కవిత్వం

ఆత్మహత్యకు ముందు

నవంబర్ 2016

వాళ ఇక్కడి ఆకాశం నిర్మలంగా వుంది
బరువైన ఒక్క నీలి మేఘ సంచారమూ లేదు
సంధ్య నలువైపులా పరుచుకుంటూ వుంది
కంటికి కొంచెం దూరంలోనే ఆకాశాన
కొంత వెలుతురు మడుగు కట్టింది

మనసులో ఆనందం ప్రవహిస్తూ వుంది
ఒక్కటంటే ఒక్కటే చేప చచ్చి తేలింది
అఖ్వేరియంలో మిగిలిన చేపలు
హడావిడిగా ఈదుతున్నాయ్
మిగిలిన గదంతా భద్రం

తను నిశ్శబ్దాన్ని
గాజు సీసాతో బద్దలు కొట్టింది
గాజుకాయ కన్నులు చిట్లాయి
వాష్ బేసిన్లో కాలం జారింది
రేపటి గడియారం రేపటిదే

నక్షత్రపు తాబేలు ఒకటి
ఇచ్చాపూర్వకంగా
దారికి అడ్డం వచ్చింది
ఏమిటటా అని
దగ్గరికి వెళ్ళగానే
భయపడి, చటుక్కున
తల లోపలికి లాక్కుంది

మూసుకుంటున్న కళ్ళ వెనుక
దూది పరుపులు మేట వేసాయి
వాలిన కనురెప్ప
శాంతిగా కావలించింది
సుఖ నిద్ర ప్రయాణాన
తీపిరాగం కమ్ముకుంది

ఇంకా చెప్పాలని వుంది
చాలా
వెనుక పేజీలు లేవు
ముందు పేజీలంతా
ఏదో నాటకపు సుందర చిత్రాలు

నాటకాలు లేని వేదికల గురించి
నువ్వు రాస్తావా?