‘ పి. అనుదీప్ ’ రచనలు

కొన్ని కన్నీళ్ళు

26-జూలై-2013


కొన్ని కన్నీళ్ళు

ఇప్పుడు కాస్తంత దు:ఖం కావాలి!
పుడమితల్లి పేగు కొసను తెగ్గొట్టే ఉమ్మనీటి ఉప్పెన రావాలి.
పైరు పసికందై గుప్పిట్లో మొలకనవ్వులు చిందాలి.
వాడిన వాగుల్లో నీటివాలు అలలపూలు పూయాలి.
మబ్బుగొడుగు పట్టి ఆకాశం వేడెక్కిన పరిగ వెన్ను తట్టాలి.
వానవిల్లు ఎక్కుపెట్టి మేఘం
నది నడుము(మ)ను గిలిగింతలు పెట్టాలి.
కడగళ్ళ వాకిళ్ళను కడిగేసి వడగళ్ళ ముగ్గులెట్టాలి.
కాలిలో ముల్లుకి కంట ఒలికే నీరులా
కర్షకుడి బాధకి కారుమబ్బు కన్నీళ్ళు చిలకాలి.
ఇప్పుడు దు:ఖాశ్రువు పాశుపతాస్త్రమై
కరువుసీమ లో కలిమి గంగను వెలికి తీయాలి.
ఇప్పుడు మరింత  దు:ఖం కావాలి!


పూర్తిగా »