కవిత్వం

స్లీపింగ్ విత్ ది ఎనిమీ

జూలై 2017

అందాకా ఒకరి చుట్టూ ఒకరం గిరికీలు కొట్టి ఆ రోజును సమీపిస్తాం

ఒక ఆగర్భ శత్రు జంట పట్టు చీరల సఫారీలో నడిచొస్తుంది
పనేమీ లేని పులొకటి తన జింకను కావిలించుకుని కార్లోంచి దూకుతుంది
రోసిన బతుకుల్లోంచి కాసేపన్నా ఆనందిద్దామని
రాష్ట్రం నలుమూలలనుంచి ఒకరూ అరా ఊడిపడతారు
మొత్తాని కో టర్కీ కోళ్ళ గుంపు షామియానాను నింపుతుంది

వెతికి పట్టి మనని దొరక బుచ్చుకొని
వరసలు కట్టి మరీ వీపులు చరుస్తారు
జరగ బోయేదొక మహత్కార్యం కాబోలని నమ్మేస్తాం -
బ్రాహ్మడూ నల్లమేక కథ చదవలేదు కదా!

ఒకడెవడో నన్ను ఉప్పెక్కించుకొని పందిరంతా తిరిగేస్తుంటాడు
బహుశా నీ తండ్రి కావచ్చు
ఇంకొకతె నీ బుగ్గలమీద మెటికలు విరుస్తుంటుంది
బహుశా నా తల్లి కావచ్చు
ఇంకెవడో తుఫాను హెచ్చరికల్ని అరిచేస్తుంటాడు
బహుశా పురోహితుడు కావచ్చు

ప్రమాదాన్ని సూచిస్తూ డప్పులో డ్రమ్ములో బాదేస్తారెవరో
“చావండి మీ అమ్మల” న్నొట్టొక రాళ్ళ వర్షం కురుస్తుంది

బతుకంతా ఆ రోజు కోసం పరితపించిన వాళ్ళం
ఆ ఘడియను సమీపిస్తాం
పళ్ళూడిన వాళ్ళెవరో తలుపు గడియ బిగిస్తారు
బోసినోళ్ళతో కాసిని బూతులు మాటాడి కావలి కాయనారంభిస్తారు

బతుకంతా ఆగదిని పంచుకోవల్సిన వాళ్ళం
పరిచయాలు ఆరంభిస్తాం
శాస్త్రానికి కాస్సేపు తలలూపుతూ
హుక్కులో గుండీలో ఊడబీకుతుంటాం

అందాకా వేగిపోతున్న వాళ్ళం
ఆ క్షణాన్ని సమీపిస్తాం
మన జీవాన్ని మింగేసిన కొండచిలువొకటి
పిప్పి పిప్పిగా ఊసేస్తుంది

కళ్ళు తెరిచే సరికే ద్వేషం నిండినకళ్ళతో…

అందాకా ఒకరి చుట్టూ ఒకరం గిరికీలు కొట్టిన వాళ్ళం
ఇక ఎవరి చుట్టూ వాళ్ళమే పరిభ్రమిస్తుంటాం
కాకపోతే…
ఇకనుండీ భూమి నేనూ చంద్రవంక నువ్వూ…