కవిత్వం

వాన పిట్ట

25 జనవరి 2013

వదలనంటుంది ఆకాశం,
కురవనంటుంది మేఘం
నావికుడా-
ఈ అమాయకపు వానిప్పుడు అవసరమా?
***
బాయ్ చెప్పడానికెత్తిన చేతిని సంగంలోనే ఆపి,
ఆఫీస్కు డుమ్మాకొడతానేమోనని..
చూపులు మిటకరిస్తూ
గేటు మీద వాల్తాయి రెండు పిట్టలు
నావికుడా-
పెనుగులాట వారిది మాత్రమేనా?
***
చూస్తుండగానే, నల్లమబ్బులు కమ్మేస్తాయి
జీవితపు రిమోట్ను సెకన్ల ముల్లుకు తాకట్టుపెట్టే
హృదయ స్పందనలను దేంతో కొలవాలని?
***
తడిసిన చూపుల్తో పిట్టలు
ముడుచుకుని లోపలకు జరుగుతాయ్
ఉసురు మాత్రం ముసురై..
ఏ ఫ్లైఓవర్ పైనో నిన్ను నిలువునా దహించేస్తుంది
అయినా-
కన్నీటితో మంటలార్పుకోడానికి..
వర్షాన్ని మించిన ముసుగేముంది?