కవిత్వం

అనిశ్చితి

ఆగస్ట్ 2017

1

నీకుగానే వచ్చావా నువ్వు
ఎవరినీ అడగకుండా, మరెవరూ దారి చూపకుండా
చేతిలో ఈ పసి దీపంతో
చీకటితో గొడవ పడుతో… నీకు నువ్వుగానే వచ్చావా?
ఆకుపచ్చని గాలిని తాకాకుండానే, ఆ ఊదారంగు సూర్యుణ్ణి చూడకనే
క్రోసుల దూరపు ఈ గమ్యాన్ని తలుస్తో నడిచి ఉంటావు.

2

గుండెలు పగిలి రోదించే తల్లులనీ,
పంటల కోతలని వదిలి చెట్టుకు పూసిన రైతులనీ పలకరించే కదా వచ్చావు
పూవులని వెతికే వసంతాలనీ,
వెన్నెల వాసన లేని శరత్తులనీ హత్తుకునే కదా నడిచావు
ఉరి కొయ్యలనీ, రక్త మలిన వద్యశిలల్నీ ముద్దాడే కదా వచ్చావు
ఇక ఈ చల్లని రాత్రి నా సమాధి మీద విశ్రమించు.

3

పాంథుడా…! ఈ మధుపాత్రని తీసుకో
మలిన పెదవులని, మకిలి ఆత్మని తడిచేసుకో
ఈ నిషిద్ధ రాతిరి చెప్పే కథని విను.
వీడ్కోలు కానుకగా నీ బిడారు వారిచ్చిన పాటని వినాలని ఉంది
కానీ ముందుగా తెరిపిన పడు.

4

సముద్రాలని మోసీ, ఆకాశాలని చిత్రించీ,
గాలిపై గీతాలని రాసిన బాలుని కోసం కదా నువ్వు వచ్చావు
పువ్వులని, సీతాకోక చిలుకలనీ లాలించి
నదుల్ని నావల్లో నింపి, ప్రకృతిని ప్రేమించిన నల్లనివాన్ని
చూడాలని కదా వచ్చావు నువ్వు
అయితే, తెలుసా నీకు?
ఆ బాలుడు నేననీ నీ ప్రయాణానికి ముందే నేను హత్య చేయబడ్డాననీ!