కథ

సేఫ్ లాండింగ్

డిసెంబర్ 2015

నస్సు అతలాకుతలంగా ఉంది.
“నాకు కొంచం పనుంది. మీరిద్దరూ వెళ్ళండి. బోర్డింగుకింకా చాలా టైముంది. అప్పటికల్లా వచ్చేస్తాను.”- ప్రభాత్‌తోనూ, విజయ్‌తోనూ చెప్తూ, కుడిచేతిపక్కనున్న కార్గో సెక్షన్‌వైపు నడిచి బయట వేసున్న కుర్చీల్లో ఒకదాన్లో, చీర కుచ్చిళ్ళు చెదరకుండా కూర్చుని, మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాలని చూస్తున్నాను.ఏమయిందీ ప్రభాత్‌కి! మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉండేవాడూ! అరగంట కిందట మేమ్ముగ్గురం కలిపి టార్మాక్ మీదకి వస్తున్నప్పుడు తన పరిస్థితెలా ఉందీ?

***

“చెన్నై ఫ్లయిటుకేగా! పదండి. మాట్లాడుకుంటూ, నడిచి వెళ్దాం.” టార్మాక్ వైపు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్న విజయ్‌తోనూ, నాతోనూ అన్నాడు ప్రభాత్.
మళ్ళీ మెన్స్ స్టాఫ్ రూంలోకి వెళ్ళి వచ్చినట్టున్నాడు. నోట్లోంచి విస్కీ వాసన.

“నువ్వొద్దు మాతో”- ఒళ్ళు మండింది.

“సరయూ, నీమీదొట్టు. చలి ఎక్కువుంది కదా అని ఓవర్ కోట్ తీసుకోడానికి వెళ్ళానంతే. అసలు నీకీ అనుమానపు భూతం వదలదా?”- రోషంగా అడిగేడు నన్ను.

“ప్రభాత్, నువ్వు రానక్కరలేదులే. నీ డ్యూటీ పాయింట్ కూడా మేమే చూసుకుంటాం. నువ్వు ఇంటికైనా పో లేకపోతే స్టాఫ్ రూమ్‌లోనైనా కొంతసేపు పడుక్కో”- చిరాగ్గా అన్నాడు విజయ్.
”అసలేమిటి మీ ఇద్దరి ఉద్దేశ్యం? నేను సరిగ్గానే ఉన్నానని చెప్తున్నాను కదా!” చిరాకు పడ్డాడు ప్రభాత్. “ఆ, మరే! నీ నోటినుంచి వస్తున్న విస్కీ వాసనా, దాన్ని కప్పడానికి నములుతున్న ఏలక్కాయీ చెప్తూనే ఉన్నాయిలే ‘సరిగ్గానే’ ఉన్నావో లేదో.’-“చురకంటించాడు విజయ్.

***

ఈ ప్రభాతేనా- లేతగా, అంత మృదువుగా ఉండేవాడు!

“ధోబీ” ఫ్లైటని అని మేము ముద్దుగా పిలుచుకునే ఢిల్లీ-లక్నో ఫ్లయిట్. వెయిట్ లిస్ట్ చేంతాడంత ఉంది. యుఏయి దేశాల్లో చాకలివాళ్ళకి డిమాండెక్కువ. అక్కడినుంచి యుపి రాష్ట్రం వాళ్ళు శెలవల్లో ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు, ఎయిర్‌లైన్ ఢిల్లీ- లక్నో కాంప్లిమెంటరీ కూపన్ ఒకటిస్తుంది.

“నా టికెట్ కన్ఫర్మ్ అయిందేమో, ఒకసారి చూసి పెట్టండి.” అంటూ, బలవంతంగా తమ టికెట్లని మా చేతులకి అందిస్తున్నవాళ్ళని పట్టించుకోవడం మానేశాం. టికెట్లు తెరిస్తే, అక్కడేవో కరెన్సీ నోట్లు పెట్టుంటాయని తెలుసు. కౌంటరు చుట్టూ మూగి, ఊపిరాడకుండా చేస్తున్నారు.

“హలో”- నన్ను పలకరిస్తున్న యూనిఫార్మ్‌లో ఉన్న వ్యక్తెవరో గుర్తు పట్టలేదు. “ప్రభాత్ ఉపదృష్ట. చండీగడ్ నుంచి బదిలీ అయి వచ్చేను” కరచాలనానికి చేయి చాపుతూ అంటుంటే, ఎందుకో గానీ చిరాకెగిరిపోయింది. ‘ఓ, తెలుగువాడా!’ మొదటిసారి ఎవరి ముఖమైనా చూసినప్పుడే, మనతో వాళ్ళు సింక్ అవుతారో లేదో అని తెలుస్తుందేమో!
“సరయూ రెడ్డి.”- చేయందించి “టీ, కాఫీ?”- అడిగి, కనిపించిన లోడర్ని పిలిచి బ్లాక్ కాఫీ పట్రమ్మన్నాను.

ఆ రోజునుంచీ ప్రభాత్ కూడా మా గుంపులో చేరేడు. గుంపంటే మరీ పెద్దదేమీ కాదు. ముగ్గురు తెలుగువాళ్ళం కలిపి, మధ్యాహ్నం షిఫ్టులో జట్టుగా ఉండేవారమంతే. వాళ్ళల్లో ఉన్న విజయ్ నాతోపాటే స్కూల్లో చదువుకున్నవాడు. కాబట్టి అతనితో చనువెక్కువ నాకు.

ప్రభాత్ జిప్సీలో ఎయిర్‌పోర్టుకొస్తాడు. అందంగా ఉంటాడు అయితే అలా ఉంటానన్న స్పృహ ఉండదు. పాసెంజర్ల బోర్డింగ్ జరిగేవద్ద డ్యూటీలు కలిపి వేయించుకుని, అందరం కబుర్లు చెప్పుకుంటూ పని చేసేవారం.

ఆర్నెల్ల తరువాత వాసంతి అన్న అసిస్టెంట్ మీద మనస్సు పారేసుకున్నాడు ప్రభాత్. “తప్పు ఛాయిస్ బాబూ” అని చెప్పడానికి మాలో ఎవరికీ ధైర్యం చాలకపోయింది. వాసంతి ఉండడానికి అందంగానే ఉంటుంది. కాకపోతే, తను ఏ ప్రపంచసుందరికీ తీసిపోనన్న భ్రమలో మాత్రం బతుకుతుంది. మా గాంగంటే ఇష్టపడదు. అలా, కొంతకాలం మానుంచి పూర్తిగా అయితే విడిపోలేదు లేదు కానీ వాసంతితోనే ఎక్కువ టైమ్ గడిపేడు. ఒక శుభముహూర్తాన, వాసంతి ఒక బిజినెస్ మాగ్నెట్ని పెళ్ళి చేసుకుంది.

వాసంతినే కాక, సమస్తం పోగొట్టుకున్నవాడిలా తయారయేడు ప్రభాత్. అప్పుడే ఎయిర్‌పోర్టు తాగుడు బాచ్ పరిచయం అయినట్టుంది అతనికి. మొత్తానికి ప్రభాత్ దేవదాసుకి దగ్గిర చుట్టం అవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అతన్ని ప్రేమగా, అక్కున చేర్చుకుందా గ్రూప్.

***

దూరంగా, మూడవ నంబర్ బే మీద నిలుచున్న ఎయిర్‌క్రాఫ్టు వద్దకి లోడర్లు వెళ్తూ కనిపించారు. ‘ఇంక నేనూ వెళ్ళాలి.’- ఓవర్‌కోట్ బెల్టు బిగించుకుని లేచాను.

విజయ్ నాకోసం ఎదురు చూస్తున్నాడు. జనవరి నెల చలి గజగజలాడిస్తోంది. తనూ, నేనూ ముందున్న నిచ్చెన ఎక్కి, విమానం లోపలికెళ్ళేం.

చెన్నైనుంచి వచ్చి, తిరిగి చెన్నైకి వెళ్ళబోయే విమానాన్ని శుభ్రం చేసే పనిలో ఉంది గ్రౌండ్ సపోర్ట్ టీం.

కాబిన్‌ని తుడిచి, హెడ్ రెస్టుల మీద అతికించిన తెల్లబట్టలని మార్చారు. పాత పేపర్లు తీసేసి సాయంత్రం ఎడిషన్లని సీట్లముందు సర్దుతున్నారు. కాబిన్ క్రూకి పక్కగా, వెనుక వైపున్న తలుపునుంచి కాటరింగ్ డిపార్టుమెంటు వాళ్ళ అన్నపానీయాలు ఎక్కించే ప్రక్రియ సాగుతోంది. కిందనున్న హోల్డుల్లో బాగేజీ, కార్గో లోడ్ అవుతున్నాయి. టర్బైన్ ఇంధనంతో టాంకులు నింపుతున్నారు.

కాబిన్ క్రూ అప్పటికే వచ్చి ఉన్నారు. ‘హెలో’లూ, హాయ్‌’లూ పూర్తయాయి. “కాఫీ?” పాట్ చూపిస్తూ అడిగాడు ఫ్లైట్ స్టీవార్డ్. “రెండు”- చెప్తూ, ‘ప్రభాత్ ఎక్కడున్నాడా!’ అని కిందకి వంగి చూసేను. ఓవర్ కోటు జేబులోకి చెయ్యి దూరుస్తూ, విమానం టెయిల్ వైపు నడుస్తున్నాడు. విజయ్ కూడా గమనించినట్టున్నాడు. మూడు మెట్లనొక అంగలో దాటుతూ కిందకెళ్ళేడు. “ఇప్పుడే వస్తాను”, నా కాఫీ కూడా పాంట్రీలోనే కౌంటర్ మీద పెట్టి, నేనూ వెంట నడిచాను. జేబులోనుంచి హిప్ ఫ్లాస్క్ తీసి, నోట్లో ఏదో వంపుకుంటున్నాడు ప్రభాత్. మేమిద్దరం తనని సమీపించేలోగానే, రెండో జేబులోంచి ఏవో మాత్రలు నోట్లో వేసుకుని పుక్కిలించి మింగేశాడు “ ఏం చేద్దాం?” వెనక్కి తిరిగి అడిగేడు విజయ్. “ఇక్కడ పాసెంజర్లెవరి కంటా పడకుండా వెళ్ళి, వెనక లోడింగ్ చూసుకోమను. పైలట్లు వస్తూ ఉంటారింక.”-విసురుగా అన్నాను.

“ చెన్నై ఫ్లయిట్ బోర్డింగ్ అనౌన్స్ చేసేరు” చేతిలో ఉన్న వాకీ టాకీలో కంట్రోల్ రూమునుంచి హెచ్చరిక. నేను ముందున్న మెట్ల వద్ద నిలుచున్నాను. విజయ్ వెనకవైపున్న మెట్ల వద్దకి వెళ్ళాడు. పైలెట్లిద్దరూ వచ్చి, “హలో, గుడ్ ఈవెనింగ్ “- పలకరిస్తూ పైకెక్కేరు. పాసెంజెర్లని తీసుకొచ్చిన మొదటి బస్సు వచ్చి ఆగింది. ఇంక ప్రభాత్ కోసం వెతికే టైం కూడా లేదు. ఫుల్ ఫ్లైట్. అందరూ ఎక్కడానికి అరగంట పట్టింది. విజయ్, నేనూ కలిపి బోర్డింగ్ కార్డులని లెక్కపెట్టిన తరువాత, పాసెంజర్ల లెక్క సరిపోయిందని కంట్రోల్ రూముకి చెప్పాను. విమానానికి తగిలించిన మెట్లని దూరం జరపడం ప్రారంభించారు. విమానం తలుపులు రెండూ మూసుకున్నాయి.

ఇద్దరం విమానం వెనుక వైపుకి వెళ్ళేం. కార్గో హోల్డులని మూసి, వాటి తలుపులు కిందకి దింపుతున్నారు. ఎయిర్‌క్రాఫ్టు జారకుండా, చక్రాలకి అడ్డం పెట్టున్న వీల్ చాక్స్‌ని తీసివేయడానికి ఆపరేషన్స్ డిపార్టుమెంటు ఉద్యోగొకతను ముందుకి కదుల్తున్నాడు. విమానం పార్కింగ్ బ్రేకులు ఇంకా వేసే ఉన్నాయి. టర్మినల్‌కి తిరిగి వెళ్తున్న లోడర్లని అడిగితే.. ప్రభాత్‌ని లోడింగ్ జరుగుతున్న చోట చూడలేదన్నారు.

కాక్‌పిట్‌కి ఎదురుగా నిలబడి, పైలట్లకి సంకేతాలిచ్చే మార్షల్ తన చిన్నకఱ్ఱలు(వాండ్స్) పట్టుకుని నిలుచున్నాడు.

అర్జెంటుగా నా భుజం తట్టి, కంగారుగా విమానం బెల్లీ కిందకి వేలు పెట్టి చూపించేడు విజయ్. దూరం జరిగిన నిచ్చెనల వల్లా, మూసి ఉన్న కార్గో హోల్డులవల్లా, కింద బోర్లా పడి ఉన్న ప్రభాత్ స్పష్టంగా కనపడుతున్నాడు. గుండాగినంత పనయింది. ఇంచుమించు పరిగెత్తుతూ మార్షల్‌ని సమీపించి, ‘ఆగమంటూ’ సైగ చేసేను. వగరుస్తూ వస్తున్న నన్ను చూసి, చేతులు కిందకి దించాడతను. కమాండర్ ముహం ప్రశ్నార్థంగా పెట్టడం కాక్ పిట్ అద్దంనుండి స్పష్టంగానే కనిపించింది. మార్షల్‌ దగ్గిరగా వెళ్ళి, “అక్కడ ఒక ఎంప్లాయీ పడిపోయున్నాడు.”- బిగ్గరగా చెప్పాను. ఈ లోపల నిచ్చెనలు దూరం తీసిన లోడర్ల సహాయంతో, స్పృహ తప్పి ఉన్న ప్రభాత్‌ని ఖాళీగా ఉన్న పక్క బే వైపు ఎత్తుకొని తీసుకెళ్ళాడు విజయ్. అర్జెంటుగా అంబులెన్స్ కావాలని కంట్రోల్ రూముకి చెప్పాను.

గుప్పెళ్ళని మూసి, చేతులు పైకెత్తి, మూసి ఉన్న గుప్పెళ్ళని దించి, వేళ్ళు విప్పుతూ… బ్రేక్స్ రిలీజ్ చేయమన్న సంకేతం ఇవ్వడం ప్రారంభించేడు మార్షల్.

అంబులెన్స్ వచ్చింది. ప్రభాత్‌ని లోపల కూలేశారు. ఇంకా స్పృహలోకి రాలేదతను. అప్పుడు చూసేను మార్షల్ ఎడమ చేతిని ఆకాశం వైపెత్తి, కుడి చేత్తో పట్టుకున్న వాండ్‌ని తిప్పడం. ఇంజిన్లు స్టార్ట్ చేయమన్న సంకేతం అది. ప్రొపెల్లర్లు తిరగడం ప్రారంభించేయి. ‘ఎవరూ గమనించకపోయి, ప్రభాత్ ఇంకా అక్కడే పడి ఉండి ఉంటే!’- ఊహించుకుంటేనే, వళ్ళు జలదరించింది.

డ్యూటీలో ఉన్న డాక్టర్, ’అది విస్కీతోపాటు సెడేటివ్స్ కలపినందువల్ల కలిగిన తాత్కాలిక పరిణామమే అనీ, ప్రమాదమేమీ లేదనీ’ రిపోర్టిచ్చాడు. ఇద్దరిని తోడిచ్చి, ఆఫీస్ కార్లో ప్రభాత్‌ని ఇంటికి పంపేరు.

డ్యూటీలో తాగి ఉన్నందుకు అతన్ని మర్నాడు పొద్దున్నే సస్పెండ్ చేసారు. ‘ఇంక మాట్లాడకపోతే లాభం లేదు’ అనుకుని, “టీ తాగి వద్దాం పదండి బయట ధాబాలో”-అంటూ బయటకి దారి తీశాను. “ఏమయింది? బే కి మన ముగ్గురం కలిపి వెళ్ళడం గుర్తుందంతే. ఆ తరువాత జరిగిందేదీ గుర్తే లేదు.” బెంచీ మీద కూర్చుంటూ, అయోమయంగా అడిగాడు ప్రభాత్. ఒక్కో ముక్కా విజయ్ అందిస్తుంటే, “ఈ మాత్రం డోసైనా కావాలి”-అనుకు౦టూ పూసగుచ్చినట్టుగా చెప్పాను. మావైపు చూసి తలదించుకున్నాడు. అవమానభారమో, అపరాధభావమో అర్థం కాలేదు. “ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా?” కోపంగా అరిచాడు విజయ్. ప్రభాత్ నోరిప్పడానికి ప్రయత్నిస్తుంటే- “మళ్ళీ ఒట్లూ అవీ వేయకు. పిచ్చివాళ్ళం కాము నమ్మడానికి. ఈ అలవాటు మానేసిన రోజున మేము నీకు స్నేహితుల౦. అప్పటివరకూ మాట్లాడకు మాతో.” విజయ్ మళ్ళీ గొంతు హెచ్చించాడు.

రెండు నెల్ల తరువాత డాక్టర్ చెకప్ అయింది. తాగుడు మానేసి, తిరిగి డ్యూటీలో చేరేడు ప్రభాత్.

***

శ్రీనగర్‌నుంచి రత్న అన్న ఒకామె ఢిల్లీకి బదిలీ అయి వచ్చింది. ప్రభాత్‍ని ఇష్టపడుతోందని మాకు త్వరలోనే అర్థం అయింది. భోజనం చేస్తున్నప్పుడూ, టీ తాగుతున్నప్పుడూ మేము మాత్రం త్వరత్వరగా తినడం, తాగడం పూర్తి చేసి, వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలిపెట్టేవాళ్ళం. కొన్నాళ్ళకి మమ్మల్ని వదిలి, వాళ్ళే వేరేగా భోజనం చేసేవాళ్ళు. ఆ తరువాత మధ్యాహ్నం లేదూ, రాత్రీ లేదూ- కలిపి తిరగడం ప్రారంభించేరు.

రత్న వయస్సులో పెద్దగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఈడూజోడూగా ఉన్నారని అసలనిపించలేదు మాకు. కానీ ప్రభాత్‌కి తనంటే ఇష్టం అని స్పష్టంగానే తెలుస్తోంది. ఉచిత సలహాలివ్వడానికి ఎవరికీ మనస్కరించలేదు.

ఒకసారి ప్రభాత్‌ని “పద, నాకు వసంత్ విహార్లో పనేదో ఉంది. నీ జీప్ తియ్యి”- అంటే, “ఇప్పుడేనా, సాయంత్రం కుదరదా?”- నానుస్తూ అడిగేడు. “ఒక్కరోజు రత్నతో నీ లంచ్ డేట్ మిస్సయితే కొంపలేమీ అంటుకుపోవులే, పద.”- తొందరపెడితే, ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగా తల పంకించి, ”వెళ్దామయితే” అంటూ, కారు పార్కింగ్ వైపు దారి తీశాడు.
“సరయూ, ఒక మాట చెప్పు, నేను రత్నకి తగినవాడినేనంటావా?” కార్లో అడిగేడు. “ఆత్మవిశ్వాసం నామమాత్రంగా కూడా మిగల్లేదులా ఉంది కుర్రాడికి. అసలు తనే నీకు తగినది కాదు.”-అందామనుకున్నాను కానీ, “పోవోయ్, నీకేం తక్కువా!” అని మాత్రం అనగలిగాను. “మరా రాత్రి సంగతీ…“ గొణిగేడు. “ఎయిర్‌పోర్టులో రత్నకి ఇంకా ఎవరూ చెప్పలేదని ఎందుకనుకుంటున్నావు?” ఎదురు ప్రశ్న వేశాను.

నెల దాటింది. ఆ తరువాత వారంపాటు “ నాకు పర్సనల్ డిపార్టుమెంట్లో పనుంది.” అంటూ, మాకన్నా ముందే వచ్చేసేవాడు. అప్పుడప్పుడూ మధ్యాహ్నం కూడా గంటో, రెండు గంటలో మాయం అవడం ప్రారంభించాడు. మూలమూలలకి వెళ్ళి ఎవరికో కానీ, రహస్యంగా ఫోన్లు చేస్తున్నాడు. ఇదేదో డిటెక్టివ్ వ్యవహారంలా అనిపించి అడిగితే, “రత్న గురించిలే. మంచి పనని రేపు నువ్వే మెచ్చుకుంటావు”- నవ్వుతూ ఎగ్గొట్టేడే కానీ వివరాలు మాత్రం చెప్పలేదు.

ఒకరోజు నేనూ పట్టుబట్టి ప్రభాత్‌తో పాటు ఆ డిపార్టుమెంటుకెళ్ళేను. లోపలికెళ్ళగానే, తిన్నగా ఎవరి డెస్కువైపో దారి తీశాడు. సావకాశంగా ఒక కుర్చీ బల్లవైపు జరుపుకుని, అక్కడున్న అబ్బాయితో కలిపి ఏవో ఫైళ్ళు చూడ్డంలో ములిగిపోయాడు. తిన్నగా వాళ్ళ మధ్యకి వెళ్ళడానికి మొహమాటం వేసి, ఇంకో బల్ల వద్దున్న తెలిసినమ్మాయితో కబుర్లు చెప్తూ కూర్చున్నాను. గంట గడిచాక వెనక్కొచ్చి, “ పద, పోదాం. పనయిపోయింది.”- నన్ను తొందర పెట్టాడు. “ఇంతకీ ఏ ఫైళ్ళవి? రత్నవా? అనధికారంగా చూపిస్తున్నాడే! ఏమిటిదంతా?” అడిగాను.

“ నా స్నేహితుడేలే. నీకే తెలుస్తుంది త్వరలో. రేడియోలా అందరికీ టాంటాం వేయకు.”- ఇంక మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వకుండా, బయటకి నడిచాడు.

***

ఇంకో వారం గడిచింది. ఒక రాత్రి, టికెటింగ్ కౌంటరు బయట ఏవో అరుపులు వినపడ్డాయి. “రత్న” పేరు ఎవరి నోటో వినిపించింది. టికెటింగ్ చేస్తున్న అబ్బాయొచ్చి, తనకోసం ఎవరో వచ్చారన్నాడు. రత్నెక్కడా కనపడలేదు. ఆశ్చర్యపడుతూ నేనూ, విజయ్ అక్కడికి నడిచాం. గ్లాస్ కిటికీలలోంచి చూస్తే, విజిటర్స్ పాస్ కావాలని గొడవ చేస్తున్న ముప్పైలలో ఉన్న వ్యక్తొకతను- మూడు, నాలుగేళ్ళ చిన్నపిల్లని ఎత్తుకుని నిలుచున్నాడు. పక్కన గేట్‌ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ ‘కలిపించుకోవాలా, వద్దా’ అన్న మీమాంసలో పడ్డట్టుగా ఉంది.

“రత్నని బయటకైనా పంపించండి. నన్నైనా లోపలికి రానివ్వండి”- అతను ముందుకొచ్చి గొంతు హెచ్చించాడు. “ఎందుకు పంపించాలి? అసలు మీరెవరు?” తికమకపడుతూ అడిగాను. విజయ్ కూడా వాదనకి తగులుకున్నాడు.

తనకోసం వెతికితే, లేడీస్ స్టాఫ్ రూమ్‌లో వంటరిగా కూర్చునుంది. “రత్నా, బయట ఆ గొడవేమిటి? ఆ మనిషెవరు? వచ్చి చూడకూడదూ!”-అంటే, నోరిప్పలేదు. బలవంతంగా లేవదీశాను. ‘ఇంక తప్పదనుకుందో’ ఏమో, లేచి నాతోపాటు బయటకి నడిచింది.

కౌంటర్ ముందు గొడవెక్కువయింది. ఆ వ్యక్తి చేతుల్లో ఉన్న పాప, రత్నని చూడగానే ”మమ్మీ” అంటూ అతని చేతుల్లోనుంచి తప్పించుకుని, ముందుకి ఉరుకుతోంది.

“ప్రభాత్!”- కంగారుగా అన్నానో,.. అరిచానో తెలియదు. నా పక్కనే నిశ్చలంగా నిలుచుని ఉన్నాడు తను. “ఓహో, ప్రభాత్ అంటే మీరేనా! మీ పరిచయం అదృష్టమో, దురదృష్టమో, మీరందిస్తూ వస్తున్న సమాచారం వల్ల నా కాపురం కూలిందో, నిలుస్తుందో…ఇంకా ఏమీ తెలియదు. కానీ ప్రస్తుతానికి నేను చెప్పగలిగేదల్లా థేంక్స్ మాత్రమే” –అంటూ, ఆ వ్యక్తి టికెట్ కౌంటరుకి ఉన్న చిన్న కిటికీలోనుంచే తన చేయి ముందుకి చాపాడు. ప్రభాత్ కూడా తన చేయి కలిపాడు. తన పెదవులమీద చిరునవ్వు మెరిసింది.
తలమీదనుంచి పెద్ద భారం దిపుకున్నట్టు, మొహంలో రిలీఫ్ కొట్టొచ్చినట్టుగా కనబడింది.

**** (*) ****