తేనెతాగిన మత్తులో తెల్లని తేనెటీగా!
సుళ్లుతిరిగే బాటను పొగమంచులో లిఖించి మాయమై
నా ఆత్మలో ఝుమ్మంటున్నావు ఇంకా.
నాకు ఏ ఆశాలేదు, నేనో ధ్వని లేని పదాన్ని
అన్నీ కోల్పోయిన బికారిని
ఓడను ఒడ్డుతో కలిపే ఆఖరి తాడువు, నువ్వే చివరి ఆశవు
నా ఎడారి నేలపై ఆఖరి రోజావు
నువ్వేమీ మాట్లాడవు కదా!
కనులు మూసి చూడు. అక్కడ రాత్రి రెపరెపలాడుతుంది.
నీ దేహమో చకిత నగ్న శిల్పం.
నీ లోతైన కనులలో రాత్రి తపతపలాడుతోంది.
చల్లని పూలచేతులు, రోజాల ఒడి నీవు.
తెల్లని నత్తల వలె నీ చనులు
నీ బొడ్డుపై సీతాకోకచిలుక నిద్రించ వచ్చింది.
నువ్వేమీ మాట్లాడవు కదా!
నీవు లేని ఒంటరితనమిది. వర్షం పడుతోంది.
దారితప్పిన కొంగల్ని వేటాడుతున్నాయి సముద్రగాలులు
తడిచిన దారులలో నీరు నగ్న పాదాలతో నడుస్తోంది.
ఆ చెట్టు ఆకులు జబ్బుపడ్డాయట
తెల్లని తేనెటీగా!
నీవు వెళిపోయాకా కూడా ఝుమ్మంటున్నావు నా హృదయంలో
కాలంలో జీవిస్తున్నావు మరలా సన్నగా, మౌనంగా.
నువ్వేమీ మాట్లాడవు కదా!
*
మూలం: Pablo Neruda – White Bee (twenty love poems and a song of despair)
అనువాదం: బొల్లోజు బాబా
అద్భుతం సర్… తడిచిన దారులలో నీరు నగ్నపాదాలతో నడవడం… వాహ్…