భర్త ప్రకాష్ ని కరకరా నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది కోమలికి. ఏనాడు తన మాట విన్నాడు గనక. ఏది తోచితే అది చేసెయ్యడమే, పెళ్ళాం చెప్పిన మాట వినాలని ఒఖ్ఖనాడైనా అనుకున్నాడా? ‘మొండి మొగుడు చెపితే వినడు గిల్లితే ఏడుస్తాడు’ అనే సామెత ప్రకాష్ కి సరిగ్గా సరిపోతుందనేది కోమలి అభిప్రాయం.
“ఇంక చాలుగానీ ఆంటీకి యిచ్చేయ్యండి” అన్నమాట కోమలికి చెవులలో అమృతం పోసినంత ఆనందాన్నిచ్చింది. కోమలికి కలిగిన ఆనందం పుత్ర కామేష్టి యాగం ఫలించి యాగపురుషుడు పాయసభాండంతో ప్రత్యక్షమైనప్పుడు దశరధ మహారాజు కుడా అనుభవించలేదేమో. ఆ ఆనందం క్షణికమే అని తన చేతులలోకి చూసుకుంటే తెలిసింది. అప్రయత్నంగా “అయ్యొ” అనుకోకుండా ఉండలేక పోయింది కోమలి.
“పోనీ లేవోయ్ ఖాళీ అయ్యిందని బాధ పడకు మనకి లేకపోతేనేమి, వాళ్ళు చూడు ఎంత సంతోషంగా వున్నారో, వాళ్ళ ఆనందం చూస్తువుంటే నీకు కుడా సంతోషంగా లేదూ, నిజం చెప్పు నిజం చెప్పు?” చిన్న పిల్లాడిలా అంత మొహం చేసుకొని అడుగుతున్న భర్తని యెలా అర్ధం చేసుకోవాలో తెలియక తికమక పడింది కోమలి.
బుజ్జిముండ తన ప్రాణమని, తన ప్రక్కన లేకపోతే ముద్ద గొంతు దిగదని తెలిసి కూడా ఎంత చులగ్గా అనగలిగేడు. చుట్టూ అంతమంది వుండ బట్టి బతికిపోయేడు లేకపోతే చీల్చి చెండాడేదే. గొంతులోని దుఃఖాన్ని తందూరి రొట్టి ముక్కతో గొంతులోనే ఆపుకొందుకు ప్రయత్నించింది. ఆమె అవస్థని కనిపెట్టిన పనీర్ కూర వడ్డిస్తున్న ఆమె “అదేమి వంటకమో నాకు తెలీదు, ఎంతరుచిగా ఉందో కుడా తెలీదు, కాని వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న సంతృప్తి మాత్రం తెలుస్తోంది, భోలేనాథ్ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ వుంటుంది”. ప్రశాంతమైన గొంతుతో అంది.
“భలే.. యీ ఆలోచన కుడా బాగుంది. యిదేనా ప్రకాష్ చెప్పే పాజిటివ్ థింకింగ్” అనుకోకుండా వుండలేకపోయింది కోమలి. ఆంధ్రుల ప్రత్యేకతని దేశవిదేశాలలో చాటిన, శాకాంబరి దేవి ప్రసాదమని గౌరవంగా, కోమలి లాంటివాళ్ళు “బుజ్జిముండ” అని ముద్దుగా పిలుచుకొనే, ఆంధ్రుల ప్రియ వంటకం గోంగూర పచ్చడి. ఎంత సరిపెట్టుకుందామనుకున్నా కోమలి మనసు స్థిమిత పడ్డంలేదు. ఇది ఇంకా కోమలి, ప్రకాష్ ల యాత్రలో తొలిమెట్టు మాత్రమే. వారి యాత్ర పూర్తి కావడానికి వాతావరణం సహకరిస్తే వారం లేకపోతే.. దైవాధీనం.
ప్రకాష్ హిమాలయాల్లో యాత్రా ప్రస్తావన తేగానే తీవ్ర వ్యతిరేకత చూపింది కోమలి. పుట్టిన, మెట్టిన వూరు ఒకటే కావడంతో కోమలి కూపస్థమండూకమైంది. ఇప్పటి వరకు తనకు తెలిసినది ఎంత తక్కువో, అలాగే తెలుసుకోవలసినది ఎంతో వుంది అని అనిపిస్తోంది కోమలికి. ఇరవై, ముప్పై పడకల టెంటులో ఒకరి పక్క ఒకరు ఏ సంకోచం లేకుండా, ఆడ, మగా తేడాలేకుండా ఆదమరచి నిద్ర పోతున్న యాత్రికులని చూస్తే కలో నిజమో అర్ధం కావటం లేదు కోమలికి. టెంటులో జాగా దొరకని యాత్రికులకి మూడు పడకలని కలిపి అందులో అయిదుగురు సర్దుకు పడుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోంది.
గజగజ వణికిస్తున్న చలిలో తలారా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో వండి వడ్డిస్తున్న కోట్లాది ఆస్తులున్న వ్యాపారవేత్తలని చూస్తుంటే “దీనివల్ల వీళ్ళకేంటి లాభం”అని అనుకోకుండా ఉండలేకపోయింది కోమలి.
చిన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి. సూర్యుడు అస్తమించగానే గాలిలో చలి పెరిగి కప్పుకున్న ఒక రజాయికి మరొకటి జోడించమంటోంది శరీరం. “నిన్న నువ్వు పడ్డ యిబ్బంది గమనించేనోయ్ అందుకే ఇవాళ ఇద్దరికీ మంచాలు తీసుకున్నాను” అంటూ తమ బ్యాగులు తీసుకోని టెంటు లోకి దారి తీస్తున్న భర్తని అనుసరించింది కోమలి. చిన్నగా వాన మొదలయ్యింది. “మాతాజీ రండి రండి ఇవాళకూడా మనం ఒకే టెంటులోకి చేరేం అంటే భూమి గుండ్రంగా వుంది అనేదానికి ఇదే నిదర్శనమేమో” అనే పలకరింపుతో ఏదో పెద్ద బెంగ తీరిన అనుభూతి కలిగింది కోమలికి. ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి చెందినవారు కావడంతో సంభాషణ అంతా హిందీలోనే సాగుతోంది.
“మాతాజీ, బాబూజీ ఏమైనా తిన్నారా? మీరు విశ్రాంతి తీసుకోండి నేను మీకు తినడానికి ఏదైనా తెస్తాను, ఏడుగంటలకి లంగరు మూసేస్తారు”. కోమలి ఏమైనా అనేలోపునే “గురకవీరుడు” గబగబా గొడుగు వేసుకొని బయటికి వెళ్ళేడు.” భయ్యా మతాజీకి స్వీట్ అంటే ఇష్టం ఓ రెండు ఎక్కువతే,” అని వెనుక నుంచి కేక వేసేడు “పేకాట పాపారావ్”. మొన్నటి బసలొ తమతో పాటు బస చేసిన కొంత మందికి ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు కోమలి, ప్రకాష్ లు. అది వాళ్ళని కించ పరచడం కోసం కాదు, ప్రయాణాలలో తారసపడ్డ వ్యక్తులకి వారి వారి అలవాట్లని బట్టి అలా నామకరణం చేసి కొన్నాళ్ళు వాళ్ళని తమ జ్ఞాపకాలలో ఉంచుకోవడం వారి అలవాటు. నిన్నటి బసలొ “నిక్కరుబాబా”,”కబుర్లరాయుడు”, “పాటల రాణి”, యిలా కొంతమందికి నామకరణం చేయటం జరిగింది. నిన్నటి దోస్తులు, మొన్నటి దోస్తులు, కొన్ని కొత్త మొహాలతో నిండి ఉంది టెంటు.
“ఓహో మన ‘యాగపురుషుడు’ కుడా వున్నాడోయ్ ఈ టెంటులో” అన్నాడు ప్రకాష్. వాన జోరందుకుంది. తెల్లవార్లూ కురిసింది వాన. దారంతా బురదమయం. జాగ్రత్తగా అడుగు వెయ్యకపోతే కాలో, చెయ్యో విరగడం ఖాయం. ఎదురుగా వున్న లంగరులో మాత్రం యాత్రీకుల కోసం భోజనాలు తయారవుతున్నాయి. ఆవేళ యాత్ర ఆగిపోయింది. మొదటి మారు యాత్రకి వచ్చినవాళ్ళు ఆందోళనతోను ఇంతకు ముందుకూడా వచ్చినవాళ్ళు నిర్వికారంగాను వున్నారు.
కోమలికి భయంగా వుంది. ఈ వాన ఎన్నాళ్ళు కురుస్తుందో ఏమిటో అని. ప్రకాష్ మాత్రం “వంటా, పెంటా లేకుండా, పనిమనిషి టెన్షను, టివి, టెలిఫోన్ గొడవలు లేకుండా వుందికదా? భోజనం మంచం మీదే చేస్తున్నావు, రజాయిలోంచి బయటికి వచ్చే పనిలేదు, హాయిగా రెస్టు తీసుకో” అని ముసుగు తన్ని నిద్రపోతున్నాడు.
మర్నాడు వర్షం తగ్గింది కాని దారంతా బురద వుడడంతో యాత్ర రద్దు చెయ్యబడింది. కోమలికి నిన్న వున్నంత దిగులు యివాళలేదు. మధ్యాహ్నానికి కొంచెం ఎండకుడా రావడంతో నడచివెళ్ళే వాళ్ళు బయలు దేరేరు. గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు తప్ప అందరూ బయలు దేరేరు. తనలో తాను మాట్లాడుకుంటూ గంజాయి దమ్ము కొడుతూ గడిపిన “గాంజా చక్రవర్తి” పడక పక్కనున్న కఱ్ఱలు తీసుకోని చంకల్లో పెట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు గమనించింది కోమలి అతనికి ఎడమ కాలు లేదని. మన రెండడుగుల దురాన్ని తన ఒకే గెంతుతో దాటుతూ బయటికి నడిచేడు “గాంజా చక్రవర్తి”. అతనికి ఈశ్వరునిపై వున్న భక్తికి కంట తడి పెట్టకుండా ఉండలేకపోయింది.
అప్పటి వరకు మైదానాల్లో ఎక్కువగా జరిగిన ప్రయాణం ఎత్తైన కొండలలోకి మారి కష్టసాధ్యంగా మారింది. అలవాటులేని నడక వల్ల అలసట, గాలిలో ఆక్సీజన్ తక్కువ అవడం మూలాన ఆయాసం. సన్నటి కాలిబాటలో గుర్రం మీద ప్రయాణం, గుర్రం మీంచి పడితే అడ్రస్సు కూడా దొరకదు అనుకుంటేనే వెన్నులోంచి చలి, భయం. సాయంత్రానికి నడుము కాళ్ళు పట్టేసి అడుగు వెయ్యాలంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి కోమలికి. ప్రకాష్ కుడా కొమలిలాగే అలసి పోయేడో, పలకరిస్తే కరుస్తుందని భయపడ్డాడో గాని మాట్లాడం తగ్గించేడు. మధ్యమధ్యలో పాత స్నేహితులు కలసి పలకరించడం, తినాలని లేక పోయినా లంగరువాళ్ళు బలవంతాన వేడి పాలో, టీ నీళ్లో పోస్తూ వుడడంతో పైకి పోతున్న ప్రాణాలని మళ్ళా కిందకి తెచ్చుకుంటున్నారు. అంత బాధ లోను “గంజా చక్రవర్తిని” గమనించడం మరచి పోలేదు కోమలి. అందరు నడిచే దారి కాకుండా అడ్డదారులంట కొండ యెక్కుతున్న అతన్ని చూసి వోమారు అతని భక్తికి ఆశ్చర్యపొతే మరో మారు “దేవుడా అతనేనయ్యా నీ అసలైన భక్తుడు అతని కోర్కెలు తీర్చవయ్యా, అతనికి ఏ ఆపదా కలగకుండా చూడు తండ్రీ” అని కన్నీళ్ళతో వేడుకోసాగింది కోమలి.
రాను రాను కోమలికి అడుగు తీసి అడుగు వెయ్యడం కష్టం అవుతోంది. ప్రకాష్ పరిస్తితి కుడా అలాగే వుంది. అల్లంత దురాన మంచులింగముండే గుహ కనిపిస్తోంది. భక్తులలో వుత్సాహం పెరిగింది.
“భం భం భోలే” నినాదాలతో కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి. మెట్లు మొదలయ్యేయి. మెట్ల పక్కన వుండే రైలింగు పట్టుకొని తనని తానూ పైకి లాక్కుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతోంది కోమలి. వెనకాలే ప్రకాష్.
రెండు కాళ్ళు వున్న తనకే ఇంత కష్టంగా వుంటే ఒంటికాలుతో బాలన్సు చేసుకొని నడిచిన గాంజా చక్రవర్తికో! పాపం అతనికి యే ప్రాణాపాయమో సంభవిస్తే తల్లితండ్రులు మొక్కు కున్నారేమో? ఆ మొక్కు తీర్చుకోడానికి అతను వచ్చాడేమో? లెంపలు వాయించుకుంటే భోలా శంకరుడు క్షమించడా? ఓ కొబ్బరికాయ కొట్టి దండం పెడితే వప్పుకోడా? యింత దూరం యింత కష్టపడి రావాలా? యిలాంటి ఆలోచన రావడం కుడా తప్పేనేమో అనుకుంటూ టపటపా చెంపలు వాయించుకుంది కోమలి.
మెట్టు మెట్టుకి ఆయాసం పెరుగుతోంది. జోళ్ళు లేని కాళ్ళు మేజోళ్ళతో గడ్డకట్టుకున్న మంచుపై నడవడంతో తడసిపోయేయి. ఆయాసానికి తోడు కళ్ళు చీకట్లు కమ్మడం మొదలైయ్యింది. గాంజా చక్రవర్తే నాకాదర్శం అనుకుంటూ ముందుకి నడవసాగింది కోమలి. ఎక్కువ సార్లు భగవంతుడిని తలుచుకుందా లేక గాంజా చక్రవర్తిని తలుచుకుందా అంటే చెప్పడం కష్టమే. ఎలాగైతేనేమి దర్శనం చేసుకొని పూజారి ఇచ్చిన ప్రసాదం తీసుకోని కళ్ళు మూసుకొని దేవుడికి తన కోరికల లిస్టు చదువుతూ కూడా “గాంజా చక్రవర్తిని” రక్షించమని చెప్పడం మరచి పోలేదు కోమలి.
ఎక్కడైనా ఒక్కమారు కూర్చొని గుక్కెడు వెచ్చని నీరు త్రాగి సేదతీరాలని అనిపించింది కోమలికి. ప్రకాష్ చెయ్యి పట్టుకొని కిందకి నడుస్తున్న కోమలి దృష్టి గొనె పట్టా తన ముందు వేసుకుకూర్చున్న గాంజా చక్రవర్తి మీద పడింది. “దానం చెయ్యి మాతా..” అని చెయ్యి జాపేడు ఒక్క నిముషం ఏమీ భోదపడలేదు. తరవాత అపనమ్మకం. యిందు కోసమా యితడు యింతకష్ట పడి యింత దూరం వచ్చింది అని అనుకోకుండా వుండలేకపోయింది కోమలి. నువ్వు యింత దూరం యింత కష్ట పడి వచ్చింది యిందుకా అని అడగకుండా వుండలేకపోయింది.
” ఆ… మరి… చూడు ఒక్కరోజు నా సంపాదన” అని వందరూపాయల కట్టని చూపేడు.
తూలి పడబోతున్న కోమలిని పొదవి పట్టుకుని “నువ్వు పరమశివుని దర్శనం కావాలని కోరుకున్నావు, అతను లక్ష్మీ కటాక్షం కోరుకున్నాడు. మీ యిద్దరి కోరికలూ తీర్చేడు భోళాశంకరుడు. మన ‘గాంజా చక్రవర్తిని’ బిచ్చగాడు అని కించపరచకూడదేమో కాముడూ, కష్టపడ్డాడు కాబట్టి దీనిని వృత్తి అనాలేమో కదూ?” అంటూ మెల్లగా కోమలిని నడిపించసాగేడు ప్రకాష్.
ఇది జీర్ణించుకోడానికి భర్త తర్కాన్ని వప్పుకోడానికి కోమలికి కొంత సమయం పట్టేటట్టు వుంది.
ఈశ్వర సన్నిధానంలో కూడా లక్ష్మీ దేవి ఆధిపత్యమా?!
**** (*) ****
కథ బాగుంది.
కర్రా నాగలక్ష్మి గారూ, మీ కథ చాలా బాగుంది. ఆ మంచుకొండల్లోని యాత్రికుల పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించారు. గాంజా చక్రవర్తి బిచ్చగాడు అయితే అమరి వీళ్ళతో కలిసి స్టే ఎలా చేసాడో మాత్రం అర్థం కాలేదు. కథ మాత్రం చాలా బాగా రాసారు. అభినందనలు.
అక్కడ యాత్రలో అందరు వొకే టెంటులో వుంటారు బీద వాళ్లకి ఫ్రీ గా ఉండడానికి ,అలాగే బస్ లో కుడా (Jammu to పెహళ్ గావ్) వరకు ఫ్రీగావెళ్ళిపోతారు , యిది కదా కాదు నేను చుసిన నిజం ఆ కోమలి ఎవరో వేరే చెప్పాలా
Thank యు all
Kadha bavunnadi atta.
బాగుంది katha
మమ్మల్ని అమరనాధ్ యాత్రకి తీసుకెళ్లి పోయావు నాగలక్ష్మీ.. కథ, కథనం.. చివర్లో మలుపు, అద్భుతం. అభినందనలు.
చాలా బాగు౦ది లక్ష్మీ నీ అనుభవాలన్నీ మ౦చి కధలుగా మలుచు
అందరికి dhanyavaadaalu
కథ బాగుందండి. చివరలో మలుపు బాగుంది.
నీ కథ చాలా బాగుంది నాగలక్ష్మి! అమర్నాద్ యాత్ర చెయ్య లేదనే కోరిక Nee వర్ణనతో తీరింది. కళ్ళకు కట్టినట్లు వర్ణించావు. అభినందనలు !
కథ బావుందండి.
ఈ సృ ష్టిలో కొన్ని నిజాలు ఏ పాటికీ అవగతం కావు. నేనూ ఇలానే ఆలోచనల్లో పడుతుంటాను.
మంచి ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు.
అభినందనలతో..
కధ చాలా బావుంది #VeeraReddyKesari