కథ

ద్వాదశి

జనవరి 2017

కాశరాజు కూతురు  చిట్టడవిలాంటి చిక్కటి నల్లటి  తన జుట్టుని పాయలు పాయలుగా విడదీసి  దువ్వుకొంది. ఆ చక్కటి కురులని బిగించి కట్టడానికి ఇంద్రధనస్సుని మించిన రిబ్బన్ ముక్క మరెక్కడ దొరుకుతుంది? అందుకే దానినే రెండుగా త్రెంచి జడలకి కుచ్చీలుగా కట్టుకొంది. తనవైపే అపురూపంగా చూస్తున్న చందమామని అలవోకగా అందుకుని ఓ చెంపన తురుముకుంది.అడుగుకో కూతురున్న ఆకాశరాజుకి, ఆమె ఎన్నో కూతురో తెలీదుకానీ, పేరు మాత్రం ద్వాదశి. ద్వాదశి అందం మామూలు అందం కాదు.  అదో గిలకబావి. తోడేకొద్దీ ఊరినట్టు, చూసే కొద్దీ ఆ అందం రెట్టింపవుతూ ఉంటుంది.ఆమె నడుముని మెచ్చుకుంటే మెడకి కోపం. మెడని మెచ్చుకుంటే జడకి తాపం. ఆమె దేహంలో ప్రతివంపునీ వర్ణించాలంటే మామూలు వాళ్ళకి సాధ్యం అయ్యే పని కాదు. ఎవరైనా తపస్సు చేసి గడ్డాలూ మీసాలూ పెంచుకుంటే  తప్ప.

ఎన్నేళ్ళుగానో ద్వాదశిని మోహిస్తూ వెంటపడి మరీ వేధిస్తున్నాడు మూడో మేఘరాజు. అరగంట పాటు అనుగ్రహిస్తే చాలు, ఆమె లోతైన బొడ్లో దూకి, చచ్చి స్వర్గానికి పోవాలని ఎన్నెన్నో కలలు కంటున్నాడు. కానీ ఆ కలలన్నీ కల్లలయ్యాయి. ద్వాదశి మనస్సు కరగదనీ, తను అనుకున్నది ఇక  ఎప్పటికీ జరగదనీ గ్రహించిన అతను, మనస్సులోనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు.

రెండ్రోజులుగా ఆ రోదనకి అడ్దుకట్ట పడడం లేదు. తమ అనుంగు సోదరుని దుస్థితికి, అశేష మేఘరాశి తరలి వచ్చి  అశ్రువులు చిందిస్తుండడంతో భూమండలం మొత్తం తడిసి ముద్దవుతోంది. జనజీవనం స్తభించి పోయింది.

చంద్రుడు ద్వాదశి కురుల్లో చిక్కడిపోవడంతో తన ఆప్తమిత్రుడి కోసం ఎక్కడెక్కడో వెదుకుతూ, విసిగి వేసారి దారి తప్పిపోయినట్టున్నాడు సూర్యభగవానుడు. లేకుంటే అలసి సొలసి ఇంకెక్కడైనా ఆదమరిచి నిద్రపోతున్నాడో… ఎవరికీ ఎండ మొహం  కనపడ్డం లేదు.

భారత వాతావరణ శాఖ ఈ విపరీత పరిణామాన్ని తుఫాన్ గా ప్రకటించింది. ప్రపంచ వాతావరణ శాఖ దానికి ద్వాదశి అని పేరు పెట్టింది.  దాంతో పేపర్లలోనూ టీవీల్లోనూ ద్వాదశి పేరు మారుమ్రోగిపోతోంది.

గంటకోసారి సముద్రం దగ్గర రెయిన్ కోట్లతో నిలబడిన టివి రిపోర్టర్లు, మధ్యమధ్యలో గొడుగులు వేసుకుని మరీ బంగాళాఖాతంలో ద్వాదశి గమనం, గమకం, కదలిక, కవళిక, వేగం, వైనం వగైరాలన్నిటినీ వివరించి వివరించి చెబుతూ ప్రజలని అప్రమత్తం చేస్తూనే ఎవరికి వారే భయాందోళనల్లో  తడిసి ముద్దవుతున్నారు.

***

వర్షం. ఒకటే వర్షం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తెల్లటి చల్లటి వర్షం.

నింగినీ నేలనీ కలిపి వెండి  దారాలతో కుడుతున్నట్టు… మిడిసి పడుతున్న మోటు చినుకుల  వర్షం.

మేఘాలన్నీ ఏకమై శోకండాలు పెడుతున్నట్టూ, ఏనుగులు తొండాలతో నీళ్ళు తోడిపోస్తున్నట్టూ  పెద్ద వర్షం. అతి భారీ వర్షం. చెరువులూ దొరువులూ నిండిపోతున్నాయి. వాగులూ వంకలూ పొంగి పొర్లుతున్నాయి. నదులు జలహస్తాలతో సముద్రం వైపు ఈదలేక ఈదుతూ అలసటతో ఇక కదలలేక దగ్గరి దారులు వెదుక్కుంటున్నాయి.

ఎవరూ కాలు కదిపే పరిస్థితి లేదు. కారు నడిపే అనుకూల వాతావరణం అసలే కాదు. ఈదురు గాలులకి తీరం వెంబడి  ఆకాశ హర్మ్యాల  అద్దాలు బద్దలవుతున్న శబ్ద కిరాతకమే అంతటా.

***

కాకినాడ మెట్రోపాలిటన్.

జి.యం.ఆర్.పోర్ట్, ఈస్ట్ అవెన్యూ. సీఫేస్ అపార్ట్ మెంట్స్.

ఇరవై అంతస్తుల  ఆ అపార్ట్ మెంట్లో తర్డ్ ప్లోర్. ఫ్లాట్ నంబర్ ఫోర్.

అందులో  ఒక మహా కుట్రకి అంకురార్పణ జరిగింది. దాని సూత్రధారి నరసింహ సాయి విఘ్నేశ్  శ్రీవాస్తవ్.

రాజమహేంద్రవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఇండియన్ ఎయిర్ లైన్స్  విమానాన్ని ప్యాసెంజర్స్ తో సహా ఇప్పటివరకూ ఎవరూ ధ్వంసం చేయని విధంగా ధ్వంసం చేసి, ఎలాంటి విధ్వంసం సృష్టించాలా? అని  రెండురోజుల్నుంచీ అతను రకరకాలుగా పథక రచన చేస్తున్నాడు .

సాయి విఘ్నేశ్ శ్రీవాస్తవ్ తీవ్రవాది కాదు. ఉన్మాది కూడా కాదు.  ఉగ్రవాది అంతకంటే కాదు. అతను ఒక ప్రొఫెసనల్ తెలుగు నావెలిస్ట్. ఆకట్టుకొనే ఆరంభ వాక్యాలతో పాఠకుడికి కనికట్టు చేయడం శ్రీవాస్థవ్ కి పెన్నుతో పెట్టిన విద్య. ఉత్కంఠతో ఊపిరాడనివ్వకుండా  చేస్తూ పాఠకులని ఏవో అద్వితీయ లోకాలకి తీసుకు పోయి,  వారిని తన కాల్పనిక జగత్తుకి దాసోహం చేసే సుశిక్షిత అక్షర మాయావి అతను.

శ్రీవాస్థవ్ రాస్తున్న కొత్త నవల ఓ మ్యాగ్ జైన్ లో సీరియల్ గా వస్తూ క్లైమాక్స్ దశకి చేరుకుంది.

ఆ నవల పేరు ‘ ద్వాదశి ‘. పాఠకుల ఊహలు అంతమయ్యేచోట కొత్త ఉత్కంఠని రేపుతూ వాళ్ళ కళ్ళని పేజీల వెంట పరుగులు తీయిస్తోంది ద్వాదశి. వర్షం మొదలవడంతో ప్రారంభమై,  వర్షం ఆగడంతో నవల ముగిసేలా ద్వాదశిని పక్కాగా ప్లాన్ చేసాడు శ్రీవాస్థవ్. ఎవరూ కనీ వినీ ఎరుగని బిగువుతో పాఠకుల వళ్ళు గగుర్పొడిచేలా దడదడలాడే గుండెలతో చదివించేలా దాని క్లైమాక్స్ రాయడంలో  విఘ్నేష్  శ్రీవాస్ఠవ్ ప్రస్తుతం నిమగ్నమయి ఉన్నాడు.

అతను తన రీడింగ్ రూంలో…

టేబుల్ మీది డెస్క్ టాప్ ముందు కూర్చుని చకచకా అక్షరాలని టైప్ చేస్తున్నాడు. కానీ సగం వాక్యం కూడా పూర్తి కాకుండానే, అతని వ్రేళ్ళు ముందుకు కదలనని మొండికేస్తున్నాయి. ఇప్పటివరకూ రెండుమూడు క్లైమాక్స్ లు రాసాడు. అయినా అవేవీ  అతనికి ఎంతమాత్రం సంతృప్తిని కలిగించలేదు. దీంతో వాటిని  డిలీట్ చేసి, ఇంకా ఇంకా కొత్తగా ఆలోచిస్తూ సరి క్రొత్తగా రాయడం మొదలెట్టాడు.

కీబోర్డ్ మీద అతని వ్రేళ్ళు కదలక పోవటానికి కారణం ఉదయం నుంచీ అతనికి ద్వాదశి కనిపించకపోవడం. ఇప్పటికే నాలుగైదు సార్లు ఆమెని చూడాలని  తహతహలాడాడు. ఆ అందాలభరిణె ఎందుకోగానీ ఈరోజు అతనికి మొహం చాటేసింది.

ఆమె ఉండే ప్లాట్ అద్దాలకి పరదాలు అడ్డుగా వేసి ఉన్నాయి. ఆమె ముఖారవిందాన్ని చూస్తే కానీ తనకి మళ్ళీ మునుపటి  ఊహా ఉత్సాహం తిరిగొచ్చేలా లేవు. ద్వాదశి పేరు తలుచుకుంటేనే అతనిలో ఓ ఉల్లాసం. ఆమెని అలా చూస్తూ ఉంటే అదోలాంటి పరవశం.

శ్రీవాస్థవ్ కంప్యూటర్ ముందు కూర్చోలేక హాల్లోకి వచ్చి, ఇంకోసారి  బైనాక్యులర్స్ చేతిలోకి   తీసుకున్నాడు. తూర్పువైపు  బాల్కనీలోకి వెళ్ళి  ఎదురుగా ఉన్న  అపార్ట్ మెంట్ వైపు ఫోకస్ చేసాడు.

తన కలలచెలి… ఊహాఊర్వశి… ద్వాదశి, అదుగో. అదుగో.. అదుగో…

ఆ జగదేకసుందరి, అతని  నవలా నాయిక ద్వాదశి బాల్కనీలో దర్శనమిచ్చింది. కళ్ళతోనే  దోసిల్లకొద్దీ అప్సరసం త్రాగి, తనలోని విరహాగ్నిని చల్లార్చుకొని, నూతనోత్తేజంతో ప్లాట్ లోపలకి తిరిగి వచ్చిన శ్రీవాస్థవ్  కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. అతనిలో ఊహలు  వాయువేగ మనో వేగాలతో విహరిస్తున్నాయి. కీబోర్డ్ మీద అతని వ్రేళ్ళు రేసుగుర్రాలని మరిపిస్తున్నాయి.

ప్లాట్ లో…

కీబోర్డ్ టకటకలు తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఆ ఏకాంత ప్రశాంతతని భగ్నం చేస్తూ కాలింగ్ బెల్  మ్రోగింది.

గోడకి అమర్చిన ఇండికేటర్ లో ఓ అగంతకుడు గుమ్మం ముందు నిలబడి  ఉండడం కనిపించింది.

అతన్ని ఎక్కడో చూసినట్టుగా, బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. కానీ  ఎవరన్నది గుర్తుకు రావడం లేదు.  అతని కుడి వైపు దవడ మీద అప్పుడప్పుడే మానుతున్న పొడవాటి గాయపుమచ్చ పచ్చిపచ్చిగా కనిపిస్తోంది.

‘ ఎవరు? ‘, ‘ ఎవరై వుంటాడు? ‘

ఇంట్లో  వేరే ఎవరూ లేకపోవడంతో అతనే లేచి వెళ్ళి తలుపు తెరిచాడు.

(అ)పరిచితుడు దృఢంగా, ఎత్తుగా ఉన్నాడు. వర్షంలో తడవడం వల్ల  అతని బట్టలు తడిచి ఉన్నాయి.  తలలోంచి మొహం మీదుగా  వర్షపు నీళ్ళు కారుతుంటే కర్చీఫ్ తో తుడుచుకుంటున్నాడు.

” మిష్టర్ విఘ్నేష్ ” అంటూ ఆర్ధోక్తిగా ఆగాడు అతను. కొద్ది క్షణాల పాటు తల తుడుచుకోవడాన్ని ఆపి.

” యస్…  లోపలకి రండి ” తలుపుకి అడ్డం తొలగి పక్కకి జరిగాడు శ్రీవాస్తవ్.

(అ)పరిచితుడు కాళ్ళకి ఉన్న బూట్లూ  మేజోళ్ళూ అక్కడే విప్పి లోపలకి అడుగుపెట్టాడు.

ఒకసారి హాలుని నలుమూలలా పరిశీలనగా చూసి “కూర్చోవచ్చా” అంటూ మర్యాద పూర్వకంగా అడిగి, సోఫాలో కూర్చున్నాడు అతను.

అతన్నే తదేకంగా చూస్తున్న శ్రీవాస్థవ్ “సారీ… మీరు? మిమ్మలని ఎక్కడో చూచినట్లుగా ఉంది. ఐ మీన్ ఎంతో పరిచయస్థుల్లాగా ఉన్నారు” అన్నాడు, తనూ అతని  ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

(అ)పరిచితుడు పెదాలు విడీ విడనట్టుగా నవ్వాడు.

“నేను మీకు బాగా తెలుసు. నేను ఇలా వున్నానంటే అందుకు కారణం మీరే. బహుశా పేరు చెబితే గుర్తుకు రావొచ్చనుకుంటాను ” అంటూ శ్రీవాస్థవ్ కళ్లలోకి నర్మగర్భంగా చూసాడు.

ఆ చూపు చురకత్తి కొసలాగా గుచ్చుకున్నట్టు తోచింది శ్రీవాస్థవ్ కి . ఎందుకో ఒక్కసారిగా వళ్ళు జలదరించినట్టయ్యింది. అతని  వైపు అలా మంత్రం వేసినట్టుగా చూస్తూ ఉండిపోయాడే తప్ప,  అతనెవరో  ఏమాత్రం గుర్తుకు తెచ్చుకోలేక పోయాడు .

తడిసి అతని వంటికి అతుక్కుపోయిన టీ షర్ట్  లోంచి,  మెలితిరిగిన కండలు బహిర్గతమవుతున్నాయి. ఈ కండలూ, ఆ హెయిర్ స్టైల్, ఆ దర్పం చూస్తుంటే తర్ఫీదుపొందిన ఏ పోలీసు అధికారో అయి ఉంటాడనిపిస్తోంది. తనకి పరిచయం ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ మనఃఫలకం మీద  మెరిసి మాయమవుతున్నారు తప్ప, (అ)పరిచితుడి ఆనవాళ్ళు మాత్రం దొరకడం లేదు.

అక్కడ ఉత్సుకత ఊపిరి పోసుకొంది. అది ఉద్వేగంగా మారి ఘనీభవిస్తోంది.

క్షణాలు దొర్లుతున్నాయి. అవి నిమిషాల్లోకి మారే లోపు…

“ఐ యాం… మేఘాంశ్ , రణధీర్ మేఘాంశ్ “   అన్నాడు అతను. మొలలో ఉన్న రివాల్వర్ ని తీసి టీపాయ్ మీద పెడుతూ…

“రణధీర్ మే…ఘాం..శ్. ” ఆ పేరు అతని నోట్లోంచి బుల్లెట్ లాగా దూసుకు రావడంతో శ్రీవాస్థవ్ షాక్ కొట్టినట్టు అదిరిపడ్డాడు.

“వ్వాట్ “, అతని గొంతులో అదోలాంటి భయపు జీర.

“కూల్… మీరు విన్నది నిజమే. నా పేరు రణధీర్ మేఘాంశ్. జాయింట్ డైరక్టర్, సెంట్రల్ ఇంటిలిజెన్స్ బ్యూరో. చీఫ్ ఆఫ్ యాంటీ టెర్రరిస్ట్ వింగ్.  అన్నట్టు ఈ డిజిగ్నేషన్ మీరు ఇచ్చిందే కదా!” వత్తి పలికాడు  మేఘాంశ్.

శ్రీవాస్థవ్ మెదడు మొద్దుబారిపోతోంది. అతని దేహం రోమాంచితమయ్యింది.  మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఏసీలో కూడా అతనికి  చెమట పట్టడం మొదలయ్యింది.

‘మేఘాంశ్… ఐ.బి.ఆఫీసర్., తన ద్వాదశి నవలలో అతనిది విలన్ క్యారెక్టర్.  అవును, అతనే… తన ఎదురుగా తాపీగా కూర్చుని ఉన్నాడు. ఇది అబద్ధం కాదు. అభూత కల్పన అంతకంటే కాదు. కాలాన్ని దహించే నిప్పులాంటి నిజం. తను అతన్ని ఏ యే పోలికలతో సృష్టించాడో? అచ్చుగుద్దినట్టు అవే పోలికలతో, అలాగే ఉన్నాడు. అదే చూపు. ఆ చూపులో అదే క్రౌర్యం.

అదే ఆహార్యం. అవే హావభావాలు. అదే ఒడ్డూ పొడుగూ ఎట్సెట్రా ఎట్సెట్రా .అతనే ఇతను. ఇది అక్షరసత్యం.

“నమ్మలేకపోతున్నారు కదూ?  నిలువుటద్దాన్ని పగలగొట్టించి మరీ ద్వాదశి చేత నా మొహంమీద కసిగా పొడిపించింది మీరే కదా! అప్పుడే మర్చిపోయారా? రక్తం మడుగులు కట్టేసింది. హబ్బ తలుచుకుంటుంటే… గాయం ఇంకా సలుపుతున్నట్టే ఉంది. ఇంతకీ  ఎక్కడ ఉందో ఆ ద్వాదశి!  నాక్కానీ కనిపించాలి. అప్పుడు తెలుస్తుంది దానికి నా అసలు దెబ్బ. “దవడమీది గాయాన్ని తడుముకుంటూ… విషపు నవ్వు నవ్వాడు మేఘాంశ్.

ఆ నవ్వు, మేఘాంశ్ అంతరంగానికి అద్దం పడుతూ ఉండడంతో శ్రీవాస్థవ్ ఆలోచనల్లోంచి బయట పడ్డాడు.

శ్రీవాస్థవ్ ఉద్దండపిండంలాంటి వాడు. అందుకే అతను  ఇంకా ఆలోచించ గలిగే స్థితిలో ఉన్నాడు. అదే మవరైనా అతని స్థానంలో ఉండి ఉంటే ఈపాటికి భయంతో గుండె ఆగి చచ్చిపోయేవాడు. తను సృష్టించిన పాత్ర. తన ఇంటి తలుపే తట్టి, తన ఎదురుగానే కూర్చుని మాట్లాడుతుంటే చూస్తూ చూస్తూ ఎవరైనా మాత్రం ఎలా బతికి బట్టగలరు? హీనపక్షం పిచ్చెక్కి పోవడం ఖాయం. ప్రస్తుతం అలాంటి మానసిక స్థితికి  కొంచెం అటూ ఇటూగా చేరుకున్నాడు శ్రీవాస్థవ్.

‘ వాస్తవం కల్పన కంటే కరుకైంది ‘ అంటే ఇదేనేమో.

శ్రీవాస్థవ్  ఆలోచనలతో తనకి సంబంధం లేనట్టు అతని మొహంలో కదులుతున్న భావాలని నిశ్శబ్దంగా చదువుతున్నాడు మేఘాంశ్.

నిలువెల్లా చమటతో తడిసి ముద్దైన శ్రీవాస్థవ్ కి వెన్నులో సన్నగా వణుకు మొదలయ్యింది. వంట్లో నరాలనన్నిటినీ లాగి ఎవరో తాడులా పేనుతున్న అనుభూతి.

‘ద్వాదశి చేసిన గాయానికి ఈ పాత్రగాడు అదే మేఘాంశ్, తనమీద రివెంజ్ తీర్చుకోడానికి వచ్చాడా? అందుకే వచ్చాడా? లేకపోతే ఇంకేమైనా ఉందా?’ ఎక్కడా అతని ఆలోచనలు తెగడం లేదు. ఎవరో గుండెని నొక్కి పిండేస్తున్నట్టు అదోలాంటి ఉక్కిరి బిక్కిరి. తలపగిలపోయేటంత టెన్షన్.

“చెప్పండి, ద్వాదశి ఎక్కడ?”  మేఘాంశ్  ప్రశ్న అతనికి వినపడలేదు. లేక వినపడినా వినపడనట్టు నటించాడో?

అంత గందరగోళంలోనూ శ్రీవాస్థవ్ ఏదో గుర్తుకు వచ్చినట్టు చటుక్కున లేచి, విండో దగ్గరకి పరిగెత్తాడు.

అది గమనించిన మేఘాంశ్ రివాల్వర్ ని  చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని వెనకనుంచి శ్రీవాస్థవ్ కి గురిపెట్టాడు. ఆ విషయం శ్రీవాస్థవ్ గమనించలేదు. కిటికీ కర్టెన్లు సర్రుమని లాగి చూసిన శ్రీవాస్థవ్ నిశ్చేష్టుడైపోయాడు.

బయట వేసవి కాలపు ఎండ మండిపోతూ ఉంది.  అటుప్రక్క బీచ్ వైపు రోడ్ మీద ఓ కార్ పార్క్ చేసి ఉంది.   ఎర్రటి పొడవాటి ఆ కారు మీద పడ్డ వర్షపు చినుకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి.  వైపర్స్  ఆన్ చేసి ఉండడంతో అవి కారు అద్దం మీద,  కిందకీ మీదకీ లేస్తూ చినుకులని చెదరగొడ్తున్నాయి.

నిలువెల్లా తడిచి ఉన్న ఇద్దరు అగంతకులు నక్కి నక్కి తన ప్లాట్ వైపే బైనాక్యులర్స్ తో చూస్తున్నారు.బహుశా వాళ్ళు మేఘాంశ్ అనుచరులై ఉంటారు.  “ఎ.. ఎందుకు? నన్ను వెదుక్కుంటూ…  నవల్లోంచి బయటకి  వచ్చారు?” మేఘాంశ్ ని అడుగుతున్నాననుకున్నాడు శ్రీ వాస్థవ్. కానీ అతని నోటి నుంచి మాట ఊడిపడ లేదు.

విపరీతమైన అశాంతికి లోనైన శ్రీవాస్థవ్ ని తీవ్రమైన మానసిక వత్తిడి లోబరుచుకుంది. కిటికీ దగ్గర నుంచి వెనక్కి తిరుగుతూ తిరుగుతూనే అతను స్పృహ తప్పి దబ్బున కింద పడిపోయాడు.

***

శ్రీవాస్థవ్ కళ్ళు తెరిచే సరికి, ఎదురుగా ఏమీ కనిపించడంలేదు.

‘ఇదేంటి? ఏమీ కనిపించకపోవడం ఏమిటి? తన కళ్ళు కానీ పోయాయా?’

‘నో…నో అలా జరగడానికి వీళ్ళేదు ‘ మానసిక సంచలనం మొదలయ్యింది అతనిలో…

‘నల్లటి ముసుగు లాంటిది తన తలకి తగిలించి ఉంది. కనిపించకపోవటానికి అదీ కారణం ‘

అసలు  విషయం గమనించడంతో మనస్సు తేలికైంది అతనికి.

‘ఉరి తీసే ముందు నేరస్థులకి కూడా ఇలాంటి ముసుగే కప్పుతారు కదా! అయితే? మేఘాంశ్, తనని ఉరి తీసి  చంపాలనుకుంటున్నాడా? మనుషులకి అంటే పగలూ ప్రతీకారాలూ కామన్. ఈ ప్రేమలూ, ద్వేషాలూ సహజం. కానీ  కల్పిత పాత్రలకి కూడా ఈ జాడ్యం ఉంటుందా? అంటే ఇప్పుడు తన తల మీదుగా పైన ఉరి త్రాడు వ్రేళ్ళాడుతూ ఉండి ఉండొచ్చా?’ రకరకాల అనుమానాలు అతని మనస్సులో తిరుగుతున్నాయి.

‘అనుమానాలా, ఆలోచనలా ఇవి. ఖచ్చితంగా ఆలోచనలే. ఇన్ని రకాలుగా ఆలోచించగలుగుతున్నాడు కాబట్టే తను రచయిత కగలిగాడు. చేతులతో ముసుగుని లాగడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. సాధ్యం కాలేదు అనడం కంటే చేతులు సహకరించలేదు అనడం కరక్ట్.

‘ మై గాడ్…నా చేతులు, అయ్యో…నాచేతులు?’ దేహంలో రక్తం అంతా గడ్డకట్టుకుపోతున్న ఫీలింగ్. ‘నా చేతులు ఏమయ్యాయి?’ భయంతో నిస్సత్తువ ఆవహిస్తోంది అతన్ని.

‘నా చేతులు నరికేసారు. చే…తు…లు నరికేస్తే! మరి నొప్పి ఏదీ?  ఏమో… తనని ఎన్ని రోజులయ్యిందో ఇక్కడకి తీసుకు వచ్చి? ఎప్పుడో నరికేసిన చేతులకి  ఇప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది? ‘

‘నరికేసారు… తన చేతులు నరికేసారు. అంటే తను కీబోర్డ్ మీద  అక్షరాలని టైప్ చెయ్యలేడు. ఇక ఏ కల్పిత పాత్రలనీ సృష్టించలేడు. పాత్రల మధ్య భావోద్వేగాలని రగల్చలేడు. ఒక పాత్రతో మరో పాత్రని మర్డర్ చేయించలేడు, మానభంగాలు చేయించలేడు. పేజీలకి పేజీలు డైలాగులు చెప్పించలేడు. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మిని  చేస్తూ ఎవరినీ ఉత్కంఠతలో ఓలలాడించలేడు. లోక కల్యాణార్థమే ఈ కథంతా అల్లాను, అంటూ క్లైమాక్స్  లో అల్లిబిల్లి సందేశాలు ఇవ్వలేడు. నాశనం అయిపోయింది. తన జీవితం నాశనమయిపోయింది. తన కెరీర్ మొత్తం సర్వ నాశనమయిపోయింది ‘

ఒక్కసారిగా  దు:ఖం ఎగ తన్నుకు వస్తుంటే, అప్పటి వరకూ అతనిలో ముసుగు తన్ని పడుకున్న అసలు సిసలు సగటు మనిషి నిద్ర లేచాడు. తొడుక్కున్న ఉల్లిపొరల్లాంటి రంగురంగుల చొక్కాలన్నిటినీ ఒక్కటొక్కటిగా విప్పేయడం మొదలు పెట్టాడు.

‘ఒరేయ్ మేఘాంశ్, దుర్మార్గుడా? ఎంత పని చేసావ్ రా దొంగ రాస్కెల్. ద్వాదశి చేత, ఏకంగా నీ పీక నరికించేస్తే పీడ విరగడయిపోను. అదేమిటీ? తను ద్వాదశి చేత అతన్ని హత్య చేయించాలనే కదా అనుకొన్నాడు.  కానీ  అదృష్టంకొద్దీ అద్దంపెంకు గురి తప్పి అతని బుగ్గని చీరేసి ప్రాణాలతో వదిలేసింది. అనుకున్నది అనుకున్నట్టే జరిగితే ఈ మేఘాంశ్ అనేవాడు లేకపోను. మనుషులకి ఉన్నట్టే అదృష్ట దురదృష్టాలు కల్పిత పాత్రలకి కూడా ఉంటాయా? ఏమో ఉండే ఉంటాయి. దానికి ఈ మేఘాంశ్ గాడే కదా ప్రత్యక్ష ఉదాహరణ.

‘జరిగిపోయిన దాని గురించి కుమిలిపోతూ కూర్చోవడం తనలాంటి సృజనశీలురకి తగని పని. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ మేఘాంశ్ గాన్ని వాడి రివాల్వర్ తోనే తూట్లు తూట్లుగా కాల్చి, ఆ గాయాల్లో ఉప్పూ కారం చల్లి, హింసింసి హింసించి చంపాలి నా కొడుకుని. లోకంలో ఎక్కడైనా ఇలా జరిగి ఉంటుందా? తనని సృష్టించిన రచయిత చేతులనే నరికేసిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న రచయిత. అసంభవం, జరిగి ఉండదు. కాన్సెప్ట్ అదిరింది. ఖచ్చితంగా తన కొత్త నవల ఇతివృత్తం ఇదే. ష్యూర్, పడిచస్తారు ఇక పాఠకులంతా. వారం వారం పత్రికకోసం ఎదురుచూస్తూ వెర్రెత్తిపోరూ. అయ్యో అయ్యో శ్రీవాస్థవ్, వాస్తవాన్ని మర్చిపోతున్నా వేమిరా బుజ్జికొండా! రాయడానికి నీకు చేతులు ఎక్కడ ఉండి చచ్చాయిరా చిన్ని నాయనా…’

శ్రీవాస్థవ్ వస్తున్న ఏడుపుని పంటి బిగువున అదిమి పెట్టుకొని, మేఘాంశ్ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. కసితో అతని ఛాతీ ఉప్పొంగింది. మేము సైతం అంటూ అతని భుజాలు కూడా తమ కండబలాన్ని ప్రదర్శించాయి. దాంతో దేహంలో గడ్డ కట్టిపోయింది అనుకున్న రక్తప్రసరణ తిరిగి వేగం పుంజుకొంది.

‘దేవుడా, ఒక్క అరగంటపాటు నా చేతులని నాకు ఇప్పించు తండ్రీ. ఆ మేఘాంశ్ గాడి అంతు చూసాక మళ్ళీ నా చేతులు…  చీచ్చీ , కాదు కాదు  నీ చేతులు నీకు అప్పు తీర్చేస్తా ‘  బేలగా ప్రార్థించాడు.

‘ఆశ్చర్యం…, అద్భుతం…, అమోఘం…అసంభవం ‘

దేవుడు అంత వేగంగా ప్రతిస్పందిస్తాడని శ్రీ వాస్థవ్ ఏమాత్రం ఊహించలేకపోయాడు. దేవుని కటాక్షం పొందడం ఇంత సింపులా? ఇది తెలీకనా, సంవత్సరాల తరబడి తపస్సులు చేస్తుంటారు  మునులూ, యోగులూ.

దేవుడి దయతోడను నెమ్మదిగా శ్రీ వాస్థవ్ కి చేతులు మొలుచుకుని వస్తున్నాయ్. ‘తనకి…చేతులు మొలుస్తున్నాయి. మొలిచేసాయి…యురేకా!! ‘ ఓ వెర్రికేక అతని నోటి వెంట వెలువడింది.

‘చేతులు మొలవడమా నా పిండాకూడా. ఇప్పటి దాకా తన చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉన్నాయి. కాళ్ళని కూడా  అలాగే  బిగించి కట్టేయడంతో తిమ్మిర్లు ఎక్కిఅవి అసలు ఉన్నాయో లేదో అన్న అనుమానం కలిగింది . రక్త ప్రసరణ సాఫీగా జరగుతుండడంతో వాటి స్పర్శ మళ్ళీ తనకి తెలిసి వచ్చింది అంతే. ఛ, ఇడియట్ లా తనలో తనే ఎంత భయానకంగా ఊహించేసుకున్నాడు! ఆందోళనతో ఎంతగా ఏడ్చి చచ్చాడు!

అద్భుత వాక్య విన్యాసాలతో, పదగారడీలతో, ఉక్కిరి బిక్కిరి చేసే ఉత్సుకతతో పాఠకులని ఊచకోత కోసే తనేనా ఇంత చేటు ఉద్విగ్నతకి లోనయ్యింది? తను సృష్టించిన పాత్ర మీద తనే పగబట్టడం ఏమిటి? ఎక్కడన్నా రచయితలు ఇలా తమ పాత్రలమీద ద్వేషాన్నో ప్రేమనో పెంచుకునే పరిస్థితి ఉంటుందా? తల్లిదండ్రులు పిల్లలమీద పగబట్టినట్టు లేదూ చండాలంగా. తలుచుకుంటుంటేనే చాలా సిల్లీగా అనిపిస్తోంది. అప్పటివరకూ తనలో వున్న భయాంoదోళనలు తగ్గడంతో మామూలుగా ఆలోచించగలుగుతున్నాడు శ్రీ వాస్థవ్. మనిషి సహజ నైజమే అంత.

తనలో తనే నవ్వుకున్న శ్రీవాస్థవ్, తనని ఓ కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి ఉంచారని గ్రహించాడు. అదృష్టం కొద్దీ తన నోటిలో గుడ్డలేమీ కుక్కలేదు.  తను ఎక్కడ ఉన్నాడు అన్నది మాత్రం అతనికి అర్థం కావడం లేదు.

ఒక వేళ మేఘాంశ్,  తనని తన ఇంట్లోనే కట్టేసి   ఉంచాడా అన్న అనుమానం కూడా వచ్చింది.   ‘ఏం? ఎందుకు? అంత అవసరం ఏమొచ్చింది? చంపేస్తాడా?’ ఇంకా చాలా సందేహాలు అతని మనస్సులో సుడులు  తిరుగుతూనే ఉన్నాయి.

ఇంతకీ ఎక్కడున్నట్టు తను? తన ప్లాట్ నీ, అందులోని వస్తువులనీ మనఃఫలకం మీద ఆవిష్కరించుకున్నాడు. ఈ కుర్చీ తనది కాదు. ఏదో  వాసన  లీలగా వస్తోంది. అది కూడా తనకి పరిచయం లేని సువాసన. అంటే ఇది ఖచ్చితంగా  తన ప్లాట్ కాదు. ఎక్కడో పరిచయం లేని చోటులో  తను బందీగా పడి ఉన్నాడన్నమాట ‘

‘ఎక్కడ…ఎక్కడ? విపరీతంగా దాహం వేస్తోంది. ఆకలి కూడా మొదలయ్యింది. నీరసంతో తల తిరుగుతున్నట్టనిపించింది. దాహం… దాహం….  వేస్తోంది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ‘హలో’ అని అరిచాడు. అరిచాను అనుకున్నాడు కానీ  నీరసం వల్ల అతని మాటలు బయటకి కీచుగా వచ్చాయి.

ఘల్ ఘల్

శబ్దం వస్తున్న వైపు తలత్రిప్పాడు. అడ్దుగా ఉన్న  ముసుగువల్ల  కళ్ళకి ఏం కనిపించడం లేదు.

ఘల్ ఘల్

ఎవరో మెత్తగా నడుస్తున్న అడుగుల చప్పుడు.

మెడ వెనక, ఎవరిదో ఊపిరి వెచ్చగా  తగిలింది.

‘మళ్ళీ ఈ దయ్యం ఎఫెక్ట్ ఏమిట్రా నాయనా? ‘

ఘల్… ఆ వచ్చేది ఆడవాళ్లే అయ్యుంటారు. ‘ఘల్…ఘల్ ‘ కాళ్ళ పట్టీల, మువ్వల శబ్దం అది.

తనకి  చేరువలోకి వచ్చాకా ఆగిపోయింది ఆ పట్టీల శబ్దం.

“అరరె, కట్లు విప్పండి” మృదుమధురంగా అంది, ఓ ఆడ గొంతు. చాలా దగ్గర నుంచి వినపడింది ఆమె మాట.

ఆమె వంటి మీద నుంచి హాయిగొలిపే  పెర్ఫ్యూం  పరిమళం వీస్తోంది.

అప్పటి వరకూ  శ్రీ వాస్థవ్ వెనకే నలబడిన  ఓ వ్యక్తి,  ఆమె ఆదేశాల మేరకి  అతని కాళ్ళకీ చేతులకీ ఉన్న కట్లు

విప్పాడు. ఆ కట్లు విప్పే చేతులు మంచుముక్కల్లా గట్టిగా చల్లగా ఉన్నాయి, చాలా సేపట్నుంచి ఫ్రిజ్ లో పెట్టి తీసినట్టు. అతని ఊపిరే  ఇప్పటి వరకూ  తనకి మెడ మీద వెచ్చగా తగిలినట్టుంది.

శ్రీవాస్థవ్ కట్లు విప్పిన ఆ చేతులు, వెనక నుంచి  అతని తల మీద ఉన్న ముసుగుని కూడా తొలగించాయి.

శ్రీవాస్థవ్ వెనక్కి చూద్దామనుకున్నాడు ఓ క్షణం. కానీ తల తిప్ప బుద్ధి కాలేదు. ఎదురుగా నాలుగడుగుల దూరంలో,   తెల్లటి దుస్తుల్లో కలహంసలాంటి అందమైన యువతి… పాలరాతి బొమ్మలా  నిలబడి ఉంది.

ఎటొచ్చీ ఒకటే చింత. ఆమె తలమీదుగా, భుజాల వరకూ  పలుచటి మేలి ముసుగు కప్పుకొని ఉంది. ఊపిరి తీసుకోవడానికేమో, నల్లటి చిక్కటి వల లాంటి వస్త్రం వేలాడుతోంది. దాని వల్ల మొహం స్పష్టంగా కనపడ్డం లేదు. మబ్బుల వెనక చందమామలా వున్న ఆమెని కళ్ళప్పగించి చూస్తున్న  శ్రీవాస్థవ్ లో హృదయస్పందన పెరిగింది.

‘ఎవరీ అపరంజి బొమ్మ? దేవ కన్యా? మేఘాంశ్ కి ఏమవుతుంది? భార్యా?  చెల్లెలా? ప్రియురాలా?’

‘అరేయ్ శ్రీవాస్థవ్, నీక్కానీ బుర్ర దొబ్బిందా బే?  వాస్తవాన్ని విస్మరిస్తున్నావేంట్రా నువ్వు. మేఘాంశ్ ఎవ్వడు? ఎడం చేత్తో నువ్వు టిక్కూ టిక్కూమని కీబోర్డ్ మీద బాదితే పుట్టుకొచ్చినవాడు. అపరబ్రహ్మవి రా. నువ్వు సృష్టించకుండా వాడికి పెళ్ళాం, ప్రియురాలూ, తొక్కా, తోటకూరా ఎక్కడి నుంచి పుట్టుకొస్తార్రా? బఫెల్లో’. అంతరాత్మ హెచ్చరించడంతో నాలుక్కరుచుకున్నాడు అతను. అంతరాత్మ అనేది లేకపోతే మనుష్య జాతి ఎప్పుడో అంతరించి పోయేదేమో!  థాంక్యూ మై సోల్ మేట్’ అంటూ అంతరాత్మగాడికి ఓ కాంప్లిమెంట్ పారేసిన శ్రీ వాస్థవ్, ఈమె ఖచ్చితంగా తను ఊహించి రాసిన ఆ ఆకాశరాజు కూతురే అయి ఉంటుంది అనుకున్నాడు.

‘అడ్డడ్డడ్డే…కురుల్లో చందమామ ఉందో? లేదో? చూసే అవకాశం లేకుండా పోయిందే. దీని సిగతరగా ముసుగు. అది లేకపోతే కనపడి వుండేదే…’

ఆమె వయ్యారంగా నడుస్తూ వచ్చి శ్రీవాస్థవ్ ముందున్న కుర్చీలో కాలుమీద కాలువేసుకొని కూర్చొంది. అచ్చం సింహాసనంలో కూర్చొన్న   ఆకాశదేశపు రాకుమారిలానే ఉంది. ఆ నడకలో హొయలు, ఆ కూర్చొన్న భంగిమలోని కులుకూ శ్రీవాస్థవ్ లో అపరిమిత సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. పల్చటి, తెల్లటి చీర ఆమె అవయవ సౌష్ఠవాన్ని కనుమరుగు కానీయలేకపోతోంది.

ఆమె ఊపిరి తీసి విడుస్తుంటే శ్రీవాస్థవ్ కి, ఉచ్ఛ్వాసనిశ్వాసలు నిలిచిపోతున్నట్టనిపిస్తోంది.  అతను ఇక  తన దాహం సంగతి మర్చిపోయాడు. ఆ మోహనాంగి  వ్యామోహంలో పీకల్లోతు కూరుకుపోయాడు. ఎంతోమంది అందగత్తెలకి ఊహల్లో ఊపిరిపోసిన అతను ఆమెనే కనురెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు. బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు అంటారు ఇందుకేనేమో .

ఎగసిపడుతున్న ఆమె హృదయభాగం అతని గుండె లయని మార్చేస్తోంది. ఎంత నిరంకుశత్వం ఆమె అందాలకి. ఎంత కోమలత్వం ఆమె దేహానిది. సన్నగా వీస్తున్న గాలి ఆమె పల్చటి పొట్టమీద చెంగుని అల్లల్లాడించి కదిలించాలని చూస్తుంటే , వంటికి అంటుకు పోయిన ఆ చెంగు ఎంతకీ కదలదేం ఖర్మ.

అయినా పారదర్శకంగా కనీ కనిపించకుండా కనిపిస్తూ, తనని ఊరిస్తున్న ఆ లోతైన నాభి… అందులో ఇంత అద్భుత సౌందర్యం నిక్షిప్తమై ఉంటుందా? అందుకేనా? మూడో మేఘరాజు దానిలో దూకి చావాలనుకొన్నది. అదే జరిగితే ఎంత సుఖమైన చావు నిజంగా. ఆహా, అలాంటి అందమైన చావు తనలాంటి వాళ్ళకే రావాలి తప్ప,  ఏ మేఘరాజుకో  రోగ రాజుకో వస్తే ఒప్పుకునే  ప్రసక్తే లేదు.

తన ఊహాఊర్వశి ద్వాదశి కన్నా ఈమె ఎన్నోరెట్ల అందగత్తె. ముఖారవిందం మినహా ఆ భువనైకసుందరిని  మైమరచి ఆరాధిస్తున్న శ్రీవాస్థవ్  ద్వాదశి గుర్తుకు  రావడంతోనే  ముసుగుకన్య  మైకంలోంచి  బయటపడ్డాడు.

తనలోని అలజడిని తొక్కి పెట్టి, “ఎవరు మీరు? ఎంత సేపట్నుంచి నన్నిలా కట్టిపడేసారు? ఎందుకు ఇలా?” తెచ్చిపెట్టుకున్న తీక్షణతతో ప్రశ్నించాడు.

ఆమె వళ్లంతా కదిలిపోయేలా నవ్వింది. ఆ బొడ్లో దాచుకున్న అమృతం తొణికిసలాడి పోతుందో ఏమిటో. ముత్యాలు జలజలా రాలినట్టు, తొలకరి జల్లు కురిసినట్టుగా ఉందా నవ్వు.

“నేను ఎవరినా? హ హ హా…హ హ హా… హా హా ”

శ్రీవాస్థవ్ లో మాటలు కరువైన మౌనం. ఇంకోసారి నవ్వక పోతుందా అన్న ఆశ.

“నిజంగానే తెలీదా మీకు?” ఆమె మాటలో జాణతనం.

తన ప్రశ్నకి ఆమె ప్రశ్ననే జవాబుగా సంధించడంతో శ్రీవాస్థవ్ లో  ఏదో అనుమానం  మొదలయ్యి, అది క్రమంగా మనసంతా సంతరించుకొంది.

“తెలీదు. ఆ ముసుగు తీస్తేనే కదా తెలిసేది!” లౌక్యం ప్రదర్శించాడు.

“అది అసంభవం …”

ఎన్నో కల్పిత పాత్రలని సృష్టించి, వాటి తలరాతలని శాసించిన శ్రీవాస్థవ్ ఆమెని నిశితంగా పరిశీలించాడు. ‘ఈమె వ్యవహారశైళి చూస్తుంటే మేఘాంశ్ తో  ఏ సంబంధమూ లేనట్టుగా కనిపిస్తోంది. నిజంగానే లేదా? లేక అలా నటిస్తోందా? ఏమో? తనెందుకు బయటపడడం. తను కూడా ఏమీ తెలియనట్టే నటిస్తూ వీళ్లని ఏమార్చి ఇక్కడ నుండి బయటపడాలి ‘ అని నిశ్చయించుకున్నాడు.

“ఇంతకీ మీ పేరేంటో చెప్పనే లేదు ” తన మనస్సులోని భావాలు బయటపడకుండా అడిగాడు.

కొన్ని క్షణాల మౌనం తర్వాత….

“ద్వాదశి…  మీరు పెట్టిందే కదా”  ఆమె గొంతు అదో రకం గమ్మత్తుగా.

” ఏంటీ?  ద్వా….ద…శా…?”  తన చెవులని తనే నమ్మలేకపోయాడు శ్రీ వాస్థవ్.

ఒక్కసారిగా కాలం స్తంభించిపోయినట్టు, కుర్చీతో సహా ఏదో అగాథంలోకి జారిపోతున్నట్టు అనిపించింది అతనికి. వంట్లో నరాలన్నీ చిట్లిపోయేంత ఉద్వేగానికి గురయ్యాడు. రెండో మూడో చిట్లిపోయాయేమో కూడా.

“అవును. ద్వాదశి… మీ నవలానాయికని ” ఆమె మొహంలో చిలిపిదనం.

శ్రీవాస్థవ్ లో అప్పటివరకూ ఉన్న ప్రసన్నత మాయమయ్యింది. ‘ఏంటీ ట్విస్ట్. పొద్దున్న వాడు, ఇప్పుడు ఇది. నాకు పిచ్చెంకించడానికే పుట్టినట్టున్నారు. వీళ్ళిద్దరేనా? ఇంకా ఏదైనా గ్యాంగ్ పని చేస్తున్నదా? ఇంతకీ వాడెక్కడో? మెత్తగా ఊరుకుంటే ఇంక లాభంలేదు ‘ అనుకున్న అతను.

“ఆపండి, మీ డ్రామాలు. అసలు ఎవరు మీరు? ఎందుకిలా చేస్తున్నారు. నా ఫ్యాన్సా? లేకపోతే పిచ్చి ఆసుపత్రి నుంచి కాని పారిపోయి వచ్చారా?” అన్నాడు కోపంగా కుర్చీలోంచి లేవబోతూ. వెనక నుంచి రెండు చల్లటి, గట్టి చేతులు  అతన్నికొంచెం కూడా  కదలనీయకుండా కుర్చీలోకి నొక్కిపెట్టి పట్టుకున్నాయి, బలంగా  పాతేసినట్టు.

చేతులు… చల్లటి చేతులు…

ఏదో గుర్తుకొచ్చినట్టు ద్వాదశి వైపు పరిశీలనగా చూసాడు. తెల్లటి ఆమెచీర, తడిచివుండడం వల్లే ఆమె వంటికి అంటిపెట్టుకుని ఉన్నట్టు అప్పుడు గమనించాడు. అతనిలో ఆవేశం అమాంతంగా  అరికాళ్ళలోకి జారడం మొదలెట్టింది. అతను అలా  ఆగ్రహంతో విరుచుకు పడతాడని ఆమె ఊహించలేదు. అలాగని,  ఆ ఆగ్రహానికి ఆమె బెదిరిపోనూ లేదు.

“ముఖ్యమైన పనిమీద మిమ్మల్ని నేను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. అందుకు మీరు నన్ను క్షమించాలి. మీతో మాకు కావలసిన  పని  అయిపోయింది. ఇంక మేము మిమ్మల్ని విడిచి పెట్టేయాలని అనుకుంటున్నాం ”  సౌమ్యంగా చెప్పింది ద్వాదశి.

‘కిడ్నాప్ చేసారా? ఏంటిది? ట్విస్ట్ మీద ట్విస్ట్. తనే పెద్ద ట్విస్టర్. అలాంటిది తన నవలల్లోని ట్విస్ట్ లన్నిటినీ తనే అనుభవించాల్సొస్తుందేంటి?. ఉదయం తనని వెదుక్కుంటూ వచ్చినవాడు మేఘాంశ్. ఇప్పుడు  ఈ ద్వాదశేమో  తనే నన్ను కిడ్నాప్ చేసానంటోంది. వీళ్లిద్దరూ ఒకటే గ్యాంగా? లేక ఇద్దరూ వేరు వేరా? అసలు ఒకళ్ళతో ఒకరికి పరిచయం ఉన్నట్టా? లేనట్టా? వీళ్ళు నిజంగానే తన కల్పిత పాత్రలా? లేక తనని ఏడిపించటానికి ఎవరైనా పన్నిన కుట్రలో భాగస్వాములా?

నవలలో పాత్రధారులే అయితే. ఒకళ్ళకొకరు పరిచయం లేకుండా ఎలా ఉంటుంది? పగలూ  ప్రతీకారాలూ ఉంటే వాళ్ళ వాళ్ళ ఊహాలోకంలో ఒకరినొకరు కొట్టుకునో, పొడుచుకునో చావాలి కానీ ఇలా వాళ్ళని సృష్టించిన తనతోనే ఎందుకు ఫుట్ బాల్ ఆడుకొంటున్నట్టు?. ఓ సారి కడిగి పారేద్దామా?’ అనుకున్నాడు. కానీ… ఏదో ఆలోచన వచ్చినట్టు మాట్లాడకుండా ఉండిపోయాడు. ఎంతయినా తను రచయిత!.

“కిడ్నాప్ చేసారా? ఎందుకు ”  సాధ్యమయినంత గంభీరంగా అడిగాడు.

“అది దేవ రహస్యం. చెబితే తల వందముక్కలు అయిపోతుందని మీరే చెప్పారు కదా”  కిలకిలా నవ్వింది, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టు.

“నేనా? నేను చెప్పానా? ఎప్పుడూ?” కిందపడి గిలగిలా తన్నుకోవడం ఒక్కటే తక్కువయ్యింది శ్రీ వాస్థవ్ కి. ఏదో తెలీని అయోమయం, అసహనం అతనిలో.

“అప్పుడే మర్చిపోయారా? ‘సంగీతా మేడం చాలా స్ట్రిక్ట్’ కథలో…” అంటూ కిలకిలలని ఇంకోసారి రిపీట్ చేసి కుర్చీలోంచి లేచింది ద్వాదశి. కుర్చీలో ఆమె కూర్చున్నంత మేరా  చెమ్మగిల్లి ఉండడం శ్రీవాస్థవ్ కి కనిపించింది.

సింహాసనం మీద నుంచి లేచి వెళ్ళిన ఆ రాకుమారి ఫ్రిజ్ తెరచి, ఓ ఎనర్జీ డ్రింక్ ని తెచ్చి శ్రీవాస్థవ్ చేతిలో పెట్టింది. ముభావంగా దాన్ని అందుకుంటున్న అతను ఆమె చేతిని తాకాలన్న కోరికని చంపుకోలేక పోయాడు.ఆ చేతిస్పర్శ ఎంతో మృదువుగా ఉంది. కానీ కోరుకున్న వెచ్చదనాన్నివ్వకుండా చల్లదనాన్ని మాత్రమే పంచింది. అయినా సరే, అలాగే  ఆ చేతిని పట్టుకొని ముద్దాడాలనిపించింది అతనికి.

ఇంతలో వెనక నుంచి ఓ అగంతకుడు శ్రీవాస్థవ్ తలకి పిన్ చేసిన,  చిన్న బగ్ లాంటి పరికరాన్ని లాగి తీసుకున్నాడు. అది తన తలలో ఉన్నట్టు  అప్పటివరకూ  శ్రీ వాస్థవ్ గమనించనే లేదు. ఏమిటది? అడిగితే మాత్రం చెబుతుందా? అసలే జగజ్జాణలా వుంది. ఆలోచిస్తూ  శ్రీ వాస్ఠవ్ డ్రింక్ పూర్తిగా తాగేసాడు. అది త్రాగిన తర్వాత, అతనికి వేరే లోకాల్లో విహరిస్తున్నట్లుగా అనిపించింది.  గాల్లో   నడుస్తూ ద్వాదశి దయ్యంలా తన వైపే గాలిలో అలా  తేలుతూ వస్తోంది.

అతని కళ్ళు మూతలు పడుతున్నాయి…

‘తన చేతులూ కాళ్ళూ మళ్ళీ కట్టేసారా? ఏమో. నోట్లో గుడ్డలు కుక్కేసారా? ఏమో. ఇందాకా తన నోట్లో గుడ్డలు లేకపోవడానికి కారణం, తనని ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళి, తన చేత ఏదో విషయం చెప్పించారన్న మాట. అందుకే  తలలో బగ్ లాంటి పరికరాన్ని అమర్చారు అనుకున్నాడు. ఏం చెప్పించారో? ఏంటది?’

గాలిలో తేలుతూ వచ్చిన ద్వాదశిని, తమకంగా ముద్దుపెట్టుకుంటూ, ఆమెని కౌగిట్లోబంధిస్తూ ఆమె మొహాన్ని ఎలాగైనా చూడాలన్న కాంక్షతో మొహం మీద ముసుగుని బలవంతంగా తొలగిస్తుండగా శ్రీవాస్థవ్ స్పృహకోల్పోయాడు.

ఇద్దరు అగంతకులు వచ్చి శ్రీవాస్థవ్ ని బలవంతంగా లేపి,  బయటకి నడిపించుకుని పోయారు.

***

స్పృహలోకి వచ్చిన శ్రీవాస్థవ్ మత్తుగా లేచి నిలబడ్డాడు. అప్పటివరకూ తను ఓ రోడ్ ప్రక్కన ముళ్ళపొదల్లో పడి వున్నట్టు గుర్తించాడు. చేతులకి, కాళ్ళకీ అక్కడక్కడా ముళ్లు గుచ్చుకొన్నాయి. నెమ్మదిగా నడుచుకుంటూ తన తన ప్లాట్ కి బయలు దేరాడు. అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. తలపైకెత్తి చూసాడు. సిరా వొంపినట్టు లేత నీలంరంగులో ఉంది ఆకాశం. ద్వాదశి కురుల్లోంచి రాలి పడలేదేమో?  చంద్రుడు ఇంకా విధులకి హాజరు కాలేదు.

***

శ్రీవాస్థవ్  లిఫ్ట్ లో తన ప్లాట్ కి వచ్చాడు. గోడకి ఉన్న ఇండికేటర్లో పాస్ వర్డ్ కొట్టాడు. తలుపు తెరిచే ఉన్నట్టుగా నీలిరంగు లైటు వెలిగింది. ఆశ్చర్యంగా తలుపు తోసుకుని లోపలకి  వెళ్ళాడు. లైట్ వెలుతుర్లో, ప్లాట్ లో సామాన్లన్నీచిందర వందరగా పడి కనిపించాయి. ఎవరో దేనికోసమో వెతికినట్టున్నారు.

రాక్షసుడిలా కుర్చీలో కూర్చుని ఉన్నాడు మేఘాంశ్. అతని చేతిలోని రివాల్వర్ శ్రీవాస్థవ్ వైపు కర్కశంగా చూస్తోంది.

అతను ఏమీ అనకుండానే  చేతులు ఎత్తి నిలబడిపోయాడు శ్రీవాస్థవ్.

గుడ్,  కూర్చోండి ”

మేఘాంశ్ వంటిమీద  ఇంకా అవే తడిబట్టలు… తలలోంచి కారుతున్న నీళ్ళు…

“భయపడకండి.  నా ప్రశ్నలకి జవాబు చెబితే మీ ప్రాణాలకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ద్వాదశి మీకెంతకాలంగా పరిచయం?”  కరకుగా ఉంది అతని గొంతు.

“అంతా తెలిసి కూడా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారేం? మీరెంత కాలంగా తెలుసో ద్వాదశీ అంతేకాలంగా తెలుసు” చిరాగ్గా చెప్పాడు శ్రీ వాస్థవ్, చేతులు గాల్లోంచి కిందకి దింపుతూ.

“ఓహో అలా వచ్చారా? సరే అయితే. ఇప్పుడు ద్వాదశి ఎక్కడుంది?”

“ఏం పిచ్చా? నవల్లోనే ఉంది కదా ” అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.

“ఆ విషయం నాకూ తెలుసు, నన్ను పొడిచి పారిపోయాక ఎక్కడికి వెళ్లింది? ఏం చేస్తోంది?” కటువుగా ఉంది అతని గొంతు.

మేఘాంశ్ ధోరణి శ్రీవాస్థవ్ కి విసుగు తెప్పిస్తోంది.

“భానుగుడి సెంటర్ లో  పెసర పుణుకులు  అమ్ముకుంటోంది ” వెటకారంగా చెప్పాడు.

“ఎక్కడా? ” అంటూ సెల్ పోన్ తీసి, అతను చెప్పిన వివరాలు టెక్స్ట్ కొట్టుకుంటున్నాడు మేఘాంశ్.

“హహ్హహ్హా ” అంటూ ఒక్కసారిగా పగలబడి నవ్వాడు శ్రీవాస్థవ్ అతను చేసేది చూసి.

ఏం? కామెడీలా? ట్రిగ్గర్ నొక్కానంటే కపాలం పేలిపోద్ది”

“నేను కాదు, మీరు చేస్తున్నారు కామెడీలు. కనీసం ఆధార్ కార్డ్ లేని అనామకులు మీరు… నన్ను కాల్చి చంపడమా? హహ్హహ్హ…”

మేఘాంశ్ చెయ్యి బలంగా గాల్లోకి లేచింది. అది విసురుగా వచ్చి శ్రీవాస్థవ్ దవడని, తాకడంతో కళ్ళు బైర్లు కమ్మినట్టయ్యింది. “మర్యాదగా ” చెబితే వినరా? ఎక్కడ ద్వాదశి? ” గద్దించాడు .

“నాకు తెలియదు అంటే వినరేం? తెలిస్తే  మీకే తెలియాలి. ఎందుకంటే మీరిద్దరూ ఒకే నవలలోని పాత్రలు. నిజంగానే నాకు ద్వాదశి ఎవరో తెలీదు ”

“ఆహో! ద్వాదశి తెలియకుండానే..ఆమె దేవత, దేవదూతా అంటూ రాసేస్తున్నావా?  సరిగ్గా చెబితే చెప్పావ్? లేకుంటే వ్యవహారం మాటల్లోంచి తూటాల్లోకి వెళ్లవలసి ఉంటుంది” హెచ్చరించాడు మేఘాంశ్. అతని సంబోధన ఏక వచనంలోకి మారడం శ్రీవాస్థవ్ గుర్తించాడు.

“ద్వాదశి నా నవల్లో ఓ కల్పిత పాత్ర. అంతవరకే ఆమెతో నాకు సంబంధం. ఇంత వరకూ  వందల్లో అలాంటి క్యారక్టర్లని సృష్టించి ఉంటాను. ద్వాదశి కాకపోతే దశమి. అదీ కాకపోతే పుష్యమి. నాకిష్టమైన పేరు పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవరు?” తనూ ఏకవచనంలోకి దిగాడు శ్రీవాస్థవ్.

“అది ఓ ఉగ్రవాది కనుక. రెడ్ విడో. రెడ్ విడో మొహం ఎలా ఉంటుందో ఇప్పటిదాకా  ఎవరూ   చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా నిఘా బృందాల దగ్గర ఆమెకి సంబంధించి ఒకే ఒక్క పోటో మాత్రమే ఉంది. అది కూడా పదేళ్ళ కిందటి నాటిది. ఈ ప్రపంచంలో ఆమె గురించి అన్ని విషయాలూ తెల్సిన  ఏకైక వ్యక్తివి నువ్వే. అది నీ రాతల వలనే తెలుస్తోంది. చెప్పు ”

“ఎవరూ చూడలేదు అనడం అబద్దం. ద్వాదశిని నువ్వు చూసావ్. చూడకపోతే ఆమె నిన్ను ఎలా దవడ మీద గాయపరిచింది ”  లాజిక్ లాగాడు శ్రీ వాస్థవ్.

“నేను చెప్పేదీ అదే. ఆమె ఉగ్రవాది అని అప్పుడు ఆ సందర్భంలో నాకు తెలియదు. లేకుంటే అప్పుడే  కాల్చిపారేసే వాన్ని. కనీసం ఫొటో అన్నా తీసుకొని వుండే వాన్ని. చెప్పు ద్వాదశి ఎక్కడ? ఎక్కడ దాచావ్ దాన్ని? ”

“నమ్మితే నమ్ము, లేకపోతే కాల్చుకుని చావు. నేను కూడా  ఆమె మొహం ఇంత వరకూ చూడలేదు అంటే నమ్మవేం. ఏవో ఊహలకి రూపం ఇచ్చాను అంతే. ఆమె రెడ్ విడోనా, గుడ్ విడో నా అన్నది నాకు అనవసరం. అయినా ద్వాదశిని సృష్టించినట్టే  నిన్ను సృష్టించింది కూడా నేనే కదా?”

“అదే, ఆ అభిమానంతోనే, నీ మీద ఇంకా గౌరవం మిగిలి ఉంది. లేకపోతే నా ట్రీట్ మెంట్ మరోలా ఉండేది. ఆట్టే టైం లేదు. సహకరించక పోతే దేశద్రోహ నేరం కింద నిన్ను అరెస్ట్ చెయ్యించాల్సి ఉంటుంది. ఉదయం నేను ఇక్కడకి వచ్చి వెళ్ళిన తరువాత, ఐదు గంటలపాటూ నువ్వు అజ్ఞాతంలోకి పోయావు. ఎక్కడకి వెళ్ళావు. ద్వాదశిని కలవడానికేనా? ఆమెకి సంబంధించిన అన్ని వివరాలూ టకటకా చెప్పెయ్యాలి. కమాన్ క్విక్ ” తొందర పెట్టాడు మేఘాంశ్.

‘వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు. నేను ద్వాదశిని కలవలేదు . ద్వాదశే నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయింది అని చెబితే వీడు నమ్ముతాడా? ఎక్కడకి తీసుకు వెళ్ళిందో చూపించు అని చంపుకు తింటాడు. అది తన వల్ల అయ్యే పనికాదు. అసలు ఆ చోటు తనకి తెలిస్తే కదా వీడికి చూపించడానికి. అయినా అదంతా వీడితో చెబితే మళ్ళీ కొత్త తలనెప్పి కొనితెచ్చుకోవడమే. ఓ పని చేద్దాం. ద్వాదశి పాత్ర రూపకల్పనకి మోడల్ లాంటి, ఆ ఊహా ఊర్వశిని చూపిస్తే సరి. ఆమె, ఆ ద్వాదశి కాదు అని తెలిస్తే వీడి దారిన వీడు పోతాడు. ఓ పనై పోద్ది’. మనస్సులోనే అనుకున్న శ్రీవాస్థవ్…

” సరే, అన్నీ వివరంగా చెబుతా కానీ, నేను ప్రొద్దున్న స్పృహతప్పి పడిపోయాకా ఏం జరిగింది? అది చెప్పు ముందు ” అన్నాడు. రాజీకి వచ్చినట్టుగా.

“నిన్ను ఈడ్చుకు వచ్చి, ఆ సోపాలో పడుకో బెట్టాను. రెండురోజులుగా తడిచి ముద్దయిపోతున్నాం కదా? ఫీవరిష్ గా ఉంటే… నువ్వు లేచేలోపు వచ్చేద్దామని డోర్స్ లాక్ చేసి డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. వచ్చేసరికి నువ్ మిస్ కొట్టావ్ ”

‘ఎండ మండిపోతుంటే వీడు వర్షంలో తడిచి చస్తున్నాడా? పిచ్చి ప్రైమరీ స్టేజ్ దాటేసినట్టుంది. కల్పితపాత్రలకి కూడా జ్వరాలూ, తలనొప్పులు వచ్చేస్తే ఈ దేశంలో ఆసుపత్రులు సరిపోయి ఏడుస్తాయా? ‘

” సరే. నా ప్లాట్లో దేని కోసం వెతికారు?”

“నీకూ ద్వాదశికీ మధ్య ఉన్న  సంబంధాలగురించి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని వెతికా. ఇక కాలక్షేపం చాలు. పాయింట్ కి రా”  అంటూ అసహనంగా కుర్చీలోంచి లేచాడు మేఘాంశ్. అతని వ్రేలు రివాల్వర్ ట్రిగ్గర్ మీద బిగుసుకొని ఉంది.

“నాకు తెలిసి… ఇక్కడ తుపాకులు పేలేంత సీన్ ఏమీ ఉండదు అనుకుంటా. దాన్ని నువ్ బేషరతుగా హోల్ స్టర్ లో పెట్టొచ్చు ” అంటూ  ప్రిజ్ దగ్గరకి వెళ్ళి, నీళ్ళు తాగి  దాని మీద పెట్టిన బైనాక్యులర్స్ అందుకున్నాడు శ్రీ వాస్థవ్.

“నువ్వు నమ్ము నమ్మకపో, ద్వాదశి నా ఊహా ఊర్వశి అంతే. ఏడాది కిందట అనుకుంటా, ఓ రోజు మధ్యాహ్నం నేను తూర్పువైపు  ఉన్న ఆ బాల్కనీ లోకి     వెళ్ళేసరికి, అదిగో రోడ్ కి అవతల ఉన్న ఆ అపార్ట్ మెంట్లో ఆ అందాల దేవత కనిపించింది ” చూపించాడు శ్రీ వాస్థవ్.

“అది అందాల దేవత కాదు. అందాల రాక్షసి ” కసిగా అన్నాడు మేఘాంశ్. అతని వెనకే నడుస్తూ.

“నీకలాగా, నాకిలాగా! ఆమె పేరుకూడా నాకు తెలియదు. కానీ. ఆమెని నేను చూసిన రోజు తిథి ద్వాదశి అవడంతో నా కలల చెలికి ఆపేరే  పెట్టుకున్నాను. ఆమె మీద వ్యామోహంతోనే  నా కొత్త నవలకి కూడా అదే పేరు పెట్టాను, ద్వాదశి అని ”  చెబుతూ బాల్కనీ లోకి నడిచాడు శ్రీవాస్థవ్ .

శ్రీవాస్థవ్ చేతిలోంచి, బైనాక్యులర్స్ అందుకొని, వాటిని అతను చెప్పిన ప్లాట్ లోకి జూమ్ చేసాడు మేఘాంశ్.

అప్రయత్నంగా అతని నోటి నుంచి ” బాప్ రే ” అంటూ ఓ కేక వెలువడింది.

“దొరికింది. దీనమ్మా ద్వాదశి దొరికింది. ఆచూకీ దొరక్కుండా ముప్పుతిప్పలు పెడ్తున్న ఆ లం… ఇక్కడకొచ్చి దాక్కొంది” ఉద్వేగంతో ఊగిపోతున్నాడు మేఘాంశ్.

అదోలాంటి రాక్షసానందంతో చిందులు వేస్తున్న మేఘాంశ్ ని  ఫెడేల్ మని  చాచి దవడ మీద కొట్టాడు శ్రీవాస్థవ్.

“ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో ముందు. నీఇష్టంవచ్చినట్టు బూతులు తిడుతున్నావేంటి? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో. ఆమె నా అందాల దేవత.  చంపేస్తా ఎక్కువ చేసావంటే ”  వ్రేలు చూపించి హెచ్చరించాడు.

శ్రీవాస్థవ్ దెబ్బకి ఎంతో  శిక్షణ పొందిన మేఘాంశ్ తూలి ముందుకు పడబోయి నిలదొక్కుకున్నాడు.

“నీయబ్బ. నువ్వు ముందు లోపలకి నడువు. నీసంగతి తర్వాత చూస్తా ” అంటూ రివాల్వర్ కొనని శ్రీవాస్థవ్  డొక్కలో ఆనించాడు మేఘాంశ్.

అతని మొహంలో తొంగిచూసిన కర్కశత్వానికి  శ్రీవాస్థవ్ కి భయం వేసింది. చెప్పినట్టు వినకపోతే కాల్చేసినా కాల్చేస్తాడు అనిపించింది.

శ్రీవాస్థవ్ ని  కుర్చీలో కూర్చో బెట్టిన  మేఘాంశ్, రివాల్వర్  పొజిషన్ లో వుంచే తన యాక్షన్ మొదలు పెట్టాడు. డిల్లీలోని హెడ్ క్వార్టర్స్ కి ద్వాదశిని గురించిన సమాచారం, ఫోన్ లో అందించాడు. క్రింద ఉన్న తన అనుచరులని పిలిచి ఏం చెయ్యాలో చకచకా ఆదేశాలు జారీ చేసాడు. అతను చేసే చేష్టలు శ్రీవాస్థవ్ కి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నిజంగానే  ఏ ఉగ్రవాదినో హతమార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లా ఉన్నాయి అవి.

‘ఇది ఖచ్చితంగా కలే అయి వుంటుంది. ఏదో సస్పెన్స్ నవల చదివినట్టు, భలే థ్రిల్లింగ్ గా ఉంది. కొన్ని కలలు మెలుకువ వచ్చే సరికి మరచిపోతాం. కానీ ఈ కలని మర్చిపోకూడదు. మంచి మిష్టరీ నవలగా రాసి పడెయ్యాలి. తనకి కల కూడా బాగా కో ఆపరేట్ చేస్తోంది. కొంచెం కూడా కంటిన్యుటీ తప్పడం లేదు. కానీ మేఘాంశ్  ద్వాదశిని ఉగ్రవాది అనడం అతను తట్టుకోలేక పోతున్నాడు.

“నీకేమన్నా పిచ్చా? ద్వాదశి నిజమైన మనిషి. ఆప్ట్రాల్ నేను సృష్టించిన ఓ కల్పిత పాత్రవి నువ్వు. నాకు మండిందంటే నిన్ను ఏదో ఒకటి చేసి చంపేస్తాను. కంప్యూటర్ ఆన్ చేస్తే నిమిషం పని అది నాకు” హెచ్చరిస్తూ కుర్చీలోంచి లేవబోయాడు.

“నువ్ చెప్పింది కరెక్టే. ముందు  నేనే నిన్ను చంపి పారేస్తే, ఆ తర్వాత నన్ను డిస్టర్బ్ చేసే వాడే ఉండడు. ఏమంటావ్?” రివాల్వర్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లోకి తెచ్చాడు  మేఘాంశ్.

టిక్..టిక్…టిక్…. క్షణాలు దొర్లుతున్నాయి. శ్రీవాస్థవ్ భయంతో గుటకలు మ్రింగుతున్నాడు. మేఘాంశ్ కాల్చేసేవాడే.

ఇంతలో అతని ఇద్దరు అనుచరులూ,  ఓ కొత్త వ్యక్తిని వెంటబెట్టుకొని పైకి వచ్చారు. అతనూ మిగతా వాళ్ళలాగానే తడి తడిగానే ఉన్నాడు.

“వీడిని ఏదైనా తాడుతో కట్టిపడేయండి” ఆదేశించి, ఆ కొత్త వ్యక్తి వైపు తిరిగాడు మేఘాంశ్.

“లిప్ మూమెంట్ ని బట్టి అక్కడ వచ్చే సౌండ్ ఏమిటో నాకు కరక్ట్ గా చెప్పాలి. ఓకేనా?” కిటికీలోంచి ద్వాదశిని చూపిస్తూ  అడిగాడు మేఘాంశ్  ఆ కొత్త వ్యక్తి తో.

” ష్యూర్ సర్ ” అన్నాడు అతను. బైనాక్యులర్ జూం చేసుకొని.

“ఆమె ముందు, ఓ నలుగురు వరకూ ఉన్నారు సర్. ఆమె మాట్లాడేటప్పుడు ఆ కదలికలని బట్టి, మనకి అర్థం అవుతోంది సార్ అది ”

కామెంట్రీ  చెబుతున్నట్టు చెబుతున్నాడు అతను.

మిగతా వాళ్ళతోపాటు శ్రీవాస్థవ్ కూడా ఆ కామెంట్రీ  వింటున్నాడు.

……………

“ట్రెల్జిడ్రిన్ టెన్ యం.జి. ”

రాసుకుంటున్నాడు మేఘాంశ్ అనుచరుడు ఒకడు.  మేఘాంశ్ ఫోన్లో టెక్స్ట్ టైప్ చేస్తున్నాడు.

వింటున్న శ్రీవాస్థవ్  నోరు బార్లా తెరిచాడు.

“సిట్రాబెట్రిన్ ట్వంటీ యం.జి.”

శ్రీవాస్థవ్ లో గుండె కొట్టుకుంటున్న వేగం పెరిగి,  లబ్ డబ్ బదులు ‘ దడ్ దడ్ ‘ మనడం మొదలెట్టింది.

“సిట్రాబెట్రిన్ కాదు అది. సిట్రాబెట్రిగ్జాన్ “  అంటూ మధ్యలోకి దూరకుండా ఉండలేకపోయాడు.

మేటర్ టైప్ చేస్తున్న మేఘాంశ్ ” నీకెలా తెలుసు?  అసలు ద్వాదశితో పరిచయమే లేదన్నావ్? ఆ పేరు కూడా ఉట్టుట్టి పేరే  అని దబాయించావు” అంటూ శ్రీవాస్థవ్ దగ్గరకి వచ్చాడు. కౄరంగా మారింది అతని గొంతు.

“నిజంగానే ఆమె నాకు పరిచయం లేదు. కానీ ఈ డ్రగ్ కాంబినేషన్స్ మాత్రం నావే. ప్రొద్దున్న నేను స్పృహ తప్పి పడిపోయాకా కళ్ళు తెరిచే సరికి ఓ గుర్తు తెలీని ప్రదేశంలో ఉన్నా. అక్కడ మొహానికి ముసుగేసుకున్న ఓ యువతి వుంది. నా పేరు ద్వాదశిని అని చెప్పింది. కానీ నేను అది నమ్మలేదు.

నీకు లాగానే అది కూడా ఓ పిచ్చిది అయి ఉంటుంది అనుకున్నాను. నిన్ను కిడ్నాప్ చేసాం.   పని అయిపోయింది కాబట్టి వదిలేస్తున్నాను అంది. అప్పుడు నాకు అర్థం కాలేదు.  బహుశా వాళ్ళు నన్ను ట్రాన్స్ లోకి పంపి,  ఈ డేటా లాగేసి ఉంటారు. ఆ టైంలో నా తలకి ఓ బగ్ లాంటిది కూడా తగిలించి ఉంది ” జరిగిన వాస్తవం చెప్పాడు శ్రీ వాస్థవ్.

” ఏమిటా డ్రగ్ కాంబినేషన్స్? ఎందుకు పనికి వస్తాయి అవి? ”

“ద్వాదశి నవల క్లైమాక్స్ లో రాజమహేంద్రవరం నుంచి కెనడాకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్లయట్ ని ఉగ్రవాదులు పేల్చి వేస్తారు. ఎన్నో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న ప్రస్తుత తరుణంలో ఒక ప్లయిట్ ని ప్రేల్చి వెయ్యడం అనేది ఎవరికైనా ఎలా సాధ్యం? ఓ సూసైడ్ బాంబర్ కి, ఈ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి ప్లైట్ ఎక్కిస్తారు.  అతను  ఈ  మాత్రలు మింగగానే  కడుపులో రసాయన చర్య జరిగి,  పెద్ద విస్ఫోటనం సంభవిస్తుంది. దాంతో తీవ్రవాదుల లక్ష్యం నెరవేరుతుంది ”

అతను చెబుతుంటే మేఘాంశ్ దవడ కండరాలు బిగుసుకున్నాయి. నుదుటి మీద చిరు చమట్లు అలుముకున్నాయి.

శ్రీవాస్థవ్ మాటలు పూర్తికాకుండానే ” ఓహ్ గాడ్ ” అంటూ  చాచి పెట్టి అతని మొహం మీద కొట్టాడు.

కుర్చీతో సహా  ముందుకు తూలిపడ్డాడు శ్రీవాస్థవ్. పడ్ద కుర్చీని వంగి పైకి లేపాడు మేఘాంశ్.

“ఏం అనుకుంటున్నావ్? ఏమిటి నువ్వు చేస్తున్న పని? నేరస్థులకి కొత్త కొత్త టెక్నిక్స్ నేర్పిస్తున్నావా? షూట్ చేసి పడేస్తా  ” ఆవేశంగా రివాల్వర్ లాక్ తీసాడు .

“ఆ కాంబినేషన్నే కాదు.  నిన్నూ ఆ ద్వాదశినీ కూడా నేనే సృష్టించాను. అది మర్చిపోకు ” దవడ మీద రుద్దుకుంటూ అన్నాడు శ్రీ వాస్థవ్.

“నువ్వు సృష్టించిన పాత్ర అయినంత మాత్రాన ఎవరిని చంపెయ్యమంటే వాళ్ళని చంపేసి, దేన్ని తగలబెట్టెయ్యమంటే దాన్ని తగలేసెయ్యాలా? మీరు మీ క్రియేటివిటీతో నేరాల్నీ నేరస్థులనీ పెంచి పోషిస్తారు. మీరు సృష్టించే మేము మాత్రం మిమ్మలని ప్రశ్నించకూడదు.  మీతో మంచిచెడ్డల గురించి విడమరచి మాట్లాడకూడదు. అంతేనా? చంపేస్తా నా కొడకా” అంటూ రివాల్వర్ ని తిరగేసి శ్రీవాస్థవ్ తల వెనక భాగంలో బలంగా కొట్టాడు.

కళ్లముందు రకరకాల రంగులు కనిపించాయి శ్రీవాస్థవ్ కి.

ద్వాదశిని నిలువెల్లా సుతారంగా ముద్దాడిన అతను, ఆమె ఆహ్వానం మేరకి ఆమెని అలాగే తన కౌగిట్లో బంధించి, తలమీద ముసుగుని తొలగించాడు.  ఆమె, తన కలల చెలి ద్వాదశీ  ఒకరే.

ఇ…ద్ద…రూ… ఒ….క…. టే టేటే. మగతగా…  నిద్రకమ్ముకొచ్చేసింది అతనికి.

***

భారతకాలమానం ప్రకారం శ్రీవాస్థవ్ లేచే సరికి ఉదయం  తొమ్మిది అయింది. తలంతా దిమ్ముగా ఉంది. వళ్ళంతా ఒకటే నొప్పులు.  గోడమీద డిజిటల్ క్లాక్ లో డేటు చూసాడు. 13 ఏప్రిల్ 2025.

‘అరే, ఈరోజు నా బర్త్ డే. మరిచేపోయాను ‘ అనుకున్నాడు.  హాలుమధ్యలో కార్పెట్ మీద పడుకొని ఉన్నాడు అతను.

‘భలే కల. పనికొచ్చే కల. తను సృష్టించిన క్యారెక్టర్లే తనతో ఆడుకోవడం ఏమిటి? ఆట కాదు అది వేట’

‘అబ్బా  దవడమీద, మెడమీదా  మేఘాంశ్ కొట్టిన దెబ్బలు ఇంకా సలుపుతూనే ఉన్నాయి’

‘అదేమిటీ? దెబ్బలేమిటి? సలపడం ఏమిటీ?  అంటే ఇది కలకాదు, నిజం. అవును పచ్చి నిజం ‘

నిన్నటి నుంచీ వరసగా జరిగిన సంఘటనలన్నిటినీ గుర్తు చేసుకున్నాడు.

‘ఏరీ? వాళ్లెవరూ కనపడ్డం లేదు. ఏమై పోయారు వాళ్ళు? ‘

దిగ్గున లేచి బైనాక్యులర్ పట్టుకొని బాల్కనీలోకి పరిగెత్తాడు.

ఆకాశంలో మబ్బులు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి. పగలే చీకటిలా ఉంది.

ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ వైపు బైనాక్యులర్స్ ఫోకస్ చేసాడు.అద్దాలకి అడ్దుగా కర్టెన్లు వేసి ఉన్నాయి. ఎక్కడా ద్వాదశి కనపడలేదు. ఏదో ఆలోచన వచ్చి త్వర త్వరగా రడీ అయి, నడుచుకుంటూ ఆమె ఉండే ఆ అపార్ట్ మెంటుకి వెళ్ళాడు.

లిప్ట్ దగ్గర వాచ్ మన్ అడ్డం పడ్డాడు.

“క్యాహోనా” అడిగాడు అతను.

“ప్లాట్ అద్దెకి కావాలి”

“టీక్ హై, తెలుగా ” అంటూ తన వెంట రమ్మన్నాడు వాచ్ మన్.

“రాత్రి పోలీసులు వచ్చారెందుకు “  అడిగాడు శ్రీవాస్థవ్ ఆరా తీస్తూ.

“పోలీసులా? అలాంటిది ఏమీ లేదేం ?” ఆశ్చర్యంగా అన్నాడు వాచ్ మన్.

తర్డ్ ప్లోర్ లో ఆగింది లిప్ట్. అదే ప్లాట్.  కిటికీలోంచి ద్వాదశి తనకి కనిపించే అదే ప్లాట్.   డోర్ తెరిచాడు వాచ్ మన్.

“ఇదొక్కటే ఖాళీగా ఉంది. అద్దె 20 వేలు, అడ్వాన్స్ రెండు నెలలు”

“ఎన్నాళ్ళయ్యింది, ఇది ఖాళీ అయి? ”

“సంవత్సరం అయ్యి ఉంటుంది. యు.యస్.కి పోయారు వాళ్ళు ”

శ్రీవాస్థవ్ కాళ్ళల్లో  ఎలాంటి వణుకూ మొదలవ్వలేదు. ఇలాంటి షాక్ లకి నిన్నట్నుంచీ అతను అలవాటు పడిపోయి ఉన్నాడు . ప్లాట్ లో  అవే కుర్చీలు, అదే పెర్ఫ్యూం పరిమళం. ప్రతి గదీ తిరిగి చూస్తున్నాడు. బాల్కనీ లోంచి దూరంగా తన ప్లాట్ కనిపించింది. సోఫా పక్కన తాగి పడేసిన  ఎనర్జీ డ్రింక్ టిన్ కనిపించింది. అది తను త్రాగి పడేసిందేనా? ఏమో.

‘ఫుల్లీ పర్నిచ్డ్. ఒక్కో గదికీ ఒకో టి.వి. ఉంది ” అంటూ వాచ్ మన్ టీవీని ఆన్ చేసాడు. టీవీ చూస్తున్న శ్రీ వాస్థవ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి.

కెనడా ఎయిర్ పోర్ట్ లో ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్లయిట్  కి తృటిలో తప్పిన ముప్పు. టేబ్లెట్ బాంబ్ తో  ప్లయిట్ ని, పేల్చి వేయడానికి ఉగ్రవాదుల కుట్ర. లేడీ టెర్రరిస్ట్, రెడ్ విడో డోరతితో పాటూ మరో నలుగురి అరెస్ట్.  బి.బి.సి.న్యూస్ చానల్లో స్క్రీన్ మీద బ్రేకింగ్స్ నడుస్తున్నాయి. యాంకర్ న్యూస్ చదువుతుంటే విజువల్స్ పడ్తున్నాయి.

ముసుగుతో ఉన్న ద్వాదశికి  హ్యాండ్ కఫ్స్ వేసి తీసుకొస్తున్నారు కాప్స్. కుట్రని భగ్నం చేసిన కెనడా రక్షణ శాఖ అధికారి మైఖేల్ రొనాల్డ్, కుట్రని ఎలా భగ్నం చేసిందీ ఆసక్తికరంగా చెబుతున్నాడు.

అతని దవడ మీద, అప్పుడప్పుడే మానుతున్న పొడవాటి గాయపు మచ్చ పచ్చిపచ్చిగా కనపడుతోంది.

ఆ ప్లాట్ నుంచి రెండే రెండు అంగల్లో శ్రీవాస్థవ్ బయట పడ్డాడు. లిఫ్ట్ గురించి ఎదురు చూడకుండా చకచకా మెట్లు దిగి కిందకి వచ్చేసాడు.

సన్నగా వర్షం పడుతోంది. అయినా ఆగకుండా పదే పది నిమిషాల్లో తన ప్లాట్ కి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు.     అతని వ్రేళ్ళు కీబోర్డ్ మీద చక చకా పరిగెడుతున్నాయి.

బయట సన్నగా మొదలైన వర్షం కుండపోతవర్షంగా మారడాన్ని అతను గమనించే స్థితిలో లేడు.

**** (*) ****