అర్ధరాత్రి… నల్లటి చీకటి. ఆకాశంలో మబ్బులు కూడా నల్లగానే ఉన్నాయి. నల్లగా ఉన్న ఆకాశంలో నల్లగా ఉన్న మబ్బులు ఎలా కనిపిస్తున్నాయి? ఎక్కడినుంచో బతకలేని వెలుతురు నల్లటి ఆకాశం నుండి తప్పించుకుని మబ్బుల్లోంచి ఈ భూమిని చూద్దామని ప్రయత్నిస్తోంది. రెండు మబ్బుల మధ్య కాస్తంత సందులోంచి, భూమి నెర్రలు వేస్తే చీలినట్టున్న ఆ చీలికల్లోంచి గుబులుగా కనిపిస్తోంది. దాంతో నల్లటి మబ్బులు ఉన్నట్టు తెలుస్తోంది.
భూమి మీద చెట్లు గుబురుగా ఉన్నాయి. గాలికి ఊగుతున్నాయి. కానీ చూడ్డానికి గుబులుగా ఉన్నాయి.
ఆ చెట్ల మధ్య నుండి తెల్లటి బట్టలు వేసుకొని పరుగెత్తుతూ వచ్చింది ఆరేళ్ళ అమ్మాయి. విశ్వ ఆమెను గుర్తు పట్టాడు. అతడి చెల్లెలే ఆమె.
“రా అన్నయ్యా, ఆడుకుందామా…”
ఆమె పరుగెత్తుతోంది. దాగుడు మూతలు. కాసేపు కనిపిస్తోంది. మరి కాసేపు దాక్కుంటోంది.
“అన్నయ్యా…” అంటూ గారాలు పోతోంది.
ఆమె బట్టలు తెల్లగా ఉన్నాయి. కాంతిలాగా. తెల్లని కాంతిని ఎర్రని చీకటి కమ్మేసినట్టు ఆమె బట్టలనిండా కమ్ముకుంటుంది రక్తం… ఆమె ఆడుకుంటూనే ఉంది… రక్తం ఆమెని కమ్మింది. ఆమె గిలగిలా కొట్టుకుంటోంది.
“అమ్మా …” కేక పెడుతూ లేచాడు విశ్వ.
“ఏంటన్నయ్యా” మంచం పక్కనే పరుగులు పెడుతూ అడిగింది ఆమె. విశ్వకిప్పుడు ముప్పై దాటాయి. తను మాత్రం ఇంకా అయిదారేళ్ళ వయసులోనే ఉంది.
***
“పేపర్” అన్న కేక వినపడగానే చిమ్మచీకటి విడిపోయింది. తెల్లటి వెలుగు వచ్చింది. అది అర్ధరాత్రయినా సరే పేపర్ వచ్చిందంటే చచ్చినట్టు తెల్లారాల్సిందే అనుకున్నాడు విశ్వ.
అయినా తాను ఇప్పుడేగా పడుకున్నాడు. పడుకుని రెండు గంటలయినా అయిందో లేదో అప్పుడే తెల్లారిందేంటి? బొంగులే… తను ఎప్పుడు పడుకుంటే ఏమిటి? దాన్ని బట్టి తెల్లారుతుందా? అయిన తను పడుకోకపోయినా తెల్లారుతుంది. ముసలమ్మ కోడి కూయకుంటే తెల్లార లేదూ? తనూ ముసలమ్మా ఒకటా? ముసలమ్మకి పింఛను వస్తుంది. తనకు కట్టాల్సిన బాకీలు చాలా ఉన్నాయి. ఆస్తి అప్పుల పట్టికలో తాను అప్పుల పట్టికలో ఉన్నాడు. ముసలమ్మకి వయసు వరం. తనకి వయసు భారం.
పేపరు వచ్చాక తెల్లారాల్సిందే. ఎందుకో తనకి తెలీదు. కానీ పేపరు వాళ్ళు తెల్లారింది అన్నాక కాదని ఎవరూ అనరు. చాలా మంది మెదళ్ళు పేపరాళ్ళకి అప్పగించేస్తారు, ఐటంసాంగ్ కి కళ్ళప్పగించినట్టు . ఇక ఆలోచనలు జోరీగల్లా ఇబ్బంది పెట్టవు. పేడపురుగుల్లా పడి ఉంటాయి. మిగతా వాళ్ళకి మెదడున్నా దానికి అవసరాలుంటాయి. అందుకే వాళ్ళు అంటుకున్న మంట మీద అల్పాచమానం చేసుకుని ఆర్పేసుకుంటారు.
నెమ్మదిగా లేచి పేపరు తీసుకున్నాను . పేపరు నిండా హీరోయిను బొమ్మలే. ఆ అమ్మాయి చాలా బావుంది. పేపర్ అంతా అందంతో నిండిపోయింది. ఆ అమ్మాయి మొహమంతా నవ్వే. దిగులు ఎక్కడా కనపడదు. మెరుపు… ఆమె కళ్ళలో, నవ్వులో, ఆమె వేసుకున్న బట్టల్లో. ఆ బట్టలు కప్పని చోట కనపడే సువర్ణ భాండపు అంచుల్లో. అంతా మెరుపే.
విశ్వకి మతిపోయింది. కానీ మనసుకి హాయిగా ఉంది. పేపరు నిండా హీరోయినే. లోపల వార్తలున్నాయి కానీ అందంగా ఉన్నాయి. ఫొటోలన్నీ హీరొయిన్వే. అంగనువాడి టీచర్లపై లాఠీ చార్జి జరిగినట్టు దారెమ్మట వస్తూ చూసాడు. వార్త ఉంది. కానీ పోల్చుకోలేకపోయాడు. అంగనువాడి టీచర్లు ఆనందంగా నవ్వుతున్నారు. ఎందుకంటే అక్కడ టీచరు వేషం కట్టిన ఆ హీరోయిను బొమ్మ వేసారు.
ఆబిట్యురి కాలమ్ చూసాడు. అక్కడ చెల్లెలు ఉండాల్సిన చోట కూడా హీరోయినే ఉంది. చెల్లెలు వేషం కట్టింది.
సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రమాదం జరిగింది. కానీ ప్రమాదవశాత్తు ఆ వార్త లేదు.
వార్త ఉండాల్సిన చోట ప్రకటనలతో సరిపెట్టాడు పేపరు వాడు.
ఆ పేపరు వాడు చిన్న చేప. సాఫ్టువేరు కంపెనీ వాడు పెద్ద చేప. ప్రకటన విలువ ఎక్కువా? వార్త విలువ ఎక్కువా? ఏది ఎక్కువ లాభదాయకం? నాకు చోటు నిండాలి. ను వ్వు ప్రకటనతో నింపితే చాలు. నేను నిజాన్ని నీ మీద తొణకను.
హీరోయిన్ అందం ఆ వార్త తాలూకు విషాదాన్ని మింగేస్తోంది. మంచిదేగా… ఆనందం బ్రహ్మ స్వరూపము. మరో పేపరు తీసాడు. దాన్నిండా శవాలే. అంతా శవాలే ఉన్నాయి. శవాలు పెళ్లి చేసుకుంటున్నాయి. సవాళ్లు విసురుకుంటున్నాయి.
విసుగ్గా ఉంది. చిరాగ్గా ఉంది. ఉన్మాదంలా ఉంది. ఇలా అన్నీ తలకిందులుగా కనపడితే తన ఉద్యోగం పోతుంది. తనది ఉద్యోగం కాదు… ఆశయం. తను విల్లా కొనుక్కోవాలి. అందుకే తనూ, భార్యా… ఇరవై నాలుగ్గంటలూ కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ మతిపోతే?
‘సరే… కానీ… లేచిపోవాలి… ముందు ఈ కలలోంచి లేచిపోవాలి’ బిగ్గరగా అనుకుని లేచిపోయాడు విశ్వ.
చుట్టూ చీకటి. ఏంటో చీకటే హాయిగా ఉంది. వెలుగు విసుగ్గా ఉంది.
***
డాక్టరు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు విశ్వ. అతడు అలా అనుకోవడానికి కారణం ఉంది. పొద్దుట లేచి రెండు పేపర్లు అందుకున్నాడు. అతడికి మతి పోయింది. రాత్రి కలలో చూసినట్టే ఉన్నాయి ఆ పేపర్లు. ఒక దాన్నిండా అందమైన పాప ఫోటోలు, ఇంకో దాన్నిండా వాంతి వచ్చేలా శవాల ఫోటోలు.
తెలుగులో ఇంక మామూలు పేపర్లు దొరకవా? ఇలా కాకుండా? మాములుగా ఎలా ఉంటాయి? తనక్కావలసినట్టు ఉండాలంటే తనే వేసుకోవాలి.
భార్య ఇచ్చిన కాఫీ తాగాడు. మగత దిగింది. రాత్రి తాలూకు జ్ఞాపకాలు కరిగిపోయాయి. కానీ పేపర్లు ఇంచుమించుగా అలానే అనిపిస్తున్నాయి.
మహాత్మా… మహర్షీ… ఏది సత్యం? ఏది మిధ్య?
పోనీ భార్య ఇచ్చిన కాఫీలో ఏదైనా దోషం ఉందీ అంటే, అది రోజూ ఉన్నట్టే ఉంది. రంగు, రుచి, వాసనా, చిక్కదనం… భార్య హడావిడిలో ఉండే నిర్లక్ష్యం.
“ఛీ… దీనికి నా మీద ప్రేమే లేదు” అనుకున్నాడు విశ్వ.
మొన్న ఒక రోజు అనుకోకుండా చైర్మన్ గారితో స్టార్ హోటల్లో ఉన్నాడు. ఉదయమే హోటల్ అమ్మాయి తెచ్చి ఇచ్చింది కాఫీ. ఎంత బావుంది. కాఫీ కాదు. ఇచ్చిన అమ్మాయి. తాజాగా… ఆమె ఇచ్చిన కాఫీ తాగితే థమ్సప్ తుఫాన్ ప్రేమగా వచ్చినట్టుంది.
అదృష్టం అంటే చైర్మన్ దే. ఆయన రోజుకో హోటల్లో తాగుతాడు కాఫీ. తనకేమో ఇంటి కాఫీ. యావజ్జీవ కాఫీగారశిక్ష… ఐపీసి… సిఆర్ పీసి… కాదు ఇది ఇండియన్ మ్యారేజ్ యాక్టు.
పేపరు చూసాడు.. హీరోయిను అందం గా నవ్వుతోంది. ఆమె కళ్ళ దగ్గర గీతలు పడటం లేదు. నవ్వినపుడు కళ్ళ దగ్గర పడే గీతలని క్రోస్ ఫీట్ అంటారు. కాకి కాలుతో గీకితే ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ గీతలు. కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. ఈ అమ్మాయి నవ్వితే ఆ గీతలు పడటం లేదంటే ఈమె కలా… నిజమా?
డాక్టరు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎలా? డబ్బులేక కాదు. సమయం లేక. ఐ ఐ టి పరీక్ష సమయంలో సమయం ఎలా ఉపయోగించుకోవాలో తను చెబుతాడు. కానీ జీవితంలో సమయం ఎలా ఉపయోగించాలో తెలిసినా అలా ఉపయోగించలేడు.
తాము డబ్బు చక్రవర్తికి బానిసలు. నెలకి ఇన్ని లక్షలు ఇచ్చేవాడు అన్ని సెకన్లనీ వాడుకుంటాడు. గుండె కవాటాల్లోకి డబ్బు ప్రవహిస్తే చాలు… కానీ డబ్బుకి బై ప్రోడుక్టు కొవ్వు. అది చేరితే ఐసియు వరకూ సమయం దొరకదు.
ఉదా: అమెరికా వాడి వ్యంగ్య చిత్రము . నగదుతో వ్యాపారము చేయు వ్యాపారి. లావుగా పొట్ట. అరువు బేరముతో వ్యాపారము చేయు వ్యాపారి. సన్నగా రమణా రెడ్డిలా… కంకాళంలా.
కానీ వెళ్ళాలి… లేకపోతే దేవాలయాల మీద బూతుబొమ్మల్లా పేపర్ల నిండా ఈ అమ్మాయి ఫోటోలు ఏంటి. అబ్సెసివ్ కంపల్సివ్… సంతింగ్ ?
సరే… ముందు చదువుల కర్మాగారానికి వెళ్ళాలి. అక్కడ అంతా యంత్రాలే . తను , పిల్లలు, నగదుతో వ్యాపారము చేయు వ్యాపారి… చైర్మన్… తల్లితండ్రులు… జీవితాన్ని అరువుగా ఇచ్చే పిల్లయంత్రాలు.
***
ఏం జరుగుతోంది?… ఇందాకే పడుకున్నాడు . భళ్ళున తెల్లారింది. ‘భళ్ళు’మన్న శబ్దం తాను వినలేదు. అసలు తెల్లారినప్పుడు శబ్దాలోస్తాయా ? ఓ ఆడకూతురి జీవితం ఆమ్లంతో, లేదా రాతితైలంతో తెల్లారినపుడు వస్తాయి శబ్దాలు. బస్సులోనో, చిన్న కారులోనో తెల్లారినా వస్తాయి శబ్దాలు. దశాబ్దాలు గా అవే శబ్దాలు. గబ్బిలాల రెక్కల చప్పుడు. బాట్ మన్ ది ఏనిమల్ రైసెస్… ఓ జీసస్… సేవ్ యువర్ చిల్డ్రన్.
తన భార్య… నిఝంగా తన భార్యే. నవ్వితే క్రోస్ ఫీట్ వస్తున్నాయి. లాఫ్ లైన్స్ కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా అన్వయించాలి? అది సంస్కారాన్ని బట్టి ఉంటుందా? మనిషిలా ఉంది కాబట్టి ఇది వాస్తవం. కలలో కూడా తనకి అందంగా ఉండటం రాదు.
మహాత్మా… మహర్షీ…!
గులాబీ అంత తాజాగా… తన భార్యే. నవ్వుతూ కాఫీ కలుపుతోంది. తనకి ఇస్తోంది. తను పేపరు చదువుతోంటే తను కూడా తన వెనక చేరి తన మెడ చుట్టూ చేతులు వేసి, తల పక్కన తల పెట్టి, లత పక్కన లతలా… లావణ్యలతలా…
కాఫీ తాగుతూ పేపరు చదవడానికి గంటా? గంటన్నారా? అది కూడా పేపరు నిండా అదే నటి… మరో పేపరులో అవే శవాలు… ఏమో… అదో మైకం… అదో భోగం.
కాఫీ అబద్ధం… పత్రిక????? ఓహొ ప్రశ్నార్ధకం ఇందుకు కనిపెట్టారా?
ఆమె ప్రేమ… కాకి కాలు…
హతవిధీ….! భార్యలు కూడా ప్రేమిస్తారా? ప్రేమించాగలరా? అసలు ఆమె ఈ పాటికి ఉద్యోగానికి పరుగులు పెడుతూ ఉండాలిగా? ఇక్కడేం చేస్తోంది ? పనీపాటా లేనట్టు ప్రేమిస్తోందా? ప్రేమించాలంటే పనీ పాటా ఉండకూడదా? తెలీదు… కానీ సమయం ఉండాలి.
ఛీ… ఇది కలే… లేవకపోతే మతిపోయేలా ఉందీ… మతిపోతే ఉద్యోగం… దరిమిలా ఆదాయం… గోవిందా… గోవిందా…
***
“నువ్వు ఉద్యోగం మానేయవోయ్. నిజంగా నీకిష్టమై చేస్తుంటే నేను మానమనను. కానీ కేవలం ఆదాయం కోసమే అయితే అవసరం లేదు. నాకు తెలిసీ నేను బలవంతపెడితే ఉద్యోగంలో చేరావు. ప్రేమించడం, ప్రేమను పంచడం స్త్రీ సహజం. అమ్లీకరించడం పురుష ప్రవృత్తి” అతడింకా పూర్తి చేయలేదు.
విశ్వ భార్య నడుం మీద ఒక చేయి పెట్టుకొని, మరో చేయి మెడ మీద పపెట్టుకుని శిల్పంలా చూసింది. ఓ క్షణం ఆమె మొహం వెలిగింది. కానీ ఆ వెలుగు వెంటనే రాజీనామా చేసింది.
“మీరు డాక్టరుకి చూపించుకోండి. టీనేజ్ పిల్లాడిలా పిచ్చిమాటలు మాట్లాడుతున్నారు” అనేసి ఆమె అతడు ఖాళీ చేసిన కాఫీ కప్పులోకి దూకి అటునుంచి తన ఖాళీ లేని జీవితంలోకి ఈదుకుంటూ పోయింది.
నిజమే తనూ డాక్టరు దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే కలని కలలా మర్చి పోకుండా… కలని నిజంలా అనుకొంటున్నాడు.ఇది ఖచ్చితంగా జబ్బే.
కానీ వెళితే పోయేది డబ్బే. వెళ్లకపోయినా పోయేలా ఉందీ. ఒకటి నిజం . భర్త పెద్ద చేప. భార్య చిన్న చేప. పురుషుడు పెద్ద చేప. స్త్రీ చిన్న చేప. మత్స్య న్యాయం అంటే పెద్ద చేప చిన్న చేపను కబళించడం. కబళించడమంటే రక్తం, మాంసం, మూలుగ అనే కాదు… ఆ రక్తానికి, మాంసానికి ఉన్న స్వేచ్చని, ఇష్టాన్ని కబళించడం కూడా.
***
‘ఇప్పుడేగా పడుకున్నాను ఏంటి ఈ వెలుతురు?’ అనుకున్నాడు విశ్వ. కానీ అది పగటి వెలుగు కాదు… రాత్రి వెలుగు. రాత్రి కూడా వెలుగుతుందా? అవును… కళామతల్లి ఆర్క్ లాంపుల్లో వెలుగుతుంది. నిజమే… ఏంటి… ఈ వెలుగులో ఆ ఆకారం? నడిచివస్తున్నా బతికి ఉన్నట్టు లేదు. ఈజిప్టు మమ్మీ ఇంటిలోకి నడచి వచ్చినట్టు ఉన్నాడు. ఎవరీ అబ్బులు?
తమ ఇళ్ళలోకి దగ్గరలో, దగ్గరలో ఉన్నా దూరంగా అనిపించే పాకల్లో ఉండే తన చిన్నప్పటి నేస్తు కదా… అవును… వీడికి పేరేదో ఉండాలే?! అవును ఆ పేరు కన్నా వాడిని నల్లోడా అని పిలిచే వాళ్ళం చిన్నప్పటినుంచి. వాడు నల్లోడే కానీ వాడి పాట తెలుపు. తియ్యటి గంభీరమైన స్వరం. వాడు పాడకున్నా తియ్యగుండేది వాడి స్వరం. అది ఆ గొంతు గొప్పదనమా?
కోకిల పాడుతుంది. కానీ అలానే వాడూ పరవశించి పాడేవాడు. ఇలా పాడటం ఒక్కటే చాలదు. కళ్ళెదురుగా కాయితాలు చూసి పాడాలన్నారు. కానీ నల్లోడికి విద్యెవరు నేర్పుతారు? పైగా వాడు పాకోడు.
అయినా ఎవరో దయామయుడు వాడి రాగాలకి గమకాలు అద్దాడు. శాస్త్రీయంగా…
“నువ్వు సినిమాల్లో పాడాలోయ్… “అన్నాడు విశ్వ వాళ్ళ నాన్న నల్లోడితో.
నమ్మినట్టున్నాడు నల్లోడు. తరువాత రోజు టీవీలో కనపడ్డాడు.
తెల్లగా ఉన్న పిల్లల మధ్య వీడు బృందావనంలో కిష్టుడిలా ఉన్నాడు. తెల్లపిల్లల పాటలు వీడి నల్ల పాట ముందు తేలిపోయాయి.
కందుల బస్తాకి చొక్కా తొడిగినట్టున్న జడ్జీ కూడా మధుర గాయకుడే. ఆయనకీ నల్లోడి పాట నచ్చింది. కానీ నల్లోడు నచ్చలేదు. అహ… నల్లోడు అంత బాగా పాడటం నచ్చినట్టు లేదు. పాడేవాడి ఒంటిరంగు పాలిపోయిన తెలుపులో ఉంటేనే శాస్త్రాలు ఒప్పుతాయి. ద్రోహాచార్యులనడుగు… గిరిజనుణ్ని మోసగించిన సన్నాసి పేరు మీద అవార్డులిచ్చే ప్రభుత్వాలని అడుగు.
ప్రశ్నలు… ప్రశ్నలు… ‘నీ పూర్తి పేరు ఏంటి?’
‘మీ గురువు గారు ఎవరు? ఎవరి పరంపర నువ్వు?’
ఎక్కడో గుడిసె గుర్తు బయటపడింది. నల్లోడు కూడా బయటపడ్డాడు. ఆ కార్యక్రమంలోంచి. బహుమతులు తెల్లపిల్లలకి వచ్చాయి.
“కందుల బస్తా నా పీక మీదకి ఎక్కి తొక్కింది” అన్నాడు నల్లోడు.
ఆ తర్వాత ఇదే కనపడ్డం.
“ఏంటి నల్లోడా… కంఠం కమిలిపోయిందే?”
“పాట అక్కడినుంచే కదా వచ్చేది… అందుకే అక్కడ కాలేసి తొక్కారు”.
“ఎవరు?”
“తెలీదు. అందరూ. అదో స్టూడియో. సినిమాలో పాడతా అంటే… నల్లోడు పాడి హీరోలని మకిలి చేద్దామనుకుంటున్నావా?” అని పీక మీద కాలేసి తొక్కారు.
నల్లోడు ఆగలేదు. పాడుకుంటూ ముందుకుపోతున్నాడు. వాడు పాడటం లేదు. పాట అలా వస్తోంది వాడి గొంతులోంచో, గుండెలోంచో…. ఆ పాట పంచమస్వరంలో వినిపిస్తోంది. అరె… తనకి స్వరాలు తెలీవే?
శవం నడిచిపోతున్నట్టు నల్లోడు నడుచుకుంటూ పోతున్నాడు. వాడి పాటను ప్రపంచం నుండి వేరు చేయవచ్చు. వాడి ప్రాణాన్ని వాడి నుండి వేరు చేయచ్చు. కానీ వాడి నుండి పాటను వేరు చేయలేరు.
లేవాలి… వాడి పాట నిండా విషాదం… తెరలు తెరలుగా… పొరలు పొరలుగా… అలలు అలలుగా… అది విషాదమా? ఉన్మాదమా?
భరించలేకపోతున్నాడు విశ్వ. లేవాలి… తప్పదు.
ఇంకా కొంచెం సేపు వింటే ఆ వేదనకి తన గుండె బద్దలు అయిపోతుంది.
“ఆఆఆఆయ్ య్ య్”… కేక పెట్టి లేచాడు విశ్వ.
చుట్టూ చీకటి.
అది నల్లోడి నిశబ్దమా… మౌనమా?
ఏదైతేనేం… హాయిగా ఉంది.
***
ఉదయం లేచేసరికి నల్లోడు శవంలా నడుస్తూ తన మంచం చుట్టూ తిరుగుతున్నాడు. పాట కూడా తనని చిత్రవధ చేస్తున్నట్టు వినిపిస్తోంది.
కాఫీతో భార్య వచ్చింది. ఆమెకి నల్లోడి స్పృహ లేదు.
“నీకు నల్లోడు కనిపించట్లా?” కాఫీనో, భార్యనో అడిగాడు.
“మనకి ఇద్దరు పిల్లలు. ఒక పాప. ఒక బాబు. వాడు కొంచెం రంగు తక్కువ కానీ మరీ నల్లోడు, కర్రోడు అని పిలుచుకునే స్థాయికి కాదు. ఇంట్లో ఇంకెవరూ లేరు. మీరు డాక్టరు దగ్గరికి వెళ్లినట్టు లేరు… పొద్దుటే పిచ్చి మాటలు మొదలెట్టారు” అంది ఆమె విసుక్కుంటూ.
కాఫీ పూర్తయ్యాక చూస్తే నల్లోడు నడుచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయినట్టున్నాడు.
కాలేజికి లేటుగా వస్తానని ఫోను చేసి స్టూడియోకి వెళ్ళాడు విశ్వ. అది కలలో కనిపించిన స్టూడియోనే.
అతడికి మతి పోయే విషయం ఒకటి అక్కడ తటస్థించింది.
అక్కడ నిజంగానే నల్లోడు ఉన్నాడు. కానీ వాడు పాడటం లేదు. అక్కడ లైట్లు మోస్తున్నాడు. విశ్వని చూసి నవ్వాడు. కానీ వాడు ఆరిపోయినట్టు… లైటు వెలుగుతున్నట్టు ఉంది. పాట వినిపిస్తున్నట్టు ఉంది. ప్రతిభ కన్నీరు పెడుతుందో… కనిపించని కుట్రల…
అవును నల్లోడికి తనూ అన్యాయం చేసాడు. నల్లోడు పాడిన ఛానల్ లో తన బంధువు ఉన్నాడు. తాను తలచుకుంటే వాడికి న్యాయం చేయగలిగే వాడు. వాడు అడిగాడు కూడా. అయినా తను చెయ్యలేదు. నల్లోడు తన బంధువు కాదుగా. ఇంతేనా… న్యాయం చేయకపోతే అన్యాయమేనా? అన్యాయం పాపమా? ఆ పాపమే తనను కొట్టిందా? నువ్వు చేసిన పాప పుణ్యాలే నీకు తిరిగి వస్తాయి అని అన్వయం చేసుకుంటున్నాడా?
లేక నిజంగా పాపపుణ్యాలు ఉన్నాయా?
విశ్వకి తల తిరుగుతోంది…
మహాత్మా… మహర్షి…
***
“దీన్ని స్కిజోఫ్రినియా అంటారు. అంటే కలను నిజం అనుకోవడం. కలే నిజం అనుకోవడం. ఇవన్నీ స్కిజోఫ్రినియా లక్షణాలు. మీరేమీ కంగారు పడక్కర్లేదు. మీకు రాత్రి కలలోనే ఈ ఇబ్బంది ఉంది. ఉదయం పూట కొంచెం ఇబ్బంది ఉంది. పూర్తిగా భ్రమనే నిజం అనుకోవడం లేదు. ఈ వ్యాధి ముదిరితే భ్రమను నిజమని, నిజాన్ని భ్రమ అని అనుకోగలరు” అన్నాడు డాక్టరు.
“నాది కల కదా… భ్రమ కాదు కదా?”
“భ్రమే మీకు కల రూపంలో వస్తోంది. అది నిద్రతో ఆగిపోతే కలగా మిగిలిపోయేది. కానీ కొంతసేపయినా కంటిన్యూ అవుతుంది కాబట్టి భ్రమ అనే అనుకోవలసివస్తుంది” అన్నాడు డాక్టరు.
“ఒక వేళ కలే నిజమై నేను నిజం అనుకుంటున్నది భ్రమ అయితే?” ఆందోళనగా అడిగాడు విశ్వ.
డాక్టరు నవ్వాడు. “టెర్మినేటర్ 2 అని ఒక సినిమా వచ్చింది. అందులో శారాకానర్ అనే ఆవిడ కొడుకు జాన్ కానర్. వాడికి పదేళ్ళు. అయితే వాడు పెరిగి పెద్దయ్యాక వాడే మనుషుల తరుపున తెలివైన యంత్రాలతో పోరాడాలి.
ఈ జాన్ కానర్ అనే పిల్లవాడు యుద్ధం చేసేది 2030 తరువాత. కానీ అప్పటివరకు వాడు బతికి ఉండటం ఇష్టం లేక భవిష్యత్తునుండి ఓ యంత్రాన్ని అతడిని చంపడానికి పంపుతారు. దాన్ని ఆపడానికి ఆ పిల్లవాడు భవిష్యత్తు నుండి తనకు రక్ష ణగా ఓ టెర్మినేటర్ని పిలుచుకుంటాడు. అతడే ఆర్నాల్డ్. అయితే ఈ విషయం శారాకానర్ చెబితే ఆమెని క్రానిక్ స్కిజోఫ్రినిక్ అని పిచ్చాసుపత్రిలో ఉంచి డాక్టర్ సిల్బర్మెన్ అనే అతడు చికిత్స చేస్తూ ఉంటాడు… ఆమెకి వచ్చిన అను మానంలా ఉంది మీ అనుమానం”
పూర్తి చేసాక మళ్లీ నవ్వాడు డాక్టరు. ద్వైతం…
***
చుట్టూ నీళ్ళు… నీళ్ళలో నల్లాడి తండ్రి… కొట్టుకుపోతున్నాడు… అవును ఊరికొమ్మున ఉన్న వాగుకి వరద వచ్చింది. వరదలో నల్లాడి తండ్రి… గేదెను రక్షించడానికి పోయి వీడు కొట్టుకుపోతున్నాడు. ఎక్కడనుంచో వచ్చాడు విశ్వ తండ్రి.
నడుముకు చాంతాడు కట్టుకున్నాడు. చాంతాడు చెట్టుకు వేసాడు. పోటెత్తిన వాగులో దూకాడు. నల్లోడి బాబు కర్రోడు కొంచెం ఉంటే కొట్టుకుపోయేవాడే. వాడి ప్రాణం కాపాడాడు.
“దొరా… నువ్వు దేవుడివి” కర్రోడు దణ్ణం పెడుతున్నాడు.
ఛ… ఏంటి ఈ నీళ్ళు… వరద ఎక్కడినుంచి వచ్చింది… తన ముక్కులోకి నీళ్ళు… చచ్చిపోతాడా?
“దొరా… ఊళ్ళో నా బంధువులు ఎక్కువ… నన్ను కుర్చీలో కూచోమంటున్నారు…” కర్రోడు గేదేలా అరుస్తున్నాడు.
“లేదు… కుర్చీ నాదే… నీకు ఇవ్వను” నాన్న అంటున్నాడు.
“తమరు మంచోరా… చెడ్డోరా? వాగులో దూకి నా ప్రాణం కాపాడారు. కుర్చీకి అడ్డం తగులుతున్నారు” కర్రోడు నీలుగుతున్నాడు.
“అలా అర్ధం అయిపోతే ఇంకెందుకు కర్రోడా. ఒకసారి అర్ధం కానిది ఎప్పటికి కాదు”
కనిపించని నీళ్ళు కర్రోడిని కమ్ముతున్నాయి… కానీ చిత్రం, వాడి ప్రాణం పోవడం లేదు… వాడి పని గేదెల్ని మేపడం… ఇంకా మేపుతున్నాడు… గేదెలు పెరిగి ఏనుగులంత అయ్యాయి… అవి వాడిని చుట్టుముట్టాయి… నువ్వు మమ్మల్ని వదిలి కుర్చీలో కూచుంటే మమ్మల్నెవడు మేపుతాడురా… అన్నట్టు వాడిని అడ్డగిస్తున్నాయి… తన తండ్రి వాటి వెనుక చేరి నవ్వుతున్నాడు.
పోనీ… తండ్రి చేసిన అన్యాయం తన చెల్లెలికి శాపం అయిందా? ఇక్కడ తండ్రి పెద్ద చేప. కర్రోడు చిన్న చేప.
“అమ్మా…” అరిచి లేచి పోయాడు విశ్వ.
అతడి మంచం చుట్టూ ఏనుగుల్లా బలిసిన బర్రెలు తిరుగుతున్నాయి. కొంచెం ఉంటే తొక్కేసేవే.
గబుక్కున డాక్టరు ఇచ్చిన బిళ్ళ వేసుకొని నీళ్ళు తాగాడు విశ్వ.
చుట్టూ ఉన్న వరద నీళ్ళు. ఏనుగు బర్రెలు మాయం అయిపోయాయి.
ఇదేంటి… వెలుగే… కానీ మసగ్గా ఉండే… ఐటి కంపెనీ… తెలుస్తోంది…
ఎవరది… తన చెల్లెలే… ఎప్పుడో చనిపోయిందిగా… ఇంకా బతికే ఉన్నట్టు ఉందేంటి?
కాదు బతికే ఉంది… నడుస్తోంది… నవ్వుతోంది… పని చేస్తోంది… వాడెవడు… ఆమె టియల్? అవును పక్కన వాడేవాడు? యల్ 4 లెవెల్ లీడరనుకుంటా… ఇద్దరు ఒకే పని చేస్తున్నారు…
ఆమెను చెరో పక్క నుంచి ముద్దు పెట్టుకుంటున్నారు. చెల్లెలు ఇద్దర్నీ కొడుతోంది.
“ఏయ్… ఓవర్సీస్ వెళ్ళాలని లేదా?” యల్ 4 అంటున్నాడు.
“టీం లో ఉండాలని లేదా?” టీయల్ కాంతారావు అంటున్నాడు. అనటం కాదుగా బెదిరిస్తున్నాడు.
“ఏం కావాలి?” చెల్లెలు అడుగుతోంది.
“పని” యల్ 4 అంటున్నాడు.
“ముద్దు మీద ముద్దు పెట్టు.. అదే “పని”గా పెట్టు” అంటున్నాడు టీయల్ కాంతారావు.
చెల్లెలు తోసేసింది. పరిగెడుతోంది. చుట్టూ ఉన్న కొలీగ్స్ సిస్టమ్స్ మీద బిజీ… డెడ్ లైన్లు… కాల్స్…
చెల్లెలు అరుస్తూ పరిగెడుతోంది. ఎవరు పట్టించుకోరేం…
ఆమె బాల్కనీలోకి వచ్చింది.
“పట్టర పట్టు… హైలేస్సా… ఇదిగో పట్టు హైలేస్సా…” యల్ 4, టీ యల్ కాంతారావు ఆమెను చంకల్లో ఒకడు, కాళ్ళ దగ్గర ఒకడు పట్టుకుని పైనుంచి తోసేసారు.
ఆమె దబ్బున కింద పడింది.
“చెల్లీ…..” గావుకేక పెట్టి లేచాడు విశ్వ.
పక్కనే చెల్లి. రక్తం మడుగు గదినిండా.
“అన్నయ్యా… ఇది ప్రమాదమా?” అంటోంది చెల్లెలు
ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. అవి చూస్తున్నాయి.
టేబుల్ మీద డాక్టరు ఇచ్చిన టెర్మినేటర్ బిళ్ళలు చూస్తూ ఉన్నాయి.
***
ద్వైతం అంటే మధ్వాచార్యులవారు చెప్పిన ద్వైతం కాదు. హరి వేరు జీవుడు వేరు. జీవుడు తన ఉనికికి హరి మీద ఆధారపడి ఉన్నాడు అన్నారు వారు. అవే వేదాలు చదివి శంకరుల వారు జీవాత్మ పరమాత్మా ఒకటే అన్నారు.
మహాత్మా… మహర్షీ… ఏది సత్యం?! ఏది మిధ్య?!
సత్యం… మిధ్య… ఒకదాన్నొకటి టెర్మినేట్ చేసుకుంటాయి. కానీ ద్వైతం నిజం. మిధ్య … నిజం ఒకటి లేక మరొకటి లేవు.
తన కలలో దర్శించేదా? ఇలలో చూసేదా? ఏది సత్యం?
శారా కానర్ నిజం అనుకున్నది డాక్టరుకి మిధ్య.
భవిష్యత్తు నుండి టె ర్మినేటర్ రావడం అతడికి పిచ్చితనం… మిధ్య…
పిచ్చి ఎవరికో తెలీదు కానీ… టెర్మినేటర్ నిజం.
**** (*) ****
ప్రముఖ జర్మన్ రచయిత కాఫ్కా 1912లో రాసిన మెటా మార్ఫిసిస్ కథ చాలాకాలం క్రితం చదివాక అలాంటి కథ, ఆ స్థాయి కథ తెలుగులో చదవగలనా అనుకున్నాను.
ఈ టర్మినేటర్ చదివి ఆశ్చర్యపోయాను. తెలుగు రచయితలు ఇంత అధివాస్తవిక ధోరణి ఉన్నకథ రాయగలిగారా అని. అస్తిత్వవాద, సర్రియల్ ధోరణులతో కథ రాసిన కాఫ్కా ఎంతోమందికి గురువుగా వెలిగాడు. మార్కెవజ్ ఆయన వల్ల ప్రేరణ పొందిన వారిలో ప్రముఖుడు.
ఈ కథలో పోస్ట్ మోడరన్ పోకడలు మాజిక్ రియలిజం చ్చాయలు బాగా కనిపించాయి .
సేవలు చేసేవాళ్ళు బతకాలి. కానీ పదవులు పొందకూడదు. ఎదగకూడదు. కర్రి వాడి కథ. పెట్టుబడి లేని కులాల ప్రతిభ అసలు ప్రతిభే కాదు, నల్లోడి కథ. ఆడవాళ్ళని లైంగిక దోపిడి చేసినా పెట్టుబడి, కార్పొరేట్ పలుకుబడితో నిజం నోరు నొక్కవచ్చు, చెల్లి కథ.
భార్యలకు ప్రేమించే హృదయం ఉన్నప్పటికీ సమయం ఇవ్వని జీవితాలు.
ఎన్నిషేడ్స్!!!!!
దోపిడికి అంతం లేదు. పల్లెలో దోచేవాడిని పట్నం, ఒక్కవాడిని దోచేవాడిని,వాడి జీవితాన్ని కబళించే కార్పొరేట్, ఆడవాళ్ళని పనిచేయనిస్తూనే లైంగిక దోపిడికి దిగే పురుష ప్రపంచం…. ఇన్ని అంశాలు నీడల్లా వెంటాడే ప్రతీకల్లా చిత్రించిన ఈ కథ తెలుగు భాషలో ఎన్నడూ రాని, లేని ఓ కొత్త ఒరవడి.
దయ్యం1,2,డిసిప్లిలాంటి సెటైర్, సయ్యాట లాంటి ధ్రిల్లర్ రాసిన రచయిత ఇలాంటి మాజిక్రియలిజం కథ రాయడం నిజంగా బహుముఖ ప్రజ్ఞా ప్రకటనే.
ఎవరికీ అందనంత ఎత్తుకి రచయిత ఎదిగారు అని నా అభిప్రాయం
Superb narration and heart touching.
థాంక్స్ ఉమా గారు . థాంక్స్ పల్లవి గారు . మీ వంటి ఉత్తమ పాఠకులు ఉండటం అదృష్టం . ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన పాఠకులు నిజంగా అరుదే
the story highly shows the writer’s intellectualism. I’m happy that you didn’t ignore satire! the story might be short but its interpretation shall be in volumes!many issues can be discussed through terminator. absolutely loved reading it . Again…its a pleasure reading a different story from all other regular stories!
ఎక్స లెంట్ ………..ఒక మనోచిత్రాన్ని అక్షరాల్లో ఇమిడ్చిన నేర్పరితనం మీ కధలోనే ”’చూసాను”.చాలాసార్లు చదవాల్సిన , చదివి ఆలోచించాల్సిన మనోచిత్రణ ఇది .ఒక తూఫాన్ లా కమ్మేసింది మనసుని …..భాషలో ఇమడని దానిని వ్యక్త్తీకరించడం తేలిక కాదు ..కానీ మీరు చాలా విజయవంతం గా దానిని సాధ్యం చేశారు ….మరొకటి ఏమంటే ఇటువంటి దాన్ని రాశాక మనసు చాలాstrain కి గురి అవుతుంది . సునీల్ కుమార్ గారూ ఆయుష్మాన్ భవ …అద్భుతంగా రాశారు గాడ్ బ్లెస్ యూ
చాల కృతజ్ఞతలు భువన చంద్ర గారు …మీ అంతటి రచయితని ఈ కథ మెప్పించడం చాలా సంతోషం … ముఖ్యంగా మరో రచయితకి ప్రశంస ఇవ్వడం అనేది మీ విశాల హృదయాన్ని , మంచి సంస్కారాన్ని తెలియ చేస్తోంది …
ఇది ఒక మారు చదివితే అర్ధం అయ్యే కధ కాదు … తెలుగులో ఈ ప్రయోగం నాకు తెలిసి ఈ మధ్య కాలం లో ఎవరు చేయలేదు … అందుబాటులో లేని ప్రక్రియ కాబట్టి అందుకోవడం కష్టం కావచ్చు … ఐతే మీరు ప్రతిభాశాలి ఐన రచయిత కాబట్టి సునాయాసం గా పట్టుకున్నారు
మరో సారి మీకు , మీ లోని సాహితీ తృష్ణ కు నమో వాకాలు
సునీల్ గారూ . మరిన్ని కధల కోసం ఎదురు చూస్తా …వున్నది వున్నట్టు నిర్భయంగా రాస్తారు మీరు …ఆ నిజాయితీ లోనించి పుట్టే కధలకు ఒక కేరెక్టర్ సహజంగానే వొస్తుంది …….ఆ సహజత్వమే కాలానికి ఎదురు నిలిచేది ……ఆయుష్మాన్ భవ………… గాడ్ బ్లెస్ యు
చాలా బాధేసింది. ఒక మామూలు కథని విలక్షణంగా, వైవిధ్యంగా రాసి చాన్నాళ్ళు వెంటాడేట్లు చేసిన ఈ శైలి నిజంగా అద్భుతం. అభినందనలు సునీల్ కుమార్ గారూ…
సారీ సునీల్ గారూ… “మామూలు కథ” అనకూడదు …. “తెలిసిన కథ” ని అనాలి.
థాంక్స్ రాధ గారు… ఈ తరహా లో నేను రాసిన మొదటి కథ ఇది . మీకు నచ్చినందుకు సంతోషం …
Thanks Manasa Yendluri
భిన్న అంశాలను నిర్భీతిగా , అద్భుతంగా ఆవిష్కరించారు. అభినందనలు సునీల్ కుమార్ గారు.
చాలా కృతజ్ఞతలు యమున గారు …మీ అభినందనలే రచనలకు ఆలంబన …
సునీల్ గారికి,
నమస్తే.
కథ చదివి నేను కాసేపు చిత్రమైన ఆలోచనలకి లోనయ్యాను.
ప్రతి రోజు మనం అనేక సంఘటనలని చూస్తుంటాం… వుద్వేగ భరితమైనవి… భాధాకరమైనవి… తీవ్రమైన నిరాశని కలిగించేవి… వొక్క క్షణం పాటు మనం యివి యిలా జరగకుండా వుంటే బాగుండును అనుకుంటాం. జరగకుండా వుండటం యెలా అని ఆలోచిస్తాం. వీటిని మనం ఆపలేమా అని ప్రశ్నించుకుంటాం. అలా అనుకునే వాళ్ళు వారిదైన ధోరణిలో వ్యక్తపరచాలనుకుంటే, వారు చిత్రకారులైతే యీ మొత్తాన్ని చిత్రించాలని అనుకుంటే అతని వ్యక్తీకరణకి వారు యెంచుకునే రంగులు మనలో యెలాంటి impact ని కలిగిస్తాయనే దాని మీదే, ఆ చిత్రాన్ని వీలైనంత యెక్కువ మంది చూడాలనుకుంటామా లేదా అన్నది ఆధారపడి వుంటుంది. బలమైన ముద్ర వేస్తే ఆ చిత్రాన్ని మనం వొకరి నుంచి మరొకరికి చేరవేస్తుంటాం. మన ఆలోచనలకి చేరువగా అలా ఆలోచించే వారిని మనం పెంచుకొంటూ కలుపుకొంటుంటే మనకి వ్యాకులత కలిగించే విషయాలపై మరింత శక్తితో పనిచెయ్యవచ్చని ఆశిస్తాం.
అలా మీ కథని వీలైనంతమందికి అందించాలనిపిస్తుంది. అలా పని చెయ్య వచ్చుననిపిస్తుంది.
రచయితగా మీరు మీ అక్షరాలతో వొక శక్తివంతమైన చిత్రాన్ని అందించారు. బాల్జాక్ కాఫ్కా లాంటి ఆర్ధిక పరమైనవి మనుష్యులని మనుష్యులుగా వుండనివ్వని సమాజాన్ని, భయంకరమైన భయం మనుష్యులలో వుండే సమాజాన్ని మనం చూస్తాం. ప్రస్తుత సమాజం అనేక ఆర్ధిక, మానసిక భయాలతో నింపేస్తుంటే అవి చూస్తున్న వొక మీరు వొక రచయితగా అందించిన చిన్ని కథలో యీ నాటి సమాజపు వోవర్ వ్యూని కళాత్మకంగా సృజించారు. సమాజంలోని సంఘటనలని వొకదాన్నుంచి మరొకటి అల్లిన పద్దతిలోని వేగం వాటిలో వేదన మనసుల్లోకి అంతే వేగంగా చేరి మెలి పెడుతూ .గుంభనంగా ‘భళ్లు’ మన్నాయి. .
కథని చెప్పటానికి యెంచుకొన్న ఫాం కథని చక్కని యెత్తులో నిలబెట్టింది.
మీరు వాడిన similes యిప్పటి సమాజంలోవి. ఆసక్తి గా వున్నాయి.
టెర్మినేటర్ 2 ని భలే చెప్పారు.
మీ కథలంటే నాకు చాల యిష్టం. గౌరవం.
Thank you very much for the powerful story.
Thanks Padma garu