గెస్ట్ ఎడిటోరియల్

భిన్నత్వాన్ని ఆదరించడం కాదు, ఆహ్వానించగలగాలి..

ఫిబ్రవరి 2015

అంతర్జాలం మూలాన మిగతా ప్రపంచం మనకు సన్నిహితంగా వస్తున్నది. మనకు చేరే సమాచారమూ, అందుబాటులోకి వచ్చే అభిప్రాయాలూ, కలిగే పరిచయాలూ, ఎదురయ్యే అనుభవాలూ విస్తృతమవుతున్నాయి. మనం ముందు ఏర్పరచుకున్న నమ్మకాలు అర్థరహితం అని తేల్చి చెప్పే, మన జీవితాలకు ఆలంబన అయిన విలువల్ని ప్రశ్నించే వాదనలనూ, వాస్తవాలనూ మనం తప్పించుకోలేం. ఈ వ్యతిరేకాభిప్రాయాలనూ, సమాచారాన్నీ సమన్వయపర్చుకుందుకు కావలసింది తార్కిక జ్ఞానం. కానీ ఈథాస్, పేథాస్ లు లోగాస్ ను వెనక్కి నెట్టేస్తాయి. ఆవేశాలూ, భావోద్వేగాలూ ముందు ఉప్పొంగుకొస్తాయి. వాటిని సమర్ధించుకోడానికి తర్కం పక్కదోవలు పడుతుంది. నిందారోపణలూ, దూషణలూ, ద్వేషాలూ మిగిలిపోతాయి.

ప్రతి ఒక్కరికీ దేవుడి పాత్ర వహించాలని ఉంటుందేమో, ప్రపంచమంతా తన అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలనీ, తనకు నచ్చని విధంగా ఎవరూ బతకరాదనీ భావించడం గమనించగలం. సక్రమ జీవన విధానమేదో మనకే తెలిసినట్టూ, సర్వజనసంక్షేమానికి సూత్రం మనకే దొరికినట్టూ నమ్ముతాం. అభిప్రాయాలను వాస్తవాలుగా భ్రమించడంలో, వాటిని చలామణీ చేయాలని ప్రయత్నించడంలో చిక్కే అది. మన నమ్మకమెంత బలమైనదప్పటికీ, పురాతనమయినప్పటికీ, మన భావోద్వేగాలతో ఎంతగా ముడిపడి ఉన్నప్పటికీ అదే పూర్తి సత్యం కానక్కర్లేదని గ్రహించుకోం. ఒకే సమయంలో గ్లాసు సగం ఖాళీగానూ, సగం నిండుగానూ ఉంటుందనీ, నిజానికి ఎప్పుడూ ఒకే ముఖం ఉండకపోవచ్చనీ గమనించం. అసలు సత్యం మన జీవితకాలంలో అంతు చిక్కకపోవచ్చనీ తెలుసుకోం.

మన మానసిక భౌతిక అవసరాలకు అనువయిన నమ్మకాలను మన చుట్టూ పేర్చుకుంటూ పోతాం. వాటిని బలపరిచే రుజువుల్ని మాత్రమే ఏరి తెచ్చుకుంటాం. ఒకటి రెండు సంఘటనలనే సాధారణీకరించుకుంటాము. వాటికి వ్యతిరేకమయిన అభిప్రాయాలకి విలువనివ్వడం అటుంచి ఆ అభిప్రాయాలను వెలిబుచ్చినవారినీ కించపరుస్తాం. హేళనలకు గురి చేస్తాం. చివరికి బెదిరింపులకూ, భౌతిక దాడులకూ తెగబడతాం. పెరుమాళ్ళ గొంతులూ మూయిస్తాం.

భిన్న జీవితాల్లోంచీ, భిన్న అనుభవాల్లోంచీ మాట్లాడుతున్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. కోసో, నొక్కో ఒక గొంతు మూయించినప్పటికీ అవి మరొక నోటివెంట వినపడతాయి. మనం నెత్తిన పెట్టుకున్నవే మరొకడి కాలి కింద ఉంటాయి. ఊహామాత్రపు నష్టాలకు బెదిరిపోనక్కర లేదు. మనోభావాల గాయాలకు మందు ముందు మన నమ్మకాల్లోనే దొరుకుతుందేమో వెతుక్కోవాలి. గౌరవంగా విభేదించలేకపోయినపుడు తప్పుకుపోగలిగిన సంయమనం అలవర్చుకోవాలి. లోనికి కిటికీ తెరిచి ‘ధూళీ, జ్ఞానమధూళీ’ రానివ్వగలగాలి. చర్చలూ, వాదనలూ ఒకరిని ఒప్పించడానికో, నొప్పించడానికో కాక అవి ఎవరికి వారి సత్యాన్వేషణలో భాగమవ్వాలి.

జనశ్రేయస్సుకు భంగం కలగనంతవరకూ ఎవరి అభిప్రాయాల పట్లా, జీవన విధానాల పట్లా అసహనం పెంచుకోనక్కర్లేదు. ప్రశ్నించడం పాపం కాదు. భిన్నత్వం నేరం కాదు. నైతిక విలువలూ స్థలకాలాలను బట్టి మారతాయి. అన్ని సంస్కృతులూ మానవ కల్పితాలే, నిరంతరమూ మారేవే. మనం గొప్ప కాకపోయినంతమాత్రాన మన జీవితాలకు ఢోకా ఏమీ లేదు. ఏ ఘర్షణ అయినా ఇరుపక్షాలూ అభ్యున్నతిని సాధించేలా ఉండాలి తప్ప రెండూ ధ్వంసమయేలా కాదు.

ఒకే రంగూ, ఒకే రుచీ, ఒకే వాసనా గల సాహిత్యామూ, సమాజమూ ఎక్కువ కాలం మనజాలవు. భిన్నత్వాన్ని ఆదరించడం కాదు, ఆహ్వానించగలగాలి. గొంతు కటువయినప్పటికీ, విన్నప్పుడు ఆందోళన కలిగించినప్పటికీ, లేదా వినక పెడ చెవిన పెట్టినప్పటికీ మాట్లాడనివ్వాలి.