కథ

పాప్‌కార్న్

అక్టోబర్ 2017

జీవీకే వన్ మాల్..

మధ్యాహ్నం మూడవుతోంది. కానీ అప్పటికే సాయంత్రం ఆరు దాటి చీకట్లు పడుతుందన్నట్లు ఉందక్కడ. వర్షం పడేలా ఉంది. అప్పుడే మాల్‌లోకి అడుగుపెడుతోన్న అర్జున్‌కు టికెట్ కౌంటర్ దగ్గర కనిపించింది రమ్య. ‘తనేనా?’ అని చూస్తూ అక్కడే ఆగిపోయాడు. టికెట్ తీస్కొని వెనక్కి తిరిగిన రమ్య, ఎదురుగా నిలబడి ఉన్న అర్జున్‌ను చూసింది.

ఆమె కళ్లు మెరిసాయి అర్జున్‌ను చూడగానే.

‘‘ఇక్కడ..?’’ అడిగాడు.

నవ్వింది.

‘‘రెండళ్లయింది మనం కలిసి!’’ అలాగే చూస్తూండిపోయిన అర్జున్‌ను కదిలిస్తూ మాట్లాడింది రమ్య.

‘‘యా! రెండేళ్లయిపోయింది’’ నవ్వాడు అర్జున్.

‘‘సమాధానం చెప్పలేదు.. ఇక్కడ..?’’ తన మాటలను కొనసాగిస్తూ మళ్లీ అడిగాడు.

‘‘పనుండి వచ్చా. ఫ్రెండ్ ఈవినింగ్ వస్తాని చెప్పి ఆఫీస్‌కెళ్లింది. ఒక్కదాన్నే బోర్ అని ఇక్కడకొచ్చా’’ రమ్యను చూస్తూ, ఆమె మాటలను అలా వింటూ నిలబడ్డాడు అర్జున్.

‘‘సో..!’’ అన్నారిద్దరూ ఒక్కసారే! నవ్వుకున్నారు.

కొద్దిసేపు ఏమీ మాట్లాడుకోకుండా ఒకరిని ఒకరు చూస్తూ నిలబడ్డారు.

‘‘నాతో పాటు సినిమా చూడొచ్చుగా?’’ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ అడిగింది రమ్య.

‘‘లంచ్‌కని చెప్పొచ్చా. మళ్లీ ఆఫీస్‌కెళ్లాలి’’

‘‘చెప్పొచ్చుగా కొంచెం లేటవుతుందని?’’

‘‘కుదరదేమో!’’

‘‘హ్మ్..’’

‘‘షో ఏ టైమ్?’’

‘‘స్టార్ట్ అయి ఉండొచ్చు. నేనేం సినిమా చూడాలని రాలేదు. ఊరికే అలా బోర్ కొడుతుందని..’’

నవ్వాడు.

‘‘వస్తావా? టికెట్ తీయనా?’’ ఉత్సాహంగా అడిగింది. తలూపాడు.

***

హీరో ఇంట్రో సాంగ్ వస్తోంది. అక్కడక్కడా కనిపిస్తోన్న కొన్ని జంటలు తప్పితే హాలు దాదాపు ఖాళీగా ఉంది. మెల్లిగా అడుగులేస్తూ వెళ్లి ఓ చోట కూర్చున్నారిద్దరూ.

‘‘సో.. హౌ ఈజ్ లైఫ్?’’ అడిగింది రమ్య.

‘‘ఆల్ ఫైన్!’’ అంటూ నవ్వాడు అర్జున్.

‘‘హైద్రాబాద్‌కి ఎందుకొచ్చానో చెప్పలేదు కదూ? నెక్స్ట్ మంత్ నా పెళ్లి. నీకు తెలిసిందనే అనుకుంటున్నా!’’

‘‘లేదు. తెలీదు.’’

‘‘వెల్ యా! అంతా అనుకోకుండా సెట్ అయిపోయింది.’’

నవ్వాడు.

కాసేపు ఏమ మాట్లాడుకోలేదు ఇద్దరూ.

‘‘లవ్ మ్యారేజ్?’’ ఏదోకటి మాట్లాడలన్నట్లు అడిగాడు అర్జున్.

‘‘లోల్ నో! తెలిసినవాళ్లే! చుట్టాలవుతారు. బెంగళూరులో ఉంటారు తను’’ అంది రమ్య.

‘‘కూల్!’’

‘‘ఇంకేంటి? మెసేజ్ చేయడం కూడా మానేశావ్?’’

‘‘అలా అనేం లేదు. కొంచెం బిజీ అయిపోయా!’’

‘‘నేను నిజంగా అనుకోలేదు ఇలా చేయాల్సి వస్తుందని. ఇట్ డిడింట్ హ్యాపెన్ అంతే. మనం అనుకున్నవన్నీ జరగవు కదా!’’

‘‘నేనిప్పుడు ఆ విషయం గురించేం అడగలేదు.’’

‘‘అడిగావని కాదు. జస్ట్ చెప్పాలనిపించింది.’’

నవ్వాడు. అర్జున్ సినిమా చూస్తూండిపోయాడు. రమ్య అర్జున్‌నే చూస్తూ కూర్చుంది.

‘‘నాపై కోపం తగ్గలేదు కదూ!?’’ అడిగింది.

‘‘నాకెందుకు కోపం? ఇట్ జస్ట్ డిడింట్ హ్యాపెన్. నేను అర్థం చేస్కోగలను.’’

‘‘థ్యాంక్స్!’’

‘‘ఇద్దరూ మౌనంగా ఒకరినొకరు చూస్తూండిపోయారు.

‘‘నిజంగానే నా మీదేమీ కోపం లేదు కదా?’’ మళ్లీ అడిగింది.

‘‘నిజంగానే లేదు.’’ చెప్పాడు అర్జున్.

‘‘నేన్నీతో లైఫ్ పంచుకుంటానని కలలుగన్నా!’’

‘‘అఫ్‌కోర్స్ నేను కూడా!’’

‘‘కానీ యూ నో వాట్? కొన్ని జరగవు.’’

‘‘హ్మ్..’’

‘‘నిన్ను వదిలేసి పోతానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి రోజే ఒకటి వస్తే చస్తాననే అనుకున్నా. నా చేతుల్లో ఏం లేదు. నిన్నెప్పటికీ మరచిపోలేను.’’

‘‘కానీ వదిలేసి పోతావ్!’’

‘‘ప్లీజ్! అలా మాట్లాడకు.’’

నవ్వి ఊరుకున్నాడు అర్జున్. రమ్యా నవ్వింది.

‘‘నన్ను మర్చిపోయావనే అనుకుంటున్నా!’’ కాస్త కుదురుకొని మళ్లీ కదిలించింది రమ్య.

‘‘అలాగే అనుకో!’’

‘‘అదే నిజమని చెప్పు!’’

‘‘అదే నిజమని అబద్ధం చెప్పనా?’’ నవ్వుతూ అడిగాడు.

‘‘కష్టం నీతో మాట్లాడ్డం!’’ నవ్వింది.

‘‘కష్టం నిన్ను అర్థం చేస్కోవడం కూడా!’’

అర్జున్, రమ్యల సంభాషణతో సంబంధం లేకుండా సినిమా నడుస్తూనే ఉంది. కాసేపు స్క్రీన్ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయారిద్దరూ.

‘‘ఎవరైనా ఉన్నారా మళ్లీ?’’ అర్జున్ వైపు తిరిగి అడిగింది రమ్య.

‘‘అంటే?’’

‘‘నీ లైఫ్‌లో? కొత్తగా.. ఇంకెవరైనా అమ్మాయి వచ్చిందా అని!’’

‘‘లేదు.’’

‘‘..’’

‘‘..’’

‘‘యూ డిజర్వ్ బెటర్! నాకంటే మంచి అమ్మాయి వస్తుంది నీకు!’’

‘‘నాకిప్పుడు ఇంక ఏ హోప్స్ లేవు.’’

‘‘అలా కాదు. ఒక టైమ్ వస్తుంది. నేనొకదాన్ని ఉండేదాన్నన్న ఆలోచన కూడా రాదు నీకు.’’

‘‘నువ్వు ఇప్పటికీ ఉన్నావ్!’’

‘‘ప్లీజ్! చాలా దూరమొచ్చేశావ్. నీకో లైఫ్ ఉండాలి. నేను లేకుండా కూడా ఉండాలది. నువ్విలా లేవు ఒకప్పుడు.’’

‘‘కచ్చితంగా లేను.’’

‘‘మళ్లీ ఒకప్పటిలా ఉండాలి నువ్వు. నవ్వుతూ.. కొత్తగా.. నీలా ఉండాలి.’’

‘‘ఇంకేదైనా చెప్పు! ఎలా ఉంటాడు మీ ఆయన!?’’

‘‘హ్మ్.. హీ ఈజ్ సో కూల్. రెండు సార్లే కలిశా నేను. ఎంగేజ్‌మెంట్ తర్వాత నాకు ఎక్కువ టైమ్ ఇస్తున్నారు. ఈ వీకెండ్‌కి బెంగళూరు వెళ్తున్నా. ఎగ్జైటింగ్!’’

‘‘వావ్!’’

‘‘ట్రోల్ చేస్తున్నావా?’’

‘‘అలాంటిదేం లేదు. గుడ్ టు సీ యూ హ్యాపీ!’’

‘‘యూ ఆర్ ఏ నైస్ గయ్!’’

‘‘ఐ విష్..’’

‘‘లోల్ షటాప్..!’’

గట్టిగా నవ్వుకున్నారిద్దరూ. ఇంటర్వెల్ కార్డ్ పడింది.

‘‘ఐ విల్ గెట్ సమ్‌థింగ్!’’ అని చెప్పి అర్జున్ బయటకు వచ్చాడు.

రమ్య కాసేపలా కళ్లు మూసుకుని అక్కడే కూర్చుండిపోయింది.

***

పది నిమిషాలకు పాప్‌కార్న్ బకెట్, రెండు కూల్‌డ్రింక్స్ ఉన్న ట్రే ఒకటి పట్టుకొని మళ్లీ వచ్చి కూర్చున్నాడు అర్జున్.
‘‘థ్యాంక్స్’’ అంటూ పాప్‌కార్న్ అందుకుంది రమ్య.

పిడికిలిలో పట్టేంత పాప్‌కార్న్ తీస్కొని ఆ పేపర్ బకెట్‌ను పక్క సీట్లో పెట్టేసింది.

కూల్‌డ్రింక్ తాగుతూ ఉన్నారిద్దరూ.

‘‘ఇంకేంటి? జాబ్ అక్కడేనా?’’ అడిగింది.

‘‘యా! అదే!! మారే అవసరం రాలేదింకా!’’ నవ్వుతూ చెప్పాడు.

‘‘లోల్.. యూ ఆర్ ఏ ఫన్నీ గయ్!’’

ఆ మాటంటూనే ముఖంలో భావాలు మార్చేసింది రమ్య. ‘‘నీతో ఉండట్లేదన్న ఆలోచన ఎందుకో బాలేదు అర్జున్!’’

‘‘ఉండిపో అని ఇప్పుడు అడగలేననేగా!?’’

‘‘ప్లీజ్! నువ్వలా అడగవనే ఈ ఫీలింగ్ చెప్పా.’’

అర్జున్ నవ్వాడు. రమ్య కూడా అతణ్ని చూసి నవ్వింది.

‘‘ఇంకేదన్నా చెప్పు..’’ అడిగింది.

‘‘ముంబైకి షిఫ్ట్ అవుదామనుకుంటున్నా..’’ అన్నాడు.

‘‘సడెన్‌గా..?’’

‘‘సడెన్‌గా అనేం లేదు. కొత్త బ్రాంచ్ ఒకటి వస్తోందక్కడ. నన్నడిగితే వెళ్తా అని చెప్పా. కొత్తగా ఉంటుంది కదా, కొత్త ప్లేస్‌లో!’’

‘‘కానీ హైద్రాబాద్ కాకుండా ఇంకో ప్లేస్‌లో ఉండలేనన్నావ్!’’

‘‘కొన్నిసార్లు ఇష్టాలను వదిలేసుకోవాలి. ఇష్టం లేకున్నా..’’

‘‘కూల్! అయితే ముంబై అమ్మాయిని పడేస్తున్నావన్నమాట!’’ నవ్వింది రమ్య.

‘‘హహహ..’’

రమ్య అర్జున్‌కు కొంత దగ్గరగా జరిగింది.

‘‘ఇంత దగ్గరగా నిన్ను చూసి ఎన్నాళ్లయిందీ!! గడ్డం పెంచుతున్నావ్ ఈమధ్య?’’ అంటూ మరింత దగ్గరగా జరిగింది.

‘‘అదీ..’’ అంటూ అర్జున్ ఏదో చెప్పబోతూంటే మధ్యలోనే ఆపేస్తూ, ‘‘బాగున్నావ్ ఇలాగే..’’ అంది.

‘‘థ్యాంక్స్! అందరూ బాగుంది అంటూంటే ఉంచేశా అలాగే!!’’

‘‘ఎవరామ్మాయి?’’ అంటూ అర్జున్‌కు పూర్తిగా దగ్గరై పెదవి కలిపేసింది రమ్య.

ఇద్దరి మాటలకు లాక్ పడింది.

రెండు నిమిషాలకు వాళ్ల వాళ్ల కుర్చీల్లో వాలిపోయి కూర్చున్నారిద్దరూ.

రమ్య కళ్లల్లోనుంచి నీళ్లు.

అర్జున్ ఆమెను కదిలిస్తే, కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వింది.

‘‘ఆర్ యూ ఓకే?’’ అడిగాడు.

‘‘ఆమ్ ఫైన్. ఇట్స్ జస్ట్. యూ నో.. ఆమ్ ఫైన్..’’ సగం మాటలను మింగేస్తూ సమాధానమిచ్చింది.

ఒక ఇరవై నిమిషాల పాటు ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండా సినిమా చూస్తూ కూర్చున్నారు.

రమ్యకు తన ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. ‘‘వచ్చేశావా.. నేనిక్కడే సినిమాకొచ్చా. కూల్. వస్తున్నా..’’ అంటూ ఫోన్ కట్ చేసింది.

‘‘అర్జున్ నేను వెళ్లాలింక! ఫ్రెండ్ వచ్చేసిందట’’ అర్జున్ చెయ్యిని గట్టిగా పట్టుకొని చెప్పింది రమ్య.

‘‘కూల్.’’ అన్నాడు నవ్వుతూ. రమ్య కుర్చీలోంచి లేచే ప్రయత్నం చేస్తోంది కానీ, అర్జున్ చేతిని అలాగే పట్టుకొని వదలలేక మళ్లీ అక్కడే కూర్చుండిపోతోంది.

‘‘నువ్వు నన్ను మర్చిపోవాలి అర్జున్! నీకు నాకంటే మంచి అమ్మాయి తప్పకుండా వస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండాలి.
నవ్వుతూ ఉండాలి. నేనదే కోరుకుంటా కూడా!’’ ఏడుపును కంట్రోల్ చేసుకుంటూనే చెప్పింది రమ్య.

అర్జున్ ఏం మాట్లాడలేదు.

‘‘మనం ఈసారి మళ్లీ కలిసినప్పుడు నువ్వొక అమ్మాయిని చూపించి తనను ఇష్టపడుతున్నా అని చెప్పాలి. తను నాకన్నా అందంగా ఉండాలి’’ రమ్య మాట్లాడుతూ పోతోంది. అర్జున్ ఆమెనలా చూస్తూ, వింటూన్నాడు.

‘‘ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. నే వెళ్తా ఇంక’’ లేచింది రమ్య.

ఒక అడుగు ముందుకేసి, మళ్లీ అర్జున్ దగ్గరకొచ్చి, ‘‘అర్జున్!!’’ అని పిలిచింది.

‘‘చెప్పు..’’

‘‘యూ ఆర్ ద బెస్ట్ అర్జున్..’’

అర్జున్ నవ్వాడు.

‘‘ఎన్నిసార్లు చెప్పినా నాకిది బోర్ కొట్టదు. యూ ఆర్ ద బెస్ట్ ఎవరి థింగ్ హ్యాపెండ్ టు మీ! ఐ స్టిల్ లవ్ యూ!’’ అర్జున్‌ను ఒకసారి గట్టిగా హగ్ చేసుకొని అక్కణ్ణుంచి బయలుదేరింది రమ్య.

సినిమా పూర్తయింది. ఎండ్ క్రెడిట్స్ పడుతూంటే స్క్రీన్‌నే చూస్తూన్నాడు అర్జున్. ‘ది ఎండ్’ అని పడగానే లేచి, బయటకు నడిచాడు.

తరువాతి షో కోసం హాల్‌ను రెడీ చేసే పనిలో పడ్డారు సిబ్బంది. అందులో ఒకరైన శ్రవణ్ అంతకుముందు అర్జున్ కూర్చున్న చోట కొద్దిసేపు కదులుతూ నిలబడ్డాడు. అరగంటలో షో మళ్లీ మొదలైంది. అదే సినిమా.

***

‘‘అమ్మా! ఒక్క టూ రూపీస్ ఇయ్యవా?’’ అమ్మ చుట్టూ చేరి ఆమెను కదిలిస్తూ అడిగింది రవళి.

‘‘ఎందుకిప్పుడు?’’

‘‘ఏదైనా కొనుక్కుంటా!’’

‘‘నాన్నొస్తాడుగా! ఏదైనా తెస్తాడులే! గొడవ చెయ్యకు’’ సర్దిచెప్పింది అమ్మ.

‘‘హ్మ్..’’ బుంగమూతి పెట్టింది రవళి.

సాయంత్రం ఏడవుతోంది. సన్నగా వర్షం పడుతోంది. ‘‘నాన్నొచ్చాడూ..’’ అంటూ బయటకు పరిగెత్తింది రవళి, శ్రవణ్ బైక్ సౌండ్ వినపడగానే.

‘‘నాన్నా! నాకేం తెచ్చావ్..’’ అంటూ బ్యాగ్ లాక్కొని చూసింది.

ఆ బ్యాగ్‌లో ఉన్న కవర్‌ను బయటకు తీసింది. ఆ కవర్లో చిన్న పేపర్ బకెట్ ఒకటి కనిపించింది. ఆ బకెట్ నిండా.. పాప్‌కార్న్.

**** (*) ****