కథ

అంతరంగాల అంతరం

జూన్ 2015

మ్మ పోయిన తర్వాత నాన్న ఒక్కరే ఇండియాలో ఉండటం ఎందుకంటూ పావని పోరుపెట్టి నాన్నని అమెరికా తీసుకొచ్చింది. మాతోపాటు ఇక్కడే ఉంటారని ఆయనకి ‘ గ్రీన్ కార్డ్ ‘ వచ్చేవరకు నిద్ర పోలేదు. ఒక డాక్టరుగా ఆయన ఆరోగ్యాన్ని, ఒక కోడలిగా ఆయన మంచి చెడులను చక్కగా చూసుకుంటుంది. మా పాప లాస్య కూడా తాతగారి మాటలకి, ఆటలకి, కథలకి బాగా అలవాటుపడింది. అంతాబాగానే ఉంది అనుకుంటుంటే, ఈ ముసలాయనకేమయిందో గానీ “సంక్రాంతి వస్తోందికదా ఊరు వెళ్లాలి” అని పట్టుబట్టాడు. ఎందుకంటే “సంక్రాంతి రోజే మీ అమ్మ పుట్టినరోజు. అక్కడ నా కోసం వెతుక్కోదూ?!”, అంటాడు. ఆ పిచ్చి మాటలకి నాకు కాలిపోయింది. బతికుండగా ఆవిణ్ణి బాగా చూసుకున్నాడో లేదో కానీ ఈయనకి ఇప్పుడు ప్రేమ పుట్టుకొస్తుంది. చేసింది గవర్నమెంటు టీచరు ఉద్యోగం. లెక్కల మాస్టారు కనుక ట్యూషన్ చెప్పమని ఎంతమంది అడిగినా, సరిగమలతోనే నా సాంగత్యం అంటూ సాయంత్రాలు ఓ ఫిడేలు పట్టుకు కూర్చునేవాడు. మా అమ్మ ఆయన రాగాలకి స్వర్ణకమలం సినిమాని తలపిస్తూ అప్పుడప్పుడూ గొంతు కలిపేది. అదే తియ్యని కంఠస్వరం అన్నయ్యకి వచ్చింది.

ఈ ఆలోచనలతో వెళ్లాల్సిన వేగం కన్నా తక్కవ వెళ్తున్నందుకు వెనుక నుండి హారన్. ఎలాగో ఆలోచనల సిగ్నల్స్ ను ప్రమాదాల హారన్ లను అధిగమించి ఇల్లు చేరుకున్నాను.

“నా టికెట్ కన్ ఫమ్ అయిందా?” అంటూ ఎదురుగా నాన్న!

“ఆ…. వచ్చే శనివారం మనిద్దరం బయలుదేరుతున్నాము.”

“అక్కడ ఉండడానికి ఇష్టపడనప్పుడ రావడమెందుకు?”

“పావని నీకు తోడుగా వెళ్లమంది.”

“నా తోడు నన్ను వదిలి వెళ్లిపోయింది. నాకు నేనే తోడు.” దిగులుగా అన్నాడు నాన్న.

అంతలోనే “మనం ఆట పూర్తి చేద్దాం రా తాతయ్యా!” అంటూ వచ్చింది లాస్య.

“లాస్యా, నీకు రేపు పరీక్ష ఉంది కదా?!”

“పరీక్ష అంటే, నాకు తెలిసిన ఒక కథ చెప్పటమే. అందరూ పుస్తకాలు చదివి కథ చెబుతారు. నాకు మీరు చెస్ నేర్పిస్తూ చెప్పిన కథలన్నీ గుర్తున్నాయి . స్టోరీ టెల్లింగ్ క్లాస్ లో ఎప్పట్లా రేపూ నాకే ఫస్ట్ వస్తుంది తెలుసా !“ తాతయ్యాతో అంది లాస్య.

***

నేను, నాన్న కలిసి అమరావతి చేరాం. అది నేను పుట్టి పెరిగిన ఊరు. మేము వస్తున్నట్లు ముందుగానే ఫోన్ చేయడంతో ఇంటి దగ్గర రంగయ్య ఎదురు చూస్తున్నాడు. రంగయ్య మా పాలేరు మాత్రమే కాదు నాన్నకి ఆప్తమిత్రుడు కూడా. ఇల్లు చూడగానే నాన్న కళ్ళలో ఒక మెరుపు.

“ప్రదీప్, ఇక్కడ ఏముంది పాతబడిన ఇల్లు, బూజుపట్టిన జ్ఞాపకాలు తప్ప అని నన్ను అడిగావు కదా! ఆ వేప చెట్టుని చూడు. మీ తాత నాటినది. ఇప్పటికీ స్వచ్ఛమైన, చల్లని గాలిని ఇస్తోంది. నీకు గుర్తుందో లేదో నీ పదో ఏడు నాటినదే ఈ కొబ్బరి చెట్టు. నువ్వు తాగిన చల్లనినీరు ఆ చెట్టుదే. అది మీ అన్నయ్య నాటిన మామిడి చెట్టు. ఆ ఆకుల కదలికలలో వాడి రాగాలాపనలే వినిపిస్తాయి నాకు. ఈ తులసికోటని చూస్తే మీ అమ్మ అక్కడ కూర్చుని హారతికి నన్ను పిలిచినట్లే అనిపిస్తుంది” ఒక ట్రాన్స్ లోంచి మాట్లాడుతున్నట్టు చెబుతూ లోపలికి వెళ్లారు.

ఇంట్లోకి వెళ్లగానే అందంగా సర్ది ఉన్న నా చిన్నప్పటి బొమ్మలు, పుస్తకాలు దర్శనమిచ్చాయి. నాన్న ఈ చెత్తని ఎప్పుడో భోగి మంటల్లో వేశారనుకున్నాను.

“చూడు ఇవి, నీకు ఇప్పుడు పనికిరానివి, కానీ నాకు అపురూప సంపదతో సమానం. ఇవే నా శ్వాస, నా జీవితం” అని నాన్న అంటుంటే ఒక్కసారిగా బాల్యం గుర్తుకు వచ్చింది .

నా చిన్నప్పుడు బడి నుండి రాగానే అన్నయ్యకి నాకు వయొలిన్ నేర్పించేవారు నాన్న. అన్నయ్యకి బాగా ఆసక్తి. పాటలు కూడా పాడతాడు కాబట్టి చుట్టుపక్కల ఏ ఉత్సవాలు అయినా వాడి కచేరి తప్పకుండా ఉండేది. వాడి అభిరుచికి తగ్గట్టు ఆకాశవాణిలో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అంతగా ఆసక్తి లేక చిగురుదశ లోనే నా సంగీత సాధన ఆగిపోయింది. ఇంజనీరింగ్ చేశాను. పై చదువులకి విదేశాలు వెళ్లాలనుకున్నాను. నాన్న అంతటి స్తోమత లేదన్నాడు.

నాన్న చదరంగపు మిత్రుడు, లాయర్ శ్రీధర్. మా అమ్మకి అన్నయ్య లాంటివాడు. ఆయనే అడక్కుండానే నా చదువుకి ఆర్థిక సాయాన్ని చేశాడు. తిరిగి డబ్బు ఇవ్వబోతే బాకీని బంధుత్వంగా మార్చుకుందాం అన్నాడు. ఆ శ్రీధర్ గారి కూతురే డాక్టర్ పావని . నాన్న మీద ఈగ వాలనివ్వదు. అమ్మ పోయిన తరువాత మా దగ్గరికి తీసుకొచ్చే వరకు ఊరుకోలేదు.

ఇంతలో నేను అమెరికాలో చేయాల్సిన పనులను గుర్తుచేస్తూ అమెరికా నుండి మా ఆవిడ ఫోను.

“నాన్నా! నేను రేపు బయలుదేరుదామనుకుంటున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. మరి వంట అదీ కష్టమౌతుందేమో మీకు. మీరు మాతో పాటు అక్కడే ఉండచ్చుకదా?!” అన్నాను.

“అన్నిటికీ రంగయ్య ఉన్నాడుగా ఇక్కడ. మీ ఉరుకుల పరుగుల జీవితంలో నేను ఇమడలేక పోతున్నానురా అన్నారు . మీ ఇష్టం అంటూ ప్రయాణానికి సిద్ధమయ్యాను.

***

“తాతగారు రాలేదా? పోనీ మనమే తాతయ్య దగ్గర ఉండచ్చుగా?” తిరిగొచ్చిన నన్ను చూడగానే అడిగింది లాస్య.

అంతలో పావని అందుకుంది “అవును ప్రదీప్, ఇదీ బానే ఉంది. నేను అక్కడ సొంతంగా ఆసుపత్రి పెట్టుకుంటాను. మన ఊరి ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందిద్దాము. నీ ఆఫీసు పనులను అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు.”

ఏం చెప్పాలో తెలియక లోపలికి వెళ్లిపోయాను .

ఇప్పడొక కొత్త సమస్య వచ్చి పడింది. ఇన్నాళ్లు నాన్న ఇంట్లో ఉండడంతో మూడు గంటలకు బడి అయిపోగానే ఇంటికి వచ్చేది లాస్య. ఇప్పుడు బడి తరువాత ఆరు వరకు డే కేర్ లో ఉండి మాతో పాటు ఆరు గంటలకు ఇంటికి వస్తోంది. డే కేర్ లో తాతయ్య లాగా కథలు ఎవరూ చెప్పడం లేదని , చెస్ ఆడడం కూడా ఎవరికీ రాదని , అక్కడ బోర్ ఉందని, ఒకటే గొడవ . పేరెంట్ టీచర్ మీటింగ్ కి వెళ్తే, లాస్య ఇది వరకటిలా అసైన్ మెంట్స్ చేయడంలేదని మునుపట్లా అంత ఆక్టివ్ గా ఉండడం లేదని టీచర్ ఫిర్యాదు చేసింది.

ఇంతలో లాస్య మ్యూజిక్ టీచర్ నుండి ఫోను. ఛెల్లో అనే వాయిద్యం (చూడటానికి పెద్దసైజు ఫిడేలులా ఉంటుంది) నేర్చుకుంటోంది. విషయం ఏమిటంటే నాన్న కూడా అప్పుడప్పుడు లాస్యతో పాటు మ్యూజిక్ క్లాసుకి వెళ్లేవాడు. మేము ఇంటికి తీసుకురావడానికి ఎప్పుడైనా ఆలస్యం అయితే, మ్యూజిక్ టీచర్ కి ఆ సమయంలో ఏవో కొన్ని భారతీయరాగాలను కూడా నేర్పించాడట. ఇప్పుడు ఆయన ఆ భారతీయరాగాలమీద కొంత పరిశోధన చేయాలనుకుంటున్నాడట. అందుకు నాన్నగారి సహాయం కావాలని, కావాలంటే ఫీజు కూడా ఇస్తానంటున్నాడు.

***

ఆదివారం ఉదయం పది గంటలవుతుండగా కాలింగ్ బెల్ వినిపించింది. ఎవరా అని చూస్తే డాక్టర్ మోహన్. చాలా పేరున్న కార్డియాలజిస్ట్ . పక్కనే ఉంటారు . పండుగలు , శుభకార్యాలలో కలుసుకుంటూ ఉంటాము . నాన్నగారి కోసం వచ్చాడట.

వారం క్రితమే ఇండియా వెళ్లారు. నాన్నగారి తో మీకు ఎలా పరిచయం అంటూ అడిగాను.

“మీ నాన్నగారితో , మా నాన్నగారికి గుడిలో పరిచయం అయింది. చదరంగం అభిరుచి వారిని దగ్గర చేసింది. మా నాన్న గారు అల్జీమర్స్ తో జ్ఞాపకశక్తిని కొద్ది కొద్దిగా కోల్పోతున్నారు. మందులతో సాధ్యం కానిది మీ నాన్నగారి సాంగత్యంతో సాధ్యపడింది. ఆయన ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడింది. ఒక్కోసారి వైద్యం, వైద్యులు చేయలేనిది మనసుకు దగ్గరైన వారివల్ల అవుతుందంటారు. మీ నాన్నగారు మళ్లీ ఎప్పుడు వస్తారు?” అంటూ అడిగారు.

ఇప్పుడే చెప్పలేను అన్నాను.

“నేను వచ్చేనెల ఇండియా వెళ్దామనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకురానా?!”

అటు మ్యూజిక్ టీచర్, ఇటు డాక్టర్ మోహన్ గారి ఆరాటం చూస్తుంటే అనిపించింది. ఎండిన గడ్డిని పనికి రానిదిగా చూస్తాం. కాని దానినే గరికగా పూజిస్తూ ఎన్నో పుణ్యకార్యాలకు ఉపయోగిస్తారు. ఎందుకో నాన్న కూడా అలాగే అనిపించాడు. సంపాదనకి పనికిరావని ఆయన అభిరుచులని నేను పెద్దగా పట్టించుకో లేదు. ఆయన వాయిద్య నైపుణ్యం ఇక్కడ మరో కళాకారుడి నూతన ఆవిష్కారానికి నాంది అవుతోంది. ఆయన చదరంగపు ఆసక్తి ఒక వ్యక్తి మానసికారోగ్యానికి ఆసరా అవుతోంది. ఆయన కథలు మా అమ్మాయికి ప్రాణం. నాకెందుకు ఆయన విలువ తెలియలేదని ఆలోచిస్తూ ఉండిపోయాను. అంతలో పావని వచ్చి ‘పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్లు’ మన వాళ్ల గొప్పతనం పరాయివాళ్లు చెబితేగాని తెలియదు. ఇప్పుడు మీ నాన్నగారికి లాస్యతో ఫోన్ చేయించండి. మీ దిగులు దూరం అవుతుంది చూడండి అంది.

మరుసటిరోజు లాస్య తాతయ్యకి ఫోన్ చేసింది.

“తాతయ్యా, నా స్టోరీ అసైన్ మెంట్ కి నీ హెల్ప్ కావాలి. ఛెల్లో టీచర్ కి కొత్తరాగాలు నేర్పించాలి. మీ చెస్ ఫ్రెండ్ ఎప్పుడూ నీ గురించే అడుగుతున్నారు. వాళ్లందరినీ తీసుకొని నేను మనూరికి రానా, లేక మీరు వస్తారా !” అని అడిగితే,

“ అక్కడ నా అవసరం అంత ఉందని తెలియక వచ్చానురా. రేపే బయలుదేరుతాను. సరేనా!“ అన్నారట నాన్న.

ఇదెలా సాధ్యం అని పావనితో అంటే , “ఆయన ఇష్టాలని గౌరవిస్తే , ఆయనకి విలువ ఇచ్చినట్లే. పెద్దవాళ్లని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత ఇంట్లో ఒక సభ్యునిలా చూడాలి, మూడుపూట్ల తిండి తిని, సమయానికి మందులు వేసుకునే ఇన్ పేషంట్ లాగా కాదు” అనేసి వెళ్లిపోయింది.

ఏమిటో ఎంతటి క్లిష్టమైన ఆఫీసు వ్యవహారాలనైనా చిటికెలో చక్కబెట్టుకునే నాకు, నన్ను చక్కదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటూ నాన్నని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాను.

**** (*) ****

 3 Responses to అంతరంగాల అంతరం

 1. రామకృష్ణ
  June 2, 2015 at 8:01 pm

  కథ బాగుంది.
  “పెద్దవాళ్లని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత ఇంట్లో ఒక సభ్యునిలా చూడాలి, మూడుపూట్ల తిండి తిని, సమయానికి మందులు వేసుకునే ఇన్ పేషంట్ లాగా కాదు” నిజం చెప్పారు.

 2. subbalakshmi
  June 7, 2015 at 3:54 am

  ఇన్ పేషెంట్ లాగా కాదు…. వారు కోరేది చిటికెడంత ప్రేమ

 3. ఆర్.దమయంతి.
  June 23, 2015 at 11:39 pm

  నీరజ గారు కథ చాలా బావుంది. హృదయాన్ని కదిలించింది. పిల్లల దగ్గర కాలం గడపడం పెద్దలకీ ఇష్టమే. మీ కథలోలా ఆవశ్యకత వుంటే, సంతోషం గా ఒప్పుకుంటారు, వుమ్డిపోడానికి. మంచి పాయింట్ వుంది కథలో.
  అభినందనలు.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)