కవిత్వం

రెంటిని ఒకటిగా చేసే …

22-ఫిబ్రవరి-2013

అంచెలంచలు గా నిద్ర పోవడం
అనేక ప్రసంగాలు విన్నట్టు మేలుకోవడం
రెప్ప చాటు నుండి
ఎవరో తొంగి చూస్తున్నట్టు ఉలిక్కి పడడం
విడదీయ రాని దృశ్యాన్ని
రక్తాలోడుతుంటే రెండుగ చీల్చటం
ఎప్పుడూ ఒక నిందితుడెవడో
మన వెనకే నడుస్తున్నట్టు అన్పించడం
పరివర్తన లేని జీవితాన్ని
ప్రాయోపవేశాల మధ్య బిగించటం
మనల్ని రక్షించే
మనకి గురిచూడడం నేర్పించే
ధనుర్విద్యాపారంగతుడి కోసం వెతకటం
చలనం లో కూడా
నిశ్చలనంగా ఉండటం ఎలాగో తెలియకపోవటం
మరణిస్తూ కూడా
జీవించటం ఎలాగో నేర్వకపోవటం
యేమీ లేని దాన్నుంచి
ఒక నిర్దిష్ట చైతన్య రూపం రావాలి
రెంటిని ఒకటిగా చేసే
విద్య ఏదో
మనకి వంటబట్టాలి