కవిత్వం

వీడ్కోలు తర్వాత

మే 2017

అంత సంతోషం వెనకా ఒక దుఃఖపు తెర సాయంకాలపు నీడై పరివ్యాప్తి చెందుతుంది
వెలిగే నవ్వుదీపపు సెమ్మె కిందొక దిగులునీడ అలాడిన్ రాక్షసుడై వళ్ళు విరుచుకుంటుంది
ఆప్యాయంగా కలిసిన చేతుల లోంచే రానున్న వియోగం వెచ్చని స్పర్శై హెచ్చరిస్తుంది
మన ఉద్విగ్నభరిత క్షణాలన్నీ కదలబొయే రైలు కూత వేటుకు పావురాలై నేల రాలుతాయి

పంటినొక్కు కింద దాగిన పెదవి వొణుకూ
గొంతులోకి యెగబాకిన దుఖపు జీరా
మొహంలోకి చూడలేని వాలుచూపులూ
మొత్తంగా ఒక అసంగతపు సంభాషణం

తిరిగి నువ్వొస్తావేమో కాస్సేపని బోసిపోయిన ప్లాట్ ఫాం మీదే తారట్లాట
కొంచెంగా దిగిన కైపులోంచి అప్పటికి మాత్రం తెలిసొస్తుంది

మన వియోగమే శాశ్వతం కలయిక తాత్కాలికం

అయినా కాళ్ళు మాత్రం మనం వొచ్చిన దిక్కుకే నిర్దాక్షిణ్యంగా దారి తీస్తాయి

ఇందాక ఆ దారిన వచ్చిన నీ అడుగుల సవ్వడి రహస్యపు కలల్లోని నీడై వెంటాడుతుంది
నీ కొసం వెతుకులాట కొన్ని ఏకాంత సంధ్యల్లొ కొన్ని కవిత్వ చరణాల్లొ కొన్ని అర్ధం లేని చిలిపి నవ్వుల్లో
నీ కొసం వెతుకులాట సరిగ్గా నువ్వు లేని గది మూలల్లో
నువ్వు నడిచిన పున్నాగ చెట్ల కింద పార్కు బెంచీ మీద ముడుచుకొని పడుకొన్న బిచ్చగాడి స్వప్నాల్లో

మళ్ళీ నువ్వొచ్చేదాకా మధురమైన పీడకలలా మనకొక జ్ఞాపకపు చెమ్మ మిగిలే ఉంటుంది
అందాకా అది తీయని బాధై ఓదార్చుతుంది
గది మూలల దాగిన ఒంటరి ఒత్తిడి
తడి రోడ్డు పక్క దుమ్ము కింద అణగారిన మల్లె పొదై విచారంగా గుబాళిస్తుంది.