‘ అరవింద్ చామర్తి ’ రచనలు

తిరుగు ప్రయాణం

రిక్షావాడు లాగలేకపోతున్నాడు
నేనూ, నా ఊపిరీ
రిక్షాలో…

గోడ మొహం అటు తిప్పుకుంది
ఎప్పటిలాగే
ఈసారి తప్పకుండా వస్తానంటే నమ్మటం లేదు!

సూట్కేస్ నిండుగా ఉంది
సున్నుండలూ, చేగోడీలూ…
ఆశీస్సులూ…
అమ్మ నేనిచ్చిన ఉచిత సలహాల్ని కూడా సర్దేసింది.

గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ బయలుదేరా…
ఉన్న బెలూన్లోనుంచి గాలి తీసి ఇంకో బెలూన్లో ఊపిరులూదాలని…
ఎంతటి వ్యర్థ ప్రయత్నం!?

నింగిలో శాటిలైట్ దీనంగా చూస్తోంది…
ఎగిరినప్పుడున్న సరదా ఇప్పుడు లేదు
ఎందుకు ఎగిరానో దానికి కూడా తెలీదు…
ఇప్పుడు భూమిని చూస్తూ ప్రదక్షిణలే మిగిలాయి.