వ్యాసాలు

ద్వంద్వపదాలు

ఆగస్ట్ 2016

ద్వంద్వపదాల వినియోగం తెలుగు భాషలో ఉన్న విశిష్టతల్లో ఒకటి. విద్యార్థి కల్పతరువు అను ఆంధ్రభాషా విషయసర్వస్వం పేరుతో, వేంకట్రామ అండ్ కో వారు 1979 లో ప్రచురించిన గ్రంథంలో, వీటికోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయమే ఉంది.  1980 లో వెలువడ్డ అయిదో ముద్రణలో, 686-687 పేజీల్లో ఈ ద్వంద్వపదాల పట్టికని వాటి అర్థాలతో సహా చూడవచ్చు. ఈ పట్టికలో ఏకంగా 102 ద్వంద్వపదాలున్నాయి. దీనితో పాటు జంట పదాల పట్టిక కూడా వాటి అర్థాలతో 672-682 పేజీలవరకూ చూడవచ్చు.

జంట పదాలంటే ఒకేరకంగా ధ్వనిస్తూ, వేరే అర్థం ఇచ్చే పదాలు. తెలియక మరోరకంగా రాస్తే అపార్థం ధ్వనించే పదాలు. ఉదాహరణకు అంకిలి, అంగిలి. అంకిలి అంటే విఘ్నము (672). అంగిలి అంటే అంతర్గళము (672). ద్వంద్వపదాలంటే, రెండు విడిపదాలుగా అనిపించి ఒక అర్థం వచ్చేలా వాడబడే పదాలు. అండదండలు అలాంటివాటిల్లో ఒకటి. దీనికి అర్థం, సహాయం అని విద్యార్థి కల్పతరువు (686) చెపుతోంది. అండ  అనే పదానికి ఆశ్రయం అనీ, ఆశ్రయానికి సహాయం అనీ అర్థాలున్నాయి. దండకి ప్రాపు అనీ, ప్రాపుకి ఆశ్రయం అనీ అర్థం ఉంది.  ఆశ్రయానికి సహాయం అనే అర్థం ఉండటంతో అండ అన్నా దండ అన్నా సహాయం అని అర్థం ఉన్నట్లే. దీని రీత్యా ఒకే అర్థం ఉన్న రెండు పదాలని కలిపి, మళ్లీ మనం అదే అర్థంతో వాడుతున్నామన్నమాట! ఇలా ఎందుకు?భావాన్ని మరింత శక్తిమంతంగా చెప్పటానికా? అంటే అవుననే అనుకోవాలి.

ద్వంద్వపదాల పట్టికలో ఉన్న కొన్ని పదాలు, విద్యార్థి కల్పతరువులో ఉన్న తెలుగు జాతీయాలు అనే అధ్యాయంలో కూడా చోటు చేసుకున్నాయి. ముందు పేరాలో ఉదహరించబడ్డ అండదండలు అన్న పదం అలాంటివాటిలో ఒకటి (643).  ఇవి కాక ద్వంద్వపదాల్లా అనిపించి, ద్వంద్వ పదాల పట్టికలో చేరని అలాంటి పదాలు మరికొన్ని కూడా తెలుగు జాతీయాల్లో కనపడుతున్నాయి. అంటు సంటు వాటిల్లో ఒకటి (643). దీని అర్థం స్నేహసంబంధములు, భేదభావములు. కాని, వ్యవహారంలో దీన్ని అంటూ సొంటూ అని రాస్తున్నాం.

జాతీయాల్లో ఉన్న ద్వంద్వపదాల్లాంటివి,  ద్వంద్వపదాల పట్టికలో ఎందుకు చేరలేదు? మన సంభాషణల్లోనూ, వివిధ తెలుగు సాహిత్యప్రక్రియల్లోనూ, ద్వంద్వపదాల్లా కనిపించే మరికొన్ని ప్రయోగాలు వినియోగంలో ఉన్నాయి. అవి ద్వంద్వపదాల పట్టికలో లేవు.  ఇవి  ద్వంద్వపదాలు కావా? కాకపోతే ఎందుకు కావు? ద్వంద్వపదాలే అయితే, ఇవి పై గ్రంథంలో ఎందుకు చోటుచేసుకోలేదు? అనేవి మన ముందున్న ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకి సమాధానాలని విజ్ఞులైన భాషాశాస్త్రవేత్తలకి వదిలేసి, అలా వాడకంలో ఉన్న ద్వంద్వ పదాలను సరైన రూపంలో రాస్తున్నామా? రాయకుండా ఉంటే వాటి అసలు స్వరూపం ఏమిటి? ఆ ద్వంద్వపదాల అర్థాలు ఏమిటి? ఏ అర్థంతో మనం వాడుతున్నామో, వాటి అసలు అర్థం ఆదేనా? మరి ఇంకేదయినానా? అనే విషయం మీద రవంత వెలుగు ప్రసరించటానికి ఈ వ్యాసం శబ్దార్థ చంద్రిక ఆధారంగా ఒక ప్రయత్నం చేస్తుంది. కుండలీకరణాల్లో ఇచ్చినవి నా దగ్గర ఉన్న ప్రతిలోని పేజీల సంఖ్యలు.

వీటిలో కొన్నిటికి నేరుగా నిఘంటువులో అర్థం ఉంది.  ఆ అర్థాలేమిటో చూద్దాం.

1. ఇరుగుపొరుగులు: దీని అర్థం ఇంటికి ఇరుపక్కననున్నవారు, ఇరుగుననుపొరుగునను ఉన్నవారు (157). ఇరుగు అంటే పక్క ఇల్లు (157). పొరుగు అంటే ప్రక్క, ఇరుగునకు ప్రక్క(907). అందువల్ల సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి కొంచెం విస్తృతార్థంతో వైవిధ్యం ధ్వనించేలా మనం వాడుతున్నాం.

2. ఉచ్చనీచములు: ఉచ్చనీచములు=ఎక్కువతక్కువలు, మంచిచెడ్డలు, మెరకపల్లములు. ఉచ్చము (ఉచ్ఛము అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు)=ఉన్నతమయినది. నీచము=క్రిందది. రెండు వ్యతిరేకార్థాలు ఉన్న పదాలని కలిపి శబ్దార్థ చంద్రిక అదే వ్యతిరేకార్థం ఇవ్వగా, అదే అర్థంతో మనం వాడుతున్నాం.

3. చిల్లు పొల్లు: దీనిని వ్యవహారంలో చిల్లూపొల్లూ అని రాస్తున్నాం. రెండు పదాలుగా కనపడుతున్న ఈ పదానికి/పదాలకి, శబ్దార్థ చంద్రిక సంక్షోభం, చిరాకు, తుత్తునియలు అని అర్థం చెప్తోంది. చిల్లు అనే పదం విడిగా కూడా ఉంది. దాని అర్థం, చిమ్ముటలోనగువానియందు ధ్వన్యనుకరణం. చిల్లును తూటు, కంత అనే అర్థంలో మనం ఉపయోగిస్తున్నాం. కాని, దాని అసలు రూపం చిల్లి. పొల్లు అంటే వ్యర్థం, నిస్సారం. కనక ఈ రెండు పదాలు విడిగా ఇస్తున్న అర్థానికీ, కలిసి ఉన్నట్లు కనపడే పదానికి/పదాలకీ ఎలాంటి పొంతనా లేదు.

4. దరి దాపు: దీనికి అర్థం ఆశ్రయం, ఆధారము, హద్దు, సమీపం (682). దరిదాపుల్లో లేడు అంటే సమీపంలో లేడని. చిత్రంగా దరి, దాపు అనే రెండు విడిపదాలు కూడా ఉన్నాయి. దరి=గట్టు, మేర, సమీపము(682). దాపు=సమీపము, ఆధారము (687). అందువల్ల విడి పదాలకు ఉన్న అర్థంతోనే దరిదాపు అనే ద్వంద్వపదాన్నీ ఉపయోగిస్తున్నాం.

5. మీదు మిక్కిలి: దీని అర్థం కడు మిక్కిలి, పైగా (1031). అవే అర్థాలతో దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. మీదు=ఉపరిభాగం(1031)=పైన. మిక్కిలి=ఎక్కువ(1027). ఈ రెండిటికీ ఉన్న విడి అర్థాలను కలిపే, ఈ ద్వంద్వపదం వినియోగంలో ఉంది.

6. వంకర టింకర: వంకరటింకర=నానావిధవక్రము (1112) అని శబ్దార్థ చంద్రిక చెపుతోంది. అదే అర్థంతో ఈ పదం/పదాలు వ్యవహారంలో ఉన్నాయి. వంకరటొంకర, వంకరకొంకర అనేవి దీనికి రూపాంతరాలు. వంకర అనే పదానికి వక్రత్వం, వక్రం అని అర్థం. టింకర అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు.

7. యోగ క్షేమం: దీని అర్థం క్షేమలాభములు (1074). అదే అర్థంతో దీన్ని ఉపయోగిస్తున్నాం. యోగం అంటే వస్తులాభం అని అర్థం ఉంది(1074). క్షేమం అంటే కుశలం (404). ఈ రెండిటి అర్థాలతో పొంతన ఉండేలాగానే, రెండిటినీ కలిపి వాడుతున్నాం.

ద్వంద్వపదాలుగా కనపడే ఈ క్రిందివాటికి వేటికీ, నేరుగా నిఘంటువులో ఎలాంటి అర్థం లేదు. అందువల్ల, వీటిలో ఉన్న పదాలన్నీ నిఘంటువులో ఉన్నాయా? ఉంటే, వీటిలోని ఒక్కొక్క పదమూ ఏం అర్థం ఇస్తోంది. రెండిటినీ కలిపితే వచ్చే అర్థం మనం వ్యవహారంలో సూచిస్తున్న అర్థానికి సరిపోతున్నదా లేదా అనేది చూద్దాం.

1. అంచెలంచెలు: అంచె=వరుస(5). అంచెలంచెలుగా అంటే వరుసగా అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం.

2. అజా పజా: అజ=ప్రకృతి, ఆడు మేక (22). అజము=చావుపుట్టుకలు లేనిది (22). పజ=జనము, ప్రజా (814). ఎక్కడున్నదో/ఎక్కడున్నాడో తెలీదు అనే అర్థంలో ఈ రెండిటినీ కలిపి వాడటం. అజ, పజ అనే పదాల అర్థాలకూ; అజాపజా అని వాటిని కలిపి వాడే సందర్భానికీ మధ్య పొంతన లేదు.

3. అడుగు బొడుగు: అడుగు=క్రిందు (26). బొడుగు అనే పదం లేదు. అడుగూబొడుగూ అని, క్రింద లేదా చివరకి మిగిలింది అనే అర్థంలో వాడతాం. అడుగు అనే పదానికి ఉన్న అర్థం, ఈ వ్యవహారానికి సరిపోతోంది. మరి, బొడుగు అనేది అడుగుకు ఊతంగా కలిపినట్లా?

4. అడ్డూ ఐపూ: అడ్డు=అడ్డగించు, అడ్డగింత, చాటు (28). ఐపు=తప్పు, దోషము, జాడ, అయిపు(245). అతడికి అడ్డూ ఐపూ లేదంటే; ఏ ఆటంకమూ లేదనీ, ఏదీ తప్పూ కాదని. ఇదే అర్థంతో ఈ రెండు పదాలని కలిపి వాడటం జరుగుతోంది.

5. అతీ గతీ: అతి=ఎక్కువ (29). అతీ అనే పదం లేదు. గతి=ఆధారం, ఫలితం (422). అతీ గతీ లేదు అని ఆధారం లేదు, ఫలితం లేదు అనే అర్థంలో వాడుతున్నాం. గతి అనే పదానికున్న అర్థం, ఈ వ్యవహారానికి సరిపోతోంది. మరి అతి, లేదా అతీ దానితో జత ఎందుకు కలిసినట్లు?

6. అమీతుమీ: ఈ పదాలు నిఘంటువులో లేవు. అమ్హీ, తుమ్హీ అనే ఉర్దూ/హిందీ పదాలు కావు కదా ఇవి?

7. అర్థం పర్థం: అర్థం అంటే అర్థం, అర్థమే (79). అతడు చేసే పనులకి అర్థం పర్థం ఉండదు అంటే అర్థం ఉండదని. అంతవరకూ బాగుంది. పర్థం ఎందుకు కలిసింది-అర్థం పర్థం లేకుండా?!

8. అలసి సొలసి: అలసి సొలసి నిఘంటువులో లేదు. అలయు=అలసిపోవు (84), సొలయు=అలయు (1254). వీటి రూపాంతరాలా అలసిసొలసి?

9. అలుపు సొలుపు: అలుపు అనే పదం లేదు. అలపు అనే పదం ఉంది (83). దీనికి అలసట, బడలిక, శ్రమము అని అర్థం. సొలుపు అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. సొలపు=వైముఖ్యం (1254). సొలయు= అలయు, వెనుదీయు(1254). కావాల్సిన అర్థం, అలపు ఇస్తున్నపుడు; సొలుపు అవసరం ఏమిటో బోధపడదు.

10. ఆకలి దప్పులు: ఆకలి అంటే అందరికీ తెలిసినదే. దీని అర్థం క్షుత్తు (100) అని చెప్పటం; పిల్లి అంటే మార్జాలం అని చెప్పినట్లవుతుంది. దప్పి=దప్పిక అనగా దాహం(680). అందువల్ల వీటి రెండు అర్థాలనూ కలిపి, వాటి అర్థంతోనే ఆకలిదప్పులని మనం ఉపయోగిస్తున్నాం.

11. ఆగమేఘాల మీద: వేగంగా అనే అర్థంతో దీన్ని ఉపయోగిస్తున్నాం. ఆగము=తప్పు, పాపం (111). ఇది మేఘాలతో ఇమడటం లేదు. ఆగమేఘాలు ఏ పదాల కూడిక, లేదా పొందిక?

12. ఆలనా పాలనా: ఆలన=రక్షణము(133). పాలన=రక్షణము(857). అందువల్ల సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి అదే అర్థంలో మనం వాడుతున్నాం.

13. ఇల్లూ వాకిలీ: ఇల్లు=గృహం (159). వాకిలి=గృహద్వారం, తలుపు (1131). ఎవరికయినా ఇల్లు లేదనవచ్చు. ఆ ఇంటికి వాకిలి లేదనవచ్చు. ఇల్లూ వాకిలీ లేదంటే, కనీసం వాకిలి ఉన్న ఇల్లు లేదనా?

14. ఉరుకులు పరుగులు: ఉరుకు=దాటు, దుముకు, పరుగెత్తు (206), పరుగు=శీఘ్రగమనం (835). ఈ రెండు పదాలకి విడిగా ఉన్న అర్థంతోనే, రెండిటినీ మనం కలిపి వాడుతున్నాం.

15. ఉలుకు పలుకు: ఉలుకు=భయం(208). పలుకు=మాట(839). ఈ రెండు పదాల్లో పలుకు అనే పదానికి ఉన్న అర్థంతో, ఉలుకు అనే పదానికి ఉన్న అర్థంతో సంబంధం లేకుండా; రెండిటినీ కలిపి పలుకుకి ఉన్న అర్థంతోనే మనం వాడుతున్నాం.

16. ఎక్కీ తక్కీ: ఈ రెండు పదాలూ ఆ రూపంతో లేవు. సరిపడినంత అనే అర్థంతో వీటిని వాడుతున్నాం. నేననుకోవటం ఇది ఎక్కువకీ తక్కువకీ ఉచ్చారణ ఫలితంగా ఏర్పడిన నూతనరూపం అని.

17. ఎదురు బొదురు: ఎదురు=అభిముఖం (228). బొదురు అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. ఈ రెండు పదాల్లో ఎదురు అనే పదానికి ఉన్న అర్థంతో, అర్థం లేని బొదురు అనే పదం కలిపి మనం వాడుతున్నాం.

18. ఏతా వాతా: ఏతా=అసత్యం(239). వాతా అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. మొత్తం మీద అనే అర్థంలో ఈ పదాన్ని/పదాలని ఉపయోగిస్తున్నాం. ఈ పొందికకి, కూడికకి మూలం ఏమిటో?

19. ఐపూ అంతూ: ఐపు=తప్పు, దోషము, జాడ, అయిపు(245). అంతు=చివర (9). ఐపూ, అంతూ లేడు అంటే జాడ లేదు అని అర్థంలో వాడుతున్నాం. ఐపు అనే పదానికి ఉన్న అర్థం, ఈ వినియోగాన్ని సమర్థిస్తోంది. అంతు అనే పదానికి ఉన్న అర్థం ఇందులో పొసగటం లేదు.

20. ఒడి దుడుకులు: ఒడి=ఒడుపు (249). దుడుకు=చెడ్డపని (700). ఒడిదుడుకులు లేకుండా అని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనే అర్థంతో వాడుతున్నాం. మరి ఈ రెండు పదాల మిశ్రమం మనం వాటిని వాడుతున్న తీరుకు సరిపోతోందా? లేదనే చెప్పాలి.

21. ఒడ్డూ పొడుగూ: ఒడ్డు=స్థూలం, పెద్ద, అధికం, విశాలం (250). పొడుగు=ఎత్తు(904). ఈ రెండు పదాలకీ విడిగా ఉన్న అర్థాలని కలిపి, ఎత్తయిన, విశాలమయిన అనే అర్థంతో రెండిటినీ కలిపి మనం వాడుతున్నాం.

22. కక్షా కార్పణ్యాలు: కక్ష=కచ్చ లేదా కసి (273). కార్పణ్యం=కృపణత్వం (325). కృపణుడు అంటే కుత్సితుడు (360) అంటే కుత్సితబుద్ధి గలవాడు. కక్షాకార్పణ్యాలు అంటే ఈ రెండిటి అర్థంతో ఒక సమ్మిశ్ర భావన వ్యక్తమవుతోంది.

23. కరువు కాటకాలు: కరువు, కరవు అనే పదాలు శబ్దార్థ చంద్రికలో లేవు. కఱవు=క్షామం, కాటకం=కఱవు. ఈ రెండు పదాలు విడివిడిగా ఇచ్చే అర్థంతోనే, కలిపి; కించిత్ అక్షరభేదంతో, వ్యవహారంలో మనం వాడుతున్నాం.

24. కల్లా కపటం: కల్ల=అసత్యం, తప్పు, మోసం, హాని, కఠినపు మాట(309). కపటము=కైతవము, కవుడు, మాయ (289). కైతవం=కపటం (366). కవుడు అన్నా కపటమే (310). కల్లాకపటం లేని వాడు అంటే మొదటి పదానికి అర్థమయిన మోసం/అబద్ధం, రెండో పదానికి ఉన్న మాయ వెరసి మాయామోసాలు/అబద్ధాలు లేనివాడనా?

25. కొండా కోనా: కొండ=పర్వతం (369). కోన=కొండలయందలి మరుగుచోటు (382). ఈ రెండు పదాల అర్థాలని కలిపి కొండాకోనల్లో అంటే పర్వతాల్లో, వాటి మరుగు ప్రదేశాల్లో అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం.

26. కోప తాపాలు: కోపము=క్రోధము, కినుక (382). తాపం=సంతాపం, బాధ(621). కోపతాపాలు లేవు అంటే ఈ రెండు పదాల అర్థాలూ కలిపి; క్రోధమూ, బాధా లేవు అని వ్యవహారం.

27. గడ్డీ గాదం: గడ్డి=కసవు(421), తృణము=గడ్డి(645), గాదము=పైరులోని కసవు, ఆకు(432). ఇంచుమించు సమానార్థం ఉన్న ఈ రెండు పదాలను కలిపి కూడా, మనం అదే అర్థంలో వ్యవహరిస్తున్నాం.

28. గొడ్డూ గోదా: గొడ్డు=సంతతి లేని ఆవు, ఆవు, ఎద్దు(459), గోద=ఎద్దు (468). ఎవరికయినా గొడ్లు ఉంటే ఎద్దుతో కలిపి అన్నిరకాల పశుసంపద ఉన్నట్లే. అందువలన ఆ విషయం చెప్పదలుచుకున్నపుడు గొడ్డుకి గోద కలపవలసిన అవసరం లేదు. కాని, ఈ రెండు పదాలను ఒకే భావం వ్యక్తీకరించటానికి కలిపి చెప్పటం జరుగుతోంది.

29. చడీ చప్పుడు: ఇది కానీ, చడి అనే పదం కానీ నిఘంటువులొ లేవు. చప్పుడు=ధ్వని (526). సడి= ధ్వని (1218). దీన్ని దృష్టిలో పెట్టుకుంటే చడీ చప్పుడులో చడి అవసరమే లేదు. ఉంటే సడి ఉండాలి. మరి దాని బదులు చడీ అనే పదం చడీ చప్పుడు లేకుండా, చడీచప్పుడులో ఎందుకు చేరినట్లు?!

30. చదువూ సంధ్యా: చదువు=పఠనం (524). సంధ్య=ప్రొద్దుపొడుచుటకు ముందు అయిదు గడియలవరకు, ప్రొద్దు గ్రుంకిన వెనుక మూడు గడియల వరకును గల కాలం. ఈ అర్థం చదువూ సంధ్యా లేదు అనే దానిలో చదువుతో పొసగటం లేదు. ఇది కాకుండా, సంధ్యకు, సంధ్యాకాలమందు చేయు ఉపాసన అనే అర్థం కూడా ఉంది (1212). చదువూ, సంధ్యా లేదు అంటే పఠనమూ, ఉపాసన ఈ రెండూ లేవనా?

31. చిత్తూ బొత్తూ: చిత్తు=దిద్ది చక్కపరుపని మొదట వ్రాసిన వ్రాత, జ్ఞానం, చైతన్యం, ప్రోగుచేసినవాడు, చయనము చేసినవాడు, సమిధ. బొత్తు అనే పదం లేదు. బొత్త=తామ్రాదిపాత్రముల బొంద(973). బొత్తి=మడత, పొర (973). నాణేనికి రెండువైపులను చిత్తూ, బొత్తూ అని అంటాం. కాని, చిత్తుకు ఉన్న అర్థాలు కాని, బొత్తు అనే పదం లేకపోవటం కానీ, ఈ వ్యవహారాన్ని సమర్థించలేకపోతున్నాయి.

32. చిన్నా చితకా: వ్యవహారంలో దీన్ని/వీటిని ఒక పరిమాణాన్ని సూచించటానికి ఉపయోగిస్తున్నాం. చిన్న =అల్పం, కనిష్టం (497). చితక అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. చితిక=ప్రోగు(494). ఈ అర్థాన్ని దృష్టిలో పెట్టుకుంటే, చిన్నాచితకాలో, చితక-వ్యవహారరీత్యా, చితికకి రూపాంతరం అనిపించదు.

33. చిల్లర మల్లర: చిల్లర అంటే కొంచెంపాటి నాణెం, సామాన్యం, అల్పం అని అర్థం (502). మల్లర అనే పదం, శబ్దార్థ చంద్రికలో లేదు. మల్లరము=మదించినది, గర్వం (1018). అందువల్ల ఈ రెండు పదాల్లో ఒక పదం విడిగా ఇస్తున్న సామాన్యం, అల్పం అనే అర్థంతోనే, అర్థం లేని మల్లర అనే ఇంకో పదం కలిపి మనం ఉపయోగిస్తున్నాం.

34. చీకూ చింతా: చీకు=నిస్సారం (503). చింత=వగపు (489). చీకు లేకపోతే నిస్సారం కానట్లు, సారం ఉన్నట్లు. చింత లేకపోతే సంతోషం. మరి ఇవి రెండూ లేకుండా అంటే? వ్యతిరేకార్థం ఉన్న రెండుపదాలను జత చేసి అపార్థం కలిగిస్తున్నామన్నమాట.

35. డబ్బూ దస్కం: డబ్బు=ధనం (588). దస్కం అనే పదం నిఘంటువులో లేదు. డబ్బుతోనే చెప్పదలుచుకున్నది చేరుతున్నపుడు, డబ్బుతో దస్కం ఎందుకు చేరింది?

36. తప్పొప్పులు: తప్పు, ఒప్పు అనే రెండు పదాలూ విడిగా శబ్దార్థ చంద్రికలో ఉన్నవే. రెండు వ్యతిరేకార్థాలు ఉన్న పదాలని, కలిపి కూడా సరయిన అర్థం వచ్చేలానే వాడుతున్నాం.

37. తిండీ తిప్పలు: తిండి=ఆహారం(626). తిప్పలు=కష్టములు, బాధలు (628). తిండి లేకపోతే కష్టం. తిప్పలు లేకపోతే సుఖం. మరి తిండీతిప్పలు లేకుండా అంటే? విభిన్న అర్థాలు ఉన్న రెండు పదాలను జత చేసి అపార్థం కలిగిస్తున్నామన్నమాట.

38. తీరూ తెన్నూ: తీరు=విధం (634). తెన్ను=దారి, మార్గం, విధి (647). రెండు విభిన్నార్థాలు ఉన్న ఈ రెండు పదాలనీ కలిపి, ఒక పద్ధతి లేకుండా అనే అర్థంతో తీరూతెన్నూ లేకుండా అని వాడుతున్నాం.

39. తుక్కూ దూగరా: తుక్కు=వ్యర్థము, త్రుప్పు, పనికిమాలిన గడ్డి మొదలగునది (637). దూగఱ= ధాన్యాదులలోనుండు దుమ్ము (706). ఈ రెండు పదాలకూ విడిగా ఉన్న అర్థాలను దృష్టిలో పెట్టుకుని పారేయాల్సిన వాటిని తుక్కూ దూగరా అని చెపుతున్నాం.

40. దరి దాపులు: దరి=గట్టు, మేర, సమీపం (682). దాపు=సమీపం, ఆధారం(687). దరిదాపుల్లో లేడు అంటే సమీపంలో లేడు అనే అర్థంతో వాడుతున్నాం. రెండిటికీ ఒకటే అర్థం ఉన్నపుడు, కావాల్సింది అదే అర్థం అయినపుడు రెండిటినీ కలిపి వాడటం దేనికి?

41. దారీ తెన్నూ: దారి=రీతి, మార్గం, దిక్కు (688). తెన్ను=దారి, మార్గం, విధి (647). రెండు సమానార్థాలు ఉన్న ఈ రెండు పదాలనీ కలిపి, అదే అర్థం వచ్చేలా దారీతెన్నూ లేకుండా అని వాడుతున్నాం.

42. దిక్కూ దెసా: దిక్కు=దిశ, శరణము, మార్గము, వైపు, నెలవు (691). దెస=దిక్కు, అవస్థ, ప్రాపు, కాపు, శరణము, చోటు (708). దిక్కూ, దెసా తెలీకుండా అన్నా దిక్కూ, దెసా లేకుండా అన్నా మార్గమూ, చోటూ తెలీకుండా లేదా లేకుండా అనా?

43. దుమ్మూ ధూళీ: దుమ్ముదూలి అనే పదం శబ్దార్థచంద్రికలో ఉంది. దాని అర్థం చిన్నాభిన్నమయినది(701). అంతే కాదు దూలి అనే పదం విడిగా లేదు. మనం ఏ అర్థంలో దుమ్మూ ధూళీ అనే పదాలను ఉపయోగిస్తామో, అది ఈ అర్థానికి సరిపడదు. వీటి అసలు మూలాలు; దుమ్ము=దుమారం, ధూళి(701). ధూళి=దుమ్ము, పరాగం (730). ఈ రెండు పదాల అర్థాలూ ఒకటే. మనకు కావాల్సిన అర్థాన్ని ఏదో ఒక పదం ఇస్తున్నపుడు, రెండిటినీ కలిపి వాడటంలో ఔచిత్యం, అవసరం బోధపడవు.

44. ధూళి ధూసరితం: ధూళి=దుమ్ము, పరాగం (730). ధూసరము=బూడిదవర్ణము, బూడిదవర్ణము గలది (731). అందువల్ల ధూసరితము అంటే బూడిదవర్ణము కమ్మినది అని అనుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే ఒకటి దుమ్ము. రెండోది దాని రంగు. ధూళిధూసరితము అంటే బూడిదరంగు కల దుమ్ము అని. కొంతమంది అనుకుంటున్నట్లు ధూసరము అంటే ఇంకోరకం దుమ్ము కాదు.

45. నగా నట్రా: నగ=ఆభరణం (735). నట్ర, నట్రా అనే పదాలు లేవు. నగానట్రా అన్నపుడు నగలు మొదలయినవి అన్న అర్థంలో వీటిని వాడటం జరుగుతోంది.

46. నదీ నదాలు: నది=ఆమడ దూరానికి మించి పారే ఏరు, లేదా ఏరు(739). నదం=పడమరగా పారెడి ఏరు, సముద్రం (739). రెండిటినీ కలిపి రెండు రకాల జలప్రవాహాలు అన్న అర్థంలో ఉపయోగిస్తున్నాం.

47. నదురూ బెదురూ: నదురు, నదరు అనే పదాలు లేవు. బెదరు=భయం, జంకు, సంకోచం, అధైర్యం (968). బెదరు అనే పదానికి ఉన్న అర్థంతో, అర్థం లేని నదురు అనే పదం కలిపి మనం వాడుతున్నాం.

48. నిక్కు నీలుగు: నిక్కు=గర్వం (758). నీలుగు అన్నా గర్వమే (787). రెండు సమానార్థాలు ఉన్న ఈ రెండు పదాలనీ కలిపి, అదే అర్థం వచ్చేలా నిక్కు నీలుగు అని వాడుతున్నాం.

49. నియమ నిష్ఠలు: నియమము=కట్టు, వ్రతనిష్ఠ (766). నిష్ఠ=ఎడతెగని శ్రధ్ధ(781). ఈ రెండిటినీ కలిపి కట్టుబాటుతో, శ్రధ్ధతో పనిచేయటం అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం.

50. నీతి నియమాలు: నీతి=న్యాయం, సత్ప్రవర్తనం(784). నియమము=కట్టు, వ్రతనిష్ఠ (766). నీతి నియమాలతో పనిచేస్తున్నాడంటే ఈ రెండిటికీ కట్టుబడి ఉంటున్నాడని.

51. నోరూవాయీ: గట్టిగా మాట్లాడలేని వాళ్లని ఉద్దేశించి అతడు నోరూ వాయీ లేని వాడు అని అంటుంటాం. నోరు=ముఖద్వారం (803). వాయి=నోరు, ముఖము(1136). ఇక్కడ ఒకే అర్థం ఉన్న రెండు పదాలని కలిపి, అదే అర్థం వచ్చేలా వాడుతున్నాం.

52. పనీ పాటా: పని=కార్యం(824). పాట=గీతం (846). అతడికి పనీపాటా లేదు అనటంలో పని లేదు అని ఒక అర్థం ధ్వనిస్తోంది. పాట లేదని ఎందుకు అనటం? పాటు=కష్టం (847). పనీ, పాటూ వ్యవహారంలో పనీ, పాటగా మారిందా?

53. పరువు ప్రతిష్ఠ: పరువు=గౌరవం (836). ప్రతిష్ఠ=గౌరవం, కీర్తి (920). ఈ రెండిటికీ గౌరవం అని అర్థం ఉంది. అందువల్ల మొదటి పదానికున్న గౌరవం, రెండో పదానికున్న కీర్తి అనే అర్థాలతో కీర్తి గౌరవాలు అనే అర్థం వచ్చేలా పరువు ప్రతిష్ఠ అని వాడుతున్నామా?

54. పిల్లా జెల్లా: పిల్ల=ఆడపడుచు(867). జెల్ల=పిల్ల. ఈ రెండు అర్థాలతోనే, రెండిటినీ కలిపి మనం ఉపయోగిస్తున్నాం.

55. పుల్లా పుడకా: పుల్ల=పుడుక (842). పుడుక=సన్నపుల్ల, కట్టెపుల్ల (875). రెండు సమానార్థాలు ఉన్న ఈ రెండు పదాలనీ కలిపి, అదే అర్థం వచ్చేలా దారీతెన్నూ లేకుండా అని వాడుతున్నాం.

56. బాగోగులు: బాగు=క్షేమం=శుభము(954), ఓగు=చెరుపు, కీడు, అశుభం (257). రెండిటినీ కలిపితే శుభాశుభములు. ఆ అర్థంతోనే మనం వ్యవహరిస్తున్నాం.

57. బొచ్చే బోలే: బొచ్చె=కుండలోనగువాని పెంకు(972). బోలె=ఓటికుండ, కుండబొచ్చె అని అర్థం(977). వీటిని ఏదో ఒక లోహంతో తయారు చేసినవి అనుకొని, వ్యవహారంలో ఈ పదాలని వంటపాత్రలు అనే అర్థం వచ్చే విధంగా వాడటం జరుగుతోంది. కాని, నిజానికి వీటిని; మట్టిపాత్రలకే వాడాలి.

58. మంచీ సెబ్బర: మంచి=మంచి (994), సెబ్బర=చెడుగు, చెడ్డది(1250). రెండూ కలిపి మంచీ, చెడూ. ఈ రెండిటికీ కలిపి మూడో అర్థం ఏదీ లేదు. ఉన్న రెండు పదాల అర్థంతోనే, మంచీ సెబ్బర ఉపయోగంలో ఉంది.

59. మందూ మాకూ: మందు=ఔషదము (997), మాకు=మ్రాను, వృక్షం (1018). సామాన్యంగా ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తిని వశపరచుకున్నపుడు, మందో మాకో పెట్టాడా అని అంటుంటారు. అయితే, దీని వ్యవహారాన్ని, శబ్దార్థ చంద్రికలో ఉన్న మందులమారి=వశక్రియావేది (998) అన్వయించుకుంటే, మందూ మాకూ అనే ద్వంద్వపదాల అర్థం అవగతమయే అవకాశం ఉంది.

60. మన్నూమశానం: అతడి దగ్గర ఏముంది? మన్నా, మశానమా అని ఏమీ లేదనటాన్ని సూచిస్తున్నాం. మన్ను=మట్టి, నేల (1008). మశానం అనే పదం కానీ, మసానం అనే పదం కానీ లేవు. మసనం=శ్మశానం. మసనం వ్యవహారంలో మసానం అయి, మట్టితో కలిసి వాడకంలోకి వచ్చింది అనిపిస్తోంది.

61. మాటా మంతీ: మాట=పదం(1019). మంతి=ప్రసంగం, ప్రస్తావన(996). ఈ రెండు పదాలకి విడిగా ఉన్న అర్థంతోనే, కొంచెం విస్తృతార్థం వచ్చేలా మనం కలిపి వాడుతున్నాం.

62. మానూ మాకూ: మ్రాను అనే పదానికి మాను అనేది రూపాంతరం. మాను=చెట్టు, వృక్షం(1066). మాకు అన్నా అవే అర్థాలు(1018). సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి అదే అర్థంలో మనం వాడుతున్నాం.

63. మూటాముల్లే: మూట=బట్టలు లోనగువాని ముడియ (1045). ముల్లె=మూత, ధనము ముడి(1042). ఈ రెండిటినీ కలిపి, మూటా ముల్లే అంటే బట్టలూ డబ్బూ అనే అర్థంతో వాడుతున్నాం.

64. మేళ తాళాలు: మేళము అంటే మనం అనుకునే ధ్వనిసంబంధమయిన అర్థం లేదు. దాని అర్థం వాద్యగాండ్ర గుంపు. (1056). మేళముచేయు అంటేనే వాద్యములను వాయించు అని మనం అనుకునే అర్థం (1056). తాళము అంటే పాడునపుడు చేతులతో చఱచెడి చఱపు లేదా పాడునపుడు జరిగెడు కాలపరిమాణం. ఈ అర్థాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ పదాలను మనం వాటి అర్థాలతో ప్రమేయం లేకుండా ఉపయోగిస్తున్నట్లు.

65. రాయీ రప్పా: రాయి=శిల, పాషాణం(1085). రప్ప=రాయివంటి గట్టి వస్తువు(1079). అందువల్ల సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి అదే అర్థంలో మనం వాడుతున్నాం.

66. వన్నె చిన్నెలు: వన్నె=అందం, రంగు (1121). చిన్నె=చిన్నియ అనగా గురుతు లేదా విలాసం(497) =స్త్రీల శృంగార చేష్టా విశేషం (1158). విభిన్న అర్థాలున్న ఈ రెండు పదాలని కలిపి అందం, విలాసం అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం.

67. వర్తక వ్యాపారాలు: వర్తకం=వాణిజ్యం, క్రయవిక్రయ వ్యాపారం(1125). వ్యాపారం=వర్తకం, పని, ఉద్యోగం, వృత్తి, యత్నం అనే అర్థాలు (1184)ఉన్నాయి. రెండిటినీ కలిపి, ఆ రెండు పదాల అర్థాలు విడిగా ఇస్తున్న అర్థంతోనే వాడుతున్నాం.

68. వాగూ వంకా: వాగు=సెలయేరు (1131). వంక=వాగూ, కాలువా (1112) అందువల్ల సమానార్థం ఉన్న రెండు పదాలని కలిపి కొంచెం విస్తృతార్థంతో వైవిధ్యం ధ్వనించేలా మనం వాడుతున్నాం.

69. వావీ వరుసా: వావి=బంధుత్వం, బంధు వరుస (1140). వరుస=బంధుత్వక్రమం (1124). ఈ రెండు పదాలని కలిపి వాడుతూ; అతడికి వావీ, వరుసా లేదంటున్నాం అంటే సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో కానీ, ప్రవర్తించటంలో కానీ, బంధుత్వాన్ని పాటించటం లేదని అర్థం.

70. సిగ్గూ ఎగ్గూ: సిగ్గు=లజ్జ (1240). ఎగ్గు=కీడు, తప్పు, అవమానం (224). సిగ్గూ ఎగ్గూ లేకుండా అంటే; లజ్జ లేకుండా అనటం వరకూ సముచితమే. ఎగ్గు లేకుండా అంటే కీడు తేకుండా, తప్పు లేకుండా, అవమానం లేకుండా అన్నట్లు. మరి ఇవి రెండూ లేకుండా అనటం అనుకున్న అర్థం ఇస్తున్నాయా? అనుమానాస్పదమే!

71. సోయీ సొంపూ: సోయి అనే పదం శబ్దార్థ చంద్రికలో లేదు. సొంపు=సౌందర్యం(1253). ఈ రెండు పదాల్లో సొంపు అనే పదానికి ఉన్న అర్థంతో, అర్థం లేని సోయి అనే పదంతో దాన్ని కలిపి మనం వాడుతున్నాం.

72. హద్దూ పద్దూ: హద్దు=ఎల్ల, మితి(1268). పద్దు=పంతం, ప్రతిజ్ఞ, నేర్పు(823). రెండిటినీ కలిపి మితిమీరి ప్రవర్తిస్తున్న అన్న అర్థంలో ఉపయోగిస్తున్నాం. కాని, రెండు పదాలకి ఉన్న అర్థం కలిపితే, మనం అనుకునే అర్థం రావటం లేదు.

73. హద్దూ ఐపు: హద్దు=ఎల్ల, మితి (1268). ఐపు=తప్పు, దోషము, జాడ, అయిపు(245). ఈ రెండు పదాలకీ ఉన్న అర్థాలని కలిపి, హద్దూ ఐపూ లేదు అని; అంటే మితి మీరి ప్రవర్తించటం అనే అర్థంలో వాడుతున్నాం. కాని, ఐపు అనే పదానికి ఉన్న అర్థం ఈ వినియోగాన్ని సమర్థించటం లేదు.

చివరగా ఒక మనవి. ఇవి కాక, ఇలా వాడబడే పదాలు మరికొన్ని ఉండవచ్చు. అవి నా దృష్టిలో లేనందునే వాటి విషయంలో నేను ఏ ప్రయత్నమూ చేయలేకపోయాను. ఔత్సాహికులు ఎవరైనా ఇలాంటి ప్రయత్నాన్ని తమ ఎరుకలో ఉన్న పదాలతో కొనసాగించవచ్చు. మరో మాట. ఈ పరిశీలన నా అవగాహన అనుమతించిన మేరకు చేశాను. ఇందులో ఏదైనా పొరపాటు దొర్లితే విజ్ఞులు దానిని సవరించవచ్చు. అంతేకాకుండా తమ దగ్గర ఉన్న అదనపు సమాచారంతో, కొన్ని పదాల విషయంలో నేను వ్యక్తం చేసిన అనుమానాలని సైతం నివృత్తి చేయవచ్చు. కావాల్సిందల్లా, మనం వాడుతున్న పదాలకు సరయిన రూపం, అసలయిన అర్థం; అవసరం ఉన్న అందరికీ చేరటమే. అది ఎంత మేరకు జరిగితే ఈ వ్యాసం అంత మేరకు దాని ప్రయోజనాన్ని సాధించినట్లు.

**** (*) ****