కవిత్వం

నాలుగు సిరా చుక్కలు

01-ఫిబ్రవరి-2013

ఖాళీగా ఎపుడున్నాం మనం
విశ్రాంతికి విశ్రాంతినిచ్చి
పరుగెడుతూనే ఉంటాం

పొడిగా రాలె క్షణాలని
కాలపు కాష్టంలో
తగలబెడుతూనె
ఉంటాం
కంటికింది నీడల్లో
తలదాచుకునే కలల్ని
లెక్కిస్తూనే ఉంటాం
ఉదయాలనీ.,
అస్తమయాలనీ దాటి
పయనిస్తూనే ఉంటాం
ప్రవహిస్తూనే ఉంటాం….

అవసరానికీ..,
సహాయానికీ…
బందుత్వం
కుదిరినపుడు
కూలిన ఉల్కలా
రాలిపడతారెవరో
శరీరానికీ.., మస్తిష్కానికీ
మత్తెక్కినపుడు
కలలో
స్కలనమై
జారిపోతారెవరో….
సాగిపోతూనే ఉంటాం
మనం కుడా…

సమాదుల్లో
నిద్రపోతున్న
ప్రశ్నల్ని తవ్వుకుంటూ
శిలాజాల్లా
మన ముందే నిలబెట్టుకొని
పరిశోదించుకుంటూ…
సమాధానాల
ఊపిరిని ఊదుతూనే ఉంటాం

మనసుకి
కవిత్వమేసినప్పుడల్లా
నాలుగు
సిరా చుక్కలని
గుటక వేస్తూనే
ఉంటాం….