కవిత్వం

మా గల్లీ పాన్ వాలా

జనవరి 2013

వాన్ని చూసినపుడల్లా
జాతీయ పతాకమే గుర్తొస్తుంది నాకు
భిన్నత్వం లో ఏకత్వాన్ని చూపే
భారతీయతకు చిహ్నం లా కనిపిస్తూ
గంపెడు ఉత్సాహాన్ని
పొట్లం కట్టి
నోటినిండా పోసేస్తాడు..

ఆనందాన్నీ.. ఉత్సాహాన్నీతదాత్మ్యతనీ…
సరైన పాళ్ళలో వేసే
ఆ వేళ్ళని చూస్తే
ఙ్ఞానాన్ని పూసుకొని
వెలిగే జ్యొతుళ్ళా కనిపిస్తాయ్…

గళ్ళీ మొదట్లో డబ్బలో కూర్చొని
పొద్దున్నే కొన్ని వార్తల్ని పంచుతూ..
కొన్ని ఊపిరి తిత్తులలో
ఉత్సాహాన్ని నింపే పనిలో
మునిగి పోతాడు

నవ్వుల బుడ్డుడిలా
సంతోషాన్ని.. పంచి ఎంత
సంపాదిస్తాడో గానీ
తన దగ్గర్నుండి
రోడ్డు పై మెం చిత్రించే
సిలోన్ మ్యాపులను చూసి సంతోషంగా
నవ్వేస్తాడు
మా గళ్ళీ చివర పాన్ వాలా…