కవిత్వం

మట్టిపాదం

ఫిబ్రవరి-2014

నన్నునే నిలబెట్టుకోవడమే
తెల్సినోన్ని
తలవంచడం
నేర్వనోన్ని
భూమిని తడిపేది
నాచమటేనని తెల్వని వాడికేం చెప్పను
నీలం చేసిన గాయంగురించి

ఓటు సీటుల
సంగతులు నేర్వని
నాజీవితంల చిరిగిన
పుటల గురించి తెల్వని
వాడికేం చెప్పను
దూదిపూల దుఃఖం గురించి

మిద్దెల అంచున
వేలాడే పెయ్యల గురించి పట్టని
వాడికేం తెల్సని
నాగురించి పుటలల్లనింపుతడు

ఏ పుస్తకం తిరగేసినా
పానం పిసుక్కసత్తంది
మెతుకుదొరకని దినాలలెక్కచెపుదమంటే
నన్ను రాజునుచేత్తిరిగదరా…
నాయకుల్లారా
మీకు పుట్టగతులుండవ్
నేను మేడిపట్టకపోతే….

ఇక
వంగిన పెయ్యని
సరిచేసుకునుడే సరి
మట్టిని ముద్దాడిన పెదాలు
బిగుసుకుంటున్నయ్
ఇక
ఈరాజ్యం నాదే
రాజునూ నేనే
నాగలి శిలువనెక్కే క్రీస్తునుకానిక

మౌనంగా వుండలేనంటూ
మాబతుకుల్ని రోడ్డుకీడ్చిన
రాజనీతిని రోడ్డునేయ
సై అంటుంది
ముల్లుగర్ర

(ఈ దేశానికి వెన్నెముఖ రైతన్న పాదాలకు వినమ్రంగా నమస్కరిస్తూ….)