కవిత్వం

చిక్కువడిన నీడలు

ఆగస్ట్ 2016

చిక్కని ఏకాంతం నిండా చిక్కువడిన నీడలు.
నువు అందనంత సుదూరంగా ఉన్నావేమో! మరీను.
స్వేచ్ఛగా ఎగురుతోన్న ఆలోచనా విహంగాలు, కరుగుతున్న చిత్రాలు,
కూరుకుపోతున్న దీపాలు.

దూరంగా గంటలగోపురంలా అంతటా దట్టమైన పొగమంచు
ఉక్కిరిబిక్కిరిచేసే వేదనలు, అంతంత మాత్రపు ఆశలు,
మూగవోయిన చిమ్మెట,
నగరం మీదినుంచి రాత్రి నీ వదనంపైకి జారిపోతుంది.

అమాంతంగా ఒక అద్భుతంలా నువ్వొచ్చే వరకూ
నేను అనుకొనే వాడిని,
నా జీవితపు పాయలనన్నీ స్పృశించేసానని, నా వొగరు జీవితం
శిలల మధ్య, అలల తుంపరలో, పిచ్చిగా, స్వేచ్ఛగా
సాగరం వైపు సాగే ఒక అరుపు.
ఆ విషాదమోహనం, ఆ అరుపు, సాగరపు ఏకాంతం
విరుచుకుపడుతూ అంబరాన్నంటుతో
దుడుకుగా పర్వులిడిన ఆనాటి నా వొగరు జీవితం.

నా మగువా?
అప్పుడు నీవు ఎలా ఉన్నావూ? ఏ కిరణానివై ?
ఏ విస్తారమైన వింజామరకు ఒకానొక తూలికవై?
ఇప్పుడు ఉన్నంత దూరంలోనే అపుడూ ఉన్నావు కదూ.
వనంలో కార్చిచ్చు! నీలి జ్వాలలు
కాంతి తరువులలో మెరుపు తళుకు.

మంటలు, మంటలు ఎగిసిపడే చిటపటలరవ్వలలో
నా ఆత్మ నర్తిస్తోంది దహించే జ్వాలలతో
ఎవరా పిలిచేది? ఏ నిశ్శబ్ధం ప్రతిధ్వనులతో నిండింది?
వేదనా సమయమిది, ఆనంద సమయమిది
ఏకాంత సమయమిది. అన్నిటికీ మించి నా సమయమిది!

వేటకాని కొమ్ము బూరలోంచి గాలి ప్రవహిస్తూంది పాటై.
శోకోద్రేకము నా దేహాన్ని చుట్టుకొంది.
అన్ని వేళ్లనూ తెంపుకొని, అన్ని అలలను ఎదుర్కొని
నా హృదయం చిక్కని ఏకాంతంలో దీపాలను పాతుకొంటూ
ఆనందంగా శోకిస్తూ అనంతంగా సంచరిస్తోంది.

ఇంతకీ
ఎవరు నీవు, ఎవరు నీవు?

*

మూలం: Thinking, Tangling Shadows by Pablo Neruda.
అనువాదం: బొల్లోజు బాబా