కవిత్వం

మధ్యాహ్నంలోకి సాగిలపడి

జూన్ 2016

ధ్యాహ్నంలోకి సాగిలపడి
నీ సాగరనయనాల లోకి నా విషాద జాలాల్ని విసిరాను,

ఆ ప్రచండ జ్వాలల్లో విస్తరిస్తూ, రగిలిపోతూ నా ఏకాంతం-
నీట మునుగుతున్న మనిషి చేతుల్లా టపటపలాడుతూ..

లైట్ హౌస్ వద్ద సంచరించే సముద్రంలాంటి,
నీ అభావ నేత్రాలకు
ప్రమాద సంకేతాలను పంపించాను.

సుదూర ప్రేయసీ!
నీవు చీకటిని దాచుకుంటావు
దిగులుతీరంమీదుగా నీ పలకరింపు కొట్టుకొస్తుంది

మధ్యాహ్నంలోకి సాగిలబడి
నీ నయనాలలో తారాడే సాగరంలోకి నా విషాద జాలాల్ని విసిరాను.

నీ ప్రేమలో ప్రకాశించే నా ఆత్మలా
తళుకుమంటూన్న తారలను
రాత్రంతా పక్షులు పొడుస్తున్నాయి.

నీడల గుర్రమెక్కి,
నేలపై నీలి కుచ్చులను రాల్చుకుంటూ
రాత్రి సాగిపోతుంది.

(మూలం: Pablo Neruda – Leaning Into The Afternoons)
అనువాదం: బొల్లోజు బాబా