మావూరి ముచ్చట

గంగులవ్వ మజ్జిగ

ఫిబ్రవరి 2016

నా జతది లచ్చిమి , నేను పొద్దుమావిటేలగా బండమింద ఒడ్లు ఎండబోసుంటే తొయ్యను బొయినాము. బండ తోస్తా
“మే లచ్చిమీ దిన్నమూ గంగులవ్వోల్లింటికి పొయ్యే యాలెకే మజ్జిగ అయిపోతున్నాయి. ఆవుల సన్నప్ప కొడుకులు, తిక్క సిన్ని కూతుర్లు ,మారక్క మనవల్లూ దినామూ మన కంటే ముందుగానే బోయి గంగులవ్వ పంచ పట్టుకుని, ఆ యవ్వ మజ్జిగ కుండ ఇంట్లోకి తెచ్చేయాలకి పోపిచ్చు కొని పోతాఉండారంట. మా యమ్మ దినామూ తిడతా ఉంది. ముందుగా పోతే ఏమి నిగడదన్ని పడుకుంటావు అని . మన కంటే ముందే ఆ బెక్కి నాయాళ్ళు పోతా ఉండారు. అసలే నా బట్లు బెక్కిడిసి పోయిండారు. వాల్లిండ్లల్లో సంగటి కడికి లేవు. రేపు మనం మేలుకోవాల” అని మాట్లాడుకొని ఆ రెయ్యి రాత్రే చెంబు తల కాడ నే పెట్టుకొని పనుకున్నా. కోడి కూస్తానే లేసి కూసుంటి. మా యమ్మ ” ఏమ్మే బుజ్జీ ఇంత పొద్దున్నే లేసినావు ” అని అడిగింది. “గంగులవ్వ ఇంటికి మజ్జిగకు పోవాలి “అంటిని.ఆ యాలకే మబ్బు ఇడిసి తెల్లపటము ఏస్తా ఉంది . చెంబు ఎత్తుకొని లచ్చిమి వాళ్ళింటికి పోయి గడపలో నిలబడితిని. వాళ్ళమ్మ
” ఏమ్మే చేయ్ తెల్లారకనే వచ్చేసినావు ఎగురలాడేదానికి ,మీ అమ్మ ఇంట్లో ఏం పనీ పెట్టదు ,కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినంట” అని తిట్టె.”త్తోవ్ మజ్జిగ కు పోదామని వచ్చినా ” అన్నా.ఆ యాలకే లచ్చిమి నా మాట విని లేసి చెంబెత్తుకుని వచ్చే.

మా ఊరందరికీ గంగులవ్వ మజ్జిగంటే అంత ఆశ ! వాళ్ళ కర్రావు ,పసావు ,పుల్లావు దగ్గర పాలు కుండకు పిండేది . మూడు ఆవుల నుంచీ కడవడు పాలు పిండేది .కడవడు పాలూ పొయ్యి మింద పెట్టి పేడ నుగ్గులు ఏర కొచ్చి పొయ్యి నిండా పోసేది . ఆ నుగ్గులతో పాలు ఎర్రగా కాగేవి . దాంట్లో ఎప్పేసి పేర బెట్టేది . ఆ మజ్జిగ కని ఇంటి ముందర గుంజ నాటింది. మజ్జిగ కవ్వం కట్టేసి చిలకతా ఉంటే సరక్ సరక్ అనే ఆ శబ్దానికి పిల్లా బిసికి అంతా చెంబు లెత్తుకుని గంగులవ్వ తల మగసాలు పట్టుకోని కూసోనుండేవాళ్ళు . బాగా రుసి వస్తుందని మజ్జిగ కుండని నారవ ఆకులతో రుద్ది కడిగి పెట్టేది ,ఎండ బడితే నెయ్యి ముంత లోనే కరిగి పోయి చేతికి రాదని పొద్దు బుట్టకనే చిలికేది . మజ్జిగ కుండ చిలికేసి ఎత్తుకొచ్చి నట్టింట పెట్టుకొని ఉట్టి మింద ఉన్నఎన్నపాస దుత్త దించుకొని పక్కన పెట్టుకుంటుంది . మజ్జిగ కడవలో చెయ్యేసి దేవితే పట్టెడు పట్టెడు ఎన్నపాస వచ్చేది . ఆ ఎన్నపాస ముద్దలన్నీ దుత్త కేసి ఉట్టి మింద పెట్టి ,నట్టింట్లో మజ్జిగ కడవ ఎత్తుకొచ్చి వాకిట్లో పెట్టుకొని ” ఏమండె సేయ్ మీకేమన్నా బాకీ చేసినానా నేను ,పొద్దు బుట్టక ముందుగానే వచ్చి వాకిట్లో కూసుంటారు అని తిడతానే “రాండే నా బట్ట ముండల్లారా ,పట్టండి చెంబుల్నిఅని చెంబుల నిండా పోసేది . మేము మజ్జిగ నిండిన చెంబుల నెత్తుకొని దావకు నవ్వతా ఎగ బారేది . ఆయవ్వ చేతి లోని ఎన్నపాస చెంబు కు చుట కారమూ అంటుకోనుండేది . అది మేము వేళ్ళతో నాకుతూ ఇంటికి బోయేవాల్లము . మా యమ్మ చూసి “ఏందే నాకతానే వస్తా ఉండారు “అని తిట్టేది.

గంగులవ్వ వారానికి ఒక సారి నెయ్యి ముంత కరగ బెడుతుంది. గంగులవ్వ ఎప్పుడు నెయ్యి ముంత కరగ బెడుతుందా అని పిల్లోల్లమంతా ఎదురుచూసే వాళ్ళం . ఆశ పట్టలేక అడిగేసేవాళ్ళం “ఎప్పుడవ్వా నెయ్యి ముంత కరగ బెట్టేది” అని. సోమవారం తప్ప ఎప్పుడూ కరగబెట్టను అనేది ఆ యవ్వ . సోమవారం అంతా ఆ యవ్వ ఇంటి సుట్టుకారాన్నే పిల్లోల్ల మంతా ఆడుకుంటూ ఉంటాం . ఆ పొద్దు ఆ యవ్విల్లు ఇడిసి పెట్టేది లే . తొలిసాకులు గుప్పెడు పెరుక్కోచ్చేది. నారవకొల్లు పెరుక్కొచ్చేది . నెయ్యి ముంత పొయ్యి మింద పెట్టి తొలిసాకులు ,నారవ కొల్లు వేసి ఉడక బెడతా ఉంటే నెయ్యి వాసన ఊరంతారంజుకొనేది . అంత గమాలించేది నెయ్యి వాసన . నెయ్యి కరగ బెట్టి వేరే దుత్తలో వంచుకునేది . పొయ్యి మింద పెట్టిన నెయ్యి దుత్త లో పైడి రాగి పిండి పోస్తుంది . పట్టెడు బెల్లం కొట్టేస్తుంది . బాగా తిప్పుతుంది పొయ్యి మింద బెట్టి . “రాండే పిల్ల ముండల్లారా” అని అందరినీ పిలిచి నారవ ఆకులు పెరక్కొచ్చు కోండి అని చెబుతుంది. ఆ ఆకుల్లో అందరికీ పిడికెడు పిడికెడు పిండి పెడుతుంది . ఆకుల్లో పెద్ద పదార్ధం పెట్టినట్టు పిలకాయలు ఎత్తుకొని నవతా ఉరికేది” గంగులవ్వ “ఈ నా బట్ట ముండలు తినే దానికే వచ్చి పొంచుకోనుండాయని “పెడతా తిట్టేది.

మా గంగులవ్వది ఎముక లేని చెయ్యి . ఊరందరినీ మజ్జిగ తోనే కాపాడింది . పట్టెడు కడి పెట్టుకొని గిన్నె నిండా మజ్జిగ పోసుకొని తింటే ఆ మావిటేల దాకా ఆకలయ్యేదే కాదు మాకు.

**** (*) ****

Painting Credit: Rural Life Painting by Chitra Vaidya