాక్టర్ ఒన్ వీక్ వెళ్ళొద్దన్నారు.”

“అయ్యయ్యో జ్వరమా? మరి నీకు తోడుగా ఎవర్నీ పెట్టలేదా అమ్మ?”

“మమ్మీకీ డాడీకీ లీవ్ దొరకలేదు. ఇద్దరూ బ్యాంక్ మేనేజర్లేలే. పని మనిషేమో  నిన్న ఉంటానని చెప్పింది. ఇవ్వాళేమో రోజూ ఉండాలంటే వీలు కాదని చెప్పి వెళ్ళిపోయింది.”

“మరి మందులు వేసుకున్నావా?”

“మార్నింగ్ టాబ్లెట్ మమ్మీ ఇచ్చి వెళ్ళింది. పన్నెండుకి బువ్వ తిన్నాక కాసేపు ఆగి ఇంకొకటి వేసుకొమ్మని చెప్పి వెళ్ళింది.”

“మరి నీకు ఆకలి వేస్తే ఎలా? అన్నం ఎవరు పెడతారు?” జాలిగా అడిగాను.

“నేనే మామ్మగారూ! అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది వెళ్ళింది అమ్మ. ఇంకా నాకు తినాలనిపిస్తే ఫ్రిజ్ లో బ్రెడ్, బిస్కట్స్ కూడా ఉన్నాయి.”

“జ్వరం అన్నావ్ కదా చక్రీ! పడుకోరా.”

“నిన్నంతా పడుకునే ఉన్నాను. రాత్రంతా పడుకునే ఉన్నాను. బువ్వ తిన్నాక కాసేపాగి కూడా పడుకొమ్మని చెప్పి వెళ్ళింది మమ్మీ. ఎంత సేపు పడుకోవాలి మామ్మగారూ?! బోర్ కదా. పైగా ఇప్పుడు నా కైట్ కూడా పోయింది. ఊహూ.. కైట్ కాదు… ఏమన్నారు గాలి… గాలిపటమేనా?”

ఏడేళ్ళ ఆ చిన్నారి  పరిస్థితికి జాలి వేసింది నాకు. యాంత్రిక జీవితాల మధ్యలో నలిగిపోతున్న ఈ పిల్లల చిట్టిగుండెల సంగతి ఈ రోజుల్లో ఎవ్వరికీ పట్టడంలేదు. సంపాదన సంగతి మాత్రమే చూసుకొంటూ సంతోషాన్ని పూర్తిగా వదులుకొంటూ కుటుంబ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు ఎక్కువగా ప్రభావితం చేసేది చిన్నపిల్లలనే కదా!

ఇప్పుడంటే ఇన్ని చెబుతున్నాను కానీ అపట్లో నా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఉండేది కాదు. అయనకు  చేదోడువాదోడుగా ఉంటుందని నేనూ చిన్న ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ప్రమోషన్. కెరీర్లో వెనుకంజ వేయకూడదంటూ అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎగబ్రాకాను కానీ విశాల్ ని చూసుకోవడంలో మాత్రం విఫలమయ్యాను. మా ఇంట్లో పెద్దవాళ్ళెవ్వరూ లేకపోవడం వల్ల వాడి సెలవు రోజుల్లోనూ, వాడికి సుస్తీ చేసి నాకు సెలవు దొరకని రోజుల్లోనూ వాడు తినడానికి అన్నీ సర్దిపెట్టి, మందులు ఎలా వేసుకోవాలో జాగ్రత్తలు చెప్పి వెళ్ళేదాన్ని. వాడు కూడా కిటికీలో కూర్చునే ఏవేవో ఆటలు ఆడుకొంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ సమయాన్ని వెళ్ళబుచ్చేవాడు. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది- వాడి బాల్యం కిటికీలోనే గడిచేలా చేయడం వల్లనే ఇప్పుడు నాకూ అదే పరిస్థితి కలిగిందేమో అని!

“మామ్మగారూ, గాలిపటమేనా?!” బిగ్గరగా వినిపించిన చక్రిక ప్రశ్నకు ఆలోచనలనుండి బయటకొచ్చాను.

“అవునమ్మా గాలిపటమే. సరే నీకు అన్నం తినే దాకా నేను కబుర్లు చెబుతానులే.”

“థ్యాంక్యూ మామ్మగారూ…మీకు కూడా బోర్ కొట్టదులే!” గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చిన తన సమాధానానికి నవ్వు ఆపుకోలేకపోయాను.

“ఎందుకు నవ్వుతున్నారు?” అడిగింది.

“సరే, నీకు ‘బుజ్జిమేక బుజ్జిమేక ‘ పాట తెలుసా?”

“తెలీదు. మేక అంటే గోట్ కదా?”

“అవును. ఆ పాట నేర్చుకుంటావా, నేర్పిస్తాను?”

“ఇప్పుడే నేర్పిస్తారా? నాకు వచ్చేస్తుందా?!” సంతోషంగా అడిగింది.

“ఎందుకు రాదూ? చక్రిక తెలివైన పాప కదా, త్వరగానే వచ్చేస్తుంది. చెప్పు… బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెళ్తివి?” అభినయిస్తూ చెప్పాను.

“బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెళ్తివి?” నాకంటే బాగా అభినయం చేస్తూ గుండ్రని తన కన్నులను అందంగా తిప్పుతూ చెప్పింది చక్రిక.

“రాజుగారి తోటలోన మేతకెళ్తిని…”

అలా ఓ అరగంట అయ్యేసరికి పాటంతా వచ్చేసింది చక్రికకు.

“హే మామ్మగారూ నాకు మొత్తం పాట వచ్చేసింది. చాలా బావుంది. మళ్ళీ పాడతాను వింటారా?” ఉత్సాహంగా అదిగింది.

నవ్వుతూ పాడమన్నట్టుగా తల ఊపాను.

మరో అరగంటలో నాలుగైదు సార్లు ఆ పాటను నాకు వినిపించింది చక్రిక.

“చాలా బాగా వచ్చేసింది బుజ్జిమేక పాట నీకు.” మెచ్చుకోలుగా చెప్పాను.

ఆనందంతో తన ముఖం వెలిగిపోయింది. “థ్యాంక్యూ మామ్మగారూ… చాలా బావుందీ పాట.” సంతోషంగా చెప్పింది.

“నాకు మీ కథ చెప్పరా?!” అంది చక్రి, మరి కాసేపాగి.

“నా కథా?!” ఆశ్చర్యంగా అడిగాను.

“అదే… సుమిత్ర కథ… రామాయణమో ఏదో అన్నారు కదా ఇందాక?” ఆసక్తిగా ఉంది చక్రిక స్వరం.

“అదా, చాలా పెద్ద కథరా అది. సరే కొంచెం కొంచెం చెప్తాను. దశరథమహారాజు అని ఓ రాజు ఉండేవాడు…”

అలా రామాయణగాథ తనకు చెప్పడం ప్రారంభించాను. మధమధ్యలో చక్రిక అడిగే ప్రశ్నలకు జవాబులిస్తూ నేను కథను కొనసాగిస్తుంటే మంత్రముగ్ధలా చూస్తూ ఉండిపోయింది చక్రిక. అహల్య శాపవిమోచన వరకూ చెప్పి,  గడియారం వైపు చూసేసరికి పన్నెండున్నర!

“చక్రీ, టైము చూడు, పన్నెండున్నర దాటిపోయింది. అన్నం తినవా నువ్వు?!”

“కథ బావుంది మామ్మగారూ, మీరు అంతా చెప్పేసాక తింటాను.”

“చాలా పెద్ద కథరా ఇది. రేపు చెప్పుకుందాంలే మిగతాది. నువ్వు అన్నం తెచ్చుకో, నేనూ తెచ్చుకుంటాను. ఇద్దరమూ కలిసి తిందాం.”

కథ ఆపినందుకు చిన్నబుచ్చుకున్నా ఇద్దరమూ కలిసి తిందామన్న మాటకు సంతోషంగా లోపలికి వెళ్ళి అన్నం కంచంలో పెట్టుకుని తెచ్చుకుంది చక్రిక.

ఈలోగా నేను కూడా నా భోజనం కిటికీ దగ్గరకు తెచ్చుకున్నాను.

“చూడు ఇది దేవుడి ముద్ద!” అని ఓ ముద్ద తీసి పక్కన పెట్టాను.

“ఆ… గుర్తొచ్చింది దేవుడి ముద్ద! మమ్మీ ఎప్పుడో చిన్నప్పుడిలా నాకు పెట్టేది.” ఉత్సాహంగా చెప్పి తనూ ఓ ముద్దను పక్కన పెట్టింది.

“నీకు పప్పు ముద్ద కావాలా?!” అని చెప్పి నా చేతిని కిటికీలోంచి ముద్ద అందిస్తున్నట్టుగా బయటకి పెట్టాను. తను కూడా తన ఖాళీ చేతిని బయట పెట్టి ఆ ముద్దను తీసుకుని, నోట్లో వేసుకున్నట్టుగా నటించి, “అబ్బ! చాలా బావుంది మీ పప్పు!” అని చెప్పింది చక్రి.

“మామ్మగారూ, చారు అన్నం తింటారా… ఇదిగో తీసుకోండి.” అని తన చేతిని బయటకు చాపింది. నేను దాన్ని తీసుకుంటుని, నోట్లో పెట్టుకున్నట్టుగా అభినయించి చెప్పాను, “ఓ… మీ చారు ఇవ్వాళ బ్రహ్మాండంగా ఉంది!”

నా మాటలకు మురిసిపోయి చూసింది. అలా ఆటలు ఆడుకొంటూ, కబుర్లు చెప్పుకొంటూ ఇద్దరమూ ఒకేసారి అన్నం తినడం ముగించాం. మరో అరగంట తర్వాత తనకు మాత్ర వేసుకోవాలన్న విషయం గుర్తు చేసి వేయించాను. మరి కాసేపటికి నిద్ర వస్తుందని చెప్పి లోపలికి పడుకోవడానికి వెళ్ళిపోయింది చక్రిక.

నేను కూడా నడుము వాల్చి ఓ గంటన్నర సేపు పడుకున్నాను. లేచి మళ్ళీ కిటికీ దగ్గరకు వెళ్ళాను కానీ చక్రిక కనిపించలేదు. ఎప్పటికి లేస్తుందో అని తన మీద బెంగగా అనిపించి అక్కడే నించుని చెట్లనూ, పక్షులనూ చూస్తూ ఉండిపోయాను. పిల్లలు వచ్చే వేళవుతోంది కానీ చక్రిక మాత్రం కనిపించలేదు.

మనసంతా అదోవిధంగా అలుముకున్న గుబులుతో వాళ్ళకు తినేందుకు ఏదైనా చేయాలని వంటింటి వైపు నడిచాను. కాసేపటికి అక్షర్, ఆకాంక్ష వచ్చారు.  టిఫిన్ తింటూ నాతో ఉత్సాహంగా వాళ్ళ కబుర్లు చెప్పారు. వాళ్ళకు నా దగ్గిర మాలిమి ఎక్కువ కదా! హోం వర్క్ చేసుకోండర్రా అని చెబుతున్నా వినకుండా రోజూలానే వాళ్ళ అమ్మానాన్నలు ఇంటికి వచ్చేవరకూ నా దగ్గిర కాలక్షేపం చేస్తూనే ఉన్నారు.

“నానమ్మా, ఈ గాలిపటం ఎవరిది?” అడిగాడు అక్షర్ ఆశ్చర్యంగా దాన్ని చూస్తూ. “నా కొత్త నేస్తానిది.” నవ్వుతూ చెప్పాను.

“కొత్త నేస్తమా? ఎవరు నానమ్మా?!” ఇద్దరూ ఒకేసారి ఉత్సుకతతో అడిగారు.

“చక్రిక.” చెప్పాను. “చక్రిక! పేరు చాలా బావుంది.” ఆకాంక్ష సంతోషంగా చెప్పింది. “అవును.” అన్నాడు అక్షర్.

వాళ్ళతో చక్రిక గురించి, తనతో ఆరోజు మధ్యాహ్నం వరకూ ఆడుకోవడం గురించి చెప్పాను. “తను కూడా మన ఇంటికొస్తే బావుణ్ణు నానమ్మా! చక్కగా ఆదివారాలు అందరం కలిసి ఆడుకోవచ్చు.” ఆశగా చెప్పింది ఆకాంక్ష. “వాళ్ళ అమ్మానాన్నా ఒప్పుకోవాలి కదర్రా. ముందు ఈ గాలిపటం దానికి అందే దారి చూడండి.” పిల్లలకు చెప్పాను.

“డాడీ వచ్చాక అడిగి వెళ్తాను.” అక్షర్ చెప్పాడు. అంతలోనే విశాల్, విద్య వచ్చేసారు. వాళ్ళు కాఫీలు తాగి అలసట తీర్చుకునేదాకా ఆగి అప్పుడు చెప్పాడు అక్షర్, “డాడీ. ఈ గాలిపటాన్ని ఇచ్చేసి వస్తాను.”

“ఇప్పుడు బయటకు వెళ్తావా? ఎవరిదది?” విసుక్కుంది విద్య. “నా గదిలోనుంచి కనిపించే ఎదురు ఫ్లాట్ లో పాపది విద్యా! నేనే ఇచ్చేసి రమ్మన్నాను.” విశాల్, విద్యల వైపు చూస్తూ చెప్పాను.

“అమ్మా, ఎవరో ముక్కూ ముఖం తెలియని వాళ్ళ ఇంటికి మనమెందుకు వెళ్ళడం చెప్పు? పైగా అక్షర్ ని పంపించేస్తానంటావేంటి?”

“క్రిందనే కదరా. ఆదివారం నాతో పాటు ఆడుకోవడానికి తప్ప పిల్లలను ఎక్కడకీ వదలవు. జైలు పక్షుల్లా ఇంట్లోనే ఉంచుతానంటావు.”  నా చిరాకుకు కొంచెం తగ్గాడు విశాల్. “సరే, వెళ్ళి రారా.” అని అనుమతించాడు కొడుకుని. ఉత్సాహంగా బయటకు పరుగెత్తాడు అక్షర్. వెళ్ళిన మూడు నిమిషాలకే తిరిగి వచ్చాడు.

“ఇచ్చేసావా?” ఆసక్తిగా అడిగింది ఆకాంక్ష. “వాచ్ మేన్ వెళ్ళనివ్వలేదు.  గాలిపటాన్ని అతనికే ఇచ్చి వచ్చాను. ఆ ఫ్లాట్ తాళం వేసే ఉంది.” పిల్లలిద్దరి కళ్ళలోనూ నిరాశ తొంగి చూసింది. అప్పుడే రాత్రి ఏడు కావస్తోంది. పాపం అక్కడ చక్రిక అమ్మానాన్నల కోసం చూస్తూ ఒంటరిగా! నా మనసు మళ్ళీ బాధగా చివుక్కుమంది.

“చూసావా? మనమేదో మంచి చేద్దామనుకున్నా అందరూ దాన్ని అలా తీసుకోరు. మనం కాలానుగుణంగా మారుతూ ఉండాలి.” సున్నితంగా అంటించాడు విశాల్, నా వైపు చూస్తూ.

“అలా అని ఎవ్వరితోనూ ఎవ్వరమూ కలవకుండా పోతే మనుషులం అనిపించుకోమురా.” హితవు పలకబోయిన నన్ను ఇంకేమీ అనలేక బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోయాడు విశాల్. ఎవరికెలా సర్ది చెప్పాలో తెలియక వంటింట్లోకి వెళ్ళింది విద్య.

మరో నాలుగురోజులు నాకు తెలీకుండానే గడిచిపోయాయి. ఎందుకంటే ఉదయం వీళ్ళంతా బయటకు వెళ్ళడమే తడవుగా నేను కిటికీ దగ్గరకు చిన్నపిల్లలా పరుగెత్తి వెళ్ళేదాన్ని. ఆ సరికే నా కోసం ఎదురు చూస్తూ కిటికీలోనే కూర్చుని చూసేది చక్రిక. తక్కువ కాలమే అయినా ఇంట్లో ఒంటరిగా ఉన్న తనకు సరదాగా కాలం దొర్లిపోవాలని నేను చాలా ప్రయత్నించాను. ఆ ప్రయత్నాలలో భాగంగా తనకు గాలిపటం ఎలా ఎగురవేయాలో నేర్పించాను. ఎన్నో చిన్ని చిన్ని ఆటలు, తెలుగులో పాటలు, పద్యాలు నేర్పించాను.

“మామ్మగారూ, నమస్కారం. శుభోదయం.”

“అబ్బో చక్రీ, నీకు చాలానే తెలిసిపోయాయే!” నేను నేర్పిన తెలుగు పదాలను తన నోటినుండి వింటున్న సంబరంతో, గర్వంతో పొంగిపోతూ అన్నాను తనతో.

“మీరు నేర్పించినవే కదా! వినండి మరి….

కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు

శేషశాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు

మధువైరి దవిలిన మనము మనము

భగవంతు వలగొను పదములు పదములు

పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని జింతించు దినము దినము

చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు

కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు తండ్రి!

హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!”

గుక్క తిప్పుకోకుండా పోతన పద్యాన్ని అప్పచెప్పేసింది చక్రిక. “నిన్ననే కదా, నీకు ఈ పద్యం నేర్పాను?” ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టాను.

“అవును. కానీ నిన్న సాయంత్రం నుండి అస్తమానూ చెప్పుకుంటూనే ఉన్నాగా?!”

“అంత నచ్చిందా నీకు?” మళ్ళీ నా విస్మయాన్ని వెళ్ళబుచ్చాను.

“అవును. మా ఇంగ్లిష్ రైమ్స్ కంటే మీరు చెప్పిన పద్యాలే బావున్నాయి.” కళ్ళను గుండ్రంగా తిప్పుతూ నవ్వింది చక్రిక.

“చేతవెన్న ముద్ద గుర్తుందా?!” నా ప్రశ్న పూర్తయ్యే లోపే గుక్క తిప్పుకోకుండా ఆ పద్యం కూడా చెప్పేసింది.

“అన్నట్టు నాకు సంతోషంగా లేదు.” బిక్కముఖం వేసి చెప్పింది చక్రిక. “ఏమయిందిరా చక్రీ?” బుజ్జగిస్తూ అడిగాను.

“రేపటినుండి నేను బడికి వెళ్ళిపోవాలి. నాకు జ్వరం తగ్గిపోయింది.” బాధగా చెప్పింది చక్రిక. నాతో మాట్లాడడం వల్ల తన సంభాషణలో ఆంగ్ల పదాల వాడకం తగ్గిపోవడం గమనించి చాలా సంతోషంగానూ, తను బాధపడే తీరుకు దిగులుగానూ అనిపించింది.

“వెళ్ళక తప్పదు కదా తల్లీ?!” మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం చేసాను. “కానీ… లంకను కాల్చేసాక హనుమంతుడు ఎలా వచ్చాడో, రాముడు ఏం చేసాడో నాకెవ్వరు చెబుతారు?” చక్రిక కళ్ళు జలజలమంటూ వర్షించాయి.

“అయ్యో… చిన్నపిల్లల్లా ఎవరైనా ఇలా ఏడుస్తారా? నువ్వు స్కూల్ కి వెళ్ళిపోతున్నావు కూడానూ! ఇవాళే చాలా కథ నీకు చెప్పేస్తాను. మిగిలిన కథంతా ఏదో ఒక సమయంలో మీ ఇంటికొచ్చి పూర్తి చేసేస్తానులే.” నేను భరోసా ఇవ్వడంతో కొంచెం నిమ్మళించింది తన దు:ఖం.

సరే అన్నట్టుగా కళ్ళు తుడుచుకుంది. కాసేపు తను దిగాలు పడుతుంటే, మరి కాసేపు నేను ఊరడిస్తుంటే ఆరోజు ఎలాగో గడిచిపోయింది.

తర్వాతి రోజు శనివారం. అలవాటుగా ఉదయం తొమ్మిది గంటలకు కిటికీ దగ్గరకు వెళ్ళాను. చక్రిక కోసం వాళ్ళ కిటికీలోకి తొంగి చూశాయి నా కళ్ళు. తను కనిపించలేదు. అప్రయత్నంగా నా కనుల ముందు సన్నని నీటి తెర! ‘నాకు రామాయణం కథ ఎవరు పూర్తి చేస్తారు?’ అని తను వెక్కుతూ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆ సన్నని నీటి తెర కాస్తా పెద్ద ప్రవాహమయింది. బరువెక్కిన గుండెతో కిటికీ దగ్గర నిలబడలేక లోపలికొచ్చి కాసేపు పడుకున్నాను.

ఆ  రాత్రంతా కూడా నాకు నిద్ర కరువై భారంగానే గడిచింది.

పిల్లలు, కొడుకు, కోడలు ఇంటికి వచ్చాక కూడా అన్యమనస్కంగానే గడిపాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టకుండా భారంగా గడిచింది.

ఉదయాన్నే మగతగా నిద్ర పడుతున్న సమయంలో కాలింగ్ బెల్ మ్రోగిన శబ్దానికి మెలకువ వచ్చింది. నేను లేచి వెళ్ళేలోపుగానే విశాల్ వెళ్ళి తలుపు తీశాడు. మరో రెండు నిమిషాల తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పాడు విశాల్, “అమ్మా! నీ కోసం ఎవరో వచ్చారు.”

ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా తన వైపు చూశాను. నాకూ తెలియదన్నట్టుగా తల పంకిస్తూ హాల్లోకి నడిచాడు. అతని వెనుకే నేనూ వెళ్ళే సరికి “నమస్కారమండీ!” అంటూ సోఫాలోనుంచి లేచి నిలబడింది ఓ జంట.  ”నా పేరు విజయ్ అండీ. ఈమె నా భార్య ప్రమీల.”

విశాల్ లోనూ, నాలోనూ కలిగిన సందేహాలను చదివినట్టుగా చిరునవ్వుతో చెప్పింది ప్రమీల- “చక్రిక మా అమ్మాయేనండీ!”

“ఓహ్ చక్రి తల్లిదండ్రులా మీరు… కూర్చోండి కూర్చోండి.” అని వాళ్ళను కూర్చోబెట్టాను. విశాల్ విద్యను నిద్ర లేపేందుకు లోపలికి వెళ్ళాడు.

“చాలా సంతోషమండీ… మీరిద్దరూ కలిసి మమ్మల్ని కలిసేందుకు వచ్చారు. చక్రి ఇంకా నిద్ర లేవలేదా?” అన్నాను నవ్వుతూ.

“మిమ్మల్ని కలుసుకోవడం మాకే ఎంతో సంతోషకరమైన విషయమండీ! చక్రిక నిన్న రాత్రినుండి ‘మామ్మగారూ మామ్మగారూ’ అంటూ మిమ్మల్నే కలవరిస్తోందండీ! నిన్న రాత్రి మేము వచ్చేటప్పటికి చాలా ఆలస్యం అయింది. వచ్చేటప్పటికి ఏమీ తినకుండానే నిద్రపోయింది. ఆ మగతలోనే ఏదో తినిపించాం కానీ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదండీ. నేను బడికి వెళ్ళను అని కూడా ఒకటే కలవరింతలు. మీరొక్కసారి వచ్చి తనను పలకరిస్తే బావుంటుంది.” ఆదుర్దా నిండిన గొంతుతో చెప్పింది ప్రమీల.

విద్య లోపలినుండి కాఫీ కప్పులతో ప్రత్యక్షమయింది. విశాల్ ఆమెను వాళ్ళకు పరిచయం చేశాడు.

మొహమాటపడుతూనే కాఫీ తీసుకుని వెంటనే వెళ్ళిపోయేందుకు లేచారు వాళ్ళు. ఈ లోపుగా నేను గబగబా ముఖం కడుక్కున్నాను.

“నేనూ వస్తాను పదండి.” అని వాళ్ళతో  పాటుగా  బయలుదేరాను.

“అత్తయ్యా, నేనూ వస్తాను పదండి. చక్రికను చూస్తాను.” అంది నవ్వుతూ విద్య. తాళం తీసి పరుగులాంటి నడకతో చక్రిక దగ్గరకు వెళ్ళింది ప్రమీల. “చక్రీ చూడమ్మా… ఎవరొచ్చారో చూడు!” అని తట్టి లేపింది.

కనులు విప్పిన చక్రిక ఎదురుగా కనిపించిన నన్ను చూడగానే “మామ్మగారూ!” అని  అరచినంత పని చేసి గట్టిగా నన్ను వాటేసుకుంది.

“ఎందుకు బడికి వెళ్ళనన్నావట?” సౌమ్యంగా అడిగాను. “మరి మీరు కనిపించరుగా!” దీనంగా చెప్పింది చక్రిక.

“ఏం బాధపడకు. మీ ఇల్లు తెలిసిందిగా నాకు. కిటికీలోంచి నన్ను పిలిస్తే చాలు, పరుగెత్తి వచ్చేస్తాను. నువ్వు కూడా మా ఇంటికి వస్తే అక్కడ అన్నయ్య, అక్క ఉన్నారు. వాళ్ళతో పాటుగా మనందరం కలిసి చాలా ఆటలు ఆడుకోవచ్చు.” అభయం ఇస్తున్నట్టుగా చెప్పాను, తన ముంగురులు సవరిస్తూ.

సందేహంగా తన అమ్మానాన్నల వైపు చూసింది చక్రిక. “వెళుదువుగానిలే. ఇవాళ సన్ డే కూడా కదా!” విజయ్ చెప్పాడు.

“సన్ డే అనకండి డాడీ! ఆదివారం అనాలి.” వెలుగు ఉండిన ముఖంతో చెప్పింది చక్రిక. “డాడీ అనకూడదమ్మా, నాన్నా అనాలి.” బదులుగా నవ్వుతూ చెప్పాడు విజయ్.

ఒక్కసారిగా ఆ గదంతా నవ్వులతో నిండిపోయింది.

“సరే, నీ కోసం చూస్తూ ఉంటాం. కాసేపాగి ఇంటికి వస్తావుగా?” అని చక్రికకు వీడ్కోలు చెప్పి తిరిగి బయలుదేరాం.

గది బయటకు వచ్చాక చెప్పాను వాళ్ళతో- “విలువైన బాల్యాన్ని మీరంతా ఉద్యోగాలు, సంపాదనల పేరుతో అణిచేస్తున్నారర్రా. పిల్లలకు కావలసిన మనోవికాసం, ఆటలు, పాటలు ఏమీ మీరివ్వలేకపోతున్నారు. కనీసం వాళ్ళకు నోరారా తినిపించడం కానీ, అక్కున చేర్చుకుని కబుర్లు చెప్పడం కానీ చేయకుండా ఆ పసిమనసులకు దక్కవలసిన ప్రేమను కూడా పంచకపోతే ఎందుకొచ్చిన ఈ సంపాదనలు చెప్పండి? ఎంత డబ్బిచ్చి వాటన్నిటినీ కొనగలరు మీరు? ఎప్పుడూ హడావిడిగా ఉరుకులు పరుగులు పెట్టడం తప్ప ఇంకాసేపు పడుకుంటానని మారాం చేసే బిడ్డను కాసేపైనా నిద్రపోనిచ్చే తీరిక కూడా లేని ఈ యాంత్రిక జీవితాలు ఎందుకు చెప్పండి?! సరే చక్రిని పంపించండి. వస్తాం.”

నా మాటలకు అందరి దగ్గరినుంచీ మౌనమే సమాధానంగా వచ్చింది. ఇంటికి తిరిగి రాగానే అప్పటికే లేచిన అక్షర్, ఆకాంక్ష నన్ను “నానమ్మా… ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు?” అంటూ నన్ను చుట్టేసుకున్నారు.

“చక్రిని మన ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్ళామర్రా.” నవ్వుతూ బదులిచ్చాను.

“హే….” ఆనందంతో కేరింతలు పెట్టారు పిల్లలిద్దరూ.

వాళ్ళిద్దరి వైపూ సంతృప్తిగా చూస్తూ చెప్పాడు విశాల్, “నువ్వు చెప్పిందే నిజమమ్మా! వాళ్ళను అప్పుడప్పుడూ ఈ ఆవరణలోకి తీసుకెళ్తూ ఉండు. చక్రితో కూడా ఆడుకోనీ.”

“అవునత్తయ్యా. అలానే చేద్దాం.  ఇంట్లోనే ఉండి సంపాదించే మార్గమేదైనా చూసుకుంటే నా పిల్లలకు కూడా నేను అందమైన బాల్యాన్ని అందించవచ్చు. రేపటినుండీ నేను ఉద్యోగానికి వెళ్ళను.” విద్య మాటలకు ఆశ్చర్యంగా చూశామిద్దరమూ.

“తప్పకుండా విద్యా! చాలా మంచి నిర్ణయం.” మెచ్చుకోలుగా చెప్పాడు విశాల్.

“అవును కిటికీలోని బాల్యానికి సెలవు పలకొచ్చు మన పిల్లలు.” గాలిలో తేలుతున్నట్టుగా చెప్పాను.

**** (*) ****

Painting: Megha Kapoor (http://arti-artindia.blogspot.com/)

(కథాగ్రూపు, సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహించిన కథలపోటీలో బహుమతి పొందిన కథ)

 

రాజేశ్ యాళ్ల:
వృత్తిరీత్యా బ్యాంక్ ఉద్యోగి. ప్రవృత్తి కథలు, కవితలు రాసుకోవడం. ప్రస్తుత నివాసం విశాఖపట్నం. నా తొలి కథ ‘కొత్తరచయితలు ‘ 1991లో “ఆంధ్రజ్యోతి” వారపత్రికలో అచ్చయింది. మరో నాలుగైదు కథలు 1996 వరకూ ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి. దాదాపు పదిహేనేళ్ళ విరామం తర్వాత మళ్ళీ కథలు రాస్తున్నాను. కథ గ్రూప్ కి, సాయి అఖిలేష్ ప్రొడక్షన్స్ వారికి, న్యాయనిర్ణేత శ్రీ వీరభద్రుడిగారికీ, కథను ప్రచురిస్తున్న వాకిలి పత్రికకి.. ధన్యవాదాలు.



17 Responses to కిటికీలోని బాల్యం

  1. December 1, 2014 at 4:08 pm

    కథ చాలా బావుంది రాజేష్ గారూ.

    • Rajesh Yalla
      December 2, 2014 at 11:05 pm

      కథ మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు ప్రసూన గారూ!!

  2. Lakshmi raghava
    December 1, 2014 at 8:24 pm

    ఎంతో సున్నితంగా అందంగా మలిచారు Rajesh గారూ, చాలా బాగుంది. అభినందనలు

    • Rajesh Yalla
      December 2, 2014 at 11:07 pm

      కథ మిమ్మల్ని అలరించినందుకు ఆనందంగా ఉంది. ఎన్నెన్నో కృతజ్ఞతలు లక్ష్మీ రాఘవ గారూ!!

  3. December 2, 2014 at 8:40 am

    కథ చాలా బాగుంది రాజేష్ గారూ . పిల్లలు కోల్పోతున్న బాల్యానుభూతుల్ని గురించి, పెద్దల బాధ్యతలని గురించి బాగా వివరించారు. అభినందనలు.

    • Rajesh Yalla
      December 2, 2014 at 11:11 pm

      మీ అభినందనలకు ఎన్నెన్నో ధన్యవాదాలు భాగ్యశ్రీ గారూ. మీ ప్రోత్సాహం ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోంది.

  4. December 6, 2014 at 9:13 am

    కథ సున్నితంగా ఉంది , నచ్చింది . కానీ ముగింపు పాజిటివ్ గా ఉన్నా సాధారణమైన ముగింపు ఇచ్చారు . మీ నుండి ఇంకా నవ్యత ఉన్న కథలు రావాలి రాజేష్ గారు . అభినందనలు

    • Rajesh
      January 13, 2015 at 10:06 pm

      మీ అభినందనలు అలరించాయి. ధన్యవాదాలు వనజ గారు!

  5. December 7, 2014 at 3:46 pm

    కథ బావుంది రాజేష్ గారూ! ఆలోచనాత్మకంగా , సహజంగా , ఆహ్లాదంగా . ముగింపులో కొంత కొత్తదనం ఉంటే ఇంకా బావుండేది.

    • Rajesh
      January 13, 2015 at 10:07 pm

      మీనుండి అభినందనలు అందుకోవడం సంతోషంగా ఉంది. ముందు ముందు మీరు చెప్పిన సూకానలు పాటిస్తాను. ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ!!

  6. yamuna
    December 8, 2014 at 11:17 pm

    కథ అంశాన్ని ‘మంచిది , ఆలోచింపతగ్గది’ తీసుకున్నారు. సున్నితంగా మలచారు. తెలుగు గురించి ఎక్కువ ప్రస్థావించటం తో సమస్య ‘పిల్లలు కోల్పోతున్న బాల్యము గురించా లేక అంతరిస్తున్న తెలుగు గురించా’ అనే సంశయం కలిగే అవకాశం ఉందేమో అనిపించింది. ముగింపు భిన్నంగా ఉంటె బాగుండేది ….బహుమతిని పొందినందుకు అభినందనలు.

    • Rajesh
      January 13, 2015 at 10:07 pm

      ధన్యవాదాలు యమునా గారూ! మీ సూచనలను గమనించాను.

  7. Veera Reddy Kesari
    December 9, 2014 at 2:43 pm

    కథ చాలా బాగుంది రాజేష్ గారూ . పిల్లలు కోల్పోతున్న బాల్యానుభూతుల్ని గురించి, పెద్దల బాధ్యతలని గురించి బాగా వివరించారు. అభినందనలు.

    • Rajesh
      January 13, 2015 at 10:08 pm

      వీరారెడ్డి గారూ! ఎన్నో ధన్యవాదాలు మీ అభినందనలకు.

  8. v.v.Bharadwaja
    January 10, 2015 at 4:41 pm

    The narration of the story gives the potentiality for the content, the way of expression of the concept very apt. You have introduced two sensitive characters which were sensitized and mesmerised the readers and automatically go through the story this is the technic of the writer’s readability effortness. Other than this, nothing is there..two things are here one is the strong feeling is the lapse of effection towards children and the way their brought- up.The main responsiblity of the parents shows towards children at that particular age is so essential total impact is the result of their individual personality.You have identified and conveyed yours message., it is o.k.

    • Rajesh
      January 13, 2015 at 10:11 pm

      భరద్వాజ గారూ! చక్కని వివరణాత్మక అభినందనలతో పాటు సునిశితంగా మీరు కథను పరిశీలించి చేసిన వ్యాఖ్యలు ఏంటో ఆనందాన్నిచ్చాయి. ధన్యవాదాలండీ!

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)