కొత్త పుస్తకం కబుర్లు

రాత్రి ఋతువులో పరిమళించే పద్యాల తోట

జనవరి 2015

“I love you as certain dark things are to be loved, in secret, between the shadow and the soul.” ― Pablo Neruda

రాత్రి… కటిక ఏకాంతపు చీకటి రాత్రి… చీకటి ఒక సామూహిక స్వప్నావిష్కరణ. రాత్రి, చీకటి పెనవేసుకున్న ప్రేమ, పగ. దేనిని ఎందుకు ప్రేమించాలి? లేదా, ఎందుకు ద్వేషించాలి? అసలు, దేన్నైనా ప్రేమించే, లేదా ద్వేషించే స్వేచ్చ కవికి వుందా? రాత్రి ఆవిష్కరించిన చీకటిలో నీడల వెతుకులాట, నీడలు లేని చీకటిలో ఆత్మతో సంభాషణ. ఎక్కడో కుదురుతుంది ఒక అక్షరానుబంధం! అప్పుడు ఆ అక్షరమాల కోడూరి విజయకుమార్ కవిత్వమై విచ్చుకుంటుంది. మధ్య రాత్రి, ఒక పరిచిత స్వరమేదో శృతి చేసుకుంటోన్న సవ్వడి లీలగా తెలియవస్తుంది.

‘నా పురా స్వప్నాలు కరిగి, కరిగీ
నన్ను వెన్నంటే తిరుగుతున్న
నా అనాది వేదన కాదుగదా ‘

అని ప్రతి ఒక్కరి హృదయాన్నీ సందిగ్ధంలోకి నెడుతుంది. అంతలోనే ‘ఒక కాగితం పడవై’ నీళ్ళ లోకి లాక్కుపోతుంది.

స్వప్నాలను అప్రమత్తం చేసే ఈ పద్యాల పూలతోట ఉన్మత్త పరిమళం ఎచటి నుండి వీచెన్?

***

కోడూరి విజయకుమార్ గురించి చెప్పడమంటే, సగం నా గురించి నేను చెప్పుకున్నట్టే ! కాకపోతే, మనం మతానికి విరుద్ధం. వాడు కాదు. అంతే ! బహుశా, యవ్వనోద్వేగాలు యెగసిపడే సమయంలో కలిసిమెలిసి తిరిగిన ఎవరి ప్రయాణానుభవాలైనా ఒకేలా వుంటాయేమో ?!

ఇప్పటి తెలంగాణ లోని ఒకప్పటి ఓరుగల్లులో ఘల్ ఘల్మని ఆడి పాడిన కుర్రాడు విజయ్. ఒకానొకప్పటి మధ్య తరగతి మిథ్యా ప్రపంచంలో గోడ్ గోడ్మని ఏడ్చినవాడు విజయ్. నలుగురు చెల్లెళ్ళకు అన్నగా గారాబంగా భుజాలపైకి ఎక్కడానికి ముందే బాధ్యతలు మీద వేసుకున్న వాడు విజయ్.

‘అమ్మానాన్నల ఆశలు అడుగంటుతాయి
నిన్నే నమ్ముకున్న అక్కాచెల్లెళ్ల భవిష్యత్తు
భయపెడుతూ వుంటుంది
అయినా సరే – నిష్క్రమించిన ప్రేయసి నీడ కరగదు’

అయినా విజయ్ సాహసించాడు. ప్రేమించాడు. అవును, బాధ్యతల బరువును మోసుకుంటూ ప్రియురాలి బరువునూ ఎత్తుకోవడం కష్టమే ! కష్టాన్ని యిష్టంగా చేయడం విజయ్ నైజం !
అలా దారం తెగిపోకుండా కలల గాలిపటాలను ఎగిరేసుకుంటూ, అలా ఆకాశాన్ని చూస్తూ నేల పైన పరుగెడుతూ, మా కూటమి లోని పెద్దాళ్ళు శివారెడ్డి, దేవిప్రియ గార్ల నుండి ‘మంచి బాలుడు ‘ అనే ట్యాగ్ లైన్ దక్కించుకున్నాడు విజయ్. ట్యాగ్ తగిలించుకున్నంత ఈజీ కాదు, దాన్ని కాపాడుకోవడం. అసలు ప్రస్తుత పరిస్థితులలో దేన్నైనా కాపాడుకోవడం ఎంత కష్టం ?
ఇప్పుడు వేసుకుందాం ఒక ప్రశ్న, అసలింతకీ జీవితమంటే ఏమిటి ? ఇంతకుముందైతే, జీవితానికి ఎన్నో అర్థాలు వుండేవి. మరెన్నో మార్గాలు వుండేవి. మహోన్నత ఆశయాలే లక్ష్యంగా ధగధగలాడేవి. ఇప్పుడు బతకడమే ఒక లక్ష్యం. జీవించగలగడమే ఒక పరమార్థం!
ప్రేమ – పెళ్లి –పిల్లలు – ఉద్యోగం- ఈ చక్రభ్రమణంలోంచే పెల్లుబికే కవిత్వాన్ని అక్షరీకరించాలి. కవి సమర్థుడు అయితే, ఈ చక్రభ్రమణంలోంచే సమాజాన్ని కూడా ఆవిష్కరించగలుగుతాడు. విజయ్ అటువంటి సమర్థుడైన కవి.

‘మబ్బుల ఆకాశం పైన రంగుల ఇంద్రధనుసు
నిలిచే వుండునని భ్రమసిన అమాయక రోజులవి’

అవును, అమాయకపు రోజుల్లోనే అచ్చమైన ప్రేమ వెల్లివిరుస్తుంది. అప్పుడంతా కెమిస్ట్రీ, ఆ తరువాత అంతా మ్యాథమాటిక్స్! త్వరలోనే ఆ మ్యాథమాటిక్స్ పరీక్ష కూడా రాయవలసిన పరిస్థితి వొస్తుంది.

‘అర్థం కాను నేను నీకు ఎప్పటికీ
కళ్ళ లోకి చూడడమే తెలుసు నీకు
కళ్ళ వెనుక తటాకాలని చూడలేవు’
తటాకాలలో తేలియాడే కలువలను చూడలేవు’

భరించాలి. నిందలే కావొచ్చు, కానీ తప్పదు. ఉరుకుల పరుగుల జీవితంలో, వస్తు వినిమయ ప్రపంచంలో ప్రతీదీ తూచబడుతుంది. ఎప్పటికప్పుడు తూకం సరిచూసుకోవలసిందే!

***

“Poetry is a naked woman, a naked man, and the distance between them.” -Lawrence Ferlinghetti

‘పురుషులు కదా మీరు
రంగులలో దాగిన దేహాలపైనే వ్యామోహం
దొరికిన ఏవో రెండు రంగులనలా చుట్టేసుకుని
చుట్టూ వున్న వర్ణమయ ప్రపంచం అంతా
ఇక మీ చుట్టూనే తిరుగుతుందని భ్రమిస్తారు’

‘కోక డాబే ‘ అన్న పురుష పుంగవుడిని శరీరపు డాబే చూస్తావని దబాయింపు. అవును, పురుషులు అందాల కోసం ప్రపంచమంతా గాలిస్తారు – ఇంటిని తప్ప ! స్త్రీలు, ఇంట్లోనూ, ఇంటి పరిసరాలలోనూ అందాలని ఆవిష్కరించగలరు. రాత్రి ఇల్లు చేరాక సగౌరవంగానో, తప్పనిసరిగానో తలవంచవలసిందే ఆ అందాలకు. అందరు పురుషుల లాగే అతడు కూడా తలవొంచే వుండొచ్చు. కానీ, ఆ సందర్భాలను అపురూప కవిత్వంగా మలిచి, కవిగా సగర్వంగా తలెత్తుకు నిలిచున్నాడు విజయ్.

తల్లి ముందు కొడుకుగా, భార్య ముందు భర్తగా మాత్రమే కాదు. కూతురు ముందు తండ్రిగా కూడా పురుషుడు తల వొంచుకోవలసిన సందర్భాలు వొస్తాయి. ఏ భయకంపిత క్షణాలలో అనుకుంటాడో పురుషుడు – ‘కూతురు బదులు కొడుకైతే బాగుండేదని’. ఆ భయకంపిత క్షణాలపై ఆగ్రహ పోరాటం చేస్తున్నా, అర్థం చేసుకోలేని వయసున్న కూతురికి ఏం చెప్పాలి ? ఇలా చెప్పాలేమో !

‘ నా లోలోపలి లాలిత్యాన్ని రక్షించింది స్త్రీలేనమ్మా
కట్నాలతోనే విలువ కట్టే విపణి వీధులూ
ఇంటికే పరిమితం చేసే మగ దుర్మార్గాలూ
నిర్లజ్జగా దొర్లే యాసిడ్ సీసాలూ… ‘

అటువంటి భయకంపిత క్షణాల లోనే కదా, అమాయి కాకుండా అబ్బాయి అయితే బావుండేదని, నువ్వు ప్రాణప్రదంగా పెంచుకున్న పూల మొక్కకు ఏ ఆపదా రాదనీ నువ్వు అనుకునేది. చిట్టితల్లులు అర్థం చేసుకుంటారులే! ఆ భయాలను ఎదుర్కునే మార్గమేదో !

‘ఇక అప్పుడు చూస్తావు నీ చిన్నారి దేవతని
తెలుసుకుంటావు అది ఇంకా పసిమొగ్గ కాదని
మెల్లిమెల్లిగా నీ పిడికిట్లోంచి తన వేలిని లాక్కుంటున్నదని
ఇక తనదైన నడక ఏదో నడిచే ప్రయత్నం చేస్తోందని’

***

‘గడియారపు రెండు ముళ్ళకు చిక్కుకుని
క్రమం తప్పక కదిలే దినచర్య
అవే రహదారులు మరికొన్ని గుంతలతో
అదే నగరం మరింత దుమ్మూ ధూళితో
అవే మొహాలు మరింత నిరాసక్తంగా ‘

నగరానికి చేరుకోవడమే ఒక విషాదమా?! అవునేమో! ఇక్కడికి చేరుకొని, ఒక గూడు ఏర్పర్చుకున్నాక, నగరజీవి ఈ సాలెగూడుని చేదించుకుని బయటకు పోలేడు. పరుగుకే తప్ప, కళకు, క్రియేటివిటీ కి ఇక్కడ సమయం వుండదు. అప్పుడే నగరం మృత ప్రాయంగా కనిపిస్తుంది. ఆ మృత సందర్భాన్ని ఖచ్చితంగా పట్టుకోగలిగాడు విజయ్. అందుకే, తన గత సంకలనం ‘అనంతరం’ లో ‘నగరంలో పద్యం మరణిస్తుంది’ అంటాడు.
‘కవి అనేవాడికి పరిశీలనా శక్తి వుండాలి. చూపుండాలి. చుట్టూ పరికించి చూడాలి’ అని శివారెడ్డి గారు పదే పదే చెబుతుంటారు. నిజమే – కళ్ళ ముందు కనికట్టు జరిగిపోతూ వుంటుంది. గుడ్డివాళ్ళం కాదుగదా – చూపు వుంటుంది. అయినా పట్టించుకోరు చాలా మంది. కానీ, విజయ్ పరిశీలన శక్తివంతమైనది. తన దృష్టి నుండి దేన్నీ పక్కకు పోనీడు.

‘ఒకప్పటి డబ్బా రేకుల టాకీసుని కూల్చివేసి / ఊరి మధ్యలో వెలిసిన మల్టీప్లెక్స్ ‘ నే కాదు, సున్నాలు వేసిన గోడల పైనుంచి అదృశ్యమై పోతున్న నినాదాలను కూడా పట్టించుకోవడం లోనే విజయ్ చూపేమిటోఅర్థమవుతుంది.

‘కామ్రేడ్ జన్ను చిన్నాలు అమర్ హై
కామ్రేడ్ జార్జి రెడ్డి అమర్ హై
విప్లవం వర్థిల్లాలి’

సమాచార సంకేతాలు హృదయాలను ఉప్పొంగించిన అక్షర సంద్రాలైన నినాదాలు – నిజమే, ఇప్పుడేమై పోయాయ్? విజయ్ మాటల్లో ఒకసారి చెప్పాడు – చిన్నప్పుడు, వరంగల్ లో డాక్టర్ రామనాథం దగ్గర జ్వరం మందులు పుచ్చుకున్నట్టు. అందుకే, ఇన్నాళ్ళైనా విజయ్ లో కవితాగ్ని రగులుతోందేమో !

సమస్తాన్ని ధ్వంసం చేసే రాజ్యం, సౌదాలనే కాదు, స్వప్నాలనూ, జ్ఞాపకాలనూ నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. వాటిని భద్రపర్చుకునే హార్డ్ డిస్క్ కవిత్వం మాత్రమే! జ్ఞాపకాలను కోల్పోతే, మనుషులు మృగ ప్రాయులుగా మిగిలిపోతారు.

Clearly, the city is not a concrete jungle; it is a human zoo-Desmond Morris

మృగతృష్ణ తో సంచరించే ఈ జూ లో కవి యెప్పుడూ అంతర్మథనం తో నలిగిపోతూనే వుంటాడు. ఈ జంతు ప్రదర్శనశాల నుండి బయటపడాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వుంటాడు. బయటపడలేక పోతున్నందుకు తనను తాను నిందించుకుంటూనే వుంటాడు. ఇక్కడ అన్నీ వున్నట్టే వుంటాయి. కానీ, కావలసినదేదీ కనిపించదు. అందుకే, ఇక్కడ బతుకు ‘ఆక్వేరియంలో బంగారుచేప’ లాంటిది. ’40 ఇంచుల కల’, ‘జలపాశం’, ‘నగర జీవితమూ – శిరచ్చేదిత స్వప్నాలు’, ‘ఒక మహానగర విషాదం’, ‘నగర వీధిలో ఎడారి ఓడ’, ‘అతడూ – నేనూ – ఒక సాయంత్ర ‘, ‘నగరంలో ఒక ఉదయం’, ‘రహస్యం’ వంటి కవితలలో నగర జీవితపు కోణాలను బహుముఖంగా ఆవిష్కరించాడు. నగరంకన్నా ఊరిని ఎంతో ప్రేమించాడు విజయ్ –

‘పరుగు చక్రాలు పాదాలకు తగిలించి
రోజూలాగే బయల్దేరిన నగరం
ఏ కూడలి దగ్గరో కాసేపు
ఆకస్మికంగా ఆపివేయబడుతుంది ‘

ఆగలేదు – నగరంలోని పరుగు ఆగదు. మన చదువు, సంస్కారం రెడ్ సిగ్నల్ నే ఖాతరు చేయవు. అందుకే విజయ్ ‘ఆపివేయబడుతుంది’ అంటున్నాడు. ఇంతకీ, ఎందుకో తెలుసా ?

‘పల్లెటూరి నాగళ్ళు కొన్ని
కూడలి రోడ్ల మీద కూర్చొని
ధర్మాగ్రహ నినాదాలై రెపరెపలాడుతుంటాయి
తాము దయతో పండించే తిండి గింజల్ని తిని
వెర్రి పరుగులు తీసే నగరం
కాస్తయినా కనికరం చూపిస్తుందని’

ఆందోళన బాటపట్టిన రైతులు ఆశపడడంలో తప్పు లేదు – కానీ, వాళ్ళని పట్టించుకోవడానికి ఇక్కడెవరికీ టైం లేదు. నగరం వ్యాపార సూత్రాలపై ఆధారపడుతుంది గానీ వాస్తవాలపై కాదు. విజయ్ ఈ కవిత రాసేనాటికి రాష్ట్ర విభజన జరగలేదు. కానీ, ముందే ఊహించాడు. విభజన సంగతి సరే, జరగబోయే అనంతర పరిణామాలను.

‘ఈ నిర్దయ నిర్లజ్జ నగరం
తన రాకాసి బాహువులు చాపి
మీ మీ పొలాలని కూడా
అనకొండలా మింగివేయబోతున్నదని’

ఇప్పుడు ఆంధ్రాలో అదే జరుగుతోంది. తెలంగాణ లో జరుగబోతోంది.

తెలంగాణ – పేరు చెబితే ఈ ప్రాంతీయులకే కాదు, ఏ ప్రాంతం వారికైనా ఒడలు పులకిస్తాయి. ఈ నేల పోరాటాల చరిత్ర అట్లాంటిది. దుఃఖం తో కలిసి వుండడంకంటే, విడిపోవడమే మంచిదని తెలంగాణ మరోసారి పోరుబాట పట్టింది. మానసికంగా ఎప్పుడో విడిపోయినా, భౌతికమైన విభజన కోసం పోరాటం తీవ్ర రూపం దాల్చింది. అయినా, దాన్ని ఆహ్వానించడానికి విద్యావంతులు సైతం సిద్ధంగా లేని స్థితి.

‘ఇప్పుడు కూడా నా నేల కన్న కలని ఒక
మాంత్రికుడు పన్నిన వలగానే చూస్తున్నావు
ఈ ఒక్క కలని బోనమెత్తుకుని
అలావా గుండంపై నడిచిన ఈ నేల చరిత్రనీ
నెత్తుటి బతుకమ్మలాడిన ఈ మట్టి గాయాలనీ
ఒక సారి తడిమి చూడ నిరాకరిస్తున్నావు’ అని విజయ్ తన ఆవేదనని వ్యక్తం చేస్తాడు.

తేదీలు, వారాల పిచ్చి లెక్కలపై పెనుకోపం ప్రదర్శిస్తాడు. ఈ తక్కు టమార మాయల మరాటీ విద్యలకు కలత చెంది, నేలకొరిగిన పూల కోసం కన్నీరు పెడతాడు.

‘బండెనక బండి కట్టి బయల్దేరిన దొరలను
తరిమి కొట్టిన ఊళ్లు కదా మనవి
కప్పం కట్టమన్న రాజుని నిలువరించి
కడ దాకా పోరాడిన సమ్మక్క సారలమ్మలు
తిరుగాడిన నేల కదా మనది
ఇలా ఆత్మల్ని దహించుకునే
విషమార్గాన్ని బోధిస్తున్నది ఎవరు తండ్రీ ?’ అని బాధపడతాడు.

పూలు రాలి, నెత్తురు చెంది స్వతంత్ర రాష్ట్ర ఆకాంక్ష ఫలించింది. అయితే, ఇది రాజకీయ తెలంగాణ. ఒక భౌతిక స్వరూపం మాత్రమే! ఈ తెలంగాణ, ప్రజా తెలంగాణ గా అవతరించినపుడే నేల రాలిన పూలు తిరిగి పుష్పిస్తాయి. తెలంగాణ దశాబ్దాల పోరాటం, తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ కల సాకార ఆకారాలపై త్వరలో ఒక దీర్ఘ కవితాగానం చేయబోతున్నాడు. ఆ కావ్య ప్రవాహపు ఆనవాళ్ళే ఇవన్నీ !

***

ఒక ఏడాది అటూ ఇటూగా ఇద్దరమూ హైదరాబాద్ చేరుకున్నాము. అప్పటికే విజయ్ ‘వాతావరణం ‘ (1997) కవితా సంపుటి వెలువరించాడు. మా పరిచయం కూడా వరంగల్లో జరిగిన ఆ సంపుటి ఆవిష్కరణ సందర్భంలోనే. బ్యాచిలర్స్ గా రూముల్లో కాలం వెళ్లదీసినప్పటినుండీ – సంసారులమో, సన్నాసులమో అయిన నేటి వరకూ తరచుగా కలుసుకుంటూనే వున్నాము. అప్పుడైనా, ఇప్పుడైనా కలుసుకున్న ప్రతిసారీ ఒక సాహితీ సందర్భం కావడమే విశేషం. నెల్లిమర్ల కార్మికుల ఉద్యమం, గద్దర్ పై దాడి, మిస్సింగ్ లు, బూటకపు ఎన్ కౌంటర్లు, కవిత్వ నిర్మాణాలు, ఎన్నెన్నో అలా దొర్లిపోయేవి మా మాటల్లో. మా ఇద్దరికీ రాత్రి ఒక వేదిక – ఒక భరోసా ! మాటలలో రాత్రి ఎప్పటికీ తెల్లారేది కాదు. అందుకే విజయ్ అంటాడు –

‘ఎప్పుడో మరణించిన నక్షత్రాలు వెలుగులీనుతుంటాయి
గతించిన జ్ఞాపకాలు అల్లుకుని వున్నట్టు ‘

జ్ఞాపకాలు ఎప్పుడూ అంతే, దులుపుకుంటున్నకొద్దీ తలుకులీనుతాయి నక్షత్ర దూళిలా!

ఒకటి కాదు, రెండు కాదు – దాదాపు పాతికేళ్ళుగా కవిత్వంలో మునిగితేలుతున్నా విజయ్ తో. పుట్టిన దగ్గరనుండీ గిట్టే దాకా పెరగడానికి ఇది వయసు కాదు, నిరంతర తపన. ఒక దాహం, ఒక ఆదిమ
దావానలం ! అనేకానేక వ్యామోహాలను, ప్రలోభాలను దాటుకుని, జీవితం విసిరే పెను సవాళ్ళను అక్షరాస్త్రాలతో ఎదుర్కొని నిలబడడం మాటలు కాదు. నిరంతరం పద్యాల తోటలా పరిమళం వెదజల్లే విజయ్, కలిసిన ప్రతీ క్షణాన్నీ కవిత్వమయంగా జీవించిన అలనాటి రోజులని గుర్తు చేస్తూ, ఈ ‘ఒక రాత్రి – మరొక రాత్రి’ గురించి కాసింత కలవరించమన్నాడు. నాకంటే నాలుగాకులు (కవితా సంకలనాలు) ఎక్కువే చదివినా, ఈ నాలుగు మాటలు రాయమని నన్ను పరకాయ ప్రవేశం చేయించిన నా మిత్రుడికి అభినందనలు!

(కోడూరి విజయకుమార్ కవితా సంపుటి ‘ఒక రాత్రి – మరొక రాత్రి‘ కి రాసిన ముందు మాట)

కవితా సంపుటి వివరాలు:
పేరు: ఒక రాత్రి – మరొక రాత్రి
రచన: కోడూరి విజయకుమార్
ప్రతులకు: కినెగె మరియు ఇతర పుస్తకాల షాపులు.

**** (*) ****