ముఖాముఖం

Appreciation చాలదు ఈ వయసులో, critical appreciation కావాలి. – పతంజలి శాస్త్రి

ఫిబ్రవరి 2016

ల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు మనదైన వాతావరణానికి భంగం కలక్కుండా సంప్రదాయ ఆధునిక కథనరీతుల్ని జోడించిన కథకుడు. ఆయన కథలు తెలుగు ప్రాదేశిక సరిహద్దుల మధ్య జరుగుతూ కూడా ఒక విశ్వవ్యాప్త దృక్పథాన్ని కలిగివుంటాయి. ఈ ఇంటర్వ్యూ గత ఏడాది వేసవికాలం మధ్యాహ్నం రాజమండ్రిలో ఆయన ఇంట్లో జరిగింది. ఆయన మెదడు ఒకేసారి పలు ఆలోచనల్ని తెచ్చిపోస్తుంటే, వరుసక్రమానికి బంధీ అయిన మాట వాటిని కొంత కలగాపులగంగా వ్యక్తం చేస్తుందనిపిస్తుంది. వాటిని కాస్త అటూయిటూ చేసి ఈ ఇంటర్వ్యూ కూర్చటం జరిగింది.

ఇంటర్వ్యూ:  ఫణీంద్ర

1. మీపై రచన దిశగా పడిన తొలి ప్రభావం గురించి చెప్పండి?

ఎక్కువ కుటుంబంమే. నేను ఆరోతరగతిలోనే మొట్టమొదటి కథ రాశాను. ఇల్లంతా పుస్తకాలు ఉండేవి, ఇంటికి ఎంతోమంది కవులూ గాయకులూ గొప్పగొప్ప వాళ్లు వచ్చి పోతూ ఉండేవారు. మూడుతరాల కవులతో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది.

2. మొదట్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచయితలెవరు?

ఏ ఒక్క రచయిత ప్రభావమో లేదు, ఒక్కొకళ్లు ఒక్కో విధంగా ప్రభావితం చేశారు. నేను కాలేజీ స్థాయికి వచ్చేసరికి – నేనే కాదు మా తర౦ అందరికీ గురువులు ఎవరంటే – మపాసా, సోమర్సెట్ మామ్, ఇక ఆ మూడో పేరు ఓ. హెన్రీ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. మపాసా నన్ను బాగా ప్రభావితం చేశాడు. అతను కథకు వాతావరణాన్ని గొప్పగా సృష్టిస్తాడు. సోమర్సెట్ మామ్ ను అప్పట్లో ఇష్ట పడ్డాం గానీ నిజంగా చెప్పాలంటే పెద్ద గొప్ప రచయిత కాడు, లోతు తక్కువ. కొందరైతే ఆయన్ని కమర్షియల్ రైటర్ అని తీసిపారేశారు. కానీ కథ గొప్పగా చెప్పగలడు. సంచార కవులూ రచయితల తరంలో దాదాపు ఆఖరివాడు.

నేను చాలా చిన్నప్పటి నుంచే రాస్తుండేవాడ్ని. ఒకసారి నాన్నగారు ‘ఏవిట్రా రాస్తున్నావ్, ఇలా పట్రా’ అన్నారు. రాసింది చదివి, ‘ఇందులో ఒక్క వాక్యం నీ సొంతం లేదు. నీకు తెలియకుండా అవీ ఇవీ ఏరుకొచ్చి ఒక చోట పెట్టావు. ఎప్పుడూ నీకు తెలియని జీవితం గురించి రాయకు. ఎప్పుడైతే ఒకరిలా రాద్దామని అనుకుంటావో, ఇక అప్పుడు నువ్వు మిగలవురా’ అని అన్నారు.

ఇంకొకటి – ఇది 1965 నాటి మాట – నేను ఎమ్మే చదివేటపుడు యూనివర్శిటీకి వెళ్ళే దారిలో మా ఫేమిలీ ఫ్రెండ్ ఆచంట జానకీరామ్ ఉండేవారు. నేను ఆయన ఇంటి దగ్గర కాసేపు కూర్చుని వచ్చేవాడిని. అప్పటికే కొన్ని కథలు రాశాను. అప్పుడే జ్యోతిలో ఒక కథ వచ్చింది. ఆ కథ ఎలా ఉందని అడిగాను. “నువ్వు కథ చాలా బాగా రాయగలవురా. కానీ నీకున్న మేధాశక్తిని పాఠకుడి నెత్తి మీద రుద్దటానికి ఎప్పుడూ ప్రయత్నించకు. నీకు నిజంగా జ్ఞానం ఉంటే అది పాఠకుడికి కూడా తెలియకుండా చిన్న హోమియోపతి మాత్రలాగా ఇవ్వాలి. Writer’s intelligence should not offend the reader,” అన్నారు.

ఈ రెండూ సలహాలనీ నా జీవితంలో ఇప్పటికీ మర్చిపోలేదు. నేను సాహిత్య సభలకీ, సంరంభాలకీ చాలా దూరంగా ఉంటాను. వాటి మీద గౌరవం లేక కాదు, నా పద్ధతి అది. వెళ్ళినా వెనక కూర్చుంటాను, మాట్లాడాల్సి వస్తే నా వృత్తి గురించి మాట్లాడి వచ్చేస్తాను. మాట్లాడాలంటే ఎంత తెలియాలి? చాలా పెద్దవాళ్ల మధ్య పెరిగాను నేను. తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ… ఎవరి పేరైనా చెప్పండి. అంటే ఏడెనిమిది అడుగుల పొడవున్న వాళ్ళ మధ్య మనం నాలుగైదు అడుగుల పొడవున్నవాళ్లం అయితే ఎలాగుంటుంది? ఆ వినయం అలా అలవాటయింది. నా స్నేహితులు కొంతమంది “వినయం అవసరమే కానీ, నీకు కాస్త ఎక్కువే” అంటూంటారు. అయ్యుండొచ్చు. కానీ నాకు అలా మౌనంగా ఉండటం ఇష్టం.

3. మీరు చదివింది చరిత్ర, ఆర్కియాలజీ. ఎక్కువభాగం జీవితాన్ని గడిపింది పర్యావరణం, జీవవైవిధ్యం ఇలాంటి రంగాల్ని కేంద్రంగా చేసుకుని… ఇదంతా ఎలా జరిగింది?

ఆర్కియాలజీ గానీ, చరిత్ర గానీ చదవాలన్న ఉద్దేశం లేదు. ఇంగ్లీషు ఎమ్మే చదవాలన్న ఉద్దేశంతో ఆంధ్ర, ఉస్మానియా, శ్రీవెంకటేశ్వరా యూనివర్శిటీలకు దరఖాస్తు పెట్టాను. తిరుపతిలో ‘భారతీయ రచయితల సంఘం’ సభలు ఏవో జరుగుతుంటే మా తాతయ్య శివశంకరశాస్త్రి గారితో అక్కడికి వెళ్ళాను. అక్కడకు వెంకటేశ్వరా యూనివర్శిటీ చరిత్ర ప్రొఫెసర్ మారేమండ రామారావు గారు వచ్చారు. మన ఆంధ్ర చరిత్రకారుల్లో గొప్పవాడు. తిరుపతి వచ్చాం గనుక ఆయన మా తాతయ్యగారిని కలవడానికి వచ్చారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. మా తాతయ్య “వీడు మా మనవడు, వీడి సంగతి చూడు” అని ఆయనతో అన్నారు. నేను ఎమ్మే ఇంగ్లీషుకి అప్లయి చేశానని తెలుసుకుని, “అది రావచ్చూ రాకపోవచ్చూ,ఎందుకన్నా మంచిది చరిత్ర – ఆర్కియాలజీ సబ్జెక్టులకు కూడా అప్లయి చేయి” అన్నారు. తన దగ్గరే చదువుకుని, పి.హెచ్.డి చేయవచ్చన్నారు. మర్నాడు ఎస్వీ యూనివర్శిటీకి వెళ్ళి అప్లయి చేశాను. చాలా రోజుల వరకూ వేరే ఏ యూనివర్శిటీ నుంచీ జవాబు రాలేదు. చివరకు ఎస్వీ యూనివర్శిటీ నుంచే నేను చరిత్ర, ఆర్కియాలజీ సబ్జెక్టులకు ఎంపిక అయ్యానని కబురు వచ్చింది. నేను వెళ్ళి రామారావుగారిని కలిసి “ఇంగ్లీషు అడ్మిషన్స్ కోసం ఇంకా వెయిట్ చేయాలాండీ” అని అడిగాను. ఆయన “ఏంటి వెయిట్ చేసేది, వాళ్ళు నీకు పంపించరు, నేనే వద్దని చెప్పాను,” అన్నారు. ఇక చేసేదేముంది, ఆ సబ్జెక్టులు తీసుకోక తప్పలేదు. అలాగని వాటి మీద నాకు అనాసక్తి ఏమీ లేదు.

అలా ఆ సబ్జెక్టుల్లో ఎమ్మే పూర్తి చేశాకా, డెక్కన్ కాలేజీలో రీసెర్చి పూర్తి చేశాను. తర్వాత యూనివర్శిటీలో చేరాలనుకున్నాను, డెక్కన్ కాలేజీలోంచి వచ్చాం మనకి ఉద్యోగం రాకపోవడం ఏమిటి – అనుకున్నాను. కొద్దికాలంలోనే అలా ఎవడూ ఉద్యోగం ఇవ్వడని తేలిపోయింది. చాలా యూనివర్శిటీలు తిరిగాను. కానీ అవకాశం మాత్రం రాలేదు. అప్పుడు సుబ్రహ్మణ్యం గారని నాగార్జున యూనివర్శిటీలో ఆర్కియాలజీ ప్రొఫెసర్, ఆయన చెప్పారు: “మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ జన్మలో ఆంధ్రాలో ఏ యూనివర్శిటీలోనూ మీకు ఉద్యోగం రాదు. ఒక కారణం, మాకు పెద్ద రిజర్వేషన్ల జాబితా ఉంటుంది. ఇంకో కారణం, ప్రతి యూనివర్శిటీలోనూ ఈ ఉద్యోగం కోసం రిసెర్చి స్కాలర్లు కొందరు సిద్ధంగా కాచుక్కూచుంటారు. వాళ్ళు అర్హులా కాదా అనేది వేరే విషయం, వాళ్ళను కాదని బయటివాళ్లకు ఉద్యోగం ఇవ్వరు” అని చెప్పారు. అంతే, మళ్ళీ ఆ ప్రయత్నం చేయలేదు. అప్పటి నుంచీ బయట కాలేజీల్లో టీచింగ్ చేస్తూ, ప్రిన్సిపాల్ గా పని చేస్తూ గడిపేశాను.

కాని హిస్టరీ, ఆర్కియాలజీ ఇవి చదవడం వల్ల ఎందరో గొప్పవాళ్ళని కలుసుకునే అవకాశం మాత్రం వచ్చింది. డెక్కన్ కాలేజీలో ‘యుగాంత’ రాసిన ఇరావతి కర్వేను కలుసుకున్నాను. అలాగే ప్రపంచంలో ఎన్నో జాతుల్ని దగ్గరగా చూశాను. ఎన్నో సంస్కృతులను అర్థం చేసుకోవడానికీ, అధ్యయనం చేయటానికి అవకాశం దొరికింది.

పర్యావరణ శాస్త్రం వైపు నా ప్రయాణం యాధృచ్ఛికంగా జరిగింది. నేను ప్రిన్సిపాల్ గా చేసి విసుగుపుట్టి వదిలేసిన తర్వాత, ప్రొఫెసర్ ఎమ్.ఎల్.కె. మూర్తి అని ఒకాయన మంచి మిత్రుడు నాకు, మేమిద్దరం గిరిజన ప్రాంతాలూ, తిరుపతి దగ్గర ప్రి- హిస్టారిక్ ప్రదేశాలూ కలిసి తిరిగేవాళ్ళం. అనుకోకుండా గాంధీ గారి ఆశ్రమం ఉన్న చోటు వార్ధా వెళ్లాను. అక్కడ కలిసిన మిత్రుడు ఒకాయన “గాంధీ పీస్ సెంటర్ కు అనుబంధ సంస్థలో పర్యావరణం మీద వర్క్ చేయాలి వెళ్తారా” అని అడిగారు. అలా 1998 నుంచి పర్యావరణం మీద పని చేస్తున్నాను.

4. కల్చర్ కు, ఇకాలజీకీ ఉన్న సంబంధం ఏమిటి?

ఒక మానవ సమూహం జీవిత నిర్వహణ కోసం చేసే కృషి అంతా ఆ జీవావరణ వ్యవస్థ మీద ఆధారపడి వుంటుంది. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో ఈ ప్రభావం ఉంటుంది. అది ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ విధానంలో ముఖ్యమైన భాగమే ఈ సంస్కృతీ సంప్రదాయాలు.

5. మీరు రాసే పద్ధతి ఎలా ఉంటుంది? ఎక్కువ రివైజ్ చేస్తారా, లేక ఒకే ఊపులో రాసి అదే ఖాయం చేస్తారా?

కూర్చుని కథ రాయాలీ అనుకుని రాయలేను. లోపల చిత్రమైన కదలిక మొదలై, అది జ్వరంలా మారుతుంది. అప్పుడు రాయడానికి కూర్చుంటాను. రాయటం మొదలుపెడితే ఇక ఏకబిగిన రాస్తాను. చాలా వేగంగా రాస్తాను. ఒక్కోసారి రాసిం తర్వాత ఏం రాశానో నేనే గుర్తు పట్టలేను. పూర్తయ్యాకా మళ్ళీ డ్రాఫ్ట్ అంటూ విడిగా రాయను గానీ, ఇంక అందులోనే మార్పులు చేస్తాను. ఫెయిర్ కాపీ చేసేటపుడు మారుస్తాను.

6. రాయడానికి కూర్చునే ముందే కథ ఆద్యంతాల పట్ల పూర్తి అవగాహన ఉంటుందా? లేక రాస్తూపోతూ దారి కనుక్కుంటారా?

రెండూను. మామూలుగా కథల విషయంలో ఎలా ముగించాలనేది ముందే ఉంటుంది. ప్రారంభమే ఉండదు. ఇలా మొదలుపెట్టాలీ అని ఖాయంగా అనుకోలేను. విస్తృతి గురించి కూడా పెద్దగా ఆలోచించను. ఇన్ని పేజీలూ అనుకోను. ఎంతవరకూ వస్తే అంతటితో ఆపేస్తాను. తర్వాత అది నవలైనా, కథయినా, ఏదైనా కావొచ్చు.

కథ రాసేటప్పుడు పాత్రలన్నీ నా కనుల ముందర కనిపిస్తూ ఉంటాయి. ఒక పాత్ర ఎలా ఉంటుంది, చర్మం రంగేమిటి, జుట్టు ఎలా దువ్వుకుంటుంది, ఎలా మాట్లాడుతుంది,హావభావాలు ఎలా ఉంటాయి… ఇలా ప్రతి మైనర్ డీటైలూ కనిపిస్తుంది. కనిపించిందంతా కథలో రాయకపోవచ్చు. కానీ కనిపిస్తుంది. కాబట్టి ముందు ఎక్కడో ఒక చోట మొదలుపెట్టేస్తాను. కథలో సంఘటనలు మాత్రం ముందు ఆలోచించుకోవడం ఉండదు. రాసేటప్పుడు ఎలా స్ఫురిస్తే అలా వెళిపోతాను. అంచేత నాది ప్రణాళికా బద్ధంగా రాసిన రచన ఒక్కటీ లేదు.

నాకు ఇష్టమైన ఒక ఉదాహరణ చెప్తాను. నా ‘వీరనాయకుడు’ అనే నవల లో నాకు చాలా ఇష్టమైన పాత్ర ఒకటి ఉంది. పూర్ణయ్య అనే ఒక వేగు పాత్ర. ఆ పాత్ర వచ్చే ముందున్న పేరాగ్రాఫులో కూడా నాకు ఆ పాత్ర వస్తుందన్న స్పృహ లేదు.

7. అంటే నిజ జీవితంలో ఏదన్నా రిఫరెన్సు ఉందా?

లేదు, అలా స్ఫురించాడంతే. నేను అరుదుగా తెలిసిన వ్యక్తిత్వాలను మిక్స్ చేస్తుంటాను, కానీ చాలా వరకూ కల్పనే. ఉన్నట్టుండి వాడి స్వరూప స్వభావాలు, వాడి ఆంతర్యం అన్నీ స్ఫురించాయి. అతడ్ని నేను నిర్మించిన విధానం నాకే నచ్చింది. దురదృష్టమేమిటంటే – అందరూ నేను రాసిన పద్ధతీ అవన్నీ మెచ్చుకున్నారు. కానీ ఫలానా పాత్రని బాగా సృష్టించారూ అని ఎంచి చెప్పడంలో విఫలం అయ్యారు. Appreciation చాలదు ఈ వయసులో, critical appreciation కావాలి. “శాస్త్రిగారు చాలా గొప్పగా రాస్తారండీ” అంటే చాలదు, “శాస్త్రిగారు మీరు ఇంచేత బాగా రాస్తారండి” అంటే అది కావాలి. ఆ పాత్ర గురించి అలా ఎవరూ చెప్పలేదని కొంత బాధ.

నా చిన్న కథల్లో కూడా పాత్రలు.. they live their own life. అవి తమ జీవితాన్ని తాము నడుపుకుని నిష్క్రమించడమే తప్పితే, రచయిత నడిపిస్తున్నట్టు కానీ,మాట్లాడిస్తున్నట్టు కానీ ఎక్కడా చేయలేదు. నా ఏ కథా ఇంకో కథలా ఉండదు.

8. ఎక్కువగా మీ కథలకు point of departure ఏదై ఉంటుంది? భావమా, ఆలోచనా, సంఘటనా, పాత్రలా?

ఆలోచన.

9. రచన జీవితానుభవం నుంచే రావాలని ఒక నమ్మకం, లేదు ఇమేజినేషన్ తో ఎక్కడి నుంచైనా కథ చెప్పవచ్చని ఒక నమ్మకం ఇలా రెండు ఉన్నాయి. మీకు ఏది ఆదర్శం?

మొదట, జీవితానుభవం అంటే ఏమిటి? – నీ జీవితానుభవం. మళ్ళీ నీ జీవితానుభవం అంటే ఏమిటి? – నీకు తెలిసిన జీవితానుభవం. అంటే చూడండి, ఒక బిందువు నుంచి అలా ఒక వలయం విస్తృతమవుతోంది. నీకు తెలిసిన మనుషులు, నీ ఊరు, నీ రాష్ట్రం, నీ దేశం ఇలాగ అనుభవాల విస్తృతి పెరుగుతూ ఉంటుంది. అంచేత, జీవితానుభవం అంటే కేవలం మన వైయక్తిక మైనటువంటి జీవితానుభవం మాత్రమే కాదు. అలాగైతే ఎవరూ ఏం రాయలేరు. మీకు రాని జ్వరాన్ని, మీకు రాని తలనెప్పినీ మీరు ఊహించలేరు.

ఉదాహరణకు మన పఠనానుభవం గురించే మాట్లాడుకుందాం. పుస్తకాల్లో మనకి ప్రత్యక్షంగా సంబంధం లేని, చూడని, అనుభవం లేని ఒక ప్రపంచానికి, సమాజానికి, వ్యక్తులకూ సంబంధించిన విషయాలు ఎన్నో చదువుతూంటాం. ఈ చదివేటప్పుడు అందులో ఉండేటువంటి మామూలు విషయాలు – అంటే ఆ స్థలానికి, ఆ కాలానికి సంబంధించిన మామూలు వివరాలు – అలా పక్కనపెడితే, ఆ రచయిత ఏ మానవానుభవం గురించి మాట్లాడుతున్నాడో అది మాత్రం మీ సొంతం అవుతుంది. ఎప్పుడో మనం ఎవరమూ పుట్టకపూర్వం రష్యా నుంచి రాసిన దాస్తోయెవ్‌స్కీ, చెఖోవ్ ల కథలు ఎలా ఇష్టపడుతున్నాం? ఆ మంచులో బగ్గీలూ, స్లెడ్జి బళ్ళూ మనకి లేవు. అయినా ఆ అనుభవాన్ని మాత్రం పట్టుకోగలుగుతున్నాం. స్థలకాలాదులతో నిమిత్తం లేని మానవానుభవం ఒకటి మనకు అందుతోంది. దీన్ని గ్రహించగలిగినపుడు మనకు నిజమైనటువంటి సాహిత్యానుభవం ఏర్పడుతుంది.

అందువల్లనే నేను యూనివర్శల్ ఎక్స్‌పీరియన్స్ అనేదాన్ని అంగీకరిస్తాను. మన అనుభవాల్ని విస్తృతం చేస్తూ పోవడమే సాహిత్యం తాలూకు పరమార్థంగా నేను భావిస్తాను. దీనివల్ల విశాలమైన ప్రాపంచిక దృక్పథం ఏర్పడుతుంది. ఒక గొప్ప సంయమనం కలుగుతుంది. స్థల కాలాల పరిమితుల్ని అధిగమించి జీవితాన్ని చూడగలం.

9. ఇరవైయేళ్ళ వయసు రాక ముందు నుంచే కథలు రాస్తున్నారు. ఈ యాభై ఏళ్ళ వ్యాసంగం లో రైటింగ్ క్రాఫ్ట్ పట్ల మీ దృక్పథంలో వచ్చిన మార్పులు చెప్తారా? అంటే రచన కళని మీరు మొదట్లో స్వీకరించిన తీరుకీ, ఇప్పటి తీరుకీ మధ్య పరిణామదశల గురించి?

Right from the word go, 1961లో నా మొదటి సీరియస్ కథ ఆంధ్రప్రభలో పబ్లిష్ చేసినప్పటి నుంచి, ఇప్పటిదాకా, రచన అనేది పార్ట్ ఆఫ్ మై బీయింగ్. My life is never complete without writing. మిగతా biological needs లాగే. సాహిత్యం వల్ల జీవితాన్ని ఎలా చూడాలో నేర్చుకున్నాను. చాలామంది లాగే నా జీవితంలోనూ దుఃఖాలూ వేదనలూ ఎన్నో ఉన్నాయి. వాటినెలా చూడాలి, ఎలా తీసుకోవాలీ అనేది సాహిత్యం ద్వారానే తెలుసుకున్నాను.

రెండోది – నేను దేన్నయితే నమ్మలేదో దాని గురించి ఎప్పుడూ రాయలేదు. నా నమ్మకం ప్రకారమే నేను జీవితాన్ని జీవించాను, రచన చేశాను. ఇది నా లిటరరీ ఇంటెగ్రిటీలో భాగం. ఇది నా తాతయ్య శివశంకరశాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నాను. నమ్మకానికీ రచనకీ తేడా ఉందంటే ఇక వాటి గురించి మాట్లాడటం అనవసరం.

చాలామంది outsiders గా రాస్తారు. అది తప్పని కాదు. ఏదో ఒక సందర్భం గురించో, పరిస్థితి గురించో, కరువుకాటకాలున్న ప్రాంతం గురించో ఒక కథ రాయాలని కూర్చూంటావు. అలా రాసేటపుడు you sit there as a chronicler. ఆ పరిస్థితిని క్రానికల్ చేయాలన్నది నీ ఉద్దేశం. అక్కడ ఏదైతే వాస్తవం అని నువ్వనుకుంటున్నావో దాన్ని నీ కథలో పెడతావు. అదో పద్ధతి. నేనేమంటానంటే – it should be your own experience. నీ అనుభవం కావాలి అది. అనుభవానికి ఇందాక చెప్పిన నిర్వచనం ప్రకారం.

10. ‘వైయక్తికత అనేది లేదూ’, ‘స్థల కాలాల్ని అధిగమించగలిగేది సాహిత్యం’ అంటున్నారు కదా. ఈ దృక్పథం మొదట్నుంచీ ఉందా?

లేదు. నేను పెరిగే కొద్దీ, చదివే కొద్దీ తెలుస్తూవచ్చింది. నేను అరవైల చివర్లో జాన్ పాల్ సార్త్రే పుస్తకాలు చదివాను. అంతేకాదు, నేను మిత్రుల దగ్గర ఎక్కువ వాడే నాకు ఇష్టమైన మాట ఒకటుంది: చింతనాశీలత. Contemplation. అలా కూర్చుని కాంటెప్లేట్ చేయటం వల్ల నేను ఇందాక చెప్పిన ఆ డైమెన్షన్స్ అన్నీ అర్థం అవుతాయి. అప్పుడు రాయటం మొదలుపెడతాం. అలాంటి మానసిక స్థితి లో రచన చేసినపుడు మనం సీరియస్ రీడర్స్ కు కనెక్ట్ కాగలుగుతాం. ఆ మానసిక స్థితితో గాఢంగా రిలేట్ అయితే రీడర్ ఎప్పుడూ అర్థం చేసుకుంటాడు.

11. మీ కథలు కొన్ని వాస్తవికంగా సాగుతూనే ఉన్నట్టుండి దాన్నించి దూరం జరుగుతాయి. దీని గురించి చెప్పండి?

వాస్తవికత అనేదానికి చాలా పరిమితులు ఉన్నాయి. దాని రిలవెన్స్ దానికి ఉంది, కాదనటం లేదు. కానీ కేవల వాస్తవికత అనేది creatively not inspiring for me. లాటిన్ రచయిత Mario Vargas Llosa ‘The Feast of the Goat’ అనే నవల రాశాడు. డొమినిక్ రిపబ్లిక్ ను పాలించిన ఒక నియంత జీవితం గురించి. రచయిత వాస్తవికంగానే కథను చెప్తాడు, చెప్తూనే ఏం చేస్తాడంటే, తన కథన శక్తి ద్వారా, ఈ వాస్తవిక పరిమితుల నుంచి దాన్ని పైకి లేపి వదిలేస్తాడు. ఫలితంగా, అది కేవలం ఒక దేశానికి సంబంధించిన నియంత గురించి అని తెలుస్తూనే ఉన్నా గానీ, మనం కూడా రిలేట్ చేసుకోగలం. అప్పుడు అది ఏ ఇతర నియంతృత్వానికైనా, ఏ అరాచకానికైనా, ఏ దుర్మార్గానికైనా రిలేట్ చేసుకోగల సృజనాత్మక అనుభవం అవుతుంది. ఇక్కడ కూడా రచయిత చేస్తున్నది క్రానికలింగే, కానీ దాన్ని ఆ చుట్టూ వున్న వాస్తవిక పరిమితుల నుంచి ఎలివేట్ చేస్తూ రాస్తాడు.

12. మీ ఉద్దేశం మేజిక్ రియలిజమా?

ఇది most misunderstood word. మన తెలుగువాళ్ళు ఏం చేసినా అతి కదా. అసలు ఒకరకంగా ఆలోచిస్తే మన దేశానికి మాజిక్ రియలిజం అనేది కొత్తేం కాదు. నేను చెప్తున్నది మేజిక్ రియలిజం కాదు, సింబాలిజం.

మేజిక్ రియలిజం అన్నది మార్క్వెజ్ నుంచి మొదలయింది. నేరేషన్ లో కాలం అన్న డైమెన్షన్ ను మేజిక్ రియలిస్టులు తీసి పారేశారు. కాలంతో సంబంధం లేకుండా గతాన్ని వర్తమానం చేస్తూంటారు. మనవాళ్ళు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. చాలా సామర్థ్యం ఉంటే తప్ప దాని జోలికి వెళ్ల కూడదు. మన తెలుగు రచయితల్లో గోపిని కరుణాకర్ ఒక్కడే దానికి సమర్థుడు. అతను గొప్ప రచయిత. అతనికే అది చాలా సహజంగా పట్టుబడింది. దాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇమిటేషన్ లా ఉండదు. నాకు చాలా ఇష్టమైన రచయిత.

13. మీ శైలిని మీరు ‘సమాంతర వాస్తవికత’ అని నిర్వచించుకున్నారు. ఇది వాస్తవిక కథనం కన్నా ఏ విధంగా భిన్నమైనది?

ఇందాక మాట్లాడుకున్నాం వాస్తవికత గురించి. వాస్తవం అనేది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. నీకు ఏది వాస్తవమో అది ఇంకొకళ్లకి వాస్తవం కానక్కర్లేదు. మన ఫిలసాఫిక్ ట్రాడిషన్ లో కూడా చిదాభాస అని ఉంటుంది. వాళ్ళేమంటారంటే – నాలుగు కుండల్లో నీళ్ళు పోసి పెట్టు, చంద్రుడు నాలుగు కుండల్లోనూ ఉంటాడు, అంటే ఎంతమంది చంద్రులు ఉన్నట్టు లెక్క? అలాగ… truth as it appears to you is not necessarily true. అంచేత, నేను చాలా కథల్లో మామూలుగా కథ చెప్తూనే, కొంత లోపలికి వచ్చిన తర్వాత ఒక సంఘటనో, ఒక పాత్రో పెట్టి, I lift it from the ordinary reality. అది కూడా వాస్తవికతే, కానీ సమాంతర వాస్తవికత. నేను అనంతపురానికి సంబంధించి నాలుగు కథలు రాశాను. వాటిల్లో ఒక కథ దీని ఉదాహరణ. అలాగే నా ‘బరువు సామాను’ లాంటి కథలు పైకి ఒక కథ చెప్తూంటాయి. కానీ ఆ కథ వెనుక ఇంకో కథ ఉంటుంది. అది ఎక్కడా పైకి చెప్పను. ఇలాంటి కథల విషయంలో పాఠకుడు తన అనుభవాన్ని కూడా అప్లయి చెయ్యాలి. హాయిగా బువ్వ తిని కుర్చీలో కూర్చొని ఈ కథలు చదువుతానంటే కుదరదు. ఇంకేదన్నా చదువుకొమ్మంటాను. ఆలోచనకి నేను ఎంత శ్రమ పడ్డానో పాఠకుడూ అంత పడాలి. వందశాతం నేననుకున్నదే సహృదయుడూ అనుకోవక్కర్లేదు. అతను తన అనుభవాన్ని కథకు అప్లయి చేసి తన యదార్థాన్ని తాను వెతుక్కోవచ్చు.

14. ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు రచయిత నబొకొవ్ నుంచి ఒక విషయం నేర్చుకున్నాను అన్నారు, అదేమిటి?

చాలా చిన్నదే. నా కథల్లో బ్రాకెట్స్ ఉంటాయి గమనించారా? నబొకొవ్ ఒక్కోసారి ఒక పెద్ద సన్నివేశాన్నో, ఒక పాత్రనో, ఒక పెర్సెప్షన్ నో బ్రాకెట్లో పెట్టి ఒక చిన్న లైన్లో చెప్పేస్తాడు. అది నేను మరికొంత విస్తరించి వాడతాను.

15. త్రిపుర మీకు మంచి మిత్రుడు కదా, మీరు సాహిత్యం గురించి మాట్లాడుకునేవారా, మీ సంభాషణల్లో మీకు గుర్తున్నవి?

ఆయనకు సాహిత్యం గురించి మాట్లాడటం ఇష్టం ఉండేది కాదు. వద్దనేవాడు. మేము ఎప్పుడు కలిసినా పెర్సనల్ లెవెల్లోనే మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఒకసారి అడిగాను. “ఎంతో జీవితం చూశారు కదా, మళ్ళీ రాయటం మొదలుపెట్టవచ్చు కదా” అని. దానికాయన, “మీకో విషయం అర్థం కావటం లేదు. నేను రచయితను కాదు” అన్నాడు. “మరి ఇదంతా ఏవిటి?” అని అడిగాను. “అదంతా నా అనుభవం, అది చెప్పాలనిపించింది, అలా చెప్తే బాగుంటుందనిపించింది, అందుకని రాశాను, ఇప్పుడు రాయాలని లేదు, నన్నేం చేయమంటారు” అన్నాడు.

ఈ మాటల్ని కూడా లిటరల్ గా తీసుకోవక్కర్లేదు. ఆయన వ్యక్తిగత జీవితం తమాషాగా గడిచింది. ఆ జీవితంలోని ఇంటెన్సిటీని పద్నాలుగు కథలుగా ముక్కలు చేశాడు. మొత్తం ఒకటే కథ చెప్పాడు. He got it out of his system. మామూలుగా భాషలో చెప్పాలంటే ఆయన బాధేదో ఆయన తీర్చుకున్నాడు. తర్వాత ఆయనకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. సహజంగానే ఇంక రాయటానికేం లేదు.

16. కథా రచన చేసినంత విస్తారంగా నవలా రచన వైపు మీ దృష్టి ఎందుకు పోలేదు?

నాకు కథలంటే ఎక్కువ ఇష్టం. రాసిన నవలలు కూడా బాగా చిన్నవి. అసలు నేను – రచన ఇంతవరకూ ఉండాలి, ఈ కోవకు చెందాలి అనుకోను. అది సహజంగా ఎంతవరకూ డెవలప్ అవుతుందో అంతవరకూ పోనిచ్చి ఆపేస్తాను. కుళాయిలో నీరు పోయినంత పోయి చివరకు చుక్కలుగా మారి డ్రై అయిపోతుందే – అలాగే.

17. రచయితలూ, సమావేశాలు, పురస్కారాల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇవి రచయితకు ఏ రకంగా మంచివి కావంటారు?

వ్యతిరేకత కంటే అసంతృప్తి ఎక్కువ. మన రాష్ట్రంలో దేశంలో ఏ పురస్కారానికి గౌరవం లేదు. ఏ పురస్కారం తీసుకున్నా ‘ఎవరు ఇప్పించారు గురూ’ అని అడుగుతారు. ఎందుకంటే ప్రతిభ వల్ల వచ్చేవి తక్కువ అని అందరికీ అర్థమయింది కాబట్టి. ఎక్కువ శాతం ఇలా పంపకాలే.

18. మీకు సినిమా అంటే ఇష్టమని తెలిసింది. ఆ వైపుగా ప్రయత్నాలేమన్నా చేశారా?

(నవ్వుతూ) చేశాను. ఇంకా వదల్లేదు కూడా. ఎందుకంటే దృశ్యమాద్యమం అనేది మన క్రియేటివిటీకి కొనసాగింపు లాంటిది. నేను నమ్ముకున్న అక్షరం నాచేత కథలెన్నో చెప్పించింది. వాటికి కొనసాగింపే దృశ్యమాద్యమం అనుకుంటాను. మంచి సినిమా చూడటం అనేది నాకు ఒక గొప్ప ఈస్థటిక్ అనుభవం. నాలుగైదు ప్రయత్నాలు చేశాను,కుదరలేదు. కానీ ఇంకా ప్రయత్నాలు మానలేదు. నా కథలు కొన్ని స్క్రీన్ ప్లేగా చేస్తున్నాను.

19. రాస్తున్న, రాయాలనుకుంటున్న రచనల గురించి చెప్పండి?

వ్యాస సంకలనం ఒకటి తేవాలి. సంస్కృతి మీద, కల్చరల్ సింబాలిజం మీద ఇలా కొన్ని అంశాల మీద రాస్తున్నాను. ‘గేదె మీద పిట్ట’ అని ఒక నవల ఈమధ్యనే రాయటం పూర్తి చేశాను. ఆధునిక జీవితం లోని ఒక పార్శ్వం గురించి చెప్తుంది.

20. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు, వారిలో మీకు నచ్చింది ఏమిటి?

తెలుగులో త్రిపుర, కేశవరెడ్డి (‘అతడు అడవిని జయించాడు’లో సింబాలిజం అనంతం), పాలగుమ్మి పద్మరాజు, చాసో, గోపిని కరుణాకర్, కాశీభట్ల వేణుగోపాల్… ఇలా చాలామంది ఉన్నారు. ఇంగ్లీషులో లెక్కే లేదు.

21. దేశం లోని ఇతర భాషల సాహిత్యంతో పోలిస్తే తెలుగు సాహిత్యం స్థితిగతులు ఎలా ఉన్నాయి?

మనలో ప్రతిభకు లోటు లేదు. ఉదాహరణకు కథే తీసుకుంటే, దేశం మొత్తం మీద చదవదగ్గ కథలు రాస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఇక్కడ తప్పితే వారి గురించి బయట ఎవరికీ తెలియదు. ఎందుకంటే అనువాదాలు లేవు. అదే ఇతర భారతీయ భాషల విషయమే తీసుకుంటే, కొన్ని వారు రచన చేసిన వెంటనే ఇంగ్లీషులోకి అనువాదం అయి వెళ్ళిపోతున్నాయి. మనవి కనీసం పక్క భాషల్లోకి కూడా వెళ్ళటం లేదు. అలాగే ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వానికి కూడా తమ భాషా సాహిత్యాల మీద శ్రద్ధ ఉంటుంది. మన పాలకులు ఆ జోలికే వెళ్లరు.

**** (*) ****