కబుర్లు

‘నువ్వు లేవు, నీ పాట ఉంది’ – తిలక్ జ్ఞాపకాలు

జనవరి 2016


“నేను ఒంటరిగా ఉన్న ఒక సామాన్య స్త్రీని. ఉద్యోగస్తురాలిని. దుర్భరమైన నా మనోవ్యథల్ని ఎదుర్కొనలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఫ్రెండు సుచిత్ర ‘చదువు, బాగుటుం’దని టేబులు మీద పెట్టిన మీ ‘అమృతం కురిసిన రాత్రి’ పేపరు కటింగు చూసి, కవితల మీద నాకున్న అభిలాషతో చదివాను. నన్నది నిజంగా బతికించింది. బతుకు మీద ఒక ఆశని పెంచింది. నాలో బతకాలనే ఉత్సాహాన్ని పెంచింది. నా నిరాశని తరిమింది. మీకు కృతజ్ఞతలు. మీ అడ్రసు మా ఫ్రెండు దగ్గర తీసుకున్నాను. ఈ ఉత్తరం మీకు చేరుతుందని ఆశిస్తున్నాను.”

“సుబ్బరాయ శాస్త్రీ, ఈ ఉత్తరం ఒక మధ్యాహ్నం పోస్టులో వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూశావా! నా కవిత ఒక ప్రాణాన్ని కాపాడటం. అక్షర రూప సాహిత్యంలో ఎంత మహత్తర శక్తి దాగి ఉందో, అది మనుషుల అంతరంగాన్ని ఎలా మేలుకొల్పగలదో” అన్నారు సాలోచనగా. అప్పటికే సాహిత్యరంగంలో తిలక్ సుప్రసిధ్ధ కవీ, కథకుడు. సాహిత్యరంగానికి బాగా తెలిసిన మా నాన్నగారి (ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి) ద్వారా ఆయన రచనల గురించి అప్పటికే బాగా విన్నాను. భారతిలో ఆయన కొన్ని రచనలు చదివి ఎంతో ఆనందించాను.

ఆ కాలంలో నేను ప.గో.జిల్లా తణుకులో పనిచేసేవాడిని. అక్కడి Z.P స్కూలులో శ్రీ ఏలూరిపాటి అనంతం గారు తెలుగు పండితులుగా పనిచేసేవారు. ఆయన కవి, మంచి వక్త. అంతే కాకుండా, ఆయన మా నాన్నగారి సాహిత్య మిత్రులు, మాకు కుటుంబ మిత్రులు కూడా. అనంతం గారి ఇంటికి దగ్గరలోనే తిలక్ గారి ఇల్లు. నా కోరిక మీద అనంతం తనకు కూడా మంచి మిత్రులయిన తిలక్ గారిని ఓ రోజు నాకు పరిచయం చేశారు. నా పేరూ, నాన్నగారి పేరూ విని, సంతోషంగా మా నాన్నగారు గోదావరి మీద రాసిన ఒక పద్యం వినిపించారు. “ఇది నాకు బాగా ఇష్టం. మీ నాన్నగారి రచనలన్నా నాకు అభిమానమేనయ్యా.” అన్నారు. పత్రికల్లో వచ్చే రచనల గురించి ముచ్చటించుకున్నాం. ప్రాచీన, ఆధునిక సాహిత్యాల మీద ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆయనది విశాల దృక్పధం. ఆయన ఏ వాదాలకు, ఇజాలకు పరిమితం కాని రచయిత. దేశ, విదేశాలలో వస్తున్న మార్పులను, సహజ పరిణామాలను జాగ్రత్తగా గమనించే వ్యక్తి అనిపించింది. ఆయన అభిప్రాయాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి.

మాటల మధ్య అనంతం గారితో- “ఇవాళ పత్రికలో ఒక MLC విద్యావిధానం, అభిరుచుల మీద చాలా హాస్యాస్పదంగా ప్రసంగించారు. విద్యా విషయంలో, అభిరుచిని పెంచే విషయంలో తగిన వాళ్ళతో చర్చించకుండా, అవగాహన లేకుండా మాట్లాడారు. ఇది చూసి భరించ లేక, నేనే MLCగా నిలబడాలని ఉంది. సరైన విద్యకీ, అభిరుచికీ ఎంత దూరమై పొతున్నామో ఈ అనవసర రాజకీయ జోక్యం వల్ల. నేను MLC నై, వీరి అజ్ఞానం తెస్తున్న ప్రమాదాలను తెలియజేస్తాను. ఏమంటారు?” అన్నారు నవ్వుతూ, కుతూహలంగా. అనంతం గారు ఆయన ఉత్సాహాన్ని గుర్తించి, చిరునవ్వుతో “తిలక్ గారూ! ఇది మన కంఠశోషగానే మిగిలిపోతుంది. ఆ దారి వేరు, ఆ తీరు వేరు. అది మీ దారి కాదు. మీ బాధ నాకు తెలుసు. మీరు మీ రసప్రపంచం నుంచి దారి తప్పటం మాకిష్టం లేదండీ.” అన్నారు. దానికి తిలక్ “అంతేనంటారా” అంటూ నవ్వేశారు. అలా నవ్వుకొని లేస్తుండగా, “శాస్త్రీ, మనం తరుచు కలుస్తూ ఉండాలి. ఇక్కడే ఉన్నావు గదా. ఇలా సాహిత్య మిత్రులం కలుస్తూ ఉంటే, చాలా బాగుంటుంది సుమా!” అన్నారు.

తిలక్ స్వయంగా తన కవితల్ని చక్కగా చదివి వినిపించేవారు. కవితతోపాటు ఆయన రాసే సమయంలో ఆయన పొందిన హృదయస్పందన, ఉద్విగ్నత, కళ్ళారా చూడగలిగేవాణ్ణి. అది అపూర్వ అవకాశంగా నేను భావిస్తాను. ఆ కవితలుగాని, అందులోని పంక్తులనుగాని ఇక్కడ ఉదహరించటం లేదు. అవి సాహిత్య పాఠకులకు బాగా తెలిసినవే. ఈ జ్ఞాపకాలు రాయటంలో నా లక్ష్యం వ్యక్తిగా తిలక్ స్నేహాన్ని, హృదయానుభూతులను మీతో పంచుకోవటం మాత్రమే.

ఒక రాత్రి హోటల్‌లో భోజనానంతరం ఆయన ఇంటికి వెళ్ళాను. టైము తొమ్మిదవుతోంది. నన్ను దూరం నుంచి చూసి, ఆయన శ్రీమతి ఇందిర గారు “అదిగో, మీ ప్రియ మిత్రుడు సుబ్బరాయ శాస్త్రి వస్తున్నాడు” అన్నారు నవ్వుతూ. “శాస్త్రీ, వచ్చావా, బాగుంది. మనం కలిసి వారం అయిందనుకుంటాను. నా కార్డు అందిందా? నువ్వు నాకు బాగా దగ్గరివాడవయ్యావు. అందుకే చూడాలనిపించి కార్డు రాసి, వేశాను.” అన్నారు. దానికి నేను “ప్రైవేటు ఉద్యోగం గదా. రావాలన్నా వీలు కాలేదు. ఈ సాహిత్య జీవులకు ఇటువంటి ఉద్యోగం పంజరమేగాని, మధ్యతరగతి అవసరాలకు ఇది తప్పదు గదా” అన్నాను. “నిజం, నిజం” అని నవ్వుతూ, “అందుకే ఉత్సాహానికీ, ఉల్లాసానికీ నిన్ను నా దగ్గరకి రమ్మనమంటాను, రప్పిస్తాను” అన్నారు అభిమానంగా.

ఆయన గదిలో కిటికీలు తెరిచి వున్నాయి. వీధిలో సందడి. గదిలో నిశ్శబ్దం. ఇంట్లోని చెట్ల మీద నుంచి వచ్చే చల్లని గాలి నైట్ క్వీన్ పూల పరిమళాల్ని మోసుకువస్తోంది. అప్రయత్నంగా నా మనస్సులో తిలక్ కవితలోని ఒక వాక్యం మెదిలింది – “ఈ గది స్వప్నాలతో నిండిపోయింది.” ఎప్పుడు ఎక్కడ చదివానో గుర్తులేదు. ఆ సమయంలో ఆయన పుస్తకాల రేక్ నుంచి ఒక ఫైలు తీసి, నాకు దగ్గరగా తన వాలు కుర్చీ జరుపుకుని, “శాస్త్రీ, ఈ కవిత శీర్షిక ‘నువ్వు లేవు, నీ పాట ఉందీ. ఇది నువ్వు వినాలి” అని రసరమ్యంగా చదివి వినిపించారు. “చాలా బాగుంది. ఈ కవితలో ఆమె లేకపోయినా, ఆమె పాట ఉందన్నారు. ఈ కవిత విన్నాక, మీ గుండెలోతుల్ని తాకిన ఆమె గురించి వినాలని ఉంది. మీ దగ్గర ఉన్న స్వతంత్రం వల్ల ఇలా అడుగుతున్నాను. అభ్యంతరం లేకపోతే చెప్పండి” అన్నాను.

దానికాయన, “ఆ అమ్మాయి మాకు తెలుసు. దీపం లాంటి రూపం. చక్కని కంఠస్వరం. నేనన్నా, నా మాటలన్నా చాలా అభిమానం. తనకి పాటలంటే ప్రాణం. నాకు ఆ అమ్మాయి పాట వినటం గొప్ప అనుభవం. ఏ పాట పాడినా ఆ పాటలోని భావం, స్వరమాధుర్యం హృదయాన్ని కదిలించేది. కవిని గనుక, నా మనస్సు సుందర స్వప్నాల్ని ఆవిష్కరించేది. పరిమళ భరితమైన పూల వాసనలు హృదయాన్ని ఆవరించుకుని అనిర్వచనీయమైన హాయిని అందించేవి. మంచి యౌవనదశలో ఆమె హఠాత్తుగా పోయింది. మేము చాలా బాధపడ్డాము. నాలోని భావప్రపంచం ఒక్కసారి చలించిపోయింది. ఆ ఉద్విగ్న మనస్థితి నుంచి ఈ కవిత వచ్చింది.” అన్నారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు ఆ కవితలో ఒక తీవ్ర వేదనా, సాంత్వనా రెండూ కనిపించాయి.

తిలక్ తన సంభాషణలలో ప్రాచీన సాహిత్యంలో పాండురంగ మహత్మ్యం, పోతన భాగవతం, పింగళి సూరన కళా పూర్ణోదయం ఇవన్నీ తన కిష్టమైన పుస్తకాలని చెప్పేవారు. “తెనాలి రామకృష్ణుని శైలి, ఊహా వైభవం, కథా కథన శిల్పం నాకు నచ్చాయి. పోతనగారి శైలిలోని ప్రసన్నత, ఆర్ద్రమైన భక్తి నాకు నచ్చుతాయి. అలాగే, పింగళి సూరన కొత్త కథా వస్తువుని ఎన్నుకుని ప్రబంధ రచన సాగించాడు. ఆ చొరవ బాగుందనిపిస్తుంది.” అని చెప్పేవారు.
ఆంగ్ల సాహిత్యానికి వస్తే, కవిత్వంలో షెల్లీ, కీట్సు, కథల్లో వర్జీనియా ఉల్ఫు, సోమర్‌సెట్ మాం, మపాసా, నాటకాలలో బెర్నార్డు షా, ఇప్సెన్, ఆస్కార్ వైల్డు మొదలైన ప్రముఖ కవులూ, రచయితల గురించి, వారి ప్రత్యేకతల గురించి, ప్రతిభ గురించి చాలా ఆసక్తికరంగా చెప్పేవారు. ఆంగ్లంలో కొన్ని ప్రసిధ్ధ రచనలు నాకిచ్చి చదవమని చెప్పేవారు. నా రచనలు వినిపిస్తే, విని ఆనందించేవారు. మంచి సూచనలు చేసేవారు.

సాహిత్య వ్యాసంగంలో ఉన్న వ్యక్తికి చక్కని లోక పరిశీలన, అవగాహన, ఉత్తమ సాహిత్య అధ్యయనం, స్వీయ దృక్పధం, సంస్కారంతో కూడిన విశాల బుధ్ధి ఎంతో అవసరం. సాహిత్య వేత్తల సహవాసం, సాహిత్య గోష్ఠులు కూడా రచయిత ఎదగటానికి దోహదం చేస్తాయని అనేవారు. ఆ రోజుల్లో వచ్చే మంచి రచనలన్నిటినీ శ్రధ్ధగా చదివేవారు.

తెలుగు భాష మీద, భాగవతం మీద ఆసక్తి, అభిమానం వారి అమ్మగారివల్ల ఏర్పడిందని చెప్పారు. తిలక్ తండ్రిగారు ఆస్తిపరులు. ఆయన ఆ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండేవారు. కాని, తిలక్ సాహిత్య వ్యాసంగం మీద ఆయనకు ఆదరం, అభిమానం ఉండేవట. ఒకసారి తిలక్ పనిమీద బాంబే వెళ్ళినప్పుడు, చాలా మంచి పుస్తకాలెన్నిటినో ఒక బుక్ షాపులో ఆర్డరు చేసి, ఇంటి అడ్రసుకి పంపమని చెప్పి వచ్చేశారు. ఇంటికి అది పెద్ద పార్సెలుగా వచ్చింది. వారిది ఉమ్మడి కుటుంబం. నాన్నగారు ఏమంటారోనని భయపడ్డారటగాని, ఆయన సంతోషంగా దానిని విడిపించి ఇచ్చారట. “ఈ విషయంలో ఆయన్ని బాగా తలుచుకుంటాను.” అని చెప్పారు. ఈ విషయం నేను మా తమ్ముడు శ్రీకాంత శర్మ ద్వారా విన్నాను.

ఒక ఆదివారం ఉదయం పది గంటల వేళ ఆయనని కలవటానికి వెళ్ళాను. ఆయన వాళ్ళ ముందు గదిలో కూర్చుని పేపరు చూస్తున్నారు. “ఎలా ఉన్నారు? ఏమిటి విశేషాలు?” అంటూ ప్రవేశించాను. “రా, రా, సంతోషం” అంటూ కుశల ప్రశ్నలు వేసి కూర్చోమన్నారు. “నువ్వు విశేషాలు చెప్పమన్నావు గదా, నిజంగానే జరిగిన ఒక విశేషం చెబుతున్నాను, విను” అంటూ మొదలు పెట్టారు. “ఈ మధ్యనే ఒక సాహిత్య సభకి నన్ను ఉపన్యాసానికి పిలిచారు. అక్కడ నా ఉపన్యాసం బాగుందని సభ్యులూ, ఆక్కడి సాహిత్య మిత్రులూ సంతోషించారు. వేదిక దిగి, నా దగ్గర ఉన్న మిత్రులతో మామూలుగా మాట్లడుతున్నాను. నాకు కొంచెం దూరంలో, సామాన్యమైన దుస్తులలో ఒకాయన నించుని నాకేసి చూస్తున్నాడు. మాట్లాడాలని కాబోలు, రావటానికి సందేహిస్తున్నాడు. ముఖం మాత్రం చాలా హుందాగా, సంస్కారవంతంగా ఉంది. మిత్రులకి చెప్పి, నేనే వెళ్ళి ఆ మధ్య వయస్కుణ్ణి “ఎవరండీ మీరు?” అని స్నేహపూర్వకంగా పకరించాను. ఆయన సంతోషించి, “నా పేరు మూర్తి అంటారు. మీ ఉపన్యాసంలో చెప్పిన ‘జీవితం’ అనే కథ నేను చదివానండీ, పత్రికలో. మీరే ఆ బాలగంగాధర తిలక్ అని ఈ సభకు వచ్చిన నా స్నేహితుని ద్వారా తెలుసుకున్నాను. అక్షరాలా అలాగే నా జీవితంలో జరిగింది. నేను పత్రికలలో వచ్చే కథలు చదువుతూ ఉంటాను. కథలంటే ఇష్టం. మీ ఉపన్యాసంలో ఈ కథ గురించి విని, ఈ విషయం చెప్పాలనిపించి ఇక్కడ నించున్నాను. నమస్కారం. ఉంటాను.” అని చెప్పి వెళ్ళిపోయాడు. శాస్త్రీ, ఆ అపరిచితుడు మూర్తి కళ్ళలో ఎంత కృతజ్ఞతని, అభినందనని చూసాను! నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను. కథా రచనలో కొంత జీవితంలోని యదార్థం, కథకుని కల్పనా, అతని అవగాహనా ఉండటం మంచి కథకు సహజం. అక్షరాలా అలాగే జీవితంలో సంభవించటం, ఆ వ్యక్తి తనను కలిసి ఆ సంగతి చెప్పటం, ఎంత కదిలిస్తుందో ఆ రచయితని. ఇంతకు మించిన విశేషం ఉందా” అని నాకేసి చూశారు ఎంతో సంతోషంగా, తృప్తిగా.

సంభాషణల్లో భాగంగా తిలక్ ఒకసారి తన ఉద్యోగ ప్రయత్నాల గురించి ఇలా చెప్పారు.

“నేను సుదీర్ఘమైన అనారోగ్యం వల్ల మంచం మీద ఏళ్ళ తరబడి ఉండటం, సాహిత్య వ్యాసంగంలోనే గడపటం జరిగింది. నాకూ అందరిలా నాకు సరిపడే ఉద్యోగం చెయ్యాలని చాలా కోరిక ఉండేది. AIRలో ఒకసారి ప్రకటన చూసి, అప్లై చేసి, ఇంటర్వ్యూకి పిలిస్తే, హైదరాబాద్ టిప్‌టాప్‌గా తయారయి వెళ్ళాను. ఆప్పుడు హైదరాబాద్ AIRలో కృష్ణశాస్త్రి గారు పనిచేస్తున్నారు. నాకూ, ఆయనకూ మంచి స్నేహం ఉండేది. ఇంటర్వ్యూకి ఇంకా కొంచెం టైం ఉండటంతో, కృష్ణశాస్త్రి గారిని ఆయన ఆఫీసు రూములో కలిశాను. ఆయన నన్ను చూసి సంతోషించి, కొంచెం పరకాయించి చూస్తూ, “ఏమిటి విశేషం, నువ్వు ఇక్కడ?” అన్నారు. ఆయనతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పాక, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పాను. ఆయన పకాలున నవ్వి, “నిన్ను చూస్తే ఉద్యోగానికి వచ్చావనుకోరు, నువ్వే ఉద్యోగం ఇవ్వగలవన్నంత దర్జాగా వచ్చావు. శెభాష్!” అని హాస్యమాడారు. ఆ ఉద్యోగం నిజంగానే రాలేదు. అంతటితో ఆ ఉద్యోగ ప్రయత్నమూ ముగిసిందనుకో. అదీ నా ఉద్యోగం ముచ్చట.” అది విని నేనూ నవ్వాను అప్రయత్నంగా.

తిలక్ గారి స్నేహం తలుచుకోగానే మనసులో ఎన్నో జ్ఞాపకాలు మెదులుతాయి. వాటిలో కొన్నిటిని మీతో పంచుకోగలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది.

**** (*) ****5 Responses to ‘నువ్వు లేవు, నీ పాట ఉంది’ – తిలక్ జ్ఞాపకాలు

 1. కె.కె. రామయ్య
  January 1, 2016 at 1:43 pm

  శ్రీ ఇంద్రగంటి సుబ్బరాయ శాస్త్రి గారికి నమస్సులు. తిలక్ గారి జ్ఞాపకాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

  మా చిన్నప్పుడు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ పుస్తకాలు మిత్రులకు బంధువులకు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం ( ఎవరైనా అమాయకప్రాణులు అవకాశం ఇస్తే ఇప్పటికీ ఇవ్వాలనే ఉబలాటం ). బందరు (మచిలీపట్నం) లో కలెక్టర్ గా పనిచేసి ఎంతో మంచి పేరుతెచ్చుకున్న శ్రీమతి లక్ష్మీ పార్థసారధి గారు జనవరి నెలలో విజయవాడలో జరిగే పుస్తకవారోత్సవం ఒకదానిలో చేసిన ప్రసంగంలో వారు తిలక్ గారి తమ్ముడు (లేదూ అన్నయ్య గారి) అమ్మాయి అని తెలిసింది. బారిష్టర్ పార్వతీశం పుస్తకం ఆవిష్కరణ, బాపు, రమణల చేతిమీదుగా జరిగిందా సందర్భంలో. తిలక్ గారి రచనలు కినిగే వెబ్ పబ్లిషింగ్ లో ఈ-పుస్తకాలు గా తీసుకొచ్చిన ప్రయత్నంలో ( నేనూ జొరబడి ) తిలక్ గారి అబ్బాయి (లండన్ లో ఉంటున్న డా. సుబ్బారావు గారి ) పరిచయం (ఇంటర్నెట్ ద్వారా) చేసుకుని వారి సమ్మతి తీసుకోవటం జరిగింది. తిలక్ గారితో తమకున్న ప్రత్యక్ష పరిచయం, వారి కవితా సౌరభాల వివరాల గురించి త్రిపుర గారి ఆప్తమిత్ర శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారి నోట వినే భాగ్యం కూడా కలిగింది. స్వోత్కర్శలతో కూడిన ఇంత అధికప్రసంగాన్ని మరొక్క మాటతో ముగిస్తా, తిలక్ కధలు, కవిత్వమూ నేనెరిగిన ఎందరి గుండెలనో ఏవేవో ఉన్నతోన్నతమైన భావోద్వేగాలతో నింపిందని అనుకుంటున్నా ( వాటిలో కొన్నైనా ఆచరించ గలిగామా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే ).

 2. తల్లాప్రగడ మధుసూదనరావు
  January 4, 2016 at 7:08 am

  1961 -62 ప్రాంతంలో తణుకులో తిలక్ గారితో మీ పరిచయం వారి వ్యక్తిత్వ విశేషాలూ చదివాను. నేను తణుకు వాసిని కావడం వారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది.
  మీర చాల చక్కగా వారి జ్ఞాపకాలను అందరికి పంచినందులకు ధన్యవాదాలు. మీరు తణుకులో పనిచేస్తున్నప్పుడు మనిద్దరికీ ఉన్న కొద్ది పరిచయం ఈ సందర్భంలో గుర్తుకు వచ్చింది. ఎప్పటి కాలం మాట? ఏభై నాలుగేళ్లకు పూర్వం.
  మధుసూదనరావు తల్లాప్రగడ
  మెల్ బోర్న్

 3. కె.కె. రామయ్య
  January 5, 2016 at 10:22 am

  తిలక్ గారి పట్ల, తిలక్ సాహిత్యంతో పట్ల తనకున్న అభిమానాన్ని, చిన్నప్పుడు తణుకులో తను ఒక సంవత్సరం ఏడవ తరగతి చదివిన విషయాన్ని స్మరించుకున్నారు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారు; శ్రీ ఇంద్రగంటి సుబ్బరాయ శాస్త్రి గారి ఈ వ్యాసాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు.

 4. Bhasker
  January 7, 2016 at 5:12 am

  బావుంది. తిలక్ రచనలంత అందంగా ఉంది.
  భాస్కర్.

 5. January 12, 2016 at 2:43 pm

  తిలక్ గారితో మీ అనుభవాలని ఇలా పంచుకోవడం ద్వారా అయన గురించి తెలుసుకునే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)