కవిత్వం

వెతుకులాటలొ నేను

జనవరి 2013

మతం బలవంతంగా తగిలించిన చిహ్నాలన్నీ ఓరోజు వదిలేసాను.
నిరాలంకృతుడనై కొంచెం తేలిక పడ్డాను.

తలమీనో, గుండెల పైనో దర్పం చూపుతూ ఊరేగే డబ్బుని తప్పుకోమన్నాను.
మట్టివాసన పీల్చే కలివిడితనాన్ని స్వంతం చేసుకున్నాను.

సాంస్కృతిక చిహ్నాలమంటూ ఆడంబరం పోయే దుస్తులను ఒక్కోటిగా విసర్జించాను.
ప్రాంతాల గొడలు బద్దలైన శబ్దమనుకుంటా స్పష్టంగా విన్నాను.

ఇక నగ్నంగా నిలబడ్డ నాలో లింగవివక్షొక్కటి ఉన్నానని ఊరేగుతోంది
శరీరానికి లోపలిగా ప్రయాణించి నాలోపలి మనిషిని మేల్కొలిపాను.

దేహనికి భిన్నంగా ఆలోచనల ప్రయాణంలో సౌఖ్యాన్ని ఆనందిస్తున్నాను.
తేలికవుతూ తరంగంలా విస్తరించే విస్తృతిని అందుకున్నాను.
విశ్వనరుడి దిశగా చెయ్యల్సిన ప్రస్థానానికి దూరాలను కొలుచుకుంటున్నాను.

అయినా క్షేత్రం సిద్దమయిన ఈ క్షణాన నేనంటే ఏమిటో తెలుసుకునేందుకు
తొలిబీజం నాటుకున్నాను.
మొదలు పెగుల్చుకుని, ఒడలు విదుల్చుకుని విస్తరించే మానవవృక్షాన్నవ్వబోతున్నాను.

 



One Response to వెతుకులాటలొ నేను

  1. September 19, 2015 at 7:57 pm

    బాగుంది శ్రీనివాస్ గారు !

మీ అభిప్రాయం రాయండి

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)