కథ

వాల్‌ పోస్టర్

ఆగస్ట్ 2017

డ్డం మీద ఇంకా బొగ్గు మరకలు ఉండిపోయాయి. ఓ కంటి కొసన పుసులు వదల్లేదు. వెనక అరుగుమీద సగం పుచ్చిన చెక్క స్థంబానికి వీపు ఆనించి కూచునాడు మదార్ వలీ. సత్తుగిన్నెలోంచి గాజు గ్లాసులోకి టీ వడబోసింది బీ.

మోకాళ్ళమీద వంగి గ్లాసు తీసుకున్నాడు వలీ. కుర్చీ మీద కూచొని టీ తాగుతూ తమ్ముడి వైపే చూస్తోంది బీ. మదార్ వలీకి పదకొండేళ్ళుంటాయి. వాడికంటే ఏడెనిమిదేళ్ళు పెద్దది. ఎక్కణ్ణుంచో కాకి కోడిగుడ్డు డోల్ల తీసుకొచ్చి దొడ్లో పడేసింది. ఉదయం ఎనిమిది దాటిపోయింది.

టీ చప్పరిస్తూ వలీ అడిగేడు.

“నానెళ్ళాడా?”

తమ్ముణ్ణి చూస్తూ బీ తొట్రు పడి అంది.

“ఏమో నిషా దిగింది ఎళ్ళేడు. జేబులో ఇరవై దొరికాయి”

“రాత్రి లేటయిందా? నానొచ్చి పండుకున్నాడు?” ఆఖరి గుక్క టీ తాగి గ్లాసు గిన్నెలో పడేస్తూ చెప్పింది బీ.

“రమణమ్మ సినిమాకి పోదావంది. పోయినా”

తమ్ముడేవీ అన్లేదు. గ్లాసు అక్కకందించి కాళ్ళు బారజాపి కుచున్నాడు. అరుగు మూల చీపురు తీసుకొని లోపలికి వెళ్ళింది బీ.

ఊరి మధ్య బస్తీ అది. నగరాన్ని చీలుస్తూ సూటిగా పోయే రహదారికి ఒక వైపు సినిమాహాలు, ఒక పక్క అసంఖ్యాకంగా వెలసిన షాపుగొళ్ళ మధ్య నుంచి ఓ సన్న రోడ్డు చీలి పర్లాంగు దూరం సాగి పల్లంలో ఆగిపోతుంది. రోడ్డు ఆగిన చోటు నుంచి బస్తీ మొదలైంది. చివికిపోయిన ఇటుకమేడలు, ఎముకలు వెళ్ళుకొస్తున్న పెంకుటిళ్ళు, గుడిశలూ, బస్తీ అంతా చిక్కుపడ్డ దారం ఉండలా వుంటుంది.

లోపలికి వెళ్ళటం కంటే బయటకి రావడం కష్టం. ఇళ్ళను వేరుచేస్తూ కాలవలున్నాయో, రోడ్లు కాలవలయిపోయాయో చెప్పటం కష్టం. గాలి వీచినప్పుడల్లా బస్తీ అంతా మోకాళ్ళలోతు నీళ్ళలో కరుగుతూ ఉంటుంది.

మదార్ వలీ ఇల్లు మొదట్లో ఉంది. తెల్ల ఎరువుల బస్తాలు కలిసి కుట్టిన పరదా పెంకుటింటి ద్వారం ముందు వేలాడుతోంది. ముందు చిన్న పంచ, లోపల రెండు గదులూ, వెనక సన్నని అరుగూ, నాలుగు లుంగీల మేర పెరడూ, పెరట్లో ఓ పక్క ఇటుక గోడల పాయిఖానా, ఓ పక్క తాటాకుల స్నానాల గదీ, రెండింటికీ కప్పుల్లేవు. అరుగు మీద బారుగా నాలుగు ప్లాస్టిక్ బాల్చీలలో, ఓ సత్తు బిందెలో నీళ్ళు తెచ్చి పోసింది బీ, ఉదయమే.

చీపురు తీసుకొని అరుగు మీదకి వచ్చింది బీ. మొండి చీపురు చర చర శబ్దం చేస్తోంది.

“పనికి బోవా? మొకం కడగరాదూ సరిగా? ”

ఒంగి తుడుస్తున్న అక్కను చూశాడు వలీ. పాత జాకెట్టూ పరికిణీలో వుందామె. చామన చాయ, సన్నగా, పెద్ద జుట్టుతో కొంచెం పెదాలు, బీ అంత అందమైంది కాదు. చిత్తడి నేలలో, ఏ విత్తనమో తెలీని ఏపుగా పెరిగిన మొక్కలాంటిదామె. దానికి

ప్రత్యేకమైన పరిమళం లేదు. దారిద్ర్యాన్నీ, దైన్యాన్నీ నిశ్శబ్దంగా ధిక్కరించే వక్షస్థలం బీలో కనిపించే ఒకే ఒక జీవ లక్షణం.

ఒంగి తుడుస్తున్న ఆమెనే చూస్తున్నాడు వలీ. సమాధానం రాకపోయే సరికి తలెత్తి తమ్ముడు వేపు చూసిందామె.

వాడు కళ్ళు తిప్పుకున్నాడు. పక్కకి తిరిగి చిమ్మటం ప్రారంభించింది బీ.

“కొట్టేడు బోసడికే”

“నువ్వేం జేశావ్?”

“ఏంజేయలే”

“సరే ఎళ్ళు”

ఒక క్షణం అలాగే కూచుని లేచాడు వలీ. చీపురు అరుగు మూల పడేసి టీ గిన్నెలు తీస్తూ అంది బీ.

“రేపు నీకు కొత్త జుబ్బా తెస్తా”

మదరవలీ నవ్వేడు. నల్లగా బక్క పలచగా ఉంటాడు వలీ. పల్చటి పెదాలు ఒక పక్కకు సాగి వాడు నవ్వితే బుగ్గమీద చిన్న సొట్ట పడుతుంది. వాడు నవ్వితే చూట్టం బీ కి ఇష్టం.

“ఎల్లు, పో”

అరుగుమీంచి గెంతి, డబ్బతో నీళ్ళు తీసుకొని పాయిఖానా వేపు నడిచాడు వలీ. గిన్నెలు తోమడం మొదలు పెట్టింది బీ. (“ఈడు అన్నం పెడతాడో, ఇంట్లోంచి భాడకో పొమ్మంటాడో!”). వలీ మయిన్ రోడ్డు మీద కరీం హోటల్లో క్లీనరు. రాత్రి కరీం లెంప వాయించాడు. (“మూడు కప్పులు పగలేసావ్. పైసా నువ్వు కడతావా, నీ అక్కని పంపిస్తావురా”) వలీ రెండు బూతులు గొణిగేడు. అవి జనాంతికం అయిపోయాయి. వాడికి అక్కంటే ఇష్టం. వలీ ఎనిమిదో ఏట తల్లి రైలు కింద పడింది. తల్లి రైలు పట్టాల వరకూ ఎందుకో వెళ్ళిందో, గేట్లోంచి వెళ్ళకుండా పట్టాలకడ్డంగా దాటటం ఎందుకో వలీకి అర్ధం కాలేదు. భార్య పోయినందుకు సంతాప సూచకంగా ఖాదర్ వారం రోజులు తాగేడు. తర్వాత రోజూ సాయంత్రం ఇంటికి తాగొచ్చేవాడు. ఖాదర్ ఏం చేస్తుంటాడో ఎవరికీ తెలీదు. అయితే కనీసం రెండు రోజులకోసారయినా ఇంటికొస్తుంటాడు. తాగిన నిద్రలో ఉండగా బీ అతని జేబులో డబ్బులు తీస్తుంటుంది. వలీకి తండ్రి అంటే ఆసహ్యం. వాడికి కరీమ్‌ని చూస్తే ఖాదరూ, ఖాదర్ ని చూస్తే కరీం జ్ఞాపకం వస్తారు.

వాడింకా రాత్రిళ్ళు అక్క పక్కనే పడుకొంటాడు. నిద్ర మెళకువ వచ్చినప్పుడు బీ గుండెల మీద చెయ్యేసి పడుకొంటాడు. తరచుగా వాడు బీకి దగ్గరగా జరిగినప్పుడల్లా ఉక్కలో ఓకటి రెండు క్షణాలు ఏదో అగరొత్తుల పరిమళం వస్తుంది.

బీ గబగబ వంట చేసి స్నానం చేసింది. భుజానికి సంచీ తగిలించుకొని బయట పడింది. బీ రమణమ్మ దగ్గర కుట్టుపని చేస్తుంది. ఓ అరడజనుకి పైగా అమ్మాయిలు అమె దగ్గర పని చేస్తుంటారు. కన్నూ ముక్కూ తీరుగా ఉన్న అమ్మాయిలెవరైనా చిక్కుల్లో ఉంటే రమణమ్మ మనసు చివుక్కు మంటుంది. మార్గం చూపిస్తుంది. బుగ్గన నిత్యం నలిగే తాంబూలంతో , రిక్షా అంతా సరిపడే మధ్యభాగంతో, ఆ ప్రాంతంలో ఎవరూ రమణమ్మ కుట్టుపని చేయగా చూడలేదు.

వలీ హోటల్ గుమ్మం ముందు నుంచున్నాడు. చుట్ట వెలిగించి అగ్గిపుల్ల పారెయ్యబోతూ చూశాడు కరీం. అతనివైపే చూస్తున్నాడు వలీ.

“ఏం కావల్రా?”

“డూటీ కొచ్చే”

“డూటీకొచ్చావా! ఎవడ్రమ్మాన్నడంట చల్”

తలొంచుకొని నించొన్నాడు వలీ.

“డూటీలో జేరతా”

వాడివైపు దీర్ఘంగా చూసి చెప్పేడు కరీం.

“రేపురా! ఈడ్నించి పో! ఇంటికాడెవరున్నారు?”

“దేనికి?”

“పనుందిరా”

“ఎవరూ లేరు. అక్క కుట్టుమిషను కాడికి పోయింది”

మళ్ళీ రోడ్డు మీదకొచ్చేడు వలీ. జేబులో రెండు రూపాయలున్నాయి. రోడ్డు దాటి సినిమాహాలు దగ్గర బండిలో ఇడ్లీ తిని, టీ తాగి, బీడీ వెలిగించి నుంచున్నాడు వలీ. రోడ్డు మీద రద్దీ ఎక్కువైంది. బస్సుల్లోంచీ వెళ్ళుకొస్తున్నారు మనుషులు. అప్పుడు చూశాడు వలీ. పేవుమెంటు పక్కనుంచీ వెళుతోంది టైరు బండి. దాని పక్కనే ముగ్గురు మనుషులు పలుగూ పారలతో నడుస్తున్నారు. బండి మీద బోర్లా పెద్ద రేకులతో వేసిన హోర్డింగ్ బండీ, మనుషులూ శవయాత్రలా అనిపించింది.

“అగ్గీ”

తేరుకొని చూశాడు వలీ. నలుగురు కూలీల్లో ఒకడు నోట్లో సిగిరెట్టు పెట్టుకొని ఎదురుగా నుంచొన్నాడు. దమ్ములాగి బీడీ ఇచ్చాడు వలీ. ఆఖరి దమ్ము లాగి బీడీ అవతల పారేసి బండి వెనక చేరాడు. సినిమాహాలు దాటిన తర్వాత కొంతదూరంలో ఖాళీ స్థలం ఉంది. ఏదో ప్రభుత్వ కార్యాలయం బోర్డు, ప్రహరీ గోడ తప్ప అక్కడేవీ లేవు. బండి గోడవారగా ఆగింది. గోడని ఆనుకొని నేలమీద బొగ్గుతో గుర్తులు పెట్టి ఉన్నాయి. నలుగురూ మాట్లాడుకొని గుర్తులు పెట్టిన చోట తవ్వడం మొదలు పెట్టారు. లోతుగా రెండు గుంటలు తవ్వి పలుగూ పారా పక్కన పడేసి బీడీ వెలిగించారు వాళ్ళు. గుంతల్లోంచి మట్టి తీసిన చేతులనిండా తడి మట్టి అతుక్కు పోయింది. తీరిగ్గా బీడీలు కాల్చి, బండిని గుంతలకు దగ్గరగా జరిపి రేకు చట్రాన్ని కిందికి దించి నిలబెట్టేరు. వలీ దగ్గరగా వచ్చి చూశాడు. బండి, మనుషులు దగ్గరగా ఉండటంతో ఏవీ సరిగా కనిపించటంలేదు. రేకు చట్రాన్ని గుంటలో దింపటానికి సర్వి కాళ్ళు బిగించి ఉన్నాయి. నలుగురూ ప్రాణప్రదంగా ఎత్తి, కేకల మధ్య బూతుల మధ్య నవ్వుల మధ్య దాన్ని పాతి పెట్టారు.

హోర్డింగ్ ఎదురుగా వచ్చి నిలుచున్నాడు వలీ. వాడితో పాటు మరో ఇద్దరు కుర్రాళ్ళు, ఓ రిక్షావాడు దాన్నే చూస్తున్నారు. రేకు కొత్త రంగులు ఎండలో తళ తళ మెరుస్తున్నాయి. దీర్ఘ చతురస్రాకారంలో చక్కటి లేత రంగులు. ఎదురుగా నుంచొని రెండు చేతులే వెనక్కి కట్టుకొని తల పైకెత్తి వలీ జాగ్రత్తగా చూశాడు. ఇరవై నిముషాలు చూసింతర్వాత హోర్డింగ్ వాడి మెదడులో మొలిచింది. మెడ నొప్పి పుట్టింది. వెనక్కి చూస్తూ సినిమా హాలు వైపు నడిచాడు. చుట్టూరా మోగే కారు హారన్లు, మోటార్ల శబ్దాలూ లీలగా వినబడుతున్నాయి వలీకి. హాలు దగ్గర ఆగి బడ్డీ కొట్లో మరో రెండు బీడీలు కొన్నాడు.

రెండో బీడీ వెలిగించగానే వాడికి బీని చూడాలనిపించింది. రమణమ్మ ఇంటివైపు నడివాడు వలీ. నడుస్తున్నా వాడి మనసులో విచిత్రమయిన స్థబ్దత ఏర్పడింది. ఆ స్థబ్దతలో రంగు రంగుల హోర్డింగ్ బరువుగా ఇమిడిపోయింది. వాడిని తేరిపారచూసి బీని బయటకు పంపించానంది రమణమ్మ. ఆమె ఎర్రటి నోటి వైపు ఓ సారి కోపంగా చూసి మళ్ళీ రోడ్డు మీదకు వచ్చేడు వలీ. వాడికి అక్కను వెంటనే చూడాలనిపించింది.

మధ్యాన్నం వరకూ రోడ్ల మీద తిరిగి ఇంటికెళ్ళేడు వలీ. బోంచేస్తూ పనిలోకి వేళ్ళలేదని చెప్పేడు.

“నే జెప్తాలే” అంది బీ. వలీకి ఎందుకో అక్కని మొదటిసారి చూస్తున్నట్టుగా ఉంది. మంచం ఎక్కి పండుకోగానే నిద్రే పట్టేసింది.

సాయంత్రం ఐదు దాటింది. టీ తాగి మొహం కడుక్కుని బయటకు వెళ్ళిపోయాడు వలీ. రోడ్డు దాటి సినిమాహాలు దగ్గర బీడీ వెలిగించి అప్రయత్నంగా హోర్డింగ్ దగ్గరికెళ్ళి నుంచొన్నాడు. లేత రంగుల్లో అందంగా వేసిన తాజ్‌మహల్ టైల్స్ ఫేక్టరీ హోర్డింగ్ అది. (‘ఇంట్లో తాజ్ చల్లదనం. మీ చుట్టూ తాజ్ సౌందర్యం’) పెద్ద హాలు. హాలు నిండా రంగుల్లో పరిచిన టైల్సు. కిటికీలోంచి తోటలో పచ్చటి చెట్ల పచ్చటి తలలు కనిపిస్తున్నాయి. సినిమాల్లో కూడా వలీ అటువంటి ఇల్లు చూడలేదు. గది మధ్యలో చల్లని నేల మీద పడుకొని ఉందామె. మోచేతుల మీద ముఖం ఆనించి , విశాలమైన కళ్ళు ఎత్తి చూస్తోందామె. అనిమేషలా, గంధర్వ కాంతలా ఆమెకీ ప్రపంచం తాలూకూ దుమ్మూ, ధూళీ, పెట్రోలు వాసనలు సోకడం లేదు. ఆమె ఎదురుగా ఎవరో కుర్చీలొ కూచొని ఉన్నారు. మనిషి పూర్తిగా కనిపించడు. ఖరీదైన పేంటు కాళ్ళు రెండు మిసమిస లాడే నల్లని బూట్లతో ఒకదాని మీద ఒకటి వేసుకొని కూచొన్నాడు అతను. ఆమె వంటి మీద సముద్ర నీలం చీరలాంటి దుప్పటి వేసుకొంది. చీర నడుం పైభాగం సరిపోలేదు.

నల్లటి అలలా లేచి పరుచుకొన్న ఆమె జుత్తు భుజాల మీంచి వీపు మీదికు ప్రవహిస్తోంది. భుజాల కింద సన్నటి ఒంపుని చూస్తూఉండిపోయాడు వలీ.

వలీ చుట్టూ చీకటి పడింది. రోడ్డు మీద దీపాలు వెలిగాయి. కార్ల కళ్ళు వెలిగేయ్యి. వలీ రోడ్డు దాటి అవతలకు వెళ్ళేడు. హోటలు రద్దీగా ఉంది. బిల్లులు వసూలు చెయ్యటంలో హడావిడిగా ఉన్నాడు కరీం. రేకు టేబిలు మీంచి కప్పులూ, ప్లేట్లూ, బాల్చీలోకొ వేసుకొంటూ లోప్లలినుంచీ నారాయణ నవ్వేడు. చెయ్యి ఊపి, రేపొస్తానని సంజ్ఞ చేసి, మరోసారి కరీం వైపు చూసి బయల్దేరాడు వలీ. కరీంది బట్టతల. నోట్లో రోజులో చాలాభాగం సిగిరెట్టు తగలడుతూ ఉంటుంది. చిన్న కళ్ళకు సుర్మా పెట్టుకొంటాడు. చప్పి దవడలనిండా సూదులు గుచ్చినట్టు చిల్లులు. సిగిరెట్టు నోట్లోంచి తీసినప్పుడల్లా క్లీనర్లని బూతుతో కేకెయ్యటం కరీం అలవాటు. ఖాదర్ మొహం కూడా సన్న చిల్లుల మయం. వలీకి అప్పుడప్పుడూ కరీం, ఖాదర్ ఇద్దరూ రైలు కింద పడి చచ్చినట్టు కలొస్తూంటుంది. ఒకసారి బీతో చెప్తే వాడి తలని పొట్టకి అదుముకుంటూ అరగంటసేపు నవ్వింది.

పేవ్‌మెంటు మీద ఇనప రైలింగ్ మీద కూచున్నాడు వలీ. బాగా చీకటి పడిపోయింది. ఇంటికెళ్ళే సందు చీకటి కాలవలా ఉంది. తరచుగా జనం వెళ్ళి సందుగోడవేపు నుంచొని వస్తున్నారు. వలీ మనసులో ఇదివరకు లేని చైతన్యం లాంటిదేదో కదలడం మొదలైంది. మళ్ళీ బీ జ్ఞాపకం వచ్చింది. అక్క జ్ఞాపకం రాగానే వాడికి సంతోషం అనిపించింది.

“ఇంటికి రావా, ఈడ కూచున్నావు?”

ఉలిక్కి పడ్డాడు వలీ. బీ పక్కనే నుంచొని ఉంది. ఆమె చేతిలో ప్లాస్టిక్ బుట్టలో ఉల్లిపాయలున్నాయి. వలీ నవ్వేడు. ఇద్దరూ చీకటి సందులోకి నడిచారు. ముక్కుకి చెయ్యడ్డం పెట్టుకొంది బీ.

గదిమూల కోడిగుడ్డు దీపం తగ్గించి ఉంది. గోడ మీద నీడల్లా రెండు బల్లులు ఉండుండి కదులుతున్నాయి. తెరచిన కిటికీలోంచి గాలి రావటం లేదు. తరచుగా వాసన తప్ప. ఇద్దరికీ విసురుతూ బీ ఎప్పుడో నిద్రపోయింది. వలీ బోర్లా పడుకొని ఒక చెయ్యి అక్క నడుం చుట్టూ వేసి పడుకున్నాడు.

తోట రాత్రి పడ్డ వర్షానికి తడిసింది. ఉదయపు ఎండలో మరీ పచ్చగా ఉండి, చెట్లు కమ్మగా నిట్టూరుస్తున్నాయి. కిటికీ పక్కనే విరబూసిన పూవులు బీ గుండెలనిండా పరిమళాలు నింపుతున్నయి. తలారా స్నానం చేసి, ఆరడానికి ఎర్ర టర్కీ టవలు చుట్టుకొందామె. లేత నీలం చీరలో బీ నీరసంగా, అందంగా ఉంది. టీపాయి మీద వెండి ప్లేట్లో పరాఠాలు పూల వాసనలో కలిసి పరిమళిస్తున్నాయి. బయట కారు హారన్ మోగింది. బీ వాచి వేసుకొంటుండగా లోపలికొచ్చాడు వలీ. కంగారుగా వచ్చి కుర్చీలో కూచొన్నాడు. బీ వెండి గిన్నిలో కమ్మటి మాంసం కూరలో ముంచి పరాఠా ముక్క తమ్ముడి నోటికి అందించింది. పసుపు పచ్చ రంగు చొక్కా వలీ వణ్టిరంగులో కలిసిపోయింది. పట్టులాంటి జుట్టు గాలికి కలవరపడుతూ మొహం మీద పడుతూంటే మధ్య బీ వెనక్కి తోస్తోంది.

మెట్ల మీద నుంచుని బీ బుగ్గ మీద మెత్తగా ముద్దు పెట్టుకొంది. చెయ్యి ఊపి కార్లో వెనక సీట్లో కూరుకుపోయాడు వలీ. పెద్ద పడవలా తెల్లటి కారు నదిలోకి జారిపోయింది. నలుగురు మనుషులు శవాన్ని మోసుకుపోతూ అద్దంలోంచి కనిపించారు. కారు వాళ్ళని దాటుతుండగా అగరొత్తుల వాసన కిటికీలోంచి వచ్చి పడింది.

“ఎవరు?”

“టీ స్టాలు కరీం బాబూ” అన్నడు డ్రైవరు.

ఒళ్ళో తల పెట్టుకొని జుట్టులో బంగారు రంగు వేళ్ళు కదుపుతూ నిద్రపుచ్చింది బీ. వలీ నిద్ర నీలిమలోకి జారిపోయాడు. తమ్ముడి తల మెల్లగా వళ్ళోంచి దిండు సువాసనల్లోకి జార్చి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది బీ. తల కదిపి దిండు ముఖం మీదకి లాక్కున్నాడు వలీ.

“ప్చ్”

అంటూ చటుక్కున లేచింది బీ. చెమటతో తడిసిన ఆమె పొట్టలోకి వలీ మొహం కూరుకు పోయింది. జుట్టు ముడేసుకుంటూ లేచి కూచొందామె.

“ఎదవా”

వెల్లకిలా పడుకొని బద్దకంగా బీ వైపు చూశాడు వలీ. లేచి కూచొని అక్కవైపు చూసి నవ్వేడు.

వలీ ఉదయమే పనిలో చేరేడు. వీలైనప్పుడల్లా కరీం వైపు చూస్తున్నాడు. వాడిలో విచిత్రమైన ఉత్సాహం కడుపు నిండుగా ఉంది. బిర్యానీ తిన్నట్టు , మధ్యాహ్నం అన్నం తింటూ పెద్దగా నవ్వేడు. వాడలా నవ్వడం చూడ్డం నారాయణకి మొదటి సారి. టేబిలు దగ్గర్నించి అరిచాడు కరీం.

“ఏరా బామ్మర్దీ నవ్వుతుండావే?”

సాయంత్రం నారాయణ, వలీ టీ తాగి, బీడీలు వెలిగించి ‘తాజ్‌మహల్ ‘ దగ్గరికొచ్చేరు. దాని వైపే చూస్తూ నుంచున్నాడు వలీ. తోటలోంచి చల్లటి గాలి తగిలింది వాడికి.

“మా ఇల్లే” అన్నడు వలీ.

వలీ వైపు చూసి పెద్దగా నవ్వాడు నారాయణ.

తరవాత వారం రోజులూ వలీ బొంగరంలా పనిచేశాడు. కరీంని చూసిన కొద్దీ కరీం శవం గుర్తొచ్చి హాయిగా ఉంది వాడికి. రోజూ రాత్రి బీ విసుక్కుంటున్నా మరీ దగ్గరిగా జరిగి పడుకొంటున్నాడు వలీ. ఉక్కా, చెమట, కిటికీ ధారపోసే వాసనలూ వాణ్ణి బాధించటం మానేశాయి. నిద్రలోకి జారేముందు కళ్ళు మూసుకొని రోజుకో చల్లటి కల కనడం అలవాటైంది వాడికి. వలీ ఆలోచనలెప్పుడు కరీం చుట్టూ తిరుగుతూండేవి. తరచుగా కరీం వాడిని చావబాదినట్టు కలొస్తూండేది. వేరే కలలు కనడానికి వలీకి ఎప్పుడూ అవకాశం కలుగలేదు. ఎప్పుడేనా సినిమాలు చూసినా కరీం కల్లో పగ తీర్చుకోవడానికి మాత్రం సరిపోయేవి.

ఇప్పుడు ఒకరోజు రాత్రి ఖాదర్ వాడి తోటమాలి. మరో రోజు కరీం ఒంటి కాలితో డాల్డా డబ్బాతో కార్లో కుచున్న వలీనిఈ, రోడ్డు మీద వాళ్ళనీ అడుక్కుంటుంటాడు. ఓ రోజు పెద్ద తెల్ల కారులో వాడూ నారాయణా సినిమా కెళ్ళారు. రోజూ ముఖ్యంగా ందాక్క ఒళ్ళో మెత్తని పరుపు మీద నిద్ర. వలీ చుట్టూ ‘తాజ్‌మహల్ సౌందర్యం, చల్లదనం ‘ కమ్ముకున్నాయి. పగలు ప్లేట్లూ , కప్పులూ కడగడం, తియ్యడం ఇబ్బందిగా లేదు. పగలు అవాస్తవంగా , రాత్రి వాస్తవంగా వాడి పదకొండేళ్ళ జీవితం వ్యత్యస్తంగా ఓ కొత్త కక్ష్యలో తిరగడం ప్రాంబించింది. బీ రోజు రోజుకీ అందంగా కనిపిస్తోంది వాడికి.

మరో పది రోజుల తరువాత ఓ రోజు మధాహ్నం కరీం బజారుకని సంచి తీసుకొని వెళ్ళిపోయాడు. కరీం వెళ్ళిన అరగంటకి ఇప్పుడే వస్తానని చెప్పి బయటపడ్డాడు వలీ. వాడికివాళ సాయంత్రం నారాయణతో సినిమాకెళ్ళలని ఉంది. బీడీ కాల్చి, అప్రయత్నంగా ఇంటి వేపు తిరిగాడు వలీ. సందులో ముగ్గురు పక్కపక్కనే గోడవేపు తిరిగున్నారు. సందు తిరుగుతున్న వలీ కాళ్ళు తడిశాయి (‘ఎదవ కొడుకులు’)

ఇంటి తలుపు వేసి ఉంది. రెండు మెట్లూ ఎక్కి బీని పిలవబోయి ఆగి పోయాడు. నిద్రపోతుంటే అక్కని లేపడం వాడికిష్టం లేదు. కానీ బీ మధ్యాహ్నం రమణమ్మ దగ్గర ఉంటుంది. మళ్ళీ అరుగెక్కి కిటికీ తలుపు చిల్లులోంచి లోపలికి చూశాడు వలీ. గది అవతలి తలుపు ఒకటి తీసే ఉంది. పలుచని చీకట్లో ఉందా గది. మంచం మీద పడుకొని ఉంది బీ. లోపలి చీకటికి కళ్ళు అలవాటు పడ్డాయి. వాడి గుండె రెంచీలో పెట్టి నొక్కినట్టయింది. బీ పక్కనే మోచేతి మీద ఆని మరో వ్యక్తి పడుకొన్నాడు. అతని రెండో చెయ్యి యధాలాపంగా బీ నడుం మీద వుంది. అతని కాలు ఆమె కాలి మీద వేసి ఉంది. వలీ చూస్తుండగానే మంచం మీంచి లేచి తాడు మీద లుంగీ చుట్టుకుని నుంచొన్నాడు కరీం. ఇప్పుడు బీ నగ్న శరీరం స్పష్టంగా కనిపించింది వలీకి.

మెట్లు దిగి హోటలుకి వెళ్ళిపోయాడు వలీ. కడుపు మీంచి కారు వెళ్ళినట్టుంది. వెనకాల తొట్టిదగ్గర కప్పులు కడుగుతూ మూడు కప్పులు పగలకొట్టి కాలవలోచి బయటకు తోశాడు. కప్పులు కడుగుతూ మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ఏడిచాడు వలీ. సాయంత్రం నారాయణకి చెప్పకుండా వెళ్ళిపోయాడు. బస్సులూ, కార్లూ, లారీలు అన్నీ వాడి మీదకు వస్తున్నట్టే ఉంది. కరీం ని వాడికి వచ్చిన బూతులన్నీ తిట్టాడు. రాత్రి పది గంటలవరకూ తిరిగి ఇంటికెళ్ళాడు వలీ. బీ తిట్టినా అన్నం తినకుండా , కింద చాపేసుకొని పడుకున్నాడు. రాత్రి వాడు చచ్చిపోయినట్టూ కరీం నవ్వుతున్నట్టూ కలొచ్చింది. రెండొ రోజు అర్ధరాత్రి మెలకువ వచ్చింది బీ కి. చాపమీద పడుకొని నిద్రలో ఏడుస్తున్నాడు వలీ. తమ్ముడికి ఏమయ్యిందో అర్ధం కావటం లేదామెకి. వలీకి రాత్రిళ్ళు వాడికే అర్ధం కాని చీకటి కలలొస్తున్నాయి. అక్క వైపు చూడ్డానికి భయంగా ఉంది వాడికి. సిల్కు, పట్టు బట్టల్లోంచి, పాల రాతి ఇంట్లోంచి బయటపడి బీ ఇప్పుడు వలీ కళ్ళకి మురికిపాతల్తో ఇబ్బందిగా , కొత్తగా కనిపిస్తోంది.

సాయంత్రం బీడీ వెలిగించి సినిమాహాలు దగ్గర నుంచొన్నాడు వలీ. హంసలాంటి పెద్ద తెల్లకారు ఆగింది. అందులోంచి నడి వయసు తెల్లటి వ్యక్తి, ఆయన, ఇద్దరు పిల్లలూ దిగేరు. ఆనమె వయసు బీ అంత ఉంటుంది. కుంకుమా బంగారం కలిసిన రంగులో వుందామె. నేలమీద మోపిన ఆమె పాదాలు ఏవో ఎర్రని పువ్వుల్లా ఉన్నాయి. తమ్ముడి భుజం మీద చెయ్యి వేసి లోపలికి వెళ్ళిపోయింది. కారు కదిలిపోయింది.

బీడీ అవతల పారేశాడు వలీ. కారు రోడ్డు ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్రయత్నంగా హాలు దాటి ‘తాజ్‌మహలు ‘ వైపు నడిచాడు. లైట్లు వెలిగేయి. హోర్డింగు ఎదురుగా నుంచున్నాడు వలీ.

తెల్లరంగు వేసి ఉన్న చట్రం మీద పెద్ద రెండు ఎక్స్ గుర్తులూ, ఓ పక్కగా పేడ ముద్ద వేసి ఉన్నాయి.

**** (*) ****

( 5-4-1991, ‘ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక ‘ నుంచీ )