కవిత్వం

కవి గొంతు విందామని

జూలై 2014

పొద్దున్నే
ఒక కవి గొంతు వినటం ఎంత బాగుంటుంది
చిలక సరస్సు పలకరించినట్టు
రాత్రంతా షాపులకు కాపలా కాసిన
కాపలాదారులు నలుగురు చలిమంట వేసుకున్నట్టు
ఏ టీ షాపు నుంచో
కొత్త టీ పొడి మరుగుతున్న వాసన
ముకు పుటాలకు తగిలినట్టు
నిమ్మ చెట్టు కొమ్మ మీద
చిన్న పిట్ట రెక్క విదిలించినట్టు
పుణికి పుణికి లోకాన్ని చూస్తున్నట్టు
పొద్దున్నే కవి గొంతు వినటం ఎంత బాగుంటుంది
రాత్రంతా వెంటాడిన కలేదో
కమ్మని గొంతుగా మారి పలకరించినట్టు
ఒరిస్సా, ఆంద్ర సరిహద్దుల్లో
రహస్య వీరుడెవరో కిట్ లోంచి
ఒక కవిత్వ పుస్తకం తీసి పైకి చదువు కుంటున్నట్టు
ఏటి ఒడ్డున రాళ్ళు
వినూత్న కోర్కెనేదో బయటపెట్టినట్టు
రాత్రి కురిసిన వాన
రహస్యంగా కవి గొంతులో ఒదిగి కూర్చుని మాటాడుతున్నట్టు
కవి ఒక పొద్దుటి పూట
పొద్దుటి పూటే ఒక కవి
పొద్దుటి పూటా కవీ కలిసి పాడుతున్న
యుగళగీతం ప్రశాంత వాతావరణంలో మార్మోగినట్టు
పొద్దున్నే కవి గొంతు వినటం భవిషత్ వాణి విన్నట్టు

విరుగుతున్న ముక్కలన్నీ అతుక్కుని
ఒక సాంద్ర సమూహ స్వప్న గీతాన్ని ఆలపించినట్టు
కల్మషం లేని కవి గొంతు
ప్రశాంత నిర్మల వాతావరణం మీద
కాంతిలా పరావర్తనం చెందుతున్నట్టు
మంచులో అప్పుడే విచ్చుకున్న గులాబి మాటాడినట్టు
చావిట్లో అప్పుడే పుట్టిన లేగదూడ అంబా అన్నట్టు
మబ్బు తెరల కెనకమాల కలకలాన్ని
సముద్రం ముఖమ్మీద నులి వెచ్చని ఆవిరి తెరల్ని
అందుకుని, ఒడ్డున నడిచి వెడుతున్న
కోటానుకోట్ల ప్రజల ప్రతిధ్వనుల్ని విన్నట్టు
పొద్దున్నే ఒక కవి గొంతు వినటం
నాలోంచి లేస్తోన్న సూర్యోదయాన్ని గమనించటం
‘జాగ్తే రహో’ అంటూ ఎవరో బిగ్గరగా అరుస్తోన్న ప్రతిధ్వని
సాకారమై నా కళ్ళ ముందు నుంచున్నట్టు
పొద్దున్నే ఒక కవి గొంతు వినటం
మరో యుద్ధానికి ఆహ్వానం పలకటం

(కవి ‘శిఖామణి’ కి ప్రేమతో)

 

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)