కవిత్వం

ఆత్మగౌరవపు పాట

15-ఫిబ్రవరి-2013

ఏమూలకో నెట్టబడ్డ
ఈసమాజపు మూలవాసిని
నిండావిస్తరించుకున్న
నా జీవనం
నిలువెల్లాదురాక్రమణ
చీల్చబడ్డ పెయ్యచెప్పిన
చివరిమాట
“తలెత్తుకు బతకాలి”
నాకష్టం కానిదేదీ
నాదికాదు
ఎవడిదో జుర్రుకొనేతత్వం కానిది
చూపుడువేలుదారి నాది
నేలతల్లి పేగుతెగని
చివరిగుడిశ వాన్ని
అవును
నేను మూల్ నివాసిని

*

ఎదురీత
కంటి అంచున
ఎగజిమ్మే
రక్తపుచార
సొంతింటి కల
నెరవేరని చివరిచూపు
బతుకువెలితినిదాచే
కనురెప్పలమౌనం
ఎన్నటికీతెగని దుఖపుజీర

ఆదిభూమిసాచ్చికంగా
గివి నా గురుతులు

*

అవును
నేన్
ఆదిమవాన్ని
అన్నీవుండిబతికినవాన్ని
బతికిచెడ్డవాన్ని
చెడిబతుకుతున్నవాన్ని
అవును
నేన్
మూలవాసిని
పెట్టడమేతెల్సినవాన్ని
పంచడమే ఎరిగినవాన్ని
ఎంచడంతెల్వనోన్ని
రగలడామేతప్ప
రగల్చడం చేతగానోన్ని
సుదీర్ఘ
నీటినాగరికతపొడుగునా
ఎముకలేని అరచేతి వాన్ని
బొటనవేలునిచ్చిన వాన్ని
శ్లోకం మింగిన శోకాన్ని
అనేకానేక
పరిష్వంగాల్లోనలిగిన గుండెను
అందుకే
ఇన్నిపొద్దుల
అంటరానిదిగావున్న
అక్షరాన్ని
నా కలంలోనింపి కురిపిస్తున్నా
రక్తగాత్ర కవిత్వం
నిప్పుల్లోకాగిన డప్పుభాష లో
గుండెలనుండి ఉబికొస్తున్న
కన్నీటి ఘోష ఇది.
అదిగో
తూరుపుదిక్కున
కరకరపొద్దు
ఆత్మగౌరవపు పాటపాడుతూ…