కథ

గంగమ్మే బెదిరిపోయే!

జనవరి 2016

మా జయక్క చానా మంచిది. ఇంటి పనైనా బయట పనైనా అంతే వైనంగా చేస్తాది. అయితే ఆయమ్మి ఆకలికి ఓర్చుకోలేదు. పొద్దుకు అంత ముద్ద కడుపులో పడిపోవాల. పుట్నింటిలో ఉన్నెబుడు కూడో కవళమో కాయో కరుసో ఏదో ఉన్నింది అంత తినేసి వేళకు కడుపు నింపుకునేది. అత్తింటికి పొయినంకనే పాపం ఆకలికి అంగలార్చింది జయక్క.

జయక్క మొగుడు, వాళ్లమ్మ మాటకు ఎదురు చెప్పడంట. ఆ తల్లేమో సరిగ్గా తిండి పెట్టేదే కాదు. మాయక్క, ఇక్కనా పక్కనా ఉండే ఇండ్లోళ్లు ఏమన్నా అంత పెడితే తిని కడుపు నింపుకునేది. అది తెలుసుకుని, ‘నా కోడలికి లేనిపోనివి చెప్పించి మా కాపరాన్ని చెడిపేస్తా ఉండారు’ అని వాళ్లను సపించి సపించి ఆ ముద్దా లేకుండా చేసింది. ఇట్ల ఇంటికూడూ దోవకూడూ రెండూ సదరంగా లేక అగసాట్ల పాలయింది జయక్క.

ఒకనాడు పుట్నింటికి వచ్చింది జయక్క. అక్క వచ్చిందని వాళ్ల నాయిన పేటకు పోయి సరుకులు తెచ్చినాడు. మా పెద్దమ్మ ఓలిగులు చేసి, తునకల చారు చేసి పెట్టింది. ఎన్నాళ్లయిందో కడుపు నిండా తిని, కరువున పడినట్లు అసట్లబసట్ల తింటా ఉండాది అక్క. అది చూసిన మాయమ్మ, ‘‘ఒసే జయమ్మా, నువ్వు తినేది చూస్తుంటే నాకు ఒక కత గుర్తుకొస్తా ఉండాది, చెబతాను యినే’’ అంటా కతను మొదులు పెట్టింది.

‘‘ఒక ఊర్లో నీ అత్త అట్లా అత్త, నీ అట్లా కోడలు ఉన్నెంట. ఆ అత్తా మీయత్త మాదిరిగానే కోడలు కు ఏమీ పెట్టేది లేదంట. ఆ కోడలు తిండికి బెక్కిడిసిపొయింది. ఒకనాడు సంకురాత్రి పండక్కి, ఇంట్లో దోసెలు పోసి, పితికిపప్పు కూర చేసిరి. ఇంట్లో తింటే వాళ్లత్త చూసి లబ్బన పడతాదనుకుని, నీళ్ల బిందిలో దోసెలూ కూరా వేసుకుని పొయి, ఊరి ముందరుండే గంగమ్మ గుడిలోకి దూరి అసట్లబసట్ల తింటా ఉండాది. అదంతా చూసిన గంగమ్మ ముక్కుమింద వేలు వేసుకునింది. ఆనెంక ఎవురో ఆ దోవనపోతాపోతా, గంగమ్మ ముక్కుమింద వేలేసుకోనుండేది చూసి, బెప్పరపొయి ఊర్లో అందరికీ చెప్పిరి. దాంతో ఊరంతా గుమి గూడి ఆ వింతని చూసి, ఊరికి ఏదైనా చెడ్డ జరగతాదేమో అని దిగులుపడిరి. ఎవురైతే గంగమ్మ ముక్కుమీది వేలును తీపిస్తారో వాళ్లకి దేవుని మాన్యంలో పది కుంటల నేలను రాసిస్తామని చుట్టుపక్కల ఏడూర్లలో చాటించిరి.

అందరూ విన్నట్లే ఆ చాటింపును ఆయాలి మొగుడూ విని, ఇంటికి పొయి దిగులు గా కుచ్చోనుండాడు. పెండ్లాము వచ్చి, ఏలట్ల కుచ్చోనుండావు అని అడిగింది. మొగుడు చాటింపు సంగతి చెప్పి, ఊరుకు ఏమైనా అయితుందేమో అన్నాడు. ‘ఓసి దీనికేనా, పోయ్యా పోయ్యా, నా పెండ్లాము తీపిస్తాది అని చెప్పి, వక్కాకు తీసుకుని రాపో’ అని మొగుణ్ణి పంపించింది.

ఇంట్లో వాళ్లందరికీ నీళ్లుపోసి, ఇల్లూ వాకిలీ అలికి, ఆయమ్మ నీళ్లు పోసుకుని కాయాకర్పూరం పూలూ పండ్లూ తట్టకు పెట్టుకుని గుడికాడకి యెలబారింది. ఏడూర్ల జనం గుడికాడ గుమిగూడి ఉండారు. ఒక తెల్లగుడ్డను తెప్పించి వాకిలికి తెర కట్టించి, లోపలికి పొయింది ఆయమ్మ. పొయేటప్పుడు ఎవరికంటా పడకుండా కుచ్చిళ్ల కిందన ఒక పొరకను పెట్టుకుని పొయింది. జనం గుడిబయట చెవులు కొరుక్కుంటా నిలబడి ఉండారు.

లోపలికి పొయిన ఆయమ్మ పొరకను బయిటికి తీసి గంగమ్మకు చూపిస్తా ‘నా గంటు తింటి, నా మొగుని గంటు తింటి, నీగంటేమన్నా తింటినా. నేను తినింది చూసి నువ్వేల ముక్కుమింద వేలేసుకుంటివి. వేలు తీస్తావా, పొరకతో నూరేట్లు కొడుదునా’ అనింది. ఆ దెబ్బకు గంగమ్మ ముక్కుమింద వేలు తీసేసింది. అప్పుడు ఊర్లోవాళ్లంతా లోపలికి వచ్చి చూసి, ఈయమ్మ ఇంత పతివ్రతనా అనుకుని దేవుని మాన్యం రాసిచ్చిరి. పలకలూ మేళాలతో ఆయమ్మను బుజాల మింద ఎక్కించుకుని ఇంటికి పిలుచుకుని పొయినాడు మొగుడు. వాళ్ల అత్తకూడా, ‘గంగమ్మకే ముక్కుమింద వేలు తీపించిందంటే సామాన్యురాలు కాదు నా కోడలు ’ అనుకుని బెదిరిపొయి, అప్పుటినింటీ కోడల్ని బాగా చూసుకునేది. అట్ల ఏదో ఒకటి చేసి అత్తకు బెదురుపెట్టకపోతే ఎట్ల జయమ్మా’’ అంటా కతను నిలిపింది అవ్వ.

‘‘మాయత్త అట్లంతా బెదిరేది కాదవ్వా . గంగమ్మే బెదిరిపోవాల ఆ ముండని చూసి’’ అంటా ఓలిగులు తింటా కండ్లనీళ్లు విడిచింది జయక్క.

**** (*) ****