కథ

అరుణోదయం

జూన్ 2015

వాళ శని వారం. సగం రోజే పని. స్కూలు అయిపోగానే తిన్నగా ఇంటికి రాబుద్ధి కాలేదు. రమణితో కాసేపు గడపితే బావుంటుందనిపించింది. వాళ్లిల్లు అమీర్ పేట్ లో, మా బస్సు రూట్లోనే ఉంది. దారిలో దిగిపోయి వాళ్లింటికి వెళ్లాను. ఇద్దరం కొంతసేపు కబుర్లు చెప్పుకుని, కొనాల్సినవేవో ఉంటే షాపింగ్ కి వెళ్లాం. మధుర పెళ్లి విషయం వచ్చింది మాటల్లో.

“దాని తీరు చూసి ఎవరినో ఇష్టపడి, మా అనుమతి కోసం వస్తుందేమో అనుకున్నానే. దానికలా ఎవరూ తారస పడలేదుట ! వెంట పడి అడిగితే ఏవేవో లక్షణాలు చెప్పి ‘ఇలాంటబ్బాయి అయితే చేసుకుంటా’ అంది” అన్నాను నవ్వుతూ. పైకలా నవ్వినా లోపలేదో అశాంతిగా ఉంది. రెండేళ్లుగా బంధువులకీ, స్నేహితులకీ చెపుతూ వచ్చాం తగిన సంబంధాలుంటే చెప్పమని. ఎన్ని చూసినా ఆఖరి మెట్టులో ఆగిపోతున్నాయి, ఇద్దరికీ అభిప్రాయాలు కుదరక. ‘చదువు, చక్కదనం ఉన్న పిల్లకి సరైన వయసులో పెళ్లి కుదరకపోవడ మేమిటా’ అని మనసు చికాగ్గా అనిపిస్తోంది.

“బలేదానివే .. వాళ్ళూ వీళ్ళూ చెప్పేవాటి మీద ఆధార పడడం ఎందుకూ . హాయిగా మాట్రిమోనియల్ సైట్ లో రిజిస్టర్ చేస్తే సరి. ఈ కాలం పిల్లలు తమకేం కావాలో స్పష్టం గా చెపుతున్నారు కదా ” అంది.

ఇంతలో అరుణ ఫోన్ ‘నాతో మాట్లాడాలని తనని వెంట పెట్టుకుని వాళ్ళమ్మ వచ్చిందనీ , ఇద్దరూ కింద సెల్లార్ లో ఎదురు చూస్తున్నారనీ’.

అరుణంటే పూర్వం మా ఇంట్లోపనిచేసిన అంజమ్మ కూతురు. ఏదో సలహా సంప్రతింపుల కోసం అప్పుడపుడు ఇలా నాదగ్గరికి రావడం మామూలే. శని వారం స్కూలు నించి త్వరగా వచ్చేస్తానని అనుకున్నారేమో, చెప్పకుండా వచ్చేసారు. ఏదో పెళ్లి సంబంధం విషయమే అయి ఉంటుందనుకుని ‘షాపింగ్ లో ఉన్నాననీ , ఆలస్యమవుతుందనీ ‘ చెప్పాను.

కావల్సినవేవో కొనుక్కుని ఇల్లు చేరేసరికి సెల్లార్ లో కింద కూర్చుని ఉన్న అంజమ్మ ‘నమస్తే అమ్మా’ అంటూ లేచి నిల్చుంది.
వెనక నించి “అమ్మా! మొహం అల్సిపోయినట్టుంది. చాయి తాగుతావా ? పెట్టేదా ” అంది అరుణ, నా చేతిలో సంచుల్ని అందుకుంటూ. ఎన్నాళ్ల తర్వాత వచ్చినా పూర్వపు అలవాటుతో ఇంట్లో మనిషిలా పని అందుకుంటుంది! వచ్చిన ప్రతిసారీ నా మనసులో ఒక ఆత్మీయ భావాన్ని రేపుతుంది!

ఇంట్లోకెళ్ళి మొహం, కాళ్ళూ, చేతులూ కడుక్కుని, బట్టలు మార్చుకుని, హాల్లోకి వచ్చేసరికి మంచి నీళ్ళూ, వేడి టీ, ట్రే లో పెట్టి తెచ్చింది అరుణ. అలసటగా సోఫా లో కూలబడి, కాళ్ళు పైకి పెట్టుకుని, కాసిని నీళ్ళు తాగి, టీ కప్పు అందుకున్నా. ఈలోపు తక్కువ స్పీడులో ఫ్యాన్ వేసింది. రెండు గుక్కలు తాగే సరికి ప్రాణం లేచి వచ్చినట్టయింది.

మనసులోనే అరుణని మెచ్చుకుంటూ “మీకు పెట్టుకోలేదేమిటే? ” అన్నా .

” మాకూ పెట్టింది లే అమ్మా! నువ్వు తాగినంక తాగుతం లే ” అంది అంజమ్మ .

” పోయి తాగేసి రండి ” అన్నా. ఇద్దరూ వెళ్లి బాల్కనీ లో కూర్చుని టీ తాగి వచ్చారు.

అంజమ్మ మా ఇంట్లో పని చేసే రోజుల్లో వాళ్ళాయన రోడ్డు పక్కన బండి పెట్టుకుని ఇస్త్రీలు చేస్తుండేవాడు. కలిసి పని చేసుకునే లాగా పెద్ద పిల్లలు, ఆడపిల్లలిద్దర్నీ రెండిళ్ళ లో పనికి కుదిర్చేసి , తను మా ఇంటిపనికి వచ్చేది. కూతురు అరుణ కూడా అప్పుడప్పుడు తన వెంట వచ్చేది. అప్పుడు దాని వయసు అయిదారేళ్ళు. అందరికన్నా ఆఖర్న పుట్టిన మగ పిల్లాడికి మూడేళ్ళు. వాడు వాళ్ళ నాన్న తో పాటు ఉండేవాడు . అప్పుడపుడు వాడినాడిస్తూ తండ్రి దగ్గరే ఉండిపోయినా వాళ్ళమ్మ వెంట వచ్చినపుడు మాత్రం ఏదో ఒక పని అందుకుంటూ ఉడత సాయం చేస్తూ ఉండే అరుణ కుదురుగా ముద్దుగా కనిపించేది.
ఆరేళ్ళ పిల్ల చదువుకోకుండా కనిపిస్తుంటే మా పిల్లలిద్దరూ వేధించడం మొదలు పెట్టారు ‘చిన్న పిల్లలందరూ తప్పకుండా చదువుకోవాలని స్కూల్లో మా సోషల్ మామ్ చెప్పారమ్మా … మరి అరుణ బడికి ఎందుకు వెళ్ల దూ? ” అంటూ వాళ్ళు అన్నారనే కాక నాకూ బాధగానే ఉండేది, ప్రభుత్వ పాఠశాలల మీద ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టినా ఆ సదుపాయాలు అవసరమైన వాళ్లకి చేరటం లేదని . అంజమ్మతో వాదించి , దాన్ని చదివిస్తే నెల జీతం పెంచుతానని చెప్పి, ఎలాగో పిల్లని బడిలో చేర్పించేలా చేసాను. తర్వాతి ఏడే అంజమ్మ తన కొడుకుని దగ్గరలో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించింది, రెండు వేలు అడ్మిషన్ ఫీ కట్టి. పుస్తకాల ఖర్చు కాక నెలకి రెండువందలు జీతం.

రెండు నెలలు గడిచాయో లేదో “ఇద్దర్నీ చెరో చోటా దించి రావడం కష్టంగా ఉందమ్మా! అరుణని స్కూలు మాన్పిస్తా ” నని మొదలెట్టింది .

” వాడి కోసం దీన్ని మాన్పిస్తావా ? ఇద్దర్నీ గవర్నమెంట్ స్కూల్లో వేసెయ్యి. ఒక్కసారే దించి తీసుకు రావచ్చు’ అని గట్టిగా కోప్పడ్డాను.

నా బలవంతం మీద దాని చదువు కొనసాగనిస్తున్నా అడపా దడపా స్కూలు మాన్పించి పై ముగ్గురిలో ఎవరో ఒకరికి ప్రత్యామ్నాయంగా పనికి పంపిస్తుండేది వాళ్లమ్మ. అయినా శ్రద్ధగా చదువుకుని , ఎన్నో విఘ్నాలు తట్టుకుని అరుణ ఎనిమిదో తరగతి పాసైంది.

ఉన్నట్టుండి అరుణని చదువు మాన్పించేసి ఇంటి పనికి తీసుకు రావడం మొదలెట్టింది అంజమ్మ. ఉన్న ఇళ్ళకి తోడు కొత్త ఇళ్ళు ఒప్పుకుని, పై పిల్లలిద్దరి కీ పెళ్లీడు వచ్చేసిందనీ, పెళ్లి ఖర్చులకి డబ్బు వెనకెయ్యాలనీ, తమలో కూడా కట్నకానుకల బెదద లక్షల్లోకి చేరిందనీ గోడు వెళ్లబోసుకుంటుంటే, ఏమనలేక ఊరుకున్నా. కనీసం అరుణ ఆసక్తికి తగిన పుస్తకాలైనా ఇద్దామనిపించి, కుతూహలం రేకెత్తించే మంచి పుస్తకాలు దొరికినప్పుడు అరుణ కోసం తెచ్చిచ్చేదాన్ని. సాయంత్రం పూట ఏమాత్రం తీరిక దొరికినా వాటి నుంచి తనేం అర్ధం చేసుకుందో అడిగి, ఆ విషయాల గురించి చర్చించే దాన్ని.

అంజమ్మకి పిల్ల ఇలా చదువు కోసం టైం వృధా చేయడం నచ్చేది కాదు. ఇంకో ఇల్లు పట్టుకుంటే ఇంకో నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చుకదా అన్నట్టు అయిష్టంగా ఉండేది .

ఇలా ఎక్కువ కాలం సాగేలా లేదనుకుంటుండగా మా అక్కయ్యకి మేజర్ సర్జెరీ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ అయ్యాక చాలా కాలం తను కోలుకోక పోవడం తో అరుణని అక్కయ్య దగ్గర పెట్టమనీ, కేవలం మంచి నీళ్ళు అందించడం, తలుపు తెరవడం , ఫోను అందుకోవడం లాంటి చిన్న చిన్న పన్లు చేస్తూ సాయంత్రాలు వాళ్ళింటి పక్కనున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కుట్టుపనిలాంటి దేదైనా నేర్చుకోవచ్చనీ చెప్పి ఒప్పించాను. అరుణ, అక్కయ్య ఇంట్లో వాతావరణానికి తొందరగానే అలవాటు పడిపోయి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఆడపిల్లల బట్టలు అన్నిరకాలూ కుట్టడం నేర్చుకుంది.

కొన్నాళ్ళకి అంజమ్మ భర్తకి కొత్త చోట వాచ్ మాన్ పని దొరికింది. మా ఇల్లు దూరమైపోవడంతో, నా దగ్గర పని మానేసి వెళ్ళిపోయింది. అయినా అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటుంది. పిల్లలకి చిన్నవైన బట్టలూ , వాడని వస్తువులూ ఇస్తే తీసుకుపోతుంది.

అరుణ మాత్రం నాలుగేళ్ళుగా అక్కయ్య దగ్గరే ఉండి పోయింది. ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చిపోయే ఆ ఇంట్లో నమ్మకంగా ఉండే అరుణ అందరికీ తలలో నాలుకలా అయిపొయింది. తిండీ, బట్టా అక్కడే గడిచిపోగా ప్రతినెలా అక్కయ్య అరుణకి ఇచ్చే జీతం తీసుకుందుకు అంజమ్మ వెళ్ళేది. ఏడాది గడిచాక దాని డబ్బు దానిపేరే బ్యాంకు లో వేస్తామనీ దాని పెళ్ళికి పనికొస్తుందనీ చెప్పి ఒప్పించాం. అక్కయ్య ఇంట్లో ఇంటి పనికి వేరే పని మనిషి ఉండేది. ఇంట్లో అంతా బయటికి వెళ్ళినా ఇల్లు చూసుకోవడం , పని మనిషి దగ్గరుండి పనంతా చేయించడం అరుణకి అలవాటైపోయింది. ఎప్పుడైనా నేవెళ్లినపుడు ఇల్లంతా చక్కబెట్టేస్తూ, ఇంటిల్లిపాది బట్టలకీ రిపైర్లు చేసేస్తూ ఇంటి మనిషిలా కనిపించేది అరుణ.

అక్కయ్యకి ఇద్దరూ కూతుళ్ళే కావడంతో వాళ్ళతో పాటు అరుణని కూడా బయటికి వెళ్ళేటపుడు తీసుకెళ్ళేవారు. వీళ్ళ వెంట అలా వెళ్ళొస్తూ ఉండడంతో నలుగురిలో ఒద్దికగా మసలుకోవడమే కాక, ఫోన్ లో ఎవరైనా ఇంగ్లీష్ లో అడిగినా చక్కగా జవాబు చెప్పేంతగా మంచి భాషా, మాట తీరూ అలవాటయ్యాయి. శరీర శుభ్రత, పనిలో నేర్పూ పట్టుబడ్డాయి. పుస్తకపఠనం పట్ల ఏర్పడ్డ ఇష్టం వల్ల తీరిక దొరికినపుడల్లా మంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటైంది. పదహారేళ్ళు దాటేసరికి నలుపు రంగు ఆరోగ్యకరమైన చామనచాయలోకి తిరిగింది. మాటలో మృదుత్వం , కళ్ళలో మెరుపూ చేరాయి. ‘అక్కయ్య ఇంట్లో చేర్పించి మంచి పని చేశాను, చక్కగా పుస్తకాలు చదువుకుంటూ ఎదుగుతోంది’ అని ముచ్చట పడిపోయాను.

ఈ లోపు అంజమ్మ తన పెద్ద కూతుళ్లిద్దరికీ పెళ్ళిళ్ళు చేసింది. ఇద్దరు అల్లుళ్ళూ హైదరాబాదు లోనే ఏవో చిన్నా చితకా పనులు చేసుకుంటున్న కుర్రాళ్ళు. అత్తింటికి వెళ్ళినా పుట్టింటిలో లాగే పాచి పనే చేసుకుంటూ ఉండి పోయారు వాళ్ళిద్దరూ. మగ పిల్లాడు అంటీ అంటని చదువు కొన్నాళ్ళు సాగించి ఒక మెకానిక్ షాపులో పనికి కుదురుకున్నాడు. వాళ్ళింట్లో అందర్లోకీ వేరుగా కనిపించే అరుణకి ఇప్పుడు పెళ్లి వయసొచ్చింది. ఏదో సంబంధం వచ్చిందని అంజమ్మ అప్పుడప్పుడు వచ్చి చెప్పడం, వివరాలు కనుక్కుని కాస్త చదువుకున్నవాడికిచ్చి చెయ్యమని నేను నచ్చచెప్పడం ఇలా ఇంకో రెండేళ్ళు గడిచాయి. వాళ్ళల్లో, ఇన్నాళ్ళు పెళ్లి చెయ్యకుండా ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవడమే తప్పు. నా మాట కాదనకుండా ఇన్నాళ్ళు ఆగారంటే గొప్ప విషయమే .
టీ తాగుతూ టీవీ పెట్టాను. ‘ ఫ్రీకీ ఫ్రైడే’ అని ఏదో ఇంగ్లీష్ సినిమా వస్తోంది. యుక్త వయసు కూతురూ , నడి వయసు తల్లీ మధ్య రోజువారీ జగడాలూ , అనుకోకుండా జరిగిన శరీరాల మార్పిడి వల్ల వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలూ , మెల్లిగా ఒకరినొకరు చక్కగా అర్ధం చేసుకునేందుకు దారి తీసిన పరిస్థితులూ … హాస్యస్ఫోరకంగా పిక్చరైజ్ చేసాడు దర్శకుడు. పైకే నవ్వేస్తూ అలా చూస్తూ ఉండిపోయా. అంజమ్మా, అరుణా వచ్చి వెనకగా కూర్చుండిపోయారు.

వాళ్ళని గమనించగానే టీవీ ఆపేసి “అయ్యో ! చెప్పలేదేం అరుణా?” అన్నా .

” చాలా బాగుంటుందమ్మా ఈ సినిమా. తల్లి శరీరంలో కూతురు. కూతురి శరీరంలో తల్లి. కొన్ని సీన్లు చూస్తా ఉంటే ఒకటే నవ్వొస్తుంది” అంది.

ఒక్క క్షణం కళ్ళప్పగించి చూసి, సర్దుకుని ” అవును అరుణా ! ఈ కాలం లో తల్లిని పిల్లలూ, పిల్లల్ని తల్లీ అర్ధం చేసుకోవాలంటే అలా ఒకరి శరీరం లోకి రెండో వాళ్ళు పరకాయ ప్రవేశం చేస్తే తప్ప పూర్తిగా అర్ధమవడం కష్టం” అన్నా..

నవ్వుతూ “అవునమ్మా” అంది. చక్కని కనుముక్కు తీరూ , మెరిసే పలువరసా .’ఎంత చక్కగా ఉంది’ అనిపించింది. మనసులో ఒక వైపు బాధేసింది. ఇదిప్పుడు తన వాళ్ళందరికీ దూరమై పోతుందా ..తల్లిదండ్రులు తెచ్చే సంబంధం ఏదైనా దానికి తగినది కావడం ఎంత కష్టం ? నిన్నటి దాకా అక్కయ్య ఇంటిలో దాన్ని ప్రవేశ పెట్టి ఏదో గొప్ప పని చేసినట్టు సంతోష పడి పోయానే .. ఇప్పుడు దానికి మేలు చేసినట్టా? కీడు చేసినట్టా? అని దిగులు కలిగింది.

“ఊ… చెప్పు అంజమ్మా! ఏమిటి విశేషం ? “అన్నా .

” ఏముందమ్మా అరుణ పెల్లి గురించే .. మొన్నా మద్య పెల్లికెళ్తే మా సుట్టాల్లో ఒకాయన అరునని జూసి ఆయన కొడుక్కి జేసుకుంటానని కబురుజేసిండు . ఆ పిల్లోడు అరునకన్న ఎన్మిదేండ్లు పెద్దోడు. మా వూరుదగ్గర్నే ఆల్ల వూరు.. ” అంది. మొహం చూస్తే ఎలాగైనా నేనొ ప్పుకుంటే బావుణ్ణన్నట్టుంది. మనసులో ఎక్కడో నేను తన శ్రేయోభిలాషి నని నమ్మకమేమో ..లేకపొతే నన్ను ఒప్పించడం ఎందుకు అనుకున్నా.

“ఎంత వరకు చదువుకున్నాడు అంజమ్మా? ” అన్నా

“సదుంకో లేదమ్మా గానీ ఐదెకరాల పొలమున్నది .. మెరక సేను”

” అయ్యో అరుణ లాంటి పిల్లని చదువులేని పిల్లాడికిచ్చి చేస్తావా అంజమ్మా” అన్నా నొచ్చుకుంటూ.

“కాత్తో , కూత్తో డబ్బున్నోల్లు కదమ్మా ..ఇట్టాంటి సంబంధం నేనైతే తీస్కరాలేను, మా వోళ్ళంతా ఒకటే చెవులు కొరుక్కుంటున్నారు ఇంకా మనువు చెయ్యలేదని. మాకులంల దానికి తగినోడు దొరకాల్నంటే జరిగేపని కాదు ” అంది .
పక్కనే కూర్చుని వింటున్న అరుణని చూస్తే జాలేసింది.

“ఆలోచిద్దాం అంజమ్మా ! సారుకోసారి చెప్పి చూస్తా ఏమంటారో ” అని వాళ్ళని పంపించేసి మంచం మీద వాలాను .. పది నిముషాలు విశ్రాంతి తీసుకుందామని.

ఆలోచన తెగలేదు. వంట ముగించి, పిల్లలతో పాటు భోజనం చేసి, రాత్రి పని పూర్తి చేసుకుని, పడుకున్నా .

ఏమీ తోచలేదు అరుణ భవిష్యత్తు తలుచుకుంటే. తన వాళ్ళందరి లాంటి జీవితంలో అరుణ ఇమడగలదా ? పై తరగతి జీవితానికి ఇన్నేళ్ళుగా అలవాటు చేసి, ఇప్పుడు ఒక్కసారిగా ఆ పాత జీవితం లోకి, ఆ వాతావరణం లోకి వెళ్ళమని పంపడం న్యాయమేనా అనిపించింది.

ఎప్పుడో చదివిన ఒక కథ జ్ఞాపకం వచ్చింది . ఒక ముసలి బిచ్చగాడు ప్రతిరోజూ ఎంగిలాకులేరుకుని అందులో పారేసిన అన్నాన్ని తింటూ ప్రాణాలు నిలుపుకుంటూ ఉంటాడు. అది చూసి జాలేసిన ఒక గృహిణి, రోజూ మధ్యాహ్నం పూట తను అన్నం తినేముందు, ఒక విస్తరినిండా భోజనం వడ్డించి తీసుకెళ్ళి అతనికి ఇవ్వడం మొదలుపెడుతుంది. అతను కడుపు నిండా తినడం చూసి సంతోష పడుతూ ఉంటుంది. ఒకసారి ఆమె ఏదో పని మీద వేరే ఊరు వెళ్తుంది. రాగానే ఆ ముసలివాడి గురించి గుర్తొచ్చి ఆరా తీస్తే, అతను పూర్వంలా ఎంగిలాకుల్లో తిండి తినడం మానేశాడనీ, ఆకలికి మాడి చనిపోయాడనీ తెలుస్తుంది.
అరుణని చూస్తుంటే ఆ కథ గుర్తొచ్చి రాత్రంతా నిద్ర పట్టలేదు.

తెల్లవారి లేస్తూనే అనుకున్నా అరుణకి వరుణ్ణి వెతికే బాధ్యత నాదే అనీ , మధురతో బాటు అరుణకి కూడా తెలుగుమాట్రిమొని.కామ్ లో రిజిస్టర్ చేయించాలనీ. అలా నిశ్చయించుకున్నాక స్థిమితం చిక్కింది.

**** (*) ****