కథ

పార్డన్ మి ప్లీజ్!

డిసెంబర్ 2017

FADE IN:

EXT. శాండియేగోయూనివర్శిటీ
గ్రాడ్యుయేషన్వేడుకఉదయం 9:00AM

(అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో శాండియేగో యూనివర్శిటీ ప్రాంగణం.
విద్యార్థులు స్నాతకోత్సవ దుస్తులు ధరించి కుర్చీలలో కూర్చుని ఉన్నారు.
వేదిక మీద ముఖ్య అతిధులుతో పాటు యూనివర్శిటీ చాన్సెలర్, ఇంకా మరికొంతమంది ఉన్నారు.
వెనుక భాగంలో విద్యార్థుల తల్లితండ్రులూ, స్నేహితులూ నిల్చుని వీక్షిస్తున్నారు.
కొందరి చేతుల్లో వీడియో కెమేరాలూ, మామూలు కెమేరాలూ, సెల్ఫోన్ కెమేరాలతో ఆక్కడి దృశ్యాలని బంధిస్తున్నారు.
వేదిక దగ్గర నిశ్శబ్దంగా ఉన్నా, వెనుక భాగం కొలాహలంగానే ఉంది.
తదుపరి అంశంగా విద్యార్థుల ప్రసంగ వివరాలు మైకులో ప్రకటన.)

 

వాచకుడు

“ఇప్పుడు విద్యార్థులు వారి నాలుగేళ్ళ కాలేజీ అనుభవాలను మనతో పంచుకుంటారు.
ప్లీజ్ వెల్‌కమ్ ఎ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఫ్రొమ్ థర్‌గుడ్ కాలెజ్ విలియమ్ జోర్డాన్!”

(వాచకుడి నిష్క్రమణ)

DISSOLVE TO:

(విలియమ్ జోర్డాన్ బలిష్టమైన నల్లజాతి వ్యక్తి. ఆరడుగుల పొడవు. వయసు ఇరవైమూడేళ్ళు. విద్యార్థుల కరతాళధ్వనుల మధ్య మెల్లగా నడుచుకుంటూ డయాస్ వైపుగా నడుస్తాడు. గొంతు సవరించుకొని మాట్లాడడానికి సిద్ధమవుతాడు.)

విలియమ్ జోర్డాన్

వారానికి ఏడు రోజులు.
పన్నెండు వారాలకి ఒక త్రైమాసికం.
వెరసి ఏడాదికి మూడు.
ఇలా ఇక్కడ నాలుగేళ్ళ అనుభవాలు.
కొన్ని తీపివీ. మరికొన్ని చేదువీ.
కొన్ని మామూలువీ. మరికొన్ని అద్భుతమైనవీ.
ఈ కాలేజీ ప్రాంగణంలో – ఎన్నో పరిచయాలూ, సాంగత్యాలూ, సంభాషణలూ, ఒప్పికోళ్ళూ, వాదాలూ, వివాదాలూ -  ఇవన్నీ నన్నొక కొత్త వ్యక్తిగా మార్చాయి.

ప్రెశిడెంట్ మార్టిన్, డీన్ మేథ్యూ, స్నేహితులారా, నా కుటుంబ సభ్యులారా, మీ అందరితో నా అనుభవాన్ని పంచుకోవడం ఒక అదృష్టం…

DISSOLVE TO:

(నాలుగో వరసలో ఉన్న విద్యార్థి సాగర్ వయసు ఇరవై మూడేళ్ళు. అతనూ గ్రాడ్యుయేట్ గౌను ధరించాడు. సాగర్ జేబులో నుండి సెల్ఫోన్ తీసి, వాట్సాప్ కాంటాక్ట్స్ లో వాళ్ళ అమ్మ నంబరు తీసుకొని టెక్స్ట్ మెసేజ్ పెట్టడం మొదలు పెట్టాడు.)

సాగర్: ” మామ్! నీకో నీకో షాకింగ్ న్యూస్…ఇప్పుడు స్టేజిమీద విలియమ్ మాట్లాడు తున్నాడు.”

(పది సెకన్ల తరువాత ఫోనులో విండో పాపప్ అవుతుంది. ఆవలి వైపునుండి సాగర్ తల్లి ప్రతిమ జవాబు.)

ప్రతిమ ” వాట్…ఏ…విలియమ్?…”
సాగర్ “వాడే ఆ డర్టీ ఫెలో. నీ పాలిట…”
ప్రతిమ: “రియల్లీ…? వాడెందుకున్నాడు?… ”
సాగర్:   “ఐ డోంట్ నో!  మాట్లాడే వాళ్ళల్లో వాడూ ఒక స్టూడెంట్!
బైద వే – తాతకి ఎలా వుంది?”

ప్రతిమ: “సీరియస్ అన్నారు డాక్టర్లు. ఇంకా కోమాలోనే
ఉన్నాడు… నీరజ మొత్తం వీడియో తీస్తోందా…?
ఐ మిస్ యూ నాన్నా! ”

సాగర్:   “తీస్తోంది. వాడు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్‌ట…స్టేజి మీద
మాట్లాడు తూ ఇప్పుడే చెప్పాడు.. ఎనీవే  బై, ttyl! ఐ మిస్ యూ మామ్!”

ప్రతిమ:   “బై..”

DISSOLVE TO:

విలియమ్

నేనొక దౌర్భాగ్య విద్యార్థిని. ఇలా చెబితే మీరు నమ్మరు.
ఎందుకంటే కొద్ది క్షణాల్లో నేను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కాబోతున్నాను.
ట్రైటన్ బేస్కెట్‌బాల్ జట్టులో మన యూనివర్శిటీకి ఆడాను.  ఇవన్నీ చూసి మీరు నన్నొక గొప్ప విద్యార్థిననుకొని భ్రమ పడేరు. నేనొక మొద్దు విద్యార్థిని.
చిన్నప్పట్నుండీ నాకు చదువు మీద అస్సలు శ్రద్ధ లేదు. మాది బీద నల్లజాతి కుటుంబం.
నేను అయిదో తరగతిలో ఉండగా మా అమ్మా, నాన్నా విడాకులు తీసుకున్నారు. ఊహ తెలిసాక మా నాన్నని చూడలేదు. మా అమ్మ వేరెవరినో పెళ్ళిచేసుకుంది.
నా అలనా, పాలనా మా అమ్మమ్మే చూసింది.
మేం ఇద్దరం ఈస్ట్ పాలో ఆల్టోలో ఉండేవాళ్ళం. అక్కడే ఎలిమెంటరీ వరకూ చదివాను.
నేను బాగా చదవాలని మా అమ్మమ్మ క్యుపర్టినో మారింది. అలా నేను కెనడీ మిడిల్ స్కూల్లో చేరాను.
ఆ స్కూలికి మంచి రాంకింగ్ ఉంది. ఆ స్కూల్లో చదువు ఒత్తిడి తట్టుకోవడం నా వల్ల కాలేదు.
నా దృష్టంతా బేస్కెట్ బాల్ ఆడటం మీదనే ఉండేది.
హోం వర్కులన్నీ మిగతా ఫ్రెండ్సు దగ్గర కాపీ కొట్టేవాణ్ణి.
ఫైనల్ పరీక్షలు సరిగా రాయలేదు. మరలా ఆరో తరగతి చదవాల్సి వస్తుందని అనుకున్నాను.
ఎలా పాస్ చేసారో నాకు తెలీదు. ఏడో తరగతిలో ప్రవేశించాను.
సరిగ్గా అప్పుడే నాకు మిస్ ప్రతిమ గుప్తా పరిచయం అయ్యింది.
ఆవిడ మా లెక్కల టీచరు. జామెట్రీ క్లాసు చెప్పేది. నాకు లెక్కలంటే చచ్చేటంత భయం.
ఆవిడ చాలా గట్టి టీచర్.  హోం వర్కులకి ఫ్రెండ్స్ సాయం పట్టేవారు. మొదటి టెస్టులో నాకు సున్నా మార్కులొచ్చాయి…

DISSOLVE TO:

(సాగర్ వాళ్ళమ్మకి  ఫోనులో Text చేస్తున్నాడు.)

సాగర్:  “అమ్మా! విలియమ్ నీ గురించి చెబుతున్నాడు.”

(ఆవలి వైపు నుండి జవాబు లేదు. నిరాశగా తలాడిస్తూ స్టేజి వైపు దృష్టి సారించాడు.)

DISSOLVE TO:

విలియమ్

….క్లాసు అయ్యాక కలవమని చెప్పింది. సరిగ్గా అప్పుడే నాకు బేస్కెట్‌బాల్ ఆడే వేళ.
మిస్ ప్రతిమని కలవలేదు. మర్నాడు క్లాసుకి వెళ్ళడానికి భయం వేసింది. ఎగ్గొట్టేసాను.
హిస్టరీ క్లాసులో ప్రిన్సిపాల్ ఆఫీసు నుండి రమ్మనమని కబురొస్తే వెళ్ళాను.
మిస్ గుప్తాతో మూడున్నరకి మీటింగ్.
బాస్కెట్ బాల్ ఆట పోతుందని మరో పక్క కోపం. భయం భయంగా వెళ్ళాను.
పరీక్ష ఎందుకు సరిగా రాయలేదని ప్రశ్న.
నాకు లెక్కలు రావని చెప్పాను.
మరి హోంవర్క్ ఎలా చేస్తున్నావు.
కాపీ కొట్టానని గట్టిగా రెట్టిస్తే చెప్పాను.
రోజూ స్కూలయ్యాక మూడింటికి తన క్లాస్ రూముకి రమ్మనమనీ, అక్కడే హోం వర్కు చెయ్యాలని చెప్పింది.
సరే నన్నాను పైకి. లోపల తెగ తిట్టుకున్నాను. చంపేయాలన్నంత కోపం వచ్చింది.
మర్నాడు క్లాసయ్యాక బేస్కెట్ బాల్ ఆటకి వెళ్ళాను. కొంతసేపయ్యాక అక్కడకి మిస్ ప్రతిమ వచ్చింది.మధ్యలో ఆపి తిట్టుకుంటూ ఆవిడ వెనుకే వెళ్ళాను…

DISSOLVE TO:

(సాగర్ నీరజకి మెసేజి చేసాడు. పద్దెనిమిదేళ్ళ నీరజ సాగర్ చెల్లెలు.)

సాగర్: “విలియం అమ్మ గురించి చెబుతున్నాడు…విన్నావా…?”
నీరజ: “చూసా.”

(సాగర్ తల్లికి మరలా మెసేజ్ చేసాడు.)

CUT TO:

INT. HOSPITAL ICU ROOM – HYDERABAD, INDIA

(కుర్చీలో తూలుతూ కునుకు తీస్తున్న  ప్రతిమ ఫోన్ మెసేజ్ రింగుకి ఒక్కసారి ఉలిక్కిపడి లేచి చూసింది.
గదంతా నిశ్శబ్దంగా ఉంది. ముఖం నిండా గొట్టాలతో తండ్రి బెడ్‌మీద అచేతనంగా కనిపించాడు.
మరలా ఫోన్ మెసేజ్ కేసి చూసింది.  ఒక్కసారి ఆమెకు విలియమ్ గుర్తుకొచ్చాడు.)

CUT TO:

INT. CUPERTINO-KENNEDY MIDDLE SCHOOL ROOM NO.10:

(విలియమ్ తలదించుకొని ఉన్నాడు. ప్రతిమ కళ్ళెర్రజేస్తూ అతని వైపు చూసింది. అతను తలెత్త లేదు.)

ప్రతిమ

“నీకు బేస్కెట్ బాల్ అంటే అంత ఇష్టం కదా? బాల్ సైజు ఎంతుంటుంది? ఐ మీన్ డయామీటర్ ఎంతో తెలుసా?”

(తెలీదన్నట్లు తలాడించాడు.)

“పోనీ రింగ్ సైజయినా తెలుసా?”

(మరలా అదే జవాబు. తలదించుకున్నాడు.)

“నీ హోం వర్కు అదే. తెలుసుకురా?”

(సరేనని మెల్లగా రూము బయటకి వచ్చాడు.)

CUT TO:

(స్కూల్ బెల్ మ్రోగుతుంది. పిల్లలందరూ క్లాస్ రూము నుండి బయటకి బిలబిలా వస్తున్నారు.
విలియమ్ రూమ్ నంబరు 10 వైపుగా వెళుతున్నాడు. ఎప్పటిలాగే మధ్యాన్నం స్కూలు తరువాత క్లాస్.
లోపలకి వెళ్ళగానే ఒక కాగితమ్మీద రాసింది మిస్ ప్రతిమకిచ్చాడు.
ప్రతిమ చూసి నవ్వుకుంది.)

ప్రతిమ

“చూసావా? ఒక బాల్ తయారు చెయ్యాలంటే దాని సైజు తెలియాలి.
ఇంకా ఈ బేస్కెట్ బాల్ రిమ్ ఎంత ఎత్తుండాలీ, రింగ్ సైజు ఎంతా? ఇవన్నీ జామెట్రీ తెలిస్తే చాలా ఈజీ.
అదే కాదు, నువ్వు దూరం నుండి బేస్కెట్ వెయ్యాలంటే ఏ ఏంగిల్లో వెయ్యాలి? ఎంత లూపులో విసరాలి ఇవన్నీ లెక్కలే…”

(విలియమ్ నవ్వాడు. ప్రతిమ జామెట్రీ లెక్కలు చెబుతోంది. అవి పూర్తి చేసి వెళుతూండగా…) -

ప్రతిమ (CONT’D)

“విలియమ్!  నీకు క్రిసమస్‌కి  ఏ గిఫ్ట్ కావాలనుకుంటున్నావు?”

విలియమ్

“ఐ లైక్ కోబీ బ్రాయన్ హైపర్ డంక్ షూస్! మా అమ్మమ్మని అడిగాను. మూడొందల డాలర్లు పైనే అంది…”

ప్రతిమ

“నువ్వు లెక్కలు బాగా చెస్తే మీ అమ్మమ్మని కొనమని చెబుతాను…. బట్ టూ నీడ్ టు వర్క్ హార్డ్!”

(విలియమ్ మొహంలో చిన్నగా చిరునవ్వు…)

CUT TO:

EXT. SAN DIEGO GRADUATE CEREMONY STAGE

విలియమ్ (CONTD…)

మాకు వేరే స్కూళ్ళతో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ఉంది. జిమ్‌లో ప్రాక్టీసు చేసేవాళ్ళు. దాని కోసం స్కూలు ఎగ్గొట్టేవాణ్ణి. ఎవరూ లేకపోయినా నే ఒక్కణ్ణే ప్రాక్టీసు చేసేవాణ్ణి.
ఈ విషయం అమ్మమ్మకీ తెలీదు. ఆవిడ నన్ను స్కూల్ దగ్గర దింపగానే క్లాసుకి వెళ్ళకుండా జారుకునేవాణ్ణి.
ఓ వారం రోజులు స్కూలుకి రావటంలేదని ఇంటికి నోటీసు వచ్చింది. అది చూసి అమ్మమ్మ నన్ను నిలదీసింది.
మిస్ ప్రతిమ నన్ను లెక్కలు చెయ్యడంలేదని బెదిరిస్తోందని స్కూలంటే భయంతో వెళ్ళడం లేదనీ అబద్ధం చెప్పాను. నేనొక ఘోరమైన అబద్ధం చెప్పాను.
మా అమ్మమ్మ స్కూల్లో మిస్ ప్రతిమ మీద కంప్లైంట్ చేసింది.
అది మామూలు కంప్లైంట్ కాదు. మిస్ ప్రతిమ రేసిజం చూపిస్తోందని ఫ్రీమాంట్ యూనియన్ స్కూల్ యూనియన్‌కి ఫిర్యాదు చేసింది.
ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలీదు. మిస్ ప్రతిమ గుప్తాని స్కూల్ నుండి సస్పెండ్ చేసారు.
సరిగ్గా అప్పుడే మా అమ్మమ్మకి శాండియేగోలో కొత్త జాబ్ వచ్చి మేం బే యేరియా వదిలేసాం…
ఇదంతా ఎందుకు చెప్పానంటే – మిస్ ప్రతిమా నాకు ఎంతో మేలు చేసింది.
తలచుకున్నప్పుడల్లా గిల్టీ ఫీల్ అవుతాను. ఆ గిల్టీయే నన్నింత వాణ్ణి చేసింది.
ఎలాగైనా బాగా చదవాలన్న పట్టుదల నాకు కలిగింది.
ఆవిడ వేసిన పునాదే ఇవాళ నేను మీతో మాట్లాడేలా చేసింది. ఐ నెవర్ ఫర్గెట్ హెర్.
ప్రతీ క్రిస్మస్‌కీ మిస్ ప్రతిమా గుప్తాని తల్చచు కుంటాను.
నేను లెక్కల్లో శ్రద్ధ చూపించడం చూసి మిస్ ప్రతిమ ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. మా అమ్మమ్మకి చెప్పలేదు. కోబీ షూస్!
నా జీవితంలో ఒక ఖరీదైన బహుమతీ అదే.
మిస్ ప్రతిమా గుప్తా పరిచయం అవ్వడం నా అదృష్టం.
మీ అందరి ముందూ ఇలా చేసిన తప్పు ఒప్పుకోవడం ఇంకా పెద్ద అదృష్టం.
చివరగా -
కొంతమంది టీచర్లు పాఠం మాత్రమే చెప్పరు.
నడక నేర్పుతారు. మార్గదర్శకులవుతారు.
దానికి నేనే ప్రత్యక్ష సాక్షి.
ఇవాళ నేను అందుకోబోయే డిగ్రీ నాది కాదు.
మిస్ ప్రతిమా గుప్తాది.
We are all here because of our teachers!
థాంక్యూ!!

(విలియమ్  ప్రసంగం ముగించగానే అందరూ కుర్చీల్లోంచి లేచి నిలబడ్డారు. ఆ ప్రాంగణమంతా తప్పట్లతో మిన్నంటింది.)

CUT TO:

INT. HOSPITAL ICU ROOM

(ప్రతిమ కుర్చీలో అటూ ఇటూ అసహనంగా జరిగి, ఒక్క సారి కళ్ళు మూసుకుంది. పదే పదే ఒక సంఘటన గుర్తుకొస్తోంది.)

CUT TO:

INT. KENNEDY MIDDLE SCHOOL PRINCIPAL’S OFFICE

(ప్రిన్సిపల్ షెర్లీ డేవిడ్ ప్రతిమ కేసి చూసి అంటోంది.)

షెర్లీ డేవిడ్

“మిస్ ప్రతిమా గుప్తా!  నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు గిల్టీ కాదని.
కానీ ఫ్రీమాంట్ యూనియన్ స్కూల్ యూనియన్ వేసిన కమిటీ అలా అనుకోవడం లేదు.
నువ్వు అతన్ని నిగ్గర్ అన్నావనీ,  నీ చర్యల్లో రేసిజం చూపించావని…(కొంతసేపు మౌనం)
నీలాంటి మంచి టీచర్ కోల్పోవడం మా దురదృష్టం. రూల్స్ రూల్సే!
సారీ! ఐ కాంట్ డూ యెనీ థింగ్.
రియల్లీ సారీ ఫర్ యూ!”

(తలదించుకొని మిస్ ప్రతిమా గుప్తా బయటకి వచ్చింది. కారు డోరు తీస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. కెనెడీ మిడిల్ స్కూల్ బోర్డు చూడగానే రెండు కన్నీటి చుక్కలు జారాయి.)

CUT TO:

INT. HOSPITAL ICU ROOM

(గతం నుంచి బయటకొచ్చింది ప్రతిమ. ఆసుపత్రి గదిలో చుట్టూ చూసింది.
అప్రయత్నంగా కంటిమీద జారిన రెండు కన్నీటి చుక్కల్ని తుడుచుకుంది.)

CUT TO:

EXT. SAN DIEGO GRADUATE CEREMONY AREA

(మెళ్ళో హవాయి పూల దండా, తలమీద గ్రాడ్యుయేట్ టోపీ పెట్టుకొని సాగర్ ఫ్రెండ్స్‌తో ఫోటోలు తీస్తోంది నీరజ.
ఫోటోలు తీయడం అయ్యాక హేండ్ బ్యాగు సర్దుకుంటూ, పక్కకు తిరిగి చూస్తే – తన వైపే నడుచుకుంటూ నవ్వుతూ వస్తోంది షెర్లీ డేవిడ్.)

షెర్లీ

“హాయ్! సగార్! కంగ్రాట్యులేషన్స్! మా అమ్మాయి నటాషా కూడా ఇక్కడే గాడ్యుయేట్ అయ్యింది…”

(అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హేండ్సూ ఇచ్చుకున్నారు. మిస్ డేవిడ్‌తోనూ, ఆమె కూతురు నటాషాతో ఫొటోలు దిగారు.)

షెర్లీ (CONT’D)

“నీర్జా! మీ అమ్మ ప్రతీమ ఎక్కడ…?”

నీరజ

“అమ్మ ఇండియాలో వెళ్ళింది. మా తాతకి సీరియస్‌గా ఉంది…”

షెర్లీ

“ఐ యాం సారీ…మీ అమ్మ ఫోన్ నంబరు ఇస్తావా…? పాత ఫోన్ నంబరుకి చేస్తే వెళ్ళడం లేదు…”

(అలాగేనని తలూపుతూ ఫోను తీసి నీరజ షెర్లీకి ప్రతిమ సెల్ నంబరుకి మెసేజి ఇచ్చింది. వాళ్ళకి బై చెప్పి షెర్లీ డేవిడ్ అక్కణ్ణుంది వెళిపోయింది.)

CUT TO:

FADE IN:

DISPLAY ON THE SCREEN: “మూడు వారాల తరువాత”

INT. KITCHEN HALL IN PRATIMA’S HOME

(ప్రతిమ ఫోన్ మ్రోగుతుంటే టేబిల్ వైపు వెళ్ళి తీసుకుంది.)

ప్రతిమ

“హలో!”

షెర్లీ

“హే ప్రతీమా!. దిసీజ్ షెర్లీ…”

(ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.)

(VOICE MUTE ON SCREEN)

ప్రతిమ

“మిస్ షెర్లీ!  థాక్స్ ఫర్ ద ఆఫర్!  ఆలోచించుకొని చెబుతాను. కెనడీ వదిలేసాక టీచింగ్ వదిలేసాను…”

షెర్లీ

“ప్రతీమా! విను. చాలెంజర్ ప్రవైటు స్కూలు. పైగా నీలాంటి టీచర్ మాకు కావాలి. నీకో విషయం తెలుసా…? నీమీద ఎవరైతే నేరం మోపారో అతనే ఇప్పుడు గిల్టీ.
శాండియేగో కాన్వకేషన్‌లో కలిసాను.
హీ ఈజ్ రియల్లీ సారీ ఫర్ వాట్ హి డిడ్ టూ యూ.
నీ గురించి అడిగాడు.  నిన్ను కలుస్తానని అన్నాడు…నేను విలియంతో చాలా సేపే మాట్లాడాను. వాడు చాలా మారాడు…”

(షెర్లీ చెప్పుకుంటూ పోతోంది. ఫోన్ అక్కడ టేబిల్ మీద పెట్టి గ్యాస్ స్టౌవ్ మీద పెట్టిన పాస్తా గిన్నె మూత తీసి చూసి, స్టౌవ్ కట్టేసి వెనక్కి వెళ్ళి ఫోను అందుకుంది.)

ప్రతిమ

“షెర్లీ! అతన్ని కలవాలని నేను అనుకోవడం లేదు.
కోలుకోలేని గాయం చేసి పారిపోయాడు.
కోలుకోవడానికి రెండేళ్ళు పట్టింది.
అయినా నాకంత పెద్ద మనసు లేదు.
ఐ డోంట్ వాంట్ టూ మీట్ హిమ్ యటాల్!”

షెర్లీ

“విలియం చాలా మారాడు. ప్లీజ్ ట్రస్ట్ మి!
బై ద వే – అతనికి పెళ్ళయ్యింది…కూడా…”

ప్రతిమ

“షెర్లీ! నేను వెళ్ళాలి. చాలెంజర్ విషయం రెండు మూడ్రోజుల్లో చెబుతాను… గివ్‌మీ సమ్ టైమ్…”

(ఫోన్ పెట్టేసింది ప్రతిమ.)

FADE OUT:

(సరిగ్గా అప్పుడే సాగర్ అటు వైపుగా వచ్చాడు.)

ప్రతిమ

“చిన్నా! ఇప్పుడే కెనడీ స్కూల్ ప్రిన్సిపాల్ షెర్లీ ఫోన్ చేసింది. ఆమె ఇప్పుడు చాలెంజర్ హై స్కూల్ ప్రిన్సిపాలట. నన్ను వాళ్ళ స్కూల్లో చేరమని అడుగుతోంది…”

సాగర్

“రియల్లీ…నువ్వేమన్నావు…”

ప్రతిమ

“ఆలోచించుకొని చెబుతాను అన్నాను. ఇంకోటి కూడా చెప్పింది. విలియమ్ గురించి ప్రస్తావన తెచ్చింది. నన్ను కలవాలని ఎంతో ఆరాట పడ్డాడని చెప్పింది. విలియమ్ కి పెళ్ళయ్యి ఒక కూతరట. కూతురికి నా పేరు…”

సాగర్

“వాడొక డర్టీ డెవిల్! ఈడియట్. నిన్నూ, నీ కెరీర్ని ధ్వంసం చేసాడు… వాడి పేరు తలుచుకోడానికి సిగ్గు లేదూ?”

ప్రతిమ

“విషయం చెబుతున్నాను. అంతే…నేను వాణ్ణి ఎప్పటికీ క్షమించను…”

సాగర్

“వాణ్ణి నువ్వు క్షమించినా క్షమించకపోయినా నేను మాత్రం నిన్ను క్షమించలేను మామ్…ఒక విషయంలో…”

(ఏమిటన్నట్లు చూసింది ప్రతిమ.)

సాగర్ (CONT’D)

“నీకు గుర్తుందా! ఆ స్కూలు సంఘటన ముందు మనింట్లో ఒక పెద్ద రాద్ధాంతం చేసావు నువ్వు.
దాదాపు నీతో రెణ్ణెళ్ళు మాట్లాడ లేదు నేను. క్రిసమస్‌కి నాన్న నాకు కోబీ బ్రాయన్ బ్లాక్ మాంబా షూ కొంటానని ప్రామిస్ చేశారు. అంత ఖరీదు వద్దని నువ్వు బలవంతాన నాన్నని ఆపేసావు.
కానీ నువ్వు ఆ యాబ్రాసికి మూడొందలు పెట్టి మరీ కొనిచ్చావు. ఇన్నాళ్ళూ మాకు చెప్పకుండా దాచావు…
ఇదెప్పటికీ మర్చిపోలేను. ఈ విషయంలో చచ్చినా నిన్ను క్షమించను గాక క్షమించను…యూ ఆర్ ఏ బిగ్ ఫ్యాట్ లయర్!”.

(అనేసి అతను విసూరుగా వెళిపోయాడు. అతను వెళ్ళిన వైపే ఆమె చూస్తూ ఉండిపోయింది.)

FADE TO BLACK.

THE END