ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

ముందు ఏమీ అనుకోకుండానే అలవోకగా ఓ చిన్న పని మొదలెడతాం, లేదా ఎవర్నో కలిసి కాస్సేపు మాట్లాడతాం. కానీ, ఒక్కోసారి ఆ చిలిపి పనే, ఆ చిరుగాలే ఒక తరంగమై మనలో తిష్టవేసుకుని గింగిరాలు తిరుగుతుంది, మనం ఊహించని దారుల్లోకి మనల్ని పట్టుకుపోతుంది. ఎప్పుడో విడిపోయిన మన ప్రతిబింబాన్ని తిరిగి తీసుకొచ్చి మనకి జోడిస్తుంది – అది కవిత్వం కావొచ్చు, పొటోగ్రఫీ కావొచ్చు, లేదా ఏ రాక్ క్లైంబింగో, పారా గ్లైడింగో కావొచ్చు – పనేదైనా అదే అసలైన ప్రేమ కథ.

అలాంటి ప్రేమకథే మోనిక్ రోసెన్ దీనూ. వృత్తిరీత్యా థెరపిస్టు అయినా, ఫొటోగ్రఫీ, కవిత్వం అంటే ఉన్న ఆసక్తీ, పట్టుదలా ఆవిడని ఓ అందమైన పనికి పురమాయించాయి, మునుపెరుగని క్రియేటివ్ ఫొటోగ్రఫీలోకి నెడుతూ, ఆమెని ఆమెకి దగ్గర చేసాయి. మోనిక్ వాకిలికి ఇచ్చిన ఇంటర్యూలోనూ, ఆవిడ తీసిన ఫొటోలలోనూ, ఆవిడ వాటికి జత చేసిన కవితల్లోనూ ఆ అరుదైన చిరుగాలి తాకిడి మనకి వినిపిస్తుంది. ఈ డచ్చమ్మాయి గురించి, ఆవిడ మాటల్లోనే. (Translated from the English version of the interview)

1. క్లుప్తంగా మీ గురించి చెప్తారా? ఏం చేస్తుంటారు, మీ అభిరుచులు, ఈ ప్రాజెక్ట్ చెయ్యడం వెనక కథాకమామీషు?

నా పేరు మోనిక్. హాలాండ్ లో పుట్టి పెరిగాను. గత ఇరవయ్యేళ్ళుగా సోషల్ వర్కర్ గా, తెరపిస్ట్ గా పని చేస్తున్నాను. ప్రయాణాలు చెయ్యడం, ఫోటోలు తియ్యడం బాగా ఇష్టం. ఎనభైలు తొంభైల్లో ఒక ఎనలాగ్ కెమెరా వాడి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసే ఇంట్లోనే కాపీలు దిద్దేదాన్ని. తర్వాత డిజిటల్ కెమెరాలు వచ్చాయనుకోండి. నాకు మనుషుల ముఖకవళికల్ని, హావాభావాల్ని, వాటిలోని అందాన్ని ఫోటోల్లో పట్టుకోవడం బావుంటుంది. పడుచు వాళ్ళు, పెద్దవాళ్ళు, రకరకాల దేశాలకి, సంస్కృతులకి చెందిన మనుషులు, వాళ్ల ముఖాల్లో సందర్భానుసారంగా పలికే భావాలు, వాళ్ల లోపల ఆ సమయంలో నడిచే ఆలోచనలు; ఇవన్నీ గమనించడం భలే ఆసక్తిగా ఉంటుంది. ఈ అలవాటు బాగా ముదిరిన తర్వాత ఫోటో ఎకాడమీలో చేరాను. 2014 లో నా కోర్సు పూర్తయిన సందర్భంలో అల్జీమర్ వ్యాధిగ్రస్తుల ఫోటోలతో మొదటి ప్రదర్శన ఏర్పాటు చేశాను.

నాకెప్పుడూ మనుషుల ఫోటోలు తప్ప వేరేవి తియ్యాలనిపించేది కాదు. ఒకరోజు ఫేస్ బుక్ ఫ్రెండొకరు “వరసగా వారం రోజులు ప్రకృతి దృశ్యాలను ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టగలవా?” అని సవాలు చేశారు. అప్పటిదాకా సముద్రతీరం లో సూర్యాస్తమయాల్లాంటి మాములు ఫోటోలు తప్ప పెద్దగా ప్రకృతిని పట్టించుకున్నది లేదు. ఇక అప్పుడు ఈ పనికోసం చెట్లని ఎంచుకున్నాను. అలా చెట్ల ఫోటోలను తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చెయ్యడం బాగుందనిపించేది. వాటితో పాటు ఏవైనా కవితల్ని కూడా చేర్చి పెడుతుండేదాన్ని. అంతకుముందు ఎకాడమీలో ప్రదర్శించిన ఫోటోలక్కూడా నా సొంతమాటలేవో రాసి పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు ప్రకృతి నన్ను కవిత్వానికి దగ్గర చేసినట్టనిపించింది. అప్పట్నుంచి అప్పుడప్పుడు చిన్నపాటి విరామాలతో చెట్ల ఫోటోలను కవితలతో పాటు ఫేస్ బుక్ లో పెడుతూనే ఉన్నాను. ఈమధ్యనే 86 వ ఫోటోని పోస్ట్ చేశాను.

2. ఈ ప్రోజెక్ట్ గురించి మరికొంచం వివరంగా…

ఇంతకు ముందే చెప్పినట్టు, నేచర్ ఫోటోగ్రఫీ లో నేనేమైనా చెయ్యగలనా, అసలు ఈ కొత్త వస్తువు నన్ను కదిలిస్తుందా అని అనుమానంగా ఉండేది. అందుకని ప్రకృతి అనే వస్తువుని చెట్లకి పరిమితం చేసుకున్నాను. అందువల్ల ఒక్క విషయం మీదే శ్రద్ధగా పని చెయ్యగలిగాను. ఆ సమయంలో నేను చికిత్స చేస్తున్న 79 ఏళ్ళ అల్జీమర్స్ రోగి ఒకాయనతో బాగా స్నేహం ఐంది. అతను హాలండ్ లోని ఒక అందమైన అడవిలో పుట్టి పెరిగాడు. అతనెప్పుడూ అక్కడి చెట్లను గురించి చెప్తుండేవాడు. అతని స్నేహానికి గుర్తుగా నేను చెట్ల ఫోటోల్ని మాత్రమే తియ్యాలనుకున్నాను. ప్రతి రోజూ రాత్రి ఆరోజు తీసిన ఫోటోలను కంప్యూటర్లోకి ఎక్కించి వాటిల్లోంచి ఒకదాన్ని ఎంచుకుని కొంత ఎడిట్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేదాన్ని. అలా చేస్తున్నప్పుడు ఆ ఫోటోకి సంబంధించిన నా అనుభూతి, దాన్లో ముఖ్యంగా గమనించవలసిన విషయాలు, ఆ చిత్రం నాలో రేపిన జ్ఞాపకాలు వీటన్నిటి గురించీ చెప్పాలనిపించేది. వాటన్నిటినీ చెప్తూ బొమ్మని కొత్త దృక్కోణంలోంచి చూపించే ఒక కవిత కోసం వెతికేదాన్ని.

Day 07
“When to the Sessions of sweet silent thought”
by William Shakespeare

అప్పుడప్పుడు, తియ్యటి తలపొకటి మౌనంగా
నన్ను ఆవరించినప్పుడు

గతించిన జ్ఞాపకాలని తిరిగి పోగుచేసుకుంటూ
తీరని కోర్కెలు మిగిల్చిన మచ్చలకేసి నిట్టూరుస్తూ
తిరిగిరాని కాలంలో కొట్టుకుపోయిన వేదనని వెదుకుతూ
కరిగిపోవడం అలవాటులేని కళ్లని
ప్రవాహాల్లోకి నిలువునా తోసేస్తాను

అప్పుడు,
చిక్కటి చీకటి చావులో చేజార్చుకున్న స్నేహాల కోసమూ
ఎన్నడో భగ్నమైపోయిన వలపుల కోసమూ
వెచ్చగా మరోసారి చెమరుస్తూ

పోగుట్టుకున్న ఎన్నో చిత్రాలకోసం గొంతుపగిలి ఏడుస్తూ
గతించిన కష్టాలన్నిటికోసం మరోసారి తపిస్తూ
బాధామయ గాధలన్ని గొంతు పూడ్చినప్పుడూ
కొత్తగా మరోసారి గుండెపగిలి వగచినప్పుడూ

ఒక్క క్షణమైనా
నీ తలపు నాలో చొరబడితే
అదే నాకు దుఃఖాంతం, నష్టాంతం.

3. కవిత్వంలో మీకు ఆసక్తి ఎలా కలిగింది? చాలామంది కవుల కవితలు మీ ఫోటోలతో చేర్చారు కదా, వాళ్లందరినీ ఎప్పుడు చదివారు? ఏ ఫొటోకి ఏ కవిత చేర్చాలి అనేది ఎలా తెలిసేది?

అయ్యో! నాకు అంతమంది కవులు, వాళ్ల కవిత్వం ఏం తెలీదండీ…

నేను వెళ్తున్నదారిలో అనుకోకుండా జరిగిన అందమైన ప్రమాదం ఈ కవిత్వం. నాకు మొదట్లో రూమి, హఫీజ్, రబియా, ఉమర్ ఖయ్యామ్ లాంటి సూఫీ కవులు, షేక్స్పియర్, కీట్స్ లాంటి ఇంగ్లీష్ కవులు మాత్రం తెలుసు. మొదట్లో ఫోటోకి తగ్గ కవిత కోసం నాదగ్గరున్న పుస్తకాల్లో చూసేదాన్ని. ఇలా లాభం లేదని తర్వాత ఇంటర్నెట్ లో వెతకడం మొదలెట్టాను. అసలేం చేసేదాన్నంటే- నేను ఆరోజు తీసిన ఫోటొల్లో ఒకదాన్ని తీసుకుని, దాన్లోని వాతావరణాన్ని నా మూడ్ కి తగ్గట్టు ఎడిట్ చేసేదాన్ని. ఆ తర్వాత ఆ ఫోటో మొత్తాన్ని ఒక్కముక్కలో చెప్పేలాంటి పదం ఒకదాన్ని పట్టుకుని ఆ పదంతో వచ్చే కవితల కోసం వెతికేదాన్ని. అలా చేస్తూ వందలకి వందలు కవితలు చదివాను. వాటిల్లో నాకు నచ్చినవన్నీ ఒక పుస్తకంలో రాసుకున్నాను. వాటిని ఇప్పటికీ వాడుతున్నాను. ఆ రకంగా అంతకుముందెప్పుడూ పేరైనా వినని కవులందర్నీ చదివాను. వాల్ట్ విట్మన్ కవితలు బాగా నచ్చాయి. డెడ్ పొయెట్స్ సొసైటీ లో రాబిన్ విలియంస్ చెప్పే “కేప్టెన్ ఓ కేప్టెన్” అనే మాటలు కూడా విట్మన్ వే అని తెలిసింది.

4. మీ ఫోటోలు కవితాత్మకంగా అనిపిస్తాయి. వాటిని కొత్తకొత్త పద్ధతుల్లో ఎడిట్ చేస్తారు కదా! అలా చేసేటప్పుడు ఫలానా ఎఫెక్ట్ కావాలనుకుని చేస్తారా లేక ప్రయోగాలు చేస్తూ ఏది నచ్చితే అక్కడ ఆపేస్తారా?

నాకు ఫోటో తీసేటప్పుడు అది చివరికి ఎలా కనిపించాలి అనే ఆలోచన ఉండదు. ఒకరోజు అనుకోకుండా నా కెమెరాలో డబుల్ ఎక్స్పోజర్ బటన్ కనపడింది. ఆ బటన్ ని నా పాత నికాన్ గేర్ లో మనుషుల ఫోటోలకి వాడేదాన్ని. కానీ అదే బటన్ ఫ్యూజీఫిల్మ్ లో ఉందని తెలీదు. అప్పట్నుంచి చాలా ఫోటోల్ని ఆ బటన్ వాడి తీశాను. దాన్ని ఏ పద్ధతిలో ఎలా వాడాలో ఫోటో తీసే క్షణంలోనే నిర్ణయించుకుంటాను. బొమ్మలో లేత, ముదురు రంగుల సరైన కూర్పు కోసం చూస్తాను. నీడలు, ప్రతిబింబాలు, చీకటి, వెలుతురు ఇవన్నీ చాలా అద్భుతంగా పదే పదే నా చిత్రాల్లోకి వచ్చి చేరతాయి. తర్వాత నేను ఇంట్లో కూర్చుని వాటిని అప్లోడ్ చేస్తుంటే అవసలు పూర్తిగా వేరే బొమ్మల్లా కనిపిస్తాయి. ఒక్కోసారి మొదటి ఫోటోకి, దాని చివరి రూపానికి సంబంధం ఉండదు. ఈ మొత్తం ఫోటోల్ని మార్చేపని, కవితలు వెతకడం చాలా సృజనాత్మకంగా అనిపిస్తుంది. నాకిలా మాయాలోకాల్ని, మాంత్రిక ప్రదేశాల్ని సృష్టించడం చాలా ఇష్టం. వెలుగునీడల మధ్య జరిగే మార్మిక సంభాషణ ఈ బొమ్మల్లో కనిపిస్తున్నట్టు ఉంటుంది. రంగులు, వాటి అమరిక, వీటన్నిటి మధ్య సయోధ్య, వీటి ద్వారా ఏవో రహస్యాల్ని, భావాల్ని చెప్పడానికి అపరిమితంగా అవకాశం దొరికినట్టు ఉంటుంది. అదలా ఉంటే, మైదానాలు, కొత్త కొత్త ప్రదేశాల బొమ్మల్ని చూడ్డం అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యం.

5. ఈ ప్రోజెక్ట్ మిమ్మల్ని చాలా లోతుగా ప్రభావితం చేసిందని అన్నారు కదా? అదెలానో కాస్త వివరిస్తారా?

అసలీ మొత్తం పని, ఫోటొలెక్కడ తియ్యలో నిర్ణయించుకోవడం నుంచి- (హాలాండ్ లో నేనిదివరకూ చూడని కొత్త ప్రదేశాల కోసం వెతికి, వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుని, ఒక్కోసారి తెల్లారకముందే ఆచోటుకి చేరుకునేదాన్ని, పొద్దుపొద్దునే ఉదయకాంతిలోని అందాల్ని కెమెరాతో పట్టుకోవడానికి) చివరిగా ఫోటో తీసి, దాన్ని ఎడిట్ చేసి, దానికి సరిపోయే కవితను వెతికే వరకూ ఒక ధ్యానం లాంటి స్థితిలో ఉండేదాన్ని. నాలోపలి పొరల్లో నాతో నేను మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఈ ఎడిటింగ్ ప్రక్రియ అంతా నన్ను నేను కొత్తగా తెలుసుకోవడానికి, నేను చూస్తున్నవాటిని, నన్ను ప్రభావితం చేసే విషయాలని కొత్తగా అర్థం చేసుకోవడానికి పనికొచ్చింది. కొత్తగా ఎక్కడికి వెళ్లాలి, కొత్త పద్ధతుల్లో ఎలా ఫోటోలను ఎడిట్ చెయ్యాలి అనే విషయంలో ఇదో మంచి ప్రేరణగా ఉండేది. ఇదంతా లోలోపలి సుదూర ప్రయాణం. ఒకరకంగా నా అంతరంగ చిత్రాన్ని చిత్రించుకోవడం. ఏమో! ఒక వ్యక్తిగా నా పరిధినిదాటి ఒక గొప్ప శక్తితో నాకు లయ కుదురుతున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. ఊహూ- అదీ కాదేమో నాలోపల్నుంచో బయటినుంచో నేను అయినదీ, పూర్తిగా నేను కానిదీ ఏదో భావన తనని తాను ఈ చిత్రాల ద్వార వ్యక్తం చేసుకుంటూ ఉండొచ్చు.

6. మీరు తీసిన ఫోటోల్ని కొన్ని ఇస్తారా?
మీకేవి కావాలి? నా కవితల్ని అనువదిస్తున్నారుగా. వాటికి సంబంధించిన ఫోటోల్ని తప్పకుండా వాడుకోండి.

***

తర్వాతి పేజీల్లో మోనిక్ రోసెన్ photo poems మరికొన్ని ఉన్నాయి. పేజీనంబర్ పై క్లిక్ చేసి చూడండి.

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12