కథ

చెదిరిన ప్రతిబింబం

ఫిబ్రవరి 2016

“హలో రాధికా, రేపటి డిన్నర్ మా ఇంట్లోనే అని గుర్తుందిగా? ప్రతిమకీ గుర్తు చేశాను. ‘వాట్ ఈజ్ యువర్ పాయిసన్!’ అని నిన్ను అడగక్కరలేదుగా! వోడ్కా, ఆరెంజ్ జ్యూసేనా?” నిన్న సాయంత్రం రేణుక ఫోన్.ఈ మధ్య ఇంగ్లీష్ తెగ వాడుతోందే! కాక్‌టెయిల్స్ గురించి కూడా బట్టీ పట్టినట్టుంది.నిజం చెప్పాలంటే, ఈ నెలవారీ డిన్నర్ల ఏర్పాటు గురించి ఆఫీసు పనుల్లో పడి మరిచేపోయాను. అలా అని ఒప్పుకోడానికి సిగ్గేసి,
“ఆ, గుర్తుందిలే. ఏదన్నా వండి తీసుకు రమ్మన్నావా?” ఫార్మాలిటీ పూర్తి చేస్తూ అడిగాను.“నిన్ను నువ్వు తెచ్చుకో, చాలు. వండడానికి రామూ ఉన్నాడు.”- రక్షించింది. మా ఆయన విక్రమ్ అయితే,
”మనమే వంటకాలు పట్టికెళ్తే, మరి వాళ్ళింట్లో డిన్నరేమిటింక! నా మొహం.” అని విసుక్కుంటాడు.ప్రతిమకి ఫోన్ చేసాను.“మూడు రోజుల తరువాత రేణుక పుట్టినరోజు. మనందరికీ ఆఫీసుంటుంది కదా అని, పనిలో పనిగా ఆదివారమే పిలిచిందంతే.“ అంది.నాకున్న మతిమరపుతో, “ఓహో, తన పుట్టినరోజా!”-అనబోయి, నాలుక్కరచుకుని,
“గిఫ్టేం కొంటున్నావు?” అడిగాను.“బాబోయ్, తనకి గిఫ్టు కొనడమా! కిందటిసారి నేను సిల్కు చీర కొన్నానా? ఎంత శ్రద్ధగా ఎంచి మరీ కొన్నాను! బాగుందని కానీ థేంక్సు చెప్పడం కానీ లేకపోగా, ఈనాటివరకూ దాని ఊసే ఎత్తలేదు. తనకి ఆ మర్యాదలు తెలిస్తే కదా? ఇంటికి పనికొచ్చే వస్తువేదో తీసుకెళ్తే సరిపోతుంది. నువ్వూ అలాంటిదే ఏదో కొనియ్యి.”- సలహా పడేసింది.

అదీ నిజమే. ఎవరైనా పుట్టినరోజుకో దేనికో పిలిస్తే, రేణుక చేసేది మహా అయితే ఏమిటి? ఏ పదేళ్ళకిందటో కొని, నచ్చక, ఇంట్లో పడేసిన డైనింగ్ టేబిల్ మాట్సో- ఎవరో, ఎప్పుడో తనకి గిఫ్టుగా ఇచ్చిన కుర్తా బట్టనో ఇస్త్రీ చేసి, రిసైకిల్ చేయడమేగా! పోయినసారి నేను తనకి గిఫ్ట్ చేసిన ఫుల్కారీ స్టోల్ గురించిన ప్రసక్తి ఇప్పటివరకూ తేనేలేదు.

పుట్టి పెరిగిన తన బాక్‌గ్రౌండుని, పెళ్ళయి ఇన్నాళ్ళయినా వదిలిపెట్టలేకపోతోందేమిటో మనిషి!

“ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో, ఈ ఊరికీ ఆ ఊరంతే దూరం.”నన్ను నేను సమర్థించుకుటూ, లోకల్ మార్కెట్లో ఉన్న గిఫ్టు ఎంపోరియమ్‌కి వెళ్ళి, ఏడు రాజస్థానీ భరిణలున్న సెట్టు కొని పాక్ చేయించాను.

***

చెప్పుకోడానికి రేణుకది పంచ్‌షీల్ ఎంక్లేవ్‌లో పెద్ద ఇల్లు. భర్త రాజీవుకి తల్లి కట్టించిన అంత పెద్దింటినీ మెయింటైన్ చేసే స్థోమత లేనప్పటికీ, ఒక్క పనిమనిషిని మాత్రమే పెట్టుకుంటే సాగే పని కాదు. మూడంతస్థుల సర్వెంటు క్వార్టరులో వంట చేసే రామూ, అంట్లూ మిగతా పనులూ చేసే వేరే మనిషీ ఉంటారు. ఈకాలంలో కూడా బట్టలుతకడానికి చాకలొకడు మళ్ళీ.

అదంతా పక్కన పెడితే, వాళ్ళ లివింగ్ రూమ్ సదుపాయంగా అనిపించదు. ఇంటిని ఎలా అలంకరించుకోవాలో చెప్పే పుస్తకాలు తెగ చదువుతుంది రేణుక. అలాంటి టివి షోలు చూస్తుంది. లాభం ఉంటే కదా? ఇల్లు చెల్లాచెదురుగానే పడుంటుంది. వాళ్ళ వాష్ రూమ్ ఉపయోగించుకోవాలన్నా, మొహమాటం వేస్తుంది. ఎందుకో కానీ మొక్కుబడి తీర్చుకున్నట్టనిపిస్తుంది తప్ప, స్నేహితులని కలుసుకున్నామన్న సంతోషం కలగదు నాకు.

విక్రమ్, నేనూ- రేణుక ఇంటికి చేరేటప్పటికి ఏడున్నర దాటింది. అప్పటికే ప్రతిమా, భర్త శేఖరూ వచ్చున్నారు. ఎదురుగా కుడిమూల శేఖరూ, రాజీవూ కూర్చున్న వైపుకి విక్రమ్ కూడా దారి తీసాడు. ఎడంవైపు, విడిగా ఒక్కర్తే కూర్చున్న రేణుక దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని,
“అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు“ -చెప్తూ, గిఫ్ట్ రాప్ చేసున్న పాకెట్ చేతికందించాను. “అరే, దీని అవసరం ఏముంది? నా పుట్టినరోజుకింకా టైముందిగా!” అన్న మాటలు ఊడిపడవని ఎలాగూ తెలుసు. చిరునవ్వులోకూడా పిసినారితనం చూపిస్తూ, ఏ మాటా ఆడకుండా పాకెట్ అందుకుని, పక్కనున్న టేబిల్ మీద పెట్టింది.

మొహంమీద తన రంగుకి మాచ్ అవని ఫౌండేషన్ ఎప్పటిలాగానే, చారలు కట్టి ఉంది. చామనఛాయకన్నా తక్కువైన మనిషి పెదాలమీద అతి లేత గులాబీ రంగు లిప్‌స్టిక్కూ, అరిగిన హవాయి చెప్పులూ. జిడ్డుగా ఉన్న జుత్తుని రబ్బర్ బాండుతో కట్టుకుంది. ఏ పదేళ్ళకిందటో కుట్టించుకున్న, వెలిసిన సల్వార్ కమీజు. కనీసం ఇంటికి నలుగురు వచ్చినప్పుడైనా తయారవాలనిపించదేమిటో!

ఇటువైపు సోఫాలో కూర్చున్న ప్రతిమని, “ఎంత సేపైంది వచ్చి?” అడుగుతూ, తన పక్కనే కూలబడ్డాను.

“ఇప్పుడేలే. పది నిముషాలయింది.” పక్కకి జరిగింది కూర్చోడానికి చోటిస్తూ.

“రేణుకా, నువ్వూ ఇక్కడికే రా. చాలా దూరంగా ఉన్నావు.” పిలిచాను.

“వంటింట్లోకి వస్తూ, పోతూ ఉండాలి. ఇక్కడ సరిగ్గానే ఉంది.” ఠపాల్మని, కరుకైన సమాధానం వచ్చింది.

ప్రతిమా, నేనూ మాటల్లో పడ్డాం. రాజీవ్ వచ్చి బీరు బాటిల్స్ తెరిచి మూడు మగ్గుల్లో పోస్తున్నాడు.

పక్కన పెట్టిన స్నాక్స్ నములుతూ, తన పెప్సీ తాగుతూ, “రాధికా, అన్నట్టు నీ డ్రింకేదీ?” ప్రతిమ అడిగింది.

‘ఏమో’ అన్నట్టు భుజాలెగరేసి, పెదాలు విరిచాను.

“ఆడవాళ్ళు తాగడం అన్న ఈ కాన్సెప్టుందే! ఇది బ్రిటిష్ వాళ్ళు మనకి వదిలి వెళ్ళిన దురలవాటు. తాగే ఆడవాళ్ళంటే ఎంత చిరాకో నాకు. కంపరం వేస్తుంది.” ఆవరించుకున్న నిశ్శబ్దం మధ్య బాంబు పడినట్టు, రేణుక మాటలు. ఇద్దరం తన వంక చూశాం. ఆ మూల దూరంగా కూర్చుని, రాజకీయాలు మాట్లాడుకుంటున్న మగవాళ్ళకి ఆ మాటలు వినిపించలేదు కాబోలు. ఇటువైపు కూడా తిరిగి చూడలేదు.

గుండెల్లో, ఏదో లోతుగా గుచ్చుకున్న ఫీలింగ్. అప్పటికప్పుడు లేచి, బయటకి నడుద్దామనిపించింది. నా మొహం చూస్తూనే అర్థం అయినట్టుంది ప్రతిమకి.

“బ్రిటిష్ వాళ్లనెందుకు ఆడిపోసుకోవడం? వాళ్ళు రాక మునుపే, పల్లెల్లో పొలం పనులు చేసుకునే ఆడవాళ్ళు తాగేవారు, ఇప్పటికీ తాగుతున్నారు. జమీందారీ కుటుంబాల్లోనూ తాగేవారు. బ్రిటిష్ అనీ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అనీ వాళ్ళ మీద నేరం మోపేసి, జస్టిఫై చేయడంలో అర్థం కనిపించడం లేదు. మా బెంగాలీలలో ఆడవాళ్ళు తాగుతారే మరి! నాకయితే ఒక చుక్క నోట్లోకి వెళ్ళటంతోనే చెవుల్లో, కళ్ళల్లో మంటలు మొదలెడతాయని ముట్టుకోను. మరి మీ పంజాబీ ఆడవాళ్ళ సంగతి మాట్లాడవేం? సందర్భం దొరకాలి తప్ప, అవకాశం వదులుకునేదెప్పుడు? తాగడంలో అందరికీ ముందే ఉంటారుగా!” ప్రతిమ కౌంటర్ ఎటాక్ వినిపిస్తూనే ఉంది.

తల భారం అవడం తెలుస్తోంది.

‘నేను తాగే అరవై మిల్లీలీటర్లకీ, ఇలా ఇంటికి ఆహ్వానించి మరీ అవమానించాలా? అయినా తనకి నా సంగతేమైనా కొత్తా? అయితే, నిన్న ఫోన్లో తన మాటలకి అర్థం ఏమిటి!’ ఇంకొక్క నిముషం కూడా అక్కడ కూర్చోవడం కూడా దుర్లభంగా అనిపించింది. పోనీ విక్రమ్‌కి ఏదైనా సైగ చేసి చెప్దామంటే, తను నావైపు చూస్తే కదా!

హటాత్తుగా లేచి, “మేము వెళ్తున్నామని చెప్తే మర్యాదగా ఉంటుందా? సీన్ క్రియేట్ చేసినట్టనిపించదు కదా! ఏదైనా అనుకోనీ. అవమానం సహించడం నావల్ల కావడం లేదే! మరి నా స్వాభిమానమో?”-తర్జనభర్జన పడుతున్నాను.

నా ఆలోచనలు తనదాకా వెళ్ళినట్టు, నా మోకాలిమీద వారిస్తున్నట్టుగా తట్టింది ప్రతిమ.

“రాధికా, నీ డ్రింక్ పట్రానా?” రాజీవ్ వచ్చాడు.

“తను పెప్సీ తాగుతుందిలే”- రేణుక నిర్ణయించేసింది. అంత అవమానం జరిగిన తరువాత పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలనిపించదని అర్థం చేసుకోలేకపోయిందా!

”ఏదీ వద్దు రాజీవ్. నాకు ఏరేటెడ్ డ్రింక్స్ పడవు. .” గొణిగాను.

“సరే అయితే, నీ ఇష్టం.” అంటూ, రేణుక మూలనున్న ఫ్రిజ్ వద్దకి నడిచింది. రాజీవ్ భార్యవైపు చూశాడు. ఏదో అర్థం అయినట్టు, మొఖకవళికలు మారాయి. భార్యవెంట నడిచాడు.

తలదించుకుని కూర్చున్న నా డొక్కలో, తన అలవాటు కొద్దీ మోచేత్తో పొడిచింది ప్రతిమ. మూడోమనిషి అక్కడ లేనప్పుడు, ఆ మనిషి గురించి గుసగుసలాడ్డం, వారివైపు సైగ చేసి చూపించడంలాంటి అలవాట్లున్నాయి ప్రతిమకి. అది అమ్మమ్మ, నాన్నమ్మల కాలపు ఆడవాళ్ళని గుర్తు తెస్తుంది నాకెప్పుడూ. ఆ చర్య ఇప్పుడు మాత్రం చిరాకు పుట్టించలేదు.
“రాజీవ్ ఏదో గొడవ పడుతున్నాడు రేణుకతో. నీ గురించే అనుకుంటాను. విను.”- మెల్లిగా చెప్పింది.

నిజమే. వాళ్ళిద్దరూ వంటింటివైపు వెళ్ళారు. మధ్యనున్న గోడవల్ల కనిపించడం లేదు కానీ కోపంగా మాట్లాడుకుంటున్న, అస్పష్టమైన గొంతుకలు మాత్రం వినిపిస్తున్నాయి.

అక్కడ మరేమయిందో కానీ, రాజీవ్ వచ్చి నా చేతికి గ్లాసందించాడు. ప్రశ్నార్థకంగా చూస్తే, “నీ స్కృ డ్రైవర్. ” అన్నాడు. మాట్లాడకుండా, గ్లాసందుకుని పక్కనున్న టేబిల్ మీద పెట్టాను. ముట్టుకోవడానికి మనస్కరించలేదు.

కొంతసేపయింది. రాజీవ్ వచ్చి, పక్కనే ఉన్న నిండు గ్లాసు చూసి “ ఏమయింది? తాగడం లేదా!” అడిగితే, బలవంతంగా నోటికాన్చుకున్నాను. రాజీవ్ కదలగానే, గ్లాస్ మళ్ళీ పక్కనుంచాను.

ఆ మూల మగవాళ్ళ గొంతులూ, వంటింట్లో గిన్నెల శబ్దం తప్ప ఇంకేవీ వినపడటం లేదు. రేణుక అదే కుర్చీలో కూర్చుని, గోడలవైపు చూస్తోంది. పెద్ద ఇళ్ళల్లో ఉండే విశాలమైన గదులలో కూడా ఆవరించుకోగలిగే నాటురకమైన, మౌనపు అసౌకర్యం అనుభవంలోకి వచ్చింది.

“మళ్ళీ రేపు ఆఫీసులున్నాయి. భోజనాలు త్వరగా కానిద్దాం.” అన్న ప్రతిమ మాటల కోసమే ఎదురు చూస్తున్నట్టు, “అయ్యో, అయిదు నిముషాలే. వడ్డించమని చెప్తాను.” పనమ్మాయికి పురమాయిస్తూ, రేణుక లేచింది.

అందరూ భోజనాల బల్ల వద్దకి నడిచారు. ఇంకా సోఫాలోనే కూర్చునున్న నన్ను రేణుక పిలవలేదు. “రాధికా, భోజనం చల్లారిపోతోంది. రా మరి.“ అన్న రాజీవ్ మాటలతో, ‘కనీసపు మర్యాద దక్కింది’ అనుకుంటూ, లేచి వెళ్ళి టేబిల్ చుట్టూ ఉన్న ఒక కుర్చీలో ఇబ్బందిగా కూర్చున్నాను.

“మీరు మచ్ఛీ లేకపోతే తినలేరుగా? ఎలా వచ్చిందో మరి! రుచి చూసి చెప్పండి.” శేఖర్‌కీ, ప్రతిమకీ చెప్తూ- వాళ్ళ కంచాలవద్దకి చేపల కూర ఉన్న బౌల్ జరిపింది రేణుక.

“మరి రాధిక వెజిటేరియన్‌గా! తనకోసం ఏమిటి చేయించావు?” ప్రతిమ కలిపించుకుంది. “దాల్ మఖనీ, బంగాళదుంపలూ.”- తన ఎదురుగా పెట్టి ఉన్న రెండు బౌల్స్‌నీ చూపిస్తూ, వాటిని ఇటువైపు జరపకుండా, ముభావంగా జవాబిచ్చింది రేణుక. ”రామూ, అవిటు పట్రా.” ప్రతిమే చొరవ తీసుకుంటూ, రాముని పిలిచింది. ప్లేట్లో చెమ్చాడు పప్పూ, ఇంకో చెమ్చాడు అన్నం మాత్రం వడ్డించుకున్నాను. వాటినే స్పూనుతో కెలకుతున్నాను తప్ప, స్పూన్ నోట్లో పెట్టుకోబుద్ధి కాలేదు. ప్రతిమ సానుభూతిగా చూసిన చూపులని తప్పించుకున్నాను. రేణుక “తినడం లేదేం?” అని కానీ, “సరిగ్గా వడ్డించుకో.” అని కానీ అనలేదు. ’నేనేమైనా ముష్టిదాన్నా?’ అంటూ రొద పెడుతున్న మనసు నోటిని గట్టిగా నొక్కాను.

భోజనాలయాయి. లివింగ్ రూముకి తిరిగి వచ్చాం. “అయిస్ క్రీమ్ తెస్తున్నాడు రాము.” అన్న రాజీవ్ మాటలకి “ అమ్మో, మరింక అవన్నీ తినే చోటు లేదు పొట్టలో. ఇప్పటికే లేటయింది. వెళ్ళాలి.” అన్న ప్రతిమని ఎత్తి, గిరగిరా తిప్పాలనిపించింది.

నావంక చూసిన విక్రమ్‌కి, “ఇంక పోదాం, పద.” అన్న తీక్షణమైన చూపొకటి పడేశాను. ఏ కళనున్నాడో కానీ, “ఎందుకు? ఏమిటి?” అన్న ప్రశ్నలెయ్యకుండా ‘సరే’ అన్నట్టుగా తలాడించాడు.

గేటు బయటకి వస్తుండగా, లోపలకి ప్రవేశిస్తున్న రేణుక కూతురు మానసి కనబడింది. “అయ్యో ఆంటీ, మిమ్మల్ని మిస్ అయాను. స్నేహితురాలి పుట్టినరోజని పక్క బ్లాకుకి వెళ్ళవలిసి వచ్చింది” అంది.

“ఫరవాలేదులే, మళ్ళీ కలుసుకుందాం.” అంటూ, కార్లో కూర్చున్నాను.

***

ఇంటికి చేరిన తరువాత, ఒక సాండ్‌విచ్ తయారు చేసుకున్నాను కానీ తినాలనిపించలేదు. డస్ట్ బిన్లో పారేసి వచ్చి, మంచంమీద వాలాను. జరిగిన ప్రతీ సంఘటనా, అప్పుడు తలకెక్కకపోయిన ప్రతీ మాటా గుర్తుకొచ్చి, అలజడి లేపుతున్నాయి మనస్సులో. “ఛీ, అప్పుడే లేచి వచ్చేయాల్సింది. నాకు పౌరుషం రాలేదా? లేకపోతే, చూపించుకోలేనంత చేతకానిదాన్నయానా?” నన్ను నేనే తిట్టుకుంటూ, మధన పడుతున్నాను.

‘ఇన్నేళ్ళలోనూ రేణుక మారనే లేకపోయింది. ఇప్పుడుండేది అంత పోష్ కోలొనీలో కానీ పెళ్ళికిముందు జనతా ఫ్లాటులోనేగా ఉన్నది! రాజీవ్ తన్ని పెళ్ళి చేసుకోవడమే వింతకునేవాళ్ళం అప్పట్లో. పాపం, ఆడపిల్లలందరికీ లైన్ వేసీ వేసీ, ఇంక లాభం లేదనుకుని వయస్సు మీద పడుతుంటే, ఆఖరికి ముక్కూ మొహం కూడా సరిగ్గా లేని రేణుకని పెళ్ళి చేసుకున్నాడు. రేణుక మనస్తత్వం మాత్రం ఇంకా ఆ జనతా గదుల్లోనే ఇరుక్కుని ఉందని నేనెందుకు మరిచిపోయాను! తనకున్న న్యూనతా భావం తెలియదా నాకూ? అత్తవారింట్లో ఎవరితోనూ, తనకి ఇందువల్లే పడదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళతో కలియడం అంటేనూ ప్రాణం పోతుందే! నలుగురి మధ్యలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. హాస్పిటాలిటీ ఎలా ఆశించగలిగాను తననుంచి?’ నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.

నిద్ర వచ్చే సూచనలు దూరదూరంగా కూడా లేవు. నిద్రమాత్ర ఒకటి మింగి, ముసుగు పెట్టుకున్నాను.

***

నెల దాటింది. ఒక సాయంత్రం ప్రతిమ ఫోన్. ఎత్తగానే నవ్వు మాత్రం వినిపించింది. “సంగతేదో చెప్తే, నేనూ నవ్వుతానుగా!” అన్నాను. బలవంతాన్న నవ్వు ఆపుకుని, “ప్రపంచంలో ఎనిమిదవ వింత. చెప్పనా?” ఊరిస్తూ అడిగింది. ఇంకా నేనేమీ అనకముందే, “రేణుక షాట్లు తాగడం మొదలెట్టిందట. తెలుసా?” పగలబడి నవ్వుతోంది.
“ఏ షాట్లు?” అర్థం కాలేదు నాకు.

“ఏవో హాట్ డేమ్‌లట. నీట్‌గా కొట్టేస్తోందీ మధ్య.”

“నిజంగానే! ఈ మార్పెప్పటినుంచి?”

“తన తోడికోడలు నీరజ లేదూ! ఈ మధ్యేదో వాళ్ళకి సఖ్యత కుదిరినట్టుంది. ఏదో పార్టీకి తీసుకెళ్ళి, ”మరీ పాతకాలపు మనిషిలా బతుకుతున్నావు. ట్రై చేయి. ఇష్టం లేకపోతే వదిలేయొచ్చు.” అందిట. ‘ఐదు షాట్ల తరువాత కూడా నాకేమీ అవలేదు. మరి జనాలెందుకు తాగుతారో, ఏమో!’ అంది రేణుక నాతో.” మళ్ళీ నవ్వు.

“ఏడవనీ. మనకెందుకు?” మాట మార్చాను.

***

నెలయింది. ఆఫీసు పని మీద మా పిన్ని కొడుకు రఘు- ఢిల్లీ వచ్చాడు. వారాంతం, ‘తన ఆఫీసువాళ్ళు ఏదో హోటెల్లో పార్టీ ఏర్పాటు చేశారంటూ’ వెళ్ళాడు. నేనూ, విక్రమ్ కూడా ఎక్కడో కూచిపూడి డాన్స్ ప్రోగ్రాముందంటే వెళ్ళాం. అది పూర్తయి, అక్కడే ఒక చోట డిన్నర్ పూర్తి చేసేటప్పటికి చాలా రాత్రయింది. ‘దారిలోనేగా! రఘుని కూడా పిక్ అప్ చేసుకుందాం.’ అనుకుని ఫోన్ చేస్తే, తను పది నిముషాల్లో హోటెల్ బయటకొచ్చి నిలబడతానన్నాడు.

చేరేటప్పటికి, కారు పార్క్ చేయనవసరం లేకుండా, రఘు బయటే వెయిట్ చేస్తున్నాడు. తన పక్కనే మెట్ల మీద, చిన్న గుంపేదో కనబడింది. మత్తులో తూలుతున్న అమ్మాయొకర్తె, ఇద్దరబ్బాయిలమీద గట్టిగా అరుస్తోంది. చూస్తే మానసి. ఎవరూ పట్టించుకోవడం లేదు.

“విక్రమ్, కారు పార్క్ చేసి రా.” కంగారు పడుతూ చెప్పి, నేను దిగి అటువైపు నడిచాను. “మానసీ, ఇంతకీ ఎవరితో వచ్చావు? అమ్మా, నాన్నకీ తెలుసా”? అడిగితే,
“ఆంటీ, వాళ్ళకి చెప్పే, నా ఫ్రెండు ప్రణవ్‌తో వచ్చాను. మరి ఎక్కడకి మాయం అయిపోయాడో తను. వీళ్ళెవరో కానీ, ఇందాకటినుంచీ అల్లరి పెడుతున్నారు.” మాటలు ముద్దగా వస్తున్నాయి. సరిగ్గా నిలుచోలేకపోతోంది.

“ అక్కా, ఈ అమ్మాయి నీకు తెలుసా? ఇందాక చూస్తే, ఈ కుర్రాళ్ళిద్దరి మీదా పడుతూ ఒకటే వికవికలూ, పకపకలూ. మరిప్పుడేమయిందో, పోట్లాటకి తగులుకుంది.” పక్కనే ఉన్న రఘు తెలుగులో చెప్పాడు.

“నువ్వు నోరు ముయ్యి ముందు.” మందలించాను.

ఈ లోపల విక్రమ్ కారు పార్క్ చేసి వచ్చి, మానసి పరిస్థితి చూసి, తనని కారు వరకూ నడిపించడానికి మాకు సహాయం చేశాడు. కార్లో కూర్చున్న తరువాత మత్తువల్ల కాబోలు, నిద్రపోయింది. వాళ్ళింటి గేటు చేరడానికి అయిదు నిముషాలముందే, తనని కుదిపి లేపాను. బెల్ కొట్టి, ఎవరి అడుగుల శబ్దమో వినిపించిన తరువాత, మానసికి కార్లోంచి దిగడానికి సహాయం చేశాను. నేను తొందర పెట్టడంతో, ఇంకక్కడ ఆగకుండా, విక్రమ్ కారు స్టార్ట్ చేశాడు.

ఉపశమనమో, విడుదలో, ఓదార్పో -ఏదో నిర్వచించలేని అనుభూతి. నిట్టూర్పు విడిచాను.

**** (*) ****