కథ

తను-నేను

జూలై 2016

ల గిర్రున తిరుగుతోంది. దాంతో పాటే కళ్ళూ. మెల్లిగా మూతలుపడుతున్న కళ్ళ ముందు దానంతట అదే తెరుచుకునే ఎలక్ట్రానిక్ డోర్ గుండా వస్తూ కనిపించిందామె. నీలం రంగు డ్రెస్ వేసుకుందన్న విషయం తప్ప మరేదీ కనిపించలేదు. అంతా మసక మసకగా ఉంది.

కళ్ళు పూర్తిగా మూతలు పడ్డాయి. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందామె. ఎంతందంగా ఉందీ!?

రిసెప్షనిస్ట్‍ను ఏదో అడిగి వచ్చి, పక్కనే కూర్చుంది. ఇప్పుడింకా అందంగా ఉంది.

5, 10, 15, 20.. నిమిషాలు గడుస్తూనే ఉన్నాయి. రాని మెసేజ్ కోసం ఈ గ్యాప్‍లో ఓ పదిసార్లు ఫోన్ చూసుకొని ఉంటా. ఆమెను చూడ్డం కోసమే! ఒకమ్మాయిని చూడ్డమంటే, చూడ్డమనే పనితో పాటు మరింకేదో ప్యారలల్‍గా జరగాలి. ఇక్కడది ఫోన్ చూస్కోవడం!

ఒకట్రెండు సార్లు తనూ చూసింది. మనకు తెలిసిందేగా.. చిన్నగా నవ్వా. తనూ నవ్వింది.

“ఎక్స్‌క్యూజ్ మీ..”

తనేనా? నమ్మలేకపోయా. ఒకర్ని పిలిచిన తర్వాత మనిషిచ్చే ఎక్స్‍ప్రెషన్‍ను బట్టి పిలిచింది వాళ్ళేనా, కాదా అర్థం చేసుకోవచ్చు.

తనే!

“యస్..”

“ఇంటర్వ్యూ??”

“యప్. రివ్యూ రైటర్!”

“ఓ..కే. ఇంగ్లీష్??”

“నోప్. తెలుగు”

కాస్త టైమ్ తీసుకొని “హ్మ్.. ఇంగ్లీష్” అంది, తను ఇంగ్లీష్ రివ్యూ రైటర్ జాబ్ కోసం వచ్చినట్లు తలాడిస్తూ.

“దట్స్ ఫైన్!”

నవ్వింది. అంటే ఇంక మాటలు ఆపేద్దాం అని అర్థం.

నేనూ నవ్వా.

కాసేపంతా నిశ్శబ్ధం. ఈ టైమ్‍లో ఓ మూడుసార్లు చూసుకున్నాం. ఒకసారి మెల్లిగా నవ్వుకున్నాం.

ఎటో చూస్తూ, నచ్చిన పాటేదో మనసులోనే మోగుతూంటే.. “సార్, మేడమ్, మీ ఇంటర్వ్యూ సెవెన్త్ ఫ్లోర్!” రిసెప్షన్ అమ్మాయి.

సార్, మేడమ్ కలిపి చెప్పడం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఒకరినొకరం చూసుకొని నవ్వాలి. మరెందుకో అది జరగలేదు.

గంట తర్వాత.. నాకు జాబ్ వచ్చిందన్న విషయం కన్‍ఫర్మ అయిన నిమిషం, నన్ను ఇంటర్వ్యూ చేసిన మేడమ్ అడిగిన చివరి ప్రశ్న, “ఓకే, ఇంతకీ మీకిష్టమైన సినిమా?”

“ది నోట్‍బుక్”

ఆవిడేమీ మాట్లాడలేదు. నవ్వింది. ఆడవాళ్ళు మాత్రమే నవ్వినప్పుడు ఇంతందంగా ఎలా ఉంటారో కదా!?

నేను బయటకు వెళ్ళిపోతూంటే.. ఇందాకటి బ్లూ డ్రెస్ అమ్మాయి ఎదురయింది. ’మళ్ళీ కలవం కదా?’ చూపులతోనే నవ్వుతూ అడిగా. తను నవ్వింది. ఆ నవ్వుకు అర్థం మాత్రం తెలీలేదు. కొన్ని ప్రయాణాలింతే.. అసలిది ప్రయాణం కూడా కాదేమో!

మళ్ళీ కలవం కదా!?

***

ఓ వారం రోజుల తర్వాత…

గంట క్రితం ప్రయాణమే మరిచిపోయే కాలంలో, వారం కిందటి ప్రయాణం, ఆ వారమే మరచిపోయి ఎప్పట్లాంటి జీవితం గడుపుతున్న ఒకరోజు..

తనొచ్చింది. మళ్ళీ తనే! ఎంతందంగా ఉందో!?

ఏదో అప్లికేషన్ నింపుతూ తనను చూడనట్టు నటిస్తూ కూర్చున్నా.

“హే.. హాయ్.. మీకూ జాబ్ వచ్చిందా?” పక్కనే కూర్చుంటూ అడిగింది.

“హహహ.. అందుకే ఇక్కడున్నా!”

“గుడ్‍వన్. నేనూ ఇవాళే జాయినింగ్” నవ్వి, కాసేపాగి, “రమ్యా” అంది.

రమ్యా.. ఎంత మంచి పేరు!?

“అర్జున్” నవ్వుతూ చెప్పా.

“హ్మ్.. అయితే ఇద్దరం కలిసి పనిచెయ్యబోతున్నామన్నమాట!”

కొన్నిసార్లు నాకేం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడిదిగో.. ఇలాగే నవ్వుతూంటా.

తనూ నేను నవ్వినట్లుగానే నవ్వింది.

కానీ ఎంతందంగా ఉంటుందో కదా? మనకు నచ్చినట్టు కనిపించిన వారిని రోజూ కలవడం, వాళ్ళతో రోజూ మాట్లాడ్డం.. ఆ ఆలోచనే ఉక్కిరి బిక్కిరి చేసింది.

చాలాసేపు ఒకరినొకరం చూసుకొని నవ్వుకున్నాం. ఏంటో.. కొన్నింటికి అర్థాలు దొరకవు. ఎప్పటికీ!

***

నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆలోచనలు నిజమై మరింత ఉత్సాహంతో నడుస్తోన్న రోజులు..

ఒకానొక సాయంత్రం.. బాస్ క్యాబిన్.

“అర్జున్, రమ్యా.. రేపట్నుంచి మన ఎంటర్‌టైన్‌మెంట్ మైక్రోసైట్ మొదలవుతుంది. రేపు రిలీజ్ అయ్యే సినిమాతోనే రివ్యూస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం”

“ఓహ్.. దట్స్ గ్రేట్!” ఇద్దరం ఒకేసారి అన్నాం.

ఆ తర్వాతి రోజు. ఈ ఆఫీస్‍లో మొదటి సినిమా. అదీ తనతో!!

ఎర్లీ షోకు నేను నా బైక్‍పై వచ్చా. తను ఆటోలో వచ్చింది.

టికెట్ తీసుకున్నాక, “నువ్వు, నేను ఒకే కాలనీలో ఉన్నాం, ఒకే షో చూస్తున్నాం. తెలుస్తోందా?”

“అర్థమైంది. తర్వాతి సినిమా కలిసే వద్దాంలే!”

రెండు వారాల్లో ’మీరు’ఎగిరిపోయింది. ’నువ్వు’కొత్తగా ఉంది. అందంగా కూడా!

ఆ తర్వాతి రెండు నెలలు.. 20  సినిమాలు, 20 ఇంటర్వ్యూలతో కళకళలాడుతూ గడిచిపోయాయి.

సినిమా.. ఎవరికి ఏమేం ఇచ్చిందో కానీ, నాకైతే ఓ అందమైన, తెలివైన, మొండిపట్టు అమ్మాయిని దగ్గర చేసింది. తెలివి, మొండిపట్టు రెండూ కలిసిన అమ్మాయితో జీవితం ఎంత బాగుంటుందో, అంతే అయోమయంగానూ ఉంటుంది.

కొన్నిసార్లెందుకో పిచ్చి పిచ్చిగా అలిగేది. నాకు కోపం వచ్చేది కాదు, ఏదైనా అందామంటే! అలిగితే ముద్దుగా ఉంటుందేమో.. నవ్వొచ్చేది. అలా నవ్వినందుకే ఐదు రోజులు మాట్లాడలేదు.

ఆరో రోజు. ట్రింగ్ అని ఫోన్ మోగితే చూశా.

“ఈవినింగ్ 5. క్యాంటీన్. నువ్వే ముందెళ్ళు!” అంటూ ఓ మెసేజ్. తనే!

“ఓహ్. వావ్! ష్యూర్!” రిప్లై ఇచ్చా.

4:50కే వెళ్ళిపోయా. 5:20 దాకా తను రాలేదు.

వెయిట్ చేయించినందుకు కోపం రావాలి. ఎందుకో.. రాలేదు.ఫోన్ చేశా. పని చేయలేదు. అంటే ఫ్లోర్‍కి వచ్చేసిందని అర్థం. సగం కోపం, సగం నవ్వు… అసలు ఈ ఎక్స్‍ప్రెషన్ ఎక్కణ్ణుంచి తెస్తుందో! అదే ఎక్స్‌ప్రెషన్‍తో వచ్చి ఎదురుగా కూర్చుంది.

వస్తూనే ఆర్డర్ ఇచ్చిందేమో! జ్యూస్ తెచ్చిచ్చాడు క్యాంటీన్ బాయ్.

ఇరవై నిమిషాలు. ఇరవై నిమిషాలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే ఎక్స్‍ప్రెషన్ కంటిన్యూ చేసింది.

నేను చాలా నార్మల్‍గా, ఏమీ మాట్లాడకుండా జీరో ఎక్స్‌ప్రెషన్‌తో కూర్చున్నా.

ఇరవై నిమిషాల తర్వాత.. మెల్లిగా నవ్వింది. నేనూ నవ్వా. లేచి జుట్టు చెరిపి, “పద వెళ్దాం” అంది.

తను కళ్ళతోనే ఇంతందంగా మాట్లాడగలదని అప్పుడే తెలిసింది.

తిరిగి లిఫ్ట్‌లో వెళుతోంటే.. “అవునూ.. రాత్రి ప్రీమియర్ షోకి కలిసే కదా వెళ్తున్నాం” అంది.

నేను నవ్వా. తనూ నవ్వింది. మేమెందుకో చాలాసార్లు నవ్వులతోనే మాట్లాడుకుంటూంటాం

***

“సినిమా చాలా చెత్తగా ఉంది కదా!” షో అయిపోయాక తన హాస్టల్ ముందు డ్రాప్ చేసినప్పుడడిగింది.

“హీరోయిన్ బాగుంది” నవ్వా.

“ఎందుకు బాగుండదూ!??” తనూ గట్టిగా నవ్వింది.

“హ్మ్.. ఇంకా..” కనుబొమ్మలెగరేస్తూ అడిగింది.

“ఒకటి చెప్పనా..”

“ఆ.. చెప్పు..”

“ఆ హీరోయిన్ కంటే నువ్వే అందంగా ఉన్నావ్!”

నవ్వింది. నేనేమీ మాట్లాడలేదు. నవ్వలేదు కూడా.

“ఇంకా…”

“ఇంకా అంటే ఇంకా! చాలా ఉంది. చెప్తూ తెల్లారిపోతుంది!”

“కానీ…”

“నిజంగానే తెల్లారిపోతుంది!”

“అవ్వనీ…” అంటూ చెంపగిల్లింది

“ఈ గడ్డం పెంచడం ఏమైనా ఫ్యాషనా?” అంటూ టాప్‍మని ఒకటి కొట్టింది. మెల్లిగానేలే! బాగుంది.

“అచ్చా సరే… నువ్వు అబద్ధాలు చెప్తావా అర్జున్?”

“అదేంటీ అలా అడిగావ్?”

“అడిగిన దానికి సమాధానం చెప్పు…”

“నేనెవర్నీ?”

“అంటే…”

“అంటే… నా పనేంటీ?”

“రైటర్‌వి. సినిమాలు తీద్దామని కూడా అనుకుంటున్నావ్! కథలు రాస్తావ్ కదా నువ్వు!” కొద్దిసేపాగి, “కథంటే అబద్ధం. అంటే.. నువ్వు అబద్ధాలు చెప్తావ్?”

“హహహ… నీతో కాదులే…”

“ఏం కాదు. నువ్వు నాతో కూడా చెప్తావ్!”

“అవును. నీతో కూడా చెప్తా”

కోపంగా చూసి, ఆ వెంటనే నవ్వింది. తననర్థం చేసుకోవడం ఎవ్వరివల్లా కాదు. ఇదే మాట తనతో చెప్తే… నవ్వింది.

ఆ తర్వాత ఇలాగే ఏదోకటి మాట్లాడుతూనే పోయింది. కొన్ని విన్నా. కొన్ని విన్నట్లు నటించా. తననలా చూస్తూ ఉండిపోవడంతో కొన్ని మాటలు చెవిని కూడా తాకలేదు.

టైమ్ 3:40 అయినప్పుడడిగా, “టైమ్ ఎంతైందీ?” అని.

“నీకు నిద్రొస్తోంది కదా?” అంది.

“హే లేదు. నేనా ఉద్దేశంతో అడగలేదు”

“హ్మ్… నీకు నిద్రొస్తోందిలే!”

“నిజంగా లేదు. చెప్పు..”

“ఏం లేదులే. రేపు కలుద్దాం. బై. యూ ఆర్ ఏ నైస్ గయ్!”

“దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ”

“బై”

“బై”

***

బై చెప్పిన తర్వాత ఒక వారం పాటు తను నాకు కనిపించలేదు. ఆఫీస్‍లో కూడా సడెన్‍గా లీవ్ అని చెప్పెళ్ళింది. వారం రోజులు.. ఫోన్ లేదు. టెక్స్ట్ లేదు. ఫ్రెండ్స్‌నడిగితే ఊరెళ్ళిందనే సమాధానం వచ్చింది. చెప్పకుండా ఎందుకెళ్ళాలి??

పిచ్చి కోపం వచ్చింది.

సడెన్‌గా వారం తర్వాత ఓరోజు మెసేజ్ పెట్టింది.

“ఈవినింగ్ 5. సినిమాకెళ్దాం. జీవీకే”

స్మైలీతో రిప్లై ఇచ్చా. మేం కోపాన్ని కూడా నవ్వుతోనే కన్వే చేసుకుంటూంటాం.

పిచ్చి కోపంతో, తనతో గొడవకనే వెళ్ళా. నేను నోరు తెరిచేలోపే

“మై స్వీట్ అర్జున్, ఎలా ఉన్నావ్?” నవ్వుతూ దగ్గరకొచ్చింది.

కోపమంతా పోయాక వచ్చే నవ్వును తను క్షణాల్లో తెప్పించింది. చెప్పకుండా ఎందుకెళ్ళావన్న విషయం మళ్ళీ ఎప్పుడైనా అడుగుతునాని తనకు తెలుసు. అందుకే ముందే చెప్పేసింది. ఒకర్నొకరం చూసుకొని నవ్వుకున్నాం.

సినిమా మొదలైంది. ఓకే బంగారం. ఇద్దరం అలా చూస్తూ కూర్చున్నామంతే!

ఇరవై నిమిషాల తర్వాత తను నావైపు తిరిగి, “అర్జున్, మనం ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు చూశాం తెల్సా!” అంది

“హహహహ… ఫైన్. ఏంటి విషయం?”

“ఏదైనా చెప్పు…”

“ఏం చెప్పను?”

“ఏదైనా… నీ ఇష్టం…”

నవ్వి, “నువ్వు చాలా అందంగా ఉన్నావ్” అన్నా.

“ఆహా… ఇది కాదు. ఇంకేదైనా” కళ్ళింతవి చేస్తూ అడిగింది.

చెవులకు తను పెట్టుకున్న రింగులు చాలా పెద్దవిగామ్ గుండ్రంగా ఉన్నాయి. అదే చెప్పా. నవ్వింది.

మళ్ళీ ఇద్దరం సినిమా చూస్తూ ఉండిపోయాం.

మధ్యలో ఒకసారి తనవైపు చూశా. తనలా చూస్తూనే ఉంది.

కళ్ళెగరేసా. నవ్వింది.

కాసేపు ఇద్దరం కళ్ళు మూసుకొని ఏమీ మాట్లాడకుండా శ్వాస చప్పుడు వింటూ ఉన్నాం. సినిమాలో పాట కూడా మంచి రిథమ్‍లో వస్తోంది. తనకు దగ్గరగా జరిగి, అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, చెవికి ముద్దుపెట్టా. పెదాలాట పాటతో పాటే వేగమందుకొని, అదే స్థాయిలో తగ్గుతూ పోయింది.

మళ్ళీ సినిమా చూస్తూ… “ఫస్ట్ సాలరీ, ఫస్ట్ కిస్. ఆ అనుభవం వేరంటారు. నిజమే!” అన్నా.

“నీకిది ఫస్ట్ కిస్సా?” అడిగింది.

“అవును. నీకూ?”

“కాదే!”

“హ్మ్. ఫైన్. అలా అని ఈ కిస్ బాలేదనకేం!”

ఇద్దరం నవ్వుకున్నాం.

ఆ తర్వాత కొద్దిసేపు ఏమీ మాట్లాడుకోలేదు. సినిమా కూడా చూడ్లేదు.”రమ్యా… ఐ లవ్ యూ” సగం సగం గొంతుతో చెప్పేశా. నవ్వింది.  నేనూ నవ్వా.”అర్జున్, ఇందాక నాకిది ఫస్ట్ కిస్ కాదన్నా కదా?” నవ్వి, కాసేపాగి “అది అబద్ధం” అంది.

ఆ తర్వాత కళ్ళతో ఇంకేదో చెప్పింది. సినిమా కూడా అప్పుడే అయిపోయింది. తనేం చెప్పిందో అర్థం చేసుకుందామని అలాగే చూస్తూ కూర్చున్నా.

“వెళ్దాం ఇంక” అంది.

***

లవ్ అనే ఫీలింగ్ ఎంత కొత్తగా ఉంటుందో ఆ తర్వాతి రోజునుంచే బాగా అలవాటైంది. చాలాసార్లు గొడవ కూడా అందంగా కనిపించేది. నెలలు గడుస్తున్నాయన్న విషయం క్యాలెండర్ పేజీలు మారిన విషయం చూశాకే గుర్తొచ్చేది.

కొన్నిచెత్త సినిమాలు కూడా చాలా బాగా అనిపించేవి. అప్పుడప్పుడు తన మాటలు గుర్తొచ్చి నాలోనేనే నవ్వుకునే ఆలోచనే గమ్మత్తుగా ఉండేది.

ఒకసారెందుకో తననొదిలేసి ఐదు రోజులు వేరే ప్రపంచానికి వెళ్ళిపోయా. నాతో నేను గడపాలనుకున్నప్పుడల్లా ఇలా తెలియని బస్సులెక్కి, ఫోన్ కట్ చేసి తిరుగుతూంటా.

ఈ ఐదు రోజుల్లో తనకు రోజుకోసారైనా ఫోన్ చేస్తుండేవాణ్ణి. ఎక్కడున్నాననేది తనెప్పుడూ అడగలేదు. నేనూ చెప్పలేదు.

ఆరోరోజు చెప్పకుండా దర్శనమిచ్చి కాఫీకి తీసుకెళ్ళా.

తను నన్నర్థం చేసుకుంది. “ఇప్పుడు రిఫ్రెష్ అయ్యావా?” అని మాత్రం అడిగింది.

“ఓహ్. వెరీ కూల్. ఇట్ వాస్ ఏ లవ్లీ టైమ్. నువ్వు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఏదోలా అనిపించింది”నవ్వా.

తనూ నవ్వింది.కాఫీ తర్వాత సినిమాకెళ్ళాం. మళ్ళీ తనను హాస్టల్ ముందు దించేపుడు చూశా. నవ్వినట్టే ఉంది కానీ, ఎందుకో కన్నీళ్ళు.

“ఏమైందీ…” అడిగా.

“ఏమీ కాలేదు” నవ్వింది. ఇందాకట్లానే ఉందా నవ్వు.

“చెప్పూ…” మళ్ళీ అడిగా.

“హ్మ్… ఇంకా…” అంది.

అంటే నువ్వే చెప్పని అర్థం. ఏదేదో చెప్పా. నన్ను అసందర్భంగా అడిగితే.. ఇలాగే ఏదోటి చెప్తూ వెళ్ళిపోతుంటా.

మళ్ళీ రాత్రి మూడున్నర దాటింది.

ఈసారి తనే అడిగింది. టైమెంతని. ఇద్దరం గట్టిగా నవ్వుకున్నాం.

ముద్దిచ్చి బై చెప్పింది.

ఇంటికెళ్ళాక, “ఐ లవ్ యూ.. :) ” అని మెసేజ్ పెట్టి పడుకున్నా.

***

తర్వాతి రోజు.

ఉదయం లేచి చూస్తే.. “లవ్ యూ టూ… :) ” అని రిప్లై ఉంది.

రిప్లైగా స్మైలీ ఇచ్చా. ఆరోజు కూడా ఆఫీస్‌కి సెలవు పెట్టి రెస్ట్ తీసుకున్నా.

తనను డిస్టర్బ్ చేయడమెందుకని ఆ తర్వాత టెక్స్ట్ చేయలేదు. సాయంత్రం తనే మెసేజ్ పెట్టింది.

“ఎందుకో గుర్తొచ్చావ్!!” అని.

“హహహహ… లవ్… :) ” రిప్లై ఇచ్చా.

అలా చాట్ చేస్తూనే పోయా. ఒక స్టేజ్‌లో ఊరికనే స్మైలీలతో ఆటాడుకున్నాం.

సడెన్‌గా ఏదో గుర్తొచ్చి, “ఈ ఐదు రోజులు నీకు డల్‌గా ఉండి ఉంటుంది కదా?” అనడిగా.

“హ్మ్… ఎందుకలా అడిగావ్??”

“అంటే నేను లేను కదా… ;)

“లేకుంటే…”

“బోరింగ్‌గా ఉండి ఉంటుందేమోని…”

“నేను లేకుండా నీకో ప్రపంచం ఉన్నపుడు, నువ్వు లేకుండా నాకూ ఓ ప్రపంచం ఉంటుందని ఎందుకనుకోవు??” మెసేజ్‌లో తను కనిపించింది. నన్నడిగితే ఇంత కోపంగా ఎప్పుడూ లేదు.

“నేను ఆ ఉద్దేశంతో అన్లేదు…”

“మరి… ఏ ఉద్దేశంతో అన్నావ్!”

కాల్ చేసి మాట్లాడితే బాగుంటుందని చేశా. ఎత్తలేదు.

చూస్తే… ఇంకో మెసేజ్. “ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నా కదా? మళ్ళీ ఫోనెందుకు? ఇప్పుడు చెప్పు?”

“వదిలెయ్…”

“వదిలేయడమంటే…”

“వదిలేయడమంటే… వదిలేయడమనే అర్థం!”

“సో… నువ్వు అందరు మగాళ్ళ లాంటివాడివే?”

“వాట్ డూ యూ మీన్?”

“ఐ మీన్ ఇట్”

మెసేజ్ చూశాక కూడా పావుగంట రిప్లై ఇవ్వలేదు.

మళ్ళీ తనే, “నువ్వు లేకపోతే నా లైఫ్ జీరో అని, నువ్వొక్కడివే నా ప్రపంచం అని నీ అభిప్రాయం”

టైపింగ్… టైపింగ్ చూపిస్తూనే ఉంది. తను మెసేజ్ పూర్తి చేసే దాకా పైది చూసి తట్టుకోలేక, కొత్త మెసేజ్ ఏం వస్తుందో అని అలా చూస్తూనే కూర్చున్నా.

“నీకు నా మీద కొంత అనుమానం కూడా ఉంది కదా! ఫస్ట్ కిస్ గురించి కూడా సరదాగా వదిలేశావ్! నన్ను నిలదీస్తావనుకున్నా”

కోపమొచ్చింది. స్మైలీ రిప్లై ఇచ్చా.

“ఈ నవ్వుకు అర్థమేంటి? నువ్వో పిచ్చిదానిలా మాట్లాడుతున్నావనా?”

“నేనామటన్లేదు”

“మరింకేం అనాలనుకున్నావ్”

ఏదో సగం వరకూ టైప్ చేసి మళ్ళీ చెరిపేశా. “టైపింగ్… టైపింగ్… టైపింగ్… ఏదో రాసి మళ్ళీ చెరిపేసి ఎందుకిలా ఆడుకుంటున్నావ్? అనుకునేదేదో చెప్పేయొచ్చుగా?” ఫాస్ట్ రిప్లై ఇచ్చేసింది.

“వదిలెయ్… ”

“వదిలేయడమేంటి… వదిలేయడం…”

“రమ్యా… నేనేదో సరదాకి…”

“సారీ… ఇంక మెసేజ్ చెయ్యకు. నువ్వేంటో పూర్తిగా అర్థమైపోయాక ఇంక నీతో ఉండలేను. బై!”

“హేయ్ హేయ్… ఏం మాట్లాడుతున్నావ్?”

“బై బై బై”

ఆ తర్వాత నెలరోజుల పాటు చాలాసార్లు మెసేజ్ చేశా. ఫోన్ చేశా. నేరుగా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశా. ఒకసారి సీరియస్ రిప్లై ఇచ్చింది. మళ్ళీ మెసేజ్ పెట్టొద్దని!

ఒకే ఆఫీస్‌లో కలిసి పనిచేస్తాం. మాట్లాడుకోం. పక్కపక్కనే కూర్చొని సినిమా చూస్తాం. చూసుకోం. ఇలాగే మూడు నెలలుగా సాగుతోందీ ప్రయాణం.

మొదట్లో నేను దగ్గరై ఏదో చెప్పడానికి ప్రయత్నించా. తను దూరం పెట్టింది. ఆ తర్వాత తను దగ్గరై ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. నేను దూరం పెట్టా. ఇప్పుడు ఇద్దరమూ ఒకరికొకరం దగ్గరవ్వాలన్న ఆలోచనను కూడా దగ్గరకు రానివ్వట్లేదు. ఇదిగో, ఇక్కడ, ఇలా, బయటకు కనిపిస్తూన్నంత దగ్గరగా, కనిపించనంత దూరంగా ఇలా కలిసున్నాం. ఇక్కడితోనే బహుశా నా ఈ ప్రేమకథ ముగిసిందేమో!

“నువ్వేమైనా చెప్పుకుంటావా?”

“నన్నా?”

“ఆ! నిన్నే!”

“యా!”

***

అర్జున్, రమ్యల ఫోన్లు రెండు నిమిషాల తేడాలో ట్రింగ్‌మని మోగాయి.

“మిస్ యూ… ”

“మిస్ యూ టూ…”

ఇప్పుడీ కథ మళ్ళీ కొత్తగా మొదలవుతుంది.

**** (*) ****