డైరీ

గడ్డిపరక

జూన్ 2015

నాకు తెలుసు- నేను రాసేదేది కవిత్వం కాదని(ఇలా చెప్పడం ఈ మధ్య ఫాషన్ కావొచ్చుకాని.. నే నిజాయితీగానే చెప్తున్న), కవిత్వం అంతకన్నా గొప్ప సౌందర్యంతో అలరారుతుందని, అయినా రాస్తూ ఉంటాను. ఇక రాయడం మానుకోమని తోచినప్పుడల్లా, ఇంకొంచెం ప్రయత్నించవచ్చేమోనని లోలోపల తోస్తుంది. ఇక వద్దని మానేయాలనుకున్నప్పుడు- అటువైపు సున్నితంగానో, బలంగానో లాగే విరోధబాస-paradox.

ఎప్పుడు కవిత్వం నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్టే ఉంటుంది. మళ్లీ మళ్లీ తిరిగొచ్చి గుండెలోనే తిష్ట వేస్తుంది. పుస్తకాలు చదువుకుంటున్నప్పుడో, జ్ఞానాన్ని, కవిత్వాన్ని ఒంపుకుంటున్నప్పుడో, జ్ఞానంలేని కవిత్వాన్ని నింపుకుంటున్నప్పుడో చిన్న అలికిడి వెంట వస్తున్నట్టు అనిపిస్తుంది.

ఇంత రాసింతర్వాత మనం రాసిందేది కవిత్వం కాదని తెలియడం చిరాగ్గానే ఉంటుంది. తోచిన భావమల్లా రాసేశాం. కానీ భావాలే కవిత్వం కాదని, భావాలతో యుద్ధం చేసి, సునిశితంగా మలిచి, గుండెలో నిక్షిప్తం చేసేదే కవిత్వమని మనకిప్పటికి తెలిసి ఏం ప్రయోజనం.

భావాలు ఎలా ఉంటాయి? అవి గదిలోంచి, ఇంటిలోంచి బయటకొచ్చి, మెట్లుదిగి, వరండా దాటి.. అలా గడ్డిలాన్ లోకి వచ్చి కూలబడతాయి. గడ్డిపరకలు పచ్చగా భూమినుంచి పొడుచుకొచ్చి, తోటమాలి పట్టిన నీటితుంపరకు తడిసి, సూర్యుడి కిరణాల స్పర్శకు మెరిసి.. వేళ్లమధ్యలోకి తోసుకొని వచ్చేవి. కానీ సున్నితమైన వీటికి తెలియదు- వేళ్ల మధ్య హృదయమొకటి వేలాడుతూ ఉంటుందని.. పదునుతేలి పచ్చగా తారాడే గడ్డిపోచల కొనకు అది గుచ్చుకుంటుందని, మన గుండెలోని మాటలు తన రక్తంలోకి పీల్చుకుంటుందని..

ఈ గడ్డిపోచలెప్పుడు కవిత్వాన్ని చెప్పవు. ఏ కవో వాటిపై భారంగా కూచోని భావాలన్నీ పరిచివెళ్లినప్పుడు దీనంగా తల వాల్చడం తప్ప.. పచ్చగా ఒకదానినొకటి అల్లుకొని, గుబురుగా దట్టంగా గడ్డిపూలనలకరించుకొని కళ్లముందు పెరిగే ఈ గడ్డిపోచలు ఏ కవిత్వం చెప్పగలవు. రాత్రి నిమ్మలంగా కురిసిన మంచులో ప్రశాంతంగా పడుకోవడం తప్ప..