కథ

కారు చెప్పిన కథ

జనవరి 2015

ప్రతీవారంలానే ఈ వారమూ ఊరికని బయలుదేరా. ప్రపంచంలో నన్ను అత్యంత సంతోషపెట్టేదేదైనా ఉందంటే.. అది కచ్చితంగా మా ఇల్లే. అదేంటో మనం వెళ్తున్నామనగానే వెళ్ళాల్సిన ప్రదేశానికి సంబంధించిన గాలి మహత్తేదో ఇక్కణ్ణుంచే పని చేయడం మొదలుపెడుతుందనుకుంటా.. ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందే కదలాడుతూ ఉంటాయి. రాత్రంతా నిద్ర లేకున్నా కళ్ళు ఎర్రబడవ్, పొద్దుణ్ణుంచి ఏం తినకున్నా ఆకలవదు, చేరాలనుకుంటున్నదీ , చేరేదీ అక్కడికే అన్న విషయం తెలిసి కూడా ప్రతీసారీ, క్రమం తప్పకుండా ఇలాగే జరుగుతుంటుందెందుకో?

రెండు సిటీ బస్సులు మారాక.. ఊరికి పోయే బస్సందుకున్నా. ఎల్బి నగర్ దాటిన బస్సు వేగంగా దూసుకెళుతోంది. గంట క్రితం దూరంగా ఉన్న జనాలకీ, గంట ప్రయాణం తర్వాత జనాల వేగాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బహుశా మనుషుల వేగాన్ని చుట్టూ ఉన్న పరిస్థితులు నియంత్రిస్తుంటాయనుకుంటా. మరి వేగమంటే దూరం, కాలాలకు మధ్యనున్న సంబంధం మాత్రమేనని నా ఫిజిక్స్ లెక్చరర్ ఎలా (ఎందుకు) మోసం చేస్తుంటాడో ఎప్పటికీ అర్థమై చావదు ?!

హయత్నగర్ స్టాప్ దగ్గర టికెట్ తీసుకున్నా. అదే చివరి స్టాప్. ఆ తర్వాత ఇంకెక్కడా ఆగదీ బస్సు. ఎవ్వరూ ఆపకూడదన్న నియమమో, ఆపలేరన్న ధైర్యమో కానీ.. పేరుకు తగ్గట్టే ‘నాన్స్టాప్’గా పరుగులు పెడుతుంది. చూస్తూండగానే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకొచ్చేశా.

జంక్షన్ అవ్వడం చేత, రోడ్డుకి సగం వరకూ బారికేడ్లున్నాయి.. మెల్లిగా వెళ్ళాలని. మనకూ జీవితంలోని అత్యంత కీలక ఘట్టాల్ని దాటేప్పుడు ఇలాంటి అడ్డుకట్టలేవైనా ఉంటే బాగుండుననిపించింది. బస్సు నెమ్మదిగా వెళుతుండడంతో కొన్ని క్షణాలు బస్సుకు ఎడమవైపున్న ప్రదేశాన్నంతా ఓసారి నిశితంగా చూసే అవకాశం దక్కింది. అలా చూస్తూండగా.. రోడ్డుకు అటుప్రక్క, కొంచెం దూరంలో మైదానం లాంటి ప్రాంతంలో కనిపించిందో కారు. ఆక్సిడెంట్కి గురై చాన్నాళ్ళ నుండి అక్కడే ఉందనుకుంటా.. పూర్తిగా నాశనమై తుప్పు పట్టిపోయి ఉంది.

నా చూపు, ఆలోచనలన్నీ ఆ కారు దగ్గరే ఆగిపోయాయ్. బారికేడ్లను దాటిన బస్సు మళ్ళీ వేగాన్ని అందుకుంది. నేను మాత్రం బస్సుతో పాటు వెళ్ళలేకపోతున్నా.. కారుని అలా చూస్తూ ఉండి పోవాలనిపించింది. నాకేదైనా చెప్పాలనుకుంటుంది కాబోలు, అదీ నన్నే చూస్తూంది. కనిపిస్తున్నంత దూరం చూపుల్తో వెంటాడింది, కనిపించనంత దూరం వెళ్ళిపోయిన మరుక్షణం నుండి ఆలోచనల్తో వెంటాడ్డం మొదలు పెట్టింది. బస్సు కిటికీలను మూసేశా. అంతటా నిశ్శబ్దం ఆవహించినట్టుంది. కాసేపు ఏ ఆలోచనలూ లేవు. నిశ్శబ్దం వెనుక ఇంత అలజడి దాగుంటుందా?! చిన్నగా కిటికీని తీశా. కిటికీ నుండి మెల్లిగా గాలి తాకుతోంది. వేడి గాలే అయినా మరీ ఇబ్బందిగా ఏం అనిపించలేదు. కళ్లు వాటంతటవే కూరుకుపోసాగాయ్.

***

ఎండాకాలం.. మధ్యాహ్న సమయం. కాళ్ళకు చెప్పులు కూడా లేవు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఒక్కణ్ణే నిలబడి ఉన్నా. నాకు కనిపించకూడదేమోని కంకణం కట్టుకున్నట్టనిపిస్తుంది.. అక్కడి వాహనాల వేగం చూస్తే. అక్కడే కొంచెం దూరంలో నన్నే చూస్తున్న ఆ కారు వైపు పరుగున వెళ్తున్నా. ‘అయినా, ఓ పాడైన కారు నాతో ఏం చెప్పాలనుకుంటుంది?’ అన్న ఆలోచనలేం లేవు. ఆ కారున్న ప్రాంతాన్ని చేరుకోవాలంటే చిన్నపాటి కంచెను దాటాలి. ఒక్క ఉదుటున కంచె పైనుంచి దూకా. ‘అబ్బా.. ఏదో గుచ్చుకున్నట్టుందే..’ నొప్పి తెలుస్తున్నా దాని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. కారు వైపే వేగంగా పరుగున వెళుతున్నా.

“ఏయ్.. నిన్నే.. ఎవర్నువ్వు ? నా మానాన నేను వెళుతుంటే నన్నెందుకలా చూశావ్ ? ఎందుకిలా వెంటబడుతున్నావ్ ?” వేగంగా కారు వైపు అడుగులేస్తూ అరుస్తున్నా.

“అసలు నువ్వు నన్నెందుకు చూడాలి ? నీ చూపుల్తో ఎందుకు వెంటాడాలి ? నీదాకా ఎందుకు రప్పించుకోవాలి ?” గట్టిగా నిలదీస్తూ ముందుకు వెళుతున్నా. అక్కణ్ణుంచి మాత్రం ఎటువంటి సమాధానం లేదు.

“అసలు నా మాటలు వినిపిస్తున్నాయా నీకు ? అడుగుతుంటే సమాధానమివ్వాలని కూడా తెలియదా ?” అప్పటికీ ఏ సమాధానం లేదు.

కోపం తట్టుకోలేక గట్టిగా అరిచా, “ నువ్వసలు మనిషివేనా ?”

కాదు కదా ?! మరి నేనెందుకు (నేనెలా) కారును మాట్లాడమని అడుగుతున్నా.

ఒక్క చిన్న ప్రశ్న.. ఇంతసేపు ఏదో తెల్సుకోవాలని ప్రదర్శిస్తున్న తెలియని వేగాన్ని అమాంతంగా తగ్గించేసింది. అయినా సరే కారుతో ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉత్సుకత మాత్రం తగ్గలేదు.

కారుకి దగ్గరగా వెళ్లి నిలబడి, మీద చెయ్యేసి అడిగా, “చెప్పు.. ఎవర్నువ్వు ?”

చివరి ప్రశ్నడిగిన మరుక్షణమే, ఎవరో నా చేతుల్ని బలంగా లాగుతున్నట్టు అనిపించింది. చూస్తే.. అదే కారు, నన్ను ఈడ్చుకెళుతోంది.

“ఏయ్.. ఎక్కడికి ఈడ్చుకెళుతున్నావ్ ? ఆగు ?” అరుస్తున్నా.

“వినిపించుకోవేం.. చెప్పేది నీకే.. వదిలెయ్.. నా గర్ల్ఫ్రెండ్ కూడా (ఉండుంటే) ఇంత అరాచకంగా ప్రవర్తించదు..” అరుస్తూనే ఉన్నా. అవేవీ దాని చెవికెక్కట్లేదనుకుంటా నన్నలా ముందుకు ఈడ్చుకెళుతూనే ఉంది.

***

ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్కి కొద్ది దూరంలో.. ఎండ వేడి ఏ మాత్రం తగ్గలేదు. కాళ్ళింకా కాలుతూనే ఉన్నాయి.

“కళ్ళు మూసుకో.. నే చెప్పే దాకా తెరవొద్దు” మొదటిసారి మాట్లాడిందా కారు.

అప్రయత్నంగానే కళ్ళు మూసుకున్నా. దేన్నైనా తెల్సుకోవాలని బలంగా కోరుకున్నప్పుడు, ఇలా మనకు తెలియకుండానే ఆ మాయలో పడిపోతామేమో?!

“ఇప్పుడు నీ మెదడును తొలుస్తున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టెయ్. వినడం మీదనే మనసును లగ్నం చేయి..” చిన్నప్పుడు తాతయ్య అందర్నీ ఓ దగ్గర కూచోబెట్టుకొని కథ చెబుతున్నట్టు చెబుతోందా కారు. అన్నట్టు నాకు తాతయ్య ఎలా ఉంటాడో తెలియదు. నేనాయన్ని చూళ్ళేదు.

“చెప్పు.. ఇప్పుడేం వినిపిస్తుంది? ” అడిగిందా కారు.

“ఏమో.. తెలీడం లేదు.. అంతా నిశ్శబ్దంగా ఉంది.”

కాసేపాగి, “ఓహో.. ఇప్పుడు.. ?” అంతే మెల్లిగా అడిగింది.

“ఏదో వాహనం హారన్ చప్పుడు వినిపిస్తోంది. దానికి ముందు ఏదైనా అడ్డుందా?” కారేం మాట్లాడట్లేదు.

“హారన్ వేగం, తీవ్రతా పెరిగింది. ఏం జరుగుతోంది ? నేను కళ్ళు తెరుస్తున్నా..”

“వద్దు.. ఆ పని మాత్రం చెయ్యకు” వారిస్తుందా కారు.

క్షణాల్లో ఏదో బద్దలైనట్టు పెద్ద శబ్ధం.

“ఏం జరిగింది. నేను కళ్ళు తెరుస్తున్నా…”

“వద్దన్నానా…”

“కానీ…”

“నే చెప్పేది మాత్రమే చెయ్యి”

“అసలేం జరిగిందక్కడ?”

“ఇందాక గట్టిగా హారన్ కొడుతూ ఓ కారొచ్చింది.గుర్తుందా?”

నేనేం మాట్లాడకపోవడంతో అదే మళ్లీ, “ఆ కారే మన ముందు ఆగి ఉన్న ఓ లారీని ఢీకొంది. అందులో ఉన్న నలుగురిలో ముగ్గురు అప్పుడే చనిపోయారు.”

“ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ? నేను కళ్ళు తెరుస్తున్నా”

“వద్దన్నానా” రెట్టించిన కోపంతో అరుస్తో౦దా కారు.

‘కాపాడండీ’ అంటూ అర్థిస్తున్నాడో వ్యక్తి.

“కానీ.. అతను చావు బ్రతుకుల్లో…”

“నువ్వేం చేయలేవు” నా మాటల్ని మధ్యలోనే ఆపింది.

“కానీ…”

“నోర్ముయ్” గట్టిగా అరిచింది.

కాసేపంతా నిశ్శబ్దం. ఆ నాలుగో వ్యక్తీ చనిపోయాడు.

“ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరువు”

ఆ మాటలన్న వెంటనే కళ్ళు తెరిచా. నా కళ్ళ ముందే నాలుగు శవాలు. చనిపోయిన క్షణాలకే ‘మనిషి’ అనే ట్యాగ్ దానంతటదే ఎలా మాయమవుతుందో కదా!

***

నేనా శవాల ముందు కూలబడి ఏడుస్తున్నా. ‘వాళ్ళు నాకేం కారు’ అన్న విషయమెందుకో గుర్తుకు రావట్లేదు.

“ఇదిగో. ఇతణ్ణే నువ్వు కాపాడతానంది. పేరు రాజేష్..”

నన్ను నేను చూసుకున్నట్టుంది అతణ్ణి చూస్తుంటే. నిమిషం క్రితం వరకూ జీవితం మీద ఎన్ని ఆశలతో బతుకుతున్నవాడో ? ఇప్పుడిలా…

“ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. ప్రస్తుతం తన అక్క దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లిని వదిలి నిమిషం ఉండేవాడు కాదు. మంచి చదువులు చదువుకొని తన వాళ్ళకు గొప్ప పేరు తీసుకురావాలని, ఇష్టం లేకున్నా ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నాడు.”

“ఇతణ్ణి చూడు. పేరు రాఘవ. ఇక్కడే డాక్టర్గా పనిచేస్తున్నాడు. అమెరికాలో ఓ డాక్టర్స్ సదస్సును చూసుకొని నిన్నే హైద్రాబాద్ వచ్చాడు. ఇతనికి భార్య, ఓ పదేళ్ళ పాప ఉన్నారు. తన సొంతూర్లో ఓ పెద్ద ఆసుపత్రి కట్టాలనేది ఇతడి కల. ఆ పని మీదే వెళుతున్నాడిప్పుడు”

నేనేం మాట్లాడలేదు. కారలా చెబుతూనే ఉంది. కొన్ని వింటున్నా, కొన్ని వదిలేస్తున్నా. కొంత అర్థమవుతోంది, కొంత అయోమయంగా ఉంది. అచ్చం ఫిజిక్స్ పాఠంలా!

కొద్దిసేపేదో ఆలోచనల్లో పడ్డా. “ఎటు చూస్తున్నావ్ ?” అన్న కారు మందలింపుతో మళ్ళీ ఈ లోకానికొచ్చా.

“ఇదిగో, ఇతణ్ణి చూడు. పేరు నర్సింహ్మ, కారు డ్రైవర్. కొన్నేళ్ళ నుండి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చాలీ చాలని జీతం (కమీషన్) తో నెట్టుకొస్తున్నాడు. సొంతంగా రెండు కార్లని కొని కిరాయికి తిప్పుతూ తన కాళ్ళ మీద తాను నిలబడాలని కోరుకుంటున్నాడు. అందుకు డబ్బులు కూడా సిద్ధం చేసుకుంటున్నాడు.”

“చివరగా ఇతణ్ణి చూడు. పేరు రామయ్య. రాఘవ తండ్రి. ఒక్కగానొక్క కొడుకుని ఉన్నత స్థితిలో చూడాలని ఇన్నాళ్ళూ కష్టపడ్డాడు. ఈ మధ్యే రిటైరై చక్కగా మనవరాలితో ఆడుకుంటూ, తనకు కథలు చెబుతూ, ఇంటిని చక్కబెడుతున్నాడు.”

వాళ్లందరి గురించి తెల్సుకున్నాక కాసేపు నేనేం మాట్లాడలేదు. ఆ కారూ ఏం మాట్లాడలేదు.

“ఇదంతా నాకెందుకు చెబుతున్నట్టు?” తేరుకొని మెల్లిగా అడిగా.

ఘోరం జరిగింది నా వాళ్ళకు కాదనుకున్నప్పుడు కన్నీళ్ళు కొద్దిసేపటికి వాటంతటవే మాయమవుతుంటాయ్ ఎలాగో ?!

“ఎందుకా? ‘నా కొడుకు మంచి స్థితికి వస్తాడు.. కుటుంబానికి గొప్ప పేరు తీసుకొస్తాడ’ని కలలు కంటున్న ఆ తల్లికి, ముప్పై రెండేళ్ళకే భర్తను కోల్పోయిన రాఘవ భార్యకి, ‘తాతయ్యా కథ చెప్పవా?’ అనడిగే పాపకి, నర్సింహ్మ కుటుంబానికి, వాళ్ళతో సంబంధమున్న ఓ ప్రపంచానికి, ఇంకా ఇంకా …”

కాసేపు ఊపిరి తీసుకొని, “ఇంత మందికి నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పు. వాళ్లందరికీ ఏం సమాధానం చెప్తావ్ ?”

“ఇదంతా దేవుడు చేసిన తప్పు. దానికి ఆయన్ని…” నే చెప్పడం పూర్తవకముందే

“దేవుడు, అన్నింటికీ నీకా దేవుడు దొరికాడు. తప్పు ఆయన మీదకి నెట్టేయడమొక్కటేనా నీకు తెలిసింది ? తప్పు ఆయనదా ?” నిలదీస్తోందా కారు.

“మరి కాదా?”

“కాదు”

“అయితే తప్పెవరిదంటావ్ ?”

“నీదీ”

“హ్మ్, నాదా ? భలే మాట్లాడుతున్నావ్ నువ్వు. మొత్తానికి తప్పు నాదంటున్నావా ?”

“అవును.నీదే.”

“ఆక్సిడెంట్ జరగడానికి నిమిషం ముందు.‘ఎ హెయ్.ఓవర్టేక్ చేయ్ నర్సింహ్మ, హౌలే బస్సోణ్ణి’ అన్న రాఘవ, ‘ఏంటంకుల్ ఈ స్పీడ్, మరీ చిన్నపిల్లల్లా,’ అన్న రాజేష్, ఆక్సిడెంట్ జరగడానికి గంట ముందు రెండు పెగ్గులేసిన నర్సింహ్మ, ఆ పెగ్గేయడానికి కారణమైన రామయ్య”

“వీళ్ళు కాదా ఈ ఆక్సిడెంట్కి కారణం?”

“అంటే తప్పు వాళ్ళదని ఒప్పుకున్నట్టేగా ?” ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు ఆ కారుకి.

“ఇప్పటికీ.. నాదదే మాట.. తప్పు నీదే..”

“మళ్ళీ అదే మాటంటావ్..”

“అవును నాదదే మాట. రాజేష్, రాఘవ, రామయ్య, నర్సింహ్మ ఈ ఆక్సిడెంట్‌కి కారణమైన ఈ నలుగురిలో; ఈ ఆక్సిడెంటేంటి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఆక్సిడెంట్ జరిగినా అందుక్కారణమయ్యే వాడిలో నువ్వున్నావ్.. ఉంటావ్..”

“ఏం ? లేవా ?”

నేనేం మాట్లాడలేదు.

“ఇప్పుడు చెప్పు.. తప్పు నీది కాదా.. ?”

నేనేం మాట్లాడలేదు. మౌనంగా తల దించుకున్నా.

క్షణాల్లో అక్కడున్న కారు, శవాలు, రక్తం అంతా అదృశ్యం. మొత్తం ఖాళీ అయిపోయింది.

‘ఎక్కడున్నా నేను ?!’

***

క్షణం ఆలోచించకుండా మైదానం వైపు పరుగులు పెట్టా. ఆశ్చర్యం! ఇప్పుడు కాళ్ళు ఏ మాత్రం కాలట్లేదు. ఫెన్సింగ్ పైనుంచి దూకా.

ఏదో గుచ్చుకున్నట్టుంది. చిత్రం! ఏ నొప్పీ లేదు. వేగంగా పరుగులు పెట్టా.

అక్కడే ఉంది. అవును.. అక్కడే ఉందా కారు.

ముందు చూసినప్పుడున్నంత అలజడి లేదు దాని ముఖంలో..

ప్రశాంతంగా అక్కడే పడి ఉంది. నిన్నటి విషాదాన్ని గుర్తు చేస్తున్న స్థూపంలా..

**** (*) ****

 

పరిచయం :
స్వస్థలం నల్లగొండ. ప్రస్తుత నివాసం హైద్రాబాద్. గత సంవత్సరమే ఇంజనీరింగ్ పూర్తైంది. ప్రస్తుతం ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నా. సినిమా దర్శకుడవ్వాలనేది నా ఆశయం. ఇప్పటి వరకు మూడు కథలు రాశాను. మరో రెండు పరిశీలనలో ఉన్నాయి. రేపు సినిమా తీసే అవకాశమే వస్తే.. తెలుగును ఉన్నతంగా చూపగలిగేందుకు (చెప్పగలిగేందుకు) నన్ను నేను తయారుచేసుకోవడానికి కథలు రాస్తున్నాను. ఈ రోజీ కథల్లో చెప్పిందే.. అంటే ఇక్కడ కథల ద్వారా కనిపిస్తున్న నేనే, రేపు సినిమా ద్వారా కనిపిస్తానన్నమాట! కథ గ్రూపు, వాకిలి ద్వారా నా ఈ కథను మీతో పంచుకునే అవకాశం రావడం నిజంగా సంతోషకరమైన విషయం. కథా గ్రూపుకు, షరీఫ్ అన్నకు, వాకిలి నిర్వాహకులకు కృతజ్ఞతలు.