కథ

ఆట

నవంబర్ 2017

నంబూరి సూర్యనారాయణరాజుగారు ఆస్థిపరుడే కాదు, మంచి చదరంగం ఆటగాడు కూడా. ఇప్పటిదాకా ఆయనతో చదరంగం ఆడి గెలిచినోళ్ళు, మా చుట్టుపక్కల పదూళ్ళలో ఎవరూ లేరు. ఊళ్ళో వాళ్ళంతా సూర్యనారాయణరాజు గారిని మేకల సూర్రాజు అంటారు.

ఆ యీడు రాజులకుండే… చుట్ట, బీడి, సిగరెట్టు, మద్యం, నస్యం, పేకాటా లాటి అలవాట్లు సూర్రాజు గారికి లేవు. అంతెందుకు? కాఫీ, టీలకి కూడా ఆయన ఆమడ దూరం. పరగడుపునే ఓ శేరు పొదుగుకాడి మేకపాలు పుచ్చుకుంటారాయన. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని మేకలని కూడా మేపుతుంటారు. ఈ మేకలని మేపడానికి వారి మకాల్లో ఇద్దరేసి మనుషులు పని చేస్తుంటారంటే అర్ధం చేసుకోవచ్చు మేకలపెంపకం అంటే ఆయనకి ఎంత శ్రధ్ధో. అందుకనే ఆయనకి మేకల సూర్రాజుగారని పేరొచ్చింది.

ఆయన్నీ, ఆయనాడే ఆటనీ చూసి, అంతా సూర్రాజు గారిని చాలా డిగ్నిఫైడ్ మనిషనుకుంటారు. కానీ… అది అబద్దం. తానో డీనోటిఫైడ్ మనిషినన్న నిజం ఆయనొక్కరికి మాత్రమే తెలుసు. ఎందుకంటే సూర్రాజుగారికి రిమ్మ తెగులుతోపాటు బాగా సినిమా పిచ్చి.

‘ కనీసం కోడిపందెం కూడా వేయని, ఆ సూర్రాజేం రాజురా? ‘ అని సూర్రాజు వెనకాల అందరూ గేలి చేసినా, ఆయన సమక్షంలో మాత్రం… ఈ సూర్రాజు చంకనాకండిరా, సగవన్నా బాగుపడతారు అని మెచ్చుకుంటూ వుంటారు కొంతమంది పెద్దరాజులు. వాళ్లకి సూర్రాజుగారికున్న రిమ్మతెగులు గురించి తెలీక. లేకపోతే ‘ అమ్మ నియ్యమ్మ సూర్రాజోయ్… ‘ అని దిమ్మ తిరిగి పడి పోయేవాళ్ళే. అలాటి పనులు నలుగురికీ తెలిసేలా చేస్తే సూర్రాజు సూర్రాజే అవుతాడు కానీ, చదరంగం ఆటగాడెలా అవుతాడు?

సూర్రాజు గొప్పదనం ఆకట్టుకొనే ఆయన ఆటలో వుందా? లేకపోతే… ఎదుటివాళ్ళ ఆట కట్టించే తీరులో వుందా? అంటే చెప్పడం కొంచెం కష్టం. ఆయన స్థాయికి ఇంకొకరెవరైనా అయితే అంబాసిడర్ కారులో తిరుగుతారు.అనవసర ఆడంబరాలకి వెళ్ళని సూర్రాజు ఎక్కడకెళ్ళినా అంబర్ సైకిల్ మీదే వెళతారు. ఏడాదికో సైకిల్ మార్చేసే ఆయన, పాత సైకిల్ ని కొన్న రేటుకంటే ఎక్కువకే అమ్మడం ఇక్కడ గమనించదగ్గ అంశం.

తెల్లటి పేంటూ చొక్కాతో, అంబర్ సైకిల్ మీద హుషారుగా తిరిగే సూర్రాజుగారి జేబులోంచి ఫెలఫెల్లాడే కొత్త వందరూపాయల నోట్లు ఏసమయంలోనైనా జిగేల్మంటుంటాయి. ఆయన దగ్గరనుంచి యాలికపండు వాసన సర్వవేళలా గుబాళిస్తూ వుంటుంది. చొక్కా కాలర్ వెనకాల మడతపెట్టి పెట్టుకునే తెల్ల జేబురుమాలు చొక్కా రంగులో కలిసిపోయి వుంటుంది. చేతికి పోచ్చీ, వేళ్లకి ఉంగరాలు, మెడలోకి పులిగోరు గొలుసూ వున్నా ఆయన వాటిని వేసుకొని తిరగరు. అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడాలేకుండా సైకిల్ మీద తొలాట, మలాట సినిమాలకి తిరిగే ఆయన్ని… ఎవరైనా అటకాయించి, లాక్కూపోతారన్న భయం. సమయపాలన వున్న మనిషి కాబట్టి వాచ్చీ మాత్రం తగిలించుకుంటారు. ఎంత కష్టపడి వ్యయసాయంచేసినా, ఏడాదికో ఎకరం తెగనమ్ముకునే రైతులున్న ఊల్లో… ఏడాదికో రెండెకరాలు కొనే సూర్రాజు విజయగాధ వెనక, ఆయన చదరంగం ఆటదే ప్రధాన పాత్ర.

ఏదైనా ఓ వ్యూహం ప్రకారం నడుచుకోవడం, ఆ ఆట ఆయనకి నేర్పింది. మేకల సూర్రాజు పొలం కొనాలనుకుంటే స్వంత ఊరిలో దాన్ని అరిచ్చచ్చినా కొనరు. అది తన చేను పక్క చేనయినా సరే… పొరుగూరిలోనే కొనుక్కుంటారు. ‘ పొలమంతా ఒకే చోట వుంటే…. వానొచ్చినా, వరదొచ్చినా, చీడట్టినా, దోమట్టినా మొత్తం పోతుంది. అదే నాలుగైదు చోట్ల వుంటే, ఒకచోట కాకపోతే మరో చోటైనా చేతికొస్తుంది ‘ అదీ ఆయన వాదన. ఇలాటి ఆలోచనలన్నీ… ఆయనకి చదరంగం ఆడ్డం వల్లే అబ్బాయని చెప్పడం ఏమాత్రం ఆక్షేపణీయంకాదు.

***

అరుగుమీద స్తంభానికి ఆనుకుని కూర్చున్న సూర్రాజుగారు, వైట్ అండ్ వైట్ లో టిప్ టిప్ గా వున్నారు. ఇంకోరోజు అయితే, ఈపాటికి ఆయన ముందు చదరంగం బల్ల సిద్దంగా వుండేది. ఈరోజు ఆయనో ముఖ్యమైన పని పెట్టుకున్నారు. అందుకనే ఒకళ్ళిద్దరొచ్చి, ఓ ఆట ఆడదామని అన్నా… ఇవాళకి కుదరదు, పనుందని చెప్పి పంపించేసారు. ఆ పనిమీదే ఎవరికోసమో ఎదురు చూస్తూ… కూర్చున్నారు.

పనంటే, అదేం పెద్ద పని కూడా కాదు. పిల్లంక మకాంలో మేకలు మేపటానికి, ఓజత పని మనుషులని కుదుర్చుకోవడమే.

‘ఇంకా రాలేదీటీళ్లు… ‘ మనస్సులోనే అనుకొని వాచ్చీ చూసుకున్నారు.

‘ అబ్బో… పదకొండు ‘ రాజులు భోంచేసే టైం అయింది.

పోనీ, భోజనానికి లేద్దామా? అనుకున్నంతలో… గేటు తోస్తున్న అలికిడయ్యింది.

ఓ నడి వయస్సు ఆడది, అదే వయస్సు మగాడూ వస్తూ కనపడ్డారు.

ఈ మధ్యే సూర్రాజుగారు, పిల్లంకలో రెండెకరాల పొలం కొన్నారు. అందులో ఓ మూల మేకల కోసం రెండు గదుల చావిడి కూడా వెయ్యించారు. బోడి రెండు మేకలకి అంత చావిడి అనవసరం కదా? అందుకే మేకలతోపాటూ వ్యవసాయాన్నీ దగ్గరుండి చూసుకోవడానికి ఓ జోడీని పనిలోకి పెట్టుకోవాలనుకున్నారు. ఆయన అన్ని మకాల్లోనూ చేసేదే ఇది. ఊల్లో వాళ్లని పనిలో పెట్టుకోవడం ఆయనకి సుతరామూ ఇష్టం వుండదు. అందుకే పనోళ్ళని పొరుగూళ్ళనుంచి పిలిపించుకుంటారు. గోపులంకలో వున్న ఓ బంధువుకి పనోళ్లు కావాలని చెబితే… ఆయన వీళ్ళని పంపించారు.

వాళ్ళని చూడగానే… సూర్రాజుగారి మొహంలో చిరాకు తొంగి చూసింది.

‘ఈ వయస్సులో వీళ్ళేం పని చేసి ఏడుస్తారు? ఆపసోపాలు పడతా కూర్చుంటారు. వీళ్ళని పంపిన ఆ చిట్టిరాజుకి బుద్దుండక్కర్లా? ‘ మనస్సులో అనుకున్నారు.

వాళ్ళవెనకే… కాంత దూరంలో ఇంకో పెళ్ళీడుపిల్ల కనపడ్డంతో ఆయన మొహంలో చిరాకు మటుమాయమయ్యింది.

సూర్రాజుగారిలో చదరంగం ఆటగాడు వెంటనే మేల్కొన్నాడు. మొదటి ఎత్తు వేసేందుకు సిద్దమయ్యాడు.

వాళ్ళు దగ్గరకి రాగానే…

” ఎవరువాయ్? ఏం ఇలా వొచ్చేరు ? ” అంటూ గంభీరంగా ప్రశ్నించారు. వాళ్లెవరో తనకి తెలీనట్టు. ఓ కంట ఆ పిల్లని పరిశీలిస్తూ.

” గోపులంకనించి చిట్రారంపేరండి. తవరి మకాంలో కవతానికి, ఓ జోడా కావాలన్నారంట కదండె. మీరు సూర్రారే కదండి ” అడిగింది ఆ ఆడమనిషి .

దానికి వయసంటే మళ్లింది కానీ వళ్లెక్కడా వడలలేదు. మొహంలో కళెక్కడా చెదరలేదు. ‘ మంచి వయస్సులో వుండగా కుర్రోళ్ళని తన చుట్టూ బొంగరాల్లా తిప్పేసుకునుంటది ‘ అనుకున్నారు సూర్రాజు. బహుశా ఈ పిల్ల దాని కూతురో… మనవరాలోఅయ్యుండాలి. దగ్గరి పోలికలు కనబడుతున్నాయి. ఆల్చిప్పల్లాంటి కళ్ళు టపటపలాడిస్తూ మాట్లాడకుండా చూస్తోందాపిల్ల.

” మరేండి…” అన్నాడు మగాడు. అది చెప్పింది నిజమేనన్నట్టు.

‘ వాడ్ని అడిగితే… ఇది సమాధానం చెబుతోంది ‘ అంటే… కొంపలో దీనిదే పెత్తనం అన్న మాట. వాడు మెతక. కొంగుచాటు మొగుడన్నమాట!’ అని ఆయనలోని ఆటగాడు ఓ నిర్ధారణ కొచ్చేడు.

” జోడాని… రమ్మంటే, ఇంటిల్లిపాదీ వచ్చేసినట్టున్నారే? ”

” ఆయ్… ఇది మా మనవరాలండీ. ఎదిగిన దాన్నొక్కదాన్నీ ఒకళ్ళింట్లో వుంచలేం గాదండీ… ”

” ఏం? పెళ్ళి చేసిపంపేలేపోయేరా? ” అనడిగారు. ఆ పిల్లని క్రీగంట చూస్తూ. పెళ్లి మాటెత్తగానే దాని బుగ్గలు సిగ్గుతో నున్నబడ్డాయి.

” అందుకోసవే కదండి, మాకీ పుర్రాకులు ” చెప్పింది ఆడ మనిషి.

” జీతం బత్తెం మా చిట్టి మావయ్యతో డుకున్నారు కదా! ”

” ఆయ్…”

” సామాన్లేయి మరి? తెచ్చుకోలేదా!”

” గేటు గుమ్మంకాడెట్టేసొచ్చేవండి… ”

” అలాగైతే సరే… మీరు మన పిల్లంక మకాం కాడకెళ్లిపోండి. నేనెనకాలే సైకిలు మీదొత్తాను. ఇంగో వెళతా వెళతా కావాల్సిన వెచ్చాలు కొనుక్కెళ్లిపోండి. పాపం ఎప్పుడు తిని బైలుదేరారో ఏంటో? ఆ మాణిక్కాలమ్మ గుడిపక్కన భద్రంకాపు వొటేలుంటది. నాలుగు, నాలుగు ఇడ్డెన్లు తినేసి పొండి… ” అంటూ ఫాంట్ జేబులోంచి రెండ్రూపాయల కట్ట ఒకటి తీసారు.

పనోళ్ళ ఆకలి గురించి అంతగా ఆలోచించిన సూర్రాజుమీద వాళ్ళకి అమితమైన గౌరవం పెరిగిపోయింది.

” ఏం పేరు… నీ పేరు? ” సూర్రాజు దర్పంగా అడిగారు. ఆ పిల వైపు చూస్తూ…

” చంద్రి … చంద్రమ్మ ”

” నాపేరేనండి… మా ఆయన పేరు అబ్బాయండి ” అందుకొంది పెద్ద చంద్రమ్మ.

” ఇదిగో…తీసుకో…” అంటూ నోట్లకట్ట అటుచాపారు.

చంద్రి కదల్లేదు. మెదల్లేదు.

” ఇచ్చుకోయే… పర్లేదు ” వాళ్ళ మామ్మ తొయ్యడంతో… చంద్రి ముందుకో అడుగు వేసి, ఆ నోట్లకట్ట అందుకొంది. ఇచ్చేటప్పుడు సూర్రాజు చేతిని సుతారంగా దాని చేతులకి తాకించారు. అది దాన్ని పట్టించుకొందో… లేక పట్టించుకోనట్టు నటించిందో.

రెండో ఎత్తు కూడా అయిపోయింది. మూడో ఎత్తుతో ఈ ముసలిదాని నోరు ముయ్యించేస్తే… నాలుగో ఎత్తు నాటికి ఈ చంద్రిని మంచమెక్కించెయ్యొచ్చు. సూర్రాజులో వున్న ఆటగాడు బలంగా నిశ్చయించుకున్నాడు. అలా జరగాలంటే… ముందు ఈ ముసలిదాని కాళ్ళకి పిల్లపెళ్ళి అనే తాళ్లతో బంధం వెయ్యాలి. నిర్ణయించుకున్నారు సూర్రాజు.

” అయిగో… ఆ పాక లో కట్టేసున్న ఆరెండు కంచి మేకలనీ మీతో తోలుకుపోండి ” చెప్పారాయన.

అబ్బాయి వెళ్ళి, ఆ మేకలు రెండిటినీ తాళ్లు పట్టుకొని తీసుకు వచ్చాడు.

‘ లింగు లిటుకని… రెండు మేకలని కాయడానికి, ఇద్దరు మనుషులని నెలనెలా జీతవిచ్చి ఈ పిచ్చిమారాజెందుకు మేపుతున్నాడో ? ‘ అందరికీ కలిగే సందేహమే… చంద్రికీ కలిగింది. ‘ ఎవరిట్టం ఆళ్ళది. ఆయన డబ్బు ఆయన తగలేసుకుంటాడు’ అందరిలాగే అదీ అనుకొని సరిపెట్టుకొంది.

***

పురి విప్పి … అందులో ధాన్యాన్ని, ఇద్దరు మనుషులు కాటా ఏసి బస్తాలు కుడుతున్నారు.

ఇంకో ఇద్దరు వాటిని ఎడ్లబళ్ళకెక్కిస్తున్నారు.

మసకపిల్లి పాలేరు, సత్తులు గాడ్ని పిలిచిన మేకల సూర్రాజుగారు…

” ఒరేయ్… వీటిని తోటపేటలో నల్లపరాజోరి ఉప్పుడుమిల్లుకి తోలుకెళ్లు. ఫలానా మేకల సూర్రాజుగారియ్యని చెప్పు చాలు. ఆళ్ళు ఇడ్లీ నూకాడేస్తారు. బస్తాలు దించేసాకా సోగ్గాడి బండుంచుకొని, పొట్టోడి బండి పంపెయ్యి. వచ్చేటప్పుడు చిట్టు యర్రపోతవరం రాంబాబు కొట్లోను, తవుడు మసకపల్లి ఆదినారాయణ కొట్లోనూ దింపేసి, నూక బస్తాలు ఇంటికి చేరేసెయ్యండి. రాత్రికి దాచ్చారం భీమేశ్వరా మిలట్రీ హొటేల్లో భోంచేయండి. ప్లేటు పదిరూపాయలు, కోడి పులావు బాగుంటదక్కడ. ఆకేటోరి హాల్లో యశోధకృష్ణ సినిమా మళ్ళీ ఏసారంట, అది మలాట చూడండి. నిద్రట్లేటు కదా అని ఆ ఈది, ఈ ఈధి చూద్దామని సరదాపడకొండెరేయ్… పోలీసులు పట్టుకుంటే లేనిపోని తలనెప్పి… ఫలానా సూర్రారి మనుషులని తెలిస్తే తలకొట్టేసినట్టవుద్ది. తెల్లారేటప్పటికి ఆట అయిపోద్ది కాబట్టి బండ్లోనే పడుకొని బస్తాలెత్తుకుని బయలుదేరి వచ్చెయ్యండి ” విశదీకరించి చెప్పి… కొంత డబ్బిచ్చారు. ఆయనంతే… ఎవరి శ్రమా దోచుకోడు.ఏదో రూపాన ప్రతిఫలం ముట్టచెప్పేస్తారు.

బళ్ళోళ్ళూ, సత్తులూ కూడా ఆయన చూపించిన అభిమానానికి ఉబ్బి తబ్బిబ్బయ్యారు.

బళ్ళు బయలు దేరే సరికి పొద్దుగూకింది. రాజుల భోంచేసే గాలేస్తోంది.

చేపలకూరతో సుష్టుగా భోంచేసిన సూర్రాజు యానాం తొలాట సినిమాకి వెళ్ళొస్తానని ఇంట్లో చెప్పి, అంబర్ సైకిల్ ని యానాం వేపు గాకుండా మసకపిల్లేపు తొక్కడం మొదలెట్టారు.

***

పదకొండు గంటలకల్లా పద్దతి ప్రకారం భోంచేసేసి… చదరంగం బల్ల, పావులపెట్టితో అరుగుమీదకి వచ్చారు సూర్రాజుగారు.

ఆయన రాకకోసం ఆవురావురుమంటా ఎదురుచూస్తున్నారు ఇంజరం మూర్తి. మూర్తి గొప్పురేవు హైస్కూల్లో లెక్కల మేస్టరు. ఒక్కసారైనా సూర్రాజుగారి ఆటకట్టించాలన్న కసి మూర్తిలో రోజురోజుకీ పెరిగి పెద్దదవుతోంది.

ఇద్దరి మధ్యా ఆట మొదలయ్యింది.

తొలి ఎత్తు మూర్తిదే…. వేసారు.

ఒకళ్ళ తర్వాతఒకళ్ళు. ఎత్తుకు పై ఎత్తులు నడుస్తున్నాయి.

” ఎంత బుర్ర బద్దలుగొట్టుకున్నా… మీ ఆటలాగే, మీరూ అర్ధంకారండి రాజుగారూ ” అన్నారు మూర్తి.

” ఏవంటారు…? ”

” అందరూ… వడ్లమ్మితే, మీరు నూకమ్ముతారు. అందరూ గేదెలని కాస్తే… మీరు మేకలని కాస్తారు”

” అందరూ నడిచే దారిలో మనం నడకూడదండి. అవసరాలకి తగ్గట్టు నడుచుకోవాలండి. ఎదటోళ్ళ అవసరమే మనకి కొత్త అవకాశాలనిస్తుందండి. అందరిలాగా వడ్లమ్మేం అనుకోండి, బస్తాకి వాళ్ళకొచ్చే ఆ నూట ఎనభయ్యే మనకీ వొస్తాయి. అదే నూక చేసి అమ్మేవనుకోండి నాలుగొందల నలభైయండి బస్తా. వస్తువునెప్పుడూ వస్తువుగా చూస్తే… ఎప్పుడూ దాని విలువ పెరగదండి. దాని బహురూపాలుగా మారిస్తేనే విలువ పెరుగుద్దండి. ఒక విషయం చెప్పమంటారా? అవసరాలు, అవకాశాలు వాటికవి పుట్టవండి… మనమే సృష్టించాలి. అదండి కిటుకు. అది తెలుసు కాబట్టి ఏడాదికింతని మనం కొంటున్నాం… మిగతా వాళ్ళు అమ్ముకుంటున్నారు. అంతకి మించి ఏమీ లేదండి ”

పావుల్లో తనకిష్టమైన గుర్రాన్ని మప్పుతూ చెప్పారు సూర్రాజుగారు.

ఎత్తువేయడం ఆపి… సూర్రాజుగారి మొహంలోకి చూస్తూ వుండిపోయారు మూర్తిగారు.

” తవరే… ఎత్తు ఎత్తాలండి ” గుర్తు చేసారు సూర్రాజు.

” మీ మేక పాల తెలివితేటలముందు మా ఆటలు సాగట లేదండి”

ఓ సారి బల్లంతా కలచూస్తూ అన్నారు మూర్తిగారు. ఓ భటున్ని ముందుకు తోస్తూ.

” మేకపాలని అలా చులకనగా అనుకుంటారు కానండి, మేకలతో చిన్నా చితకా యాతన అనుకుంటున్నారేంటి? మా చెడ్డ ఇబ్బందండి. పచ్చగా ఏది కనిపిస్తే దాన్ని లట్టుక్కున కొరికేస్తాయి. మళ్ళీ అది చిగురు పట్టడం అంటే దానమ్మా మొగుడు తరం కాదండి. అందుకే వాటి మీద ఎక్కడలేని దృష్టీ … పెడతాను. ప్రత్యేకంగా ఓ మనిషినెట్టి … ఎవరి మొక్కా, మోటుకీ కరవకుండా, మన ఆకూ అలమే దగ్గరుండి మేపిస్తాను. అలవాటైన ప్రాణం కదండీ… ఆ కాసిని పాలచుక్కలకోసం తప్పదండి… ” సూర్రాజు చెబుతుంటే, మూర్తిగారికి ఏ ఎత్తు వేయాలో అర్ధం కాకుండా వుంది.

” మీరు మీ పాల గురించెంత ఆలోచిస్తారో… పక్కోళ్ళ మొక్కలగురించి కూడా అలా ఆలోచిస్తారు కాబట్టే మీకింత గౌరవమండి ” అంటూ ఓ భటుడితో సూర్రాజు శకటుని వేసేసారు మూర్తిగారు.

సూర్రాజుగారి పెదాలమీద ఓ వంకర నవ్వు మెరిసింది.

” ఆయ్…ఏదో, మీ బోటోళ్ళ పుణ్యాణ ఇలా గడిచిపోతున్నాయండి రోజులు. మీ రాజుకి చెక్ ” చెప్పి అరుగు దిగారు సూర్రాజు.

సూర్రాజు ఎత్తుని అంచనా వేయలేని మూర్తిగారి బుర్ర గిర్రున తిరిగింది. ఎక్కడ పప్పులో కాలేసానా? అని ఆలోచించడం మొదలెట్టారు.

దూళ్ళపాకలో కూర్చొని మేకపిల్లలతో ఆడుకుంటున్న…. కోలంక పాలికాపుసింహాద్రిని పిలిచారు సూర్రాజు గారు.

” ఒరేయ్… నువ్వు ఈ అటుకుల మూటనట్టుకెళ్లి, కాకినాడ పేర్రాజుపేటలో రెడ్డి బాబూరావుగారని మన ప్లీడరుగారుంటారు. అక్కడెవల్నడిగినా తీసుకెళ్ళి మరీ చూపిస్తారు ఆయన ఇల్లు. లేపోతే బస్టాండులోదిగి రెండు రూపాయలిస్తే రిక్షావాడు దర్జాగా తీసుకుపోతాడు. ప్రయాణం కూడా సుఖంగా వుంటది. మరీ సందరడిపోయిందనుకో… మీసాల్రాజుగారి హొటేల్లో ఓ పలావు కొట్టేసి, రాజుగారి ఆనంద్ హాల్లో ఎంటీవోడి ‘ అగ్గిబరాటా ‘ ఆడుతోంది. అది చూసి అటూ ఇటూ రెండుసార్లు రోడ్లంట తిరిగితే తెల్లారిపోద్ది. పొద్దున్నే తొలిబస్సెక్కొచ్చేయి. సినిమా నిద్దరోకుండా చూడొరేయ్… మళ్ళా నాకు రేపొద్దున్న స్టోరీ చెప్పాలి. చాన్నాళ్ళయ్యింది అగ్గిబరాటా చూసి, కధ మర్చిపోయేను ” చెప్పారు. వాడి చేతిలో ఓ వందకి చిల్లర నోట్లు పెట్టి.

” అలాగేండి ” అంటూ సింహాద్రి అరుగు మీదున్న చిన్న అటుకులమూట తలకెత్తుకున్నాడు.

మూర్తిగారు ఉసూరుమంటూ… ఇంటికి వెళ్ళడానికి సైకిల్ తీసారు.

ఆయన వైపు వెళ్ళిరమ్మన్నట్టు నవ్వుతూ చూసారు సూర్రాజుగారు.

సూర్యాస్తమయంకి ముందే… అలవాటు ప్రకారం భోంచేసేసిన సూర్రాజుగారు యర్రపోతవరం సినిమాకి వెళ్ళొస్తానని ఇంట్లో చెప్పి, అటువైపుగాకుండా కోలంక మకాం వేపు సైకిల్ తొక్కారు.

***

అలసి పోయిన సింహాద్రి పెళ్ళాం చుక్క అటు తిరిగి పడుకొంది. దాని పక్కలో విశ్రాంతి తీసుకుంటున్న సూర్రాజు గారి మనస్సు ఎప్పుడూ లేంది ఏదో కీడు శంకించింది. వారగా తెరుచుకున్న కిటికీ తలుపు గాలికి కొట్టుకుంటోంది. కిటికీ తలుపు వెయ్యడం మర్చిపోయారా? లేపోతే ఎవరైనా బలవంతంగా తెరిచేరా?

చప్పుడు కాకుండా కిటికీ దగ్గరకి వెళ్ళి చూసారు.

ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ దూరంగా చెట్టు కింద నిలబడి బీడీ కాలుస్తున్నాడు సింహాద్రి. గుప్పు గుప్పున పొగ గాల్లో కలుస్తోంది. వెన్నెల రాత్రులు కావడంతో స్పష్టంగా కనిపిస్తున్నాడు. వాడి బీడీ పొగే తనని అప్రమత్తం చేసింది అన్నమాట.

బయట వాడు. లోపల వాడి పెళ్ళాం. దాని పక్కలో తను. బయట పడాలంటే గదికి వెనక తలుపు లేదు. అంతా అయోమయం.

సింహాద్రి నిలబడ్డ చోట నుంచి చావిడి వైపు కదిలాడు.

కిటికీ పక్కనుంచి పక్కకి కదిలారు సూర్రాజు.

ఇప్పుడేం జరుగుతుంది?

అయనలోని చదరంగం ఆటగాడు, టక టక ఆలోచింఛడం మొదలెట్టాడు.

అంటే వాడు తమని… చూసేసాడన్నమాట. అయినా కానీ వాడు లోపలకి రాలేదంటే… వాడి ఎత్తు ఏమయ్యి వుంటది.

మళ్ళీ ఓ సారి కిటికీలోంచి చూసారు. వాడు నెమ్మదిగా తన అంబర్ సైకిల్ ని స్టాండు తీసి దొర్లించడం మొదలెట్టాడు.

సూర్రాజుగారి గుండె దడదడలాడింది. వాడి ఎత్తు ఏమయ్యి వుంటది?

ఎత్తు ఒకటి… తన సైకిల్ తీసుకెళ్ళి, దాచేసి… తర్వాత దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం.

ఎత్తు రెండు… దాన్ని ఏకాలవలోనే… తొక్కేసి తన కసి తీర్చుకోవడం.

ఎత్తు మూడు… సైకిల్ తీసుకెళ్ళి ఊరిలో అందరి ముందూ ప్రవేశపెట్టి, తన బండారాన్ని బయట పెట్టడం?

ఎత్తు నాలుగు… వాడికి అవసరం వచ్చినప్పుడల్లా డబ్బు కోసం వేధించడం.

అంతేనా ఇంకా అయిదూ… ఆరూ ఎత్తులు ఏమైనా వుండి వుంటాయా?

వాడు ఎందుకో… మూడో ఎత్తే, వేస్తాడని ఆయన లోని ఆటగాడు గట్టిగా తీర్మానించాడు.

ఎందుకంటే… వాడికి తనని చంపాలని వుంటే, ఈపాటికి తలుపులన్నీ బయటనుంచి గొళ్ళెంపెట్టి చావిడికి కసిగా నిప్పంటించేసేవాడే. అలా జరగ లేదంటే… వాడు ఖచ్చితంగా మూడో ఎత్తే వేస్తాడు. దానికి చెక్ పెట్టాలి ఎలా? ఎలా? అయినా వీడు కాకినాడనుంచి ఇంత తొందరగా ఎలా తిరిగొచ్చేసాడు? చిత్రంగా వుందే? ఈ పనికిమాలిన ఆలోచనలు తర్వాత. ముందు ఈ బందిఖానా నుంచి త్వరగా బయటపడాలి.

ఇంకోసారి కిటికీ లోంచి చూసారు. సింహాద్రి సైకిల్ తొక్కుకుని పోతున్నాడు.

తలుపు గడియ తీసి తెరవబోయారు. రాలేదు. లండీ కొడుకు గొళ్ళెం పెట్టేసాడు.

ఆలస్యం చేయకూడదు. తన పరువు గంగలో కలిసిపోయే క్షణాలు తరుము కొచ్చేస్తున్నాయి. ఎత్తుకి పై ఎత్తు వెయ్యాలి. ఈ గండం నుంచి బయటపడాలి.

వాడికే అన్ని వెధవ తెలివి తేటలుంటే…? కాకలుతీరిన చదరంగం ఆటగాడు సూర్రాజుగారికి ఇంకెన్ని తెలివి తేటలుండాలి? ఇలాటి సందర్భం ఒకటి ఎదురయితే ఏం చేయాలో ఆయన ఊహించకుండా వుంటాడా? దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోకుండా వుంటాడా?

కనిపించిన ఓ తువ్వాలు అందుకొన్న సూర్రాజు రెండో గదిలోకి వెళ్ళి వెనక గోడని చేత్తో తడిమారు. అక్కడ, ఇటుకలు సిమెంట్ చేయకుండా వట్టి మట్టితో కట్టి వుంది గోడ. బలంగా రెండు తన్నులు తన్నేసరికి అవతలకి పడిపోయాయి ఇటుకలు. మనిషి పట్టేంత సందు. బయట వెన్నెల వెలుగు. ఆ వెన్నెల రాత్రిలో… ఊరి వైపు కాకుండా రెండో వైపు చేలగట్లకడ్డంపడి ఆయన రోడ్డెకారు.

నడుస్తూ నడుస్తూనే…. తనని ఎవరూ గుర్తుపట్టకుండా చొక్కా విప్పేసి, తలకి పాగా చుట్టేసారు. రోడ్డెక్కితే ఏబస్సో…లారీయో… దొరక్కపోదు.

***

భూమి బద్దలయిపోలేదు.

ఆకాశం విరిగి పడిపోలేదు.

అన్ని రోజుల్లాగే సూర్రాజుగారికి ఆరోజూ తెల్లారింది.

అలవాటు ప్రకారమే ఆయన పొదుగుకాడ మేకపాలు శుభ్రంగా పుచ్చుకున్నారు.

రాత్రి నిద్రలేకో… ఏమిటో… కొంచెం కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి అంతే.

ఆ తరువాత…

రోజూలాగే, పల్చటి గుడ్డతో శుభ్రంగా సైకిల్ తుడుచుకుని స్నానానికి లేచారు.

సైకిల్?

అవును సైకిలే!

స్నానం చేసి, వైట్ అండ్ వైట్ వేసుకొని… ఓ యాలిక పండు నములుతూ పోయి మేడమీద గదిలో వాలు కుర్చీలో కూర్చున్నారు. అక్కడ నుంచి చూస్తే అద్దాల్లోంచి రోడ్డుమీద వచ్చే పోయేవాళ్లు కనిపిస్తూ వుంటారు.

ఆయన ఊహించింది నిజమే… సింహాద్రిగాడు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి వాకిట్లో దిగాడు.

ఆ సైకిల్ ని ముందు పెద్దయ్యగారిదగ్గరా, చిన్నయ్యగారిదగ్గరా ప్రదర్శనకి పెట్టి, తర్వాత ఊళ్ళో పెద్దలందరినీ పంచాయితీకి పిలిచి, ఆ తర్వాత తాను చావిట్లో బంధించిన సూర్రాజుని చూపించి వెధవని చేసి వదలాలని… వాడి ప్లాన్.

కానీ వాడి ప్లాన్ అంతా తలక్రిందులయ్యింది.

వాకిట్లో నిగ నిగ లాడుతున్న సూర్రాజుగారి ఫారిన్ అంబర్ సైకిల్ చూసి వాడు బిత్తర పోయాడు. తన కళ్ళని తాను నమ్మలేక దాని చుట్టూ తిరిగి మరీ చూసాడు. ఎప్పుడూ లేనిది… హేండిల్ బార్ మీద నం.సూ.రా. అని సూర్రారి పేరు కూడా రాసి వుంది. ‘ ఇక్కడ సైకిల్ వుందంటే… అక్కడ గదిలోంచి సూర్రాజు తప్పించుకున్నాడన్న మాట. హమ్మ రాచనంజికొడుకు ఎంత గొప్ప దెబ్బేసాసేడు. వెధవ పని చేసాడు తను. రాత్రంతా పిచ్చికుక్కలా రోడ్లమీద అక్కడకీ…. ఇక్కడకీ తిరగకుండా అక్కడే కాపలా కాస్తే సరిపోను. ఇప్పుడేం చేయాలి? ఆయన సైకిల్ ఆయన దగ్గరే వుంది.పైగా దాని మీద పేరొకటి. ‘ ఆలోచిస్తూ రెన్నిమిషాలు జుట్టు పీక్కున్నాడు సింహాద్రి.

వాడిని పైనుంచి దడదడలాడే గుండెలతో… ఓ కంట కనిపెడుతున్నారు సూర్రాజుగారు. కానీ ఆ విషయం వాడికి తెలియదు.

‘ ఇప్పుడు తన చేతిలో ఉన్న ఈ సైకిల్ ని సాక్ష్యంగా చూపించి, సూర్రారిని వెధవని చెయ్యాలని చూస్తే… నలుగురూ తననే తన్ని తరిమేస్తారు ‘ అటూ ఇటూ చూసాడు. నయమే… తనని ఈ సైకిల్ తో ఇంకా ఎవరూ చూడలేదు. ఎవరొకరు చూసేలోపు దీన్ని వదిలించేసుకోవాలి… తర్వాత సంగత్తరవాత అని నిర్ణయించుకున్నాడు.

వెంటనే సైకిల్ తొక్కుకుంటూ పోయి ఏటిగట్టున తేలాడు. ఏమీ ఎరగనట్టు సైకిల్ ని గోదాట్లోకి తోసేసాడు. దాంతో వాడి హృదయం తేలికపడింది. ఓసారి మునిగిపోతున్న సైకిల్ వైపు కసిగా చూసి ఇంటి దారిపట్టాడు.

సింహాద్రి అలా వెళ్ళగానే ఇలా మేడ దిగిన సూర్రాజుగారొచ్చి అరుగుమీద కూర్చున్నారు.

సింహాద్రి అప్పుడే కాకినాడనుంచి తిరిగివస్తున్నట్టుగా వచ్చి ఆయన ఎదురుగా నిలబడ్డాడు .

ఇద్దరూ తేలుకుట్టిన దొంగల్లా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. కానీ ఎవరూ ఏమీ బయట పడలేదు.

” ఏరా ప్లీడరుగారున్నారా? ఇదేనా రాడం ” ప్రేమగా అడిగారు సూర్రాజుగారు. ఏమీ జరగనట్టే.

” ఆయ్… కానీ ఆనందాల్లో అగ్గిబరాటా మారిపోయిందండి. ఏదో… వింగ్లీష్ సిన్మా ఆడతంది. తీరా టిక్కట్టు తీసేసానుగందా అని అదే చూసొచ్చానండి. ఒక్క ముక్కద్దం అవలేదు. ఆముక్కే… చెప్పెళదారనొచ్చేను. ఇంకెళ్ళొత్తానండి మేకలిప్పే టైం అయ్యింది. ” తనకీ ఏమీ తెలనట్టే నటించాడు సింహాద్రి కూడా.

వాడు సెలవు తీసుకొని ఇంటి వైపు బయలుదేరాడు.

వాడి కళ్ళల్లో కదిలే బాధ సూర్రాజుగారి దృష్టిని దాటిపోలేదు. ఓడిపోయానన్న బాధ కాదది… గెలవాలన్న కసి. అచ్చం ఇంజరం మూర్తి కళ్ళల్లో కసిలాటిది.

తన ఆటలో కిటుకు వీడికి అర్దమైపోయింది. వీడి ముందు ఇక తన ఆటసాగదు.

ఆట తీరు మార్చుకోవాలి.

ఆట తీరు మార్చుకోవాలా? ఎందుకు?

ఎవరితో ఆడుతున్నాడు తను ఆట? నూకలిస్తే మేకలు కాసే తన మనుషులతోటా? ఎంత దుర్మార్గం.

చ… ఇంక తను ఆట మానేయాలి. మనస్సులో అనుకున్నాననుకొని పైకే అనేసారు సూర్రాజు గారు.

రాత్రికి రాత్రే… కాదనకుండా, లేదనకుండా ఓపిగ్గా తనకో కొత్త అంబర్ సైకిల్ బిగించి ఇచ్చిన ద్రాక్షారామ సైకిల్ స్టోర్స్ ఓనర్ వీర్రాజుకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ.

లేకపోతే ఈపాటికి… హమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది.

**** (*) ****