టీక
“అంతర్లీన ఘనీభూత సాగరాన్ని బద్దలుకొట్టే గండ్ర గొడ్డలే సాహిత్యం” అంటాడు కాఫ్కా.
ఇక్కడ సాగరం అంటే ఆలోచనలు. వాటిని ముక్కలు చేయడమే సాహిత్యం చేసే పని. జీవితంలో అనుభవాలే వాటికి ఆలంబన. ఇవి కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ మారుతూ ఉంటాయి. వాటికి అక్షర రూపం ఇస్తే అవి సార్వజనికం అవుతాయి.
సరిగ్గా ఒక పుస్తకం చేసే పనే అది. అవి కథలు కావచ్చు; కవిత్వం కావచ్చు; నవలలు కావచ్చు. ఆ అనుభూతులు మనల్ని తాకితే అవి సొంత అనుభవాలుగా రూపాంతరం చెందుతాయి. ఇటువంటి అనుభవాల డయాస్పోరా కథల పుస్తక పరిచయం ఇది.
ఈ కథా రచనలు తెలుసుకునే ముందు డయాస్పోరా అంటే కాస్తయినా తెలియాలి. అప్పుడు ఈ కథల వెనుక తపనా, జీవితమూ మరింతగా కనిపిస్తాయి.
డయాస్పోరా అంటే ఏవిటి?
ప్రస్తుతం కుగ్రామమైన ఈ ప్రపంచంలో, పుట్టుకతో సంబంధం లేకుండా, ఎవరు ఎక్కడైనా జీవించే అవకాశం ఉంది. అసలు ఏ మనిషయినా తన స్వస్థలం వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అక్కడ భరించలేనంత ఇబ్బందయినా ఉండాలి. లేదా జీవితం మెరుగుపడచ్చన్న ఆశ అయినా వుండాలి.
ఈ రెండే మనిషిని స్థాన భ్రంశం చేయిస్తాయి.
కొత్త ప్రదేశం వేరే ప్రపంచాన్ని చూపిస్తుంది. కొత్త అనుభవాలని ఇస్తుంది. ఆలోచనలని రేకెత్తిస్తుంది. పాత జ్ఞాపకాలని వెలికి తీస్తుంది. వీటికి అక్షర రూపం ఇస్తే అది “డయాస్పోరా” సాహిత్యం అవుతుంది.
వేరొక కొత్త సమాజపు అలవాట్లూ, సంస్కృతీ ఎదురు పడినపుడు – తమ నమ్మకాలకీ, ఆలోచనలకీ, నమ్మిన విలువలకీ మధ్య సంఘర్షణ – వాటిద్వారా కలిగే ఒక మానసిక ఒత్తిడీ డయాస్పోరా జీవితాల్లో ప్రధాన అంశం. సూక్ష్మంగా చెప్పాలంటే – రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి. ఇలాంటి సందర్భాలలో కొంత మానసిక సంఘర్షణ కలుగుతుంది.
ఇప్పుడయితే ప్రపంచం హద్దులు చెరిగిపోయాయి. ఇల్లు కదలకుండా ప్రపంచాన్ని వేలి కొసల మధ్య పట్టేయచ్చు. పాతికేళ్ళు, ఇంకాస్త వెనక్కి అంటే నలభయ్యేళ్ళ క్రితం అమెరికాలో జీవితం ఇప్పటి తరానికి ఊహించడం కూడా కష్టం.
అమెరికాలో తెలుగు వారి వలసలని మూడు కాలాలుగా వర్గీకరించచ్చు – డెబ్భైలకి (1970) కి ముందు, తరువాత 90 వరకూ, అక్కడనుండి ఇప్పటి వరకూ.
డెబ్భైలకి ముందు అతి తక్కువ మంది అమెరికా వలస వచ్చారు. డెబ్భైలలో ఎంతో మంది డాక్టర్లు అమెరికా వచ్చారు. తొంభైల తరువాత కంప్యూటర్ సాంకేతికత పెరిగాక అది రెట్టింపయ్యింది. 2000 తరువాత అది నాలుగింతలయ్యింది.
అటువంటి మొదటి తరం (’70 డెబ్భైల ముందు) ప్రవాస తెలుగు వాళ్ళల్లో ముఖ్యులు వేలూరి వేంకటేశ్వర రావు. తెలుగు భాష మీద ప్రేమా, సాహిత్యం పట్ల అభిమానమూ ఆయన చూసిన అమెరికా జీవితాన్ని కథల రూపంలో రాసారు. ఆ కథలన్నీ గుది గుచ్చి “ఆ నేల, ఆ నీరు, ఆ గాలి” పేరుతో పుస్తకంగా వచ్చింది.
ఎప్పటినుండో వాయిదాలు వేస్తూ వచ్చిన నా ఈ సమీక్ష ఇన్నాళ్ళకి అక్షర రూపం దాల్చింది. ఇట్స్ నెవర్ టూ లేట్. తెలియనంతవరకూ ఏదీ పాత బడదు.
అసలు కథ
ఈ మధ్యే నోబెల్ ప్రైజు వచ్చిన బాబ్ డిలన్ని ఎవరో అడిగారట: “నువ్వు పాటకుడివా? కవివా?” అని. “నేను పాడగలిగితే పాట, పాడటానికి కుదరనిది కవిత!” అని బదులిచ్చాడట. బాబ్ డిలన్ ప్రతిపాదన కథలకి కూడా వర్తిస్తుందని వేలూరి “నా మాట” అంటూ రాసారు ఈ పుస్తకంలో. “వావ్!” అనాలనే అనుభూతి కథ చదివాక అనిపిస్తే అది కథే – అంటారు వేలూరి.
ఈ కథా సంకలనంలో పాతిక పైగా కథలున్నాయి. కొన్ని డయాస్పోరా కథలూ, మరికొన్ని జ్ఞాపకాల (నాస్టాల్జియా) కథలూ.
కథ చెప్పడంలో వేలూరిది విభిన్న శైలి. మహా పొదుపరి. ఎక్కడా ఒక్క వాక్యం కూడా ఎక్కువ కాదు; అలాని తక్కువా కాదు.
పైన చెప్పినట్లు కొత్త దేశం అంటే అమెరికా వచ్చాక మన తెలుగు వాళ్ళల్లో కలిగే భయాలూ, ఇష్టాలూ, మార్పులూ ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి తెలుసున్నంత స్పష్టంగా మరొకరికి తెలీవు. ఆకాశ హర్మ్యాలూ, పెద్ద పెద్ద ఇళ్ళూ, రోడ్ల మీద వందల కొద్దీ కార్లూ ఇవన్నీ మొదటి సారి చూస్తే ఆశ్చర్యంగా కంగారుగానే ఉంటుంది. కొంత కాలానికి మామూలవుతాయి. మరికొంత కాలానికి అవీ మనవిగా మారుతాయి. ప్రవాసీయులకి ఈ మార్పు సహజం. సరిగ్గా అటువంటి మార్పునే ఒడిసి పట్టుకున్న కథ “మెటా మార్ఫసిస్“.
సరిగ్గా ఇదే రంగనాధంలో వచ్చిన మార్పు ఈ కథలో కనిపిస్తుంది.
“...నల్లతోలు సూట్కేసులో రెండు జతల బాటా బూట్లూ, ఓ డజను ప్లాస్టిక్ టంగ్క్లీనర్లూ, … బామ్మ ఇచ్చిన ఆవకాయ జాడీ, కోతి మార్కు నల్ల పళ్ళపొడీ, తాతగారిచ్చిన పాకెట్ సైజు ఆంజనేయ దండకం, కనకమ్మ పిన్ని పంపిన కొబ్బరి నూనె సీసా, … సీతా రామ లక్ష్మణుల కేలండరుతో సహా రంగనాధం న్యూయార్కులో వాలాడు,” ఇలా మొదలవుతుంది కథ.
మొదటి సారి అమెరికా చూసిన రంగనాధం ఆశ్చర్యపోతాడు. అదిరి పడతాడు. మెల్లగా అలవాటు చేసుకుంటాడు. అమెరికన్గా మారిపోతాడు. ఇన్ని మార్పులొచ్చినా ఒక్క విషయంలో మాత్రం మారడు. అదే కథకి ముగింపు. రంగనాధమే కాదు, చాలా మంది తెలుగువాళ్ళ పరిస్థితి అదే. ఎప్పుడో ముప్పై యేళ్ళ క్రితం రాసిన కథ. ఇప్పటికీ చెక్కు చెదరని ముగింపు. ఇంత చూసీ ఈ కథ ముచ్చటగా మూడు పేజీలు. చివర్లో “వావ్” అనుకోవడం మాత్రం ఖాయం. ఇది ఎనభైల నాటి కాలం కథ అయినా ప్రవాసం వచ్చిన అమెరికా తెలుగు వారిది ఇప్పటికీ ఇదే తీరు.
డయాస్పోరా జీవితానికి ఇది మొదటి ప్రతీకగా చెప్పుకోవచ్చు.
(ఇదే పేరుతో కాఫ్కా 1925 ప్రాంతాల్లో ఒక కథ రాసాడు. గ్రెగార్ అనే సేల్స్ మాన్ ఒక రోజు హఠాత్తుగా ఒక పురుగులా మారిపోతాడు. అలా మారడంలో తనలోనూ, కుటుంబంలోనూ వచ్చే మార్పులు చివర్లో అతని ఉనికికే ప్రమాదం కలిగిస్తాయి. గూగుల్ చేస్తే దొరుకుతుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కథ అది.)
అమెరికా గాలీ, నీళ్ళూ పడ్డాక కాస్త నిలదొక్కుకున్నాక, ఇక్కడ విచ్చలవిడితనాన్ని అలవాటు చేసుకొని పరాయి దేశ స్త్రీలతో అనుబంధాలు పెంచుకుంటాడు సుందరం. తరచు వేంకూవర్ కాన్ఫరెన్సులకి వెళ్ళినప్పుడు ఒకమ్మాయి ఇరానీ దేశస్తురాలని తెలిసాక (9/11 అప్పుడే జరుగుతుంది), అతని ఆలోచనల్లో వచ్చిన భయమూ, అనుమానమూ, మార్పుల వలన ఇంటికొచ్చాక ఊహించని షాక్ తగులుతుంది. ఇదీ ‘పడమటి సంధ్యారాగం’ కథ. ఇటువంటివి అమెరికాలో వింటూనే వుంటాం. ఈ కథ చదువుతూంటే ఒక ఇంగ్లీషు కథలా అనిపిస్తుంది.
అమెరికాలో స్థిరపడి, ఇండియా వచ్చిన తెలుగు పెళ్ళికొడుకుల ప్రహసనం “తీన్ కన్యా” కథ. అమెరికాలో ఉంటున్నాడు కనుక ఏ డాక్టరో, ఎం.బి.య్యే చదివిన అమ్మాయో అయితే బావుంటుంది అనుకున్న గోవిందరావుకి అమ్మాయిల తీరు షాక్ ఇస్తుంది. చివరకి ఏ అమ్మాయికి ఓటేసాడు అన్నది ఆసక్తి కరమైన మలుపు. ఈ కథలన్నీ, అనవసరపు వర్ణనలూ, సోదీ లేకుండా సూటిగా సాగుతాయి.
“– నల్లద్దాలతో, సైడు ఫోజులో పదేళ్ళ కిందటి తన పాత ఫొటో. ఆ ఫొటో కింద యస్.వి.ఆర్.గోవిందరావు (వెంకట్). సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (U.S.A). ఫోటో పక్కనే పెద్ద అక్షరాల్లో ఆకుపచ్చ బ్యాక్గ్రౌండులో ‘స్వదేశాగమన శుభాకాంక్షలూ అని హెడ్డింగు. దానికింద. “అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా అత్యుత్తమ సేవలందిస్తూ విరామము కొరకు, వివాహము కొరకూ స్వదేశానికి తిరిగి వస్తున్న మా “చి. గోవిందరావు”కి ఇవే మా శుభాకాంక్షలు –” ఎనభైల్లోనూ, తొంభైల్లోనూ ఇటువంటి వివాహ ప్రకటనలు తెగ వచ్చేవి.
అప్పట్లో పెళ్ళి చూపుల ప్రహసనం ఈ కథ. ఈ తీన్ కన్యా కథలో వేలూరి వ్యంగ్యం తారాస్థాయిలో వుంటుంది.
డాలరు ఒక మహమ్మారి. అమెరికా డాలరయితే మరీనూ. పట్టుకుంటే వదలదు. అది కలల్లోనూ, ఊహల్లోనూ, ఆఖరికి భ్రమల్లోనూ దూరుతుంది. దూరడమే కాదు డైనాసార్లా తయారవుతుంది. డాలరు వాల్యూ పడిందా అంతే సంగతులు. ఎంతో మంది ఇండియన్లకి, ముఖ్యంగా తెలుగువాళ్ళకి నిద్రా, స్థిమితమూ వుండవు. డాలర్ మీద ఎక్కి “ఎగిరే గుర్రాలు” కథల గురించి వింటూనే ఉంటారు, అమెరికాలో.
“ఇంకొక రెండేళ్ళు పట్టాలి. అంతే. తన కంపెనీ స్టాక్ ఇంకో పదిరెట్లు పెరిగి పోతుంది. ఆ తరువాత రిటైరయ్యి, బెజవాడ మార్తాండ శాస్త్రిని రప్పించి వీణ నేర్చుకోవాలి. లేదంటే హుస్సేన్ దగ్గరో, రామారావు దగ్గరో పెయింటింగ్ నేర్చుకోవాలి….గొంతు బాగానే వుంటుంది కదా లలిత సంగీతం నేర్చుకుంటేనో…? మన మాతృ దేశానికి ఏదన్నా సాయం చెయ్యాలి…ప్రాధమిక పాఠశాలకి లైబ్రరీ కట్టించాలి…ఒక్కో బడికీ రెండు కంప్యూటర్లు ఇవ్వాలి…అయినా వెధవ డబ్బు దాచుకొని ఏం చేసుకుంటారు కనుక…?” — ఇవి ఎగిరే గుర్రం ఆలోచన్లు. అచ్చం అమెరికాలో ఉండే మన వాళ్ళ ఆలోచన్లలా అనిపించడం లేదూ? ఇలా ప్రతీ కథలోనూ వేలూరి మార్కు కనిపిస్తూనే ఉంటుంది. మచ్చుక్కి కొన్ని చెప్పాను. పూర్తిగా అమెరికా జీవితానికి అలవాటు పడినా , ఇంకో పక్క స్వదేశంలో మనుషుల వైపు ఆరాటం ఓ పట్టన పోదు. ఇదొక డయాస్పోరా డోలాయమాన స్థితి.
అమెరికా జీవితం గురించి వ్యంగ్య రూపంలో ఇటువంటి కథలు ఈ పుస్తకంలో చాలా వున్నాయి.
ఎనభై, తొంభైల్లో తెలుగువారి కథలు కొన్నయితే, ఇవి కాకుండా కేవలం ఇండియాలో పాత జ్ఞాపకాల కథలూ ఉన్నాయి. క్లబ్బులో చెట్టు కథ, పన్నెండు పంపుల కథ, అంటు అత్తగారూ, ఇలా ఇంకొన్ని కథలున్నాయి.
తెలుగులో మనకి పొలిటికల్ సెటైర్ కథలూ, మైథలాజికల్ సెటైర్ కథలూ అంతగా లేవు. స్వర్గంలో స్ట్రిప్ టీజ్, బ్రహ్మ సృష్టి కథలు అలాంటివే. ఇవి కాకుండా కొన్ని చిత్ర కథనాలూ (పెన్ ఫొటోగ్రాఫ్స్), జ్ఞాపకాల కథలూ ఉన్నాయి.
కథలు అల్లడంలో వేలూరిది ప్రత్యేక శైలి. సూటిగా కథలోకి వెళిపోతారు. మొదటి రెండు వాక్యల్లోనే కథా నేపథ్యం కనిపిస్తుంది. ప్రత్యేకమైన వర్ణనలూ గట్రా వుండవు. అక్కడక్కడ రావిశాస్త్రి కథల్లా అనిపించే అవకాశం ఉంది. కానీ రావిశాస్త్రి కథల్లో ఉండే వర్ణనలూ, ఉపమానాలూ, ఉపోద్ఘాతాలూ కనిపించవు. ఒక్క సెటైర్ తప్ప.
ఈ పుస్తకానికి మకుటాయమయిన కథ ఒకటుంది. దాని పేరు – “గోమెజ్ ఎప్పుడొస్తాడో…?“. తెలుగువాళ్ళు ముఖ్యంగా ఎనభై, తొంభైల తరువాత అమెరికా వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆర్థికంగా (అమెరికా వాసుల్లో) మధ్య తరగతి కంటే ఎక్కువే అని చెప్పచ్చు. మాలాగే వలస వచ్చిన చైనా వాళ్ళూ, ముఖ్యంగా స్పానిష్ వాళ్ళూ కూడా ఇక్కడ ఎక్కువే. ఇక్కడ బ్రతకడం కోసం వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కార్పెంటర్ నుండి, గార్డెనింగ్ జాబులూ, క్లీనింగ్ జాబులూ ఇవన్నీ చేసేవాళ్ళల్లో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. మనలాగే వీరు వలస వచ్చినా, ఆర్థిక స్థితిలో చాలా తేడా ఉంది. అది ప్రవర్తనలోనూ కనిపిస్తుంది. ఒక్కోసారి వారి మీద చులకన అభిప్రాయాలు బయటకొస్తాయి. అటువంటి స్పానిష్ వ్యక్తి కథ – “గోమెజ్ ఎప్పుడొస్తాడో?”.
అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పని సరి. ఇది లేకపోతే ఏ డాక్టరూ కన్నెత్తి కూడా చూడరు. చాలామంది ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్కి ఈ ఇన్సూరెన్స్ ఉండే అవకాశం తక్కువ. వారికి ఏదైనా సుస్తీ చేసినా, యాక్సిడెంట్ అయినా ఆసుపత్రికి వెళితే తడిసి మోపెడవుతుంది.
నిజానికి ఎందరో తెలుగు వారు భార్యా పిల్లల్ని ఇండియాలో వదిలేసి బాడీ షాపింగ్ కంపెనీల ద్వారా వచ్చేవారు. కుటుంబమంతటికీ ఇన్సూరెన్స్ ఇచ్చే వారు కాదు. ఇదే పరిస్థితి చూచాయగా ఇప్పుడూ ఉంది. జబ్బులు రానంతవరకే. వచ్చాయంటే ఇన్సూరెన్స్ లేకపోతే దాన్ని మించిన నరకం ఉండదు. ఇహ ఇల్లీగల్గా వచ్చిన మెక్సికన్ వారి సంగతి మరీ ఘోరం. ఈ డయాస్పోరా అనుభవాన్ని ఎంతో సున్నితంగా ఈ కథలో చూపించారు వేలూరి. ఆర్థికంగా ఒక మెట్టు పైన ఉన్నంత మాత్రాన అది మానసికంగానూ, ప్రవర్తనలోనూ ఉండదు అన్న సత్యాన్ని దృశ్యం రూపంలో చెప్పే కథ ఇది.
చివర్లో జాలీ, కరుణా కథని వదిలి మనల్ని అంటి పెట్టుకుంటాయి. ఒక మంచి కథ చేసే పనే అది.
కథలు రాయాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకం నిండా రకరకాల కథన రీతులు కనిపిస్తాయి. ఎంత చిన్న వస్తువయినా కథా రూపంలో ఎలా మలచవచ్చో తెలుస్తుంది. కాకపోతే కొన్ని కథల్లో కథనం మాత్రం అమెరికన్ స్టైల్లో ఉంటుంది. నలభయ్యేళ్ళుగా ఇక్కడ ఉంటున్న వేలూరి గారి మీద అమెరికన్ కథ ప్రభావం లేదు అనుకోలేము. చాలా కథల్లో క్లుప్తత కనిపించడం ఇందువలనే అనిపిస్తుంది.
“వేలూరి కథలు అమెరికా తెలుగువాళ్ళ వ్యవహార శైలిపై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ్య కథలు. కథని, పాత్రల్ని నిర్మించడంలో, నడిపించడంలో ఆయనకి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమయ్యింది. హాస్య, వ్యంగ్య ధోరణిలో కథలు నడిపినా, వాటిల్లో ఆవేదనా, ఆవేశమూ ఉన్నాయి” – అని సిఫార్సు చేసారు ముందు మాట రాసిన వాసిరెడ్డి నవీన్. మీరూ, నేనూ, అందరం ఆయనతో ఏకీభవిస్తాం, పుస్తకం చదవడం పూర్తయ్యాక.
చివరగా – ఈ పుస్తకంలో కథలన్నీ ఒక ఎత్తు, వేలూరి “మా తెలుగు మాస్టార్ని తలచుకుంటూ…” తన మాటగా రాసిన వ్యాసం ఇంకో ఎత్తు. కథలకంటే ముందు ఇది చదవండి. మీ కళ్ళు చెమరుస్తాయి.
(అక్టోబరు 12 వేలూరి గారి జన్మదిన సందర్భంగా….)
వేలూరి ఇతర రచనలూ, కొన్ని కథలూ: లింక్
పుస్తకం: ఆ నేల, ఆ నీరు, ఆ గాలి (కథలు)
రచయిత: వేలూరి వేంకటేశ్వర రావు
వెల: Rs.80, $8
లభించు చోటు: నవోదయా (హైద్రాబాద్), www.kinige.com
**** (*) ****
అందరూ తప్పక చదవవలసిన వేలూరి వేంకటేశ్వర రావు గారి కథల పుస్తకం ” ఆ నేల, ఆ నీరు, ఆ గాలి ” ను
పరిచయం చేసిన గొర్తి సాయి బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు.
పుస్తకం.నెట్ అంతర్జాల పత్రికలో వచ్చిన … వేలూరి వేంకటేశ్వర రావు గారిని సాయి బ్రహ్మానందం గారు చేసిన ఇంటర్వ్యూ …
( విశ్వనాథ, శ్రీశ్రీ, తిలక్, చాసో, శ్రీపాద, రావిశాస్త్రి వారికి నచ్చిన కవులూ, కథకులు అని చెప్పిన ఇంటర్వ్యూ )
కూడా ఈ సందర్భంలో తప్పక చదవవలసినది : http://pustakam.net/?p=13861
వేలూరి గారి కథలు పుస్తకం లభించు చోట్లు : ( పుస్తకాభిమానుల సౌకర్యార్ధం మరో సారి )
కినిగె : http://kinige.com/book/Aa+Nela+Aa+Neeru+Aa+గాలి
నవోదయ బుక్ హౌస్ కాచిగూడా, హైదరాబాదు : https://www.telugubooks.in/