మనకిప్పుడు ఎక్కడికైనా వెళ్ళటానికి బస్సులు, రైళ్లు, విమానాలు, ఎవరితో అయినా మాట్లాడటానికి రకరకాల సమాచార వ్యవస్థలు, ఏ మూల పల్లెటూరికైనా కనీసం ఒక మట్టిరోడ్డు, మన స్థిర చరాస్తు లేవైనా కానీ వాటిమీద మన హక్కు, మనమీద ఎవరైనా దాడి చేస్తే పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఇంకో ఆలోచన లేకుండా మన జీవితంలో బాగం అయిపొయాయి. ఇవన్నీ లేని ఒకానొక కాలంలో – 1824 లో – ఇంగ్లాండు నుండి ఒక 16 ఏళ్ల కుర్రవాడు బొంబాయిలో ఈ దేశపు గడ్డ మీద అడుగుపెట్టి ఒక 36 సంవత్సరాలు ఈ దేశంలో తిరుగుతూ తను చూసిన కళ్ళతో అక్షరాల్లో అవన్నీ చూపిస్తుంటే చూడటం ఎంత బావుంటుంది. ఈ రోజు భారతదేశం కంటే అప్పటి భారతదేశం కళ్ళకింకా ఇంపుగా కనపడుతుంది అతని అక్షరాల్లో.మెడోస్ టైలర్ ఇంగ్లాండ్ లోని లివరపూల్ లో 1808 లో పుట్టాడు. తండ్రివైపు, తల్లివైపు బంధువులు ఇంగ్లాండ్ లో పలుకుబడి గల కుటుంబాలకు చెందినవాళ్ళు. తండ్రి వ్యాపారమేదో చేసి నష్టపోయాడు. మెడోస్ టైలర్ ది అత్తెసరు స్కూల్ చదువు. 13, 14 ఏళ్ల వయసులోనే భారతదేశం తో వ్యాపారం చేసే సంస్థలో ఒక చిన్న ఉద్యోగం చేసాడు. తండ్రి లాగే అతనికీ వ్యాపారం చేయటమంటే ఇష్టం. బాక్సర్ అనే వ్యాపారస్థుడి దగ్గర బొంబాయి లో పనిచేయటానికి, భవిష్యత్తు లో అతని వ్యాపారం లో భాగమవ్వటానికి మాట్లాడుకుని మెడోస్ టైలర్ ఇంగ్లాండ్ నుండి ‘నాలుగున్నర నెలలు ప్రయాణం’ చేసి తన పదహారవ ఏట 1824 లో బొంబాయి లో కాలు పెట్టటం తో అతని భారతదేశ ప్రస్థానం మొదలవుతుంది.మెడోస్ టైలర్ ఒకరకమైన ప్రజ్ఞ తో పుట్టాడు. ఇచ్చిన పని సమర్ధవంతం గా చేయగలడు అనే గురి అతనిమీద ఎవరికయినా కలుగుతుంది. భారతదేశం లో బాక్సర్ వ్యాపారం సరిగా లేకపోవటం, బాక్సర్ నుంచి సకాలంలో సరియైన సమాచారం బొంబాయి చేరకపోవటం అనే కారణాల వల్ల తన తల్లి పెత్తల్లి కుమారుడైన బొంబాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘ న్యూ హోమ్’ సహాయం చేసి హైదరాబాద్ లో నిజాం కొలువులో సైనికోద్యోగం ఇప్పిస్తాడు మెడోస్ టైలర్ కి.
బొంబాయి నుండి బయలుదేరేటప్పుడు ‘ నువ్వు ఉపయోగపడతావని తేలగానే నిన్ను ఉపయోగకారిగా చేస్తారు. నిబ్బరంగా తెలివితేటలతో చేసుకో, విజ్ఞతతో వ్యవహరించమని చెప్పిన న్యూ హోమ్ సలహా తో బొంబాయి నుండి హైదరాబాద్కు బయలుదేరతాడు మెడోస్ టైలర్.
పనిచేస్తూ నేర్చుకోవడం, అట్లా నేర్చుకున్న పనిని సమర్ధవంతంగా చేయటం, అట్లా పనిచేస్తూ తన చుట్టూవున్న వాళ్ళ హృదయాలని గెలుచుకోవటం మెడోస్ టైలర్ కి అప్రయత్నంగా అబ్భింది. ఈ పుస్తకం పూర్తయ్యాక మనల్ని ఆకర్షించింది మెడోస్ టైలర్ వ్యక్తిత్వమా, ఆయన చూపించిన మన దేశమా అని తేల్చుకోలేకపోతాం.
1758 ప్లాసీ యుద్ధం తరువాత భూమి నుండి వచ్చే ఆదాయం, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మీద పన్ను ద్వారా లభించే డబ్బు ఆయా ప్రాంతాల్ని బట్టి స్థానిక సంస్థానాధీశులకైనా, జమీందార్లు నవాబులకైనా, నిజాముకైనా, కొన్ని చోట్ల ప్రత్యక్షంగానూ, కొన్ని చోట్ల పరోక్షంగానూ పరిపాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ కయినా అదే ఆదాయ వనరు. వీళ్ళందరితో పాటు అప్పటికి లక్షల్లో అప్పులివ్వగలిగే వడ్డీ వ్యాపారస్తులు బలమైన వర్గం.
ఈస్ట్ ఇండియా కంపెనీ కున్న ఇంకో వెసులు బాటు వ్యవసాయం ద్వారా వచ్చే మిగులుని వర్తకానికి ఉపయోగించి వాళ్లదేశం నుండి తెప్పించిన వెండీ, బంగారం తో చెల్లింపులు చెయ్యకుండా ఇక్కడి వ్యవసాయం మీద మిగులుతోచేసి, దేశమంతటా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరింపచేసుకోవటం వాళ్ళకి మాత్రమే వున్న వెసులుబాటు. వ్యవసాయం మీద ఎక్కువ మిగులు రావాలంటే వ్యవసాయం చేసే విస్తీర్ణం పెరగాలి. కొన్ని ప్రాంతాల్లో జమీందార్ల కింద గానీ ఇంకొన్ని ప్రాంతాల్లో రైతువారీ పద్ధతి ద్వారా గానీ వ్యవసాయం చేసే రైతులకి, కౌలుదార్లకీ ఏ భూమి మీద అయితే కష్టపడుతున్నారో ఆ భూమి మీద కష్టపడే హక్కు, స్థానిక పెత్తందార్ల మూలాన సందేహాస్పదంగా మిగిలిన ఆ హక్కు నికరంగా వుండాలి. వ్యవసాయ భూముల మీద ప్రాపర్టీ రైట్స్ క్లియర్ గా ఉండాలి. వ్యవసాయం మీద వచ్చే ఆదాయం దొంగలు, దోపిడీదార్ల పాలవ్వకుండా తమకే దక్కుతుందనే భరోసా వుండాలి. స్థానిక నీటివనరుల్ని వుపయోగించుకొనే సౌలభ్యం వుండాలి. అప్పటికి పుంతలుగానే వున్న దారుల్ని రహదారులు చేయాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూములన్నీ సర్వే చేయించాలి. జిల్లాల సరిహద్దులు, అధికారానికి సంబంధించి రెవిన్యూ, సివిల్ క్రిమినల్ విషయాలకి వీటిల్లో ఒకదానితో ఒకటి ఎంతమేరకు జోక్యం చేసుకోవచ్చనే అధి కారానికి సంబంధించిన విచక్షణ ఇవీ ఆ రోజుకి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశ రాజకీయ, ఆర్ధిక విషయాల్లో జోక్యం చేసుకుంటున్న బ్రిటిష్ ఎడ్మినిస్ట్రేషన్ ముందున్న కర్తవ్యాలు.
అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక రాజకీయ వ్యవహారాల్లో తమ జోక్యం కోసం ‘ రెసిడెంట్ ‘ ని కొన్ని కొన్నిచోట్ల వుంచారు. అలాగే నిజాం రాజ్యం లో కూడా. ఆ రాజ్య పాలకుడు తమ వ్యాపార ప్రయోజనాలకనుకూలమైన నిర్ణయాలు చేసినంతకాలం ఆ ‘ రెసిడెంట్ ‘ ఆ రాజ్యానికి అనుకూలంగా వుంటాడు. రాజ్య పాలకుడు తమకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ పాలకుడి మీద మిలిటరీ దాడి చేయించి తమకనుకూలమైన వాళ్ళనో, లేదా తామే పాలకులగానో అవతారమెత్తుతారు. ఇదీ అప్పటి భారతదేశ రాజకీయ ముఖచిత్రం.
గుర్రాలతో, గుడారాల తో ప్రయణిస్తూ, కవాతు నేర్చుకుంటూ, రెండు దళాల జమా ఖర్చులు చూస్తూ, ఒక మున్షీ ని పెట్టుకుని హిందూస్థానీ బాష నేర్చుకుంటూ, మధ్య మధ్యలో అడవిపందుల్నీ, పిట్టల్నీ వేటాడుతూ, సమర్ధుడు అని ‘రెసిడెంట్ ‘ దృష్టిలో పడి హైదరాబాద్ చేరతాడు.
అప్పటి హైదరాబాదు ఎలా వుండేదో మెడోస్ టైలర్ మాటల్లో ….
“ అప్పటి నగర జనాభా మూడున్నర లక్షలు. హాయిగా తిరిగేవాడిని.మూసీ నది ఒడ్డున నిలబడి చూస్తుంటే కోటలు, గోడలు, బురుజులు, ఒకపక్క బేగం బజారు, చక్కటి చెట్లు ఎంతో మనోజ్ఞమైన దృశ్యాలు, నదిలో పలువురు స్నానం చేస్తూ వుండేవారు, గుడ్డలు వుతుకుతూ వుండేవారు.చెలిమలు తవ్వి నీళ్లు తీసుకు వెళుతూ వుండేవారు. ఇసుకతో వొళ్ళు రుద్దుతూ వుంటే.. హాయిగా నిలబడి వుంటే.. ఏనుగులు, రకరకాల దుస్తులు ధరించిన జనం, ఒకవైపున చార్మినార్, మక్కా మసీదు, విశాలమైన మీర్ ఆలం చెరువు, దూరంగా ఆకాశం లో కానవచ్చే గోలకొండ ఖిల్లా, సూర్యోదయ కాలం కమ్మ తెమ్మెరలు అనుభవిస్తూ, బంగారు కాంతులీనే సూర్యాస్తమయాలు, ఆ ఇసక తిప్పలపైన ముస్లిం పెద్దలు తివాచీలు పరిపించుకుని, ఎవళ్ళ హుక్కా వాళ్ళు తాగుతూ, వాళ్లతో సంభాషిస్తూ కాలక్షేపం చేయటం నాకు వినూత్నమైన అనుభవం “
పర్షియన్ బాష నేర్చుకోవడం మొదలుపెడతాడు. ‘ రెసిడెంట్ ‘ అతనిని బొలారం లో సైన్యానికి ఇచ్చే సరుకుల ధరలు, నాణ్యానికి సంబంధించిన విషయాలు చూడమని పంపిస్తాడు.వాటినన్నిటినీ ఒక క్రమంలోకి తెచ్చినందుకు సిపాయిలందరూ సంతోషిస్తారు. పై అధికారి మెచ్చుకుంటాడు.
మెడోస్ టైలర్ కి సైనికోద్యోగం కంటే పౌర పరిపాలనా వ్యవస్థలో ఉద్యోగం అంటే ఇష్టం. సదాశివపేట ప్రాంతానికి పోలీస్ అసిస్టెంట్ సూపరిండెంట్ గా పంపిస్తారు. అప్పుడతనికి 18 సంవత్సరాలు నిండలేదు. అతనికిచ్చిన ప్రాంతం 250 మైళ్ళ పొడవు, 60 మైళ్ళ వెడల్పు 10 లక్షల జనాభా కలది. ఆ జిల్లా పరిధిలో గల వ్యాపారస్తులు తప్పుడు తూనికలతో ప్రజల్ని మోసం చేస్తుంటే వాళ్ళని సరిచేయటానికి బంజారాల్ని పిలిపించి వ్యాపారం చేయిస్థాడు. తూనికలు, కొలతలు పరిశీలించటానికి పోలీసులకు హక్కు కల్పిస్తాడు. అతను ఆ జిల్లాలో తిరుగుతూ ఒక విషయం గమనిస్తాడు. ‘ నేనున్న జిల్లాలో బోలెడన్ని జమీందారీలున్నవి. నిజాం ప్రభుత్వ ఉత్తర్వులని వాళ్ళు ఖాతరు చేయరు. హైదరాబాదు లో పలుకుబడి కల పెద్దలున్నారు. ఈ జమీందారులకి ఆ పెద్దల అండదండలున్నవి. దొంగలు, బం దిపోట్లు ఈ జమీందారుల్ని ఆశ్రయించుకుని తమ క్రూరకృత్యాలు సాగిస్తున్నారు. ఆ దొంగలు సంపాదించిన ధనం లో జమీందార్లకు వాటాలున్నవి. అటువంటి జిల్లాలో శాంతి భద్రతీసు కాపాడటం కష్టం. ముందు నాకు గల అధికారాలు, వ్యవహరణ పరిధులు స్పష్టంగా తేల్చుకోవాలి’ అనుకుంటాడు. ఇది 1826 లో తెలంగాణా పల్లె చిత్రం.
రెవిన్యూ సర్వే చెప్పి అక్రమాలు చేసి, లంచాలు పుచ్చుకునేవారెందరినో పట్టుకుంటాడు. అప్పుడా ప్రాంతంలో దాయాదుల్ని హత్య చేసిన ఒక జమీందారు నెలకి 300 రూపాయిల జీతగాడైన మెడోస్ టైలర్ కి లక్ష రూపాయలు లంచమిస్తానన్నా లొంగడు.ఆ ప్రాంతంలో ధగ్గుల కదలికల్ని పసిగడతాడు.ఆ జిల్లాలో పనిచేస్తూ ఎవరు చేసుకుంటున్న భూమిని వారికి ఇచ్చే కార్యక్రమం, బాటలకు రక్షణ కార్యక్రమం చేబడతాడు. అక్కడున్నప్పుడు మరాఠీ బాష నేర్చుకుంటాడు. సైన్యం లో చేసిన మార్పులవలన అతనికి పిలుపు వచ్చి హైదరాబాద్ చేరతాడు. తిరిగివెళ్ళేటప్పటికి అతనికి 21 ఏళ్ళు.
హైదరాబాద్ లో పామర్ తో ఎక్కువ స్నేహం మెడోస్ టైలర్ కి. చరిత్ర పట్ల,సాహిత్యం పట్ల ఆసక్తిని పామర్ తో మాట్లాడుతూ తీర్చుకొనేవాడు. పామర్ విశాలమయిన గ్రంధాలయం మెడోస్ టైలర్ జ్ఞానం పెరగటానికి ఎంతగానో ఉపయోగపడింది. ఒకానొక సందర్భం లో నిజాం కి, అతని తమ్ముడికి వచ్చిన గొడవ లో సైనిక చర్య జరపాల్సిన సందర్భంలో – అత్యంత సహనం తో దాన్ని పరిష్కరించినందుకు అతని సైనికులు అతనిని ‘ మహాదేవ బాబా ‘ అని పిలిచి జై కొడతారు. నిజాం తమ్ముడు తనకు ఇచ్చిన ముప్ఫయి వేల రూపాయల బహుమానాన్ని తిరస్కరిస్తాడు. 1832 లో పామర్ కూతురు మేరీ తో సికిందరాబాదు చర్చిలో అతని వివాహమవుతుంది.
మనకు చరిత్రలో భాగమయిన విలియం బెంటింగ్, లార్డ్ మెకాలే, డల్హౌసీ అందరికీ తను పనిచేసే క్రమం లో దగ్గరౌతాడు. మెకాలే గురించి అతడి జ్ఞానం అపారమైందని, అతడితో పరిచయం మూలాన తను ముందు ముందు ఏమేమి చదువుకోవాలో అర్ధమయిందని, అతనితో కలిసి పనిచేస్తే బావుండేదని అనుకుంటాడు. ఉష్ణ మండలం లో ఉండటం వలన ఆరోగ్యం పాడయి రెండు సంవత్సరాలు సెలవు తీసుకుని 1938 లో ఇంగ్లాండు కి వెళతాడు. ‘భారత దేశంలో అనాగరిక తండాలలో నివసిస్తున్న లక్షణాలేవీ నీలో లేవే’ అని అక్కడి వాళ్ళు ఆశ్యర్యపోతారు.
‘ భారతదేశంలో ప్రజలు ఉన్నత నాగరీకత కలవారేనని, వారూ ఇంగ్లీష్ అంత వారేనని చెప్పినా ప్రయోజనం లేదని అని- వారు నమ్మని కథలని నేనెందుకు చెప్పాలని ‘ అంటాడు. ఇంగ్లాండు లో వున్నపుడే ‘ Confessions of a Thug ‘, ‘టిప్పు సుల్తాన్’ మీద పుస్తకం రాస్తాడు. బొంబాయి నుండి 1824 లో తను హైదరాబాద్ వచ్చినప్పటి పరిస్థితి పోలుస్తూ ఇప్పుడు 1840 లో దోవపొడవునా దున్నని భూములు ఎక్కువగా కన్పడ్డాయి. పంట బాగా వుంది, మునపటికంటే సర్వే బాగా సాగుతుంది, పన్ను తగ్గటమే కాకుండా భూమి విలువని బట్టి నిర్ణయించటం జరుగుతుంది, మెట్ట ప్రాంతాలలో జొన్నలు, అపరాలు, పల్లపు ప్రాంతాలలో జొన్న, గోధుమ కనపడతాయి. దేశపు తీరుతెన్నులు మారిపోతున్నాయి అనుకుంటాడు. మధ్య మధ్య లో గుడారాల్లో మజిలీ చేస్తూ ఏనుగులమీద, గుర్రాల మీద సాగిన ఆ ప్రయాణం లో అడుగడుగునా ప్రజల బ్రహ్మాండమయిన స్వాగతం, అతనక్కడ వున్నప్పుడు తమకు జరిగిన మేలు స్మరించుకుంటూ. ఆ సమయంలో ఆయన భారతదేశం లో విద్య గురించి రాస్తూ విద్య దేశీయ భాషాల్లోనూ, ఇంగ్లీష్ లోనూ సాగాలని సూచిస్తాడు, సంస్కృతం లోనూ, పర్షియన్ లోనూ కాకుండా. టైమ్స్ పత్రిక కు గౌరవ వేతనం మీద భారత దేశం గురించి తరుచూ రాస్తూ వుంటాడు.
గుల్బర్గా కి దగ్గర్లో వున్న ‘ సురపురం’ సంస్థానం చిక్కుల్లో పడుతుంది. సంస్థానాన్ని ఏలుతున్న రాజు చనిపోతాడు. రాజుగా వచ్చిన కొత్త వ్యక్తి నుండి ఏటేటా పెంచే కప్పమే కాకుండా 15 లక్షల నజరానా తీసుకుంటాడు నిజాం. సురపురం సంస్థానం వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పుచేసి నజరానా చెల్లిస్తుంది. వడ్డీ వ్యాపారస్థులు, సంస్థానం మధ్య గొడవలు, వడ్డీ వ్యాపారస్తులు, నిజాం మధ్య గొడవలు. సంస్థానానికి వారసులు, చనిపోయిన రాజు భార్య రాణీ ఈశ్వరమ్మ మధ్య గొడవలు, 12,000 మంది బేడర్ల ని చేతిలో పెట్టుకుని రాణీ తిరుగుబాటు ప్రయత్నం. అక్కడున్న ప్రతినిధి చేతులెత్తేశాడు. ఎటువంటి చిక్కుపరిస్థితుల లోనించయినా నేర్పుగా బయటపడేసే సామర్ధ్యం మెడోస్ టైలర్ కి వుందని నమ్మిన అతన్ని అక్కడికి పంపుతాడు ‘ రెసిడెంట్ ‘.
‘సురపురం లో ఎవరినీ నమ్మటానికి వీలులేదు. పైకి పెద్ద మనుషులవలెనే కనపడతారు. తేలికగా ద్రోహం, దౌష్ట్యం చేస్తారు. కొంచెం హెచ్చరికగా వుండండి ‘ అని అంతకుముందు అక్కడ పనిచేసిన రాజకీయ సలహాదారు చెప్పాడు. చనిపోయిన రాజు ఎనిమిది సంవత్సరాల కొడుకుని వారసుడిగా గుర్తిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. అతనికి యుక్త వయస్సు వచ్చేవరకు చనిపోయిన రాజు తమ్ముడు పెద్ది నాయక్ రాజ ప్రతినిధిగా కొనసాగుతాడు. అది కాదన్నవారు తిరుగుబాటు చేసిన వారేనని వాళ్ళని అణచివేయవలసిందనీ మెడోస్ టైలర్ స్పష్టంగా చెబుతాడు. ఇక అక్కడ్నుంచి అత్యంత నాటకీయంగా భయపెట్టవలసినవాళ్ళని భయపెట్టి, బుజ్జగించవలసిన వాళ్ళని బుజ్జగించి, కఠినంగా వుండవలసి దగ్గర కఠినంగా వుండి, రక్షణ కల్పించవలసిన వాళ్ళకి రక్షణ కల్పించి, శిక్షించవలసినవాళ్ళని శిక్షించి దిన దిన నాటకీయ పరిణామాల మధ్య ఆ ఎనిమిదేళ్ల రాజకుమారుడికి తనే స్వయంగా చదువుచెబుతూ పరిస్థితిని మొత్తం తన చేతిలోకి తీసుకుంటాడు.
ప్రతిరోజూ రాజకోట రహస్యం లాటి పరిణామాల మధ్య అన్నిటినీ చక్కగా నిర్వహించిన మెడోస్ టైలర్ 1841 నుండి 1853 వరకు సంస్థానం లో ఎం చేశాడనేది చదివి తీర వలిసిందే.
ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సంస్థానాన్ని నిర్వహించటమే కాకుండా సంస్థానపు ప్రజలకి చాలా మేళ్ళు చేసాడు మెడోస్ టైలర్. గ్రామలన్నీ తిరిగి భూముల కొలతలను గూర్చి, పన్నులను గూర్చి ఉద్యోగులకు తగు సూచనలు చేస్తూ, బేడర్లు చేస్తున్న పశువుల చోరీలు తదితర దొంగతనాలు విచారిస్తూ, ఖజానా ఏర్పాటు చేసి రాజ ప్రతినిధి పెద్ది నాయక్ మోసం చేయకుండా సక్రమమయిన ఖర్చులు పెట్టమని సలహా చెబుతూ అతడ్ని హెచ్చరిస్తూ, బుద్ధి చెబుతూ వుండేవాడు మెడోస్ టైలర్. గ్రామ ప్రాంతాలకు పర్యటనకు వెళుతూ, పొలాలు కౌలుకు తీసుకుని పంటలు పండించుకొమ్మని, కౌలు కత్తులు రాయమని రైతుల్ని ఆడిగేవాడు. మీ రాతకోతలు నిలిచివుంటాయా అని అడిగినవారికి మీ కష్ట సుఖాల్ని గమనిస్తూ ఉంటానని మాట ఇచ్చేవాడు.అతని మాటల్లోనే వినండి.
“బొంబాయి రాష్ర్ట హద్దుల్లో పలువురు రైతులు తమంత తామే వచ్చి భూములు పుచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్లినా నా గుడారం చుట్టూ వందల రైతులు చేరే వారు”.
“వాళ్ళకి మాపద్ధతులే వింతనిపించాయి. నా పట్ల ఎంతో విశ్వాసంచూపించేవాళ్ళు. అంత బాగా నా జీవితంలో ఎప్పుడూ నేను పనిచేయలేదు. అంత హాయిగా తిరగానూ లేదు. అంత హాయిగా నిద్రించానూ లేదు “
“ భాగ్యవంతులు సరిగా పన్నులు ఇవ్వరు. వారికంటే పేదలే నయం, గత 50 సంవత్స రాలుగా లెక్కలను ఎవరూ సరిగా రాసివుంచట్లేదు. వసూలయినదాన్ని సరిగా ఖజానా కి ఇవ్వట్లేదు దీన్ని సరి చేయాలంటే ఇంకొన్నాళ్లు పడుతుంది”
“గ్రామాల్లో పరిస్థితి తెలుసుకోవటానికి రోజుకి పన్నెండు గంటలుపనిచేసినా సరిపోదు. క్రౌర్యాలు,వత్తిడులు,మోసాలు,అసత్యాలు ఎన్నోబయటపడుతున్నాయి.తెలుసుకున్నకొద్దీపుట్టల్లోనిపాముల్లాగావెలువడుతున్నాయి “
“ప్రజల కష్టాలు తెలుసు కోవటానికి ఎందుకు అంత శ్రమ పడతావు. దువ్విన కొద్దీ దువ్వెన విరగటమే కానీ చిక్కులు విడవు. ఒకసారి జుట్టు గొరిగేస్తే మళ్లీ పెరుగుతుంది. చిక్కులు పడకుండా జాగ్రత్త పడవచ్చు” అని ఒక స్నేహితుడు హితవు చెప్పాడు. దారుణమయిన హితవు, ఓపికతో దువ్వెననే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాను అంటాడు.
సరిహద్దుల్లో అల్లర్లు తగ్గినయ్యి.పశువుల చోరీలు లేవు. ఏదయినా నేరం జరిగితే నేరం చేసినవారిని పట్టుకుని కొట్టడానికి, వాళ్ళ ఇళ్లు తగలపెట్టటానికి ప్రజలు సాయుధముఠాలుగా బయలు దేరటం లేదు. ఏదయినా నేరం జరిగితే అధికారులకి ఫిర్యాదు చేస్తున్నారు
ఈ లోపు తన భార్యకి జబ్బు చేసి చనిపోతుంది.
“ఆమె నా భార్య. ప్రియురాలు. నా సుఖశాంతులు కోరిన వ్యక్తి.సురపురం లో సుఖం లేకుండా జీవితం గడపమని అన్నట్లుగావెళ్ళిపోయింది. ఆమెసానుభూతి లేకుండానే ఇక నేను పనిచేసుకోవాలి. ఆమె లాలన లేకుండానే జీవయాత్రగడపాలి.
ఆమె మరణానంతరం నా ఆరోగ్యమూ చెడింది. నా ఇల్లు కట్టడమూ పూర్తయింది ఎవరు వుంటే నాకిది ఇల్లు అవుతుందో వారు లేకపోయిన తరువాత ఈ ఇల్లు నేనేమి చేసుకోను” అంటాడు.
నిజాం బ్రిటిష్ వారికి ఇవ్వవలసిన అప్పు కి బదులుగా కొన్ని జిల్లాల్ని బ్రిటిష్ వారికి దత్తత ఇస్తాడు. రాయచూరు కి పక్కనున్న ‘ నల్ దుర్గ్ ‘ కూడా అందులో ఒకటి. అరబ్బులు ఎక్కువగా వుండే ప్రాంతం. నిజాం తమకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేవరకు కోటలో అడుగుపెట్టనివ్వమని బీరాలు పోయినా నిజాం తోనే తేల్చుకొమ్మని లేదంటే సైనిక ప్రయోగం చేస్తామనే మెడోస్ టైలర్ మాటలకితగ్గి కోట ని స్వాధీనం చేస్తారు. మెడోస్ టైలర్ సహాయకుడు ఒక ఇంగ్లాండ్ వాసి. అతని తండ్రి ఏడింబరో లో న్యాయవాది. స్కాట్లాండ్ అంత దేశాన్ని ఇద్దరు బ్రిటిష్ ఉద్యోగులు చిన్న పదాతి దళ సహాయం తో ఆక్రమించి అదుపులోకి తీసుకురావటం కనీ వినీ ఎరుగని సంఘటన అని ఆశ్చర్య పోతాడు. 1853 నుండి1857 వరకు ‘నలదుర్గ్’ కి అసిస్టెంట్ అసిస్టెంట్ కమీషనర్ గా చేసాడు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని పనులు ఎవరయినా చేయగలరా అని ఆశ్యర్య పోయేటన్ని పనులు చేసాడు ఆ కొద్ది కాలంలో.
నలదుర్గ్ జిల్లాలో బందిపోట్ల బెడద ఎక్కువగా వుండేది. ఆ జిల్లాలో న్యాయస్థానాలు లేవు. నిజాం ప్రభుత్వ ప్రతినిధులు, అరబ్బులు నేరాలు చేసినవారినే శిక్షించేవారు. చిన్న నేరాలు చేసిన వారినే శిక్షించేవారు. బందిపోట్లను శిక్షించలేరు. నిజాం ప్రభుత్వ పతినిధికి వాటాలుండేవి. బందిపోట్లతో ప్రభుత్వోద్యోగులు షరీకై వుండేవాళ్ళు. ఇక హత్యలు ఎన్నడూ ఎవళ్ళూపట్టించుకున్నదే లేదు.కొన్నిసంవత్సరాలుగా ఈ ప్రాంతంలో న్యాయస్థానాలే లేవు. మెడోస్ టైలర్ బొంబాయి రాష్ట్ర పద్ధతి లో ఒక శాసనావళిని, నిబంధనావళిని రూపొందించాడు. గ్రామ పటేళ్లకూ,తాలూకా ఉద్యోగులకూ సహాయకుల్ని ఏర్పాటు చేశాడు. గ్రామ పటేళ్లకూ, తాలూకా ఉద్యోగులకు, తనకూ అంచెలవారీగా విచారణాధికారాలు కేటాయించాడు. ‘తను చేసిన తీర్పులపై రెసిడెంట్ కి అప్పీల్ చేసుకోవచ్చు’.
మెకాలే రచించిన శాసనావళి అమలు చేసేటప్పుడు, ఆస్తి హక్కుల దావాలకు సంబంధించి మెడోస్ టైలర్ రూపొందించిన శాసనావళినే యధాతధంగా మెకాలే శాసనావళిని లో వుంచేశారు. ఇవే కాకుండా వివిధ శాఖలూ, ఉద్యోగులూ అనుసరించదగు నియమావళిని కూడా రూపొందించాడు. 1854 లో నలదుర్గ్ తూర్పు ప్రాంతం దుర్భరమయిన పరిస్థితుల్లో వుండేది. అంతకు ముందు పాలించింది అరబ్బులు. వాళ్ళ హయాంలో హత్యలు, దోపిడీలు, పంటల విధ్వంసం యధేచ్చగా సాగాయి. జిల్లా పరిపాలనను సరిదిద్దటానికి కోడి కూత నుండి రాత్రి 8 గంటలవరకూ పనిచేశాడు మెడోస్ టైలర్. ఇప్పుడు నలదుర్గ్ జిల్లాలో బందిపోట్లు లేరు. బందిపోటు దొంగతనాలన్నీ నిజాం పరిపాలనా కాలంలోనే. పోలీసులు నిక్కచ్చిగా పనిచేస్తున్నారు. ప్రతి గ్రామ పటేలుకు కొంతవరకు న్యాయ నిర్ణయాధికారాలు ఇచ్చాడు. అందువల్ల గ్రామోద్యోగుల గౌరవం పెరిగింది.
మాలిక్ అంబర్ కాలం లో సెటిల్మెంట్ వివరాలు గ్రామోద్యోగుల దగ్గర వున్నాయి. వాటిని ఆధారం చేసుకుని కొత్త వివరాలను చేర్చి సెటిల్మెంట్ పని మొదలెట్టాడు. పంజాబు ప్రాంతంలో సర్వే పద్ధతుల్ని చెప్పే ఒక పుస్తకం సహాయంతో ప్రతి గ్రామాన్ని సర్వే చేయించాడు. సర్వే కి కావలసిన కొన్ని పరికరాల్ని తయారుచేసుకుని, కొంతమంది యువకులకు శిక్షణ ఇచ్చి సర్వే చేయించాడు. ప్రభుత్వం ఇతని పనితీరుని ఆమోదించింది. మెడోస్ టైలర్, అతని ఉద్యోగులు చేసిన పని చాలా పెద్దది. మొత్తం 34,474 వివరణ పత్రాలు, జాబులూ ఇంగ్లీష్ లో, పర్షియన్ లో, మరాఠీలో వాళ్ళమధ్య నడిచాయి. అతనికీ, అతని సహాయకులకీ మధ్య నడిచిన ఉత్తరాలే ‘తొమ్మిది వేలు’న్నాయి. నలదుర్గ్ జిల్లాలో మొత్తం 2 లక్షల 60 వేల ఎకరాల సర్వే పూర్తి అయింది. భూమి హక్కు స్థిరంగా వుండేటట్లు తగు చర్య తీసుకోవాలని ప్రతిపాదించి 30 ఏండ్ల పాటు ఆ హక్కు వుంటుందని నిర్ణయించాడు. అప్పటివరకూ సిస్తు మారదు. రైతుకు తన భూమి హక్కు సురక్షితమనే భావం వుంటేనే భూమిపై పెట్టుబడి పెట్టటం, శ్రమించటం సాధ్యమవుతుందని మెడోస్ టైలర్ అంటాడు.భూమి హక్కుకూ, శిస్తుకూ సంబంధించిన వివరాలన్నీ మరాఠీ భాషలోకి అనువదించి, గ్రామ పెద్దలనందరినీ పిలిపించి,తను చేస్తున్న పనులనూ, ప్రభుత్వ అనుమతి లభిస్తే చేయ తలపెట్టిన పనులను వివరించి చెబుతాడు.మునపటివలె ఎవరూ భూఖామందును భూమినుండి వెళ్ళగొట్టరనీ, శిస్తులు యథేచ్ఛగా పెంచే అవకాశం లేదని చెబుతాడు.
అక్కడున్నవారందరూ ఒక కొత్త యుగం ప్రారంభమయినదని సంతోషపడతారు. రెసిడెంట్ కూడా పంజాబులో జరుగుతున్న పాలన కంటే నలదుర్గ్ ప్రాంతం లొనే పరిపాలన బాగా సాగుతున్నదని చెబుతాడు.
అహ్మదనగర్ ప్రాంతాన్ని చూసి ఎన్నో వాగులున్నాయి. నీరు పుష్కలం. చక్కటి జలాశయాలు నిర్మించుకుంటే సేద్యం ఎంతయినా అభివృద్ధి చెందుతుంది అనుకుంటాడు.తుల్జాపురం లో రెండు జలాశయాలు నిర్మించాలని పథకం వేసుకుంటాడు. తుల్జాపురం నుండి అహ్మద్ నగరం వరకు చెరువుల నిర్మాణం చెయ్యాలని సూచిస్తాడు. ఆ ప్రాంతాలలో కాటకం ఏ క్షణాన్నైనా ముంచుకు రావొ చ్చని జలాశయాలకి కావలసిన పరిశీలనలు, విషయసేకరణ అన్నీ చేస్తాడు.
గోదావరి నదికి నలదుర్గ్ జిల్లాకి మద్ధ్యలో ఎంత వర్షం పడుతుంది, ఎన్ని వాగులు ఎట్లా ప్రవహిస్తున్నవి, ఎన్ని చెరువులు ఏర్పాటు చేయవచ్చును అనే విషయమై 600 చదరపు మైళ్ళ మేర క్షుణ్ణంగా పరిశీలన చేసాడు. భటోరి దగ్గర అహ్మద్ నగరానికి నీళ్లు సరఫరా చేసే పెద్ద సరస్సు నిర్మాణం చేపడతాడు. చాలా చోట్ల రహాదారుల నిర్మాణం చేపడతాడు. మెడోస్ టైలర్ జాతకం చెప్పిన ఒక జ్యోతిష్కుడు చెప్పినట్లు ” మీరు పనిచేయటానికే పుట్టారు, భోగభాగ్యాలలో దొర్లటానికి పుట్టలేదు. ఇక మీ జీవితం ఇంతే “. అది నిజమేనేమో.
1857 లో భారత దేశం లో తిరుగుబాటు పరిస్థితులదృష్ట్యా క్లిష్టమయిన బీరార్ జిల్లాకి బదిలీ చేస్తారు మెడోస్ టైలర్ ని.
మెడోస్ టైలర్ బదిలీ మీద బీరార్ కి పొయ్యేటప్పుడు ప్రముఖ ఉద్యోగులు 1622 మంది సంతకాలతో ఒక సన్మాన పత్రాన్ని సమర్పించి వీడ్కోలు చెప్పారు. అతని మాటల్లోనే చదవండి …
” సభలో పలువురు కన్నీరు కార్చారు. మహాదేవ బాబా కి జై అని నినదించారు. నా కళ్లల్లో నీళ్లు తిరిగినవి. వాళ్ళకి ఉపయోగకరంగా నేనే దయినా చేసి వుంటే ధన్యుడిని. ఆ రాత్రి నేను ప్రయాణమై పోతూ వుంటే వేలాది ప్రజలు వీధులలో నిలబడి మహాదేవ బాబా కి జై అంటూ 2 మైళ్ళదూరం నడిచి వచ్చారు. సురపురం నుండి వచ్చేస్తుంటే మనస్సు బాధ చెందింది. ఇక్కడినుండి వెళ్లిపోతుంటే వాళ్ళ ఆదరం నుండి దూరమయి పోతున్నట్లనిపించింది.”
నలదుర్గ్ నుండి బయలుదేరిన మెడోస్ టైలర్ ‘ బ్రిటిష్ పరిపాలకుల వలన దేశంలో శాంతి నెలకొన్నది పరిపాలన ఇక క్రమంలో రూపొందుతున్నది ? అటువంటప్పుడు తిరుగుబాటు ఆలోచన దేనికి ? ‘ అనుకుంటాడు. బీరార్లో ఆర్ధిక పరిస్థితులు, శాంతి భద్రతలు అస్తవ్యస్తం గా వున్నాయి. 20 లక్షల జనాభా వున్న బీరార్ కి సహాయంగా పంపటానికి సైన్యం లేదు. నైతిక బలంతో అదుపు చేయండి అని రెసిడెంట్ కబురు చేస్తాడు. బీరర్ చుట్టుపక్కల అన్ని సంస్థానాలు, నవాబులు ఏదో ఒక మేరకు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం లో వున్నాయి. అది బీరార్ దాటితే నిజాం రాజ్యానికి కూడా పాకే ప్రమాదముంది. నిజాం మొఘల్ చక్రవర్తుల మీద వ్యతిరేకతతో బ్రిటిష్ సైన్యానికి సహాయం చేస్తున్నాడు. నిజాం ని, రెసిడెంట్ ని చంపాలని ‘ రోహల్లా’ లు హైదరాబాద్ రెసిడెన్సీ మీద దాడి చేశారు. బీరార్ లో కూడా కొన్ని సైనిక స్థావరాల్లోనించి సైనికులు వెళ్లిపోయారు. ఉన్నవాళ్ళని నమ్మేటట్లు లేదు.
మెడోస్ టైలర్ ని చంపమని, చంపేసామని, చంపేస్తామని ప్రతిరోజు వార్తలొస్తున్నాయి. కానీ మెడోస్ టైలర్ ప్రజలమధ్యనే గుడారం వేసుకుని పనిచేస్తూ తిరుగుబాటు బీరార్ కి వ్యాప్తి చెందకుండా చూస్తున్నాడు. ఎక్కడైతే కుదురుతుందో అక్కడల్లా స్థానిక సహాయం తీసుకుంటున్నాడు. నాగపూర్ కి అతను బీరార్ నుండి పంపిన 600 ఎడ్ల బండ్ల వలన మధ్యభారతం లో తిరుగుబాటు ని అణచటం సాధ్యమైంది. 1858 కల్లా పరిస్థితులు బ్రిటిష్ వాళ్ళ అదుపులోకి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పోయి ప్రత్యక్షంగా రాణీ గారి పాలన వచ్చింది.
సురపురం లో ఏదో సమస్య తలెత్తిందని, తక్షణం హైదరాబాద్ రావాలని రెసిడెంట్ నుండి జాబు రావటం తో మెడోస్ టైలర్ మళ్ళీ వెనక్కి బయలుదేరతాడు. సురపురం రాజ కుమారుడు బ్రిటిష్ సైన్యంపై దాడి చేసి ఓడిపోయి హైదరాబాద్ కు పారిపోగా, అక్కడ అతనిని ప్రభుత్వం పట్టుకుని నిర్బంధంలో వుంచింది. పీష్వాల నాటి మహారాష్ట్ర ప్రాభవాన్ని ఉద్ధరించటానికి సురపురం సంస్థానాదీసుల వంటి వారు పూనుకుని తిరుగుబాటును సానుకూలం చేయాలని రాజకుమారుడికి ఎవరో ఉపదేశం చేశారు. పదివేల మంది బేడర్లతో బళ్లారి, ధార్వాడ్, బెల్గాం -రాయచూరు ప్రాంతాన్ని అతడు పట్టుకుంటే మిగిలినవారు అతడి నాయకత్వాన్ని అనుసరిస్తారని తిరుగుబాటుదారులు నూరిపోశారు.
సురపురం మీద బ్రిటిష్ వాళ్ళు దాడిచేయగా ఎక్కడివాళ్ళక్కడ పారిపోయారు. సహాయం కోసం హైదరాబాద్ వచ్చిన రాజకుమారుడు వీధుల్లో తిరుగుతుండగా పట్టుకున్నారు. తండ్రి లాటి మెడోస్ టైలర్ తో మనసు విప్పి మాట్లాడిన రాజకుమారుడ్ని రక్షించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఉరిశిక్ష పడుతుందనుకున్న రాజకుమారుడికి మెడోస్ టైలర్ ప్రయత్నాల వలన నాలుగు సంవత్సరాలు ఖెదు పడుతుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో రాజకుమారుడు మరణిస్తాడు. సురపురానికి కమిషనర్ గా పంపిస్తారు మెడోస్ టైలర్. ఒక సంవత్సరం అక్కడుండి అస్తవ్యస్తమయిన పరిస్థితుల్ని వీలయినంత వరకు సరిదిద్ది తన ఆరోగ్యం బాగోలేక ఇంగ్లాండు కి బయలుదేరతాడు మెడోస్ టైలర్.
సురపురం ప్రజల వద్ద వీడ్కోలు తీసుకోవటం కష్టమైంది మెడోస్ టైలర్ కి. అతని మాటల్లో వినండి…
“నా చేత దర్బారు జరిపించి మరాఠీ భాషలో నాకొక వీడ్కోలు పత్రం సమర్పించారు. నే చేసిన పనులన్నీ పేరు పేరునా పేర్కొని నాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారిలో నేను ఎరగని వారు లేరు. కొందరు నా ఎదుట పెద్దలయినవారే. నన్ను వారు మరిచిపోరు. నేనూ వారిని మరిచిపోలేను. ఎవ్వరికీ తెలియకుండా అర్ధరాత్రి లేచిపోదామని అనుకున్నాను. అర్ధరాత్రి చూద్దును కదా అందరూ రోడ్లమీదనే వున్నారు. బేడర్లు అందరూ అక్కడే కాపలా వేశారు. కొందరు ఏడ్చారు. కొందరు నిశ్శబ్దం గా నాతో నడిచారు”
” ఇప్పుడు మాకు దిక్కు లేదు. ఉదయం ధాన్యం దంచుకునేటప్పుడు, సాయంత్రం దీపం వెలిగించుకునేటప్పుడు మా స్త్రీలు మీ పేరే తలుచుకుంటారు. తప్పక తిరిగి రండి ” అన్నారు.
దోవలో ప్రతి గ్రామంలో అబాలగోపాలం ఇలాగే వీడ్కోలు ఇచ్చారు. వారి బిడ్డలను ఆశీర్వదించుతూ తాకమన్నారు. ఒకచోట కొందరు ” మేమంటే మీకెందుకంత ఇష్టం. మమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నారు ?” అని అడిగారు. దీనికి జవాబు లేదు. నేను పేరు కోసం ఏనాడూ తంటాలు పడలేదు. చేతనయినంతవరకు న్యాయం చేకూర్చటానికి ప్రయత్నం చేశాను. ప్రతి విన్నపాన్ని విన్నాను. నన్ను వచ్చి కలుసుకోవటానికి ప్రతివారికీ అవకాశం కల్పించాను. వారు చూసిన ఇంగ్లీషు మనిషిని నేనొక్కడినే. నా మీద ఎవ్వరూ ఏనాడూ ఫిర్యాదులు చేయలేదు. మామూలు మర్యాదలే వారిపట్ల చూపాను.
” ప్రజలకు ఇంత మేలు చేస్తున్నావు కదా -ప్రతిఫలం ఏమిటి? వారు ఏమయినా నీకు కృతజ్ఞత చూపెట్టారా ? ” అని కొందరు స్నేహితులు అడిగారు.
ఇది సరియయిన ప్రశ్న కాదు. నేను ప్రజలకు చేయగలిగినదంత చేయలేదు. నాకు ఎక్కువ సహాయం లభించివుంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలిగి వుండేవాడిని. నాకు చేతనయినంత చేశాననటానికి భగవంతుడే సాక్షి. ఇంకా ఎంతో చెయ్యగలిగి వుండేవాడిని. ఆరోగ్యం లేదు.’
‘ నా ఆరోగ్యం బాగుంటే భారతదేశాన్ని వదిలిపోయ్యేవాడిని కాను. భారతదేశమన్నా, భారతీయులన్నా నాకు మక్కువ. ఒక్కసారి ఇంగ్లాండు వెళ్లి తిరిగి వచ్చి, పనిచేస్తూనే ప్రజల మధ్య చచ్చిపోవాలి. ‘
అని అనుకుంటూ వెళ్లిన మెడోస్ టైలర్ అనారోగ్యం మూలాన తిరిగి రాలేకపోయాడు.
ఇంగ్లాండు తిరిగివెళ్లిన మెడోస్ టైలర్ ‘ భారతదేశంలో ఒంటరి జీవితం గడిపిన నా ముఖాన, పెదవుల చివర, పడిన ముడతలన్నింటిని నా బిడ్డలు చదును చేశారు. ఇస్త్రీ చేశామని వారే చెప్పారు.’ అని మురిసిపోయ్యాడు. అనారోగ్యం మూలాన తిరిగి రాలేక ‘ నేను ప్రజల మధ్య బతికాను. వారితో నాకు ఆత్మీయత ఏర్పడింది. మళ్ళీ వారి మధ్యకు వెళ్లి సేవ చేసే భాగ్యం లేకుండా చేసాడు భగవంతుడు.’ అని బాధ పడతాడు.
సురపురం లో నలదుర్గ్ లో వున్నప్పుడు టైమ్స్ పాత్రికకు దేశీయ భాషలలో విద్యా బోధన జరగాలని అనేక వ్యాసాలు రాసాడు. ఇంగ్లాండు వచ్చాక 1657 కాలానికి చెందిన మరాఠా రాజ్య అవతరణ కి సంబంధించి ‘తార’ అనే నవల, 1757 కాలానికి సంబంధించి,’ రాల్ఫ్ డార్నెల్ ‘ అనే నవల,ఇందులో బ్రిటిష్ అధికారం ఎలా విస్తరించిందో రాస్తాడు.1857 కాలానికి సంబంధించి, బ్రిటిష్ అధికారాన్ని వదులుకోవటానికి భారతదేశంలో వివిధ వర్గాలు చేసిన ప్రయత్నం మూడవ నవల ‘ ‘సీత’ రాసాడు. చిత్రకారుడు కాబట్టి భారతదేశాన్ని గురించి ఎన్నో చిత్రాలు, స్టూడెంట్స్ మాన్యువల్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ‘ అనే పుస్తకం రాసాడు. భారతదేశంలో సేద్యపు వనర్లు వాటికి గట్లు, తూములు అమర్చే పద్ధతి, వాన నీటిని ఉపయోగించుకునే కృషి వీటిని గురించి ‘ ఐర్లాండ్ ఇంజినీర్ల ‘ సంస్థ లో ఉపన్యసిస్తాడు. భారతదేశానికి వెళ్ళినప్పుడు మెడోస్ టైలర్ కి చదువు లేదు. స్వయంగా చదువుకున్నాడు. చెప్పుకోదగిన భోగభాగ్యాలు లేకపోయినా, దేవుని దయవలన తినటానికి ఉంది నా బిడ్డలు నన్ను ప్రేమిస్తున్నారు, నా మిత్రులు నన్ను ఆదరిస్తున్నారు, ఇంతకంటే కావలసింది ఏముంది అనుకుంటాడు.
భారతీయ జీవితాన్ని, కథలను గాధలను చక్కగా చిత్రీకరించవలసిన వారు భారతీయ విద్యావంతులే. హిందూ సంఘం లో నెలకొనివున్న దురాచారాల గురించే ఎందుకు రాయాలి. మంచి సంప్రదాయాల గురించి కూడా రాయొచ్చు కదా, సరళంగా, సహజంగా,ప్రజల మనస్సులను కదిలించే అనేక విషయాలపైన రాయండి. దేశీయమైన భాషలలో ప్రజలకు ఆప్యాయకరమైన సాహిత్యం వెలువడి జాతీయ సాహిత్యాభివృద్ధికి పునాదులు పడాలి ‘ అంటాడు.
1875 లో మొదటి సారి వచ్చిన 51 సంవత్సరాల తరవాత మరలా భారతదేశాన్ని చూడాలనుకుని ఈసారి బొంబాయి నుండి హైదరాబాద్ కి 27 గంటల రైలు ప్రయాణం చేసి మిత్రులందర్నీ కలిసి తిరుగు ప్రయాణం లో ‘ మెంటోస్ ‘ దగ్గర ప్రశాంతంగా ‘విధి నిర్వహణకై కృషి చేసిన వ్యక్తిననే నన్ను భగవంతుడు సంభావించుకాక ‘ అని కన్నుమూస్తాడు.
**** (*) ****
పద్మావతి గారు, చాలా బాగా, వివరంగా రాశారు. ఎంత గొప్ప జీవితం! అస్సలు confusion లేకుండా రాసారు. తప్పకుండా కొనుక్కుంటాను ఈ పుస్తకం దొరికితే. ఇంత tempting గా రాసిన రివ్యూ చదవడం చాలా రోజుల తర్వాత ఇదే. Thank you.
చాలా బాగా పరిచయం చేసారు. ఈ పుస్తకం ఎక్కడా దొరుకుతున్నట్లు లేదు. చరిత్ర అంటే ఆసక్తి వున్నా వాళ్లకి చాలా బావుంటుంది. కృతజ్ఞతలు