ఆడియో

ప్రళయ కావేరి కథలు

ఏప్రిల్ 2017


టైమ్ మెషీన్ లో కూర్చుని గతకాలంలోని ఒక ప్రాంతాన్ని సందర్శించ గలగడం ఫాంటసీ. కొన్ని పుస్తకాలు ఈ ఫాంటసీని దాదాపుగా నిజం చేయగలుగతాయి. స.వెం.రమేశ్ గారి ‘ప్రళయ కావేరి కథలు’ అలాంటి ఒక టైమ్ మెషీన్. అన్నట్టు, ఈ కథల్లో ఫాంటసీలకీ సముచితమైన చోటుంది.

సాంకేతికత, ప్రభుత, వ్యాపార శక్తుల ప్రయోగ ప్రమేయాలు… కారణాలేవైనా, సంఘజీవనం అంతకంతకూ వేగంగా మార్పులు చెందుతూ పోతోంది. ఒక మార్పును అర్థం చేసుకుని సర్దుబాటయేలోగా మరిన్ని కొత్త మార్పుల రాకతో నేటి సమాజపు జీవితాలలో కుదురు లేకుండా పోతోంది. ఈ కుదురు లేకపోవడమనేది బాగా తక్కువగా వున్న కాలంనాటి ఒక సమాజాన్ని మెల్ల మెల్లగా తెరలు తీసి చూపాయీ “ప్రళయ కావేరి కథలు”.

పన్నెండేళ్ల మనవడిని కలిగిన అవ్వాతాతల మాటల్లో సల్లాపాలు దాదాపు వాళ్లు మాట్లాడుకున్న ప్రతి సందర్భంలోనూ కనిపిస్తాయి. తన అక్క కూతురు గేణమ్మ (బహుశా జ్ఞానమ్మ కు రూపాంతరం కావొచ్చు) తనకు మరదలౌతుందనీ తన మనవనికి మరో అవ్వ అవుతుందనీ పరిచయం చేస్తాడు తాత. ఆ వెంటనే అవ్వ, ‘అరవయ్యేళ్ల ఈ తాతకు మరదలు కావలసివచ్చిందని’ దెప్పుతూ, గేణమ్మను ఆ మనవనికి అత్తగానూ, తాతకు కోడలి వసర గానూ తీర్మానిస్తుంది. ఈ దెప్పిపొడుపుకోసమే ఆ తాత ముందు అలా అని వుంటాడేమో.

ఈ గేణత్త వచ్చి, అవ్వకు చేదోడుగా ఎన్ని పనులు చక్కబెట్టిపోతుందో చదివితున్నప్పుడు కొన్ని దశాబ్దాలనాటి పల్లెటూళ్లూ, సున్నమూ ఎర్రమన్నూ పూసుకొన్న మట్టిగోడలూ మన కళ్లముందు మెదులుతాయి. రాబోయే తరాలకు ఇవి బహుశా కార్టూన్లూ మహా అయితే వీడియోలు, Primal Survival లాంటి టీవీ కార్యక్రమాల వల్ల మాత్రమే ఊహలకు అందవచ్చు.

“చిత్తిరినెల్లో చింతకాయలవాన పడితే, ఆడ్నించి యింక దిబ్బెరువు కయ్యల్లోకి మోసేది, గెనివార, అడుసుదుక్కులు, మానుతోలేది, పట్రతోలేది, మొలగ్గట్టేది, నారు పెరికి నాటేది, కలుపుతీసేది, చాడేసేది, పిండేసేది, మడవతిప్పేదీ, మందు కొట్టేదీ, పైరు కోసేదీ, పనమోపులు కట్టేదీ, సామినేసేది, పిడేటు కొట్టేదీ, తూర్పారబట్టేదీ, …” ఇలా సేద్యపు క్రమం కనిపిస్తుంది. యంత్రాల రాకతో ఇందలో రెండుమూడు పనులు కలిపి ఒకేసారి జరిగిపోతున్నా యీ రోజుల్లో. పల్లెల్లో ఆయా పదాల వాడకం కూడా తగ్గిపోతోంది. ఒకప్పటి జీవితాల చిత్రణపై వెలుగును ప్రసరించే ఇలాంటి కథల్లో తప్ప ఇంకో రకంగా ఈ పదాలను అర్థవంతంగా పునఃపరిచయం చేసుకోవడం అసాధ్యమోమోనిపిస్తుంది. మన భాషలో వాడుకలో లేని పద సందప ఇంత వుందా అని ఆశ్చర్యం కలిగింది. ఇది కేవలం ఒక చిన్న ప్రాంతానికి చెందిన వ్యవసాయాధారిత సమాజం నుంచిన వచ్చిన మచ్చుతునక మాత్రమే. ఇతర వృత్తుల, జీవనశైలుల్లో ఇంకెంత వుందో వుండేదో ఊహించుకోవచ్చు.

ఒక మనిషిని కళ్లజూసినంతనే మరో మనిషి కళ్లు గొప్ప ఆనందంతో వెలగడం — అనుభవంలో వున్నదే అయినా, ఇదే అనుభూతిని “ముఖం ‘పొద్దుతిరుగుడు పువ్వంత’ కావడం”గా చదివినప్పుడు కళ్లు మెరుస్తాయి. “ప్రళయకావేరి కథలు” ఇలాంటి మెరుపుల్ని అడుగడునా మెరిపించింది.

పాతబడి, అందువల్ల కొత్తగా కనిపించే పదాలు పుటలకొద్దీ పుట్టలుపుట్టలుగా ఉన్నాయీ కథల్లో. ఒకోసారి ఈ పదాలను పరిచయం చేయడమే ముఖ్యోద్దేశ్యంగా రాశారేమోననిపించే సంభాషణలూ కనిపించాయి. జల్లలదొరువు పిల్లల ఆటలను ప్రస్తావించే ఒస సంభాషణ ఇందుకు ఉదాహరణ. అయినా, చదువుతూపోతున్నప్పడు ఈ వరవడిలో ఇదేమంత ఇబ్బందిగా అనిపించలేదు.

పొట్టచెక్కలయ్యేలా నవ్వించే హాస్యపు సన్నివేశాలకూ, కంటతడిపెట్టించే సన్నివేశాలకూ, గగుర్పాటు కలిగించే వర్ణనలకూ ఇలా నవరసాలూ ఒలికించిన కథలిందులో వున్నాయి. వీటిని చదువుకోవడం నిస్సందేహంగా ఒక మధురానుభూతి.

***

ఉత్తర పొద్దు కథ వినండి:

పార్టు 1:

పార్టు 2:

పార్టు 3:

పార్టు 4:

**** (*) ****



మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)