కథ

యుద్ధం

ఆగస్ట్ 2015

ల్లాహ్ అక్బర్.. అషహాదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్.. అష్‌హదు అన్నమహమ్మదర్రసూలుల్లాహ్.. హయ్య అలస్సలాహ్.. హాయ్య అలల్ ఫలాహ్..

గుట్టు సప్పుడు గాని సీకటి పొద్దును సిల్లకల్లం జేసుకుంట లౌడ్‌స్పీకర్‌ల నుంచి ఫజర్ నాలుగు దిక్కుల్లా మోగంది. మసీదు గూట్ల బిగేసుకోని పండుకున్న జంట పావురాలు జడుసుకోని రెక్కలు ఇసురుకుంటా ఆకాశంలకి ఎగిరినయ్. ఎగిరివోయిన పావురాలకి కిందెందో గింజల్లెక్క మెరవంగనే ఓ పాత రేకుల షెడ్డు మీద టపా టపా రెక్కలార్చినయ్. మెరిసే వాట్ని ముక్కుల్తో పొడవబోతే ముక్కులు దిగవడి రేకు రంధ్రాలు పెద్దగైనాయ్.

గా రంధ్రాల కెళ్ళి సొచ్చుకొచ్చిన జీరో బల్బు వాటి కండ్లల్ల ఎలిగింది. పావురాలు ఇచ్ఛంత్రవోయి మెడలు మెలికలు తిప్పుకుంట లోపల్కి తొంగిజూత్తే, ఆటి గూటి కన్నా సిన్నగున్న ఇంట్ల అమ్మీ, నలుగురు ఆడ పిలగాండ్లు, ఓ మగ పిలగాడు సీమగ్గూడా సందీయకుండా ఒగల మీద ఒగలు వడ్డట్టూ పండుకున్నరు. ఆల్ల దాపునే పండుకున్నఅబ్బ, ఫజర్ పిలుపుకు లేసి నమాజ్ జేయనీకి తొమ్మిదేళ్ళ కొడుకును లేపుకుంట అబ్దుల్లా
“ఉఠో బేటా నమాజ్ కా వక్త్ హువా..”

“సోనేదో సోనేదోజీ..”

“ బేఠా బహుత్ రాత్ తక్ పడ్ రహాతా.. సోనేదో” కొడుకును లేప్తోంటే అమ్మి లేసింది.

“అమీనా ఉఠో బేటీ, పానీ బంద్ హోజాయేగా ఉఠో’ అని పదిహేనేళ్ల పెద్ద పిల్లను లేపి బయటకువోయి ఖాళీ బిందెలు, బకేట్లల్ల అడుగున మిగిలిన ఒక్కో సుక్క వంచితే చెంబడు నీళ్ళయినయి. అమీన లేసి దాని పెద్ద సెల్లెను, రెండో సెల్లెను లేపింది. తల్లి,ఇద్దరు ఆడపిలగాండ్లు ఖాళీ బిందెలు, బకెట్లు పట్టుకొని చౌరస్తాల ఉన్న మున్సిపాల్టీ నల్ల దగ్గరికి పోంగనే మిగిల్న చెంబెడు నీళ్ళతోని తండ్రి వజూద్ జేసిండు.

దిగూట్లే తెల్లగా ఉతికివెట్టిన తుండు గుడ్డ దీసి కింద పరిసి నమాజ్ జేసిండు. నమాజ్ అయిపోయేటాల్లకు తల్లో సగం బిందె, పెద్ద పిల్లో సగం బిందే ఎత్తుకొత్తే, రెండో పిల్ల ఖాళీ బకెట్లు ఎట్ల తీసుకపోయి౦దో అట్నే తీసుకచ్చింది. ఓ బిందె ఇంట్ల వెట్టి, ఇంకో సగం బిందే బాత్రూంల ఉన్న బకెట్ల కుమ్మరించి కొడుకును లేపి తానానికొమ్మ౦ది. అబ్దుల్ లేసి కప్పుకున్న దుప్పటిని బేఫికర్‌గా నిద్రవోతున్నచెల్లెకు కప్పి, పోయి నాలుగు చెంబులు నెత్తి మీద కుమ్మరించుకొని తాన౦ అయి౦దనిపి౦చి౦డు.

గింతల తండ్రి ఇంటిముంగట కరంటు పోలుకు సైకిల్ చైన్తోని కట్టన తోపుడు బండిని ఇప్పి బయటకు తీసి, అండ్లున్నఅరటి గెలల తొక్కలను, చెత్తను ఏరి సాఫ్ సఫాయ జేసిండు. అబ్దుల్ల ఇస్కూల్ డ్రెస్సు తొడుక్కోని, పుస్తకాలు సర్దుడు వెట్టిండు. బాల్పెన్ను తీసి రిఫిల్ల ఇంకెంతుందో జూసుకున్నడు. గింతల పాలు, సెక్కరి, ఛాపత్త, బన్ను వక్కలు పట్కచ్చి అమ్మికిచ్చింది రెండో పిల్ల.

అబ్దుల్ల పుస్తకాల సంచి సర్దుకొని ఇంటి ముంగటికచ్చి సంచిని తోపుడు బండి కిందున్న జాలి మీదికి తోసిండు. దాని పక్కకే ఉన్న సైకిల్ గాలి పంపు తీసి టైర్ల గాలి కొట్టుకుంట
“అబ్బా… ఇస్కో బహుత్ పంఛర్ హోగయీ …రోజ్ హావా బర్ బర్‌కే బేజార్ హోరా, ట్యూబ్ బదల్ డాలో నా…”

రోజ్జెప్పేదే మళ్ళా జెప్పి మిగిలిన రె౦డు టైర్లల్ల గాలి ఉందో దిగిందో అని ఒక్కో టై రును నాలుగు సార్ల ఒత్తి జూసిండు.

“యే లో… చాయ్ పీలో” అమ్మీచాయ్ బన్నుతెచ్చి ఇచ్చింది. అబ్దుల్లా చాయ్ ల బన్ను ముంచంగనే పర్రెలు సాచిన భూమి వాన నీళ్ళను పీల్సుకున్నట్టు చాయ్ ని గిలాస అడుకంటా పీల్సుకుంది. బన్ను మింగి మిగిలిన ఒక్క ఛా బొట్టును గొంతులేసుకోవడానికి గిలాస పై పైకి ఎత్తి తంటాలు వడ్తుంటే అమ్మీ తన గిలాసల ఉన్న దాంట్ల కొంచెం ఛా ని అబ్దుల్ల గిలాసలకి వొంపింది. అమ్మీ కేసి జూసి పండ్లికిలించి నఃవ్వి ఒక్క గుట్కల మింగేసిండు.

అబ్బా కొడుకులు బండి తోసుకుంట ఇరుకిరకు గల్లీలు దాటుకుంట బయలెల్లే ఏళకి పొద్దెక్కి౦ది.

“అబ్బా మై స్కూల్ నై జాతా, బండి మెయిన్ బజార్లకు ఎక్కంగనే మొఖం మా డిసిండు. “కైకు నై జాతా?” మలుపు తిరగడానికి ఎనక రె౦డు పైయ్యల్ని లావట్టిండు.

“టీచర్ మార్ తే “

“ఇస్కూల్ జాకే అచ్చా పడేతో ఆఛ్చీ నౌకరీ మిల్తీ. నై తో మేర్కు జై సే మౌజ్బేచ్కే జిందగీ కరేగా క్యా?”

“ ఔర్ క్యా ఫిర్? ఇత్తే దిన్సే భోల్రూ కాంపాక్స్ బాక్స్ దిలావ్ బోల్కే , దిలారే నై… టీచర్ గుస్సా కర్రై” అరటి పళ్ళ గోదామ్ ముంగంటికి చేరిండ్రు.

“ రోజ్ కా రోనా బంధ్ కర్, బాద్మే దిలాతావు. ఛల్ పైలే బండిపే మాల్ లగాయే౦గే”

గోదాం లోపల్కి నడిసిండు. యేళఁం పాట పాడి కొనుక్కున్న అరటి గెలల కుప్ప దగ్గరికివోయి గాలి సొర్ర కుంట కప్పిన అరటి ఆకులు జరిపి జూసుకుంటా పండిన గెలలను కుప్ప ను౦చి వేరు జేసిండు. లెక్కవెడితే రోజటి కన్న రెండు గెలలు తక్కువ పండినయి. “క్యా మాలై భయి, సాత్ దిన్ హోగయా ఆదా మాల్ కచ్చా హిచ్ హై” అరటి పళ్ళ సేఠ్‌తోన౦టే “కమ్ పడేతో దో తీన్ కో కెమికల్ మే డుబాకే లేజావ్,”

“ మియా మేర్కో రెగ్యులర్ కస్టమర్ హై , ఐసా కరే తో గిరాక్ కరాబ్ హోజాతా”

“ ఫిర్ మై క్యా కరూ, సబ్ లోగాకా మాల్ జల్దీ కతమ్ ఓజాతా, తేరే వైజై’సే మెర్కో భి లోడ్ లానే కో రుక్నా పడ్రా, మేరా బాతా సున్కే కెమికల్ మే డుబాకే దో దిన్ మే మాల్ కతం కర్లే” సేఠ్ జెప్పిన దాన్కి ఏ౦ బదులీయకుండా నిన్నటి పైసలు లెక్కవెట్టి ఇచ్చిండు. పక్క కుప్పోడు కెమికలేసిన బకెట్ల పచ్చి అరటి గెలలు ముంచి తీయంగనే తొక్కలు పసుపచ్చగా మారిపోవటాన్ని సూత్తున్న అబ్దుల్నుపిలిసి సిన్నసిన్న గెలలను తీసుకవోర¬ బండ్లె పెట్టు మన్నడు. పండిన గెలలు బండ్లెక్కిచ్చి అడ్డమీదికి బయలెల్లిండ్రు.

తొవ్వల రోజు తీసుకునే కస్టమర్ల కోసం ఓ కాలనీల ఆగంగనే బండికింద కట్టిన గంట కొట్టిండు అబ్ధుల్.

గీదే టయానికి ఇస్కూల్ల గూడ గంట మోగింది. గంట సప్పుడుకు బండి దగ్గరికచ్చిన కస్టమర్లకు అబ్బాడజను, అరడజను అని లెక్క వెట్టి ఇత్తాంటే ఇనడనోళ్ళ ఇండ్లళ్ళకు అబ్దుల్ వోయి లైన్ గా ఇచ్చచ్చిండు.

గప్పుడే బల్లే పిల్లలందరూ ప్రార్థనకు లైన్ల నిలవడ్తండ్రు. కాలనీ దాటి అడ్డ మీదికి దారి పట్టేటాళ్ళకు పంచర్లున్న టైరు గాలి మొత్తం దిగింది. బండి తోసుడు బరువై టాల్లకి అబ్బా మళ్ళా గాలి కొట్టుడు వెట్టిండు. బల్లే ప్రార్థన జేసే పిల్లల గొంతుకు వ౦త పాడుతూ అబ్దుల్ అబ్బతోని కలిసి అడ్డ మీదికి జేరిండు. ప్రార్థన అయిన౦క భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశము ను ప్రేమిస్తున్నాను… అని ప్రతిజ్ఞ జేసుకుంటా బండి కదలకుండా నిలవడేందకు నాలుగు టైర్ల కింద నాలుగు కంకర రాళ్ళను ఏరుకచ్చి పెట్టిండు. బండి కింద జాలి మీదున్న ఇస్కూల్ బేగ్ తీసి అండ్ల రెండు అరటి పళ్ళ ఏసుకొని “అబ్బా మై జా రాహు” అని ఎనక్కి తిరిగి సూడకుండా ఉరుకులు వెడుతూ బడి బాట వట్టిండు. గప్పటికే టీచరచ్చి అంటెడెన్స్ తీసుకునుడు మొదలవెట్టింది.

అబ్దుల్ పేరు విల్తే జవాబు లేకపోయేటాల్లకి తలెత్తి తరగతి గదిలున్నపిలగాండ్ల దిక్కు జూసింది. అబ్దుల్ గూసునే జాగా ఖాళీగా కనవడ్డది. ఆ బ్సె౦టేయ వోయి కొద్దిగా తటాపటాయి౦చి ప్రెజెంట్ ఏసి తర్వాత పేర్లను పిలుసుడు వెట్టింది. గింతల ఖాళీగా ఉన్నఅబ్దుల్ జాగల ఇంకో పిలగాడు కూసుందామని జరిగితే పక్కకే ఉన్న అబ్దుల్ సోపతిగాడు ఆ పిలగాన్ని కూసోనియలే. అటె౦డెన్స్ తీసుకున్న౦క టీచర్, పాఠం మొదలువెట్టటానికి ముందు నిన్న జెప్పిన పాఠంల ప్రశ్నలడుగుడు షురు జేసింది.

రెండు మూడు ప్రశ్నలయిన౦క ఓ ప్రశ్నకి పిలగాండ్లెవరు జవాబు చెప్పలే, అర్ధ వై౦దో కాలేదోని మళ్ళా అదే ప్రశ్న అడిగితే జవాబు దర్వాజల ను౦చి ఇనవడ్డది. టీచర్‌తో పాటుగా పిల్లలందరూ దర్వాజ దిక్కు జూస్తే, ఆడ నిలవడ్డ అబ్దుల్ మోస పోసుకుంటా మళ్ళా జవాబు జెప్పి౦డు. జవాబు రైటే గాని గిట్ల రోజు లేట్ గా ఇస్కూల్ కత్తే పేరు తీసేత్తాని బెదిరించి పది బస్కీల్ తీసి క్లాస్‌ల గూసోమ౦ది.

అలవాౖటెన పాణం అయిన౦దున దబ దబ బస్కీల్తీసి ఆడి జాగల వోయి కూసున్నడు. ఆడి సోపతిగాడు పండ్లికిలించి తెచ్చినవా అని సైకగ జేస్తే, తెచ్చినట్టు తలూపిండు. పగటి పూట బల్లే పెట్టే అన్న౦ తిన్న౦క ఇద్దరు కలిసి బడెన్కకు వోయి అరటి పండ్లు పంచుకు తింటారు. సాయంత్రం బడి చుట్టి కాంగనే మా నాన్న వీడియో గేమ్ తెచ్చిండు మా పోయి ఆడుకుందాం రా అని అరటిపండ్ల సోపతిగాడు పిలిస్తే, అబ్బా నమాక్ వోయే టైమ్ అయి౦ది, నేను బండి దగ్గరుండాలని మళ్ళా అడ్డ మీదికి ఉరికిండు అబ్దుల్.

ఆ తెల్లారి బడిగంట మోగలేదు. బాంబుల మోతతో మారుమోగిన నగరం అని అన్ని పేపర్లూ ఎర్రటి అక్షరాలతో నిండిపోయినాయి.బడికచ్చిన ఓ ఒకటో తరగతి పిలగాడు ఇయ్యాల బడి బందని చేప్తే సంబురంగా ఎగురుకుంటా ఇంటికురికిండు.

వారం అయిన౦క ఎప్పటిలెక్కనే సీకటి పొద్దును సిల్లకల్లం జేసుకుంట లౌడ్‌స్పీకర్‌ల ను౦చి ఫజర్ నాలుగు దిక్కులా మోగి౦ది.

మసీదు గూట్లో ఒంటరిగా ముడుసుకున్న పావురం ఎప్పటిలెక్కనే గూటికి సేరుతానో లేనోనని ఎగరడానికి జ౦కింది. ఎప్పటిలెక్కనే బడి గంట మోగింది, ఎప్పటిలెక్కనే పిలగాండ్లు ప్రార్ధన జేసిండ్రు, ఎప్పటి లెక్కనే భారతదేశఁం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశము ను ప్రేమిస్తున్నాను… అని ప్రతిజ్ఞ జేసిండ్రు.

ఎప్పటిలెక్కనే టీచరచ్చింది. ఎప్పటిలెక్కనే అంటెడెన్స్ తీసుకునుడు మొదలు వెట్టింది. ఎప్పటిలెక్కనే అబ్దుల్ పేరు పిలిస్తే జవాబియ్యలేదు, ఎప్పటిలెక్కనే టీచర్ తలెత్తి తరగతి గదిలున్న పిలగాండ్ల దిక్కు జూస్తే అబ్దుల్ గూసునే జాగా ఖాళీగా కనవడ్డది.

ఎప్పటిలెక్కనే ఆ ఖాళీ జాగాల కూసుందామని జూసిన ఇంకో పిలగాన్ని, ఎప్పటిలెక్కనే అరటిపండు తినచ్చు అన్న ఆశ పోయి అరటిపళ్ళ సోపతిగాడు ఆపలేకపోయిండు. ఎప్పటిలెక్కనే తటపటాయిస్తూ ప్రెజెంట్ ఎయ్యాలనుకున్న టీచర్‌కి ఎప్పటిలెక్కనే ఇస్కూల్ కి అత్తాడన్న భరోసా పోయి ఒక్కరోజుకే కాదు జీవితాంతం ఆబ్సెంటేసింది.

అదే టయానికి అడ్డ మీద అరటి పళ్ళ బండి ముంగట అబ్బ లేకుండా జీవితాంతం ప్రెజెంట్ అయిదామని సిద్దమయి౦డు అబ్దుల్. ఎప్పటిలెక్కనే నాలుగు కంకర్రాళ్ళు ఏరుకచ్చి బండి కదలకుండా నిలవెడ్తూ.

**** (*) ****

Painting: Kishore SinghOne Response to యుద్ధం

  1. Shekhar
    August 17, 2015 at 11:55 am

    సూపర్ సూపర్ చాల బాగుంది.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)