వ్యాసాలు

మాయా “క్లాసిక్”!

ఆగస్ట్ 2017

నేటి మానవ జీవితంలో సినిమా ఒక విడదీయరాని అంతర్భాగం. ఒక దృశ్యం వేయి మాటలకి సమానం అంటారు. సాంకేతిక ప్రగతి అభివృద్ధితో పాటు సినిమా రంగం కూడా పెరిగింది. పలు అంశాలతో కొన్ని వేల సినిమాలు వచ్చుంటాయి ఇప్పటి వరకూ. మిగతా భాషలు మినహాయించి ఒక్క తెలుగులోనే పదివేల పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో ఎన్ని సినిమాలు గొప్పవి? ఆ సినిమాలు ఎన్ని తరాలకు గుర్తుంటాయి? ఇలాంటి సమాధానం చెప్పాలంటే ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. మంచివి ఎంపిక చెయ్యాలి.

ఎన్నో సినిమాలు వచ్చినా వాటిలో కొన్ని సినిమాలే కాలానికి నిలబడతాయి. కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. సినిమా అనేది సామూహిక సృజన. దర్శకుడూ, రచయితా, నటులూ, ఫొటోగ్రాఫరూ, సంగీతమూ, ఆహార్యమూ వంటివే కాకుండా ఇంకా ఎన్నో విభాగాలు కలిస్తేనే ఒక సినిమా తయారవుతుంది. ఇవన్నీ సమపాళ్ళల్లో కుదిరితేనే ఆ సినిమా అందరినీ అలరిస్తుంది. అన్ని వంటకాలూ అద్భుతంగా కుదిరి గుర్తుండే విందు భోజనం లాంటిదే సినిమా కూడా. అన్నీ సమపాళ్ళల్లో కుదిరిన సినిమాలు అరుదుగా వస్తాయి. అవే కాలానికి నిలబడతాయి. వాటినే సినిమా పరిభాషలో క్లాసిక్స్ అంటారు.

అసలు క్లాసిక్స్ అంటే ఏవిటి? ఏ సినిమాలని క్లాసిక్స్ అంటారు? వాటిలో ఏఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? ఎక్కువ కాలం నడిచిన సినిమానా? ఎక్కువ ప్రజాదరణ పొందిన సినిమానా? ఎక్కువ డబ్బులు గడించిన సినిమానా? ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతాయి. ప్రజాదరణ పొందిన ప్రతీ సినిమా గొప్ప సినిమా కానేరదు. అలాగే సినిమాలో చాలా అంశాలు అద్భుతంగా ఉన్నా ప్రజాదరణ లేకపోవచ్చు. కొన్ని సినిమాల్లో అన్ని అంశాలూ కుదరకపోయినా విశేషమైన డబ్బు సంపాదిచవచ్చు. ప్రేక్షకుల ఆదరణా, అభిరుచీ ఒక్కోసారి ఊహకు అందవు.

డెబ్బయ్యేళ్ళ పైబడిన తెలుగు సినిమా చరిత్రలో పాతిక అత్యుత్తమ చిత్రాలు ఎంపిక చేయడం సాహసంతో కూడిన పని. అంతే కాదు వాటి స్థానం ఎంపిక చెయ్యడం ఇంకాస్త కష్టమైన విషయం. అసలు అత్యుతమ చిత్రం అంటే ఏది? కొలమానాలు ఏవిటి? వీటినే ఇంగ్లీషులో క్లాసిక్స్ అంటారు. మనకి ఇలాంటి విషయాలమెద ఆసక్తీ, శ్రద్ధా తక్కువ.

ఏ సినిమానయినా క్లాసిక్ అనడానికి ముఖ్యమైన అంశం “కాలానికి నిలబడడం”. అంటే కొన్ని తరాలని ఆ సినిమా రంజింపచేయడం. అలాగే ఎన్ని సార్లు చూసినా విసుగు కలగకపోవడం. అత్యున్నత సాంకేతిక విలువలూ, నటీ నటుల అద్భుతమైన నటనా, బిగువైన కథాకథనం (స్క్రీన్‌ప్లే), ఇంకా ప్రేక్షకులని చివరివరకూ కట్టి పడేయడం వంటివి కూడా ముఖ్యమైన అంశాలు. ఇంకా ఎంపిక చేసుకున్న కథ కూడా ముఖ్యమే. అది ఎటువంటిదయినా కావచ్చు. అంటే సాంఘికం, ఇతిహాసం, చారిత్రికం, లేదా సైన్స్ ఫిక్షన్, ఇలా ఏదయినా కావచ్చు.

ఇవన్నీ ఒక సినిమాని క్లాసిక్ అనడానికి ఎంచుకునే అంశాలు. స్థూలంగా ఇవీ ప్రమాణాలు. హాలీవుడ్‌లో ఈ ప్రమాణాలతోనే సినిమాలు ఎంపిక చేస్తారు.

తెలుగులో వచ్చిన కొన్ని వేల సినిమాల్లో క్లాసిక్స్ అనబడేవి మహా అయితే ఇరవయ్యో, పాతికో ఉండచ్చు. వాటిలో కొన్ని – మాలపల్లి, పాతాళ భైరవి, దేవదాసు, బంగారు పాప, మల్లీశ్వరి, మాయాబజార్, మిస్సమ్మ, కన్యా శుల్కం, జగదేక వీరుని కథ, పల్లెటూరు, లవకుశ, అల్లూరి సీతారామ రాజు, ముత్యాల ముగ్గు, శంకరాభరణం, సాగర సంగమం. ఇవి కాకుండా మరికొన్ని ఉండచ్చు. మరలా వీటిలో అత్యుత్తమమైన చిత్రం ఏదంటే చెప్పడం కాస్త కష్టంతో కూడిన పని. సినిమా మొదటి నుండి చివరవరకూ అన్ని అంశాలలో అద్భుతంగా కుదిరి, ఎన్ని సార్లు చూసినా విసుగనిపించని సినిమా ఎంపిక చెయ్యడం కష్టమే! అంతే కాదు అది కాలానికి నిలబడాలి. అంటే కొన్ని తరాల ప్రేక్షకులని అలరించాలి.

ఇలాంటి అంశాలన్నీ అద్భుతంగా అమరిన ఏకైక తెలుగు సినిమా “మాయా బజార్”.

అది విడుదలయ్యి అరవయ్యేళ్ళు అయ్యింది. ఇవాళ చూసినా ఆ సినిమా కొత్తగానే ఉంటుంది. అంతే కాదు, మొదటి సారి చూసిన వాళ్ళనీ అంతగానే అలరిస్తుంది. దీనికి వయసు భేదం లేదు. ఈ సినిమా క్లాసిక్ అనడానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా మీద వందల కొద్దీ వ్యాసాలూ, విశ్లేషణలూ వచ్చాయి. నాకు నచ్చిన అంశాలు ఏవిటీ, ఎందుకు ఈ నాటికీ అందర్నీ రంజింప చేస్తోందీ సినిమా అన్న దానిపై నా పరిశీలనలు కొన్ని.

కె.వి రెడ్డి దర్శకత్వంలో, నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా విజయా వారి బ్యానర్ మీద మార్చ్ 27, 1957 నాడు ఈ సినిమా విడుదలయ్యింది. సంగీతం ఎస్. రాజేశ్వర రావూ, ఘంటసాల నిర్వహించగా, మార్కస్ బార్ట్లే ఫొటోగ్రఫీ చేసారు. హేమాహేమీలయిన నటులు ఎస్వీ రంగారావూ, సావిత్రీ, ఎన్. టీ రామారావూ, నాగేశ్వర రావూ. సి.ఎస్. ఆర్, ప్రధాన పాత్రలుగా కనిపిస్తారు. వీరు కాకుండా గుమ్మడి, రమణా రెడ్డి, ముక్కామల, ఆర్ నాగేశ్వర రావూ, ఛాయాదేవి, సూర్యకాంతం, ఋష్యేంద్రమణి వంటి నటీనటులు కూడా ఉన్నారు.

ఈ సినిమాని అజరామరంగా నిర్మించిన ఘనత దర్శకుడు కె.వి.రెడ్డికి దక్కుతుంది. అలాగే ఈ సినిమాకి ఆయువు పట్టు మాటల మాంత్రికుడు పింగళి. సంగీతం వరకూ వస్తే నేటికీ ఈ సినిమాలో పాటలు అందరి నోటా నానుతూనే ఉంటాయి. ఇవి కాకుండా కడుపుబ్బ నవ్వించే హాస్యం, మాయలూ, మంత్రాలూ ఇవన్నీ ఈ సినిమాలో సమపాళ్ళల్లో చక్కగా అమరాయి.

కథ వరకూ వస్తే ఈ కథకి మూలం మహాభారతం. బలరాముడూ, రేవతిల కూతురు శశిరేఖ. చెల్లెలు సుభద్ర ని అర్జునిడికిచ్చి వివాహం జరుగుతుంది. శ్రీకృష్ణుడూ, అర్జునుడూ బావా బావ మరుదులే కాదు, అత్యంత సన్నిహితులు కూడా. సుభద్ర కొడుకు అభిమన్యుణ్ణి శశిరేఖకిచ్చి వివాహం జరిపిస్తానని కృష్ణుడి సమక్షంలో చెల్లెలికి ప్రమాణం చేస్తాడు బలరాముడు. శశిరేఖా, అభిమన్యుడూ కూడా ఒకరినొకరు ఇష్ట పడతారు. ఈలోగా కౌరవుల మాయా జూదంలో పాండవులు సర్వస్వమూ కోల్పోయి, పాండవులు అరణ్యవాసం వెళితే, సుభద్ర పుట్టింటికి వస్తుంది. బలరాముడూ, రేవతీ సుభద్రని ఆదరించకపోతే వాళ్ళని ద్వైత వనంలో ఉన్న ఘటోత్కచుడి దగ్గరకి రహస్యంగా పంపిస్తాడు కృష్ణుడు. పాండవులని కౌరవులు మాయాజూదంలో మోసం చేసారని తెలుసుకొని హస్తినకు వెళతాడు బలరాముడు. అక్కడ బలరాముణ్ణి సత్కరించి, ప్రశంసలతో ముంచెత్తి అతన్ని శాంత పరుస్తారు శకునీ, ధుర్యోధనులు. పనిలో పనిగా శశిరేఖని ధుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడితో వివాహం జరిపించాలని నిశ్చితార్థం జరిపిస్తారు కౌరవులు. సందలు ఇష్టపడే రేవతికీ ఈ సంబంధం నచ్చుతుంది. శశి రేఖ మాత్రం ఈ పెళ్ళికి ఇష్టపడదు. ఈలోగా అక్కడ ద్వైత వనం చేరుకున్న అభిమన్యుడి ద్వారా విషయం తెలుసుకున్న ఘటోత్కచుడు శశిరేఖను తీసుకొచ్చి అభిమన్యుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన అనుచరులతో ద్వారకకి వెళతాడు. అక్కడ శశి రేఖా, లక్ష్మణ కుమారుల వివాహం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. తన అనుచరులతో అక్కడ నానా రభసా సృష్టించి, మాయా శశి రేఖగా మారి మగ పెళ్ళివారిని బెంబేలెత్తిస్తాడు ఘటోత్కచుడు. చివరకి ఈ పెళ్ళి పెటాసు చేసి, కౌరవులకి బుద్ధి చెప్పి, అభిమన్యుడికీ, శశి రేఖకీ వివాహం జరిపిస్తాడు ఘటోత్కచుడు. స్థూలంగా ఇదీ కథ. ఇది మహా భారతంలో లేదు. అసలు బలరాముడికీ, రేవతికీ శశిరేఖ అన్న కూతురే లేదు. ఈ కథ జానపద వాంగ్మయంలో పుట్టుకొచ్చింది. ఆనోటా ఈనోటా శశిరేఖా పరిణయంగా చెలామణీ అవుతూ వచ్చింది. భారతంలో ఎన్నో ప్రక్షిప్త కథలున్నాయి. అందులో ఇదీ ఒకటి.

స్థూలంగా ఇదొక పౌరాణిక చిత్రం. కానీ సినిమా చూస్తున్నంత సేపూ అలా అనిపించదు. సినిమాలో ఘటోత్కచుడి మాయలూ, మంత్రాలతో పెళ్ళి పేరు చెప్పి కౌరవులనీ, వారి బంధు వర్గాన్నీ అపాసుపాలు చేయడంలో ఎంతో హాస్యం కనిపిస్తుంది.

శశిరేఖా, అభిమన్యుల ప్రేమ కథ. దీనికి ప్రధాన సూత్రధారి ఘటోత్కచుడూ, కృష్ణుడూ. మహాభారతంలో శ్రీకృష్ణుడు ప్రథాన పాత్రధారి. కానీ ఈ కథకి ఘటోత్కచుడు ప్రధాన పాత్రధారి. సినిమా మొత్తం ఇతని చుట్టూనే తిరుగుతుంది. అలా అని మిగతా పాత్రలకి ప్రాముఖ్యత లేదని కాదు. శశిరేఖా, అభిమన్యుడూ కూడా ముఖ్య పాత్ర ధారులే. వీరు కాకుండా శకునీ, లక్ష్మణ కుమారుడూ ఇలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలు కూడా ఉన్నాయి.

ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర నిడివి తక్కువ. ఎక్కడ ఎంత అవసరమో అంత వరకే ఉంటుంది. అలాగే కృష్ణుడి పాత్రని ఆకాశానికి ఎత్తేసి మిగిలన పాత్రలని పట్టించుకోకపోవడం కనబడదు. ఇంకా ఈ కథలో పాండవుల ప్రస్తావన వస్తుంది కానీ వారెవరూ కనిపించనే కనిపించరు. నిజానికి ఈ కథని జనరంజకంగా తెరకెక్కించడం అంత సులువు కాదు, ఘటోత్కచునికి ఎన్ని మాయలూ, మంత్రాలూ పెట్టి చూపించినా. పాండవులు లేకుండా ఈ కథ చెప్పడం కష్టం.

ఇక్కడే దర్శకుడు కె.వి రెడ్డి ప్రతిభ కనిపిస్తుంది. ఈయనకి తోడైన మాటల రచయిత పింగళీ, కెమేరామెన్ మార్కస్ బార్ట్లే కూడా వారికిచ్చిన బాధ్యతని గొప్పగా నిర్వహించారు.

పైన చెప్పినట్లు కథలో పాండవులు లేరు. కథ కౌరవులకీ, పాండవులకీ మధ్య మాయాజూదం జరగక ముందు మొదలవుతుంది. మాయా జూదం తరువాతా ఉంటుంది. పాండవులు జూదంలో ఓడిపోవడమూ, అన్నగారి పంచన సుభద్ర పుట్టింటికి చేరడమూ ఇవన్నీ మాయా జూదం సంఘటన తరువాత జరుగుతాయి. పాండవులు తెరేమీద కనిపించకుండా ఎలా కథని నడిపించాలి? ఇక్కడే కె.వి రెడ్డి తెలివితేటలు కనిపిస్తాయి. ఇది ఎంతో సులభంగా చూపించేస్తాడు, మూల కథకి భంగం రాకుండా. శశిరేఖా, అభిమన్యుల చిన్నతనంతో సినిమా ప్రారంభించి, బలరాముడు అభిమన్యుడే తన అల్లుడన్న ప్రమాణం సుభద్రకి చేయడం చూపిస్తాడు. అప్పుడే కౌరవుల మాయా జూదం చూపించాలి. అది ఎక్కడో వేరే చోట జరుగుతుంది. అదంతా చూపించాలంటే సినిమా నిడివి చచ్చేటంత అవుతుంది. పైగా ఈ కథ దారి తప్పే ప్రమాదం కూడా ఉంది.
అందుకని కృష్ణుడి చిన్నప్పటి విశేషాలు పాట రూపంలో కృష్ణుడూ, రుక్మిణికీ ఒక ప్రదర్శన జరుగుతున్నట్లు చూస్తాడు. పాట చివర్లో కృష్ణుడు పరధ్యానంలోకి వెళ్ళి కొంతసేపటికి మామూలు స్థితికి వస్తాడు. ఆ పరధ్యానం ఎందుకంటే అక్కడ ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగుతూ ఉంటుంది. ద్రౌపది కృష్ణుణ్ణి మొరపెట్టుకోవడంతో కృష్ణుడు ఆమెను కాపాడడం కోసం వెళతాడు. అతని పరధ్యానం గమనించిన రుక్మిణి ఏమయ్యిందని అడుగుతుంది. అక్కడే మాయా జూదంలో పాండవుల ఓటమి గురించీ, ద్రౌపదీ వస్త్రాపహరణం గురించీ తెలివిగా కృష్ణిడి చేతే చెప్పిస్తాడు దర్శకుడు. ఇదంతా ఒక పాటరూపంలో మూడు నిమిషాల్లో తెరపై చూపిస్తాడు.
మరుక్షణమే సుభద్ర, అభిమన్యుడితో పుట్టింటికి రావడం సీన్ వచ్చేస్తుంది. కథ అభిమన్యుడూ, శశిరేఖలమధ్యకి వచ్చేస్తుంది. వెనువెంటనే బలరాముడు వారి పెళ్ళి తిరస్కరించడమూ, అవమానంతో సుభద్ర అక్కడ ఉండలేని పరిస్థితి గ్రహించి కృష్ణుడు ఘటోత్కచుడి నివాసానికి పంపించడమూ చూపించేస్తాడు. ఇదీ కె.వీ రెడ్డి స్క్రీన్‌ప్లే ప్రతిభ.
ఇంకోటి ఈ సినిమా మొత్తంలో ఎక్కడా కృష్ణుడి మహిమలూ, మాయలూ ఉండవు. కృష్ణుడి పాత్ర ఎంత అవసరమో అంతే ఉంటుంది. ఎక్కడా అనవసరంగా శృతి మించదు.

పాండవులకీ, కౌరవులకీ అసలేం జరిగిందో తెలుసుకోవడానికి బలరాముడు ఒక్కడూ వెళతాడు. ఇక్కడ కృష్ణుడు తోడు వెళ్ళనట్లు చూపించి తప్పిస్తాడు. అక్కడ ధుర్యోధనుడి కొడుకుతో శశిరేఖ వివాహానికి ఒప్పేసుకొని వచ్చేస్తాడు. ఇలా ప్రతీ సన్నివేశంలోనూ ఏ పాత్ర అవసరం ఎంతో అంతే ఉంటుంది.

ఇవి కాకుండా ఈ కథ పౌరాణికమయినా ఏ పాత్రా మనకి అలా అనిపించదు. బలరాముణ్ణీ, సుభద్రనీ, కృష్ణుణ్ణీ, రేవతీ, శశిరేఖాభిమన్యుల్ని చూస్తూంటే మన ఇళ్ళల్లో ఓ పెదనాన్ననీ, బాబయ్యనీ అత్తయ్యల్ని చూస్తున్నట్లు ఉంటుంది. మన కుటుంబాల్లో మేనరికం పెళ్ళిళ్ళ గురించి వింటూనే ఉంటాం. చిన్నప్పుడు మాట ఇచ్చుకొని, పెద్దయ్యాక ఆస్తులూ అవీ పోతే కాదనడం వింటూ ఉంటాం. అందువల్ల బలరాముడూ, కృష్ణుడూ, రేవతీ, సుభద్రా, అభిమన్యుడూ, శశిరేఖా పౌరాణకి పాత్రల్లా కాకుండా మనింట్లో మన మధ్య మసిలే మనుషుల్లాగే అనిపిస్తాయి; ఒక్కఆహార్యం తప్ప. మనకి ఈ పౌరాణిక పాత్రలు మామూలు మనుషుల్లా అనిపించడానికి ప్రధాన కారణం మాటల మాంత్రికుడు పింగళి. ఎక్కడా పెద్ద పెద్ద సంస్కృత సమాసాలూ, బరువైన పెద్ద డయిలాగులూ ఉండవు. అన్ని సంభాషణలూ మన ఇళ్ళలో మాట్లాడుకున్నట్లే ఉంటాయి.
అలాగే వదినా, మరదళ్ళ మధ్య దెప్పిపొడుపులూ, మాటలు తిరిగి అప్పజెప్పడాలూ, వ్యంగ్యాలూ, విసుర్లూ ఇవన్నీ వ్యవహారిక భాషలో ఉంటాయి. వింటూంటే మన ఇళ్ళల్లో సంభాషణల్లా ఉంటాయి తప్ప ఎక్కడా పౌరాణికం అన్న భావన కలగదు.

ఉదాహరణకి కొన్ని. అభిమన్యుడు తన విలువిద్యని శశిరేఖకి ప్రదర్శించాలని ఉవ్విళ్ళూరుతాడు. శశిరేఖ నెత్తిమీద పెట్టి ఒక పండుని కొట్టే సమయానికి రేవతి వచ్చి అడ్డుకొని, అభిమన్యుడి విల్లంబులు లాక్కొంటుంది. మరదలు సుభద్ర దగ్గరే ఇది తేలుద్దామని వస్తూండగా, అక్కడ బలరాముడూ, కృష్ణుడూ పాచికలు ఆడుతూ కనిపిస్తారు. రేవతి చేతిలో విల్లంబులు చూసి – “కృష్ణా! చేతిలో ఆ ధనుర్బాణాలు చూస్తూంటే మీ వదిన అపర కాళికా దేవిలా లేదూ?” అంటూ హాస్యమాడతాడు బలరాముడు. ఇలాంటి హాస్యాలు మన ఇళ్ళలో తరచూ చూస్తూనే ఉంటాం.
అలాగే అభిమన్యుడూ, శశిరేఖా నౌకా విహారం వెళ్ళారని తెలిసి, అది నిజమో కాదో తేలుద్దామని రేవతి బలరాముడితో బయల్దేరుతుంది . అది తెలిసీ కృష్ణుడు వారికంటే ముందు రుక్మిణితో వెళ్ళి అభిమన్యుడూ, శశిరేఖల్ని తప్పిస్తాడు. నౌకలో కృష్ణుడూ, రుక్మిణులని చూసి రేవతి “ఈ వయసులో రుక్మిణికి నౌకా విహారం ముచ్చటా?” అని బలరాముడితో అంటుంది.
తరువాత రేవతీ, బలరాములు నౌకా విహారం చేస్తూంటే సరిగ్గా రుక్మిణీ అదే మాటంటుంది. ఇక్కడే స్త్రీల మనస్తత్వాన్ని అద్భుతంగా చూపిస్తాడు. వేంటనే – “రస పట్టులో తర్కం కూడదు” అని కృష్ణుడి చేత పలికిస్తాడు. మన కుటుంబాల్లో ఆడవాళ్ళ మధ్య ఇలాంటి ప్రవర్తనలే చూస్తూ ఉంటాము.

సినిమా మొత్తమూ ఇలాంటి సహజమైన సంభాషణలతోనే సాగుతుంది. ఎక్కడా పౌరాణిక వాసనలు కనిపించవు. అలాగే అభిమన్యుడు కృష్ణ్ణి మావయ్యా అని సంబోధించడమూ, బలరాముడు అభిమన్యుణ్ణి మేనల్లుడని చెప్పడమూ, శశిరేఖ సుభద్రని అత్తయ్యా అని పిలవడమూ, ఇవన్నీ మనకి అలవాటయిన పిలుపులు.
అలాగే లక్ష్మణ కుమారుణ్ణి పొగిడే భట్రాజులు కౌరవల గురించి చెబుతూ “బాబాయిలు” అనడమూ, అర్జునుడి గురించి చెబుతూ ఘటోత్కచుడు “అర్జున బాబాయి” అనడమూ సినిమాలో కనిపిస్తాయి. బాబాయికి బదులు పినతండ్రి అనచ్చు. కానీ బాబాయి అన్నది వ్యవహారికం. ఇలాంటి జాగ్రత్తలు సంభాషణల్లో తీసుకోవడం సినిమా మొత్తమూ ఉంది. మాటలన్నీ మామూలుగా సహజంగా ఉంటాయి.

సినిమా చివర్లో లక్ష్మణ కుమారుడితో మాయా శశిరేఖ పెళ్ళిలో ఘటోత్కచుడి అనుచరుల మాయల వల్ల అందరూ తుమ్ముతారు. “నీళ్ళు కొత్త చేసుకుంటాయి” అని కృష్ణుడు అంటే, అది రేవతి అందుకుంటుంది. అది విని రుక్మిణి “అవును పాపం” అని వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తుంది. ఇలా ప్రతీ పాత్ర విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ రాయలేము.

ఈ సంభాషణలు కాకుండా ఈ సినిమాలో మరో మహత్తరమైన ప్రయోగం ఉంది. అది పెళ్ళి. ఈ పెళ్ళి వేడుక మొత్తమూ తెలుగు వారి పెళ్ళి వేడుకే! పద్ధతులూ, ఆచారాలూ, ఆఖరికి పెళ్ళి విందూ, వంటకాలూ ఇవన్నీ తరచూ తెలుగు ఇళ్ళల్లో కనబడేవే.
సాధారణంగా రామాయణ, భారతాలలో కథల్ని తీసుకొని మన జీవితాలకి అన్వయించి కథలు రాయడమూ, సినిమాలుగా తీయడమూ చూస్తూనే ఉంటాం. కానీ ఈ సినిమాలో మన అలవాట్లూ, సాంప్రదాయాలూ, పద్ధతులూ పౌరాణిక పాత్రలకి ఎంతో సహజంగా అన్వయించడం కనిపిస్తుంది. దీన్నే ఇంగ్లీషులో reverse adaptation technique అంటారు. ఈ సినిమాలో మొత్తం పెళ్ళి తంతు అంతా తెలుగు పెళ్ళే. తెలుగు వారి పద్ధతులూ, ఆచారాలూ ఇవన్నీ భారతంలో కుదించేసారు.

సంభాషణల్లో వాడుక మాటలు ఎలాగో పెళ్ళి పద్ధతుల్లోనూ అవే పాటించారు. మగపెళ్ళి వారు పెళ్ళి విడిదికి రాగానే పెళ్ళికూతురు ఎలా ఉంటుందో చూడాలన్న తహతహ కుటుంబాల్లో ఉంటుంది. ఇక్కడ శశిరేఖని చూడ్డానికి లక్ష్మణ కుమారుడూ, భానుమతే కాదు, శకునీ మిగతా బంధుగణమూ వెళతారు. అలాగే మగ పెళ్ళి వారు పెళ్ళిళ్ళలో సదుపాయాలూ సరిగ్గా లేవూ, పట్టించుకోవడం లీదూ, ఆతిధ్యం సరిగా లేదని అయిన దానికీ, కాని దానికీ లూ, ఒంకలూ చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఈ సినిమాలో చక్కగా కనిపిస్తాయి. హాస్యం కోసం, మిగతా పాత్రల, అంటే ధుర్యోధనుడూ, శకుని వంటి రాచరికపు పెద్దల, స్థాయి తగ్గకుండా ఆడపెళ్ళి వారి వద్ద బెట్టు చేయడం పురోహితులకి అప్ప జెప్తారు. అలా వాళ్ళ చేత హాస్యం పండిస్తారు.
ఇంకా పెళ్ళిలో బాసికం కట్టడం, తెర పట్టడమూ, పాద పీడనం, పెళ్ళికొడుకు నిలబడి తాళి కట్టడం ఇవన్నీ ఆనాటి పద్ధతులేనా అనుకునేలా భ్రమించ చేసారు.
అలాగే పెళ్ళికి విచ్చేసిన వారికి “రుమాలు” ఇవ్వడం పూర్వం పెళ్ళిళ్ళలో తెలుగు వారి సాంప్రదాయం. అది కూడా హాస్యం కోసం తెలివిగా వాడుకున్నారు. ఆ రుమాళ్ళకోసం కౌరవ సోదరులు ఎగపడటం హాస్యాన్ని పుట్టిస్తుంది.

ఇహ పెళ్ళిలో భోజనం గురించి చెప్ప నవసరమే లేదు. వివాహ భోజనంబు పాట నిండా తెలుగు వంటకాలే! బొబ్బట్లూ, గారెలూ, బూరెలూ, చెగోణీలూ, ఆఖరికి గోంగూరని కూడా కౌరవుల కాలం నాటి వంటకం చేసేస్తారు. అలా చేయడం సినిమాలో ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించదు. ఇది కె.వి.రేడ్డి, పింగళిల మేధోచమత్కారం.

అసలు ఈ సినిమా మొదలవ్వడమే శశిరేఖ రజస్వల (లేదా ఓణీ పండగ) సందర్భంతో పాటతో మొదలవుతుంది. రజస్వల అన్నది ఎక్కడా పాటలో కనిపించదు. మాటలూ ఉండవు.
పుట్టిన రోజని కూడా అనుకోవచ్చు కానీ, చూస్తే అదే సందర్భం అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలాంటి సందర్భాలకి ఇంట్లో ఆడవాళ్ళనే పిలుస్తారు. అందుకే అక్కడ సుభద్ర, పిల్లవాడు అభిమన్యుడూ కనిపిస్తారు. అర్జనుడు కనిపించడు.
ఇక్కడ పాండవులని, ముఖ్యంగా అర్జనుణ్ణి, తెరపై చూపించే అవకాశం ఉంది. దర్శకుడు ఇక్కడా తెలివిగా దాట వేసాడు. ఇలా ప్రతీ సన్నివేశ నిర్మాణంలోనూ ఎంతో చాకచక్యం కనిపిస్తుంది.

ఈ మాయ బజార్ సినిమా ఆరేడు తరాలకి అమితంగా నచ్చడానికి హాస్యమూ, నటనా, మాటలూ, పాటలూ ఒక కారణమయితే, అంతర్లీనంగా తెలుగువారి జీవన విధానాన్ని సినిమాలో జొప్పించడం మరో ప్రధాన కారణం.

ప్రతీ తరంలోనూ పెళ్ళిళ్ళు ఉంటాయి. చిన్న చిన్న ఆచారాలూ, పద్ధతులూ, సాంప్రదాయాలూ తేడా ఉండచ్చు గాక. కానీ ప్రధాన తంతు రమారమి అందరికీ ఒకటే. అలాగే పెళ్ళిళ్ళలో తగవులూ, అపార్థాలూ ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. అందువల్ల ఏ తరం వారయినా ఈ సినిమా చూస్తే ఇట్టే సొంతం చేసేసుకుంటారు. తమ జీవితాలకి దగ్గరగా ఉండడం వలన అన్వయం చక్కగా కుదురుతుంది. ఇవి కాకుండా హాస్యం ఎలాగూ ఉంది. పిల్లా, పెద్ద తేడా లేకుండా ఈ సినిమా హాయిగా చూసేయచ్చు. ఒకసారి కాదు, ఎన్ని సార్లు చూసినా విసుగనిపించదు. ఒక పౌరాణిక సినిమా చూస్తున్న భావనే కలగదు. వీటికి తోడు అద్భుతమైన ఫొటోగ్రఫీ ట్రిక్కులూ, అలరించే సంగీతమూ ఉన్నాయి. ఇవన్నీ మించి నటీనటులందరిదీ అద్భుతమైన నటనా కౌశలమూ ఉంది. ముఖ్యంగా ఎస్వీయార్, సావిత్రీ ఈ సినిమాకి హీరోలు. ఎస్వీ రంగారావుకి అలాంటి పాత్ర కొట్టిన పిండి. సావిత్రి మాయా శశిరేఖగా చేసిన నటన అద్భుతం. చిన్న చిన్న హావభావాలు పలికించడంలో ఆమె చూపించిన నటన అద్భుతమూ, అజరామరమూ.

ఇహ స్క్రీన్‌ప్లే వరకూ వస్తే ఈ సినిమాలో ఏ ఒక్క అనవసర సన్నివేశమూ కనిపించదు. సినిమా మొత్తం వేగంగా నడుస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో చూపించిన అబ్బురపరిచే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి – తలచిన వారిని చూపించే ప్రియదర్శిని, రెండోది సత్య పీఠం. ప్రియదర్శిని ప్రస్తుత టీవీ లేదా వీడియో కెమేరా అనుకోవచ్చు. అప్పటికే పాశ్చాత్య దేశాల్లో టీవీ వచ్చేసింది. ప్రియ దర్శిని అని చక్కటి పేరుపెట్టి సినిమా కథనంలో ఇమిడ్చి చూపించారు. అలాగే సినిమా మొదట్లో కృష్ణుడి తమ్ముడు సాత్యకి ద్వారా ప్రవేశ పెట్టిన సత్యం పీఠం చివర్లో శకుని బండారం బయట పెట్టడానికి వాడుకున్నారు. చివర్న ఘటోత్కచుడు మాయలూ అవీ చేస్తాడు కానీ కృష్ణుడు మామూలు వ్యక్తిగానే అంతా చూస్తూ ఉంటాడు. అన్నగారి దగ్గర అతి వినయంతో ప్రవర్తించే తమ్ముడిలా కనిపిస్తాడు తప్ప ఎక్కడా దేవుడు అన్న భావనే కలగదు.

ఈ చిత్రంలో మనకి ప్రతీ పాత్రా చివరి వరకూ గుర్తుంటుంది. ఘటోత్కచుడి అనుచర గణమూ, లక్ష్మణ కుమారుడి సన్నిహితుడూ, పురోహితులూ, దుశ్శాశనుడూ, శకునీ, ఆఖరికి మాయా శశి రేఖ చెలికత్తె చంప, ఇలా అందరూ గుర్తుంటారు. వారి పాత్రల నిడివితో సంబంధం లేకుండా.

ఇవి కాకుండా ఈ సినిమాలో సంభాషణలు కొన్ని తరాలు అందరి నోటా నానుతూనే ఉన్నాయి. “వెయ్ వీడికో వీర తాడు!”, “ఇదే మామ మన తక్షణ కర్తవ్యం”, “హై హై నాయకా”, “దుసట చసుటతయమూ” వంటి ప్రయోగాలూ ఇన్నేళ్ళయినా వాడుకలోనే ఉన్నాయంటేనే పింగళి వారి గొప్పతనం తెలుస్తోంది.

ఇహ ఈ సినిమాలో పాటలు. కొన్ని పాటలు కట్టకా సాలూరి రాజేశ్వర రావుకీ, నిర్మాతలకీ విభేదాలు వచ్చి, ఆయన చేయగా మిగిలిన పాటలూ, నేపథ్య సంగీతమూ ఘంటసాల చేసారని అంటారు. ఈ సినిమాలో ఒక్కో పాటా ఒక ఆణి ముత్యం. “నేవేనా నను తలచినదీ”, “చూపులు కలసిన శుభవేళా”, “లాహిరి లాహిరిలో, “అహ నా పెళ్ళి అంట”, “వివాహ భోజనంబు” ఇలా ప్రతీ పాటా ప్రసిద్ది చెందినవే. ఇవి ఎంతలా ప్రజల నోళ్ళల్లో నానాయంటే, ఈ పాటల పల్లవులతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఇది ఏ సినిమాకీ దక్కని అపూర్వ గౌరవం.

ఈ సినిమాకి మరో గొప్పదనం కూడా ఉంది. పైన చెప్పిన అంశాలన్నీ కన్నుల విందుగా చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లీ మాయా జాలం మనల్ని కట్టి పడేస్తుంది.

సాంకేతిక ప్రగతి అంతగా లేని ఆ రోజుల్లో ఈయన చేసిన కొన్ని ఫొటోగ్రఫిక్ ట్రిక్స్ ఇప్పటికీ ఆశ్చర్యమే.

మయ ద్వారక సెట్టింగు ఇప్పటికీ ఒక అద్భుతం. అలాగే వివాహ భోజనంబు పాటలో చూపించిన ట్రిక్ ఫొటోగ్రఫీ; వంగర, బాలకృష్ణ, అల్లు రామలింగయ్యల మధ్య హాస్య సన్నివేశాలలో తివాచీ చుట్టుకు పోవడం, గిర్రున తిరిగే మంచం, అటూ ఇటూ కదిలే తాంబూల పళ్ళెం ఇవన్నీ అప్పట్లో ఎలా తీయగర్లిగారు అన్నది ఊహకే అందవు. ఘటోత్కచుడు పెద్దగా అవడం, పెళ్ళివారి విడిది సన్నాహం పాటలో, చెప్పులూ, బెందెలూ ఇవన్నీ కొట్లలో వరసగా అమరడం, ప్రియదర్శినిలో అభిమన్యుణ్ణి చూస్తూ శశి రేఖ పాడే సన్నివేశమూ ఇవన్నీ బార్ట్‌లీ ప్రతిభకి తార్కాణం. తెలుపు నలుగు చిత్రంలో వెన్నెల్లో ఉన్నట్లు భ్రమించేలా తీసిన లాహిరి లాహిరి పాటా ఇవన్నీ మాయా బజార్ సినిమాని మరో మెట్టుపైకి తీసుకెళ్ళాయి.

సెట్టింగులు వేసిన గోఖలే, కళాధరూ, ఆహార్యం అందించిన భక్తవత్సలం అందరూ శక్తికి మించి తలో చెయ్యీ వేసారు ఈ కళాఖండంలో. ఎన్నో తరాలకి పసితనంలోనే పరిచయమయ్యే సినిమా మాయాబజార్. అందుకే ఇన్నేళ్ళు అంటే అరవయ్యేళ్ళు గడిచినా ఈ సినిమా తెలుగు వారి హృదయాల్లో చిరకలాంగా నిలిచి పోయింది. ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి. అందుకే వీటిని క్లాసిక్స్ అంటాం. అనడమే కాదు, మరలా మరలా చూస్తూనే ఉంటాం.

ఏ ముహుర్తాన మాయ అని టైటిల్లో తగిలించారో, ఇన్నేళ్ళుగా తెలుగు వారిని ఈ సినిమా మాయ చేస్తూనే ఉంది. ఉంటుంది కూడా. ఎంతైనా క్లాసిక్ కదా!

**** (*) ****

మొదటి ముద్రణ: తానా సావనీర్.