కథ

మూడు వీడుకోళ్ళు

ఫిబ్రవరి 2016

పొద్దు పొద్దున్నే వాన పడ్డది కావచ్చు. రోడ్లన్నీ తడిసి పోయి ఉన్నై. స్పీడ్ గా పొతే జారుతదేమో అన్న స్పృహ లేని వాళ్ళు, వాళ్ళ వాళ్ళ మామూలు దినచర్యలలో నగరాన్ని కాలంతో పాటుగా స్పీడ్ గా ఉరకలెత్తిస్తున్నరు. వీళ్ళతో పాటుగా అప్పుడే తన దిన చర్య కూడా మొదలు పెట్టిండు సూర్యుడు. తడిసిన రోడ్ల మీద కిరణాలు ముచ్చటగ కనిపిస్తున్నై.

బస్ స్టాప్ ల దగ్గర దగ్గర యాభై మంది ఉన్నరు. దాదాపు నలభై తలలు వాళ్ళ చేతుల ఉన్న మొబైల్ దిక్కు చూస్తా ఉన్నై. ఓ పది తలలు బస్ వచ్చే దారి దిక్కు అసహనంగా చూస్తా ఉన్నై.

చుట్టూ పనోరమిక్ వ్యూ చూస్తె ప్రతీ ఒక్కళ్ళూ ఏదో పనిలో నిమగ్నమై ఉన్నరు. లోకం అందరికీ వాళ్ళ వాళ్ళ బాధ్యతలని అప్పజెప్పినట్టు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నరు. ఎవరి పనులు ఎంత ప్రాముఖ్యమైనవో అని చుట్టూ జనాలనీ, వాళ్ళు చేసే పనుల్నీ చూస్తున్నడు కిరణ్.

చూస్తుండంగానే రోడ్ అవతల నుండి ఒక ముసలామె ఎవర్నో పిలుస్తున్నది. ఎనభై ఏల్లన్నా ఉంటై అతి సులభంగ. వేషం, ఆహార్యం చూస్తె పెద్దింటికి సంబందించిన మనిషి లాగా ఉంది. ఇటు దిక్కు చూస్తె ఒక కార్, దాని పక్కన డ్రైవర్ కనిపించిండు. ఇంత ముసలి ప్రాణం ఒక్కతే బయటకు రాకుంటే ఏం. వీళ్ళూ, వీళ్ళ సోకులు కాకుంటే.. అనుకున్నడు కిరణ్. పాపం ముసలామె పెద్దగ అరవలేకపోతున్నది. డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రేడియో వింటున్నడో, వినిపించనట్టు కావాలనే చేస్తున్నడో అర్ధం కాలేదు. ముసలామె స్వయంగా రోడ్ దాటుకుని వద్దామని ప్రయత్నించింది. మెల్లగా ఆమె వచ్చేవరకు నగరం ఆమె కోసమని తన విధుల్ని ఆపుకోలేదు. బైక్ ఒకటి ఆమెకి అతి దగ్గరగ పోయింది. కొంచెం అయితే ..

చేతుల ఉన్న పాత పుస్తకాలు న్యూస్ పేపర్ పడేసి టక్కున రోడు దాటుకొని పోయిండు కిరణ్.

“ఆగు అమ్మమ్మా. నువ్వు ఇక్కన్నే ఉండు. నేను డ్రైవర్ని తీస్క వస్త.” ఆమెని అక్కన్నే ఉండమని చెప్పి మల్ల రోడ్ దాటుకుని వచ్చి డ్రైవర్ని తీస్కవచ్చిండు కిరణ్.

ఆమె మెల్లగా కార్ ఎక్కింది.

విండో దించి “ఏం పేరు రాజా” అని అడిగింది.

“కిరణ్, అమ్మమ్మా”

“ఇదిగో ఇదుంచు” వంద కాగితం ఇయ్యబోయింది.

“ఏ వద్దు వద్దు అమ్మమ్మా.”

“పర్లేదు ఉంచుకో రాజా.”

“వద్దు అమ్మమ్మా” కిరణ్ ససేమిరా అన్నడు.

“ఎక్కడికి వెడుతున్నావ్ రాజా”

“దిల్సుఖ్ నగర్ దాకా పోవాలమ్మమ్మా”

“సరే మాతో పాటు వద్దువుగానీ రా, లేకుంటే వంద తీస్కో. ఏదో ఒకటి” తిరస్కరించలేని రెండు ఆఫర్స్ ముందట పెట్టింది.

దరిదాపుల్ల బస్ వచ్చే సూచన లేదు. ఒక్క సెకన్ ఆలోచించి,
“సరే అమ్మమ్మా, నా బుక్స్ తెచ్చుకుంటా”

బస్ స్టాప్ పోయి బుక్స్, న్యూస్ పేపర్ తెచ్చుకుని కార్ ఎక్కిండు కిరణ్. విండో పైకి ఎక్కిచ్చింది ముసలామె. అప్పటి దాకా వినిపించిన నగర ఘోషతో టక్కున సంబంధం తెగిపోయినట్టు కార్ లోపల సుఖమైన నిశ్శబ్దం ఆవహించింది. పేరుకు పోయి కార్ ని తొందరగా కదలనివ్వని ట్రాఫిక్ కూడా కార్ లోపల ఎలాంటి ఇబ్బందిని కలిగించడం లేదు. కార్ ఇంటీరియర్ చూస్తున్నడు కిరణ్. ఖరీదైన కార్ లాగా ఉంది. ముసలామె ఏమన్న అనుకుంటుందేమో అని ఏం మాట్లాడలేదు. న్యూస్ పేపర్ తెరిచి చదువుతూ ఉన్నడు.

“ఏం రాజా, నీ దగ్గర ఫోన్ లేదా?”

“ఎందుకు అమ్మమ్మా?”

“నీ వయసు వాళ్ళందరూ టిక్కు టిక్కు మని అస్తమానం ఆ చిన్న చిన్న పలకల వేపు చూస్తా ఉంటరు. ఏం జూస్తారో ఏమో. నీ చేతిల మాత్రం ఆ పలక బదులు పేపర్ కనిపిస్తే..”

“నాకూ పెద్దగా అయిడియా లేదు అమ్మమ్మా. నా స్థోమతకి ఈ పేపర్ మాత్రమే కొనగలను”

“ఏమి? మీ నాయన్ని అడిగితె కొనివ్వడా?”

“అమ్మా నానా చిన్నపుడే పోయిన్లు అమ్మమ్మా. ఆశ్రమంల ఉంట. అక్కన్నించే చదువుకుంటున్న. కొద్దిగా గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తది చదువు కోసం అంతే. అవన్నీ ఎందుకు కానీ, మీరు కొనుక్కోలేదేందుకు ఫోన్. డ్రైవర్కి ఫోన్ చేస్తే ఈ తిప్పలంతా ఉండేది కాదు కదా?”

“ఆ దానికేం. నా దగ్గర టిక్కు టిక్కుమనేవి చాలా ఉన్నై”

“ఏమున్నై?”

“నడుస్తుంటే, బొక్కలూ, నరాలూ, నములుతుంటే పళ్ళు దవడా, ఒక్కటేవిటి నా శరీరంలో అన్నీ అవయవాలు ఏదో టైంల లుకలుకమనో, టిక్కు టిక్కుమనో అంటూ ఉంటై.” తన ముసలితనం మీద తానే జోక్ వేసుకుని నిండుగ నవ్వింది అమ్మమ్మ. తనతో పాటే చిన్నగ నవ్విండు కిరణ్.

“ఏం వార్తా విశేషాలు ఇవాళ పేపర్ల” అడిగింది.

“కొత్తగ ఏం లేవు అమ్మమ్మా. అవే రాజకీయాలు, అవే నేరాలూ, అవే ఘోరాలు”

“మరెందుకు కొనుక్కోవాలే?”

“అవసరం. జరిగేది తెలుసుకోవడం ఒక అనివార్యత. బాగా లేదని వదిలేసేది కాదు కదా వ్యవస్థ అంటే”

“ట్రూ”

“మీ మాటల్ల అక్కడక్కడ ఇంగ్లీష్ ఉంది. ఎంత దాకా చదువుకున్నరు అమ్మమ్మా”

“యు డోంట్ హావ్ టు గో టు స్కూల్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, కిరణ్” చిన్నగ నవ్వుకుంట అన్నది.

అప్పటి దాకా అక్కడో ముక్క అక్కడో ముక్క ఇంగ్లీష్ ఉందేమో కనీ, మొత్తం వాక్యం స్పష్టంగా ఇంగ్లీషుల మాట్లాడిన పండు ముసలి మనిషిని ఎట్లా అర్ధం చేస్కోవాల్నో అర్ధం కాలేదు కిరణ్కి. అప్పుడు అక్కడ ఆ ముసలి మనిషితో ఆ క్షణం చిత్రంగ అనిపించింది. రోజూ చూసే సన్నివేశంలాగ లేదు. కొంత ఆశ్చర్యం, కొంత కుతూహలం కలిగింది కిరణ్ కు.

“అమ్మమ్మా ..మీరు ఇంగ్లీష్ .. ఎట్లా సాధ్యం?”

“నీ వయసెంత రాజా?”

“ఇరవై మూడు”

“చిన్న పిల్లాడివి. నీకు చెప్తే అర్ధం చేస్కునే మెచూరిటీ ఉందా లేదా అని ఆలోచిస్తున్న”

“లోకం చాలా చిన్నప్పుడే పరిచయం అయింది అమ్మమ్మా. మంచి చెడులు పిలవక ముందే పలకరించినై. మీ అంత కాకున్నా ఇక్కడో అక్కడో లోకం నేర్పించిన పాఠాలు నేర్చుకునే ఉన్న. పరవాలేదు చెప్పండి అమ్మమ్మా”

“సరే, చిన్నగా చెప్తా.”

అమ్మమ్మ స్వగతం చెప్పడానికి సిద్ధం అయింది.

***

“అప్పట్ల మా కుటుంబం చెన్నపట్నంలో ఉండేది. నేను పుట్టగనే మా అమ్మ పోయింది. మా నాయన స్వాతంత్ర పోరాటం అని ఇంటి పట్టున ఉండేవాడు కాదు. నేను ఏడేళ్ళు ఉన్నపుడు మా అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టి మా నాయన స్వతంత్ర పోరాట యోధుల సమూహంలో కలిసి పోయాడు. అదే ఆయన్ని ఆఖరు సారి చూట్టం. మళ్ళీ ఎప్పుడూ కనబడలా”

పూర్తిగా అమ్మమ్మ దిక్కే తిరిగి ఆమె చెప్పేది వింటున్నడు కిరణ్.

“అప్పట్లో ఇప్పుడున్నంత విమెన్ ఎంపవర్మెంట్ లేదు. అమ్మాయిలని గ్రాంటెడ్గా తీస్కునేవాళ్ళు. పని పాటలు, వంటా వార్పూ, శారీరక సుఖాలని తీర్చే యంత్రాలుగా మాత్రమే చూసెడి వాండ్లు.”

“ఇంట్లో మా తాతగారు, మావయ్యా, నేనూ మాత్రమే ఉండేవాళ్ళం. తాత గారికి అంతులేని జబ్బు ఏదో ఉండేది. రేపో మాపో అనేటట్టు మంచం మీదే ఉండేవారు. ఆ వయసులో వంట పని, ఆ పనీ, ఈ పనీ అని అన్ని పనులూ నేనే చేయవలసి వచ్చింది. బడికి పోవాల్సిన వయసుల ఇద్దరు మనుషుల పనులూ, అనారోగ్యంతో ఉన్న మనిషి మంచి చెడ్డలూ, మల మూత్రాల బాగోగులూ చూస్కోవలసి వచ్చింది. అయ్యో తల్లిదండ్రి లేని బిడ్డ అన్నవాడూ, ఇంత కష్టమా అన్న వాడూ, ఇన్నీ నెత్తినేసుకుని చేస్తున్నందుకు శహబాష్ అన్న మెచ్చుకోలు ఇచ్చినవాడు లేడు. ఆ పనులన్నీ చేయడం నాకు పుట్టుకతోనే వచ్చిన బాధ్యత అన్న చందంగా చూసెడి వాండ్లు.”

రెండేండ్లు గడిచినవి. నాకు తొమ్మిదేండ్లు. మా తాత అప్పుడప్పుడు తన మంచం పక్కన కూచోబెట్టుకొని ఏదైనా మాట్లాడే వారు. ఒక రోజు మాటల్లో హటాత్తుగా .. “మామయ్యని పెండ్లాడుదువే?” అని అడిగారు.

“ఛీ ఛీ.. మామయ్య అంటే నాకిష్టం లేదు. అయినా అప్పుడే నాకు పెండ్లి వద్దు” అన్న.

“ఎందుకే? ఎందుకిష్టం లేదు” అన్నరు తాతగారు.

“మామయ్య మంచి వాడు కాదు”

“అదే ఎందుకు?”

“నేనేం చెప్పలేక పోయిన.. ఏడుస్తూ లోపలి పారిపోయిన.”

“ఎందుకు చెప్పలేక పోయిన్లు అమ్మమ్మా. ఎందుకు మీ మామయ్యా మంచి వాడు కాదు?” కిరణ్ అడిగిండు.

“అభం శుభం తెలవని వయసుల ఆ ఇంటికి వచ్చిన. ఇంట్లో నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడప్పుడూ మామయ్యే తినడానికి ఏదైనా తెచ్చి ఒల్లో కూచోబెట్టుకుని మాట్లాడేవాడు. అక్కడా ఇక్కడా తడుముతూ నన్ను నవ్వించే ప్రయత్నం చేసేవాడు.

కానీ మామయ్య చాలా వరకు రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు అర్ధ రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నదాన్ని లేపి అన్నం పెట్టమన్నడు. నిద్రలో లేవడం ఇష్టం ఉన్నా లేకున్నా లేదని చెప్పే స్వతంత్రం లేని దాన్ని. వంట గదిలోకి పోంగానే వెనక నుండి వచ్చి నా నోరు మూసి నన్ను బలవంతం చేశాడు. ఎవరికయినా చెప్తే గొంతు కోస్తానని బెదిరించాడు. అలాంటి ఎన్నో చీకటి రాత్రులు నా జీవితంలో చీకటిని నింపుతూ వచ్చినై. ఎవరికీ చెప్పుకోలేక, చావలేక ఉండవలసి వచ్చింది.”

“ఐయాం వెరీ సారీ అమ్మమ్మా..” ఊహించని సమాధానం కిరణ్ ని కలవర పరిచింది. అమ్మమ్మ మోహంలో బాధ లేదు. కిరణ్కి భావం లేని అమ్మమ్మ మొహం ఇంకా ఆశ్చర్యం కలిగించింది.

“పరవాలేదు.”

“ఆ తరవాత?”

“ఆ తరవాత,..

ఒక రోజు మా తాత గారు..

“చిన్న పిల్ల దానికేం తెలుస్తుంది పెళ్లి అయితే అదే సర్దుకుంటుంది” అని మామయ్యకి చెప్పడం వినిపించింది.

నాకు ఆపాదమస్తకం వణుకు పుట్టింది.

ఆ రోజు రాత్రే నాకున్న నాలుగు జతల బట్టలు సర్దుకుని ఇంట్లో నుండి పారిపోయిన.

***

చిట్ట చీకటి. ఎక్కడో దూరంగా కాగడాలు వెలుగుతున్నై. ఎవరో ఉన్నరు. మా నాయన కూడా అలాంటి కాగడాలు పట్టుకున్న గురుతులు జ్ఞప్తికి వచ్చినై. వాళ్ళ దగ్గరకు పోదామా వద్దా అని భయం భయం గా చూస్తా ఉన్నా కానీ ధైర్యం చాలలేదు.

ఇంతలో ఆ గుంపు నుండి ఒకళ్ళు నన్ను చూసి నా దగ్గరికే వస్తున్నరు.

నా బట్టల ముల్లె గట్టిగా పట్టుకుని కూచొని ఉండిపోయిన.

ఇంతలో దూరం నుండి అదే పనిగా ఈలలు వినిపించినై. బ్రిటీష్ పోలీస్ వాండ్లు గుంపుగ ఉరికి వస్తున్నరు. వాళ్ళ చేతుల ఉన్న పీకల నుండి ఈలలు వేస్తా.

కాగడాల సమూహం చెల్లా చెదురయిపోయింది. ఆ సమూహం, ఈ సమూహం దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టుకుంటున్నరు. బ్రిటీష్ వారికి ఇద్దరు కాగడా వాళ్ళు దొరికారు. కొందరు మిగిలిన వారి వెనుక ఉరికారు. పెద్ద పోలీస్ వాడు నన్ను చూసి నా దగ్గరకు వస్తున్నాడు.

నా బట్టల ముల్లె తప్ప నా దగ్గర ఏం లేదు.

“ఆర్ యూ లాస్ట్” అని అడిగాడు. నాకేం అర్ధం కాలేదు. నేనేం మాట్లాడలేదు. చేతికి బేడీలతో ఉన్న కాగడా మనిషి నా గురించి ఏదో ప్రాధేయపడుతున్నాడు. గొరగొరా గుంజుకపోయినారు అందరినీ. ఈ పెద్ద పోలీస్ వాడు నవ్వుతూనే నా దగ్గరకు వచ్చి చెయ్ చాచినాడు.

చీకట్లో ఏముందో, రేపు ఎలాంటి ఉదయం కనిపిస్తుందో, లోకం ఎలాంటి ప్రస్థానాన్ని ముందు౦చుతుందో.. ఆలోచించే పరిజ్ఞానం, అవకాశం, తెలివీ లేవు. వాడు చాచిన చెయ్ ఆహ్వానమో, ఆజ్ఞ్యో కూడా అర్ధం కాలేదు. గాల్లోదీపం లాగా ఉన్నదాన్ని, వాడి చేతుల చెయ్యి వేసి వాడితో వెళ్ళిపోయిన.”

వాడు ఇంటికి తీస్కోని పోయిండు నన్ను. ఆయన పేరు డేవిడ్. డేవిడ్, వాని పెండ్లాం ఇంటికి కొత్త పనిమనిషిని కొనుక్కుని వచ్చినట్టు సంబురపడ్డరు.

అక్కడ వాళ్ళిద్దరూ, ఇక్కడ వీళ్ళిద్దరు. అక్కడా ఇక్కడా అదే పని. కాకుంటే అక్కడ అన్నం, కూర ఉండేవి, ఇక్కడ రొట్టె ముక్కలూ, జాము ఉండేవి.

అక్కడ మామయ్య చేసే బలవంతపు పనులు డేవిడ్ మొదలు పెట్టిండు. వీడు కనీసం కొంత వయసు వచ్చే వరకైనా ఆగిండు. డేవిడ్ మృగం కాదు. చేసే పని బలవంతం అయినా మామయ్యా లాగా మృగం లాంటి వాడు కాదు. మనిషి స్థాయిని బట్టి దుర్మార్గాల రూపం మారుతూ ఉంటుందని తెలుసుకున్న. ఏదేమైనా డేవిడ్ కొంచెం సున్నితమైన వాడు, లోపల నేనంటే ప్రేమ ఉండేది అనే భావం కలిగేది నాకు.

కొన్నేండ్లు గడిచినై. నేను కొంచెం పెద్దదాన్ని అయిన.

డేవిడ్, వాని పెండ్లాం అదే నా ప్రపంచం. ఆమెకి తెల్వని మరో ప్రపంచం డేవిడ్తో మాత్రం. వంట గదిల నుండి నా జీవితం ముందుకు కదలలేదు. బయట వార్తలు కూడా చెప్పే వాళ్ళు లేరు. ఒక రోజు పటాకుల మోత వినిపించింది. రెండు రోజుల తరవాత డేవిడ్ పెండ్లాం దేశం పోతున్నట్టు చెప్పింది. నాకు అప్పటికే వాళ్ళతో మాట్లాడి అర్ధం చేస్కోగలిగే ఆంగ్లం వచ్చింది. అసహనంగా ఉండి నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు.

కొన్ని రోజులకు ఆమె వెళ్ళిపోయింది. డేవిడ్ నా దగ్గరకు వచ్చి మీకు స్వాతంత్రం వచ్చింది. నీ కోసమే ఇంకా ఇక్కడున్నా. కొన్ని రోజుల్లో నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడు.

నాకు స్వాతంత్రం రావడమంటే ఏంటో కూడా తెలవదు. నా పరిస్థితి ఏమిటని అడిగినా. నీకు అన్నీ అరేంజ్ చేసి వెడతా బెంగ పడకు అన్నాడు.

డేవిడ్ దేశం పోయే ముందర రెండు వారాలు ఉన్నాడు నాతొ. సొంత పెండ్లాం కన్నా ఎక్కువ చూస్కున్నడు. నాకు ప్రేమ అంటే అర్ధం తెలవదు. లోకంలో అప్పటి వరకూ నా అస్తిత్వానికి ఆ మాత్రం విలువ వచ్చింది అప్పుడే మొట్ట మొదటి సారి. అడిగి అడిగి మరీ నాకు కావలసినవి తెచ్చి పెట్టిండు.

ఈ ఇల్లు ఇక నీదే. నీ పేరు మీద కొంత రొక్కం బాంకులో జమ చేస్తున్నా. కొంత బంగారం కూడా ఉంది బీరువాలో. అత్యవసరం అనిపించినపుడు వాడుకో అని వెళ్ళిపోయే ముందు నా బాగోగులు చూసి పోయాడు.

డేవిడ్ వల్ల నాకో కొడుకు పుట్టాడు. రామలింగం డేవిడ్ అని మా నాయన పేరు కలిపి పెట్టుకున్నా.

జీవితం మళ్ళా మొదటికి వచ్చింది. చెన్న పట్నంలో నన్నూ, నా కొడుకునీ జంతువుల లాగా చూసే వాళ్ళు. నాకు పరిచయం లేని సమాజం, నేనెవరో గుర్తించని నా గురించి తెలవని సమాజం, దోషిలాగా, ముండ లాగా చూస్తున్నది. కొందరు మొఖం మీదనే అడిగే వాళ్ళు, ఎందరితో పడుకున్నవ్ అని.

డేవిడ్, ఆయన పెండ్లాం నుండి అబ్బిన నాగరికత వల్లనో, భాష వల్లనో, నా నడవడిక నలుగురిలో కొంత భిన్నంగ ఉండేది. నేను ఎవరి దాన్ని? నాది ఏది? నా వారెవరు? లాంటి అస్తిత్వ శోధనతో సతమతం అయ్యేదాన్ని. మా నాయనతో చివరి జ్ఞాపకం గుర్తుకు వచ్చింది. కాగడా పట్టుకుని దేశం కోసం చీకట్లో మాయమయిన ఆయన విగ్రహం గొప్పగా కనిపించింది.

నా కొడుకు రామలింగాన్ని దేశ భక్తునిగా పెంచాలని అనిపించింది. వాడే నా లోకం. నేను నేర్చుకుంటూ, వాడికి చెప్తూ దేశాన్ని ప్రేమిస్తూ..దేశభక్తుల కథలని నెమరు వేస్కుంటూ.

అలా నాలుగేండ్లు. ఇంతలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజించబడినై. మళ్ళీ ఏదో కొత్త అవకాశం వెతుక్కుంటూ వచ్చినట్టు అనిపించింది. మదరాసులో భూములు, ఇండ్ల ధరలు ఆకాశాన్నంటినై. నా ఇల్లు అమ్మితే భారీ మొత్తమే చేతికి వచ్చింది. రామ లింగం, నేనూ హైదరాబాద్ వచ్చి ఇల్లు కొనుకున్నం. ఇల్లు కొన్నాక కూడా పెద్ద మొత్తం, బంగారం చేతిలో ఉండే.
అధ్బుతమైన అవకాశాలున్న భాగ్య నగరం, చేతిలో రొక్కం, కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఆశలు, ముద్దొచ్చే కొడుకు జీవితం నిండుగ కనిపించింది.

సొంతంగా నేర్చుకున్నదీ, తెల్లవాండ్ల నుండి నేర్చుకున్నదీ, నాకు తెలిసింది వంటా వార్పూ ఒక్కటే. ఫుడ్ బిసినెస్ మొదలు పెట్టిన. కొద్దిగా బాగానే నడుస్తుంది. రామలింగం, వ్యాపారం అన్నీ చూస్కోవడం కష్టమై ఒకరిద్దరు పని వాళ్ళని పెట్టుకున్న. మెల్లగా నగరం మమ్మల్ని ఆదరించింది. అక్కున చేర్చుకున్నది. కొన్నేండ్లు గడిచేసరికి వ్యాపారం నాలుగు దిక్కులా విస్తరించింది. ఇబ్బందులు లేవు. ఇక్కడ అందరూ సొంత వారి లాగా చూస్తారు. రామలింగం మేజర్ రామలింగం అయ్యాడు. ఆర్మీలో పని చేసాడు. తాత గౌరవాన్ని నిలబెట్టి మరీ ..” ఆగిపోయింది అమ్మమ్మ.

“మరి..?” అడిగిండు కిరణ్.

“వాడు కూడా తాత లాగానే. ఒకరోజు యుద్దంలో..”

“యుద్ధంలో .. ఏమయింది అమ్మమ్మా?”

“ఒక్కగానొక్క కొడుకు. ఆర్మీకి పంపినప్పుడు కూడా బాధ పల్లా. గర్వంగా అనిపించింది. వాడు ఆర్మీ బట్టలు వేసుకుని యుద్ధానికి పొతున్నపుడు వాళ్ళ తాతగారు కాగడా పట్టుకుని చీకట్ల కలిసి పోయిన సన్నివేశమే కనిపించింది. ఆ రెండు సన్నివేశాలే నా జీవితంలో చెప్పుకోదగ్గ స్మృతులు. ఆ రోజే ఆశలు వదిలేసుకున్న. శరీర భాగాలు కూడా దొరకలేదుట. సకల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనేక గౌరవ పురస్కారాలు, మెడల్స్ కూడా ఇచ్చారు.”

కిరణ్ ఆమె దిక్కే చూస్తున్నడు. ఆమె మోహంలో బాధ లేదు. ఉద్వేగం మాత్రమే ఉన్నది.

“ఐయాం వెరీ సారీ అమ్మమ్మ”

“పరవాలేదు”

కిరణ్ గుండె బరువెక్కింది. తర్వాత మాట్లాడలేకపోయిండు. టాపిక్ మార్చాలని అనుకుంది అమ్మమ్మ.

“ఏం పుస్తకాలవి?”

“బయాలజీ పుస్తకాలమ్మమ్మా”

“చూస్తె చాలా పాతవి లాగున్నై.?”

“ఔనమమ్మా. పాత పుస్తకాల షాపులో కొన్నా పొద్దున్నే”

అమ్మమ్మకు కిరణ్ ఆర్ధిక పరిస్థితి గురించి అర్ధం అయింది.

“ఏం చదువుతున్నవ్?”

“బయో కెమిస్ట్రీ చదువుతున్న అమ్మమ్మ. ఎప్పటికన్నా పెద్ద సైంటిస్ట్ కావాలని కోరిక.

“తప్పకుండా అయితావ్ రాజా. నీకేం. మంచి మనసుంది.”

కిరణ్ వాళ్ళ ఆశ్రమం వచ్చింది మాటల్లనే.

“బాయ్ అమ్మమ్మా” కిరణ్ చేతుల పుస్తకాలు పట్టుకుని నడిచి పోతున్నడు. కారు తిప్పుకుని తన దారిన తాను పోతున్నది.

***

ఆమె ఆలోచనలో పడ్డది. ఇవ్వగలిగిన స్థాయిలో తను, అవసరం ఉన్న వాడు కలుసుకోవడం ఎంత యాదృచ్చికం? ఎందుకు వాడు నడిచి పోతుంటే, విడిచి పోతున్న భావం కలుగుతుంది?
చేత కాగడాతో వీడుకోలు చెప్తూ చీకట్లో మాయమైన తండ్రీ..

ఆర్మీ బ్యాగు చేతుల పట్టుకుని వీడుకోలు చెప్తున్న కొడుకూ..

పాత పుస్తకాలు పట్టుకుని అనామక ప్రపంచంలో కలిసి పోయి వీడుకోలు చెప్తున్న ఆశావాది..

అందరూ ఒకే లాగా కనిపిస్తున్నరు. ఏది గమ్యం? ఏది ప్రయాణం? జీవితం చరమాంకం దశకు చేరుకున్న౦క కూడా ఇంకా గమ్యాలు, ప్రయాణాలు ఉంటయా? ఊరంతా తిరిగిన మనసుకు చివరికి ఇల్లు చేరుకోవడం గమ్యం. ప్రయాణమే గమ్యం అయితే, ఊరే ఇల్లవుతుంది. మనసుకు ఎప్పటికీ స్వాంతన దొరకదు. ప్రయాణం ఎప్పటికీ ఆగదు. తనంతట తానుగా ఆగిపోయే వరకూ ప్రస్థానాన్ని ఆపే ప్రసక్తి లేదు.

ఎప్పుడూ లేనంత స్థిరంగా ఉంది ఆమె మనసు.

“డ్రైవర్ కారు తిప్పి ఆశ్రమం దిక్కు పోనీయ్” అడిగింది.

కార్ విండో తెరిచి చూసింది.

వర్షం పడిన మట్టి రోడ్డు మీద కార్ గుంభనంగా, నిశ్చలంగా కదులుతుంది. చుట్టూ పనోరమిక్ వ్యూ చూస్తె పిల్లలు ఆడుకుంటున్నరు, పని వాళ్ళు పని చేసుకుంటున్నారు. లోకం ఒక్కోల్లకు ఒక్కో స్థానాన్ని కేటాయి౦చినట్టే అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉన్నరు.. అనుకున్నది మనసుల.

**** (*) ****